స్మరణ: కథ నచ్చిన కారణం

మాధవపెద్ది గోపాల కృష్ణ గోఖలే (మాగోఖలే) రాసిన కథ స్మరణ ( డిసెంబర్, 1941).

వ్యక్తిగతంగా ఈ కథ నాకు ఎందుకు నచ్చిందో రాసే ప్రయత్నం ఇది. కాబట్టి, ‘కథకి ఉండవలసిన లక్షణాలు’ గురించి పుస్తకాలలోంచి వల్లె వేయడం అప్రస్తుతం. అంతే కాదు, స్ఫుటంగా ఆ ‘లక్షణాలు’ ఇవి అన్న అవగాహన కూడా నాకు లేదు. అనాయాచితంగా, అస్పష్టంగా, కదుల్తున్న నీళ్ళల్లో ప్రతిబింబాలుగా సదరు లక్షణాలు నా వ్యాఖ్యానంలో కనిపిస్తే క్షంతవ్యుణ్ణి.


బ్రహ్మన్న – మాగోఖలే చిత్రం

ముందుగా మాధవపెద్ది గోపాలకృష్ణ గోఖలే గురించి నాలుగు మాటలు చెప్పాలి. 1917లో తెనాలి దగ్గర బ్రాహ్మణకోడూరులో జననం. మద్రాసు ఆర్ట్స్‌స్కూలు లో దేవీప్రసాద్‌ రాయ్‌ చౌదరి వద్ద చిత్రకళాభ్యాసం. కొంతకాలం ఆంధ్రపత్రిక, ప్రజాశక్తి పత్రికల్లో ఆర్టిస్ట్ గాను, విలేకరిగానూ పనిచేసాడు. గోఖలే చిత్రకారుడిగా ప్రసిద్ధికెక్కాడు. ఆయిల్‌, వాటర్‌ కలర్‌ ఆయన ప్రత్యేకత. ఆయన వేసిన వాటర్‌ కలర్‌ చిత్రం బ్రహ్మన్న చాలా ప్రసిద్ధికెక్కిన చిత్రం.

1950ల్లో సినిమా రంగంలో ప్రవేశించాడు, గోఖలే. సినిమా నిర్మాతలు నాగిరెడ్డి – చక్రపాణి (ఆలూరి సుబ్బారావు) గార్లకు ఎంత ఖ్యాతి ఉన్నదో, వాళ్ళిద్దరూ విజయ-వాహినీ లకి తీసిన కళాఖండాలకి (పాతాళభైరవి, గుండమ్మ కథ, వగైరా) ఆర్ట్ డైరెక్టర్గా గోఖలేకీ అంతే ఖ్యాతి దక్కిందనటం అతిశయోక్తి కాదు. 1981లో గోఖలే మరణించాడు.

అయితే, మాగోఖలే ప్రసిద్ధ కథా రచయిత అని అప్పట్లోనూ, ఇప్పుడూ కూడా చాలా కొద్దిమందికే తెలుసు. అందుకు ఒక కారణం: గోఖలే రాసిన కథలు చాలా తక్కువ. రాసిన కాసినీ ఆణిముత్యాలు. ‘అలగా జనం భాష’లో, వాళ్ళ జీవితానికి సంబంధించిన కష్టనష్టాలు, బాధలూ మాటల్లో చిత్రించాడు గోఖలే. బహుశా శిష్ట్లా పెట్టిన వరవడి తీర్చిదిద్దిన వాడు, గోఖలే. ఈ పని 1940 ప్రాంతాల్లో చెయ్యగలగడం సాహసం. పాత్రౌచిత సంభాషణలు ప్రాచీన సాహిత్యంలో ఉన్నా, అప్పట్లో తెలుగులో ఆధునిక కథల్లోకి అటువంటి భాష రాలేదు. అంటే, సమకాలీన కథావస్తువు ఎన్నుకున్నా, అప్పటి కథకులు కథచెప్పడానికి వాడిన భాష పాత్రౌచిత్యంగా లేదు. అప్పట్లో పత్రికల మీద గ్రాంధిక వాదుల బలం ఎక్కువగా ఉండడం కారణం కావచ్చును. అందుకు ఎదురొడ్డుతూ గోఖలే రాసిన మొట్టమొదటి కథ ‘కిట్టకాలువ గట్టు కాడ’ 1940లో ఆంధ్రపత్రికలో అచ్చైనప్పుడు, గ్రాంధికవాదులు ‘ఉస్సురనడం,’ వ్యావహారిక భాషావాదులు ‘భేష్‌’ అనడం ఇప్పుడు పాత చరిత్ర. (కిట్టకాలువ గట్టుకాడ కూడా నాకు నచ్చిన కథే! అయితే, ఆ కథ నాకు అందుబాటులో లేదు).

ఇక పోతే స్మరణ కథ గురించి.

మొదటి భాగంలో కప్పని మింగుతున్న పాము గురించి వెంకటాద్రికి వాడి అమ్మ కనకమ్మ చెప్పడం, ప్రతీకగా దాని అవసరం కథాంతంలోగాని బయట పడదు. ఈ రకమైన ‘ట్విస్ట్’ అలనాటి పాతకథల్లో మామూలు. ఇప్పటి కొన్ని కొత్త కథల్లోనూ ఈ రకమైన ‘విరుపు’ కనిపిస్తుంది.


మాగోఖలే కథలు, 1989
విశాలాంధ్ర ప్రచురణ, 60.00 రూ.

కథావస్తువు అప్పుడూ ఇప్పుడూ కూడా సమకాలీనమే! బలవంతుడు బలహీనుణ్ణి అణిచి పెట్టడం అన్ని వేళలా అన్ని సమాజాల్లోను ఉన్నదే! అందుచేత ప్రత్యేకంగా వస్తువు ఏమంత ఆకర్షణీయం కాదు. Run of the mill అని అన్నా అనవచ్చు. కథకుడు వాడిన భాషే కాకుండా, కథ చెప్పిన పద్ధతిలో ప్రత్యేకత ఉంది. గోఖలే సినిమాలో కళకి కుంచెలతో, రంగులతో ఎన్నెన్ని నగిషీలు చెక్కాడో, అన్ని నగిషీలూ పదునైన మాటలతో ఈ కథ చెక్కాడు. బ్రహ్మన్న బొమ్మ చూస్తే గోఖలే చిత్రకళ లాగానే, గోఖలే కథలూ అంతే పదునుగా కనిపిస్తాయి.

వెంకటాద్రికి భయం లేకండా నిద్రపోవడానికి కనకమ్మ చెప్పిన కథ, స్మరణ కథకి ప్రాణం. అందుకని కథ నేను తిరిగి మళ్ళీ చెప్పను. స్మరణ కథలో అంతరార్థం, నాకు నచ్చింది. మీకు కూడా నచ్చుతుందనుకుంటాను. ఏ విషయం చెప్పండి.