పళ్ళెం మాత్రం పగలగొట్టకు

సంభాషణల సంకుల సమరం లో
విజేత చేతి ఆయుధం, మౌనం.
దాన్ని ధరించక ఎంతసేపూ రాతిగదలను
భుజాన మోస్తావు,
ఎందుకీ వికృతవీచిక,
విద్రోహపు, విధ్వంసక పాచిక?
షోకుల, బాకాల,పొలికేకల కింద
ఆకలి కేకలు అడుగంటుతున్నాయి
క్షుదాగ్ని కొలిమిని ఆర్పకుండా
ఎందుకీ క్షుద్రదేవతావాహన?
గర్జింపుల, గాండ్రింపుల, ఘీంకారాల
గారడీవిద్యల ప్రదర్శనలెందుకు?
గరీబోడి నసీబు గాటన కట్టేసి ఉంది
పీటముడులు విప్పు
నేనున్నానని ధైర్యం చెప్పు
ఆవిరైపోతున్న ఆశలపై
శీతలవాయువై సోకి
చల్లని జల్లు చల్లు.
ఆకలి కడుపులకి
అన్నానివై ఉండు,
నడవలేక నడుము వాల్చితే
మోచేతి దిండువై ఉండు.
పుట్టినందుకో పరిపూర్ణత
గిట్టబోయే ముందు నీకో ఘనత.
అంతే తప్ప
వాదోపవాదాల వలలు
ఎన్నిసార్లు విసురుతావ్?
వాతావరణం వాటం గా లేదని
ఎన్ని యుగాలు కసురుతావ్?
అన్నం పెట్టకపోయినా ఫర్లేదు,
బాబూ…
పళ్ళెం మాత్రం పగలగొట్టకు

దేవరపల్లి రాజేంద్ర కుమార్‌

రచయిత దేవరపల్లి రాజేంద్ర కుమార్‌ గురించి: పుట్టింది గుంటూరు జిల్లా నిడుబ్రోలు - పొన్నూరు లో , పాఠశాల విద్యాభ్యాసం అక్కడి జిల్లా పరిషత్ హైస్కూలులో , అంధ్రా క్రిష్టియన్ ‌ కాలేజీలో ఇంటర్మీడియట్ , డిగ్రీ , ఆంధ్ర విశ్వవిద్యాలయంలో యం . ఏ., ఫిలాసఫి, మాష్టర్ ఆఫ్ జర్నలిజం అండ్ కమ్యూనికేషన్ ‌ , ఈనాడు జర్నలిజంస్కూలులో డిప్లొమ , ఈనాడు దినపత్రికలో హైదరాబాద్ లో కొంతకాలం రిపోర్టరు ఉద్యొగం , మధ్యలో ఆగిపోయిన పి. హెచ్ . డి.
1992 నుండి రచనలు, ఆంధ్రజ్యోతి , ఆంధ్రభూమి , మిసిమి , తదితర పత్రికల్లో ప్రచురణ , ప్రస్తుతం ఒక ఆంగ్లదినపత్రికలో (విశాఖపట్నం) రిపోర్టరు ఉద్యోగం, పూర్తి కాలపు రచయితగా , పర్యావరణ కార్యకర్తగా మారాలని కోరిక. ప్రస్తుతం మూడు బ్లాగులను నిర్వహిస్తున్నారు. ...