పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16454

  1. పడమట సంధ్యారాగం గురించి lyla yerneni అభిప్రాయం:

    07/13/2009 10:53 am

    “సంధ్య ఇంట్లో లేదు. ”

    సంధ్య ఇంట్లో లేదా? ఏమయ్యింది? బెడ్రూం లో వస్తువులన్నీ ఎక్కడి వక్కడే ఉన్నయి. రోజూ వాడే పర్సు -డ్రెస్సరు మీదే ఉంది. ఇంట్లో వేసుకు తిరిగే చెప్పులు -అక్కడే మంచం పక్కనే ఉన్నయ్యి . గరాజ్. గరాజ్ .. ..- గరాజ్లో టయోటా కేమ్రీ కారు ఉందా ? కారూ అక్కడే ఉంది. సంధ్య అప్పుడప్పుడూ లేక్ పక్కనే సైకిలు తొక్కుతుంది. ఆ సైకిలు , ఆ సైకిలు – ఉంది, అదిగో ఆ మూలగా గార్బెజ్ బిన్నుల పక్కనే ఉంది. అదే మూల, బట్టలు ఆరెయ్యటానికని కొనుక్కొచ్చిన పొడుగాటి తాడు అక్కడే ఉండాలే . అది లేదు . అప్రయత్నంగా అతను గరాజ్ సీలింగు దూలాల వంక చూశాడు. గుండె దడదడ లాడింది.
    సంధ్యా, సంధ్యా ! అంటూ గభిక్కున …

    ఏం పాఠకులండీ? రామాయణంలో పర్ణశాలలో సీత కనపడక పోతే అక్కడ వాల్మీకి కథ ఆపితే – సీత ఏమైయ్యిందో అని మధన పడరూ. సీతా! సీతా! అంటూ రాముడితో పాటు అటూ ఇటూ పరిగెట్టరూ. ఏం పాఠకులండీ?

    కథలు కథలుగా చదువుకునే పాఠకులేరీ. అందరూ విమర్శకులే. ఏ వల్లంపాటి కధా శిలపం, కథా విమర్శ -పుస్తకాలో చదివేసుకుని – ఇది కథేనా? శైలి బాగుంది . Keep it up. వస్తువు శూన్యం. సంభాషణలు – అసలు తెలుగు వాళ్ళూ ఇలా మాట్లాడుకోరు. ఈ కథలో నాకు ముగింపు చదవక ముందే తెలిసి పోయింది. కథ వాస్తవానికి దూరంగా ఉంది. వాస్తవానికి మరీ ఇబ్బంది కలిగించేంత దగ్గిరగా ఉంది. కధాకధన విధానము బాగుంది ….అంటూ ఏంటేంటో రాస్తారు.

    ఏం పాఠకులండీ! కథలు ఇలానా చదువుకుంటారు?

    పోనీ మళ్ళీ చందమామ కథలన్నా చదవండి. 🙂

    లైలా

    [పై వ్యాఖ్యలపై వచ్చిన ప్రతివ్యాఖ్యలను చర్చావేదికలో ఉంచాము – సం.]

  2. రాగమాలిక గురించి సాయి బ్రహ్మానందం అభిప్రాయం:

    07/13/2009 10:35 am

    రమ గారూ,

    మీరిచ్చిన సమాచారానికి ధన్యవాదాలు. నావద్ద అన్నమయ్య 20 సంపుటాలున్నాయి. ఇవి టి.టి.డి వారి మొదటి ప్రచురణవి. ఆతరువాత వచ్చినవి నాకు దొరకలేదు. తిరుపతెళ్ళినప్పుడు అక్కడ పుస్తకాల షాపులో కూడా లేవు. జయప్రభ గారి పుస్తకం తెప్పించుకుంటాను. మీరు చెప్పిన 29వ సంపుటి ఎక్కడ దొరుకుతుందో చెప్పగలరా?

  3. అచ్చులో పత్రికలు అంతరిస్తాయా? గురించి K. V. S. Ramarao అభిప్రాయం:

    07/13/2009 10:02 am

    వేలూరి గారు ఇలాటి వ్యాసం “ఈమాట” లో రాయటం ఆశ్చర్యకరం. ఐతే ఇది “వెబ్ కల్చర్ ” మన జీవనవిధానాన్ని పూర్తిగా మార్చేస్తున్న సంధి సమయం గనుక ఈ సందర్భంలో ఈ విషయం గురించిన చర్చ సమంజసమే నేమో.
    కాగితపు పత్రికలకు కాలం చెల్లిందన్న విశ్వాసమే “ఈమాట” ఆవిర్భానికి మూలం అని పదేపదే చెప్పనక్కర లేదు. వేలూరి గారు వారి వ్యాఖ్యలో ఉట్టంకించిన “న్యూయార్కర్ ” లోని పుస్తకపరిచయం కూడ వెబ్ మీద అప్పనంగా దొరుకుతుంది – దానికి పుస్తకం అక్కర్లేదు – ఇక్కడ క్లిక్ చెయ్యండి – http://www.newyorker.com/arts/critics/books/2009/07/06/090706crbo_books_gladwell .
    వెబ్ మీద ఉన్న “కంటెంట్ ” ఏదైనా సరే ఫ్రీ గా దొరకాలి అనేది దాదాపుగా అందరూ అంగీకరించిన సత్యం ఐపోయింది. ఎక్కడిదాకానో ఎందుకు, “ఈమాట” ఫ్రీ పత్రికే కదా ! ఈ “సత్యం” వల్ల ఇప్పటికే కలిగిన ఉపయోగం ముందు కొందరికి కలిగిన “నష్టాలు” చాలా తక్కువ అని నా అభిప్రాయం. అంతేకాదు, అలా నష్టపోతున్నా మనుకునే వారు ఇంకెవర్నో నిందించటం ఆపి కొత్త మార్గాలు వెదుక్కోవటం అవసరం. వెబ్ విప్లవం రాకముందు ఏదైనా జర్నల్ లో వచ్చిన ఒక టెక్నికల్ పేపర్ కాపీ సంపాయించాలంటే ఎంత భగీరథయత్నం అయేదో చాలా మందికి స్వానుభవమే. అదే ఇప్పుడు ఎలాటి టెక్నికల్ పేపర్ ఐనా (కనీసం నాకు ప్రత్యక్షంగా తెలిసిన కంప్యూటర్ సైన్స్ రంగంలో) పట్టుకోవటానికి ఒక నిమిషం పట్టదు. అలాగే, మనం ఏదైనా ఒక కొత్త విషయం గురించి పరిశోధన చెయ్యాలన్నా అదిప్పుడు ఎంతో తేలిక. ఇలాటివి ఇదివరకు అసాధ్యాలు.
    రమ గారు లేవదీసింది దీనికి లంబంగా (“అర్థాగొనల్ ” కి అనువాదం) ఉన్న విషయం. రచయిత్రులకు పారితోషికం విషయం. పత్రికల మనుగడే ప్రశ్నార్థకం ఐతే ఇక వారిచ్చే పారితోషికాల మాట చర్చనీయమా అని సందేహం కలగొచ్చు కాని ఇవి రెండూ వేర్వేరు విషయాలు. ఆర్థికంగా సామర్థ్యం వున్న పత్రికలు తప్పక పారితోషికాలియ్యవలసిందే. కాని పత్రికే ఫ్రీ అయి, మరే విధమైన ఆదాయమూ ఆ పత్రిక్కి లేకపోతే వారు పారితోషికాలు ఎలా ఇవ్వగలరు? ఒకవేళ ఎవరో దానం చేసో లేక సంపాదక వర్గమే సొంత డబ్బు వేసో ఇచ్చినా అది ఎక్కువ కాలం నిలబడే పద్ధతి కాదు. పత్రికల వారి లాగానే రచయిత్రులు కూడ ఆర్జనకి ఇతర మార్గాలు కనుక్కోవాలి.
    ఇది సంధి కాలం కనుక అలాటి మార్గాలు ఇంకా స్పష్టంగా లేవు. ఐతే సినిమాల దెబ్బకు తోలుబొమ్మలాటలు ఎలా మూలబడ్డాయో వెబ్ దెబ్బకు కాగితపు పత్రికలు, వాటికి సంబంధించిన వారూ దెబ్బతినటం తప్పదు. ఎంత త్వరగా ఇది గుర్తించి ఎవరికి అనుకూలమైన మార్గం వారు చూసుకుంటే అందరికీ అంత మంచిది – అని నా అభిప్రాయం.

  4. హాయిహాయిగా ఆమని సాగే గురించి tavva obul reddy అభిప్రాయం:

    07/13/2009 9:05 am

    శ్రీ లక్ష్మన్న గారికి ,
    నమస్కారములు!
    పాటపై మీ ఈ వ్యాఖ్యను చదివాక రోజూ వింటున్న పాటలోనే కొత్త రుచులు దొరికాయి.
    మీకున్న అపారమైన సంగీత పరిజ్ఞానానికి అభినందనలు.
    ఇలాగే మరెన్నో పాటలను గురించి మీ ద్వారా తెలుసుకోవాలనుంది.

  5. రాగమాలిక గురించి rama bharadwaj అభిప్రాయం:

    07/13/2009 9:04 am

    బ్రహ్మానందం గారూ!! మీరు అన్నమయ్య మొత్తం సంపుటాల్ని 29 ని సేకరించుకోండి. “వలె వలెనని వలచితినట” అన్న ది ఆ సూళాది. ఇది 25 వ సంపుటము లో478 వ సంకీర్తనగా ఉంది.27 వ సంపుటపు పీఠికలో కూడా దీని ప్రస్తావన వచ్చిన చోట ఈ సూళాది పాఠం ఇవ్వబడివుంది. ఈ సూళాదిని ” దేశి సూళాది” గా అన్నమయ్య పేర్కొన్నారు. సప్తరాగమాలిక..సప్త తాళమాలికలో ఇది కూర్పబడివుంది.రాగమాలికలోని రాగాల క్రమం ఇది: “మాళవిగౌళ; రామక్రియ; వరాళి; బౌళి; పాడి; నాట; శ్రీ రాగం; ఇంక తాళమాలిక క్రమం”ధృవ;మఠెం;రూపకం;ఝంపె;తివుడ;ఆట;ఏక తాళాలు.వీటిని పట్రాయని సంగీతరావు గారు వారి కుమార్తె కొచ్చర్లకోట పద్మావతి గారితో కలిపి గానం చేసారు. S.R. జానకీరామన్ గారు కూడా దీనిని గానం చేసారట. నేనిచ్చిన ఈ వివరాలన్నీ..జయప్రభ గారి ఇటీవలి విశ్లేషణ.అయిన… అన్నమయ్య 2nd volume నించి గ్రహించాను.వీలుంటే అన్నమయ్య గారి పదాల మీద ఆమె చేసిన విశ్లేషణని చదవండి. మొత్తం.. రెండు సంపుటాలు అవి. అన్నమయ్య సాహిత్యం మీద ఇష్టం ఉన్న ఎవరైనా తప్పక చదవదగ్గవి.
    రమ.

  6. పడమట సంధ్యారాగం గురించి Maddipati Krishna Rao అభిప్రాయం:

    07/13/2009 6:41 am

    ఈ కథ గురించి కిరణ్ గారి అభిప్రాయం పై నేను ముందు వ్రాసిన అభిప్రాయంలో వ్రాద్దామనుకున్నాను కానీ, కథ గురించి నేను చెప్పదలుచుకున్నది మరుగున పడుతుందని ఆపేశాను:

    పొడుపు కథలు, భేతాళ కథలు, కాశీ మజిలీ కథలు, ఇత్యాదులన్నీ ముఖ్యంగా కొస మెరుపు కథలు. ఈ కథలో కొస మెరుపున్నా, అంతవరకూ సాగిన కథకు ఆఖరి సన్నివేశం కంటే ఎక్కువ విలువుందని నా అభిప్రాయం. ఆఖరి సన్నివేశం 360వ డిగ్రీ మాత్రమే! పుస్తకం వెనకాల ఉన్న కోట్ దగ్గర్నుంచి, ఇల్లీగల్ ఇమ్మోరల్, అంత ఇల్లీగల్ కాదు గాని ఇమ్మోరల్, అంత ఇమ్మోరల్ కాదు, నుంచి స్లై డాగ్, స్లై బి_ వరకు సాగిన ప్రస్థానంలో రచయిత వదిలిన క్లూలు నిజంగానే పాఠకుణ్ణి ‘హింట్లు చూసి కథ రాసుకో’ మనడమే! పాఠకుల మీద ఎంత నమ్మకం, గౌరవం లేకపోతే రచయిత తన కథను అలా ఊహలకొదిలేస్తారు చెప్పండి?

    సాఫ్ట్‌వేర్ తయారు చేసేవారు చేసేది పనిముట్లన్న సంగతి మరచిపోకూడదు. పనిముట్లే ఇల్లు కాదుగదా! (వాడే సాఫ్ట్‌వేరే వ్యాపారం కానట్టు). ఇక్కడ రచయిత చేసింది పనిముట్టు కాదు. చైతన్య స్రవంతి అనే సాహిత్య పనిముట్టుతో వేసిన చిత్రం. అందులో పాఠకులాక్కావల్సింది వారినే వెతుక్కోమంటున్నారు!

    కృష్ణారావు

  7. పడమట సంధ్యారాగం గురించి Ravikiran Timmireddy అభిప్రాయం:

    07/13/2009 5:39 am

    ఒక సంఘటన, ఒక సంఘర్షణ కథెందుకు కాగూడదు? “సంధ్య ఇంట్లో లేదు” అనే వాక్యానికి పొడిగింపు, వివరణ ప్రతి పాఠకుడు ఈ కథలో తనకు తాను ఇచ్చుకునే ముగింపు మీద ఆధారపడి ఉంటుందేవో కదా. అల్లికలో మరికొంచం జాగ్రత్త అవసరవే కానీ, కథ బాగనే వుంది.

  8. పడమట సంధ్యారాగం గురించి సాయి బ్రహ్మానందం అభిప్రాయం:

    07/13/2009 12:26 am

    పై వ్యాఖ్యలు చూసాక ఇది రాయాలానిపించింది. వెస్ట్రన్ కథ పరిణామం చెందినంతగా తెలుగు కథ కాలేదు. కధంటే ఇలాగే వుండాలని మన పెద్దలు నిర్ణయిచేశారు. కథంటే మొదలుండాలి. నాయకుడుండాలి. శిల్పం వుండాలి. ముగింపుండాలి. చివర్లో ఓ సందేశముండాలి. సూక్తిముక్తావళుండాలి. ఏ మాత్రం బుర్రకి పదును పెట్టకుండా అరటిపండొలిచినట్లుండాలి. ఇలా ఎవరికి తోచింది వారు చెప్పారు. చెప్పడమే కాదు, మనకలాంటి కథలు చదవడమే నేర్పించారు. అందువల్ల తెలుగు కథ వారు ఏర్పరిచిన చట్రంలోనే ఇరుక్కుని ఊపిరాడకుండా వుంది.

    ఈ కథ చాలా మంచి కథని అనను కానీ వైవిధ్యమున్న కథ. డయాస్పోరా కథల కోవకి చెందిన కథ. ఎవరికీ తెలియదనుకుంటూ తప్పులు చేసుకు పోయే ఒక పాత్రకొచ్చే మానసిక సంఘర్షణ కనిపించింది. తను చేసే ప్రతీ దానికీ ఒక కారణం ( జస్టిఫికేషన్ ) వెతికే ప్రయత్నం కనిపిస్తుంది. ఆ కారణం ఏదైనా కావచ్చు. అది అనుమానమవ్వచ్చు. భయం కావచ్చు. లేదా తనకి తను సర్దిబుచ్చుకునే మనస్తత్వం కావచ్చు. ఇవన్నీ ఈ సుందరం పాత్రలో కనిపించాయి. ఒక్కమాటలో చెప్పాలంటే మనలోనే ( అంటే ప్రవాస భారతీయులు ) కనిపించే పాత్ర. సుందరానికి సఫూరాతో అక్రమ సంబంధమున్న సంగతి ఎవరికీ తెలియదనుకుంటూ గడిపే క్యాజువల్ మనస్తత్వ చిత్రీకరణలో, చేసే పనిని సమర్ధించుకునే నైజం చూపించారు. చాలామంది మగాళ్ళు భార్యలు వెర్రిబాగుల ఇల్లాళ్ళుగా జమకట్టి, తాము ఏం చేసినా గ్రహించలేరు. పైగా వారూ ధైర్యం చెయ్యరని అనుకుంటూ వుంటారు. వారు పరస్త్రీతో ఎలా అక్రమ సంబంధ పెట్టుకుంటారో మరో మగాడు కూడ తమ స్త్రీలతో అలా చేసే అవకాశముంది కదా? అన్న చిన్న విషయాన్ని విస్మరిస్తారు. పైపెచ్చు తమ తమ క్రియలకి కారణాలు వెతుకుతారు. ఇదీ ఈ కథలో నాకు కనిపించిందీ, అనిపించిందీ!
    ఈ కథలో సుందరం యాంటీ హీరో! ఒక నెగిటివ్ షేడ్సున్న వ్యక్తి. ముగింపు మరీ ఒక్క వాక్యంలో తేల్చేయడంతో పాఠకుల్ని ఆలోచించ నీయకుండా అయోమయంలో నెట్టేసింది. “సంధ్య ఇంట్లో లేదు. ” అన్న వాక్యం ఏ రకంగానైనా ఊహిచుకునేలా చేసిందంతే! బహుశా కథలో వున్న అతి క్లుప్తతవల్ల ఈ అయోమయం ఏర్పడిందేమోనని నా అభిప్రాయం. ప్రతీ వాక్యమూ ఓపిగ్గా చదివి అర్థం చేసుకుంటేనే ఈ కథ ఎక్కుతుంది. లేదా ఇదీ కధేనా అనిపిస్తుంది.

  9. రాగమాలిక గురించి సాయి బ్రహ్మానందం అభిప్రాయం:

    07/12/2009 11:41 pm

    ప్రసాదు గారూ,

    మీరిలా పద్యాలు కట్టి మరీ ఇబ్బంది పెట్టేస్తున్నారు. ఏదో నాకు తెలిసింది రాసానంతే! వ్యాసం నచ్చిందని చెప్పారు. సంతోషం. నే పడ్డ కష్టాన్ని తీసేయడానికి ఆ రెండు ముక్కలు చాలు. మీలాగ నేనూ సంగీత విద్యార్థినే! కాబట్టి అంతేసి పెద్ద మాటలనవసరం.

    ఇహ, మీరడిగిన ప్రశ్న – కృష్ణా ముకుందా మురారి పాట గురించి. తెలుసున్నది చెబుతాను. రాగమాలిక ప్రధాన లక్ష్యం వివిధ రసాలని వివిధ రాగాలతో సంయమనం చేయడం. రస ప్రధాన రాగాలనెన్నుకొని పాట కట్టడం. ఇక్కడ రసమే పాటకి దిశానిర్దేశకం చేస్తుంది. కాబట్టి రసం మారినప్పుడల్లా పాటకి సంబంధిచిన శృతీ, లయా తదనుగుణగా మార్చుకోవచ్చు. అది సంగీత దర్శకుడి ప్రతిభ మీదే ఆధారపడుంటుంది. చరణాంతం పల్లవి మొదలుపెట్టిన శృతిలోనే వుండాలన్న నియమం రాగమాలికకి లేదు. సాంబమూర్తి గారు ఒక రాగమాలిక రాసారు. పేరు గుర్తురావడంలేదు. అందులో రాగం మారినప్పుడల్లా పల్లవి కూడా అదే రాగంలో మారుతూ వస్తుంది. ఇదేవిధంగా మీరుదహరించిన పాటా కట్టుండే అవకాశముంది. ఆ పాటలో శృతి మార్చడానికి కారణం సన్నివేశానికనుగుణంగా జరిగిందనే అనుకుంటున్నాను. ఎక్కడైనా దొరికితే బాలమురళి స్వరపరిచిన శృతి భేద రాగమాలిక వినండి. మీకు మరింతగా అర్థమవుతుంది.
    సినిమా పాటలో రాగమాలిక నాకు నచ్చిన రాగమాలికల్లో ఇదొకటి.

  10. రాగమాలిక గురించి సాయి బ్రహ్మానందం అభిప్రాయం:

    07/12/2009 11:14 pm

    రమ గారూ,

    మీరు చెప్పిన అన్నమయ్య “దేశ సూళాది” రాగమాలిక, తాళమాలిక నాకు లభ్యం కాలేదు. మీ వ్యాఖ్య చూసాక, అన్నమయ్య కీర్తనల పుస్తకాలన్నీ తిరగేసినా దొరకలేదు. మీదగ్గరుంటే పంపగలరా? లేదా ఎక్కడ దొరుకుతుందో చెప్పండి. తెప్పించుకుంటాను.
    అన్నమయ్య రాగమాలికని గుర్తుచేసినందుకు మరోసారి ధన్యవాదాలు.