పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16454

  1. చాటు పద్యాల్లో శ్రీనాథుడు గురించి డా. వేలం పళని అభిప్రాయం:

    10/16/2019 2:04 am

    చాలా బాగుంది. శ్రీనాథుని పై స్పెషల్ పేపర్ ఎంపిక చేసుకొన్న విద్యార్థులు కూడా ఈ వ్యాసం తప్పక చదవాలి. అభినేయ, ప్రాసంగిక, కథా చాటువుల గురించి కూడా ముందు ముందు ప్రస్తావించండి.

  2. కవితాకన్యక మానసంరక్షణము గురించి లక్ష్మణ్ అభిప్రాయం:

    10/11/2019 11:07 am

    ఇది చాల బాగుంది. ఇది ఏకపాత్రాభినయంలా చేస్తే ఎంతో బాగుంటుంది. కవుల మీద ఇలాగ రాయలని ఊహ రావటం నిజంగ అద్బుతం. చివరగ రాసిన మొక్కపాటి వెంకటరత్నం పంతులు పుస్తకం ఎక్కడ దొరుకుతుందో తెలియచెయ్యండి.

  3. చిన్నయ సూరి – గిడుగు రామమూర్తి 3 గురించి గోవింద్ అభిప్రాయం:

    10/09/2019 5:18 pm

    Dr. I.A.P.S. Murthy గారు,

    క్రీములు (అంటే క్రిములు) పూస్తే పనిచేయవు అప్లై చేస్తేనే పనిచేస్తాయి.
    గంధం పూస్తారు. పసుపు రాస్తారు.
    కానీ టీవీల్లో సౌందర్యపోషణా కార్యక్రమాలలో అన్నీ అప్లై చేస్తారు.
    ఎందుకంటే ఆ సామాగ్రి అంతా వారు సప్లై చేస్తారు.

    మీరు అన్ని విషయాలు చాల చక్కగా వివరించారు.

    ధన్యవాదాలు.

  4. త్యాగరాజయ్య సాహిత్యము: సాహిత్యమును వెనుకకు నెట్టి నూతన సృష్టి చేసిన త్యాగయ్య గానప్రతిభ గురించి Akhil Pattamatta అభిప్రాయం:

    10/09/2019 10:16 am

    వ్యాసం ఎంతో తేజోవంతం. అయినా, శ్యామశాస్త్రి, ముత్తుస్వామి దీక్షితార్ విషయంలో వ్యాఖ్యలు అంత రుచిగా లేవు. ఆర్ద్రతలో శ్యామశాస్త్రిగారిని మించినవారు లేరు. త్యాగరాజువారు తత్వం చెప్పారు, అలంకారాలు వేసారు, ఎన్నో ప్రయోగాలు చేశారు. ఇవన్నీ పట్టలేదు శ్యామశాస్త్రిగారికి. వారు తెలుగువారు కాకపోయినా వారి సాహిత్యం ఎంతో సొగసు అయినది. సంస్కృతం వాడకం తగ్గించి, పాలించు కామాక్షి, తల్లి నిన్ను నెరనమ్మి, కరుణ జూడవమ్మా వంటి అనేక కృతులలో వారు అల్లిన సాహిత్యం మధురాతి మధురం.

    ముత్తుస్వామి దీక్షితార్ వారి విషయానికి వచ్చేసరికి, యావత్ దేశం వినగలిగే సాహిత్యం, మంత్ర శాస్త్ర విజ్ఞానము, నాదానుభూతి వారి సొంతం.

    త్యాగరాజు పట్ల వీరి అభిమానం, ఇతరులపై preconceptions ఈ మొదటి paragraphsలో కనిపిస్తున్నాయి.

  5. ప్రాణంతో చెలగాటం గురించి Ramnarayana Battula అభిప్రాయం:

    10/09/2019 9:55 am

    Marvelous, made to read in one go!

  6. థాయ్‌లాండ్ యాత్రాగాథ – 3 గురించి వంశీ క్రిష్ణ అభిప్రాయం:

    10/08/2019 4:26 am

    మీరు బయటపెట్టాల్సిన జ్ఞాపకాలు, మేము దాచుకోవాల్సిన ట్రావెలోగ్ లు మీ థాయ్ భూమి యాత్రా విశేషాలు. చరిత్ర, ప్రదేశాలు, వాళ్ల కథలు, మధ్య మధ్య మీ చతురోక్తులు, కూతూహలం, వివరణలు.. వెరసి చక్కటి కాలక్షేపం, మాబోటి చల్లకదలకండా కూర్చుని ప్రపంచాన్ని చుట్టేవారికి (మీ కళ్లతో).

  7. చిన్నయ సూరి – గిడుగు రామమూర్తి 3 గురించి K.V.S. Ramarao అభిప్రాయం:

    10/07/2019 8:18 pm

    చాలా చక్కటి వ్యాసపరంపరని రాశారు నారాయణరావు, శ్రీనివాస్ గార్లు. దీని వెనక ఎంతో పరిశ్రమ వుంది. దీన్లో ఎంతో పనితనం వుంది.
    ఐతే గమ్యం ఏదో ముందుగా ముచ్చటగా చెప్పివుంటే ముందు రెండు భాగాలూ ఇంకా తేలిగ్గా అర్థమై వుండేవి (బహుశా ఎక్కడికి చేరతారో మొదలెట్టినప్పుడు వారికి విస్పష్టంగా తెలియక పోయి వుండే అవకాశమూ లేకపోలేదు). ఏమైనా, నాకర్థమైంది ‘కవితలు, కథలు, ఇతర కల్పిత రచనలు కాని’ రచనల్లో రాసే తెలుగు గురించి చాలా కూలంకష చర్చ చేసి ఇప్పటి దుస్థితి నుంచి బయటపడటానికి కొన్ని సూచనలు చేశారని. కల్పనా రచనల మీద ఎలాటి ఆంక్షలూ పెట్టటం మంచిది కాదని స్పష్టంగా వివరించారని. ఐతే మాట్లాడే తెలుగు ఎలా వుండాలనేది ఈ వ్యాసాల పరిధి లోకి రాలేదు, నాకర్థమైనంత వరకు. మొత్తం మీద, చాలా విస్తారంగా మొదలైన చర్చ కొంత ఇరుకైన గమ్యాన్ని మాత్రమే చేరిందేమో అనిపిస్తుంది.

    ఐతే, అకల్పితరచనల భాష గురించి ఇంత లోతైన పరిశోధన, లోచూపు, విస్తారం వున్న ఈ పరంపరని ఇన్నాళ్లుగా కొనసాగించిన వ్యాసకర్తలు అభినందనీయులు. తెలుగు మీద (ఇంకా) మమకారం వున్నవాళ్లకి ఇది అవశ్యపఠనీయం.

    పదిహేనేళ్ల క్రితం అనుకుంటాను, ఒక తేలికైన mathematical model ని ఉపయోగించి ఇంక ఏడు తరాల్లో తెలుగు భాష కేవలం విద్యావిహీనులు మాట్లాడే భాషగా మాత్రమే మిగుల్తుందని నేనో వ్యాసం రాశాను. చాలా మంది నా మీద విరుచుకు పడ్డారు కూడ. కాని ఇప్పుడు అది బహుశ దురాశాపూరితమైన అంచనా అని, అంతకాలం కూడ పట్టకపోవచ్చునని అనిపిస్తున్నది. తెలుగు మాట్లాడటం వెనకబాటుతనానికి గుర్తని, ఇంకే భాషలూ రాని వాళ్లకి మాత్రమే తెలుగు గతని చాలామంది విద్యావంతులైన తెలుగు వాళ్ల అభిప్రాయమని నా అభిప్రాయం. తెలుగు మనకి గర్వకారణమని భావించి, తెలుగువాళ్లు తెలుగు లోనే మాట్లాడే స్థితి కలగాలంటే, ఎవరో ఒక సినీ ప్రముఖుడు నడుం కట్టి ఉద్యమం నడిపిస్తే తప్ప సాధ్యం కాదని నాకనిపిస్తున్నది ఇప్పటి పరిస్థితుల్లో. కర్ణాటకలో రాజ్ కుమార్ నడిపిన ఉద్యమం గుర్తొస్తున్నది ఈ సందర్భంగా. అలా కాకుండా ఏదో కొద్దిమంది ఎంత అరిచిగీపెట్టినా తెలుగు వాళ్లు అవకాశం ఉంటే తెలుగు తప్ప ఇంకే భాషనైనా మాట్లాడతారు తప్ప తెలుగుని కాదు.

  8. చిన్నయ సూరి – గిడుగు రామమూర్తి 3 గురించి Dr. I.A.P.S. Murthy అభిప్రాయం:

    10/07/2019 1:49 am

    >>ఈనాటి తెలుగు వచనం
    క్రమక్రమంగా ఈ ఉద్యోగాల్లో తెలుగు మీద ఏ విధమైన పట్టు లేనివాళ్లు, అంతో ఇంతో ఇంగ్లీషు మాత్రమే చదువుకున్నవాళ్లు చేరారు. దీని ఫలితంగా తెలుగు పత్రికల్లో భాష ఇటు తెలుగూ కాని, అటు ఇంగ్లీషూ కాని ఒక విలక్షణమైన స్థితికి చేరుకుంది. ఇంగ్లీషుకి సమానమైన ఏ తెలుగు మాటా వెంటనే తోచకపోతే, ఆ ఇంగ్లీషు మాటనే వాడెయ్యడం ఈ కొత్త ఉపసంపాదకులు అలవాటుచేసుకున్న పద్ధతి……

    తెలుగు భాష – నేటి స్థితి

    ఆంధ్రరాష్ట్రాలలో ప్రస్తుతం వాడుకలో ఉన్న తెలుగుని గమనిస్తే అనేకవిధాలుగా భాష భ్రష్టుపట్టి పోతోందనిపిస్తూంది. పేలవమైన ఉచ్చారణ, మితిమీరిన పరభాషాపదప్రయోగం, లిపి దోషాలు / ముద్రారాక్షసాలు, అస్తవ్యస్తమైన వ్యాకరణం / మాటలకూర్పు లాంటి లక్షణాలతో జనబాహుళ్యంలో మనభాష ఎన్నోవిధాలుగా సతమతమౌతోంది. సినిమాలూ టీవీలూ పత్రికలూ FM రేడియోలూ తెలుగుభాషకు ఈ స్థితి పట్టడానికి తమవంతు సాయం చేస్తున్నాయి. వాణిజ్య ప్రకటనలలో వాడుతున్న తెలుగుకైతే దౌర్భాగ్యం దాపురించింది.

    వీటి గురించి కొంచెం:

    1. ఉచ్చారణ:

    ముక్యమంత్రి, ఆసాబావం, ఆర్దికసాకా మంత్రి, ప్రస్న, గనవిజయం, అద్యక్షుడు, మద్యాహ్నం, అబ్యర్ది, … చేసారు, స్రీకాకులం, తెలంగానా, వరద ఉద్రుతం, దీపావలి… ఇటువంటి ఘోరమైన ఉచ్చారణలు తెలుగు దృశ్య, శ్రవణ మాధ్యమాలలో కోకొల్లలు. సినిమా హీరోలను మొదలుకొని గుళ్లలో పూజారులది కూడా ఇదే తంతు. హీరోయిన్లకి డబ్బింగ్ చెప్పేవాళ్లు వేరే ఉంటారు కనుక, వీళ్ల ఉచ్చారణ కొంత నయం. సీనియర్లైన సుమ లాటి వాళ్లు కూడా ఇటీవలి కాలంలో అడపాదడపా ఒత్తుల్ని విస్మరిస్తూండడం విచారకరం.

    చక్కగా ఒత్తులు పలికేవాళ్లు రానురానూ తగ్గిపోతున్నారు.

    ‘చ’, ‘జ’ ల దంత్యాక్షరాలను కంప్యూటర్ పై రాయడం తెలియలేదు. అచ్చులో లేకపోయినప్పటికీ, వీటి దంత్యాలకూ తాలవ్యాలకూ తేడా తెలిసి మాట్లాడేవాళ్లు చాలా తక్కువమంది. ఇది పక్కన పెడితే, ఈ అక్షరాలను అదొక విధంగా పలకడం కొందరికి పరిపాటిగా మారింది.

    2. లిపి

    పదిమంది చూడాలని పెట్టిన బోర్డుల్లో రాస్తున్న లిపి గురించి ఎవరికైనా తెలుసునా, తెలిస్తే పట్టించుకుంటున్నారా అనిపిస్తుంది. చూపే సదుపాయం ఉంటే ఇందుకు నిదర్శనంగా కొన్ని చిత్తరువులను పెట్టేవాడిని.

    విశాఖపట్నంలో కానీ, హైదరాబాదులో కానీ, దుకాణాలముందూ వాహనాలపైనా ఇతరత్రా కూడా రాసిన తెలుగులో, నాలుగింట మూడువంతులు తప్పులతో ఉండడం చూడవచ్చు. మిగతా భాషలలోని వ్రాతని పరికిస్తే ఒక్క తప్పు కూడా దొరకదు.

    ముద్రారాక్షసాలకి మరొక కారణం – ముఖ్యంగా ఫ్లెక్సీలలో – కంప్యూటర్లో ఇంగ్లీషు అక్షరాలతో తెలుగు లిపిని తెప్పించడం. ఈ విధంగా తెలుగు బోర్డులు తయారు చేసే వాళ్లకి తగినంత శిక్షణ లేకపోవడం ఒక కారణం కావచ్చు.

    ఇంగ్లీషు భాషని తెలుగు లిపిలో రాయడం మరొక జాడ్యం. ఇంగ్లీషు పదాలకి సరైన తెలుగు మాటలు తెలియక ఇలా చేస్తున్నారా?

    కొన్ని పత్రికలూ మాధ్యమాలూ స్వతంత్రించి, ‘ఋ’ ని ‘రు’ గా మార్చేశాయి. క్రుష్ణుడు, త్రుప్తి లాటివి రాయడం ఇంకా మొదలయినట్లు లేదు. ‘ఱ’ ఏనాడో కనుమరుగైంది.

    3. పరభాషా పదప్రయోగం

    ఈ మధ్యకాలంలో మామూలుగా మాట్లాడే తెలుగు వాళ్లెవరూ రంగులూ అంకెలూ వారాలపేర్లూ తెలుగులో వాడగా వినలేదు. బ్రదర్, సిస్టర్, మదర్, ఫాదర్, అంకుల్, ఆంటీ, కజిన్ బ్రదర్, కజిన్ సిస్టర్: ఇవి చుట్టరికాలు. రైస్, కర్రీస్, పాపడ్, చట్నీ, రసం, కర్డ్, ఇవి భోజన పదార్థాలు. చీర, రవికె, అంచు, పాట, బడి, పరీక్ష, విమానం లాటి పదాలు వినబడటం లేదు. అరకు వేలీ, ఎయిర్ పోర్ట్, టెంపుల్, లెఫ్ట్, రైట్; రాయడమైనా మాట్లాడమైనా అన్నిటికీ ఇంగ్లీషే. కూరలమ్మేవాళ్ల దగ్గర్నుంచి కార్లు కొనుక్కునే వాళ్ల వరకూ ఇదే తీరు.

    వంటల కార్యక్రమాలలో ఇంగ్లీషు వాడకం వర్ణనాతీతం. వెజిటబుల్స్ స్మాల్ స్మాల్ పీసెస్ గా కట్ చెయ్యడం, బౌల్ లో వెయ్యడం, ఆయిల్, వాటర్, సాల్ట్, సుగర్, బట్టర్ యాడ్ చెయ్యడం, స్టౌ ఆన్ చెయ్యడం (పొయ్యి వెలిగించడం కాదు), మిక్స్ చెయ్యడం, ఫ్రై చెయ్యడం, ఇలాచీలు (ఏలకులు కాదు), సిరప్, టేస్ట్, మచ్చుకి కొన్ని. కొన్ని వాక్యాలలో ఐతే, ఒకటి రెండు తెలుగు పదాలు మినహాయిస్తే, మిగతాదంతా ఇంగ్లీషే. తరగడం, సన్ననిసెగ, కలియ తిప్పడం, కరగబెట్టడం లాటి మాటలు లేనేలేవు. కూరగాయల పేర్లు, పండ్ల పేర్లు, అంకెలు; ఇవేవీ తెలుగులో ప్రస్తుతం వాడుకలో లేవనుకుంటాను. ఆశీర్వాద్ సంస్థ వారు ‘ఆటా’ ని అమ్ముతారు; గోధుమ పిండిని కాదు.

    టీవీల్లో సౌందర్యపోషణా కార్యక్రమాలలో వచ్చేవాళ్ల మాటల సోకు చెప్పనలవి కాదు. తెలుగులో అవయవాలే లేవు. అన్నిటికీ ఇంగ్లీషే. ఏవీ పూయరు, రాయరు; అప్లై చేస్తారు.

    గమ్మత్తేమిటంటే, పరాయి రాష్ట్రాలవాళ్లు తెలుగులో మాట్లాడితే, తెలుగు వాళ్లకంటే తక్కువ ఇంగ్లీషు పదాలు వాడతారు.

    తెలుగు భాషాభివృద్ధికి పాటుబడుతున్నామంటూ సంస్ఠలూ పత్రికలూ నడుపుతున్న రామోజీరావు గారి ‘ఈటీవీ న్యూస్’ తో సహా పత్రికల్లోనూ టీవీల్లోనూ అనేక శీర్షికలు ఇంగ్లీషులోనే ఉన్నాయి.

    తెలుగువారికీ మిగతా భారతీయులకీ తేడా ఎక్కడుందంటే, వాళ్ల వ్యావహారిక భాష వేరు, సభాముఖంగా మాట్లాడే భాష వేరు. తమిళులైతే నలుగురిలోనూ / నలుగురితోనూ గ్రాంధికంగా తప్ప మాట్లాడరు. బంగ్లా, మరాఠీ, కన్నడం, మలయాళం, హిందీ మొదలైన భాషా ప్రసంగాలలో పరభాషా పదాలు అతి తక్కువ ఉంటాయి. ఏ స్థాయి వారు సభలో మాట్లాడినా, స్వంత భాషలోని స్వచ్ఛత సొగసులొలుకుతూ ఉంటుంది.

    4. అస్తవ్యస్తమైన వ్యాకరణం / మాటలకూర్పు:

    తెలుగు వాడకంలో ఈ మధ్య ఎంతో విశృంఖలత్వం చోటు చేసుకుంది.

    సెల్ ఫోన్ మాట్లాడుతూ…
    హైదరాబాద్, విజయవాడ లో (హైదరాబాద్, విజయవాడ లలో కాదు) …
    విపక్షం …
    నలుగురు మృతి …

    మచ్చుకు కొన్ని. విశదంగా ఉదహరించడం వీలుకాదు.

    ‘బ్రష్ చేసుకోవడం’, ‘ఆన్ ది వే లో ఉండడం’, ‘లంచ్ చెయ్యడం’ లాటి మిశ్రమ పదజాలాల ప్రయోగం వాడుక భాషలో అలవాటుగా మారింది.

    శ్రీ వేంకటేశ్వర భక్తి వాహిని వారి నాదనీరాజనం కార్యక్రమంలో ఎంతో కాలంగా వస్తున్న ఒక వ్యాఖ్యాత, నాలుగైదు పదాలు కూడా ఒక వాక్యంలో సరిగ్గా కూర్చలేకపోవడం శోచనీయం.

    ఇవన్నీ చూస్తుంటే, వాడిన భాషను సరిచూసే వాళ్లూ, సరిదిద్దే వాళ్ళూ ఉన్నారా, ఉంటే భాషపట్ల వారికి అవగాహనగానీ ఆసక్తిగానీ శ్రద్ధగానీ ఉన్నాయా అన్న సందేహం కలుగుతుంది.

    ఒకప్పుడు ముప్పాళ రంగనాయకమ్మ పత్రికాభాష గురించి రాసిన ‘తెలుగే రాస్తున్నామా?’ అన్న వ్యాసావళిని గుర్తుచేసుకుని పాటించడం ఇప్పుడు చాలా సంపాదకులకి అవసరం.

    పతనమౌతున్న తెలుగు భాష తిరిగి ఎలాగ పైకి వస్తుందో తెలియదు. ఒకరిద్దరు పెద్దలకీ పండితులకీ తెలియజేయడం, అభ్యర్ధించడం జరిగింది. సలహాలూ సూచనలూ ఇవ్వడం సులువే. కానీ వాటిని ఆచరణలో పెట్టడం, ఫలితాలు సాధించడం, ఒక బృహత్కార్యం.

    ‘ఈమాట’ మూలంగా ఎవరైనా స్పందిస్తే సంతోషం.

    భవదీయుడు,
    ఇంద్రగంటి అనంత ప్రభాకర సత్యనారాయణ మూర్తి.
    హైదరాబాదు.

  9. ప్రాణంతో చెలగాటం గురించి Murali Krishna Rao, Sanaboyina అభిప్రాయం:

    10/04/2019 6:04 am

    చాలా బావుంది. ఇటువంటి కథలు తరచూ ప్రచురించండి.

  10. జాషువా పిరదౌసి గురించి satyavada venkata subba rao అభిప్రాయం:

    10/03/2019 4:51 am

    అద్భుతంగా ఉంది. ఇంతకాలము ఫిరదౌసి అంటే జాషువాగారు రాసిన పుస్తకం అని అనుకున్నాను కాని ఇది ఒక కథా కావ్యం అని తెలిపినందుకు ధన్యవాదములు.