రవి గాంచిన కవి: విన్నకోట రవిశంకర్ కవితా సంకలనాల పరామర్శ

1981-1992 మధ్యకాలంలో విన్నకోట రవిశంకర్ రాసిన 29 కవితలు 1993లో కుండీలో మర్రిచెట్టు అనే సంకలనంగా ప్రచురితమైనాయి. ఈ సంకలనానికి రవిశంకర్ కవితాగురువు ముందుమాట రాస్తూ ఇలా అన్నారు: “రవిశంకర్ కవిత్వ నావ మాటల ప్రవాహంలో కొట్టుకుపోదు. దానికి గమ్యముంది. జీవితానుభవమూ, హృదయానుభూతీ – ఈ రెండు ధృవాలనీ కలిపి కవిత్వ విద్యుచ్చక్తిని సృష్టించాడు… రవిశంకర్. ఇటువంటి కవులు అరుదుగా ఉంటారు. ఇదింకా ఇతని మొదటి పుస్తకం.”

పదేళ్ళ తరువాత 1993-2002 వరకూ రాసిన కవితలనుంచి ఏరి పేర్చిన 40 కవితల సంకలనం ‘వేసవి వాన’. ఈ సంకలనానికి ముందు మాటలో, “ఏకాంతంగానూ, మరొక తోడుతోనూ, మనస్సును ప్రకృతికి సన్నిహితం చేసి చదివితే ఇతని కవిత్వం మనసుకు బాగా పడుతుంది. ఇందులో నేను ప్రయత్నించినది అందుకు దిశా నిర్దేశం చెయ్యడమే. అక్కడక్కడ ప్రలోభపడి వ్యాఖ్యానించినా పాఠకుడికి దారి చూపించే ప్రయత్నంలో భాగమే”, అని రాశారు చేరా.


రెండో పాత్ర – విన్నకోట రవిశంకర్
ముద్రణ 2010. వెల రూ. 15/- $5.
అన్ని బుక్‌షాపు‌లలో లేదా
రచయిత నుండి లభ్యం

2010లో వచ్చిన సంకలనం ‘రెండో పాత్ర’. దీనిలో 2003 – 2009 మధ్యలో రాసిన కవితలు, మూడు అనువాదాలు కలిపి వెరసి 36 కవితలున్నాయి. ఈ సంకలనానికి వెల్చేరు నారాయణరావు ‘ఈ పద్యాలు ఎలా చదవాలా?’ అన్న మకుటంతో వెనుక మాట రాశారు. అందులో, “నెమ్మదిగా చదవండి. పైకి చప్పుడు చేయకండా మీరు చదువుతుంటే మనసులో చేసే చప్పుళ్ళని నెమ్మదిగా వినండి.” అని చెబుతూ “… ఈ పద్యాలన్నీ ఒకదాని తరవాత ఒకటిగా వరసగా గబగబా చదివేయకండి. ఒక్కటొక్కటే చదవండి. చదివి కాస్సేపు ఆగండి. వేరువేరుగా ప్రతికవితా మీ లోపలికి వెళ్ళనివ్వండి. గబుక్కున పుస్తకం తెరిచిచూస్తే అనుకోకండా కనిపించిన కవిత మీరనుకోని ప్రపంచాన్ని చూపించవచ్చు”, అని అంటారు.

సంకలనానికీ, సంకలనానికీ మధ్య వ్యవధి సుమారు ఒక దశాబ్దం. ఈ మూడు సంకలనాలూ చదివితే, కవిగా రవిశంకర్ ప్రేరణలు, ఎదుగుదల, మార్పులూ తెలుసుకోవటానికి అవకాశం ఉన్నది.

ఈ వ్యాసంలో మూడు దశాబ్దాల రవిశంకర్ కవితలపై పునర్విమర్శనాత్మక సమీక్ష (retrospective review) చేయడానికి ప్రయత్నిస్తాను. ఈ ప్రయత్నానికి పూనుకోవడం సాహసమే. ఇటువంటి ప్రయత్నంలో చాలా సాధక బాధకాలున్నాయి. ముఖ్యంగా, బాగా పరిచయమున్న స్నేహితుడి కవితలని సమీక్షించడానికి, వ్యాఖ్యానించడానికీ చేసిన సాహసం – నాలో కొంత గగుర్పాటు మరికొంత ఆదుర్దా కలిగించాయని చెప్పక తప్పదు. ముందుగా నా పరామర్శ పరిధి గురించి ఒక మనవి. It is really a confession.

సాధారణంగా విశ్వవిద్యాలయాలలో ఉన్న సాహితీవేత్తలు – అక్కడా, ఇక్కడానూ – సాహిత్య విమర్శలు రాసినప్పుడు వారి పాండిత్యం ప్రతిబింబించే శబ్ద సముదాయం వాడటం కద్దు. పాశ్చాత్య సాహితీవిమర్శకుల వ్యాసాలు చదివినప్పుడు నాబోటి సాధారణ పాఠకుడికి బోధపడని పదజాలం విరివిగా ఉంటుంది. నామటుకు నాకు, పండితులు పండితుల కోసమే రాస్తున్నారా అనిపిస్తుంది. మచ్చుకి, పాశ్చాత్య పండితుల వ్యాఖ్యలలో కనిపించే పదజాలంలో కొన్ని పదాలు: signification, textuality, code, post-individualism, logocentricism మొదలైనవి (ఈ పదాలని సంస్కృతీకరించే పని పండితులకే అప్పచెప్పుదాం). ఇకపోతే, మనకి తెలుగులో చెప్పుకోదగ్గ సాహిత్య విమర్శ చాలా తక్కువేనని చెప్పాలి. ఆ ఉన్నది కాస్తలో చాలా భాగం, వామపక్ష ధోరణిలోను, మార్క్సిస్టు-లెనినిస్టు-మావోయిస్టు మూసలోనూ సాగుతుంది. నా ఉద్దేశంలో, ఏ సిద్ధాంత పరంగా చేసే విమర్శయినా నిజాన్ని కప్పి పుచ్చుతుంది. అటువంటి విమర్శలు పాఠకుడికి నిష్ఫలమని నా నమ్మిక. నేను కవితలు, కథలు, నవలికలు, నవలలు, వ్యాసాలూ – ముఖ్యంగా నా ఆనందం కోసం, నా మనస్సంతుష్టి కోసం చదువుతాను. సాహిత్య వివరణ (literary interpretation) పరామర్శ శాస్త్రీయం (scientific) కాదని నా దృఢ నమ్మకం. సావధానంగా చదివే సాధారణ పాఠకుడికి వచ్చే సహజోపలబ్ధమైన అనుభవం సాహిత్య పరామర్శకు న్యాయం చేస్తుంది.

రవిశంకర్ మొదటి సంకలనం కుండీలో మర్రిచెట్టు. అందులో మూడో పద్యం కుండీలో మర్రిచెట్టు (ఫిబ్రవరి, 1983). ఈ పద్యం చదివిన వెంటనే, రవిశంకర్ రొమాంటిసిస్టుగా కనిపిస్తాడు. సహజ ప్రకృతి పురోగమనానికి పట్టుబట్టి అడ్డుపడితే భావుకులకి ఆవేదన కలుగుతుంది. అలనాటి భావకవుల కవితల్లో కనపడే విషాదం, బాధా ఈ కవితలో కనపడుతుంది. చూడండి, కుండీలో మర్రిచెట్టు కవిత.

నిండైన దీని జీవితాన్ని
ఎవరో అపహరించారు.

దీని బలాన్ని, బాహువుల్ని,
వేళ్ళని, వైశాల్యాన్ని,
నింగిని అటకాయించే నిర్భయత్వాన్ని,
ఎవరో
నిర్దయగా, నెమ్మదిగా
అందంగా అపహరించారు.

గాలి సమ్మెటల్తో బాదినా
చెక్కుచెదరని దీని స్థైర్యాన్ని,
వేలి కొసల తాకిడికి
తలవంచే వినయంగా మార్చారు.

ఇక్కడీ జీవితమే
అందంగా, ఆకర్షణీయంగా ఉంటుందని
అమాయకంగా దాన్ని నమ్మించారు.

పచ్చదనంతో,
రెపరెపలాడే జవసత్వాలతో,
వందయోజనాలు,
వేయి ప్రయోజనాలుగా
విస్తరించవలసిన దీని జీవితసామ్రాజ్యాన్ని,
కుండీలో,
రెండు పిడికిళ్ళ మన్నులో,
నీటికై వెదుకాడే కళ్ళలోకి
కుదించారు.

నిండైన దీని జీవితాన్ని
ఎవరో అపహరించారు.

ప్రాచ్య దేశాల్లో బోన్సాయ్ కళాకారులు, ముఖ్యంగా బోన్సాయిని కళగా ఆరాధించేవాళ్ళు ఈ పద్యం చదివి ఏమనుకుంటారో? ఈ కవితలో ఇస్మాయిల్ గారి కవితల ఇన్ఫ్లూయెన్స్ బాగా కనిపిస్తుంది. ఇది రాసేకాలంలో రవి శంకర్ విద్యార్థి. ఇస్మాయిల్ గారితో కవితాపరిచయం ఉన్న విద్యార్థి. గురువుగారిలా మాటల పొందికలో నిరాడంబరత అబ్బింది. జెన్ బౌద్ధ సిద్ధాంత ప్రాబల్యంలో కవితలు రాసేవారు, మాటలు తూచితూచి వాడతారు. చాలా తక్కువ మాటల్లో ఎక్కువ గూఢార్థం చొప్పించడం వాళ్ళ ఆచారం. ఈ కవిత రాసే టప్పటికి, రవిశంకర్ కి జెన్ క్లుప్తత అలవాటు కాలేదనిపిస్తుంది. తరువాతి సంకలనాల్లో వచ్చిన కవితల్లో నిశితమైన క్లుప్తత ఉన్నదని చెప్పడానికి ఉదాహరణగా ఈ కవిత పూర్తిపాఠం ఇచ్చాను.

అదే సంకలనంలో స్త్రీ పాత్ర (జనవరి, 88) అనే కవిత చూడండి.

అక్కడున్న అందరి మనసుల్లోని
దుఃఖాన్నీ
ఆవిష్కరించే బాధ్యతని
ఒక స్త్రీ నయనం వహిస్తుంది.

ప్రకటించక,
ప్రకటించలేక,
పాతిపెట్టిన వందలమాటల్ని
ఒక్క మౌన రోదన వర్షిస్తుంది.

సున్నితమైన జ్ఞాపకాల వేలికొసల తాకిడికి
శ్రుతిచేసిన వీణలాగా ఆమె ధ్వనిస్తుంది
కనిపించని విషాదపు ఒత్తిడికి
చిగురుటాకులా ఆమె చలిస్తుంది…

అంటూ సాగిన ఈ కవిత ఇస్మాయిల్ గారికి ‘ఒక వింతసత్యాన్ని అభివ్యక్తం’ చేసింది. ఒకే పద్యం అందరికీ ఒకేరకమైన అనుభూతి కలిగించదు కాబోలు. ఈ మధ్యనే మరోసారి ఈ కవితని నేను చదివినప్పుడు – ముఖ్యంగా ఆఖరి చరణాలు మననం చేసుకున్నప్పుడు – ‘బయటపడని పాత్రల మనోరూపాలని లీలగా అవతలివైపు చూపించే తెర,’ స్త్రీ అన్న మాటలు నన్ను వెంటాడినాయి. స్త్రీ శక్తిపై కవికున్న గౌరవం నాకు ద్యోతకమయ్యింది.

అదే సంకలనంలో మరో కవిత మోళీ (నవంబర్ 89).

నీ క్షణికానందాన్ని
ఆమె తొమ్మిదినెలలు మోసింది.
వీడైతే దానిని
నూరేళ్ళూ మోయవలసినవాడు.

ఇంకా నీ బెల్టు చారల్ని,
వేళ్ళ ఆనవాళ్ళని కూడా
ఎక్కడ మొయ్యమంటావు చెప్పు!

నీ కోసం ఆమె
తన నవ్వులన్నీ మూట గట్టి ఇచ్చేసింది.
….

ఇంతజరుగుతున్నా,
ఇంకా నీ జీవితపు మోళీ
అద్భుతంగా ఉందని
లోకాన్ని నమ్మించడానికి,
ఆమె బాధల తాటిమీద
పడిపోకుండా నడిచి చూపించాలి.

ఇందులో ఏదో మోసం ఉంది.
నీఅధికారపుటంధకారంలో జరుగుతున్న ఆటలో
ఎక్కడో – క్షమించరాని దోషం ఉంది.

దీనిని పైపద్యంతో జతచేసి చదవండి. వేరే వ్యాఖ్యానించనవసరం లేదనుకుంటాను.

కుండీలో మర్రిచెట్టు, ముద్రణ 1993.
విన్నకోట రవిశంకర్
అన్ని బుక్‌షాపు‌లలో లభ్యం

రవిశంకర్ కవితల్లో పునః పునః ప్రస్తావనగా వచ్చే కవితా వస్తువు చిన్ని చిన్ని పాపలు. వస్తువు పాతదే అయినా, ఒక్కొక్కసారి ఇదివరకు వాడిన పాత మాటలే వాడినా కవిత మంచిదయితే పునశ్చరణ దోషం కాదు. ఇది హైకూ సంప్రదాయం కూడాను! కవిత ‘మంచిది’ అని చెప్పడంలో స్థూలంగా నా భావం ఇది: మొదటి వాన జల్లు పడ్డ తరువాత నేల వాసన ఎప్పుడూ కొత్తగా ఆహ్లాదకరంగా ఉంటుంది. వాన పాతదే! నేలా పాతదే. అలాగే, వస్తువు పాతదే; మాటలూ బహుశా వాడినవే అయిఉందవచ్చు. కాని, పాఠకుడికి సరికొత్తగా వినిపిస్తే, అది మంచి కవితేనని నా అభిప్రాయం. ఉదాహరణకి, సూర్యోదయం మీద, ఆకురాలు కాలంమీదా, ప్రకృతిలో ఏటేటా సహజంగా వచ్చే మార్పులపై ప్రముఖ హైకూ కవులు వందల కొద్దీ కవితలు రాశారు. ప్రతి హైకూ లోనూ ఒక కొత్త పరిమళాన్ని పంచిపెట్టడానికి ప్రయత్నించారు. ఆ ప్రయత్నం సఫలీకృతం అయినంతమేరా అవి మంచి కవితలే అని నా భావం.

మొదటి సంకలనం లో ‘పాప మనసు’ (జనవరి 92), రెండవ సంకలనం, వేసవివాన నుంచి ‘పోలికలు’, ‘అద్వైతం’, ‘దాగుడు మూతలు’ ( రచనా కాలం 1993-2002), మూడో సంకలనం రెండో పాత్ర నుంచి ‘తొలి అడుగు’ (డిసెంబర్ 2008) వరసగా చూద్దాం.

పాప మనసు

ఈ పాపకి మన ప్రపంచం
అంతగా నచ్చదు.
ఉదయం లేచిన దగ్గిర్నించి దాని మరమ్మత్తు కోసం
ఉబలాట పడుతూ ఉంటుంది.

ఇదే అందం అనుకొని, మనం
శ్రమ పడి అమర్చిన గదిని
తన కల్పనా శక్తితో
తేలిగ్గా పునర్నిర్మిస్తుంది.

ప్రతి వస్తువుకి స్థలనిర్దేశం చేస్తూ
మనం మూసివేసిన వాటి స్వేచ్చని,
తన చిన్నారి చేతులతో
తెరిచి పరుస్తుంది.
….

కనిపించిన ప్రతి కాగితాన్నీ
చక చక వేళ్ళతోనే చదివేస్తుంది.
తనంతటి వార్త ఉండగా ఇదెందుకన్నట్టు,
ఇవాళ్టి పేపర్ని క్షణాల్లో పాత బరుస్తుంది.

రోజంతా తుళ్ళుతూ, గెంతుతూ,
ఎగిరెగిరిపడే ఈ పాపని
నిదర బరువుతో అదుపు చేసినప్పుడు
కట్టుబడని కాగితపుటంచుల్లాంటి
దాని మనసు చేసే రెపరెపల్ని
నేను తప్పక వింటాను.

చిన్న పిల్లలు చేసే అన్ని చిలిపిపనులూ తల్లితండ్రులకి గర్వం కలిగించడం సహజం. ఈ పైకవితలో రవిశంకర్ తన పాప మురిపాలన్నీ మాటల పటం కట్టి చూపించాడు. తాను అలసట చెంది, పాప అల్లరి అదుపులో పెట్టడం కూడా ఆనందదాయకమే!

వేసవి వాన సంకలనం నుంచి ఈ క్రింది కవితలు:

పోలికలు

దారి తప్పిన ఒక జ్ఞాపకాన్ని
ఈ పసిపిల్ల ఓపిగ్గా ఒడ్డుకు చేర్చింది.
గతకాలపు చీకటిగదిలో పారేసుకున్న ఒక విలువైన అనుభవాన్ని
అతి సహనంతో ఇది వెతికి తెచ్చింది.

ఎన్నాళ్ళక్రితమో బూడిదగా మారి
నీళ్ళలో కలిసిపోయిన వాళ్ళు
దీని పాలబుగ్గల్లోంచి మళ్ళి పలకరించారు.

పటాలుగామారి, కాలంలో
ఒకచోట నిలిచిపోయినవాళ్ళు,
దీని పసికళ్ళల్లో సజీవంగా కదిలారు.

ఎంతమంది గతించినవాళ్ళ ఆనవాళ్ళని
ఇంతచిన్ని శరీరంలో దొంతర్లు దొంతర్లుగా దాచిందో!
ఇది వాళ్ళందరూ ప్రేమతో సంతకాలు చేసి పంపిన
బుల్లి ఆటోగ్రాఫ్ బుక్ లాగా ఉంది.

వివరణకందని దీని చిన్ని పదవులమీది చిరునవ్వు
తమకు లభించిన ఈ కొనసాగింపుకి
వాళ్ళు తెలిపే అంగీకారం కావచ్చు.
మూసిన దీని గుప్పిట్లో దాచిఉంచింది
విప్పిచెప్పలేని వాళ్ళ సందేశం కావచ్చు.

పసిపిల్లలు తాతముత్తాతల ఆకారాలని జ్ఞప్తికి తెస్తారు. ఎన్నో ఆనందకరమైన ఊహలకి నీరు పోస్తారు, వాళ్ళ చేష్టలద్వారా! పిల్లలలో పూర్వీకుల పోలికలు వెతకడం మన సంప్రదాయం. బహుశా అన్ని సంస్కృతుల్లోనూ ఈ సంప్రదాయం ఉండి ఉండచ్చు. పూర్వుల పోలికలుండటం సహజమే కూడాను. ఆ పోలికలు వెతకడంలో, అనుకోకండా ముఖ్యంగా తల్లితండ్రులకు – ఎందరివో పూర్వీకులవి – ఎన్నెన్నో పోలికలు కలిసిపోయి కనిపిస్తాయి. చివరి చరణాల్లో రవి కవిగా తాత్విక ధోరణిలోకి వస్తాడు. మన పెద్దవాళ్ళూ అంటారు, పసిపాపల మూసిన గుప్పిట్లలో వాళ్ళ పూర్వీకుల చరిత్ర సకలం పదిల పరచబడి ఉంటుందీ అని!

అద్వైతం అన్న కవిత చూడండి:

దీని నవ్వుకి, ఏడుపుకీ మధ్య
రెండుపెదవుల నడుమ ఉన్నంత దూరం.
దీని నిద్రకి, మెలకువకీ మధ్య
రెండు కనురెప్పల నడుమ ఉన్నంత దూరం.
….

దీని పంతాలకి, కేరింతలకీ మధ్య
రెండు అరచేతుల నడుమ ఉన్నంత దూరం.

ఇది ఆడటానికి, ఆడించటానికీ మధ్య
దీనికీ మాకు ఉన్నంత దూరం.
….

దీని నడకకి, పడిపోవటానికీ మధ్య
గెలుపుకి, ఓటమికి ఉన్నంత దూరం.

ఇది నేర్వటానికి, నేర్పటానికి మధ్య
తెలివికి, జ్ఞానానికి ఉన్నంత దూరం.

ఈ కవితలోనూ చిన్ని పాప (శ్రీకళ రవిశంకర్ల కూతురు హిమబిందు ప్రేరణ!) వస్తుంది. రెండు విపరీత విశేషాలు భిన్నం కావని కవి అద్వైతపరంగా అందంగా ఉదహరించాడు. పోలికలు కవితలోను, అద్వైతం కవితలోనూ కవి తాత్విక పరిణితి గమనార్హం. మరొక విషయం – నా ఉద్దేశంలో, అద్వైతం కవిత రాసే సమయానికే రవిశంకర్ ఇస్మాయిల్ గారి పంథా నుంచి కాస్త వేరుపడి తనదైన కొత్త బాట వేసుకోవడానికి ప్రయత్నిస్తున్నట్టు కనిపిస్తుంది.

దాగుడు మూతలు కవిత చూడండి. ఇదికూడా చిన్ని పాపచేష్టలనుదహరించే కవితే!

ఈ పాపకి నాతో
దాగుడు మూతలాడటమే యిష్టం

నాచిన్న గది అద్దంలో
చిక్కిన ఈ చందమామకి
నీలితెరల మబ్బుల చాటున
దోబూచులాడటమే యిష్టం.
….

సుడిగాలిలా వచ్చి
నన్ను చుట్టుకొపోయే ఈ పిల్లే
ఊపిరి బిగపట్టి
ఒక మూల కూర్చొనుంటుంది.
…..

నేనెంత శ్రమపడితే
దానికంత ఆనందం.
…..

ప్రతి రోజూ విడవకుండా
నన్నీ ఆటలోకి లాగే ఈ పాప
ఎప్పటికీ నాకు దొరికీ దొరకని
ఒక జీవితసత్యంలా తోస్తుంది.

వేసవి వానలో మూడు కవితలూ, మూడు విభిన్న తాత్వికసందేశాలనిస్తాయి. వస్తువు ఒకటే అయినా మాటల కుదింపు లోతైన ఊహలకి దారి తీస్తుంది. అందుకని వస్తు పునశ్చరణ అవసరమవుతుంది. మంచి కవులు ఈ పునశ్చరణ జాగ్రత్తగా వాడుకోగలరు.

రెండో పాత్ర సంకలనంలో కవిత, తొలి అడుగు (డిసెంబర్ 2008) చూడండి:

పార్టీ సంరంభంలో ఎవరో
అప్పుడే నడకనేర్చుకున్న పసిపాపని
ఆడుకోమని క్రిందకు దింపారు.

ఉబలాట పడే కాళ్ళతో
ఊగే మనసుతో ఆపాప
తల్లికీ, లోకానికీ మధ్య
లోలకంలా ఊగుతుంది.

ఒక అడుగు ముందుకు వేసి
మళ్ళీ వెనక్కి తీసుకునే ఈ పిల్ల
జనకాసారంలో దిగబోతూ
కాలితో లోతు చూస్తున్నట్టుగా ఉంటుంది.

అమ్మ, నాన్న కాని గుంపులోకి
వెళ్ళటానికి వెరుస్తున్న ఈ పాప
ద్వివచనంలోనుంచి బహువచనంలోకి మారటానికి
సందేహిస్తున్న సంస్కృతపదంలా వుంది.
…..

లోకం చూసి భయపడే ఈ పిల్లే
ఒక నాటికి
లోకమంటే ఏమిటో అమ్మానాన్నలకి
వివరించబోతుంది.

చెయ్యి విడవటానికి సందేహిస్తున్న ఈ అమ్మాయే
ఒకనాడు
ఒంటరితనపు గుయ్యారంలో వారిని వదిలి
చెయ్యి ఊపుతూ వెళ్ళి పోతుంది.

పాపమనసు అనే కవితతో ఈ కవితని పోల్చి చూడండి. ఒంటరిగా ఉండలేని ఈ పాప, చిలిపి పనులతో తల్లితండులకి ఆనందం కలిగించిన ఈ పాప, ఒంటరితనపు గుయ్యారంలోకి తలితండ్రులని వదిలి వెళ్ళి పోతుంది. ఇది ఒక వ్యక్తి జీవితసరణి. ఎంతో ఒడుపుగా ఒకానొకచోట కాస్త గడుసుగా అల్లిన పద్యం.

ఒక్కొక్కసారి అనిపిస్తుంది; కవి చరిత్ర – అంటే కవి బయాగ్రఫీ, ఆ కవి తన కవితలకు వేసిన తాళం తీయటానికి సహాయపడుతుందనుకుంటాను. అంతేకాకుండా ప్రతికవితలోనూ మాటలతో చెప్పలేనిదేదో విశేషం ఉంటుంది. సీరియస్ పాఠకులు ఆ విశేషలక్షణాన్ని వెతుక్కుంటూ ఆ కవితని పదేపదే చదువుతారు. ఆ విశేషం ఏమిటో చెప్పలేకపోతే కనీసం సూచనప్రాయంగా తన అనుభూతిని చెప్పగలగటం (నాబోటి) విమర్శకులు /సమీక్షకులు చేయవలసిన పని. ఆ సూచన కూడా సఫలీకృతం కాదేమోనన్న అనుమానం కలిగితే, పద్యం పూర్తిపాఠం ఇవ్వడం శ్రేయస్కరం. ఒక్కొక్కసారి, అంతర్గతవిశేషం కవిత అనే బోనులో ఇరుక్కొని ఉంటుందని అనుకుంటాను. అందుకని చాలా కవితలకి పూర్తిపాఠం ఇస్తున్నాను.

ప్రముఖ అమెరికన్ హైకూ కవి నిక్ వర్జీలియో (Nick Virgilio), హైకూలెందుకు రాస్తున్నావని అడిగితే “To get in touch with the real,” అని అన్నాడట! “మనచుట్టూ ఉన్న అనుభవిక ప్రపంచాన్ని ఆవిష్కరించటమే కవిత్వ లక్ష్యం,” అని ఇస్మాయిల్ గారు రాశారు. అయితే మన ప్రత్యక్షానుభవాలని, శబ్దాలతో, మాటలతో బందీ చేసి చెప్పగలమా? This is an eternal struggle, particularly for poets. అందుకనే కాబోలు, పద్యం అంటే ఏమిటో, పద్యం ఎలా ఉండాలో, పద్య రచనకి ప్రేరణ ఎక్కడినుంచి వస్తుందో, ఇలాంటి వివరాలన్నీ చెప్పటానికి కవులు పద్యాలు రాస్తున్నారు.

ఇస్మాయిల్ గారు 1979లో కవిత్వం అన్న కవితలో “Muse” ని వెతుక్కుంటూ “యోజనాలు నడిచిపోవడం” గురించి రాశారు. తరువాత 1983 లో పద్యసమాధి అనే కవిత రాశారు. అందులో “పద్యాన్ని లోతుగా తవ్వి/ ప్రేతపేటికని తెరిచాక/ ప్రతిసారీ అందులోంచి/ బ్రతికొచ్చే శవం తనే/” అని ముగించారు. కవికి అస్తిత్వం అతని కవిత్వమే తప్ప వేరేమీ కాదన్న భావం స్ఫురించే వాక్యాలు అవి.

వేసవి వాన, ముద్రణ 2002.
విన్నకోట రవిశంకర్
అన్ని బుక్‌షాపు‌లలో లభ్యం

రవిశంకర్ రెండవ సంకలనం వేసవి వానలో పద్యం పరంగా రెండు పద్యాలు, మూడో సంకలనం రెండోపాత్రలో మూడు పద్యాలూ రాశాడు. అవకాశం అన్న కవితలో తాను ‘Muse’ని వెతుక్కుంటూ రాసిన పద్యం ఇస్మాయిల్ గారు వేసిన బాట దాటి వచ్చింది. రవిశంకర్ ధోరణే వేరు! అసంపూర్ణ పద్యం రాసేటప్పటికీ రవి స్వంత గొంతు స్వచ్ఛంగా వినిపిస్తుంది. అది అతని పరిణితికి ఆనవాలు అని చెప్పచ్చు.

ముందుగా వేసవివాన సంకలనం నుంచి, పద్యం కోసం అన్న పద్యంలో కవి పద్యం కోసం పడవలసిన శ్రమ, అన్వేషణా విశ్లేషిస్తూ,

అప్పటివరకు వాడిన
సకలాలంకారాలన్నీ
స్వచ్చందంగా పరిత్యజించాలి

అని చెబుతూ ఉపమాలంకారాలని స్వేచ్చగా వాడతాడు.

కవిత్వం అన్న కవితలో,

ఎప్పటికో ఒక పద్యం
ఈ గాలం ఆలోచనకి ఆకర్షింపబడుతుంది.
ఏవో రెండు పదచిత్రాలు
ఈ గుడ్డి వలకు కళ్ళై మిలమిలలాడతాయి, అని చెబుతూ,

తాను లోబడి,
ప్రపంచాన్ని లోబరచుకొనే
విచిత్రసమ్మోహన రహస్యం
కవిత్వం, అని రొమాంటిక్ గా ముగిస్తాడు.

రెండో పాత్ర సంకలనంలో మూడు కవితలున్నాయి, పద్య పరంగా! అవి, అవకాశం (ఆగస్ట్ 2005), ఒకోసారి (మే 2004), అసంపూర్ణ పద్యం (ఆగస్ట్ 2005).

అవకాశం అన్న పద్యంలో,

గతస్మృతుల్ని చిత్రాలుగా
పద్యం ప్రదర్శిస్తూనే ఉంటుంది.
ఒక్క క్షణం అడుగు బయట పెడితే
తలుపులు మరలా తెరుచుకోవు.
….

రూపొందుతున్నంతసేపు
మట్టిలా మెత్తగా ఉండే పద్యం
అలక్ష్యంతో ఆలస్యం చేస్తే
రాయిగా మారిపోతుంది.
…..

సగమే గుర్తున్న కలలా
ఒక అసంపూర్ణపద్యం
ఎప్పటికీ అసంపూర్తిగానే మిగిలిపోతుంది, అని muse చేస్తాడు.

ఒకోసారి అన్న ఖండికలో తనకి, పద్యం ఎందుకు రాయాలని ఉండదో చెపుతున్నాడు.

అసంపూర్ణ పద్యాన్ని మోస్తున్నంతసేపూ
ఆందోళనగానే ఉంటుంది.
పల్లెటూళ్ళో ప్రసవవేదన పడుతున్న స్త్రీని
బండిలో వేసు కొని బయల్దేరినట్టుగా ఉంటుంది.
…..

పొడిపొడి మాటలు చాలవు
పరిచితదృశ్యాలు పనికి రావు
తెలియని అడవిదారులవెంట
తెలవారేదాకా సాగే అన్వేషణకి మళ్ళీ
తెరతీయాలని ఉందదు.

పద్యం రాయాలని ఉండదు, అని ముగిస్తాడు.

ఆఖరిగా, అసంపూర్ణ పద్యం అన్న ఖండికలో

రహస్యంగా నన్ను పిలిచి
మన్నించిన పద్యం
గుహతలుపు ఇప్పుడు మూసుకొపోయింది.
తలుపుతెరిచే మంత్రం
మరిచిపోయాను.
…..

కళ్ళు నిలిపినంతసేపు
కన్నియలా నర్తించిన పద్యం
కాలుతగిలి రాయిగా మారిపోయింది
ఈ శిలకిప్పుడు ప్రాణం పోయలేను.
….

అలజడి ఉన్నప్పుడే పద్యం పూర్తికావాలి
ప్రతిరూపంతిరిగి ఏర్పడిందంటే
ఇక, పద్యం పూర్తికాదన్నట్టే…

ఈ కవితలన్నింటిలోనూ ప్రతీకలు క్రొత్త పుంతలు తొక్కినాయి. మాటలతో ప్రత్యక్షానుభవాలని చెప్పలేం అన్న తాత్విక వ్యధ ఈ కవితలన్నింటికీ ప్రేరణ.

హైకూ కవులు, జెన్ తాత్వికులు చాలా తక్కువ మాటలు మాత్రమే వాడుతూ విశ్వసత్యాలని కవిత్వం ద్వారా ఆవిష్కరించడానికి సర్వదా ప్రయత్నిస్తున్నారు. అదే కోవకి చెందిన తెలుగు కవుల్లో ఆద్యులు, ముఖ్యులు ఇస్మాయిల్ గారు. ఆయన వేసిన బాటలో కవిత్వం రాస్తున్నవారు కొద్దిమంది ఉన్నారు. అయితే ఆయన పంథాని అధిగమించి తనదైన పంథా సృష్టించుకుంటూ పరిణతి చెందిన కవుల్లో చెప్పుకోదగ్గ కవి రవిశంకర్.

వేసవి వాన లో చెప్పుకోదగ్గ కవితలు: వేసవి వాన, తోడు, సంగమం, ఆఖరిక్షణం మళ్ళీ చదవాలనిపించే మంచి కవితలు.

మూడో సంకలనం, రెండో పాత్ర. ఇందులో ఇంకా ఎన్నో చక్కని చిక్కని కవితలున్నాయి. రవిశంకర్ తనదైన సొంత గొంతుకతో ఆలపించిన కవితలు. వాటిలో కొన్నింటిని ముచ్చటించి ఈ సమీక్షని ముగిస్తాను.

ముందుగా ఒక విషయం చెప్పాలి. రవిశంకర్‌కి మూడు అంకె అంటే చాలా ఇష్టం కాబోలు! ఇంతవరకూ ప్రచురించిన మూడు సంకలనాలలోనూ మూడో కవితే సంకలనానికి పట్టపు పేరయ్యింది. కుండీలో మర్రిచెట్టు సంకలనంలో మూడో కవిత, కుండీలో మర్రిచెట్టు. వేసవివాన సంకలనంలో మూడో కవిత, వేసవి వాన. అట్లాగే, రెండోపాత్ర సంకలనంలో మూడో కవిత రెండో పాత్ర – ఇది కాకతాళీయమే కావచ్చు!

గొడుగు (జనవరి 2008)

ఎండ గాని, వాన గాని లేనప్పుడు కూడా
మా నాన్నగారు గొడుగు వేసుకొని నడిచే వారు.

ప్రకృతినుంచే కాదు, గొడుగు
మనుషులనుంచి కూడా కాపాడుతుంది
తెరిచిపట్టుకున్నంతసేపూ చుట్టి
ఒక నల్లటి ఏకాంతాన్ని నిర్మిస్తుంది.

మిలమిలలాడే ఊసల్ని బయట పెడుతూ
ఆత్మీయంగా నవ్వుతుంది.

కాళ్ళకింద నల్లటితివాచీలా పరుచుకున్న రోడ్డు
తలపై నల్లకలువలా విరిసిన గొడుగు
– నడిచినంతమేరా ఆయనతో
సంభాషించేవి.

నడకంటే ఆయనకెందుకంత ఇష్టమో
నాకిప్పుడర్థమౌతోంది.

ఆయన విడిచివెల్లిన గొడుగుని
బహుశా మేమెవరమూ తెరవం.
విప్పిచెప్పని ఆయన అంతరంగంలా
ఆ గొడుగు ముడుచుకొనే ఉంటుంది.

ఎప్పటికీ రాయని ఆత్మకథలా
మిగిలిపోతుంది.

రెండో పాత్ర – విన్నకోట రవిశంకర్
ముద్రణ 2010. వెల రూ. 15/- $5.
అన్ని బుక్‌షాపు‌లలో లేదా
రచయిత నుండి లభ్యం

ఈ పద్యానికి ఎన్నిరకాల వ్యాఖ్యానాలయినా ఇవ్వచ్చు. కొన్ని వ్యాఖ్యలు వింతగా కూడా కనపడవచ్చు. వాళ్ళ నాన్న గారు వదిలిపెట్టిన గొడుగు తెరవకపోవడానికి ఒక కారణం: ఆయనంటే విపరీతమైన గౌరవం, అభిమానం కావచ్చు. తెరిచిపట్టుకున్న గొడుగు నిర్మించే ‘నల్లని’ ఏకాంతం నప్పకపోవచ్చు. లేదా, ఆయన నడిచిన వీధిలో ఆయన నడిచిన పద్ధతిలోనే నడవడం కేవలం అనుకరణ అవుతుంది. కాబట్టి, గొడుగు పెట్టిన చోటే వదిలెయ్యడం భావ్యం కావచ్చు. మరోసారి చదివితే మరో అర్థం కూడా గోచరించవచ్చు.

ఈ పద్యం చదివిన తరువాత
“There are things
We live among
and to see them
Is to know ourselves,” అని జార్జ్ ఓపెన్ (George Oppen) రాసిన పద్యం ఎందుకనో గుర్తుకొచ్చింది.

మరొక మంచి పద్యం చేయూత (మార్చ్ 2005)

ఎంత సంగీతంతో కడిగితే
ఈ ఆత్మ దీపం
బాహ్యప్రపంచపు మసి వదిలి
మళ్ళీ తళ లాడుతుంది?

ఎన్నిస్వరాలతో మంత్రిస్తే
ఈ కోతిమనసు
ఏకాగ్రతతో
పాము పడగై నిలుస్తుంది?

అంతరంగపు చీకటిలో
అలమటిస్తున్నవాడికి
నీ వంతు సాయంగా
ఒక వెలుగు రెక్క తీసావు.

అపశబ్దాల అరణ్యంలో
దారితప్పిన వాడికి
నీ పాటతో
ఒక కాలి బాట వేసావు.

నీ ప్రయత్నం నువ్వు చేసావు.

నువ్వు ఎవరైతేనేం? అపశబ్దాల అరణ్యంలో దారి తప్పిన వాడికి కాలిబాట వేసి చేయూతనిచ్చిన మహానుభావుడివి. చాలా థాంక్స్. నువ్వంటే నాకు ఎనలేని గౌరవం; అయినా నా బాటలో నే పోతాను, అన్న అర్థం స్ఫురిస్తుంది.

రెండో పాత్ర (ఫిబ్రవరి 2003) అనే కవిత పూర్తి పాఠం చూడండి:

పాపను పడుకోబెట్టినపుడు
తనపై పరుచుకున్న నిద్రని
దుప్పటిలా తొలగించి వచ్చి
ఎప్పటిలా ఆమె తిరిగి పనిలో పడింది.

కళ్ళకి అక్కడక్కడ అంటుకొన్న కలని
కాసిని చన్నీళ్ళతో కడిగింది.
పాప చేతినుంచి విడిపించుకున్న తన అస్తిత్వాన్ని
తిరిగి నడుముకు చుట్టుకుంది.

పాప ఇల్లంతా పరిచిన దాని ప్రపంచాన్ని
ఒద్దికగా ఒకచోట చర్దింది.
ముడిపెట్టిన శిరోజాల్లాంటి తన ఆలోచనల్ని
సున్నితంగా విడిపించి పరుచుకుంది.

పాపచుట్టూ పరిభ్రమించిన
తన సర్వశక్తుల్నీ
తిరిగి తనవైపుకు తిప్పుకుంది.

పాప ఆకర్షణలో కరిగిపోయిన
తన ఆకర్షణల్ని
ఒకటొకటిగా తిరిగి సమకూర్చుకుంది.

పగలంతా పాలవాసన వెంట
పరుగులెత్తిన ఈమె
సగం రాత్రి వేళ పారిజాతమై పరిమళిస్తుంది.

ఈ మధ్య కాలంలో ఇంతకన్నా మంచి ప్రేమ కవిత చదివిన గుర్తు లేదు. ఇది చదివిన తరువాతే నేను ఈ సమీక్షకి రవిగాంచిన కవి అని పేరు పెట్టాను.

రవిశంకర్ రాజకీయ నినాద కవితలు రాయడు. అటువంటి కవితలంటే అతనికి అసహ్యం కూడాను. అయితే యజ్ఞం (డిసెంబర్ 2009) ఒక విషాద రాజకీయ కవిత.

ఏ చైనా తల్లి సన్నని వేళ్ళతో కూర్చిందో
ఇన్ని మాటలు నేర్చిన ఈ పరికరాన్ని.
…..

ఎన్ని దేశాల శ్రామికులు మండే కళ్ళతో అమర్చారో
ఈ జండా పై కలల నక్షత్రాన్ని.

తినేదెవరైతే ఏముంది?
ప్రతి బియ్యపుగింజ మీద
పండించిన వాడిపేరే ఉంటుంది.

ఏకొత్త వస్తువు తాకినా
అజ్ఞాత సృష్టికర్తల ఆనవాళ్ళు
తడితడిగా తగుల్తాయి.
సుదూరప్రాంతాల జీవన గాధలు
అంతరంగంలో వినబడతాయి.

వినియోగ మహాయజ్ఞంలో
వ్రేల్చిన సమిథలేవో
బూడిదరంగు పెదవుల్తో
పొడిపొడిగా నవ్వుతాయి.

ఈ కవితని వ్యాఖ్యానించడం పాఠకులని చులకన చేయడమేనని పిస్తుంది.

ఇవికాక ఈ సంకలనం లో నింగి-నేల, వాన పాట, నేలకురిసే వాన, శివరాత్రి, ఋతు సంధ్య చక్కని కవితలు. తప్పకుండా మిమ్మల్ని ఆలోచింపచేసే కవితలు. మీకు ఆహ్లాదం కలిగించే కవితలు.

నా పరిభాషలో మాటలు మన అవసరాన్నిబట్టి పూడ్చుకొనే చిన్న చిన్న గోతులు. మంచి కవుల చేతిలో ఆ మాటలు శూన్యత్వాన్ని పరిపూర్ణంగా చేస్తాయి. కవులు సరైన పదాలకోసం తహతహలాడతారు. కవిత్వం వంటవంటి ప్రక్రియ అయితే భవిష్యత్తులో కవితలకి ఒక రెసిపీల పుస్తకం రాయచ్చు. అయితే గొప్ప వంటకారులెవరూ పుస్తకాలు చదివి వంటకాలు చెయ్యరు. కొంతమంది కవుల కవితలు కొన్ని పాఠకులని తుదలేని ధ్యానం, దీర్ఘాలోచనలోకి, – endless reverie – లోకి తీసుకొపోతాయి. రవిశంకర్ ప్రచురించిన మూడో సంకలనం, రెండో పాత్ర లో కొన్ని కవితలు అట్లాంటివే!

సహచరి (మార్చ్ 2005) కవిత చూడండి:

అర్థ జీవితం గడిచాక
అర్థంతరంగా ఒక రోజు
కొత్త సహచరి ముంగిట్లో
కాలుపెడుతుంది.

ఆత్మ దీపం కోసం
గుడిగా వెలసిన దేహంలో
పేరు తెలియని పక్షి
గూడు పెడుతుంది.

రేపణ్ణించి
కాలం
రెండు మాత్రల మధ్య దూరంగా
కొలవబడుతుంది.

కడదాకా కలసి సాగాల్సిన
సుదీర్ఘ పాదయాత్ర
సరికొత్తగా ఇక్కడ మొదలౌతుంది.

ఈ పరామర్శ మొట్టమొదటి సంకలనంలో కుండీలో మర్రి చెట్టు అనే కవితతో మొదలు పెట్టాను. ఈ సంకలనంలో రంగు అన్న కవితతో ఇది ముగించడం సబబనిపిస్తోంది.

రంగు (అక్టొబర్ 2003)

ఏదో ఒక ఋతుబలహీనతకి లోబడి
వేరు పడుతుందే గాని,
పచ్చగా కలిసి ఉండటమే
చెట్టుకి హాయి.

అందుకే, రంగుమారిన మరుక్షణం నుంచి
రాల్చటం మొదలెడుతుంది.

కలవని రంగెపుడూ బరువౌతుంది.
(రాల్చలేని రంగు మరింత భారం)

అంతా ఒకేరంగైనప్పుడు
అంతగా ఇబ్బంది ఉండదు
ఎవరూ ఎదుట నిలబడి
వింతగా పరికించరు.

తన సహ
అచరుల మధ్య
తానూ ఒకటి.

పలురకాల పరిణతులతో
నింగిదాకా ఎదిగిన చెట్టుకి
రంగిచ్చే గుర్తింపుతో పనిలేదు.

మెల్లమెల్లగా ఆకులన్నీ రాల్చి
మళ్ళీ ఒకటయ్యే రోజుకోసం చూస్తుంది.
ఏనాటికైనా,
ఆకుపచ్చ మేఘంలా వచ్చే వసంతమే
దానికోరిక తీరుస్తుంది.

ప్రతిరోజూ మనం చూస్తున్నవి, చేస్తూన్నవి, అనుభవిస్తూన్నవీ మనం మామూలుగా వాడుకునే మాటల్లో పెట్టి నవీనమైన వెలుగులో రంగుల కవితల చిత్రాలు ఇచ్చాడు రవిశంకర్.