“చెప్పండి ఏమిటి సమస్య?” అలవాటైన రొటీన్, క్యాజువల్ గా ప్రశ్నించాను.
“డాక్టర్ గారూ, ఈమె నా భార్య. తీవ్ర నిద్రలేమితో బాధ పడుతోంది” సమాధానమిచ్చాడు ఎదురుగా ఆమె పక్కనే కూర్చుని ఉన్న అతను.
“ఊహూ? ఎన్నాళ్ళనుండి?”
“దాదాపు పదేళ్ళనుండి” ఈ సారీ అతనే.
“ఇంతకాలంగా సమస్య ఉంటే ట్రీట్‌మెంటేమీ తీసుకోలేదా?”
“ఏవో వాడుతూనే ఉన్నాం, ఫలితం లేదు, ప్రతిసారీ ఆశతో ఏదో చికిత్సకి వెళ్ళడం నిరాశతో మానేయడం. అలోపతి, హోమియో, ఆయుర్వేదం, ప్రకృతి వైద్యం, ఇలా అన్నీ ప్రయత్నించి విసుగుతో ఓ సంవత్సరంగా ఏమీ వాడకుండా వదిలేశాం! మరీ ఈ మధ్య లేచి తిరగలేనంతగా మంచం పట్టింది. ఆమె అదృష్టం, మీ హస్తవాసీ బాగుంటే నయమవక పోతుందా అనే ఆశతో ఇలా తీసుకువచ్చాను. ఈ ఊళ్ళో నా తమ్ముడు ఉన్నాడు, వాడు ఎంతో కాలంగా చెపుతున్నాడు ఈ సిటీ లోనే పేరు మోసిన డాక్టర్ మీరనీ, మీ వద్ద తప్పక నయమౌతుందీ అని” అతనే చెప్పుకు పోతున్నాడు. ఆమె మౌనంగా కూర్చుంది.
“సరే..! మీకు ఆకలి సరిగా ఉందా…” ఆమెని పరీక్షిస్తూ, ప్రశ్నలు మొదలు పెట్టాను. ఆమె అన్నింటికీ నిలువుగానో అడ్డంగానో తలూపటం తప్ప నోరు విప్పలేదు, సమాధానాలు అతడి నుండే వస్తున్నాయి. పరిక్షించటం పూర్తయినా అతను ఇంకా ఏవేవో చెపుతూనే ఉన్నాడు. ఆమె పడుతున్న ఇబ్బంది, తరచూ ఆమెకి కలిగే ఆరోగ్య సమస్యలూ, గతంలో వాడిన మందులూ, అతడే ఓపిగ్గా వివరంగా చెప్పుకు పోతున్నాడు.
“నిద్రలేమి వల్ల సైకోసొమాటిక్ ఇష్యూస్ అని ఇలా ఎన్నెన్నో సమస్యలు వస్తూ ఉంటాయి. మీకు నిద్రలేమి తొలగిపోయి, సరిపడినంత నిద్ర పోవటం ప్రారంభమైతే ఈ సమస్యలు చాలా వరకు అవే తగ్గిపోతాయి. కొన్ని మెడిసిన్స్ రాస్తున్నా, వాడి చూడండి. వారం తరువాత ఓసారి కలవండి. ఎలా ఉందో చూసి మళ్ళీ ఆలోచిద్దాం” అతనితో చెపుతూ పెన్ చేతిలోకి తీసుకుంటూ ఓ సారి ఎందుకో ఆమె వైపు చూసాను.
అప్పుడే కళ్ళు ఎత్తి నా కేసి చూసిన ఆమె కళ్ళు ఒక్క క్షణం నా కళ్ళతో కలుసుకున్నాయి. ఆ కళ్ళలో నాకు చాలా చిరపరిచితమైన భావాలు! అప్రయత్నంగా చేతిలోని పెన్ను టేబిల్ పై పడేసాను. పరీక్షగా ఆమె కళ్ళలోకి చూసాను. ఎందుకో ఆమె కూడా నా కళ్ళ లోకే ధీర్ఘంగా చూస్తోంది. నా మనసుకి ఏదో తడుతోంది! జంతువుల్లో లాగే కొన్ని ఇన్‌స్టింక్ట్స్ మనుషుల్లోనూ కొన్ని సార్లు పనిచేస్తాయేమో! విశాలంగా, స్వచ్చంగా ఉన్న అందమైన ఆ కళ్ళలో నాకే తెలిసిన లోతులేవో ఉన్నాయి! తనది కాని ప్రపంచంలో నివసించే జీవి కళ్ళ లోని నిర్వేదం, జూ లోని జంతువు కళ్ళలో గూడు కట్టుకున్న నీడలు. నాకు బాగా తెలిసిన రోజూ చూస్తున్న అవే కళ్ళు .
నన్ను చూస్తున్న ఆమెలొ ఏదో సంచలనం, నా లాగే ఆమే ఏదో అర్ధమైనట్లుగా చూసింది.
టేబిల్ పైని ప్రిస్కిప్షన్ ప్యాడ్‌నీ పక్కకి తోస్తూ, “ఉహూ! ఇలా కాదు, మీరు చెప్పండి, మీరు ఏదైనా నోరు తెరచి మాట్లాడితే గాని నేను ఏ సంగతీ నిర్దారించలేను!” ఆమె కేసి సూటిగా చూస్తూ అడిగాను. ఐదు నిమిషాలు, కొత్త కేసులైతే పది నిమిషాలకు మించి ఏ పేషెంట్‌నీ చూడని నేను ఆమెతో మాట్లాడించనిదే ఈ రోజు ఇంకెవర్నీ చూడనని ఆ క్షణం లోనే డిసైడయి పోయాను!
“చెప్పండి! పోనీ మీ గురించి ఏదైనా మాట్లాడండి.”
“ఏముంది, నా గురించి?” నెమ్మదిగా శ్రావ్యమైన లోగొంతుకతో ప్రశ్నిస్తున్నట్లుగా సమాధానమిచ్చింది. ఆమె మాట్లాడటం కాస్త ఆశ్చర్యాన్ని కలిగించినట్టుగా తల తిప్పి ఆమె కేసి చూసాడు అతను.
“మీకు అభ్యంతరం లేకపోతే మీరు కాసేపు బైట కూర్చోగలరా?” అతని వైపు చూస్తూ అడిగి, ఆమె రియాక్షన్ కొరకు చూసాను.
“తప్పకుండా!” కుర్చీలోంచి లేస్తూ అన్నాడతను. అతడ్ని వారించకుండా మౌనంగా ఉండిపోయింది ఆమె.
“మీరు ఏదైనా నాతో చెప్పాలనుకుంటే సంశయించకుండా చెప్పవచ్చు. ఇష్టమైతేనే తప్పని సరి అనేం కాదు, మీరేం చెప్పకపోయినా ఫరావాలేదు,ఈ రోజుల్లో అన్ని వ్యాధులకీ మందులున్నాయి, నిజానికి మీకు ఏ వ్యాధీ లేదు, మీకు తప్పక నయమౌతుంది.”
“ఊ…” స్టూడెంట్ లా తలూపింది.
“మీ రొటీన్ ఎలా ఉంటుంది? ఏం చేస్తుంటారు? రాత్రి ఎన్ని గంటలకు బెడ్ మీదకి వెళతారు?”
“ఊ.. లేటే అవుతుంది, రోజూ పదకొండు దాటితే గానీ… భోజనాలూ అవీ అయి అందరూ నిద్రకొరిగే సరికి ఒక్కోసారి ఇంకా లేటవుతుంది.”
“ఊహూ… మీకు అబ్బాయి కదూ, తనూ అంతేనా?”
“వాడు టీవీ చూస్తాడు, త్వరగా నిద్రపోమని చెప్పినా వినడు. వాడు పుట్టినప్పుడు పసితనంలో రోజంతా పడుకుని, రాత్రులు నిద్రపోకుండా ఆటలు మొదలెట్టేవాడు.లైట్లు ఆఫ్ చేస్తే ఏడుపు అందుకునే వాడు!” మురిపెంగా చెప్పింది. తన కొడుకు గురించి చెప్పినప్పుడు ఆమె మొహంలో మెరుపు నా దృష్టిని దాటి పోలేదు. కొనసాగించమన్నట్లుగా తల పంకించాను.
“వాడితో ఆరోజులు కష్టమైనా బాగుండేవి. ఇప్పుడు పెద్దవాడౌతున్నాడు, వాడి కోసం నేనేమీ చేయలేని పరిస్థితి లోకి వచ్చాను.”
“పేచీ పెట్టకుండా స్కూలుకి వెళతాడా?”
“ఊ, అన్నింట్లో వాడే ఫస్టు!” ఆమె ముఖంలో మళ్ళీ అదే వెలుగు.
“మీరూ చిన్నప్పుడు మీ అబ్బాయి లాగే ఉండేవారా?”
“ఊ.. స్కూలంతటికీ నేనే ఫస్టు ఉండేదాన్ని చదువులో…” మాట్లాడుతూ ఆగింది, ఆమె కళ్ళలో గతం తాలూకు నీడలు.
“ఓ! వెరీ గుడ్! ఏ సబ్జెక్ట్ ఇష్టంగా చదివేవారు?”
“ఇష్టమేమిటీ? అన్నీ చదవాల్సిందే! దేంట్లోనూ అరమార్కు తగ్గినా ఇంట్లో నాన్న బెత్తంతో బాదేవాడు.” పెద్దగా బాధ ద్వనించని అభావమైన గొంతుతో చెప్పుకుపోతోంది.
“ఒక్క నిమిషం ఊరికే కూర్చుంటే వీపుపై వాతలు తేలేవి! చదవటం అలవాటైపోయి చదవనప్పుడు చేతులు వణికేవి!” గతం లోకి వెళ్ళిపోయినట్లుగా మౌనంగా కూర్చుండిపోయింది .
“ఓహ్.. ఐతే మీరు చాలా నేర్చుకునుండాలి, చాలా జ్ఞానం సంపాదించారన్నమాట !” వాతావరణాన్ని తేలిక పరచటానికి విఫల ప్రయత్నం చేస్తూ అన్నాను.
“ఎలా, ఎందుకు జీవించాలో నేర్చుకోలేదు! క్లాసు పుస్తకాల జ్ఞానమే తప్పించి లోకజ్ఞానం లేని దాన్నయ్యాను…” ఏదో ఆలోచిస్తున్నట్లు మళ్ళీ మౌనం దాల్చింది.
నేనిచ్చే ట్రీట్మెంట్ కోసమో లేదా నేను అడిగాననో కాక తను చెప్పాలనుకుంది కాబట్టే చెప్పడం మొదలెట్టినట్టుగా ఉంది! ఇంటర్‌కాం తీసి అత్యవసరమైనవి తప్పించి మిగతా అపాయింట్మెంట్స్ అన్నీ క్యాన్సిల్ చేయమని చెప్పి నేనూ మౌనంగా కూర్చున్నా ఆమెనే చూస్తూ.
“బాగా చదివే వారుగా మరి ఏదైనా ఉధ్యోగం లాంటిదేదైనా చేసారా?” మళ్ళీ ఆమెని మాటల్లోకి దింపుతూ ప్రశ్నించాను.
“ఉహూ.. లేదు చదివించారు, చదివాను! పెళ్ళి చేసారు!”
“పేరెంట్స్?”
“ఊ”
“మీకు ఏది ఇష్టమో మీకు తెలియదా?”
“నాకా? మనకేది ఇష్టమో అది చేయగలమా?”
“కొందరు చేయగలరు.”
“కానీ ఆ కొందరిలో నేను లేను, నేను చేసేదేదీ నాది కాదు. మా నాన్న తరచూ అంటుండేవాడు ‘సొంత తెలివి చూపకు చెప్పింది చెయ్యి!’ అని. వాళ్ళు చెప్పిన పని చెయ్యడం తప్ప సొంతగా మరింకేమీ చేయకుండా ఆలోచించకుండా ట్రైనింగ్ పొందాను. చుట్టూ ఉన్న వారు నాలో ఏం చూడాలనుకున్నారో అలానే రూపొందాను.”
నాకు తెలుసు ఆమె ఇంకేం చెప్పక్కర్లేదు, నాకు తెలుసు, అంతా నాకు తెలుసు, మౌనంగా అనుకున్నాను. నాకు అర్ధమైనట్టుగా ఆమె గ్రహించిందని కూడా నాకు తెలుసు.
“మీది అరేంజ్డ్ మ్యారేజ్ కదా!”
“ఊ.. చేశారు.”
“తరువాత?”
“ఇంకేం ఉంటుంది? ఏమీ లేదు. అంతే!”
“ఇప్పుడు మీకు ఇష్టమైనట్లు జీవించలేరా?”
“ఏమో నాకేది ఇష్టమో మర్చిపోయాను!”
“పోనీ చిన్నప్పటి ఇష్టాలు ఉంటాయిగా?”
“చిన్నప్పటివా..?” గుర్తు తెచ్చుకుంటునట్లు ఒక్క నిముషం ఆగింది. “ ఏమో ! మరీ చిన్నతనంలో హాయిగా పరిగెత్తాలనీ, డాన్స్ చేయాలనీ, గొంతెత్తి పాడాలనీ ఇలా ఎన్నో ఉండేవి.” ఆమె నవ్వటానికి ప్రయత్నించి విఫలమైంది. “మనసు సంతోషంగా ఉండేది, ఊరికే నవ్వు వస్తుండేది. అలా నవ్వితే ఇంట్లోవాళ్ళకి ఇష్టం ఉండదని అర్ధం చేసుకునే వయసు వచ్చే సరికే నవ్వు మర్చిపోయాను, భోగం వాళ్ళు మాత్రమే నవ్వుతారనేది అప్పుడు మా ఇంట్లో వాళ్ళ నిశ్చితాభిప్రాయం. కఠినమైన క్రమశిక్షణ లో పెరిగాను. సంతోషంగా ఉండడం చెడ్డవాళ్ళ లక్షణమన్నారు, పసితనం లోనే మంచిదానై పోయాను.”
“సరె అదంతా వదిలేద్దాం! ఇప్పుడు మీ జీవితం మీకు సంతోషాన్ని ఇవ్వటం లేదా?”
“ఏమో ! మా వాళ్ళూ బంధువులూ అంతా నేను సుఖంగా ఉన్నానని, అదృష్ట వంతురాలిననే అంటారు మరి.”
“మీరేం అనుకుంటుంన్నారు?”
“నేను అనుకోవటానికేం ఉంటుంది? మా నాన్న అంటాడు. మా అమ్మాయిని చదివించాను, క్రమశిక్షణ, మర్యాదా, వినయం, అణకువ, పనీ అన్నీ నేర్పించాను డబ్బున్న వ్యక్తితో సాంప్రదాయబద్దంగా పెళ్ళిచేశాను. మా శిక్షణలో పెరిగినందునే అది ఈ రోజు ఇంత సుఖంగా ఉంది! అని. నాకేదీ ప్రత్యేకంగా అనిపించదు! నా మెదడు ఏనాడో సహజత్వాన్ని కోల్పోయింది! వాళ్ళ కొలతల, సూత్రాలతో అదిమి వేయబడ్డ జీవితం స్పందన కోల్పోయింది. లోపల నేనంటూ లేనప్పుడు శరీరానికి ఎన్ని సుఖాలు ఉంటే ఏంటి ప్రయోజనం? నేను ఎవరి లాగానో ట్రైన్ చేయబడ్డాను. ఆ శిక్షణ ‘జీవించకు మేం చెప్పినట్లు నటించు చాలు’ అన్నట్లుండేది. నటించీ… నటించీ, ఇప్పుడు ఎవరో ఒకరు స్క్రిప్టు రాస్తేనే గాని ముందుకు సాగకుండా ఐపోయాను.”
ఒక్కనిమిషం ఆగి కొంగుతో ముఖాన్ని తుడుచుకుంది. ఇంత మాత్రం కూడా ఎవరితో మాట్లాడి ఎరగదేమో కాస్త ఆయసం తో ముఖాన చెమట పట్టింది. ఓ మూలనున్న టేబిల్ దగ్గరకి నడిచి జగ్ లోని మంచినీళ్ళు గ్లాసులోకి వంచి అందించాను. అందుకుని తాగి ఖాళీ గ్లాసు టేబిల్ పై పెట్టి మాట్లాడటం మొదలు పెట్టింది.
“వాళ్ళ మూసల్లా పిల్లల్ని తయారు చేయాలనుకుంటారు పెద్దవాళ్ళు.. . కొందరు అదృష్టవంతులు ఆత్మలు చచ్చి మూసల్లా తయారవుతారు, సుఖపడతారు కూడా. మరి కొందరు అదృష్టవంతులు ఎదురు తిరిగి సొంత వ్యక్తిగా ఎదిగి తృప్తిగా జీవిస్తారు. నాలాంటి దురదృష్టవంతులు ఇటు సొంత ఆత్మ చావకా, అటు వారి ట్రెయినింగ్ తో కుదించుకుపోయీ అసమర్ధుల్లా మిగిలి పోతారు.” ఇంకేం లేనట్టు మాట్లాడడం ఆపేసింది.
“అవును అసమర్ధుల్లా మిగిలిపోతారు”, నాలో నేనే నిశ్శబ్దంగా అనుకున్నా. ఆమె చెప్పింది కొంతే. చెప్పకపోయినా ఇంకా ఎంతో తెలుసు నాకు.
“సరె, నేను చెప్పేందుకు ఏమీ లేదు, మీకు అన్నీ తెలుసు! ఎందుకీ స్థితి అన్నది మీరు తెలుసుకోగలిగారు. త్వరలోనే తరువాత ఏమిటి? అనేది మీకే తడుతుంది.” చెపుతూ ప్రిస్కిప్షన్ రాయడం మొదలుపెట్టాను.
“ఇదిగో ఈ టాబ్లెట్ మనసుని కాస్త తేలిక పరచడానికి ఉపయోగపడుతుంది, అవసర మనిపించినప్పుడు వాడవచ్చు. ఇంకోటి నైట్ పడుకునే ముందు వేసుకొండి” చెపుతూ ప్రిస్కిప్షన్ ఆమె వైపు జరిపాను. నేననుకున్నట్లే ఆమె దాన్ని అందుకోలేదు.
నేనూ ఏదో చెప్పాలనుకుంటున్నట్లు గ్రహించేసింది, నాకు తెలుసు! కానీ.. నేను…? చెప్పండి అన్నట్లు చూసింది. ఆమె గుర్తు పట్టేసింది, నాకది తెలుస్తూనే ఉంది. రెండు నిమిషాలు ఇద్దరి హృదయాలు మౌనంగా ఓదార్చుకున్నాయి.
“వెళ్తాను.. థాంక్యూ!” ప్రిస్కిప్షన్ చేతిలోకి తీసుకుంటూ లేవబోతోంది.
“గతంలో డాక్టర్లు మీకేమైనా చెప్పే ఉంటారు.. మళ్ళీ అవన్నీ నేను చెప్పను, నా స్వానుభవంతో ఒక్కటి చెప్పగలను. మీకు మీ అబ్బాయి ద్వారా కొంత ఉపశమనం దొరకవచ్చు. మీ అబ్బాయిని తన సొంత ఆలోచనలతో స్వేచ్చగా పెరగనివ్వండి! వాడిలో మీకు మీరు కనిపించినప్పుడల్లా మీకు బావుంటుంది. మరొకటి సంతోషాన్ని , తృప్తి ని మించిన నిద్రమాత్ర ఇంకోటి లేదు వాటికై శాయశక్తులా ప్రయత్నించండి.”
ఆమె మౌనంగా డోర్ వైపు నడచింది. నేను టేబుల్ డ్రాలోంచి ఓ టాబ్లెట్ తీసి వేసుకుని నీళ్ళు తాగాను, ఆమెకి ప్రిస్కిప్షన్ లో రాసిన టాబ్లెట్ అదే.
నా ఎదురుగా గోడపై ఫోటోలో నాన్న కళ్ళలో గర్వం. నా కొడుకుని నాలాగే డాక్టర్ని చేసాను. నా హాస్పిటల్ కి అధిపతిని చేసాను అన్న గర్వం !