అను.4 – సంస్కృత కలావిలాసము: ఆంధ్రకవులపై క్షేమేంద్రుని ప్రభావం

జీవితప్రతిబింబమే కావ్యమని విశ్వసించి, తాదాత్మ్యభావంతో తనచుట్టూ ఉన్నవారి అనుభవపరంపరను పరిశీలించి, సారవిచారం చేసి, కవిత్వాన్ని ఉపదేశాత్మకంగా దిద్దితీర్చిన మహాకవి క్షేమేంద్రుడు. కాశ్మీరదేశంలో ధర్మవృక్షానికి చీడ పొడమి ఆగమోక్తాలైన కర్మముల అనుష్ఠానం వల్ల, అననుష్ఠానం వల్ల కలిగే సుపరీత విపరీతఫలితాలను ప్రత్యక్షంగా చూసి, పతనావస్థలో ఉన్న జాతికి జ్ఞానమూలకమైన ఔచిత్యప్రస్థానాన్ని నిర్మించిన మహానుభావుడు. మహర్షితుల్యుడైన శ్రీమదభినవగుప్తపాదుల వద్ద ఇహపరవిద్యలను అభ్యసించి మోక్షపదం వెతుకులాటలో నిర్లిప్తతను వహింపలేక లోకజ్ఞుడై, లౌకికవ్యవహారాలలో పాల్గొన్న గొప్ప ఉపదేష్ట. సమకాలిక సాంఘిక రాజకీయపరిస్థితుల సద్విమర్శతో ప్రజోపయోగం నిమిత్తం ధర్మసూక్ష్మాలను కథాముఖంగా ఆవిష్కరించాలని తహతహలాడిన సంస్కర్తృశిఖామణి. సమస్తమానవగుణాదర్శకమైన దర్శనప్రతిభ, సర్వాంగసార్థకమైన వస్తునిర్మాణకౌశలం, ధర్మధ్వనిమనోజ్ఞమైన అభివ్యక్తిసౌందర్యం ఏకోన్ముఖంగా ప్రవహించిన త్రివేణీసంగమమే క్షేమేంద్రుని కావ్యప్రమితి.

కలావిలాసం క్షేమేంద్రుని లఘుకావ్యసంచయంలో సుప్రసిద్ధమైనది. వజ్రకఠోరమైన ఆయన విమర్శవాక్కు ఇందులో కోమలహాస్యపూర్ణంగా వెల్లివిరిసింది. కావ్యసౌందర్యసమాధాయకమైన వస్తుసామగ్రి ఎక్కడ కనుపించినా దానిని వేయిభంగుల వర్ణించాలనే కుతూహలం ఉన్నవాడు. అందుకు తగిన ఇతివృత్తాన్ని కూర్చుకొన్నాడు. సంఘానికి దూరవర్తిగా ఎక్కడో విద్యారణ్యంలో తలదాచుకొన్న ఏ జితేంద్రియుణ్ణో, తపోధనుణ్ణో, గురువునో, వేదాంతప్రవక్తనో నిలిపి నీతులను బోధింపకుండా చౌర్యకళలో ఆరితేరిన ధూర్తాగ్రణిని పట్టుకొచ్చి ధర్మోపదేశానికి పరికరించుకొన్నాడు. ఆ రోజులలో అటువంటి సాహసాన్ని చేయగల ధైర్యం ఎంతమంది కవులకుంటుంది?

మూలదేవుని ప్రసక్తి ఎలాగూ వచ్చింది కాబట్టి, నాలుగు మాటలు చెప్పాలి. ఇతను చౌర్యకళను అభ్యసింపగోరే విద్యార్థులకోసం ఒక పాఠ్యగ్రంథాన్ని నిర్మించాడట. కౌటల్యుడు అర్థశాస్త్రంలో దానిపేరు ‘ఖరపటము’ అని చెప్పాడు. అందులో దొంగలకోసం ఆ కళాప్రయోగతంత్రమంతా ఉపకరణము, ప్రమాణము, ప్రహరణము, ప్రఘారణము, అవధారణము అని అయిదు ప్రకరణాలలో ఉన్నదట. మహేంద్ర విక్రమవర్మ మత్తవిలాస ప్రహనంలోనూ, భాసుని పేరిట ప్రచారంలో ఉన్న దరిద్ర చారుదత్తంలోనూ ఇతని ప్రశంసలున్నాయి. తమిళ మలయాళ దేశవాఙ్మయాలలో ఇది ‘కరవడమ్’ అన్న పేరిట ప్రచారంలో ఉండేదనటానికి ఆధారాలున్నాయి.

తరగతి గదిలో నేర్చుకొనేటప్పుడు మంత్రము, దైవము, ఔషధము, స్థితి, ప్రయుక్తి, దేశము, కాలము, ఉపకరణము అన్న ఎనిమిది ప్రయోగాలు బోధకు వస్తాయట. శూద్రకుని మృచ్ఛకటికంలో శర్విలకుడు చారుదత్తుని ఇంటిలో గోడకు కన్నం పెట్టినప్పటి వర్ణనమంతా ఖరపటానుసారమే అని వ్యాఖ్యాతలన్నారు. తండ్రి విడిచివేసినందున తల్లి దగ్గర పెరిగినట్లుంది. కర్ణీసుతుడని ప్రసిద్ధి. శూద్రకుని పద్మప్రాభృతకంలోనూ, బాణభట్టు కాదంబరిలోనూ, దండి దశకుమారచరిత్రలోనూ, అవంతీసుందరీ కథలోనూ ఉన్న వర్ణనలను బట్టి ఇతని కీర్తిప్రతిష్ఠలు దేశవిదేశాల వ్యాపించినట్లు గుర్తింపగలము. కలాంకురుడు అనికూడా పేరున్నదట. భగవత్పతంజలి మహాభాష్యంలోనూ, సుబంధుని వాసవదత్తా కథలోనూ, బుధస్వామి బృహత్కథాశ్లోకసంగ్రహంలోనూ ఉన్న పర్యాయ ప్రస్తావనలను బట్టి ఇతని పుస్తకం ఆ రోజుల్లో చాలా ప్రచారంలో ఉండేదని ఊహించాలి. బోజుడు శృంగారప్రకాశంలో పేర్కొన్నాడు. మాహుకుని హరమేఖలను బట్టి ఇతను గొప్ప శృంగారపురుషుడని తెలుస్తున్నది. మాహుకుడు చతుర్విధవిటులలో ఇతను ‘భద్రుడు’ అనికూడా చెప్పాడు. రాజపుత్త్రుడని కొందరంటారు. నందయంతి అనే బ్రాహ్మణస్త్రీని అపహరించి, పెండ్లాడిన ఉదంతాన్ని అవంతీసుందరీ కథలో దండి చెప్పాడు. ఇంతటి మహానుభావుడిని పట్టుకొచ్చి కథానేతగా నీత్యుపదేశానికి నిలపటం క్షేమేంద్రుని గడుసుదనం కాకపోతే మరేమిటి?

సంస్కృత కలావిలాస కథ

సంస్కృత కలావిలాసంలో పది సర్గలున్నాయి. మొట్టమొదటిది దంభాఖ్యానసర్గం. ఇందులో 96 శ్లోకాలున్నాయి. శ్రీపతి వక్షఃస్థలం వలె మంగళాయతనమైన విశాలపురంలో సకలకళాకోవిదుడైన మూలదేవుడనే ధూర్తశిఖామణి ఉండేవాడు. ఒకరోజు మాధ్యాహ్నిక భోజనానంతరం అతని ఆస్థానికి హిరణ్యగుప్తుడనే వ్యాపారి తన కొడుకును వెంటబెట్టుకొని దర్శనార్థమై వస్తాడు. “అయ్యా! లేకలేక కలిగిన ఒక్కగానొక్క కొడుకు. అల్లారుముద్దుగా పెరిగాడు. యుక్తవయస్సు వచ్చింది. డబ్బున్నవాళ్ళ చుట్టూ ఎటువంటి అవ్యక్తులు చేరతారో మీకు తెలియనిది కాదు కదా. ఆ దుష్టులతో, వాళ్ళ వెంబడిని వచ్చే వారకాంతలతో నెగ్గుకొనిరావటం ఎలాగో నేర్పించటం నా వల్ల కాలేదు. ఆశ్రయాన్ని కోరి వచ్చినవారికి అభయాన్ని ప్రసాదించే మీరు తండ్రి వలెనే ఈ కుమారునికి లోకజ్ఞానాన్ని కలుగజేయాలి” అని వేడుకొంటాడు. మూలదేవుడు అందుకు అంగీకరిస్తాడు.

హిరణ్యగుప్తుడు వెళ్ళిన తర్వాత సాయంకాలం గడిచి రాత్రి కాగానే కాగానే మూలదేవుడు శిష్యులందరిని కూర్చుండబెట్టుకొని, చంద్రగుప్తుని చేరబిలిచి, “నాయనా! లోకమంతా కపటోపాయపరులతో నిండి ఉన్నది. సంపన్నుల వద్దకు శ్రీవశీకరణార్థం చేరే దాంభికుల వాస్తవస్వరూపం ఏమిటో నీకు తెలియజెబుతాను” అని, అతనికి దంభస్వభావాన్ని వివరిస్తాడు. శౌచపరులమని, వేదమూర్తులమని, సాధుపుంగవులమని ప్రచారాలు చేసుకొనే మోసగాళ్ళ కలరూపును విప్పిచెబుతాడు. ఎముకలు కొరికే చలిలో కూడా లోలోపల చీదరించుకొంటూనే, స్నానసంధ్యలు కానిచ్చి, నిలువుబొట్లు పెట్టుకొని మహాపూజలు నిర్వహిస్తున్నట్లు నటిస్తూ భక్తులమని జనాలను చేర్చే దొంగవేషగాళ్ళను దూరంగా ఉంచాలంటాడు. బ్రాహ్మణ్యంలో కుత్సితుల మోసాలను విప్పిచెబుతాడు.

పూర్వం బ్రహ్మదేవుడు చరాచరభూతసృష్టిని కావించిన పిమ్మట ఒకరోజు దివ్యదృష్టితో భూలోకవాసుల స్థితిగతులేమిటో ఆలోచించి, మానవులు ఋజువర్తనులై ధనార్జనాసక్తులుగా లేరని, భోగపరాఙ్ముఖత వల్ల ప్రజాతంతువృద్ధి నిలిచిపోయే ప్రమాదం ఉన్నదని గుర్తించి – ఈ దాంభికతను సృజించాడట. పూర్వం దేవతలకు కంటకంగా మారిన జంభాసురుడే దంభుడై మానవలోకంలో జన్మించి జీవకోటిని తన శక్తిమూలాన వశపరచుకొన్నాడు. అచిరకాలంలో ఆ శక్తి అందరినీ ఆవహించింది. ఒక్కొక్కళ్ళు ఆ వృత్తి, ఈ వృత్తి అనిలేక ఎట్లా మోసగాళ్ళయ్యారో, ఆ మోసాలెటువంటివో, వాళ్ళచేతి పనిముట్లేమిటో చెబుతాడు. ఒకప్పుడు ఋషివేషాన్ని ధరించి బ్రహ్మసభలోకి అడుగుపెట్టిన దంభుణ్ణి చూసి దేవర్షులే చకితులయ్యారట. చివరకు సాక్షాత్తు శ్రీమహావిష్ణువు కూడా అందుకు అతీతుడు కాదట.

దమ్భవికారః పురతో వఞ్చకచక్రస్య కల్పవృక్షోఽయమ్
వామనదమ్భేన పురా హరిణా త్రైలోక్య మాక్రాన్తమ్. (1-96)

(కపటోపాయమనే చిత్తవికారం కలిగిన మోసగాళ్ళందరికి ముంగిటి కల్పవృక్షం అయిన శ్రీహరి మునుపు వామనరూపాన్ని ధరించి మూడడుగుల నెపంతో మూడు లోకాలను ఆక్రమించాడు.)

అని బలిచక్రవర్తిని వంచించిన వామనుని మాట తెస్తాడు.

రెండవది లోభవర్ణనసర్గం. ఇందులో 89 శ్లోకాలున్నాయి. కిరాటుల (వర్తకుల) లోభగుణం పాపానికి ఎలా దారితీస్తుందో వర్ణింపబడింది. వంచన లన్నిటికి మూలం లోభగుణమే. ఒక అమాయకుడు తనవద్ద దాచుకొన్న పెద్దమొత్తాన్ని సొంతం చేసికొని అతను వచ్చి అడిగినప్పుడు లేదని మొండిచెయ్యి చూపిన పురపతి అనే సెట్టి కథను మూలదేవుడు చెబుతాడు. ఒకప్పుడు శుక్రాచార్యుడు బాలసఖుడైన కుబేరుణ్ణి కొంత ధనం అడిగాడట. కుబేరుడు ఉన్నా ఇవ్వనంటాడు. శుక్రునికి కోపం వచ్చి కపటోపాయంతో అతని సర్వస్వాన్నీ హరిస్తాడు. కుబేరుడు హరుని ప్రార్థిస్తాడు. హరుడు శుక్రాచార్యునికి నచ్చజెబుతాడు. ఎంతకీ తన మాట వినటం లేదని ఆగ్రహించి అతనిని పొట్టన బెట్టుకొంటాడు. శుక్రుడు గౌరిని సన్నుతింపగా ఆమె కరుణించి శుక్రుని బ్రతికిస్తుంది.

మూడవది కామవర్ణనాసర్గం. ఇందులో 76 శ్లోకాలున్నాయి. స్త్రీలు చేసే వంచనకృత్యాలు, ముగ్ధా ప్రౌఢాదుల స్వభావాలు, సముద్రదత్తుడనే వ్యాపారి పరపురుషాసక్త అయిన భార్యవల్ల ఎలా మోసపోయినదీ వివరింపబడింది.

నాలుగవది వేశ్యావృత్తం. ఇందులో 40 శ్లోకాలున్నాయి. మూలదేవుడు వేశ్యకాంతల కుటిలానురాగాన్ని వివరిస్తాడు. విక్రమసింహుడనే రాజుకు వేశ్యలంటే అమితాభిమానం. మంత్రికి వేశ్యలంటే సద్భావం లేదు. రాజు తన మంత్రికి ప్రత్యుదాహరణను చూపగోరి, విలాసవతి అనే అందగత్తెను రాణివాసానికి తెచ్చి, ఆమెను భోగభాగ్యాలలో ముంచెత్తుతాడు. కొంతకాలానికి ఆమె, “రాజా! విదర్భదేశంలో ఉన్న నా ప్రియునిపై చౌర్యాపనింద పడింది. అతనిని విడిపింపగలవని నీకు వశవర్తినిగా ఉన్నాను” అంటుంది. రాజు నివ్వెరపోయి, విదర్భపై దండెత్తి, ఆమె కోరికను నెరవేర్చి, వేశ్యావిముఖుడై వారి వర్తనలను గర్హించటం ఇక్కడి ఘట్టితాంశం. ఆ కాలంలో వేశ్యకాంతలు అభ్యసించే చతుష్షష్టి కుటిలకళల వివరాలు ఈ సర్గంలో ఉన్నాయి.

అయిదవది కాయస్థచరితసర్గం. ఇందులో 46 శ్లోకాలున్నాయి. మోహగుణపు స్వభావం, కాయస్థుల (గణకవృత్తిలో ఉన్నవారు) దుర్మోహం నిరసింపబడ్డాయి. కూటస్థులు (కొలువులో కాయస్థులకు తోడుగా మధ్యవర్తిత్వానికి కూర్చొన్న తీర్పరులు), కాయస్థులు సదా నకారమనే సిద్ధమంత్రాన్ని (ఏదడిగినా, “అందుకు వీలులేదు, ఇందుకు నియమాలు ఒప్పుకోవు, ఇది సాధ్యం కాదు, అది రాజాజ్ఞకు వ్యతిరేకం” అని లాకేత్వమిచ్చి చెబుతుండటం) జపిస్తుంటారట. వారు చేసే మోసాల పట్టిక ఒకటున్నది.

ఉజ్జయినిలోని మహాకాళేశ్వర మందిరం వద్ద ధూర్తుడొకడు స్నానం చేసి, ఏమీ తోచక, నిర్మానుష్యంగా ఉన్న ఆ గుడిలో కూర్చొని శివునికి ఫలపుష్పాదులతో పూజచేస్తాడు. ఈశ్వరుడు దయతలిచి అతనికి వరమివ్వబోతాడు. ఆయన మెడలోని కపాలమాలికలోని ఒక పుర్రె అందుకు అడ్డుపడుతుంది. ఇంతలో ధూర్తుడు పూజవల్ల అలిసిపోయి మళ్ళీ స్నానానికి వెళ్తాడు. అడ్డుపడిన పుర్రె శివునికి ఆ ధూర్తుని దుర్వర్తనను వివరిస్తుంది. శివుడు ఇవన్నీ నీకెలా తెలుసునని అడుగుతాడు. పూర్వం నేను మగధలో కాయస్థునిగా జన్మించి, మీ యందలి భక్తిఫలంగా మీ గళసీమ సన్నిధిసేవలో ఉన్నానని పుర్రె చెబుతుంది. ఏమి కులమో ఏమిటో! చచ్చి కైలాసానికి వచ్చినా పుట్టుకతో వచ్చిన బుద్ధి మాత్రం మారలేదని శివుడు నవ్వుకొంటాడు.

ఆరవది మదవర్ణనసర్గం. ఇందులో 33 శ్లోకాలున్నాయి. కృతయుగంలో ఇంద్రియజయాన్ని సాధించిన మహాత్ముల దమము అనే శక్తి అక్షరాలు తిరగబడి మదముగా మారి కలియుగంలో జనులను ఆవేశించిందట. మదవశుల దుర్వర్తనలు, మద్యలోలుర దుశ్చేష్టలు అన్నీ ఇన్నీ కావు. చ్యవన మహర్షి ఆశ్వినులకు సోమపానార్హతను కల్పించాడని తెలిసి, ఇంద్రుడందుకు నిరాకరిస్తాడు. ఋషికి కోపంవచ్చి ఇంద్రుని భుజాన్ని స్తంభింపజేసి కృత్యాజ్వరాన్ని ప్రయోగిస్తాడు. ఇంద్రుడు భయంతో కాళ్ళబేరానికి దిగాక చ్యవనుడు అతనికి పూర్వస్థితినిచ్చి, కృత్యను మదరూపంలో లోకులను ఆవేశించేందుకు వదిలివేస్తాడు. ఆ మదమత్తుల మదాశ్రయస్థానాలు వివరింపబడ్డాయి.

ఏడవది గాయనవర్ణనసర్గం. ఇందులో 26 శ్లోకాలున్నాయి. గాయనీగాయనులంటే – ఆ రోజులలో నటవిటాదుల కోవలోనివాళ్ళు కదా – వట్టి దొంగలట. దొంగలు రాత్రిపూట రహస్యంగా దోస్తే ఈ కళాకారులు పట్టపగలే దోచుకొంటారట. కళ పేరిటి వారి నానా చిత్తవికారాలూ వర్ణింపబడ్డాయి. ఇంద్రుడు నారద మహర్షిని భూలోకంలోని విశేషాలేమిటని అడుగుతాడు. రాజులు ఇంద్రపదవి కోసం శతక్రతువులు చేసే ప్రయత్నాలలో ఉన్నారని నారదుడు చెబుతాడు. ఇంద్రుడు మండిపడి, యజ్ఞానికి కావలసిన సాధనాలు లేకుండా వాళ్ళ మైమరపించి సంపదలను కొల్లగొట్టమని గాయన పిశాచాలను సృష్టించాడట.

రసజ్ఞుల హృత్తాపహారులనుకొనే కళాకారులను వట్టి విత్తాపహారులు గాను, సంగీత గాత్ర వాద్యకళలను కార్యాచరణపరుల ‘దృష్టి మరల్చే తంత్రాలు’ గాను నిరూపించటం ఈ చిత్రణలోని గడుసుతనం.

ఎనిమిదవది సువర్ణకారోత్పత్తి సర్గం. ఇందులో 29 శ్లోకాలున్నాయి. కంసాలులు చేసే మోసాలన్నీ ఏకరువుకు వస్తాయి. పూర్వం మేరుపర్వతం ఎలుకల బాధ ఎక్కువై దేవతలకు మొరపెట్టుకొన్నదట. దేవతలు మేరుపర్వత బిలాలను మంత్రధూమంతో మూసి, ఎలుకలన్నింటినీ కాల్చివేశారు. ఆనాటి మూషిక జీవాత్మలే స్వర్ణకారులుగా జన్మించాయట.

తొమ్మిదవది నానా ధూర్తవర్ణన సర్గం. ఇందులో 73 శ్లోకాలున్నాయి. ధూర్తులు కనుకట్టు చేసి లోకులను వంచించే తీరుతెన్నులన్నీ ప్రస్తావనకు వచ్చాయి. జ్యోతిష్కులమని, రసవాదులమని, వశీకరణ విద్యలు తెలిసినవాళ్ళమని నమ్మినవాళ్ళను లోబరచుకొనే నీచుల నయవంచక మాయాకృత్యాలు ఎన్నెన్నో. వేలకొద్దీ ఉండే ఆ మాయలలోనూ అరవైనాలుగు ముఖ్యకళ లున్నాయట. వాటి వివరాలు చెప్పబడ్డాయి.

పదవది సకలకళానిరూపణ సర్గం. ఇందులో 43 శ్లోకాలున్నాయి. ధర్మపరులు అర్థకామాలను మోక్షాభిముఖంగా అనుష్ఠించి, జీవితాన్ని అందమైన కళగా ఎలా మలుచుకోవచ్చునో ప్రబోధించే ఉత్తమాధ్యాయమిది.

ఈ విధంగా లోకంలోని శుభాశుభావర్తనుల వాస్తవస్వరూపాన్ని శిష్యునికి విశదీకరించి, మూలదేవుడు ఇంటిలోనికి వెళ్ళిపోతాడు.