పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16450

  1. ఈమాట మే 2008 సంచిక విడుదల గురించి chavakiran అభిప్రాయం:

    05/03/2008 6:00 pm

    లోగోలో బొమ్మ బాగుంది. కానీ ఫాంట్ మాత్రం మరీ పాత కాలం చందమామ ఫాంటులా ఉన్నది. వేమన?

    బై డిజైన్ అయితే పర్వాలేదు, కాకుంటే ఇంకేమన్నా జలక్ ఇచ్చే ఫాంట్ ట్రై చెయ్యాల్సింది 🙂

  2. పేరు గలవాడేను మనిషోయ్ గురించి డా.స్మైల్ అభిప్రాయం:

    05/03/2008 2:48 pm

    ‘సిన్నబ్బ’ కథల్లాగా ‘కాదరయ్య’ కథలు అని ఓ పుస్తకం అచ్చేయించొచ్చు రచయిత. కథ చదవడంలో ఉండే మజా బాగా అనుభవించాను కానీ ఏదో తెలియని అసహనం. ఇదీ అని చెప్పలేని భావన. రవికిరణ్ గారి వ్యాఖ్య చదివాక ఇదీ అని తెలిసింది. కానీ కథను నడపడంలో మంచి ప్రావీణ్యం సంపాదించాడు రానారె!

  3. పేరులేదు గురించి డా.స్మైల్ అభిప్రాయం:

    05/03/2008 2:33 pm

    సంప్రదాయ సాహిత్యానికి, ఇంకా చెప్పాలంటే…

    ‘మృగమదసౌరభవిభవ
    ద్విగుణితఘనసారసాంద్రవీటీగంధ
    స్థగితేతరపరిమళమై
    మగువపొలుపుఁదెలుపు నొక్క మారుత మొలసెన్’

    అతఁడా వాతపరంపరా పరిమళ వ్యాపార లీలన్‌ జనా
    న్విత మిచ్చోటని చేరబోయి కనియెన్‌ విద్యుల్లతావిగ్రహన్‌
    శతపత్రేక్షణఁ చంచరీకచికురన్‌ చంద్రాస్యఁ చక్రస్తనిన్‌
    నతనాభిన్‌, నవలా ,నొకానొక మరున్నారీ శిరోరత్నమున్‌

    అన్న పద్యానికీ-ఈ కింది అభ్యుదయ కవితకు

    ‘దారిపక్క చెట్టుకింద,ఆరిన కుంపటి విధాన
    కూర్చున్నది ముసల్దొకతె
    మూలుగుతూ-ముసురుతున్న ఈగలతో వేగలేక
    ముగ్గుబట్టవంటి తలా, ముడుతలు తేరిన దేహం,
    కాంతిలేని గాజుకళ్లు-తనకన్నా శవం నయం.
    పడిపోయెను జబ్బుచేసి, అడుకొన్నే శక్తిలేదు,
    రానున్నది చలికాలం, దిక్కులేని దీనురాలు,
    ఏళ్లు ముదిరి, కీళ్లు కదిలి, బతుకంటే కోర్కెసడలి-
    పక్కనున్న బండరాతి పగిదిగనే పడిఉన్నది.
    “ఆ అవ్వే మరణిస్తే ఆ పాపం ఎవ్వరి”దని
    వెర్రిగాలి ప్రశ్నిస్తూ వెళ్లిపోయింది!
    ఎముకముక్క కొరుక్కొంటూ ఏమీ అనలేదు కుక్క,
    ఒక ఈగను పడవేసుక తొందరగా తొలగె తొండ;
    క్రమ్మె చిమ్మచీకట్లూ, దుమ్మురేగె నంతలోన
    “ఇది నా పాపం కా”దనె ఎగిరివచ్చి ఎంగిలాకు.

    గల తేడాను మీ కవితలో చూసుకొన్నాను. మనస్సు కదిలించిన కవిత, పేరులేక పోయినా గొప్పదనానికి లోటులేదు.

  4. పేరు గలవాడేను మనిషోయ్ గురించి రవికిరణ్ తిమ్మిరెడ్డి అభిప్రాయం:

    05/03/2008 1:51 pm

    రానారే గారి కథ వ్రాసే తీరు చాలా బాగుంటదని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎక్కడా నిల్చిపోకుండా, చక్కగా, మృదువుగా, వేసవికాలంలో మరీ ఉధ్రుతి లేని ప్రవాహంలా, చల్ల చల్లగా, మొదటి వాక్యం నుంచి, ఆఖరి వాక్యానికి జారిపోతాం. ఈ కథ లో కథనం కూడా అంత బాగానూ వుంది.

    కథలో ఇతివృత్తం మాత్రం నా కంతగా నచ్చ లేదు. మా చిన్నప్పుడు టి. వీలు ఆంధ్ర దేశాన్ని జయించనప్పుడు ఆలిండియా రేడియోనే రాజ్యం సాగుతున్నప్పుడు సంగతి. అత్యకస్థితి రోజుల్లో ఇందిరా గాంధీ గారి ఇరవై సూత్రాల పథకాన్ని గురించి, ఇందిర గారి ఇండియా గురించి రేడియో నాటికలూ, కథానికల ప్రచార సాహిత్యం గుర్తు కొచ్చింది కథ చదివేక. ఊర్లో మోతుబర్లు, సన్నకారు రైతులు, రైతు కూలీలూ, రెడ్లు, మాల, మాదిగలూ అనే ఆర్ధిక, సామాజిక, కుల వైరుధ్యాలు లేని సమాజం చూపించే వారు ఆ రేడియో ప్రచార కథల్లో. ఆర్ధిక అసమానతల్తో సంబంధం లేకుండా, ఎవరి సమస్యలు వారికుండొచ్చు, కథలో రెడ్డి కారు, బుట్టోడి ఇల్లు సమస్య లాగా. కానీ అందరూ కలసి ఇందిరగారీ ఇండియా పల్లెల్లో ఒకరికోకరుంటూ వొక స్వర్గఖండాన్ని సృష్టిస్తారు. అప్పుడు ఏ కలక్టరో ఎవరో వచ్చి అభినందించి, వాళ్లకి ఇరవై సూత్రాల పథకం పవర్ని విశిదీకరించి గ్రామానికి బర్రెలూ, గొర్ర్లూ, ఇళ్ళు ప్రసాదిస్తారు. ఈ కథలో కూడా బుట్టోడి నాయనకి వొక ఇందిరమ్మ ఇల్లు ఇచ్చేస్తే రాజశేఖర రెడ్డి సుద్దంగా ఈ కథని ప్రచారానికి వాడుకోవచ్చు.

    మంచి కథనంలో ముడుచుకుపోయిన అసహజ కథిది, అందుకనే ఆఖర్లో కథ మనసుని తాకకుండానే ఆగిపోతుంది.

  5. సడిచేయకే గాలి గురించి Sai Brahmanandam Gorthi అభిప్రాయం:

    05/03/2008 12:27 pm

    లైలా గారూ,

    వేలూరి గారి వ్యాసం రాయకపోయినా ఇలాంటివి కనిపిస్తే రాస్తాను. మీకందరికీ తప్పులేదనిపించింది. సంతోషం.

    ప్రేరణకి కొత్త అర్థాలూ, అన్వయాలూ చెప్పినందుకు ఆనందించాను. ఇప్పుడే పాత సినిమా పాటలన్నీ ముందేసుకూర్చున్నాను. ఎంత ప్రేరణ దొరుకుతుందో చూడాలి.
    మీరు రాసిన –
    “కవి ఎవ్వరికీ తెలియదు, కాపీ కొట్టేద్దాం అని కాదు ఈ పాట రాసేది. చాలామందికి ఈ పాట చాలా ఇష్టమనే. ఈ కవి ముందు పాటకి పొంగిపోయాడు. ఇంకో చక్కని విషయానికి దాన్ని అన్వయించి మరో చక్కని పాట రాశాడు. దీనితో మన ఆనందం ఎక్కువ అయ్యింది కాని తగ్గదే.”
    అన్న ఈ మాటలు కవి గారంటే ఇంకాస్త అనందించేవాణ్ణి.

    -సాయి బ్రహ్మానందం గొర్తి

  6. సడిచేయకే గాలి గురించి జె.యు.బి.వి. ప్రసాద్ అభిప్రాయం:

    05/03/2008 11:12 am

    ఇక్కడ ఇచ్చిన లింకుకి కృతజ్ఞతలు. చక్కగా రాజసులోచననీ, యంటీ రామారావునీ, రాజనాలనీ చూస్తూ, పాట మూడు సార్లు విన్నాను లీల గారి చక్కటి గొంతుతో. సంతోషం కలిగింది.
    ఈ పాటలో పల్లవి కాకుండా మూడు చరణాలున్నాయి. ఒక్కో చరణంలో ఆరు చిన్న లైన్లు (లేదా మూడు చిన్న లైన్లు) వున్నాయి. మొత్తం పద్దెనిమిది చిన్న లైన్లు, లేదా తొమ్మిది పెద్ద లైన్లు. చొక్కాకుల వెంకట ప్రసాద్ గారు రాసిన కవితలో (పాటలో?) మూడు చరణాలున్నాయి. మొదటి చరణంలో ఆరు లైన్లూ, రెండవ చరణంలో నాలుగు లైన్లూ, మూడో చరణంలో ఐదు లైన్లూ. మొత్తం పదిహేను లైన్లు. రెండింటి లోనూ పల్లవి రెండు లైన్లు. పల్లవి లోని మొదటి లైను మాత్రం ఒకేలా వుంది. అంటే కవి గారు ఈ పాటలోని మొదటి లైను మాత్రం స్ఫూర్తిగా తీసుకుని రాశారనుకుని, కాస్త ఈజీగా తీసుకుని వదిలెయ్యాలి. “గ్రంధ చౌర్యం” అనే పెద్ద మాటలూ, “రాసిందేమో నాలుగు లైన్ల కవిత” అనే అన్యాయం మాటలూ ‘విజ్ఞత’కి చెందినవి అవవు.
    ఈ సందర్భం గురించి నిన్న ఇంకో వెబ్ పత్రిక ఎడిటర్ గారితో మాట్టాడుతున్నప్పుడు, కొన్ని విషయాలు తెలిశాయి. సుద్దాల అశోక్ తేజ అనే సినీ పాటల రచయిత, శ్రీశ్రీ “మహాప్రస్థానం” లోని “నేను సైతం ప్రపంచాగ్నికి సమిధ నొక్కటి ధార పోశాను” తీసుకుని, దాన్ని మూడు లైన్ల పల్లవిగా చేసి, సొంత చరణాలు రాసుకుని, ఠాగూర్ సినిమాకి ఇచ్చారు. ఈ పాటకి National Film Aware for Best Lyrics Award వచ్చింది. కొంత మంది విమర్శించారు. దానికి బదులుగా శ్రీశ్రీ మహాప్రస్థానం లోంచి ఒక్క లైను మాత్రమే స్ఫూర్తిగా తీసుకున్నాను అని సమర్థకులు అన్నారు. కేంద్ర బహుమతి విషయంలోనే ఇలా వుంటే, తెలుగు జ్యోతి వారి బహుమతుల విషయంలో ఇది ఆశ్చర్యకరమైన విషయం కాదనిపించింది.
    – ప్రసాద్

  7. అమ్మ గురించి జె.యు.బి.వి. ప్రసాద్ అభిప్రాయం:

    05/03/2008 9:43 am

    నిన్న నా అనుభవం రాసే హడావుడీలో, రాద్దామనుకున్న కొన్ని పాయింట్లు మర్చిపోయాను. పొద్దున్న హైకింగు చేస్తూ వుంటే గుర్తొచ్చాయి.
    పాము సంఘటన చాలా డ్రమెటిక్ గా వుండి, సహజత్వానికి దూరంగా వుంది. పాము వచ్చి పిల్లాడి మీదకి పాకింది. అప్పుడు అటు వేపు పోతున్న లలిత, “పాము, పాము” అని అరిచింది. ఆ చప్పుళ్ళకి పాము దడుచుకుని, పిల్లాడిని కరవడమో, లేక పారిపోవడమో చేస్తుంది. అదీ పిల్లాడు పడుకున్నది ఓ మూల నున్న గదిలో కాదు. అందరూ అటూ, ఇటూ తిరుగుతూ వుండే హాల్లో. ఇంట్లో బారసాల జరుగుతోంది. అంత హడావుడిగా వుండే ఇంట్లోకి పామెలా వచ్చిందో! వచ్చిందే అనుకోండీ, లలిత అరవగానే, “హన్నా, నా మీదే అరుస్తావా” అని చెప్పి, ఆ పామెళ్ళి ఆమెని కరిచింది. ఎక్కడో సహజత్వం లోపించింది ఈ వివరాలలో.
    ఒక్కోసారి చిన్నప్పుడు జరిగినవి మనకి పూర్తిగా గుర్తుండవు. కానీ ఆ తరవాత కాలంలో చుట్టూ వున్న పెద్దాళ్ళు ఆ విషయాలు మాట్టాడుకున్నప్పుడు, ఓ జ్ఞాపకం మన మెదడులో చోటు చేసుకుంటుంది. వయసు పెరిగే కొద్దీ, ఆ జ్ఞాపకం మన సొంత అనుభవమే అని అనుకుంటాము. అలా జరిగి వుండదు అని ఎవరన్నా అన్నా మనం నమ్మం. వేరే వాళ్ళు మాట్టాడుకున్నప్పుడు, విషయాలు కొన్ని కొంత రూపాంతరం చెందుతాయి. లేని వివరాలు వస్తాయి. కానీ అది ఆ పిల్లాడి సొంత అనుభవమై కూర్చుంటుంది.
    ఆ తరవాత, చెల్లాయినో, తమ్ముడినో తీసుకురావడానికి ఆస్పత్రి తీసుకెళ్ళే వాళ్ళు, పాము కరిచినా ఆస్పత్రికి తీసుకెళ్ళరు. పైపెచ్చు మంత్రగాడిని పిలుస్తారు. తరవాత ఓ డాక్టరుని కూడా పిలుస్తారు. మంత్రగాడు మంత్రం అన్నా వేస్తాడు, ఆ డాక్టరు మాత్రం ఏమీ చెయ్యడు, పాము చరిత్ర అడగడం తప్ప. కరిచిన పాము విష పూరితమైంది అయివుండదు. లలితకేమీ కాలేదు. కానీ, లలిత భరించ లేనంత మంచితనంతో, “మంచి కాలం, నన్ను కరిచింది. చంద్రంను కరిచి ఉంటే” అని అంటుంది. “అమ్మయ్య, పిల్లాడిని కరవలేదు” అని తల్లి సంతోషిస్తే చక్కగా వుంటుంది. పాము వచ్చింది కాబట్టి, ఎవర్నో ఒకర్ని కరవాలి కాబట్టి, పిల్లాడి బదులు నన్ను కరిచింది అని అనడం గానీ, అనుకోవడం గానీ అసహజంగా వుంది.
    ఈ సంఘటనలో లోపించిన సహజత్వం, లలిత లోని ఉత్తమ గుణాల విలువని తగ్గించదు.
    అంత ప్రేమగా పెంచిన తల్లిని కూడా వదిలి, “నేను” పాత్ర అమెరికాలో సెటిలవుతుంది. మామూలు ప్రేమల విషయాల గురించి కాదు మాట్టాడేది. అంత అద్భుతమైన ప్రేమ దొరికితే ఎలా వదిలి పోగలుగుతారా అన్నది పాయింటు.
    అలాగే పెళ్ళికి చెప్పిన ఒకే ఒక్క కారణం మన్మధుడు విసిరిన పుష్ప బాణాలు. పెళ్ళికి అవి అవసరమే గానీ, వాటి వల్లే పెళ్ళి అనుకుంటే ఎలా? సాధారణంగా పెళ్ళి అంటే, మనుషులకి మన్మధుడు గుర్తొస్తాడు గానీ, కంపాటిబిలిటీ గుర్తు రాదు.
    మొత్తానికి మనుషుల్లో మంచితనాన్ని చూపించే కధ.

    – ప్రసాద్

  8. సడిచేయకే గాలి గురించి Lyla yerneni అభిప్రాయం:

    05/03/2008 8:56 am

    పాట చాలా చక్కగా ఉంది. ఆ పాట సాహిత్యంలోని మృదుత్వాన్ని ఆనందించాను. ఇదివరకటి సినిమా పాట లాగానే పాడుకుని కూడా సంతోషిస్తున్నాను. చేతైతే ఈ కొత్త పాటను పాడించి ‘యూ ట్యూబ్” లో కూడా పెట్టించి వింటాను.
    కవి ఎవ్వరికీ తెలియదు, కాపీ కొట్టేద్దాం అని కాదు ఈ పాట రాసేది. చాలామందికి ఈ పాట చాలా ఇష్టమనే.
    ఈ కవి ముందు పాటకి పొంగిపోయాడు. ఇంకో చక్కని విషయానికి దాన్ని అన్వయించి మరో చక్కని పాట రాశాడు. దీనితో మన ఆనందం ఎక్కువ అయ్యింది కాని తగ్గదే.
    అంతకు ముందు ఒక పాట ఉంటే, అది మిగతా మనుషులందరినీ బతికున్నంత కాలం ఆ పాటే పాడమని బంధించటానికి కాదు. ఈ పాట వచ్చినందువల్ల అంతకు ముందు పాటకు హాని ఏమిటి? ఏం లేదు.
    వేలూరి వ్యాసం లేక పోతే ఈ పాట మీది కామెంట్లు ఇంకో ధోరణిలో ఉండేవా కావా? అంటే ఆ వ్యాసం ప్రభావం చదివిన వారి మీద పడింది. ఆలోచిస్తున్నారు. మరి అంత చక్కని పాట ప్రభావం శ్రోతను నోరు మూయించలేదు. కవిని చేసింది. ఇంకో చక్కని పాట రాయించింది.
    నేనైతే:
    సడి చేయకే గాలి సడి చెయ్యకే
    సవ్వడి చేసి మా పాప కునుకు చెడనియ్యకే
    అని పాడుకుంటున్నాను.

    ఫాడనివ్వరా ఏమిటి?

    లైలా

  9. పేరు గలవాడేను మనిషోయ్ గురించి Kameswara Rao అభిప్రాయం:

    05/03/2008 4:10 am

    ఈ కథ చదివిన తర్వాత, వేలూరివారన్న కావ్యపురుషుడు సతీసమేతంగా తెలుగునేలకి తిరిగి వచ్చాడన్న నమ్మకం కలిగింది. తెలుగు సాహిత్యంలో నిలిచిపోయే రచయిత మళ్ళీ లభించేడనడంలో నాకేమాత్రం సందేహం లేదు. ఇదేదో రానారెగారిని ఆకాశానికి ఎత్తెయ్యడానికి అంటున్న మాట కాదు. అతనిపై మరింత బాధ్యత పెట్టడానికి అంటున్నదిది. ఎందుకంటే తెలుగు సాహిత్యానికి అలాటి రచయితని అందించడం, అందించకపోవడం ఇప్పుడతని చేతుల్లోనే ఉంది.
    ఈ కథని ఇంతగా మెచ్చుకోడానికి ఇందులో ఏముందీ అంటే, జీవితం ఉంది! ఎలా అయితే జీవితం మనకెలాటి సందేశాలూ సూటిగా ఇవ్వదో ఇదీ అలాగే ఇవ్వదు.
    కథలోని వాతావరణం కానీ, అందులోని పాత్రలుకానీ నాకు పరిచితం కావు. అయినా కథ చదూతున్నంత సేపూ సినిమా చూసినట్లు, కాదు కాదు, నిజంగా ఆ మనుషులు నా ముందు మసలుతున్నట్లే అనిపించింది.

    కానీ ఈ కింది పేరా ఒక్కటీ మాత్రం శివుడి నోట్లోంచి కాక రచయిత నోట్లోంచి వచ్చినట్టుగా అనిపించింది.

    “అవున్రా. రెడ్డేరికి కారు మింద మోజు. కొనగానే అయిందా! మన బండ్లబాటల్లో అది నడవొద్దూ? ఈ రాళ్లలో గుంతల్లో వొక మైలు పరిగెత్తిందంటే దానికి వొళ్లు పులిసిపోతుందంట. దానికి వొళ్లు పులిసిందంటే, రెడ్డేరి జేబుకు తూటు పడినట్టే. వేలతో పని. లేడియో కొన్నాగానీ దానికి బ్యాటరీలెయ్యాలంటే మనకు ఎంత కరుసవుతాదో, కారు బాగోగులు సూడాలంటే రెడ్డికీ అంతే కరుసౌతాది. మనం యిల్లుగట్టడమెంతో రెడ్డేరు రోడ్లేయించడం అంత. ఈ యండావానలకు తలదాచుకోను కుక్కకు యిల్లులేదు. నాజూకైన వస్తువు దాచుకోను మనకు సరైన యిల్లు లేదు. కారు నడుపుకుండేదానికి రెడ్డేరికి సరైన రోడ్లులేవు. అంతా ఒకటేరా.”

  10. అమ్మ గురించి Srinivas అభిప్రాయం:

    05/03/2008 3:45 am

    కధ బావుంది. కథా లేక నిజమేనా?