పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16454

  1. శ్రీశ్రీ కవిత్వంలో కొన్ని సామాన్య జీవనాంశాలు గురించి ravikiran timmireddy అభిప్రాయం:

    02/08/2010 1:49 pm

    హనుమంతరావు గారు,

    నాకు చెప్పడానికి చేతగాని విషయాన్ని మహా బాగా చెప్పేరు. ఖచ్చిత తత్వం చేరిన తర్వాత కవిత్వం లుప్తమైపొయ్యేపనైతే, మన ప్రాచీన సాహిత్యంలో అసలు కవిత్వవే లేదనుకోవాలేవో. నేనేవీ ప్రాచీన సాహిత్యాన్ని ఔపోసన పట్టలేదు కానీ ఆ ఖచ్చిత తత్వం తర్వాత కవిత్వం లేదంటే, పాపం నైషధ కర్తలనించి, లేదు, లేదని మహా ఖచ్చితవైన అభిప్రాయాలు కల ఇస్మాయిల్ గారిదాకా అందరూ కవులు కాకుండా పోతారేవో. అదేందో అంటారు చూడండి, కొని తెచ్చుకోవటవని అలాగుంది రవి శంకర్ గారి వాదం. ఖచ్చిత తత్వం వుంటే కవులుగారని వారు చాలా ఖచ్చితంగా చెప్తున్నారు. పాపం కవి ఏ అభిప్రాయాలు లేకుండా, ఏ నమ్మకాలూ లేకుండా, ఏమాత్రం ఏ మానవ లక్షణాలు లేకుండా, ఏ చెట్టుగానో, ఏ పువ్వు గానో, లేకపోతే, పచ్చ, పచ్చగా ఎండలో మిల, మిల మెరుస్తూ ఎండుతున్న ఏ పిడగ్గానో అయ్యుండాలేవో.

    రవికిరణ్ తిమ్మిరెడ్డి.

    [ఈ అభిప్రాయం ఎడిట్ చేయబడింది – సం.]

  2. తెలుగు వీర లేవరా గురించి rama bharadwaj అభిప్రాయం:

    02/08/2010 10:54 am

    “కల్పన” అని ఒక విషయం ఉంటుంది చాకిరేవు ఉపేంద్ర గారూ!! అందులో మనం విశ్లేషించే reality పొసగదు. మన్నెం దొరల లో లోలోపల ఉన్న ఆవేశాలని, సీతారామరాజు తెల్లదొరలకి వ్యతిరేకంగా రౌద్రాన్ని ఉసిగొలిపేలా బయటికి తీస్తున్నాడు అని చూసినప్పుడు ఆ పాట సహజంగానే కన్పిస్తుంది.

    సిన్మా మొత్తం మీద సీతారామారాజు అటు తెల్లదొరలతో ఆంగ్లంలోనూ..ఇటు మన్నెం దొరలతో కొండభాషలోనూ మాట్లాడాలి మరి న్యాయంగా మీ వాస్తవికత ప్రకారం. కానీ రూదర్ ఫర్డ్ గా ఇంగ్లీషు వాడిని పెట్టి తియ్యలేని ఆ తెలుగు సినిమా లో జగ్గయ్యని తెల్లదొరగా జనం ఊహించుకోవలసినట్టుగానే..సీతారామరాజు మాట్లాడిన తెలుగు భాషని కూడా మనం ఆయా సందర్భానుసారం ఊహించుకోవాలన్నమాట! లేకపోతే మన్నెం భాషలోనో లేదా ఇంగ్లీషు భాషలోనో తియ్యాల్సిన సినిమాని సీతారామరాజు సొంత భాష అయిన తెలుగులో తియ్యడం ఏమిటీ?? ప్రేక్షకులు “తెలుగు”వాళ్ళు గనక. కొండదొరలు కారు గనకానూ!! తెలుగువీరలేవరా అని మీకు నచ్చకపోతే “కొండవీర లేవరా”!! అని మీరు మీ కోసం పాడుకుంటే గనక శ్రీశ్రీకి ఏమంతగా అభ్యంతరం ఉండకపోవచ్చు.

    పాటపాడుతున్నది అల్లూరి. పాడాల్సిన పాట సీతారామరాజు మనస్సుని ప్రతిబింబించేలా ఉండాలి. ఆ సినిమాకి నాయకుడు ఆయన గనక.మల్లుదొరో..గంటందొరో పాడే సందర్భం కాదది. తెలుగు మన్యం అది. వాళ్ళలో వాళ్ళేం మాట్లాడుకున్నా మైదానప్ప్రాంతపు నాయకులతో ఆ గిరిజనులు వాళ్ళ యాసలోనే కావచ్చుగాక కానీ తెలుగులోనే మాట్లాడాలి.

    యుధ్ధంలో తొడగొట్టే ఉద్రేకం అవసరం గనక అలాంటి భావనకి అవకాశం ఉంటే అది సహజమే!! పాట రాసిన శ్రీశ్రీ, పాట పాడిన ఘంటశాల, ఆ సినిమా తీసిన ఘట్టమనేని కృష్ణ, ఆ సినిమాని చూసిన కోట్లాది ప్రజ ఇందరూ తెలుగువాళ్ళు. ఆ సినిమాకి రావాల్సిన డబ్బులు తెలుగు వారినించి. అది తెలుగువారి ఆవేశాల దర్పణం గా ఉండటమే సబబు అని వాళ్ళకందరికీ స్పష్టత ఉంది. మరి మీరు మీ ఉతకడంలో భాగంగా ఇన్నింటినీ మరిచి బాదుడు బాదుతానంటే ఎలా??
    రమ.

  3. తెలుగు వీర లేవరా గురించి చాకిరేవు ఉపేంద్ర అభిప్రాయం:

    02/08/2010 9:47 am

    ఏక వచన బహు వచనాలే కాదు, అర్ధాలలో కూడా పొంతన లేని పాట ఇది.. యుద్ధానికి ప్రేరేపించే పాటలకి అర్ధంలో పొందిక వొద్దిక వుండనక్కర లేదనుకుంటేనో లేక పోతే ఏదో పెద్దాయన రాసుకున్నాడులే అని సరిపెట్టుకుంటేనో తప్ప, ఈ పాట వినడానికి నిజానికి చాలా చికాకు కలిగిస్తుంది.

    శ్రుంఖలాలలో వున్న మనిషి ఎవడయినా తొడలు కొట్ట గలుగుతాదా ? చురకత్తులు చేత పట్టి దాడి చేసే మనిషి ప్రవృత్తి తొడలు కొట్టి సవాలు చేసేదిగా వుంటుందా ?

    అన్నిటికీ మించి ఈ పాట అటు తెలుగు సంస్కృతికీ ఇటు మన్నే ప్రాంత సంస్కృతికీ జనరంజకమైన కట్టుకధ ద్వారా అన్యాయం చేస్తుంది. అల్లూరి సీతా రామరాజు చేసింది మన్నెం పితూరీ. మన్నే ప్రాంత ప్రజలలో తాము తెలుగు వారిమన్న స్పృహ , ఇప్పటికీ వుండదు. 1920 వ దశకంలో వుండే దన్న అబద్ధం సినిమా చెప్తే, దానికి ఒక మార్చింగ్ సాంగు కవి రాయవలసి వచ్చింది. పైగా అందులోకి మనకి అర్ధం కానీ భాషలో రాసిన పాట అని మనకి మనం నచ్చ జెప్పుకుని వింటే ఒక మాదిరిగా రిపబ్లిక్ డే రోజు పేరేడు లో ఎన్ సి సి కుర్రాళ్ళ బాండ్ లాగా బాగానే వుంటుంది. యదాలాపంగా వింటే వొళ్ళు గగుర్పొడుస్తుంది కూడానూ.

  4. పాఠకులకు సూచనలు గురించి Pavankumar Krovvidi అభిప్రాయం:

    02/07/2010 2:43 am

    అమెరికాలో ఇతరత్రా దేశాల్లో మన వాళ్ళు ఈ రకమైన తెలుగోష్ఠి చెయ్యడము చాలా ఆహ్లాదకరమైన విషయము.

  5. తెలుగు వీర లేవరా గురించి శ్రీనివాస్ అభిప్రాయం:

    02/06/2010 4:29 pm

    సేకరణ శ్లాఘనీయం. ఒక చిన్న అప్రస్తుత విషయం,.
    ప్రతి మనిషీ తొడలుగొట్టి శృంఖలాలు పగులగొట్టి, చురకత్తులు పదును బెట్టి, తుది సమరం మొదలు బెట్టీ, సింహాలై గర్జించాలీ……..”
    ప్రతి మనిషీ – సింహాలై”; ఏక వచనానికీ, బహు వచనానికీ పొత్తు కుదరలేదు కదా! ఇన్నాళ్ల తరవాత ఈ మధ్యే ఏదో బ్లాగులో చదివేను. మహాకవి మహా కవే.

  6. మనుచరిత్ర – ద్వితీయాశ్వాసము గురించి Lokeshwar అభిప్రాయం:

    02/06/2010 8:01 am

    మనుచరిత్ర తెలుగులొ వచన రూపము లొ వుంటే బాగుండును.

  7. కళాపూర్ణోదయం -8: మణిహారం గురించి PARANKUSHAM SRINIVASA SWAMY అభిప్రాయం:

    02/04/2010 7:12 am

    కథ చాలా బాగుంది. ఎంతో శృంగారంగా వుంది. ఎన్నిమలుపులో.. కథలో కథ.

  8. తెలుగు కవిత – ప్రస్తుత పరిస్థితి గురించి Geddapu Lakshmi Prasad అభిప్రాయం:

    01/31/2010 12:25 pm

    సోదాహరణంగా మౌలిక కవితా లక్షణాలను వివరించడమే కాకుండా, ప్రక్రియా భిన్నత్వం లో లక్షణాపరమైన ఏకత్వం ఉంటుందని ఆ లక్షణాలను పాటించడం వల్లే ఏ రచనైనా కవితా స్థాయిని పొందగలుగుతుందని చాలా చక్కగా విశ్లేషించారు. ఆధునిక కవితలు వ్రాయడానికి, ప్రాచీన కవితా “స్పృహ” (కనీసం) అక్కరలేదనీ, పద పరిజ్ఙానం అవసరం లేదని, భావించే నేటి వారికి మార్గదర్శకంగా నిలుస్తుందని నిలవాలని నా ఆకాంక్ష!

  9. అచ్చులో పత్రికలు అంతరిస్తాయా? గురించి చాకిరేవు ఉపేంద్ర అభిప్రాయం:

    01/31/2010 4:42 am

    జీవితంలో అనుకోకుండా ఎదురయిన విరామం.

    పనీ పాటా లేకుండా కూర్చోవలసి రావటంతో తెలుగు సాహిత్యంలో ఏం జరుగుతోందో తెలుసుకో వాలని కుతూహలం పుట్టుకొచ్చింది. ఎక్కడో వీపుమీద చీమ పాకినట్టు మొదలయి, జరజరా పాకి మాడులోకి అంటుకుంది.

    తెలుగులో రెండు రకాల పత్రికలు వున్నాయి. సౌలభ్యం కోసం వాటిని గబ్బు పత్రికలు, వెబ్బు పత్రికలుగా వర్గీకరించుకోవచ్చును. గబ్బు పత్రికలు మళ్ళీ రెండు రకాలు. సమస్త జ్ఞాన రంధ్రాలనీ మూసుకుంటే తప్ప భరించ లేనివి కొన్ని. ముక్కు వొక్కటీ మూసుకుంటే చడవగలగినవి మరి కొన్ని. ఈ రెండో రకం పత్రికలలో మురుగుతో పాటు అడపా దడపా బంగారమ్ముక్కలు కూడా కొట్టుక వస్తవి. వాటిని జల్లెడ పట్టి ఏడాదికో రెండేళ్ళకో ఎవరో వొకరు సంకలనాలు ప్రచురిస్తూ వుంటారు. అటువంటి సాహిత్య కార్మికులకి మన సమాజంలో తగిన గుర్తింపు లేదు.

    వెబ్బు పత్రికలు గబ్బు పత్రికల చావుకి వచ్చాయా అన్నది పై వ్యాసమూ దాని మీద చర్చకూ మూలాంశము. దీనివలన తెలుగు సాహిత్యానికి ఏదో మేలు జరుగుతుందని నమ్మటానికి నాకేమీ అభ్యంతరం లేదు. అదేంటో నాకు సరిగా తెలియక పోవటం వలన ఆ విషయాన్ని విజ్ఞులకే వదిలేస్తాను.
    వెబ్ పత్రికల వలన ప్రచురణా సంస్కృతులలో రాగల పరిణామాలు, వాటిని ఎట్లా ప్రయోజనకరంగా దిద్దుకోవచ్చును అన్న విషయం ఎవరూ ప్రస్తావించలేదు. (రమా భరద్వాజ్ గారూ – ఇది వుతుకుడు కాదు).

    1. ప్రచురణ అన్నది ఒక కాల చక్రానికి లోబడి వుంటుంది. టెక్నాలజిలో మార్పుల వలన ఆ కాల చక్రం మారిపోతుంది. పాఠకుల అభిప్రాయాలు వెంట వెంటనే ప్రచురితమవుతాయి. పేజీల పరిమితి వుండదు. మధ్యలో పోస్ట్ ఆఫీసు ప్రమేయం వుండదు కాబట్టి రచయితల కృషి ఫలం కూడా సంపాదకులకీ , విమర్శకులకీ, ఆపైన పాఠకులకీ తొందరగా అందుతుంది.

    2. వెబ్బు పత్రికలు అందరికీ అందుబాటులో వుండవు. పుస్తకం చేతిలో పట్టుకుని , పక్క మీద బోర్లా పడుకునో, దిండుమీద చేరబడో, వరండా లోనో బాల్కనీలోనో బస్సులోనో చదువుకునే వెసులుబాటు వుండదు. (నా చిన్నప్పుడు మా అమ్మా నాన్న కొనుకున్నవో, లైబ్రరీ నుంచి తెచ్చుకున్నవో పుస్తకాలు ఎవరూ చూడకుండా మంచం కింద దూరి చదువుకొనే అవకాశం లేక పోయి వుంటే నేను ఎంత అజ్ఞానిని అయివుందునో తలచుకుంటే వొళ్ళు గగుర్పొడుస్తుంది).

    ఈ రెండు విషయాలనే తీసుకున్నా వెబ్బు పత్రికలు తెలుగు సాహిత్యంలో వొక ప్రయోజనకరమైన దిశా నిర్దేశం చెయ్యగాలవని ఆశించవచ్చు. గబ్బు పత్రికలలో ప్రచురించబడటానికి ప్రస్తుతం తెలుగులో సాహిత్య కృషికన్న ఎక్కువగా సంపాదకులతో, విమర్శకులతో, వునికివాద రాజకీయ సంఘాలతో, ఎన్.జి. వో. లతో, ఒక్క మాటలో చెప్పాలంటే నానా రకాల మఠాలతో, ముఠాలతో, పీఠాలతో సంబంధాలు ఏర్పరచుకోవాల్సి వస్తోంది.

    ఈ విష సంస్కృతిలో నిలదొక్కుకోవాలంటే , రచయిత (త్రు) లు అసాధారణమైన ప్రజ్ఞావంతులు, అసామాన్యమైన నైతిక స్థైర్యం కలిగి వున్న వాళ్ళూ, దార్శనికులూ అయి వుండాలి. కొత్త తరం సాహిత్య కర్షకులపైన ఇంత భారం మోపటం భావ్యం కాదు. అందుకే వెబ్బు పత్రికలు – అనుకోకుండా, మన చేతిలో పడ్డ కొబ్బరి కాయలుగా భావించి, కోతి సాయంగా కొత్త వారధులు కట్టడానికి శ్రమించడం మంచిది.

    చాకిరేవు ఉపేంద్ర

    పి.ఎస్.
    కొబ్బరి కాయనించి వారధికి ఎట్లా వచ్చానని ఎవరూ అడగరు అనే నమ్మకం, పొగరు బోతు తనం నాకు రావటానికి ముఖ్య కారణం ఈ మధ్య కాలంలో వచ్చిన తలా తోకా లేని అనేకానేక తెలుగు రచనలే అని గమనించగలరు.

  10. శ్రీశ్రీ కవిత్వంలో కొన్ని సామాన్య జీవనాంశాలు గురించి రవిశంకర్ అభిప్రాయం:

    01/30/2010 7:30 pm

    శ్రీశ్రీ కవిత్వం పై థీసిస్ రాసింది రామకృష్ణగారే. ప్రసంగంలో రామకృష్ణగారి గురించి, ఆయనకు డాక్టరేటు రావటం మీద శ్రీశ్రీ చేసిన చమత్కారం గురించి చెప్పానుగాని, వ్రాతప్రతిలో పేరు రాసేటప్పుడు పొరపాటు దొర్లింది. క్షంతవ్యుణ్ణి. – రవిశంకర్