“చెప్పండి ఏమిటి సమస్య?” అలవాటైన రొటీన్, క్యాజువల్ గా ప్రశ్నించాను.
“డాక్టర్ గారూ, ఈమె నా భార్య. తీవ్ర నిద్రలేమితో బాధ పడుతోంది” సమాధానమిచ్చాడు ఎదురుగా ఆమె పక్కనే కూర్చుని ఉన్న అతను.
“ఊహూ? ఎన్నాళ్ళనుండి?”
“దాదాపు పదేళ్ళనుండి” ఈ సారీ అతనే.
“ఇంతకాలంగా సమస్య ఉంటే ట్రీట్‌మెంటేమీ తీసుకోలేదా?”
“ఏవో వాడుతూనే ఉన్నాం, ఫలితం లేదు, ప్రతిసారీ ఆశతో ఏదో చికిత్సకి వెళ్ళడం నిరాశతో మానేయడం. అలోపతి, హోమియో, ఆయుర్వేదం, ప్రకృతి వైద్యం, ఇలా అన్నీ ప్రయత్నించి విసుగుతో ఓ సంవత్సరంగా ఏమీ వాడకుండా వదిలేశాం! మరీ ఈ మధ్య లేచి తిరగలేనంతగా మంచం పట్టింది. ఆమె అదృష్టం, మీ హస్తవాసీ బాగుంటే నయమవక పోతుందా అనే ఆశతో ఇలా తీసుకువచ్చాను. ఈ ఊళ్ళో నా తమ్ముడు ఉన్నాడు, వాడు ఎంతో కాలంగా చెపుతున్నాడు ఈ సిటీ లోనే పేరు మోసిన డాక్టర్ మీరనీ, మీ వద్ద తప్పక నయమౌతుందీ అని” అతనే చెప్పుకు పోతున్నాడు. ఆమె మౌనంగా కూర్చుంది.
“సరే..! మీకు ఆకలి సరిగా ఉందా…” ఆమెని పరీక్షిస్తూ, ప్రశ్నలు మొదలు పెట్టాను. ఆమె అన్నింటికీ నిలువుగానో అడ్డంగానో తలూపటం తప్ప నోరు విప్పలేదు, సమాధానాలు అతడి నుండే వస్తున్నాయి. పరిక్షించటం పూర్తయినా అతను ఇంకా ఏవేవో చెపుతూనే ఉన్నాడు. ఆమె పడుతున్న ఇబ్బంది, తరచూ ఆమెకి కలిగే ఆరోగ్య సమస్యలూ, గతంలో వాడిన మందులూ, అతడే ఓపిగ్గా వివరంగా చెప్పుకు పోతున్నాడు.
“నిద్రలేమి వల్ల సైకోసొమాటిక్ ఇష్యూస్ అని ఇలా ఎన్నెన్నో సమస్యలు వస్తూ ఉంటాయి. మీకు నిద్రలేమి తొలగిపోయి, సరిపడినంత నిద్ర పోవటం ప్రారంభమైతే ఈ సమస్యలు చాలా వరకు అవే తగ్గిపోతాయి. కొన్ని మెడిసిన్స్ రాస్తున్నా, వాడి చూడండి. వారం తరువాత ఓసారి కలవండి. ఎలా ఉందో చూసి మళ్ళీ ఆలోచిద్దాం” అతనితో చెపుతూ పెన్ చేతిలోకి తీసుకుంటూ ఓ సారి ఎందుకో ఆమె వైపు చూసాను.
అప్పుడే కళ్ళు ఎత్తి నా కేసి చూసిన ఆమె కళ్ళు ఒక్క క్షణం నా కళ్ళతో కలుసుకున్నాయి. ఆ కళ్ళలో నాకు చాలా చిరపరిచితమైన భావాలు! అప్రయత్నంగా చేతిలోని పెన్ను టేబిల్ పై పడేసాను. పరీక్షగా ఆమె కళ్ళలోకి చూసాను. ఎందుకో ఆమె కూడా నా కళ్ళ లోకే ధీర్ఘంగా చూస్తోంది. నా మనసుకి ఏదో తడుతోంది! జంతువుల్లో లాగే కొన్ని ఇన్‌స్టింక్ట్స్ మనుషుల్లోనూ కొన్ని సార్లు పనిచేస్తాయేమో! విశాలంగా, స్వచ్చంగా ఉన్న అందమైన ఆ కళ్ళలో నాకే తెలిసిన లోతులేవో ఉన్నాయి! తనది కాని ప్రపంచంలో నివసించే జీవి కళ్ళ లోని నిర్వేదం, జూ లోని జంతువు కళ్ళలో గూడు కట్టుకున్న నీడలు. నాకు బాగా తెలిసిన రోజూ చూస్తున్న అవే కళ్ళు .
నన్ను చూస్తున్న ఆమెలొ ఏదో సంచలనం, నా లాగే ఆమే ఏదో అర్ధమైనట్లుగా చూసింది.
టేబిల్ పైని ప్రిస్కిప్షన్ ప్యాడ్‌నీ పక్కకి తోస్తూ, “ఉహూ! ఇలా కాదు, మీరు చెప్పండి, మీరు ఏదైనా నోరు తెరచి మాట్లాడితే గాని నేను ఏ సంగతీ నిర్దారించలేను!” ఆమె కేసి సూటిగా చూస్తూ అడిగాను. ఐదు నిమిషాలు, కొత్త కేసులైతే పది నిమిషాలకు మించి ఏ పేషెంట్‌నీ చూడని నేను ఆమెతో మాట్లాడించనిదే ఈ రోజు ఇంకెవర్నీ చూడనని ఆ క్షణం లోనే డిసైడయి పోయాను!
“చెప్పండి! పోనీ మీ గురించి ఏదైనా మాట్లాడండి.”
“ఏముంది, నా గురించి?” నెమ్మదిగా శ్రావ్యమైన లోగొంతుకతో ప్రశ్నిస్తున్నట్లుగా సమాధానమిచ్చింది. ఆమె మాట్లాడటం కాస్త ఆశ్చర్యాన్ని కలిగించినట్టుగా తల తిప్పి ఆమె కేసి చూసాడు అతను.
“మీకు అభ్యంతరం లేకపోతే మీరు కాసేపు బైట కూర్చోగలరా?” అతని వైపు చూస్తూ అడిగి, ఆమె రియాక్షన్ కొరకు చూసాను.
“తప్పకుండా!” కుర్చీలోంచి లేస్తూ అన్నాడతను. అతడ్ని వారించకుండా మౌనంగా ఉండిపోయింది ఆమె.
“మీరు ఏదైనా నాతో చెప్పాలనుకుంటే సంశయించకుండా చెప్పవచ్చు. ఇష్టమైతేనే తప్పని సరి అనేం కాదు, మీరేం చెప్పకపోయినా ఫరావాలేదు,ఈ రోజుల్లో అన్ని వ్యాధులకీ మందులున్నాయి, నిజానికి మీకు ఏ వ్యాధీ లేదు, మీకు తప్పక నయమౌతుంది.”
“ఊ…” స్టూడెంట్ లా తలూపింది.
“మీ రొటీన్ ఎలా ఉంటుంది? ఏం చేస్తుంటారు? రాత్రి ఎన్ని గంటలకు బెడ్ మీదకి వెళతారు?”
“ఊ.. లేటే అవుతుంది, రోజూ పదకొండు దాటితే గానీ… భోజనాలూ అవీ అయి అందరూ నిద్రకొరిగే సరికి ఒక్కోసారి ఇంకా లేటవుతుంది.”
“ఊహూ… మీకు అబ్బాయి కదూ, తనూ అంతేనా?”
“వాడు టీవీ చూస్తాడు, త్వరగా నిద్రపోమని చెప్పినా వినడు. వాడు పుట్టినప్పుడు పసితనంలో రోజంతా పడుకుని, రాత్రులు నిద్రపోకుండా ఆటలు మొదలెట్టేవాడు.లైట్లు ఆఫ్ చేస్తే ఏడుపు అందుకునే వాడు!” మురిపెంగా చెప్పింది. తన కొడుకు గురించి చెప్పినప్పుడు ఆమె మొహంలో మెరుపు నా దృష్టిని దాటి పోలేదు. కొనసాగించమన్నట్లుగా తల పంకించాను.