Comment navigation


15815

« 1 ... 1518 1519 1520 1521 1522 ... 1582 »

  1. ది బీచ్ గురించి Kameswara Rao గారి అభిప్రాయం:

    03/15/2007 10:18 am

    కథ చాలా బాగుంది. ఏ ఎక్స్ట్రాలకీ పోకుండా చాలా సున్నితమైన విషయాన్ని, చాలా లోతైన విషయాన్ని, అంత సున్నితంగానూ, అంత లోతుగానూ చెప్పిన కథ!

  2. చాదస్తం గురించి Kameswara Rao గారి అభిప్రాయం:

    03/15/2007 9:45 am

    రవికిరణ్ గారన్నట్టు, కథలో ఆవిడ పాత్ర బాగానే ఎస్టాబ్లిష్ అయ్యింది. కాకపోతే అది two-dimensional అయ్యి కూచుంది. ఎంతసేపూ తన ఆలోచనలే తప్ప ఎదుటివాళ్ళ అభిప్రాయాలగురించి ఆలోచించే అలవాటు బొత్తిగా కనిపించదు.

    ఉదాహరణకి “నీ భర్త నిన్ను అర్థం చేసుకున్నంత వరకూ, ఎవరూ మీ స్నేహం గురించి ఏమనుకున్నా లెక్క లేదులే” అని ఇంకొకావిడ అన్నప్పుడు భర్త తనుచేసే ప్రతి స్నేహాన్ని ఆమోదించితీరాలన్న ఆలోచనే తప్ప, అతనికీ స్వంత అభిప్రాయాలు ఉండవచ్చునని గాని, జీవిత భాగస్వామిగా తన స్నేహాలతో అతనికి ప్రమేయం ఉంటుందన్న ఆలోచనగానీ లేకపోయింది.

    “మా ఆయన కర్థం అయ్యే స్నేహాలు మాత్రమే నేను చెయ్యాలట!” – అని ఆ ఇంకొకావిడ అనలేదే!

    “అతని కర్థం కాకపోతే అది అతని చేతకానితనం అవుతుంది గానీ, నా స్నేహం తప్పెందుకవుతుందీ?” – అతనికర్థం కానంత మాత్రాన తన స్నేహం తప్పవుతుందని ఎవరన్నారు? అతనికి అర్థం కాకపోయినంత మాత్రాన అది అతని చాతకాని తనమూ కాదు.

    “అయినా భర్త దయాదాక్షిణ్యాల మీదా, అతను విషయాలనర్థం చేసుకునే చాకచక్యం మీదా ఆధారపడి లేవు నా స్నేహాలు.” – ఆవిడ జీవితం భర్తతో ముడుపడి ఉనప్పుడు, అతని ఇష్టాయిష్టాలు అసలు ఖాతరే చెయ్యననుకోవడం ఆవిడ అహంభావమే కాని ఆత్మోన్నతి అనిపించుకోదు.

    పెళ్ళి భారీగా చేసుకోకూడదన్నది ఆవిడ స్వంత అభిప్రాయం. అది తన స్నేహితుడిమీద రుద్దడానికి తాపత్రయ పడిన ఆవిడ, ఒకవేళ తన స్నేహం తన జీవితభాగస్వామికి ఇష్టం లేకపోతే దానిగురించి ఆలోచించాలన్న సహనం కూడాచూపలేదు!

    ఆవిడ వ్యక్తిత్వమే ఈ కథ శీర్షికకి సరిగ్గా సరిపోతోంది!

  3. ఇద్దరు దుర్మార్గులు గురించి Kameswara Rao గారి అభిప్రాయం:

    03/15/2007 8:55 am

    ప్రసాద్ గారూ,

    చలం మీ అభిమాన రచయితా?:-)

    ఈ కథలో ఉన్న పాత్రలని ఒక మూసలోకి (మంచి పాత్రలు, చెడ్డ పాత్రలుగా) తెచ్చే ప్రయత్నం కథలో కన్నా మీ విమర్శలోనే ఎక్కువగా కనబడుతోంది. శృంగార జీవితంలో యాంత్రికత చోటుచేసుకుని, అది తొలగించుకోవడం చాత కాక తిప్పలు పడే పాత్ర మోహన్ ది. ఆ పాత్రకి అంతకంటే లేబుల్సు తగిలించడం సబబు కాదు. కథ ఈ పాత్ర చుట్టూనే తిరిగింది. ఈ పాత్రకి ఉదాత్తత ఆపాదించే ప్రయత్నం నాకెక్కడా కనపడలేదు.

    జీవితంలో తప్పుదోవ పట్టి, అది వదలడం చాత కాక దానితో రాజీ పడిపోయిన పాత్ర గోపికది. ఈ పాత్రకీ ఉదాత్తత ఆపాదించే ప్రయత్నం కథలో నాకు కనపడలేదు. అలా తప్పుదోవలో నడుస్తున్న మనిషికి మంచి ఆలోచనలు కానీ, తెలివి కానీ ఉండదనుకోవడం ఆ పాత్రని ఒక మూసలో పొయ్యడమే.

    ఇక మోహన్ భార్య పాత్ర. నిజమే, ఈ పాత్రకి ప్రత్యేకమైన వ్యక్తిత్వం కనిపించదు. స్త్రీ వాదులకి చాలా అభ్యంతరకరమైన పాత్రే! ఐతే కథలో ప్రతి పాత్రకీ ఒక ప్రత్యేకమైన వ్యక్తిత్వం ఉండి తీరాలంటారా? ఒక సామాన్య వ్యక్తికి కథలో పాత్ర అయ్యే పాత్రత లేదంటారా? మరొక విషయం. కథ మొత్తం మోహన్ దృక్పథం నుండే చెప్పబడింది, నేరుగా అతని ద్వారా కాకపోయినా. కాబట్టి అతని భార్య పాత్రకి అంత కంటే ప్రాముఖ్యం కథలో ఇవ్వాల్సిన అవసరం లేదు.

    గోపిక నాలుగు మాటలు చెప్పేసరికి మోహన్ లో మర్పు వచ్చేయడం కొంత dramaticగా ఉన్నది వాస్తవమే. ఐతే అలా జరగడానికి అవకాశం బొత్తిగా లేకపోలేదు. దానికి కొంత వాతావరణం కథలో చూడవచ్చు.

    సారాంశమేమిటంటే, కథ నాకు నచ్చింది.

    ఐతే చివర్లో “ఆమె అర్థం చేసుకుంది. ముందు నవ్వింది.తరవాత చెప్పింది.” అన్న మాటలు అర్థం చేసుకోవడం కొంత కష్టంగా ఉంది. ఆమె ఏం అర్థం చేసుకుంది, ఎందుకు నవ్వింది అన్నది పాఠకుని ఊహకు వదలి వెయ్యడం గాలిలో దీపం పెట్టి పాఠకుడా కాపాడూ అనడంలా ఉంది! మోహన్ దీపలకి మధ్యకొంత సంభాషణ పెట్టి, దాని ద్వారా దీప పాత్ర వ్యక్తిత్వాన్నీ, మోహన్ ఆలోచనలో పరివర్తననీ చూపెట్టి ఉంటే మరింత నిండుగా ఉండేదేమో.

  4. ఇద్దరు దుర్మార్గులు గురించి kiran గారి అభిప్రాయం:

    03/14/2007 12:25 pm

    కధ కన్నా ప్రసాద్ గారి విశ్లేషన నాకు బాగా నచ్చింది. కథ లోని ప్రతి పాత్రయొక్క నిజస్వరూపాన్ని కల్లకు కట్టినట్లు వివరించిన ప్రసాద్ గారికి ధన్యవాదాలు.

    కిరణ్.

  5. రాఫెల్ గురించి P. Siva గారి అభిప్రాయం:

    03/14/2007 6:52 am

    ఆహ్లాదకరమయిన సాయంత్రంలా ఉంది కథ. అయితే మొదటి పేజీ కథకి బొత్తిగా అనవసరం. చెట్టును ట్రిమ్ చేసుకున్నట్టే కథనూ చేసుకోవాలి మరి.

  6. భయం! గురించి Vaidehi Sasidhar గారి అభిప్రాయం:

    03/12/2007 10:56 am

    ఆసక్తిగా చదివించిన కధ.ఇటువంటి చిన్న ఇతివృత్తం (plot) చుట్టూ అల్లిన కధలకి కొసమెరుపు ముఖ్యమైన ఆకర్షణ. అందుకనే చివర్లో ముగింపు పాఠకులకే వదిలేయట మే బాగుందనిపిస్తుంది. ఈ సంప్రదాయం మనకి యండమూరి (ఆ ఒక్కటీ అడక్కు) కి ముందునించీ ఉన్నదే కదా!!

  7. నామాట గురించి Anuradha గారి అభిప్రాయం:

    03/12/2007 2:52 am

    శ్రీవెంకటేశ్వరరావు గారి సంపాదకీయం చాలా ఆసక్తిదాయకం
    గా ఉంది.శ్రీ రోహిణీప్రసాద్ గారు, భావితరాలవారు సంస్కార
    పరంగా ఆటవిక దశకు చేరుకోకుండా చూడవలసినది
    మనమేనని చెప్పి,ప్రతి వ్యక్తికీ సమాజం పట్లగల బాధ్యతను
    గుర్తు చేశారు. సమాజ ప్రాధాన్యత తగ్గి వ్యక్తి ప్రాధాన్యత
    పెరుగుతున్నఈ కాలంలో క్రమేణా అభిరుచుల స్థాయి
    దిగజారుతోంది. పాశవిక ప్రవృత్తులను ప్రేరేపించే చవకబారు
    సంగీత,సాహిత్య,నృత్యాలకు ఎక్కువ ఆదరణ లభిస్తోంది.
    ఇలాంటి పరిస్థితుల్లో ఉదాత్తమైన,ఉన్నతమైన కళా సృష్టిని
    ప్రోత్సాహపరిచే కార్యక్రమాల అవసరం ఎంతైనా ఉంది.
    అనూరాధ

  8. భయం! గురించి Rao Vemuri గారి అభిప్రాయం:

    03/09/2007 7:00 pm

    కొత్తపాళీ గారు అడిగిన విషయాల వివరణ.
    సంపాదకుల దయవల్ల “అభయారణ్యంలో ఏంబరు” కథకి ఇచ్చిన లంకె ఇప్పుడు పనిచేస్తోంది.

    చత్వారీ వాక్పథం అంటారా. వాక్కు మనందరికీ తెలుసున్నదే. పథం కూడా తెలుసున్నదే. ఆధునిక పరిభాషలో వాక్పథం అంటే ommunication channel. చతుర్ అంటే నాలుగు కనుక ఇది four fold communication channel. త్వం చత్వారీ వాక్పథానీ.. అని గణపతిని కీర్తిస్తాము కదా. ఇంతకీ ఏమిటీ నాలుగు వాక్పథాలూను? “పర, పశ్యంతి, మధ్యమ, వైఖరి.” వైఖరి అంటే నోటితో మాట్లాడే communication. మధ్యమ అంటే ఆలోచించేటప్పుడు మన శ్రవణయంత్రాంగానికి వినిపించేది. పశ్యంతి అంటే intuition. పర అంటే ఏమిటో నాకు నిక్కచ్చిగా తెలియదు. మరొకరు చెప్పగా విన్నదేమో. Communicate చెయ్యటానికి శబ్దం ఒక మార్గం; ఇంకా వేరే మార్గాలు ఉన్నాయన్నది ఉపనిషద్వాక్యం.

    ఇప్పుడు మళ్ళా చదివి చూడండి.

    ఈ కథలో foot notes పెట్టి చెప్పాలంటే ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. మరొక సందర్భంలో వాటిని చూద్దాం.

  9. సీతా-రామా గురించి ravikiran timmireddy గారి అభిప్రాయం:

    03/09/2007 6:59 pm

    J.U.B.V. ప్రసాద్,

    ఇద్దరు దుర్మార్గులు మీద మీ విమర్శ చాలా పదునుగానూ, నిజానికి చాలా దగ్గరగానూ, ఆలోచింపజేసేదిగానూ వుంది. సీతా-రామా, ఇది నా మొదటి కథ. చాలా లోపాలే వుండొచ్చు. ఇది మీ చేతిలో చీల్చి చెండాడబడటం వొక గొప్ప learning experience గా భావిస్తాను. దయచేసి నా కథ సీతా-రామ ని మీ విమర్శతో గౌరవిస్తారా.

    రవికిరణ్ తిమ్మిరెడ్డి

  10. ఇద్దరు దుర్మార్గులు గురించి JUBV PRASAD గారి అభిప్రాయం:

    03/09/2007 6:19 pm

    ఈ కధ రాసిన రచయితని గానీ, దాన్ని ఇష్టపడ్డ పాఠకులని గానీ నొప్పించకుండా అభిప్రాయం రాయాలని నా తాపత్రయం. ఈ ప్రయత్నంలో సఫలీకృతుణ్ణి కాలేకపోతే, మన్నించమని రచయితకీ, ఇష్టపడ్డ పాఠకులకీ మనవి. ఈ అభిప్రాయంలో వున్న వ్యంగ్యం, వెటకారం ఈ కధలోని పాత్రలకి మాత్రమే అని గమనించండి.
    ఈ కధలో మూడు పాత్రలున్నాయి. ఒక “వేశ్య”, ఒక “విటుడు”, ఒక “గృహిణి”. “విటుడు” రసికత కోసమో, మరో “అనిర్వచనీయమైన ఆనందం” కోసమో (నిజానికి ఇటువంటి అనిర్వచనీయాలు ఏవీ వుండవు. పరాయి ఆడవాళ్ళ దగ్గర మగాళ్ళకి దొరికే ఆనందమే ఇది. దీనికి ఎంత భావుకత వున్న పేర్లు పెట్టుకున్నా, అసలు విషయం ఇదే! ఇది మగవారిని “గర్వ” పడేట్టు చేసే విషయమే!) “వేశ్య” దగ్గరకి వెళుతూ వుంటాడు. ఎటొచ్చీ తను తప్పు చేస్తున్నాడని మాత్రం తెగ ఒప్పేసుకుంటూ, ఆ విధంగా తెగ ఆలోచించేస్తూ, ఒక్కో రాత్రికీ ఐదు వేలు ఖర్చు పెడుతూ, కాసింత గిల్టీ కాన్షస్‌తో “పెద్దమనిషి”లా చలామణీ అయిపోతూ వుంటాడు. అలా ఒకరోజు ఆ “వేశ్య” దగ్గరకి వెళితే, ఆవిడ తన “వుదాత్తత”తో “మీరు మీ భార్య గురించి తెలుసుకోండీ” అని “నాలుగు మంచి మాటలు” చెప్తుంది. ఈ మనిషి ఇంటికి పోయి (అడ్డమైన తిరుగుళ్ళూ తిరిగి, తిండి కోసం ఇంటికి చేరిన పక్షి, కనీసం స్నానం అయినా చేసి చచ్చాడో, లేదో, పాడు!), “నీకు ఏ అష్ట పదంటే చాలా ఇష్టం” అని అడిగి, ఇంకా ఏవేవో మాట్టేడేసి, (అన్నీ ఒక్క రాత్రిలోనే) “అనిర్వచనీయ మైన ఆనందా”న్ని పొందేస్తాడు. ఇదే “అనిర్వచనీయమైన ఆనందం” అంతకు ముందు ఆ “వేశ్య” దగ్గర ఒక్క మాట కూడా మాట్టాడకుండా పొందుతాడు. అప్పటి నించీ ఆ “వేశ్య” దగ్గరకి భార్యాభర్తలిద్దరూ కలిసి వెళుతూ వుంటారు స్నేహంగా!
    ఈ కధలో ముఖ్యంగా వళ్ళు మండించే పాత్ర “గృహిణి”. ఈవిడ పేరు దీప. ఈవిడ డాక్టరంట కూడా. ప్రేమ వివాహం కాదు కాబట్టి, శ్రోత్రియ కుటుంబం నించే వచ్చిందనుకోవాలి. ఈవిడకి వెన్నెముక అనేదే వుండదు. డాక్టరెలా అయిందో “పైవాడి”కే తెలియాలి. పతివ్రతల కోవలో పుట్టిన మనిషి ఈవిడ. శిధిలాలలో తప్ప మామూలుగా దొరకరు ఇలాంటివాళ్ళు. అయినా ఇలాంటి వాళ్ళు చెడు తిరుగుళ్ళు తిరిగే మగాళ్ళ పాలిట దేవతలు లెండి. భర్త “వ్యభిచారం” గురించి తెలిసినా సరే, “ఇంట్లో వ్యభిచారం చెయ్యకపోతే చాలు” అనుకుంటుంది. అటువంటి కొంప, ఒక గుడి లాంటిదిట ఈవిడకి. ఎంత సిగ్గుమాలిన పాత్రో ఇది. బొత్తిగా సినిమాలా, టీవీలా, పుస్తకాలా జ్ఞానం ఏవీ వున్నట్టు లేదు అసలు. అదన్నా కాస్త ఏడిస్తే, భర్తల “వ్యభిచారానికి” భార్యలు కనీసం ఎలా ఎదురు తిరుగుతారో, ఎలా బాధ పడతారో తెలిసేది. “భర్త కోరినది” ఇచ్చేస్తూ వుంటుంది. ఇలాంటి పనికిమాలిన మనిషి, భర్త “వేశ్యని” ఇంటికి తెచ్చుకుంటే ఏం చేస్తుందో! ఏమీ లేదు, వంటలు చేసి, వాళ్ళకి సరఫరా చేస్తూ వుంటుంది ఈ డాక్టరు. అదేగా మరి “భర్త కోరేది” అప్పుడు. డాక్టరు చదువులూ, ఇంజినీరింగు చదువులూ జీవితంలో ఎందుకూ పనికి రావు అనే నగ్న సత్యాన్ని ఈ కధ చక్కగా చూపిస్తుంది. భర్త “వ్యభిచారం” మానేశాక, ఈ సిగ్గులేని మనిషి ఆ “వేశ్య”తో స్నేహానికి భర్తతో కలిసి వెళుతూ వుంటుంది.
    జీవితంలో ఇలాంటి పాత్రలూ, పరిస్థితులూ ఆడవాళ్ళకే వుంటాయి. వాళ్ళంటే నోర్మూసుకు పడుంటారు, డాక్టర్లయినా సరే. డాక్టర్ దీపగారే బయట వేరే మగాడితో “అనిర్వచనీయమైన ఆనందాన్ని” పొందుతూ వుండి, ఆ తరువాత ఆ బయట మగాడి “మంచి మాటల” వల్ల తిరిగి భర్తని, “ఎల్లారీశ్వరి పాటల్లో నీకే పాటంటే ఇష్టం” అని అడిగి, అతన్ని దగ్గరకు తీసుకుంటే, ఆ భర్త ఇలాగే భరించి, ఆ బయట మగాడితో స్నేహం చేస్తాడా? స్త్రీల గౌరవం గురించి మాట్టాడే వాళ్ళు, ఇలాంటి పాత్రల గురించి చదివి, ఎలా భరిస్తారో నాకు అర్థం కాదు.
    ఇంక “వేశ్య” పాత్ర గురించి. ఈ అమ్మాయి పేరు గోపిక. చాలా వుదాత్తమైన “వేశ్య”. ఇంజనీరింగు చదివే అమ్మాయిని, ఒక ఎమ్మెల్లే కొడుకు ప్రేమించి, సినిమాల్లో హీరోయిన్ చేస్తానని చెప్పి, వేరే వూరు తీసుకు వచ్చి, పెళ్ళి చేసుకుని కాపురం పెడతాడు. పెళ్ళయిపోతే హీరోయిన్ ఎలా అవుతుందో ఈ రోజుల్లో! ఏదో ఒకటి లెండి. ఏవో పాత కక్షల కొద్దీ ఎవరో ఆ అబ్బాయిని చంపేస్తారు. ఇక ఇంజనీరింగు చదువు వెలగ బెట్టిన ఈ గోపిక, కుట్టు పనీ, చిప్స్ అమ్మడం లాంటి పనుల కన్నా “వ్యభిచారం” గొప్పదని తేల్చేసుకుంటుంది. ఒక్కసారికి ఐదు వేలంట. వేరే గతి లేక గానీ, పురుష దౌర్జన్యాలతో గానీ, వేరే దౌర్భాగ్యుల వల్ల గానీ, “వ్యభిచారం” లోకి దిగిన స్త్రీలు ఎన్నో అవస్థలు పడుతూ వుంటారు. ఇంకేదన్నా గతి దొరికితే అటువంటి మురికి లోంచీ బయటకి వచ్చేద్దామని చూస్తూ వుంటారు. ఇంజినీరింగు చదువుతున్న గోపికకి తొందరగా ఎక్కువ డబ్బు సంపాదించడానికి ఇదొక్క మార్గమే కనబడుతుంది మరి. “వళ్ళు బలిసి, డబ్బాశ కొద్దీ ఆ చెత్త పని మొదలెట్టిందంటారే” గానీ, “తప్పని పరిస్థితుల్లో కాదు”. ఒక్కసారికి ఐదువేలు సంపాదించే ఈ పాత్రకి బోలెడంత వుదాత్తత. వంట కూడా తనే చేసేస్తూ వుంటుంది “విటులకి” పెట్టడానికి. సంఘ భయం, బ్రోకర్ల భయం, పోలీసుల భయం, గట్రా బొత్తిగా లేవు ఈ పాత్రకి. ఇలాంటి పాత్రని చూస్తే ఎంత చీదర పుడుతుందో! చివర్లో “విటుడికి” నాలుగు “మంచి మాటలు” చెప్పేసి, అతని భార్యతో అతన్ని కలిపేస్తుందీవిడ. తర్వాత, వాళ్ళ స్నేహితురాలయి కూర్చుంటుందీవిడ. డ్రామా విషయంలో సినిమాని దాటి ఎక్కడికో వెళ్ళి పోయిందీ విషయం.
    ఆఖరుగా “విటుడి” పాత్ర చూద్దాం. ఇష్టమైన అష్టపది గురించీ, అలాంటివే ఇంకేవో ప్రశ్నలడిగేసి, తన “అనిర్వచనీయమైన ఆనందాన్ని” ఇంట్లోనే పొందచ్చని తెలియక, బోలెడన్ని “ఐదువేలు” తగలేసుకుంటాడు. అలా అని ఆ “వేశ్య”ని ఏమన్నా గౌరవిస్తాడా? అదీ లేదు వీడికి. ఐదు వేలు తీసుకుంటుందని మొదటి నించీ ఏడుపే. ఆ తరువాత తన అవసరం తీరాక “అసహ్యం” వేస్తుంది వీడికి. మరి ప్రేమ లేని చోట ఇంకేం వేస్తుంది అవసరం తీరగానే? అసలా “అసహ్యం” తన మీద తనకే వెయ్యాలి. “నీ భార్య కూడా నీలాగే వ్యభిచారం చేస్తే వూరుకుంటావా?” అని ఎవరైనా వీడిని మొహం మీదే అడగాలి. ఒక వెధవ పని చేస్తూ, అది చేస్తున్నానని ఒప్పుకుంటే అది వుదాత్తంగా అయిపోతుందా? చేసే పని తప్పు అని తెలియని వాళ్ళని ఏమన్నా కాస్త క్షమించవచ్చేమో గానీ, ఇలాటి అతి తెలివి గల మనుషులనా? ఇలాంటి మనుషులకి కొన్నాళ్ళకి తమ “అనిర్వచనీయమైన ఆనందం” భార్యల దగ్గర దొరకడం మానేస్తుంది. అప్పుడు మళ్ళీ కధ మొదలు. అప్పుడు ఈ నాలుగు “మంచిమాటలు” కూడా బొత్తిగా పని చేయవు.
    ఈ చెత్త పాత్రలు స్త్రీల గౌరవాన్నీ, సమాజంలో వున్న నిజమైన వుదాత్తతనీ పరిహసిస్తూ వుంటాయి.
    కాబట్టి, భార్యల దగ్గర “అనిర్వచనీయమైన ఆనందం” దొరకని మగవాళ్ళూ, మీరేం చెయ్యాలీ? వెంటనే “వేశ్యల” దగ్గరకి పరిగెత్తండి. మీరెళ్ళకపోతే, మీ కష్టాలు తీరవు మరి. మీ భార్యలు ఏమీ అనుకోరు లెండి. మీరు వెళ్ళే ఆ “వుదాత్తమ ఆడవాళ్ళి” మీకు నాలుగు “మంచి మాటలు” “చెప్పే విధం”గా చెప్తారని మీ భార్యలకి తెలుసు లెండి. చివర్లో మీరంతా ఇంచక్కా స్నేహితులయిపోవచ్చు కూడా!
    ఇలాంటి నెగిటివ్ కధల్లో ఆడవాళ్ళని అవమానించి, పురుష పెత్తనాన్ని పదిలం చేసే విషయాలు తప్ప, మంచి విషయం ఒక్కటుండదు!!
    “ఇద్దరు దుర్మార్గులు” అని బడాయిగా పాత్రల్ని చెడ్డవాళ్ళు అని ఒప్పేసుకోవడం వల్ల, అవి మంచి పాత్రలయిపోవు. ప్రతీ మనిషీ ఏదో ఒకటి ఆలోచిస్తూనే వుంటాడు. అంత మాత్రాన అది “అంతర్మధనం” అయిపోదు. నాలుగు నిజాలు ఒప్పేసుకుని, చేసే చెత్త పనులు చేస్తూనే వుంటే, అది విచక్షణ వున్నట్టూ కాదు.

    ప్రసాద్

« 1 ... 1518 1519 1520 1521 1522 ... 1582 »