Comment navigation


15803

« 1 ... 1544 1545 1546 1547 1548 ... 1581 »

  1. తెలుగు సాహిత్యం లో విమర్శ గురించి Alok Vastav గారి అభిప్రాయం:

    11/06/2006 3:41 am

    వేలూరిగారూ, ఇప్పుడు నేను చెప్పబోయే విషయం మీకు తెలిసేవుంటుంది.ఐనా వుదహరిస్తాను.ఉమాకాంతంగారు గురజాడవారిని మద్రాసు నగరంలో కలిసినప్పుడు జయంతిరామయ్య మొదలైనవారి గ్రాంధికభాషా సమర్థనను ప్రస్తావిస్తూ అక్కిరాజుగారు గ్రాంధికభాషను సమర్ధించారు.ఐతే అందుకు సమాధానంగా గురజాడ “వారు పెద్దవారు అంచేత వారికి నా వాదన అర్థంకాలేదు.మీరు యువకులు మీకూ అర్థమవడంలేదు” అని చెప్పారు.వెనక్కి వచ్చిన ఉమాకాంతంగారు మరి యేమీ ఆలోచించక తమ గ్రంధాన్ని వ్యావహారికంలోనే రాసారు. ఉమాకాంతంగారి సున్నితత్వం కూడా కృష్ణశాస్త్రిగారంత సున్నితమే.

    తల్లికి బిడ్డడి మీద వున్నట్టుగానే కవులకు తాము రాసిన రాతల పట్ల మమకారం వుండడం అత్యంత సహజం.ఎవరైనా బిడ్డని అనాకారియని తిట్టితే తల్లికి ఖేదమవడంలో సహజత వుంది. గానీ ఎవరైనా బిడ్డని దుష్టుడని నింద వేస్తే తల్లి కోపగించక ఆరోపణలోని నిజానిజాలను విచారించుకోవాలి. బిడ్డ నిజంగానే దుష్టుడైతే ఆ ఆరోపణ జేసిన వ్యక్తికి కృతజ్ఞత తెలియజెప్పాలి. అంతేగానీ గుడ్డినమ్మికతో ఆరోపించిన వ్యక్తిని నిందించడమో, ఆ ఆరోపణను తృణీకరించడమో జేస్తే అది ఆత్మహత్యాసదృశమే. కట్టమంచివారు మొదటి చర్యకు పాల్పడితే, ఉమాకాంతం గారు రెండవదాన్ని జేసారు. అనగా కృతులలోని దుష్టాలను ఖండించారు. రూపాన్ని అవహేళన జేయడం నీచమేగానీ గుణ లోపాలను ఎత్తి చూపడం నేరం గాదు. అంచాత అక్కిరాజుపైని అక్కసు అర్థరహితం. అక్కిరాజుగారికి అర్ర్ద హృదయం కొరవడలేదుగానీ కవులకు అర్థజ్ఞానం కొరవడిందన్నది నిర్వివాదం.

  2. తెలుగు సాహిత్యం లో విమర్శ గురించి Rohiniprasad గారి అభిప్రాయం:

    11/05/2006 3:43 pm

    విమర్శల్లో తెగనాడినవి గుర్తున్నంతగా తక్కినవి గుర్తుండవేమో! తెలుగులో మంచి విమర్శలు చాలానే వెలువడ్డాయి. కాని వేలూరివారు చెప్పినట్టుగా కొన్ని విమర్శల ద్వారా రచన గురించే కాక విమర్శకుడి సంగతి కూడా మనకు తెలుస్తుంది.

    పాత సాహిత్యంలో “అమలినం” కాని శృంగారాన్ని పద్ధెనిమిదో శతాబ్దం నుంచీ విమర్శకులు ఈసడించుకోవడం కనిపిస్తుంది. ఆ తరవాతి కాలంలో కూడా ముద్దుపళనివంటివారి రచనలు తీవ్ర విమర్శకు లోనవడం గురించి ఆరుద్ర ప్రస్తావించారు. వాటిలో కొన్ని శృంగారాన్ని గురించిన స్త్రీల దృక్పథాన్ని తెలుపుతాయనీ, వాటిని తరవాతి కాలంలో అణచకుండా ఉన్నట్టయితే అదొక ఆధునిక స్త్రీవాద సాహిత్యానికి దారి తీసి ఉండగలదనీ ఆయన భావించారు.

    వ్యాసంలో ప్రస్తావించిన రచనలోనే కృష్ణశాస్త్రిగారు తనకన్నా సీనియర్లనూ, జూనియర్లనూ కూడా పేర్కొంటూ, విమర్శ కాకపోయినా సమీక్ష చేశారు. కె.వి.రమణారెడ్డి అనేకుల రచనలను వివరంగా విమర్శించారు. “ఋణ” దృక్పథంతో చేసిన విమర్శల్లో రాచమల్లు రామచంద్రారెడ్డిగారు దిగంబర కవులను గురించి రాసినది కూడా ఒకటి. త్రిపురనేని మధుసూదనరావు విశ్వనాథ రచనలను విశ్లేషించి మరీ చెండాడాడు.

    ఈ మధ్య ద్వానాశాస్త్రి తదితరులు విప్లవ, స్త్రీ వాద, దళితవాద, మైనారిటీ వాద రచనలను సహృదయతతో విమర్శ చేస్తున్నారు. ఇవి అంతగా గుర్తుండకపోవటానికి కారణం ఇవన్నీ దిన, వార, మాసపత్రికల్లో ఏదో ఒక మూల కాస్తకాస్తగా కనిపిస్తూ ఉండడమే. సాహిత్యానికే దిక్కులేని ఈ రోజుల్లో విమర్శలను పట్టించుకునేవారే తక్కువ.

    మంచి సాహిత్యాన్నిగాని, ఉన్న సాహిత్యంలో మంచినిగాని పరిచయం చేస్తే అది కూడా ఉపయోగకరమే. 1969లో నేను ఆంధ్రా యూనివర్సిటీలో చదువుతున్నప్పుడు వెల్చేరు నారాయణరావుగారు వెన్నెల రాత్రి వేళ హాస్టలు డాబామీద తిలక్ రాసిన అమృతం కురిసిన రాత్రి కవితను విద్యార్థులకు చదివి వినిపించడం గుర్తుంది.

    విమర్శకులూ, సమీక్షకులూ సామాన్య పాఠకులకన్నా కాస్త లోతుగా పరిశీలించి, రచనలను గురించి వ్యాఖ్యానం చేస్తారు కనక సాహిత్యాభిమానులకు అది ఉపయోగపడుతుంది. అయితే వారికి కూడా తప్పనిసరిగా కొన్ని పరిమితులుంటాయి. వేలూరివారి వ్యాసంవల్ల నాకు అర్థమయినదిదే.

  3. తెలుగు సాహిత్యం లో విమర్శ గురించి Veluri Venkateswara Rao గారి అభిప్రాయం:

    11/05/2006 11:08 am

    Alok Vastav గారు కృష్ణశాస్త్రి గారి మూల వ్యాసం చదివి ఉంటే, ఉమాపతి గారి గురించి నేను అన్నమాటలకి అక్షేపణ చేసేవారు కాదనుకొంటాను.

    కృష్ణశాస్త్రి గారి “పాతిక సంవత్సరాల తెలుగు కవిత్వము” అన్న 1948 భారతి పత్రికలోని వ్యాసం 1923 నుంచి 1948 వరకూ వచ్చిన కవిత్వంపై, నాటి కవితా ఉద్యమాలపై చక్కని విమర్శనా వ్యాసం అని నిస్సంశయంగా చెప్పవచ్చు.

    ఓరియంట్ లాంగ్మన్ వారు 1993 లో ప్రచురించిన “అప్పుడే పుట్టి ఉంటే” అన్న కృష్ణశాస్త్రి గారి వ్యాస సంపుటి లో ఈ వ్యాసం తిరిగి అచ్చయ్యింది. 1/8 డెమీ సైజులో 34 పేజీల సుదీర్ఘ వ్యాసం ఇది. ఆ వ్యాసంనుంచి ఈ కింది వాక్యాలు (చూ: 29 వ పేజీ):

    “… కృష్ణపక్షం ప్రచురించాను. స్ఫుటంగా నా మనస్సులో నాటుకొపోయిన మరి రెండు మూడు ఘట్టాలు ఉన్నాయి. 1925 లో నేమో అక్కిరాజు ఉమాకాంతం గారు వ్రాసిన “నేటి కాలపు కవిత్వము” అనే గ్రంథం వచ్చింది. ఆశనిపాతమంత తీవ్రధాటితో వచ్చింది. రాకేం జేస్తుంది? ఎప్పుడయితే నిజమైన ఒక ఉద్యమం బయలుదేరిందో, అప్పుడే దాని గుణదోషవిమర్శన కూడా వస్తుంది. ఆయన తీవ్ర విమర్శననుంచి నావంటి కవులు నేర్చుకోవలసినది లేకపోనూ లేదు; కాని కొంత ఆర్ద్ర దృష్టితో కవితాహృదయముతో ఆ విమర్శన సాగితే, నేటికాలపు కవిత్వంలో వారు చక్కదనమూ కవిత్వగుణమూ గ్రహించి ఉండేవారు. ఊపిరాడనీయనంత కోపంతో ఆ గ్రంథం దాడిచేసినట్లనిపించింది నావంటి వారికి. దానికి జవాబు వ్రాద్దామా అన్నారు కొందరు మిత్రులు. ఏమి జవాబు మేము వ్రాయగలం? కొత్త పద్యాలు వ్రాయడమే జవాబనిపించింది. వ్రాయకుండా ఎలాగుండగలం? ఈ సంకల్పం 1925 లో మదరాసులో మరీ దృఢపడింది.”

    ఆర్ద్ర దృష్టి, కవితా హృదయము ఉమాకాంతపండితులకు లోపించిందని ఇంతకన్నా మృదువుగా, కృష్ణశాస్త్రిగారి కన్నా చక్కగా ఇంకెవరు చెప్పగలరు?

    అభివాదాలతో,

    వేలూరి వేంకటేశ్వర రావు.

  4. రచయితలకు సూచనలు గురించి swarup krishna గారి అభిప్రాయం:

    11/05/2006 9:04 am

    మీ మాగజైను చాలా బాగున్నది. మీ కృషి ఫలించాలనీ ఆశిస్తూ

  5. తెలుగు సాహిత్యం లో విమర్శ గురించి Ananth B. Shastry గారి అభిప్రాయం:

    11/05/2006 8:41 am

    మీ వ్యాసం కాస్త ఓపిగ్గా చదవ వలసి వచ్చింది.

    సుమారుగా 100 ఏళ్ళ క్రితం వ్రాసిన విమర్శ గురించి సోదాహరణంగా విపరీతంగా చర్చించారు. 40/50 ఏళ్ళ క్రితం వ్రాయబడ్డ (నాకు ఉమాకాంతం గారు ఏ సంవత్సరంలో వ్రాసారో గుర్తులేదు) విమర్శ గురించి ఒక్క ముక్క చెప్పి, దానిపై మీ అభిప్రాయం వ్రాసారు. ప్రస్తుత విమర్శనా ధోరణి పై మీ అభిప్రాయాల్ని వెలిబుచ్చారు. అంత వరకూ బాగుంది. కాని, కొత్త విమర్శలకు ఉదారణలు ఇచ్చి ఉండవలసింది. కనీసం నలుగురి పేర్లు, వారి రచనల పేర్లిచ్చినా బాగుండేది.

    విమర్శ ఎలా ఉండకూడదో చెప్పారు బాగానే ఉంది. ఎలా ఉండాలో చెప్పే విమర్శలు తెలుగులో లేవనుకోవాలా? అనే సంశయాన్ని కలిగించారు. మంచి విమర్శల గురించి కనీస ప్రస్తావన చేస్తే బాగుండేది.

    వ్యాసంలో ఋణ విద్యుచ్ఛక్తి దండిగా ఉంది. మీ ఆశయం దాన్ని చదువరులకు తెలియజెప్పడం కాదు గదా! వారి దృష్టి ధనాత్మకత వైపు మళ్ళించడానికి అది ఒక వేదిక మాత్రమే.

    ఇది ఒక సాహితీ సభలో కీలకోపన్యాసంగా ఇవ్వబడిందని చెప్పుకున్నారు గాబట్టి ఒక మనవి. కీలకోపన్యాసాలు ఋణాత్మకంగా మొదలవడంలో తప్పులేదుగాని, ఉపన్యాసం పూర్తయేసరికి ధనాత్మకత హృదయాల్లో ప్రతిష్ఠించాలి. ఈ వ్యాసం ఆ పని చెయ్యగలదని అనిపించలేదు నాకు.

    పైన చెప్పిందంతా కేవలం నాకొక్కడికే అనిపిస్తే అది నాలోపమే.

    విధేయుడు
    అనంత్

  6. అన్నీ చెప్పగల భాష గురించి Sowmya గారి అభిప్రాయం:

    11/04/2006 11:23 pm

    బాగుందండీ.

  7. గణపతి బప్పా మోరియా! గురించి suseela subbarao గారి అభిప్రాయం:

    11/04/2006 8:43 pm

    దేవుడు అనే పదానికి సరి ఐన నిర్వఛనం హాస్యపూరితంగా, సునిసితంగా ఇచ్చిన ఈకథ ముచ్చటగా వుంది. చాలా రోజుల తరువాత సావిత్రిగారి కలం నుంచి ఒక మంచి కథ వెలువడింది.

  8. తెలుగు సాహిత్యం లో విమర్శ గురించి Alok Vastav గారి అభిప్రాయం:

    11/04/2006 12:07 pm

    అక్కిరాజు ఉమాకాంతం గారిది హద్దుమీరిన అవహేళన అన్న మీ మాటలు అంతగా నచ్చలేదు. యే కొంచెం సూటిగావున్నా అది హద్దులు మీరిందనా కొలబద్ద? కట్టమంచివారికంటే అక్కిరాజుగారిలో నాకు నిజాయితీ, ఆవేదనా కనపడుతుంది. శ్రీశ్రీ మాటల బట్టి జూస్తే కవులకు అక్కిరాజుగారి పాండిత్య భయమేగానీ ఆయన ఆవేదన కనబడలేదులా వుంది. అంటే ఆయా కవులకి కవిత్వవీరత్వం, పాండిత్యభీరుత్వమని తీర్మానించవొచ్చుగదా! లేదూ ఆయన చేత విమర్శింపబడ్డవారందరూ కవిపండితులే అనుకొంటే ఆయన విమర్శలని దీటుగా ఎదుర్కొంటూ యేల గ్రంధాలు, వ్యాసాలు వెలయించలేదు? “ఆ మహాపండితుడి ఆక్షేపణలకు సమాధానమ ఎవరేం చెప్పగలరు? మరింత ఉత్సాహంతో, పట్టుదలతో నవ్యకవితారీతులను ప్రచారం చేయడమే ఆయనకు చెప్పగల సమాధానమని మేమనుకొన్నాం” అని కృష్ణశాస్త్రిగారు భారతి రజతోత్సవ సంచికలో రాసినట్టు శ్రీ పేర్వారం జగన్నాధం గారు రాసారు. “మేమనుకొన్నాం” అన్న పదం నాకెందుకో “మూక మనస్తత్త్వా”న్ని గుర్తుకుతెచ్చింది.వొక్క పండితుడి “అవహేళన”కి మూక ప్రచారం స్థాయిలో సమాధానమివ్వాలని అంతమంది కలిసి తీర్మానించడమే సాక్షి అక్కిరాజుగారిది అవహేళనతో కూడిన విమర్శ కాదని. సంపూర్ణంగా భారతీయతత్వ చింతనతో విమర్శించిన అక్కిరాజుగారిని కట్టమంచివారి సరసన కట్టివేయడం మనసుకి కష్టంగా వుంది.

  9. బస్సెడు దూరం గురించి neeharika గారి అభిప్రాయం:

    11/04/2006 9:43 am

    బాగా రాసావు. అనట్టు ఒక చిన్న సందేహమొచ్చింది: ఏదైనా పెళ్ళికి వెళ్ళినప్పుడు మొదలయిందా ఈ కథ కు అంకురం?

  10. బస్సెడు దూరం గురించి Ashish.R.Katta గారి అభిప్రాయం:

    11/04/2006 3:56 am

    మనసులోని భావాలను సిరా చేసి కాగితం పై నింపితే కవితలు ఉద్భవిస్తయి
    సంఘటనలల జీవితాన్ని కాగితం పై పెట్టి కనికట్టు చెస్తే ఒక మంచి కధ జనిస్తుంది
    దాంట్లో శివం లంటి పాత్ర ఊపిరి పొసుకుంటుంది
    పేజీ చివరన వ్రాసిందెవరని చూస్తే తెలుగు భాష కి కొత్త ఊపిరి పోస్తున్న ఒక నవకిరణం నామం కనిపిస్తుంది

« 1 ... 1544 1545 1546 1547 1548 ... 1581 »