పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16452

  1. 3వ కాలిఫోర్నియా సాహితీ సదస్సు – ఒక పరిచయం గురించి Rao Vemuri అభిప్రాయం:

    05/30/2008 6:40 am

    నేను ఈ సదస్సుకి వెళ్ళేను. రెండవ వరసలోనే కూర్చుని ఉండటం వల్ల కాబోలు సదస్సు కిటకిటలాడిపోయిందన్న విషయం నాదృష్టిలోకి రానే లేదు. వక్తలు తెలుగులో అంతబాగా మాట్లాడుతూ ఉంటే దిక్కులు చూడవలసిన ఆవసరం కనిపించలేదు. పోనీ “మా తాతల్నాడు నేతులు తాగేం, కావలిస్తే మా మూతులు వాసన చూసుకోండి” అనే బాపతేమో ఈ పూర్వ వైభవపు ప్రసంగాలు అని అనుకుందామా అంటే, “అబ్బే అదీ కాదు, చూడండి మా తడాఖా” అంటూ స్వీయ కవితా పఠనంతో అదరగొట్టేసేరు. కనీసం ఈ సదస్సుకి హాజరయిన తరం వాళ్ళు ఉన్నంత వరకూ తెలుగుకి ఢోకా లేదు .. అమెరికాలో. భారీ ఎత్తున జరుగుతూన్న తిరునాళ్ళ కంటె ‘పీల ఎత్తు’లో జరుగుతూన్న ఈ సదస్సులే మేలేమో.

  2. పాప గురించి రానారె అభిప్రాయం:

    05/30/2008 6:38 am

    బ్యూటిఫుల్. ఒక మంచి పాట వింటే మూడ్ ఎలా మారిపోతుందో ఈ కథ చదివాక అలాగయ్యింది. శుభోదయం. 🙂

  3. జ్యోతిషమూ – లోపలి సంగతులూ – 2 గురించి నాగమురళి అభిప్రాయం:

    05/29/2008 7:41 am

    లక్ష్మన్న గారూ,
    Nature-Nurture చర్చ గురించి ఇంగ్లీషులో పాప్యులర్ సైన్సు పుస్తకాలు చాలానే ఉన్నాయి అనుకుంటున్నాను. నేను స్టీవెన్ పింకర్ అభిమానిని. అసలీ నేచర్ నర్చర్ విభజనే ఒక ఆభాస (False Dichotomy) అని ఆయన అంటాడు. మీకు వీలైతే అతను రాసిన `How The Mind Works’, ‘The Blank Slate’ పుస్తకాలు చదవండి. (How The Mind Works లో కొద్ది పేజీలు మాత్రమే దీని గురించి కేటాయించబడింది.) అలాగే జీన్సు కి సంబంధించిన విశేషాలు తెలియజేసే పుస్తకం ఒకటి కొన్నేళ్ళ క్రితం చదివాను (పేరు గుర్తు లేదు ప్రస్తుతం). అందులో కూడా ఇదే భావాన్ని చదవడం జరిగింది. ఇటువంటి పుస్తకాల్లో ఈ విషయమై కవలల గురించిన విశేషాలు, వారిపై జరిగిన పరిశోధనల వివరాలు కూడా చాలా ఉంటాయి.
    నమస్కారాలతో,
    నాగ మురళి.

  4. జ్యోతిషమూ – లోపలి సంగతులూ – 2 గురించి విష్ణుభొట్ల లక్ష్మన్న అభిప్రాయం:

    05/29/2008 6:20 am

    నాగమురళి గారూ:

    నా ప్రశ్నలకి సమాధానం ఇచ్చినందుకు థాంక్స్.

    మీరు సూచించినట్టు, రామన్నకీ, నాకూ – మా జీవితాల్లో వివాహం, ఉద్యోగం వంటి విషయాల్లో ఒక ఏడాది తేడా అన్నది జరగలేదు. కనీసం ఈ విషయంలో జ్యోతీష్యం ఫలించలేదు. ఒక మనిషి జీవితంలో Nature ప్రభావం గొప్పదా లేక Nurture ప్రభావం గొప్పదా? అన్నది ఎప్పటికీ అంతుతేలని చర్చే! ఈ విషయంలో దాదాపు ఒకే కాలంలో పుట్టిన కవలలపై ఈ ప్రభావం ఎలా ఉంటుంది? రెండు విభిన్న కాలాలలో పుట్టిన, బంధుత్వం లేని ఇద్దరు వ్యక్తులు ఒకే వాతావరణంలో పెరిగితే, ఆ ప్రభావం ఎలా ఉంటుంది?

    వ్యక్తిగతంగా నేను జాతకాలని సరదాగా తెలుసుకొని వదిలేస్తాను తప్ప వాటికి అంతకంటే ప్రాముఖ్యం ఇవ్వక్కరలేదనిపిస్తుంది. కాకపోతే, “నా జాతకం ఇలా చెపుతోంది, కాబట్టి నేను ఇలాగే ప్రవర్తించాలి” అన్న Auto Suggestion ని follow అయిన వ్యక్తులు నా దగ్గర కుటుంబాల్లోనే నాకు తెలుసు. జాతకం ప్రకారం జీవితాన్ని మలుచుకొన్న (మలుచుకోదలుచుకొన్న) వ్యక్తుల్ని చూస్తే నాకు భయం.

    జాతకం, జ్యోతీష్యం (ఈ మధ్య ప్రజాదరణ పొందుతున్న వాస్తు) వంటి విషయాలపై ఇవ్వవలసినంత ప్రాధాన్యత మాత్రమే ఇస్తే ఫరవాలేదు. లేకపోతే, ఈ విషయాలపై ప్రజల్లోని బలహీనతలని సొమ్ము చేసుకొనేందుకు చాలా మంది గురువులే మనకున్నారు.

    నమస్సులతో,

    విష్ణుభొట్ల లక్ష్మన్న

  5. సడిచేయకే గాలి గురించి కొడవళ్ళ హనుమంతరావు అభిప్రాయం:

    05/27/2008 7:17 pm

    “జయభేరి”

    JUBV ప్రసాద్ గారి వ్యాఖ్య నుండి:
    సుద్దాల అశోక్ తేజ అనే సినీ పాటల రచయిత, శ్రీశ్రీ “మహాప్రస్థానం” లోని “నేను సైతం ప్రపంచాగ్నికి సమిధ నొక్కటి ధార పోశాను” తీసుకుని, దాన్ని మూడు లైన్ల పల్లవిగా చేసి, సొంత చరణాలు రాసుకుని, ఠాగూర్ సినిమాకి ఇచ్చారు.

    సినిమాలో ఏముందో నాకు తెలియదు కాని ఆ శ్రీశ్రీ గీతం ప్రారంభం ఇది:

    “నేను సైతం
    ప్రపంచాగ్నికి
    సమిధ నొక్కటి ఆహుతిచ్చాను!

    నేను సైతం
    విశ్వవృష్టికి
    అశ్రు వొక్కటి ధారపోశాను!

    నేను సైతం
    భువన ఘోషకు
    వెర్రిగొంతుక విచ్చి మ్రోశాను!”

    కొడవళ్ళ హనుమంతరావు

  6. గ్రంథచౌర్యం గురించి … గురించి Sai Brahmanandam Gorti అభిప్రాయం:

    05/27/2008 1:46 pm

    విమర్శకుడు గారూ,

    దీన్నే అనువాద ప్రేరణ అంటారని మీకు ఆమాత్రం తెలియదా? పదాల అందం చూడాలి లేదా ఏ సందర్భంలో రాసారో చూడాలి. అంతేకానీ ఇలా కాపీ అంటే ఎలా చెప్పండి? నానీల నాన్న గారికి కూడా ఒక నాన్నుంటారన్న విషయం గుర్తించాలి. చిత్రం ఏమిటంటే దీన్ని సదరు కవిగారు పట్టించుకోనట్లు నటిస్తారు. కానీ ఆయన భక్త బృందం వచ్చే సంచికలో విరుచుకు పడేవరకూ కాస్త ఓపిక పట్టండి. ఈ రోజుల్లో కవిత్వానికి కాదు, కవికి అనుచరులుంటే చాలు. పబ్బం గడుపోడానికి.

  7. గ్రంథచౌర్యం గురించి … గురించి విమర్శకుడు అభిప్రాయం:

    05/27/2008 12:40 pm

    “ఆధునిక తెలుగు సాహిత్యంలో వున్న చౌర్యాల ఉదాహరణలు కూడా కొన్ని ఇచ్చి వుంటే ఇంకా బాగుండేది. ముఖ్యంగా పేరున్న రచయితల రచనల గురించి.”

    మీ కోసమే అన్నట్టు డా.గోపీ నోబెల్ బహుమతి గ్రహీత Octavio Paz ను కాపీ కొడుతూ దొరికి పోయాడు.

    వివరాలకు ఈ లింకును చూడుడు:

    ఔరా! ఏమి ఈ ‘దిగుమతి’? (ఆంధ్రజ్యోతి వివిధ)

    నానీల నాన్నగా గోపీ ఖ్యాతి ఖండాంతరాల్లొ వ్యాపించి, ఆయనకు గురు పీఠాన్ని ప్రసాదించి పెట్టింది. దీర్ఘ కవితలు రచించి చిరయశస్సునార్జించిన గోపీ ప్రస్తుతం తెలుగు విశ్వ విద్యాలయ వీసీ ; ఘనత వహించిన కవి గారి ఛాయాచిత్రం కోసం క్రింది లింకును చూడండి.

    A `Water Song’ to die for, to pray for – The Hindu story

    విమర్శకుడు

  8. అంతర్మథనం గురించి B Apparao అభిప్రాయం:

    05/27/2008 8:42 am

    రాజారావు గారికి
    నమస్కారం
    మీ కథ చాలా బాగుంది. అలాగే మీ ఇతర రచనలు కూడా మీ బ్లాగులో చదివాను. చాలా ఓపికగా వ్రాసారు. అభినందనలు.

  9. సడిచేయకే గాలి గురించి chokkakula venkataprasad అభిప్రాయం:

    05/27/2008 7:29 am

    జె.యు.బి.వి. ప్రసాద్, లైలా యెర్నెని, రవికిరణ్ తిమ్మిరెడ్డి గార్లకు నా కృతజ్ఞతలు. కనీసం నెలరోజులు నిలిచిన తరువాత వ్రాద్దామని ఆగాను. నా మిత్రులు వారికి పాప పుట్టిందని చెప్పినపుడు నాకు కలిగిన ఆనందాన్ని మాటల్లో పెట్టాను. నా పదాలు మీకు నచ్చినందుకు నాకు అనందం. ప్రచురించినందులకు ఎడిటర్ గారికి ధన్యవాదాలు.

    చొక్కాకుల వెంకటప్రసాద్

  10. పేరులేదు గురించి కొడవళ్ళ హనుమంతరావు అభిప్రాయం:

    05/27/2008 12:09 am

    వరూధిని అందం, సరస్వతి సౌందర్యం

    సంప్రదాయ సాహిత్యాన్నీ, అభ్యుదయ సాహిత్యాన్నీ జమిలిగానే కాదు, విడిగా నయినా విమర్శించడానికి నాకు కనీస యోగ్యత కూడా లేదు. కాని డాక్టర్ స్మైల్ గారి అభిప్రాయం రెండురోజుల నుండి నా మనసును పట్టి వదలకపోవడాన ఇది రాస్తున్నాను. ఇది వారిపై విమర్శ కాదు. దీంట్లో సాహిత్యాభిమానులకి పనికొచ్చేముక్క ఏదన్నా ఉండొచ్చనే ఆశ.

    పాతసాహిత్యం సామాన్యప్రజల జీవితాన్ని కావ్యవస్తువుగా తీసుకోలేదనీ, అభ్యుదయసాహిత్యానికీ సంప్రదాయ సాహిత్యానికీ గల ముఖ్యమైన తేడా అదేననీ అంటే నేనొప్పుకుంటాను.

    వరూధిని సంప్రదాయసాహిత్యానికి ప్రతీక అయితే నష్టం లేదుగాని, “భిక్షువర్షీయసి” అభ్యుదయసాహిత్యానికి ప్రతీక అయితే మనకి లోటుగానే ఉంటుందనుకుంటాను. “భిక్షువర్షీయసి” మంచి కవిత కాదని కాదు, ప్రతీక కాకూడాదనే నాఉద్దేశం.

    వరూధిని ప్రవరులది ప్రేమకథ. ప్రేమకథల్లో అందానికి ప్రాముఖ్యత ఉంటుంది. అందం బాహ్య సౌందర్యం గురించీ, హృదయ సౌందర్యం గురించీ కూడానూ. అయితే ఎవరికైనా మనిషిని చూడటంతోటే ఆకట్టుకునేది బాహ్య సౌందర్యమే. నాభి లోతు దాకా పోవాలో లేదో నాకు తెలీదు కాని, వరూధినిని పరిచయం చేసిన విధం ఆకర్షణీయమే. “మగువపొలుపుఁదెలుపు నొక్క మారుత మొలసెన్,” అన్న మాటలు కవితా సౌరభం తో నిండినవే. ఈతరం కవులు కూడా స్వీకరించదగ్గవే.

    ఆ పద్యాల వెనువెంటనే వరూధినిని మన కళ్ళముందట నిల్పే పద్యమిది:

    “తతనితం బాభోగ ధవళాంశుకములోని
    అంగదట్టపు కావిరంగువలన
    శశికాంతమణిపీఠి జాజువారగ కాయ
    లుత్తుంగ కుచపాళి నత్తమిల్ల
    తరుణాంగుళీ ధూత తంత్రీస్వనంబుతో
    జిలిబిలిపాట ముద్దులు నటింప
    ఆలాపగతి చొక్కి యరమోడ్పు కనుదోయి
    రతిపారవశ్య విభ్రమము తెలుప

    ప్రౌఢి పలికించు గీతప్రబంధములకు
    కమ్ర కరపంకరుహ రత్న కటక ఝణఝ
    ణధ్వనిస్ఫూర్తి తాళమానములు కొలుప
    నింపు తళుకొత్త వీణ వాయింపుచుండి.”

    తిక్కన, సూరన లను మించి ఇంత సుకుమారమైన పద్యం మన భాషలోనే లేదన్నారు పుట్టపర్తి [1]. అదెందుకో తెలుసుకునే పరిజ్ఞానం నాకు లేదు కాని, “ఆలాపగతి చొక్కి యరమోడ్పు కనుదోయి రతిపారవశ్య విభ్రమము తెలుప,” అన్నది నన్నాకర్షించింది.

    కారణం దానిపై రారా ఇచ్చిన వివరణలు. ఆయన దానిని “రసపారవశ్య” మని చదువుకున్నాడు. సుకుమార హృదయం గలవాళ్ళే సాహిత్యంలోనైనా ఏకళలోనైనా పారవశ్యం చెందుతారనీ, “కవితా! ఓ కవితా!” లో శ్రీశ్రీ చెప్పిన “క్షణికమై, శాశ్వతమైన దివ్యానుభవం, బ్రహ్మానుభవం,” పెద్దన చెప్పిన పారవశ్యమూ ఒకటేననీ అన్నాడు. నాకది నచ్చింది.

    ఇంతకీ రారా ఈ మాటలన్నది కొడవటిగంటి కుటుంబరావు రాసిన కొన్ని ప్రేమకథలను విశ్లేషించే సందర్భంలో [2]. కుటుంబరావు రాసిన పెద్దకథ “కురూపి” లో అనాకారిగా కనకం ప్రపంచంలోకి ప్రవేశించిన సరస్వతి అతనిని తన హృదయసౌందర్యం ద్వారా చివరికెలా వశం చేసుకుంటుందీ వివరిస్తూ శిల్పానికి గల ప్రాముఖ్యతని వివరించాడు.

    సమాజంలో అందవిహీనమైన స్త్రీ పురుషులు ఉండితీరతారు. మరి వాళ్ళ ప్రేమా పెళ్ళీ లాంటి చిక్కు సమస్యలు తీరేదెలా? దీనికి కుటుంబరావు ఇచ్చిన సమాధానం – ఆధ్యాత్మికం. అంటే అదేదో పరలోకానికి సంబంధించిందని కాదు. మనిషి నుండి వేరే మనిషి పొందే లక్షలాది అనుభూతుల్లో అందం ఇచ్చేది ఒక్కటేననీ, అంతకంటే గాఢమైన అనుభూతులు చాలా ఉంటాయనీ, వీటి మూలంగా ప్రేమా పెళ్ళి సఫలం అవుతాయనీ వ్యక్తం చెయ్యడనికే “కురూపి” రాశానన్నాడు.

    “అందచందాలు లేని భార్యలను ఆప్యాయంగా ప్రేమించే భర్తలున్నట్టు నాకు చిన్నతనం నుండి కూడా తెలుసు. నాకు తెలియనిదల్లా నేటి మన సమాజం కిందకే దిగుతున్నదో, మీదికో ఎక్కుతున్నదో, నేటీ యువకులు పైనే చూస్తున్నారో, కిందకో చూస్తున్నారో … అది మాత్రమే,” అని కొంత నిరాశపడ్డాడు.

    కుటుంబరావువి చదవ్వలసిన ప్రేమకథలు. అవి అభ్యుదయసాహిత్యాన్ని “భిక్షువర్షీయసి” కవితా పరిమితుల్ని దాటి విస్తరింపచేస్తాయి.

    కొడవళ్ళ హనుమంతరావు

    నోట్స్:

    [1]. “వ్యాసవల్మీకం” లో “వరూధిని” అన్న వ్యాసం. పుట్టపర్తి నారాయణాచార్యులు, 2004. “వరూధిని హృదయమున రససముద్రమున్నది. మాటలలో కవిత యున్నది. ప్రకృతి యొక్క విచికిలస్వరూపము వరూధిని…” అని ముగించారు. ఈయనా, రారా, ఇద్దరూ ప్రొద్దుటూరు వారే! వాళ్ళూ, శ్రీశ్రీ, కొకు, ఇంకా కొందరు అభ్యుదయరచయితలూ కలిసి “సంవేదన” ఆవిష్కరణ సందర్భంగా తీయించుకున్న ఫొటొ ఈ పుస్తకంలో ఉంది.

    [2] “కుటుంబరావు సాహిత్యం,” అయిదవ సంపుటం లో “భావుకుల రచయిత కొకు,” అన్న వ్యాసం, రాచమల్లు రామచంద్రారెడ్డి. 1983. కవులలోకెల్లా అల్లసాని పెద్దన తన అభిమాని కవి అని చాటుకుని, “కవిత్వానికి కావలసింది ఆవేశబలం కాదు, అనుభూతి సౌకుమార్యం,” అన్న విలక్షణ విమర్శకుడు రారా.