నాకు సూర్యుడితో చక్కని అనుబంధం ఉంది.
నమస్కారాలు కాదు – కరచాలనం చేస్తూ ఉంటాను.
ఇంట్లో ఉన్నా, బయట ఊళ్ళకు వెళ్ళినా, సన్‌రైజ్ సన్‌సెట్ పాయింట్లకోసం వెదుక్కుంటూ ఉంటాను.
చుట్టూ సముద్రం ఉన్న చిన్న ద్వీపంలో ఆ పాయింట్లు పెద్దగా వెతకకుండానే కనిపిస్తాయి కదా – మాకు బాగా దగ్గరలో ఉన్న మలక్కా జెట్టీ సూర్యోదయం చూడటానికి సరైన ప్రదేశం అని తెలుసుకున్నాం.
“మనకు చేతిలో బండి ఉందిగదా – దగ్గర ప్రదేశానికే వెళ్ళాలన్న తాపత్రయం ఎందుకూ? నిన్న చూసిన సునామీ మెమోరియల్ బీచ్ నాకు బాగా నచ్చింది. అక్కడ సన్‌రైజ్ చూద్దామా?” జగన్ ప్రతిపాదన.
ఎనిమిది కిలోమీటర్లు. పావుగంట.
సరిగ్గా అయిదింటికి సముద్రతీరం చేరుకున్నాం. అప్పుడే ఆకాశం రంగులు సంతరించుకుంటోంది. నిన్న మాకు కలిగిన నిరాశను గ్రహించి సూర్యుడు మేఘాలకు తగిన ఆదేశాలు ఇచ్చినట్టున్నాడు. అవి కుదురుగా సర్దుకుని క్షితిజంలోని సాగరరేఖనుంచి రెండు మూడు బింబాల మేర ఖాళీ ఉంచాయి. అది చాలు చక్కటి సూర్యదర్శనానికి… ఒక్క దర్శనమే కాదు – ఆ మేఘాల ఉనికి సూర్యోదయ దృశ్యాన్ని మరింత శోభామానం చెయ్యడంలో బాగా సాయపడింది. ఆకాశంలో రంగుల కూడిక, అవి సముద్రంలో ప్రతిఫలించడం, ఆ ప్రతిఫలనాన్ని మృదువుగా చెదరగొడుతున్న కెరటాలు – అరుదైన అనుభవమది.తనివి తీరడం, మనసు నిండడం అన్నది నాలాంటి వారికి అందుబాటులో లేని లక్షణం అనుకొంటాను. తిరిగి గెస్ట్‌హౌస్‌కు చేర్చే దారి అడుగడుగునా మమ్మల్ని ఆకట్టుకోసాగింది. అప్పుడే నిద్రలేస్తున్న ఒక గ్రామం ‘కాసేపు ఆగి పలకరించి వెళ్ళగూడదా?’ అని పిలిచింది. ఆగి గబగబా రెండు ఫోటోలు. బైక్ మీద సాగరతీరం వెంబడే ఉదయపు వేళ తిరగడంలోని ఆనందాన్ని పూర్తిగా పొందాలన్న భావన మమ్మల్ని ముందు అనుకున్న మలక్కా జెట్టీ దగ్గరికి చేర్చింది. కాస్తంత స్థిమితంగా చూస్తే, ఆ జెట్టీ పక్కనే అడవితో నిండిన బీచ్ కనిపించింది. ఆ బీచీ, అడవి, కోరల్స్, దూరాన కనిపిస్తోన్న గుడి – ఓ అరగంట. మళ్ళా వచ్చి గుడిని మరింత తీరికగా చూడాలన్న నిర్ణయం.
మనసుకు నచ్చే ప్రదేశంలో, ఎటు చూసినా రారమ్మని పిలుస్తోన్న బీచులు ఉన్న ద్వీపంలో, రెండు చక్రాల మీద విహారాలు చేసే అవకాశం వస్తే ఒక్క నిమిషమన్నా వృథా చెయ్యకుండా అలా ఎగిరిపోతూ ఉండాలనిపిస్తుంది… అతి కష్టం మీద గెస్ట్‌హౌస్‌లో బ్రేక్‌ఫాస్ట్ ముగించి మరో గంట తిరిగేలోగా అంతకు ముందు చూసిన మలక్కా తీరాన ఉన్న గుడి ప్రాంగణంలో తేలాం.చక్కని ప్రాంగణం. భక్తులుగానీ పూజారిగానీ కనిపించలేదు. చుట్టూ పచ్చదనం. ఇసుకతిన్నెల మీద గడ్డిపూలు. కాస్తంత దూరాన జెట్టీ. ఇంకే పనీ పెట్టుకోకుండా ఏదన్నా పుస్తకం పట్టుకుని రోజంతా గడపదగ్గ ప్రదేశం. అవునూ – నికోబారీల మతమేమిటీ? నిన్న తిరిగినపుడు మూస్ అన్న ఊళ్ళో ఆకట్టుకొనే చర్చ్ కనిపించింది. మా గెస్ట్‌హౌస్ దగ్గరా ఏదో కృష్ణ మందిరం – వివరాలు తెలుసుకోవాలి… రోజంతా కాదుగానీ, మొత్తానికి, తెలియకుండానే ఆ గుడి దగ్గర ముప్పావు గంట గడిచిపోయింది.
“మనం ఈ ద్వీపం తిరిగి రావడం సంగతేమిటీ?” అడిగాడు జగన్. వివరాల్లోకి వెళ్ళాం. అంతా కలసి ఏభై-అరవై కిలోమీటర్లు కాబట్టి మహా అయితే నాలుగు గంటలు – తీరిగ్గా లంచ్ ముగించుకుని మధ్యాహ్నమంతా ఆ పని పెట్టుకోవచ్చుగదా అనిపించింది. మేమా మాటల్లో ఉండగానే పదకొండు గంటలకు విలేజ్ కౌన్సిల్ వారితో మీటింగ్ ఏర్పాటు చేసినట్లు సమాచారం అందింది.
విలేజ్ కౌన్సిల్ వేపు వెళుతోంటే, సునామీ మెమోరియల్ బీచ్ మళ్ళా పలకరించి నిలువరించింది. పదకొండు అవడానికి ఇంకా అరగంట పైనే ఉంది కదా అని అక్కడ ఆగాం. నిన్న గబగబా చూసింది ఒక అందం. ఈ ఉదయం మసకమసక చీకటిలో సూర్యోదయ సమయంలో చూసింది మరో అందం. ఇపుడు పదిన్నరా పదకొండు గంటల వేళ లేత ఆకుపచ్చరంగు సముద్రం, శంఖంలా తెల్లగా మెరిసే ఇసుక తిన్నెలు, క్షితిజంలో గాఢమైన నీలి రంగు వెడల్పాటి గీత, చుట్టూ అలుముకున్న పచ్చదనం – మేమిద్దరమే తప్ప ఇంకెవరూ లేకపోవడం చాలా అన్యాయమనిపించింది. అంత అందాన్ని ఇద్దరమే ఎలా భరించగలం?“మీలో మీరేనా కొబ్బరినీళ్ళు పుచ్చుకునేదీ? మాకూ ఇవ్వవచ్చుగదా,” సముద్ర తీరానికి కాస్తంత దూరాన, రోడ్డుకు దగ్గరలో, తీరిగ్గా కొబ్బరి బొండాలు తాగుతోన్న స్థానిక యువదంపతుల్ని సరదాగా పలకరించి చూసాను.
ముందు ఆశ్చర్యపడ్డారు. తేరుకుని అతను నవ్వాడు. ఆమె కార్యాచరణకు పూనుకుంది. గబగబా తానే రెండు బొండాలు కొట్టి అందించింది.
ఈసారి ఆశ్చర్యపడటం మా వంతు.
చదువుకున్న మహిళ ఆమె. పది దాకా చదివిందట. హిందీ చక్కగా మాట్లాడుతోంది. కాస్తంత ఇంగ్లీష్ కూడా. అతను మితభాషి. నవ్వులు మాత్రం అమితం. మాట్లాడాలంటే బెరుకు. ఆమెకా సమస్య లేదు.
అదే అక్కడి నికోబారీలతో మా మొట్టమొదటి అసలైన సంపర్కం. అవకాశం వదులుకోదలచుకోలేదు. అక్కడే వాళ్ళతోబాటు చేరగిలబడి అరగంట గడిపాం. ఆమె నేపథ్యం, చదువు, ఉద్యోగం, అక్కడి వాళ్ళ జీవనసరళి, సునామీ తర్వాత వాళ్ళ జీవితాలలో వచ్చిన మార్పులు – వీటి గురించి క్లుప్తంగానే అయినా వివరాలూ ఆలోచనలూ పంచుకున్నాం. ఆమె అక్కడి స్కూల్లో చిరుద్యోగి. విషయాలు తెలిసిన మనిషి. మా మధ్య జరుగుతోన్న సంభాషణను గమనించిన ఇద్దరు ముగ్గురు నికోబారీ యువకులు – అప్పటిదాకా మాకేసి అనుమానంగా చూసినవాళ్ళు కాస్తా – మాతో చేరి పరిచయాలు చేసుకున్నారు. ఆ చదువుకున్న మహిళ సంధానకర్తగా వ్యవహరించింది. అయినా విలేజ్ కౌన్సిల్ మీటింగుకు టైమవుతోంది కాబట్టి ఎక్కువ సమయం గడపలేక పోయాం. చివర్లో ఫోన్ నెంబర్లు ఇచ్చి పుచ్చుకున్నాం. ఢిల్లీ తిరిగొచ్చాక కూడా ఆ దంపతులతో టెలిఫోన్ సంపర్కం ఆరు నెలలు సాగింది.కాస్తంత దారులు వెతికి పదకొండు లోపలే విలేజ్ కౌన్సిల్ భవనం చేరుకున్నాం. రెండంతస్తుల భవనమది. క్రింద ఆఫీసులు. పైన మీటింగ్ హాలు. థామస్ అన్న పెద్దాయన కౌన్సిల్ హెడ్‌మాన్. జోసెఫ్ అన్న మరో చురుకైన మధ్యవయస్కుడు కార్యదర్శి. ఇతనికి హిందీ బానే వచ్చు. ఇంగ్లీషులోనూ ప్రవేశముంది. కౌన్సిల్ ఏర్పడే విధానం, వాళ్ళ విధులూ అధికారాలు, స్థానిక పాలనా వ్యవస్థతో వారి సంపర్కం, ఇతర విలేజ్ కౌన్సిళ్ళతోనూ, ద్వీపాలతోనూ వాళ్ళకు ఉండే సంబంధబాంధవ్యాలు – గ్రామాలకు అందే ఆర్ధిక వనరులు, విద్య, వైద్యం, రోడ్లులాంటి విషయాలు నిర్ణయించడంలో విలేజ్ కౌన్సిళ్ళ పాత్ర, అందుతోన్న సదుపాయాలు, అభివృద్ధిపట్ల స్థానిక నికోబారీల స్పందన, మారుతోన్న వారి జీవనసరళి – ఇలా ఎన్నో విషయాలు చర్చకు వచ్చాయి. వాళ్ళంతా ఏ బిడియాలూ లేకుండా ఆ విషయాలన్నీ చర్చించారు. స్థానిక గవర్నమెంటు వ్యవస్థతో చక్కని అనుబంధమే ఉన్నా, ఏదన్నా పని పోర్ట్ బ్లెయిర్‌లో జరగాలంటే ఎంత కష్టపడాల్సి వస్తుందో చెప్పుకొచ్చారు.
లంచ్ ముగించాక ద్వీప ప్రదక్షిణ ఆరంభించాం.
“ముందు ఎక్కడికీ?” ప్రశ్న.
“వెళుతూ ఉందాం. ఆగాలనిపించిన చోట ఆగుదాం,” జవాబు.
గెస్ట్‌హౌస్ వదిలి మెయిన్ రోడ్డు జంక్షన్‌లోని గాంధీ బొమ్మ దగ్గర ఎడమకు మళ్ళాం. జెట్టీ, దేవాలయం, సముద్రం – పది నిముషాల్లో ఎయిర్ ఫోర్స్ క్యాంప్. నిన్న ఇక్కడే గదా హెలికాప్టర్ దిగిందీ… మరో పది నిముషాలు – అడవి. అది దాటాక కాకన బీచ్. చెప్పాల్సిన అవసరం లేకుండానే బండి సముద్రం వేపుకు మళ్ళింది.
నిన్న ఈ కార్ నికోబార్‌లో తిరిగినదంతా ఊళ్ళూ, ఇళ్ళూ, బీచుల మధ్య. అడుగడుగునా మనుషుల జాడ. మేమున్న గెస్ట్‌హౌస్ ఊరి నడిబొడ్డున ఉంది – అంచేత ఎక్కడో మారుమూల ద్వీపంలో ఉన్నట్టు కాకుండా చిన్నపాటి సగటు పట్నంలో ఉన్న భావన కలిగింది. అదే కోలాహలం, అవే శబ్దాలు, అవే వాహనాలు, అదే మనుషులు.
కానీ ఈ కాకన బీచ్ బాణీ వేరు. ప్రపంచపు ఎల్లలు దాటుకుని, విశ్వపు పొలిమేరలు చేరి, ప్రకృతి పాదవిన్యాసాలే తప్ప ‘నరసంచారం ఏనాడూ లేదు’ అనిపించే ఏకాంతస్థలమది. తీరరేఖను హత్తుకుని ఉన్న అడవి, సముద్రానికి బాగా పక్కనే చక్కగా కూర్చోడానికి అనువుగా వంగి పెరిగి, యవ్వనదశలో ఉన్న కొబ్బరి చెట్లు, సాగర జలాలలోంచి మొలుచుకుని వచ్చినట్టున్న దిట్టమైన రాతి స్తంభం (కనీసం పాతిక ముప్ఫై అడుగుల ఎత్తు ఉండి ఉండాలది), వెతకకపోయినా కనిపించి పలకరించే కోరల్స్ – ప్రత్యేకమైన బీచ్ అది. అందానికి అందం, ఏకాంతానికి ఏకాంతం, ప్రత్యేకతలకు ప్రత్యేకతలు… గూగుల్లో చూస్తే మరో ఇరవై ముప్పై నిముషాల దూరంలో కిమియోస్ బే ఉందని తెలిసింది. దానికి దగ్గర్లోనే దారికి గండి పడ్డ సూచన మ్యాప్‌లో కనిపించింది. నిన్న రాత్రి రమేష్ చెప్పిన కూలిన వంతెన అదే అయి ఉండాలి.ముందుకు సాగాం.
ఉన్నట్టుండి ఒక పద్ధతైన ప్రాంగణం. ‘గ్రేవ్ యార్డ్ ఆఫ్ ఎడ్వర్డ్ కచ్ఛాటో’ అన్న బోర్డ్… ఎవరీ ఎడ్వర్డ్? బ్రిటిష్ అధికారా? మిషనరీనా? రెండూనా? లోపలికి వెళ్ళి వివరాలు చూసాం.
నికోబారీ ట్రైబల్ నాయకుడు.
ఒకప్పుడు కార్ నికోబార్ ట్రైబల్ కౌన్సిల్‌కు అధినేతగా వ్యవహరించిన మూలవాసుల ప్రియతమ నాయకుడు. 1950లలో అక్కడ స్థాపిస్తోన్న ఎయిర్ ఫోర్స్ స్టేషన్ కోసం స్వయంగా నెహ్రూనే మూలవాసుల స్థలం కొంత అడిగినపుడు పెద్ద మనసుతో ఒప్పుకుంటూనే, ‘మీ షోకైన జాకెట్ ఇచ్చినట్టయితే నేను స్థలం ఇస్తాను’ అని ఎదురు బేరం పెట్టిన ఘనుడు. 1989లో పద్మశ్రీ ఇచ్చారట – అలా పద్మ అవార్డ్ అందుకున్న ఏకైక నికోబారీ వ్యక్తి ఈ ఎడ్వర్డ్ కచ్ఛాటో!
కాస్సేపు ఆ ప్రాంగణంలో కూర్చుని ఆయన స్ఫూర్తిని అందుకునే ప్రయత్నం చేసాం. మరి కాస్త ముందుకు వెళితే ‘కోరల్ బీచ్’ అంటూ సైన్ బోర్డ్. మరో పది నిముషాలు వెళ్ళగా విరిగిన వంతెన – భగ్నవారధి!
ఎప్పుడు విరిగిందో తెలియదు – చూస్తే ఏళ్లు గడిచాయి అనిపించింది. అగడ్త మరీ పెద్దదేం కాదు – మహా అయితే 50 మీటర్లు. అవతల కొనసాగుతూ కనిపించి ఊరించే రోడ్డు… ఎలాగైనా నీళ్ళను దాటి అటు వేపుకు చేరుకోవాలని ఎంతగానో దారులు వెతికాం – బైక్ సంగతి సరే సరి, అసలు నడచి దాటడం కూడా అసాధ్యమని స్పష్టమైంది. కాసేపటి క్రితమే వదిలి వచ్చిన కోరల్ బీచ్‌లో ఓ పావుగంట. సాయంత్రం అవవస్తోంది. మేమున్నది తూర్పు తీరాన – అంచేత సన్‌సెట్ అవకాశాలు లేవు. అయినా సంధ్యావర్ణాలు చూడటానికి మలక్కా జెట్టీ సరైన వేదిక అవుతుందని స్ఫురించి గబగబా బండిని అటువేపు ఉరికించాం. సరిగ్గా సమయానికి జెట్టీ చేరుకోగలిగాం. క్షితిజంలో మహాసుందర వర్ణసమ్మేళనం. ఆకాశంలోకి చూస్తే ఇంకా పూర్తిగా వెలుగు సంతరించుకోని త్రయోదశి చంద్రుడు పలకరించాడు. ప్రశాంత నిశ్శబ్ద వాతావరణం. ఆ వాతావరణంలో బైక్ కూడా మిళితమై పోయి సుందరంగా కనిపించేసరికి దానికీ చక్కని ఫోటోలు.చీకటి ముసిరీ ముసరని సమయంలో గెస్ట్‌హౌస్ చేరుకున్నాం. చేరీ చేరగానే నిన్న కలసిన ఎస్సైగారి ఫోన్: ‘అమరేంద్రగారూ… రండి… మీ గెస్ట్‌హౌస్‌నుంచి వంద మీటర్లు కూడా ఉండదు మా పోలీస్ క్వార్టర్…’
జగన్ రానన్నాడు. నే వెళ్ళాను.
పోలీస్‌గారి ఇల్లు అనుకొని వెళితే మినీ ఇస్కాన్ దేవాలయం కళ్ళ ముందు నిలిచింది. ఆయన పరిపూర్ణమైన కృష్ణభక్తుడు. ఎంత పరిపూర్ణం అంటే ఆ భాషా, ఆ మాటా కూడా నాకు అర్థం కాలేదు.
త్వరగా ముగించేద్దాం అనుకొంటూ ఉండగా ఒక విషయం స్ఫురించింది: నికోబార్ ద్వీపాల్లోని మతాల వివరాలు అందించడానికి ఈయనే సరైన వ్యక్తి కదా…
“ఈ కార్ నికోబార్‌లో 80 శాతం మూలవాసులు. మొన్నమొన్నటిదాకా వీళ్ళంతా ప్రకృతిని పూజించేవారు. వృక్షాలు, నదులు, జంతువులు, కొండలు, ఋతువులు వీరికి ఆరాధ్యదైవాలుగా ఉండేవి…
“నూట యాభై రెండు వందల సంవత్సరాల క్రితం మన సౌతిండియానుంచి ప్రొటెస్టెంట్ మతగురువు ఒకాయన వచ్చాడు. కృషి చేసాడు. ఇపుడు ఈ మూలవాసుల్లో దాదాపు అందరూ క్రిస్టియన్లు. గమనించే ఉంటారు. ఇంత చిన్న ద్వీపంలో పది చర్చిలున్నాయి… వీళ్లలో హిందువులు, ముస్లింలు చాలా తక్కువ.
“మన సెటిలర్ల మాటకు వస్తే, వీరిలో హిందువులు ఎక్కువ. ఇప్పుడిప్పుడే క్రిస్టియానిటీ, ఇస్లాం కూడా సెటిలర్లలోకి అడుగు పెడుతున్నాయి. మన గుళ్ళు మనకున్నాయి – చూసే ఉంటారు, జెట్టీ దగ్గర దేవాలయం…”
చెప్పుకొచ్చాడాయన.
“మిగిలిన నికోబార్ ద్వీపాల్లోనూ మత గణాంకాలు ఇలానే ఉన్నాయా?” అడిగాను.
“దాదాపు ఇలానే ఉన్నాయి. క్రిస్టియానిటీ మెజారిటీ మతంగా స్థిరపడింది. హిందూమతం, ఇస్లాంల లెక్కలు ద్వీపాన్ని బట్టి కాస్త అటూ ఇటూగా ఉన్నాయి.”
నిజానికి ఇదో కనువిప్పు నాకు. ఈ సమాచారం ద్వీపాలను కొత్త కళ్ళతో చూసే అవసరం, అవకాశం నాకు అందించింది.
ప్రయాణాలే ఒక వ్యసనమంటే సాగరతీరాలు ఇంకా పెద్ద సద్వ్యసనాలు.
ఆ రోజు 26 అక్టోబర్. గురువారం. మేము ప్రయాణం మొదలెట్టి నాలుగో రోజు. కార్ నికోబార్ వదిలి కమోర్తా ద్వీపం చేరవలసిన రోజు. పది గంటలకు హెలికాప్టర్. పక్షిమార్గాన 120 కిలోమీటర్లు. అంతా కలసి అరగంట.
ఎప్పుడో పది గంటలకు హెలికాప్టరయితే తెల్లవారుఝామున ఇంటిపట్టున ఎలా ఉండగలం? అందులోనూ కార్ నికోబార్ ద్వీపంలో గడిపే ఆఖరి క్షణాలవి… మళ్ళా మళ్ళా ఆ ద్వీపానికి వచ్చే అవకాశాలు దాదాపు లేవు…
పెద్దగా సంప్రదించుకోకుండానే అయిదింటికల్లా ఇద్దరం బైక్ ఎక్కాం. ఐదు నిముషాల్లో జెట్టీ దగ్గరకు చేరాం.
సాయంత్రమే ప్రశాంతమనుకుంటే ఉదయం మహాప్రశాంతం. అలల ధ్వని కూడా లేనంత నిశ్శబ్ద వాతావరణం. ఆకాశానికి రంగులు అద్దే పనిలో మునిగి తేలుతూ ఇంకా ఉదయించని సూర్యుడు. మరీ దట్టంగా కాకుండా ఉదయానికి శోభను సమకూర్చే బాణీలో తూరుపు మేఘాలు. అరుణారుణ వర్ణాలు. అంతలోనే లలితంగా మారిన ఆకాశం… ఆ లాలిత్యాన్నే ప్రతిఫలిస్తోన్న సముద్రం. తాపీగా సూర్యుని రాక… అరగంట… ఉదయం ఐదున్నర.గెస్ట్ హౌస్ వైపు తిరుగుముఖం పట్టాం.
పెర్కా కూడలి చేరుతున్నపుడు “మనం పొరపాటు చేస్తున్నామండీ,” అన్నాడు జగన్. “ఏమిటదీ?” ఆశ్చర్యంగా అడిగాను.
“మొన్నట్నించీ ఈ మూడు రోడ్ల జంక్షన్ మీదుగా కనీసం పదిసార్లు వెళ్ళాం. ఆయన విగ్రహం అంత ప్రస్ఫుటంగా పెట్టారు. ఒక్కసారన్నా ఆగామా?”
నిజమే. చక్కని గాంధీ బొమ్మ అది. ఆ కూడలిలో ఊరికే బొమ్మ పెట్టి ఊరుకోకుండా విగ్రహం దగ్గర ఎత్తైన చప్టా. ఆ పైకి చేరుకోడానికి నాలుగయిదు విశాలమైన మెట్లు – జగన్ బండి ఆపాడు.
చిన్నప్పట్నుంచీ తెలిసిన మనిషి. గౌరవభావం, ఆత్మీయభావన కలిగించే మనిషి. కాసేపు అక్కడ గడిపాం.
గాంధీబొమ్మ దగ్గిర ఆగిన స్ఫూర్తితో గెస్ట్‌హౌస్ పరిసరాల్లో మరి కాసేపు తిరుగాడాం. ఎడ్వర్డ్ కచ్ఛాటో పార్క్ కనిపించింది. నిన్నా మొన్నా ఆ పేరు చూసామేగానీ పట్టించుకోలేదు. గత సాయంత్రం వేళ ఆయనతో కలిగిన పరిచయం, తెలుసుకున్న వివరాలు ఆయన పేరిట రూపొందించిన పార్క్‌లో కాసేపు గడిపేలా చేసాయి. పనిలో పనిగా గెస్ట్‌హౌస్‌నీ, బిజీ మార్కెట్ వీధినీ మా కెమెరాలో బంధించాం. గెస్ట్‌హౌస్ బిల్లులు చెల్లించి అక్కడి వారికి టిప్ ఇవ్వబోతుంటే ‘ఇక్కడ అది పద్ధతి కాదండీ’ అంటూ సున్నితంగా తిరస్కరించారు.పదిన్నరకల్లా హెలికాప్టర్ ఎక్కాం. రమేష్, జాన్సన్ వచ్చి బై బై చెప్పారు. రెండ్రోజుల్లోనే వాళ్లిద్దరితో చక్కని సంపర్కం ఏర్పడింది. ఆ మాత్రానికే నాకు మనసులో కాస్తంత దిగులు…
హెలికాప్టర్ ఎగిరీ ఎగరగానే మనసు గత నాలుగు రోజుల సింహావలోకనంలో మునిగిపోయింది. అండమాన్ విమానాశ్రయంలో చక్కని స్వాగతం, నామీద నాకే అసూయ కలిగించే గెస్ట్‌హౌస్ రూమ్, రవి ప్రకాష్‌తో లంచ్ కబుర్లు, పోర్ట్ బ్లెయిర్‌తో పాత సంబంధాలు పునరుద్ధరించుకోవడం, రెండవ రోజు ‘తూనీగ’ రెక్కల మీద ఎప్పట్నించో కలలు కన్న (కార్) నికోబార్ చేరుకోవడం, అటు పల్లె ఇటు పట్నం కాని ఆ జిల్లా ముఖ్యపట్టణం, క్షణాల్లో నికోబార్‌తోనూ, అక్కడి సాగర తీరాలతోనూ ప్రేమలో పడటం, మరో రోజు గడిచేసరికి అక్కడి స్థానికులూ, సెటిలర్లూ పరిచయం అవడం, తనివి తీరేలా మనసు నిండేలా కబుర్లు – వివరాలు, నాలుగో రోజుకల్లా మేము ఎప్పట్నించో ఆ ద్వీపాల్లోనే ఉంటోన్న భావన కలగడం, మా యాత్ర సరైన దారిలో సాగుతోందనీ – నికోబార్ ద్వీపాల వీక్షణానుభవం సంతృప్తికరంగా ముగియబోతోందనీ నమ్మకం…
అరగంటలో కమోర్తా ద్వీపం చేరుకున్నాం.
హెలిపాడ్ దగ్గర సహాయపడే మిత్రుని స్వాగతం, కారు ఏర్పాటు మామూలే. పావుగంటలో గెస్ట్‌హౌస్.
గెస్ట్‌హౌస్ ఉన్న ప్రదేశం మమ్మల్ని ఎంతగానో ఆకట్టుకొంది.
ఎత్తైన గుట్ట మీద, మూడు వేపుల సముద్రం ఒకవేపు నేలా ఉన్న బిందువు దగ్గర కట్టిన వసతి గృహమది. మూడువేపులా సముద్రం అనడమేగానీ ఆ నాలుగో వేపున కూడా ఎదురుగా కనిపించే నేలను దాటుకుని దృష్టిని మరికాస్త సారిస్తే నేలకు అవతలి వేపున స్ఫుటంగా కనిపించే సముద్రం. దిగువన కమోర్తా జెట్టీ. ఏ హడావుడీ లేని ప్రశాంత ప్రదేశం… మరి ఎవరి ఆలోచనో తెలియదుగానీ ఆ ప్రాంగణంలోనే పాతిక ముప్ఫై అడుగులు ఎత్తున్న ఐఫిల్ టవర్ నమూనాను కూడా నిలబెట్టి ఉంచారు. నేనంటే అదంతా చూసి పరవశపడుతున్నానుగానీ జగన్ ఎందుకో మహా ఆందోళనగా కనిపించాడు. గబగబా వెళ్ళి కేర్‌టేకర్‌తో ఏదో మాట్లాడి వెలిగిపోయే మొహంతో తిరిగి వచ్చాడు. ‘ఏవిటీ సంగతీ?’ కళ్ళతో ప్రశ్నించాను.
“ఇక్కడ ఎయిర్‌టెల్ సర్వీసు లేదు… ఎలా రా బాబూ అనుకుంటూ ఎందుకైనా మంచిదని వెళ్ళి లోపల అడిగివచ్చాను. బ్రమ్మాండమైన వైఫై సిగ్నలుంది… అది లేకపోతే ఈ రోజంతా మా చెడ్డ కష్టమయిపోయేది.”
“ఒక్కరోజు వైఫై లేకపోతే బతకలేమా?” సరదాగా నేను.
“బతకొచ్చు. కానీ ఇవాళ నాకు ఏభై నిండుతున్నాయి. అన్ని వేపులనించీ ఫోన్లు – మెసేజీలు…” నాకు తెలియని విషయం చెప్పాడు.
అభినందనలు చెప్పాను. ఫోన్‌కాల్స్‌లో నిమగ్నమై పోయాడు జగన్. గెస్ట్‌హౌస్ చేరామేగానీ మాకింకా ఎందుకో గది చూపించలేదు. ఈలోగా ఎవరో ఉద్యోగి వచ్చి కేర్‌టేకర్‌తో ఏదో మాట్లాడాడు. ఆ తర్వాత మా దగ్గరకు వచ్చి మర్యాద చెదరకుండా మమ్మల్ని ఒకటి రెండు ప్రశ్నలడిగాడు. మా పేపర్లు చూసాడు. ఫోన్లో వాళ్ళ అధికారితో మాట్లాడి, అనుమతి తీసుకుని గది ఇప్పించాడు. ఆయన అక్కడి అసిస్టెంట్ కమిషనర్ గారి పి. ఏ. అట.
వివరాల్లోకి వెళితే ఇక్కడి ఆఫీసుకు నేను ఒక్కణ్నే వస్తున్నట్లు సమాచారం అందిందట. జగన్ గురించి వివరం అందలేదు. రూమ్ సంగతి ఎలా ఉన్నా అలా బయటివాళ్ళు ఇలా వచ్చేయడం వాళ్ళకి మామూలు విషయం కాదు. అంచేత కార్ నికోబార్ పెద్దాఫీసును సంప్రదించి, ‘ఇద్దరు’ అని నిర్ధారించుకుని, సమస్యను పరిష్కరించాడాయన.
ఈలోగా మా బైక్ వచ్చి చేరింది. ‘ఓ… బుల్లెట్టా! కష్టమైన బండి. ఇంతకు ముందు నడపలేదు,” అన్నాడు జగన్. నాలో ‘ఆదిలోనే హంసపాదా?’ అన్న చిన్న ఆందోళన. అయినా అది బయటకు చెప్పలేదు.
ఇవాళా రేపూ ఎలా గడిపితే బావుంటుందీ అని ఆ పి.ఏ. గారిని సలహా అడిగాం. ‘ఇవాళ ఇక్కడికి ఉత్తరాన 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న పిల్ పిల్లో అన్న ఊరూ, అక్కడి సముద్రతీరం చూసి రండి. ఇక్కడికి వచ్చిన వాళ్ళంతా అవి తప్పకుండా చూస్తారు. అన్నట్టు రోడ్డు అంతగా బాగోదు. బైక్‌తో వెళ్ళడం కష్టం. కారు పంపిస్తాను…”.
వద్దన్నాం. “మరి రేపు?” అని అడిగాం.
చూస్తున్నారు కదా – ఈ జెట్టీ, అటువేపు నన్‌కోవ్రీ (Nan Cowry) ద్వీపం, ఎదురుగా ఉన్న మరో రెండు ద్వీపాలు… నా సలహా ఏమిటంటే ఈ సముద్రంలో మరపడవ తీసుకుని ఆ ద్వీపాలన్నీ చూసి రండి. ఉదయం గడపడానికి అదే మంచి మార్గం. ఊ అంటే చెప్పండి, కాళిదాసు అని పడవ అబ్బాయి ఉన్నాడు. చెపుతాను.”‘ఊ’ అన్నాం.
జగన్ ఫోన్‌లో తీరుబడి లేకుండా గడుపుతున్నాడు. ఈలోగా ఆ గెస్ట్‌హౌస్‌లోనే బస చేసిన ఇద్దరు బోటనీ రీసెర్చి స్కాలర్లు వచ్చి కలిసారు. మా తర్వాతి మజిలీ కచ్ఛల్ అని విని ముచ్చటపడ్డారు. “అందమైన ద్వీపం. ఇంకా అందమైన గెస్ట్‌హౌస్” అని పరవశంగా చెప్పారు. పిల్ పిల్లో బీచ్ గురించీ, అక్కడికి వెళ్ళే దారి గురించీ, దారిలోని అడవి గురించీ గొప్పగా చెప్పారు. గత వారం రోజులుగా వాళ్ళు కచ్ఛల్‌లో గడిపి మొన్ననే కమోర్తా వచ్చారట.
కొన్ని కొన్ని ప్రదేశాలు, వెళ్ళి చూడకముందే మనకి ఒక ఊహా, అవగాహనా కలిగిస్తాయి. కార్ నికోబార్ ఆ కోవకు చెందిన ప్రదేశం. బహుశా నాకు తెలియకుండానే ఈ ద్వీపాన్ని మూడేళ్ళ క్రితం చూసిన లిటిల్ అండమాన్‌తో మనసు పొరల్లో ఎక్కడో సరి పోల్చి ఉంటాను. అక్కడి పెర్కా పట్టణం లిటిల్ అండమాన్‌లోని హట్ బే పట్టణాన్ని సరిపోలింది. కార్ నికోబార్ బీచ్‌ల శృంఖల లిటిల్ అండమాన్ బీచ్‌ల జ్ఞాపకాలను తిరగదోడింది. అంచేత ఆనందం రెట్టింపయిందే తప్ప ఆశ్చర్యం కలగలేదు.
కమోర్తా ద్వీపం మా ఊహలకందని ప్రదేశం. అసలైన నికోబార్ ఇక్కడే ఉంది అన్న భావన కలిగించిన ప్రదేశం. అడుగడుగునా నేలా నీరూ నింగీ చెలిమి చేసుకుని సహజీవనం సాగిస్తోన్న ప్రదేశం. అంచేత ఆనందానికి ఆనందం, ఆశ్చర్యానికి ఆశ్చర్యం.
ఆ ఆశ్చర్యంలోంచి గంటా రెండు గంటల్లోనే తేరుకున్నాం కానీ అదే కమోర్తా ద్వీపం ఆ మధ్యాహ్నం మాకు కలిగించిన ఆశ్చర్యం, ఆనందం మూడేళ్లు గడిచినా ఇంకా మమ్మల్ని వదలలేదు అనడం అతిశయోక్తి కాదు.
ఆ మధ్యాహ్నం పిల్ పిల్లో బీచ్‌కి బయల్దేరాం. ఛోటా ఇనాక్, బడా ఇనాక్ అన్న గ్రామాలను ఇరవై నిముషాల్లో దాటాం. ఆ తర్వాత అంతా ఊహాతీతమైన, దేనితోనూ పోల్చలేని అందం… మనుషులు కానీ గ్రామాలు కానీ ఎంత వెతికినా కనిపించని ప్రదేశం – కొండలు… అడవి… లోయలు… చెట్లు… చెలకలు… మేము… బుల్లెట్ బండి.
అసలు మనిషి పాదం ఎప్పుడైనా సోకిందా అనిపించే దారి… గరిక పరకా, చెట్ల ఆకులూ, నీటి చెలమలూ, కొండ చరియలూ – ప్రకృతి సమస్తమూ తనకే స్వంతమైన అందంతో కన్నుల పండుగ చేస్తోన్న సమయం… ఒక్కసారిగా పరిసరాలు మారిపోయి సరళమైన కొండబాట కాస్తా శిఖరాలూ లోయలతో నిండిపోయింది. చెట్లూ పొదలూ కూడా ఆకుల పరిమాణం పెంచుకుని రాక్షసాకారంలో కనిపించాయి. చెట్ల మీదకు ఎగబ్రాకి వాటిని పూర్తిగా ఆక్రమించుకున్న లతలు, ఆ లతలు సృష్టిస్తోన్న అవతార్ సినిమాలోని గ్రాఫిక్స్‌ను గుర్తు చేసే దృశ్యాలు… ఆ సినిమాలోని ఆదివాసుల నివాసస్థలం పండోరా చేరుకున్నామా అన్న భ్రమ. అది ఒక అంతులేని ప్రయాణం – అంతం లేకుండా ఉంటే బావుణ్ణు అనిపించిన ప్రయాణం. పదే పదే ఆగి విస్మయంతో ఆ భయదసౌందర్యాన్ని కళ్ళప్పగించేసి చూస్తూ వెళ్ళిన సమయం… ఏ కారణంవల్ల అయినా బైక్ ఆగిపోతే ఎలా? ఎలా ఏముందీ… అదో అవకాశం అన్న ఎరుక… అలా సాగిన ప్రయాణం గంటన్నరా రెండు గంటల తర్వాత పిల్ పిల్లో గ్రామం మీదుగా సముద్రపు ఒడ్డుకు చేరింది. మెల్లగా బైక్‌ను తీరం దగ్గరకు చేర్చి… క్షేమంగా పార్క్ చేసి, బండల్ని దాటుకుని తీర జలాలను తాకాం. మామూలు నిర్వచనాలకు లొంగే బీచ్ కాదది. ఇసుక పరచిన నేల తగుమాత్రంగానే ఉంది. కొండలు బండలు నీళ్ళల్లోకి చొచ్చుకు వచ్చిన ప్రాంతం ఎక్కువగా ఉంది. మళ్ళా ఆ నీళ్ళు బండల మధ్యకు చొచ్చుకుని వచ్చి మడుగులు కట్టిన స్థలమది. అలా అని అక్కడి బండలు నడకను నిరోధించేవి కాదు. నీళ్ళ తాకిడికి నునుపుదేలి, ఎవరో చెక్కిన శిల్పాల్లా చక్కని రూపాలు సంతరించుకుని, నాచు మొక్కలతో ఏదో ఒప్పందం చేసుకున్నట్టు ధగధగ మెరిసే ఆకుపచ్చ రంగును అమర్చుకుని, నిపుణులైన శిల్పులకూ శక్తివంతమైన కంప్యూటర్లకూ సాధ్యం కాని ఆకృతులు సమకూర్చుకుని – ఓహ్… ప్రకృతి పరచిన ఆరుబయలు శిల్పసౌందర్యశాల అది.ఆ శిలల మధ్య పదీ పదిహేను అడుగుల ఎత్తున రెండడుగుల ఎడంతో గోడ కట్టినట్టు అటూ ఇటూ శిలలు… లోపలికి నడిస్తే ఇరవై అడుగుల దాకా సాగిన గుహ… సముద్రం పోటులో ఉన్నపుడు ఈ గుహ అంతా నీళ్ళతో నిండిపోతుంది కాబోలు…
నాలుగు దాటింది. చీకటి ముసిరే వేళ. వెలుగు పోయిన పక్షంలో, వచ్చిన దారిని గుర్తుపట్టుకుంటూ వెనక్కి వెళ్ళడం కష్టమని తెలుసు. సరైన దారేనా అని అడగటానికి కూడా మనుషులు ఉండరని తెలుసు.
మెల్లగా తిరుగు ప్రయాణం ఆరంభించాం. పిల్ పిల్లో గ్రామం చేరేసరికి గవర్నమెంటు బస్సు ఒకటి మెలమెల్లగా ఊగుతూ, ఊరు చేరుతూ కనిపించి ఆశ్చర్యపరచింది. ఆ బస్సు కూడా మమ్మల్ని చూసి ఆశ్చర్యపడింది కాబోలు – దిగుతోన్న ప్రయాణీకులు మమ్మల్ని పలకరించి కుశలమడిగారు. ఎలానూ వచ్చారు కదా – ఆలస్యం అయినా పర్లేదు – అదిగో ఆ రోడ్డు చివర సునామీ మెమోరియల్ ఉంది… చూసి వెళ్ళండి అన్నారు. వెళ్ళాం. మెహమూద్ ఆలీనుంచి లివింగ్‌స్టన్ వరకూ 28 పేర్లు. వారి పేర్లతోబాటు వారి తండ్రులూ భర్తల పేర్లు, వయసులతో సహా. మూడేళ్ళ పసిపిల్లలనుంచి, 75 ఏళ్ల వాళ్ళ వరకూ ఆ డిసెంబర్ 26, 2004 బ్లాక్ సండే నాడు, ఆ చోట ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు…తిరుగు ప్రయాణంలో ఇంకా వెలుగు సంతరించుకోని చతుర్దశి చంద్రుడు మాకు తోడుగా వచ్చాడు. అయిదయ్యేసరికి చీకట్లు కమ్మాయి. పగటి వెలుగులోనే మరో ప్రపంచంలా కనిపించిన ఆ దారి ఆ రాత్రి, వెన్నెలే తోడుగా, గతుకులే రోడ్డుగా… మెల్లగా ధైర్యం జారిపోకుండా పట్టి ఆపుకుంటూ బడా ఇనాక్ గ్రామం చేరేసరికి ఆరుంబావు అవనే అయింది. ఒకసారి గ్రామాలకు చేరుకునేసరికి ధైర్యం పుంజుకుంది. ముసురుకొని వచ్చిన పరిస్థితుల పుణ్యమా అని జగన్ కూడా బుల్లెట్ బండి తనకు కొత్త అన్న విషయం మర్చిపోయి వాహనాన్ని ఎంతో లాఘవంగా నడపసాగాడు!
ఆరూముప్పావుకు గెస్ట్‌హౌస్ చేరుకున్నాం. దూరాన ధగధగా మెరుస్తోన్న ఓడ ఒకటి మాకు స్వాగతం పలికింది.
మరోసారి నికోబార్ వెళ్ళడమంటూ జరిగితే అందుకు ఈనాటి మా పిల్ పిల్లో బీచ్ ప్రయాణమే ముఖ్య ప్రేరణ అవుతుంది. మర్నాడు మా పిల్ పిల్లో అనుభవాన్ని బోటనీ స్కాలర్లతో పంచుకుంటే, “అదృష్టవంతులు మీరు. భూమధ్య రేఖకు దగ్గరలో ఉండే అడవులు ఎండా వానలకు కొదవ లేకపోవడంవల్ల మహా దట్టంగా పెరుగుతాయి. అమెజాన్ వర్షారణ్యం గురించి వినే ఉంటారు. శ్రీలంకలోని అడవులూ ఇవే. మీరు ఇవాళ ఈక్వెటోరియల్ ట్రాపికల్ ఫారెస్ట్ చూసారు,” అన్నారు.
కొన్ని ఉదయాలు మామూలుకన్నా ఎంతో ముందుగా ఆరంభమవుతాయి.
ఆ అక్టోబర్ 27 ఉదయం అలాంటిది.
అప్పటికే మా ఇద్దరికీ కమోర్తాలో ఒక్క రాత్రే ప్లాన్ చెయ్యడం పొరపాటేమో… మరో రోజు అదనంగా చేర్చి ఉంటే బావుండేది అనిపించడం మొదలయింది.
నడిసముద్రంలో ప్రణాళికలు మార్చడం సమంజసం కాదు. సాధ్యమసలే కాదు. కానీ ఉదయం నాలుగున్నరకల్లా వెలుగు రేకల వేటలో కెమెరా పట్టుకుని బయటపడడం మన చేతుల్లోని పనే కదా…
ఆ ఉదయం అదే చేసాం.
నాలుగున్నరే అయినా పొద్దు రెక్కలు విప్పుకోవడం అప్పటికే ఆరంభమయింది. మేఘాలు కొండల్లా కపటగాంభీర్యం ప్రకటించసాగాయి. వాటి ధాటికి దీటుగా సూర్యవర్ణాలు తూరుపు ఆకాశాన్ని కమ్ముకు రావడం ఆరంభమయింది. దిగువన నీరు, నీటిలో దీపాలు ఆర్పుకుంటూ ఓడలు, మేఘాల ప్రతిబింబాలతో రంగు తేలుతోన్న సముద్ర జలాలు, మేమూ ఉన్నామంటూ ఫోటో ఫ్రేమ్‌లోకి వచ్చేస్తోన్న కొబ్బరి ఆకులు.
విభిన్న సూర్యోదయమది. నవ సౌందర్యోదయమది.
ఎనిమిదింటికల్లా మరపడవ వేసుకుని కాళిదాసు వచ్చేసాడు. తమిళం తెలిసిన మధ్య వయసు తెలుగు మనిషి. ‘గంటకు ఐదు వందలు’ అన్నాడు. ‘మేమడిగామా?’ అన్నాం. ‘ఎన్ని గంటలు తిప్పమంటారు?’ అని అడిగాడు. ‘అది నీకే తెలియాలి. ఆపమని మేం అనం’ అన్నాం. సముద్రమే రారమ్మని పిలుస్తోంటే గంటలూ రూపాయల బేరాలు తగని విషయం కదా…
నవ్వేసాడు. ఇంజన్ స్టార్ట్ చేసాడు.
భూమి ఎక్కడో సముద్రమెక్కడో తెలియని భూ-జల ప్రపంచంలో ఒక గమ్యమంటూ లేకుండా పడవ ప్రయాణం. ఎదురుగా పచ్చని కొండలు… కొండల నడుమ ఏభై గజాల ‘ఇరుకు’ జలసంధులు… అవతల అనంతసాగరం. ద్వీపాలలో చిక్కని అడవులు… చేపల పడవలు.. అలలు లేని జలధి… ఒక నిర్జన ద్వీపం దగ్గర కాసేపు పడవ ఆపాడు కాళిదాసు. పడవ దిగి ఇద్దరం అలా అలా తిరిగి వచ్చేసరికి రెండడుగుల తెల్ల చేపను వేటాడి చూపించాడు. తిరిగి, తిరిగి, నన్‌కోవ్రీ ద్వీపపు జెట్టీలో పడవ ఆపాడు.చిన్న దీవి. వెయ్యిమంది జనాభా అట. ఒక రకంగా కమోర్తా, నన్‌కోవ్రీ ద్వీపాలను జంటద్వీపాలనవచ్చు. జెట్టీలోంచి అడుగు పెట్టీ పెట్టగానే ఇళ్ళూ దుకాణాలూ పలకరించాయి. గ్రామంలోకి దారి తీస్తోన్న బాటలు. ఒక బాటలో కాస్తంత దూరం వెళ్ళగానే గవర్నమెంటు సీనియర్ సెకండరీ స్కూలు. అంతా కలసి ఈ జంట ద్వీపాలలో నాలుగయిదు ప్రైమరీ స్కూళ్ళు, సెకండరీ స్కూళ్ళూ ఉన్నాయట. అందులో ఒకటి ఇంగ్లీష్ మీడియం.
తిరిగి పడవ ఎక్కడానికి జెట్టీకేసి వెళుతున్నప్పుడు ఏదో తియ్యని పాట వినిపించింది. రేడియోనేమో అనుకొన్నాను. కాదు. ఎవరో నిజంగా పాడుతున్నారు. నా ప్రమేయం లేకుండానే కాళ్ళు నన్ను ఆ చుట్టుగుడిసె ముందుకు తీసుకువెళ్ళాయి. ఎందుకు ఆగానా అని వెతుక్కుంటూ జగన్ వచ్చి చేరాడు. పాట వినిపించి అతనికి విషయం అర్థమయింది. చొరవ చేసి తలుపు తోసాం.
ఊహించని దృశ్యం. ఒక మధ్య వయసు వ్యక్తి గోడకు చేరగిలబడి కాళ్ళు సౌకర్యంగా చాపి మరణం గురించీ, పగిలిన గుండెల గురించీ ఏదో బెంగాలీ పాట పాడుకొంటున్నాడు. సందర్భానికి తగినట్టుగా అతని పాట వింటూ రెండు పెంపుడు ఊరకుక్కలు. వాటికీ సందర్భశుద్ధి పుష్కలం అనుకొంటాను – మా చొరబాటును చూసినా ఏ అల్లరీ చెయ్యలేదు. పాటకుగానీ మాకుగానీ ఆటంకం కలిగించలేదు.
మెల్లగా నిలబడిపోయాం. మా ఉనికిని గ్రహించినా అతను పాట ఆపలేదు. ముగిశాక మరో పాట పాడతావా అని అడిగాను. పాడాడు. ఈసారి బాగా తెలిసిన ముఖేష్ పాట అడిగాను. పాడాడు. బెంగాలీ మూలాలట. ఈ ద్వీపంలోనే చాన్నాళ్లుగా ఉంటున్నాడట. కుటుంబం, పిల్లా పాపల ప్రస్తావన మేము తీసుకురాలేదు. ఫోటోలు దిగుదామంటే సిద్ధపడ్డాడు.ఇలాంటి అనుభవాలకు పేర్లు పెట్టటం కష్టం. వర్ణించడం ఇంకా కష్టం. ‘ఈ అనుభవం ఎంత సహజంగా అమరింది!’ అని సంతోషపడి ఊరుకోవాలి. ఊరుకోవాలి అంటున్నానుగానీ ఏళ్లు గడిచినా కళ్ళముందు తిరుగాడే, మనసుకు వినిపించే అనుభవమది.
“మన కచ్ఛల్ బోటు మూడింటికి… ఇప్పుడింకా పదకొండే. ఏం చేద్దాం?” అడిగాడు జగన్.
“పదండి, ఊళ్ళో తిరిగి వద్దాం,” అంటూ దారి తీసాను. ఊరు బాగా పరిచయం అయిపోయిందిగాబట్టి ప్యాంటూ చొక్కా పక్కన పెట్టి షార్ట్స్, టీ షర్ట్ వేసుకున్నాను.
గెస్ట్‌హౌస్‌కు దగ్గర్లోనే మురుగన్ టెంపుల్ ఉంది. ఇంకాస్త దూరంలో ఇందిరా పార్కు. దాని పక్కన హాకీ గ్రౌండ్. అండమాన్ పీడబ్ల్యూడీ వాళ్ళ ఆకుపచ్చని ఆఫీసు. అన్నిటినీ పలకరిస్తూ గంటా గంటన్నర.
“మీ ఈ తిరుగుళ్ళూ, ఈ అవతారం చూస్తే ఒకప్పుడు బీఈఎల్ లాంటి డిఫెన్స్ కంపెనీలో ఒక యూనిట్‌కు బాధ్యులని గానీ, ఇంజనీరింగూ, మానేజిమెంట్ చదివారనిగానీ ఎవరూ అనుకోరు. మిమ్మల్ని సీరియస్‌గా తీసుకోరు,” ఉన్నట్టుండి అన్నాడు జగన్.
“ఎమ్.ఫిల్ సోషియాలజీ మర్చిపోయారేం? ఏదేమైనా నన్ను నేనే సీరియస్‌గా తీసుకోను. ఇంకెవరైనా ఎలా తీసుకుంటారూ? అసలలా తేలిక మనిషిలా ఉండటంలో ఎంత సుఖముందో మీకు తెలియదూ?”
“తెలుసులెండి. సరదాగా అంటున్నాను. కానీ ఒక్కసారి మీతో నాలుగు నిముషాలు మాట్లాడితే మిమ్మల్ని సీరియస్‌గా తీసుకోకుండా ఉండటం ఎవరికైనా చాలా కష్టం.”
ఆశ్చర్యమనిపించింది. ఈ కోణం ఏనాడూ నా ఆలోచనల్లోకి రాలేదు. జగన్ ప్రశంసల విషయంలో మహా పొదుపరి. అంచేత అతని మాట సంతోషమే కలిగించింది. మరో రెండు గంటల్లో అతని మాట నిజమని ప్రాక్టికల్‌గా ఋజువయింది.
“వెళ్ళే ముందు ఏసీ గారిని కలిసి థాంక్స్ చెపుదామా?” జగన్.
“తప్పకుండా”
అసిస్టెంట్ కమీషనర్ అజయ్ ఆఫీసు మా గెస్ట్‌హౌస్‌కు బాగా దగ్గర.
వెళ్ళాం.
సందేహిస్తూనే ఆయన పీ.యే వెళ్ళి చెప్పి వచ్చాడు. పావుగంట తర్వాత మాకు పిలుపు వచ్చింది.
వీలయినంత క్లుప్తంగా థాంక్స్ చెపుదామని వెళ్ళాం. అసిస్టెంట్ కమీషనర్ అంటే ఎక్కడైనా బిజీగా ఉండే అధికారి.
టీ చెప్పారాయన. అంటే స్థిమితంగానే వందన సమర్పణ చెయ్యవచ్చన్నమాట.
కుతూహలం కొద్దీ ఆయన నికోబార్ పరిపాలన అనుభవాలు అడిగాం.
వివరంగా చెప్పుకొచ్చారు. స్కూళ్ళు, హెల్త్ సెంటర్లు, రవాణా సౌకర్యాలు, ట్రైబల్ కౌన్సిళ్ళు – వివరంగా చెప్పారు. అత్యవసర పరిస్థితుల్లో – ముఖ్యంగా వైద్యసౌకర్యం విషయంలో మూలవాసులకు హెలికాప్టర్ సీట్ల విషయంలో ప్రయారిటీ ఇవ్వడం చెప్పారు.
చర్చ నికోబారీలు, వారి సంస్కృతి, ఆచార్య వ్యవహారాలు, జీవనవిధానం మీదకు మళ్ళింది. “గత రెండు దశాబ్దాలుగా – సునామీ తర్వాత, ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలు అద్వితీయం. అయినా నాకు ఎక్కడో అనిపిస్తూ ఉంటుంది – వీటన్నిటివల్లా ఈ నికోబారీలు తమ మూలస్వభావానికీ జీవన సరళికీ పూర్తిగా దూరమవుతున్నారన్న భావన నన్ను వ్యక్తిగతంగా ఇబ్బంది పెడుతూ ఉంటుంది,’ అంటూ మనసు విప్పారాయన.
జీవనసరళి విషయంలో ప్రపంచమంతా కొత్త పోకడలు పోవడం, బ్రతుకులు సరుకులుగా, వాణిజ్య వస్తువులుగా మారడం, ధనమే జీవితాలనూ నాగరికతలనూ శాసించే శక్తిగా పరిణమించడం మా మాటల్లో దొర్లింది. ‘గత ఏభై యేళ్ళుగా డబ్బును నా నాలుగో ప్రయారిటీగా ఉంచగలిగాను’ అన్నపుడు ఆయన అర్థం చేసుకోగలిగారు. ‘అలా కూడా కార్పొరేట్ ప్రపంచంలో ఉన్న మనుషులు ఉండగలరా,’ అని ఆనందాశ్చర్యాలు ప్రకటించారు.తెలియకుండానే రెండు గంటలు గడిచిపోయాయి. మేము సారీలు చెపుతోంటే ఆయన గట్టిగా వారించారు: ‘ఇలాంటి సంభాషణ జరిపి ఏళ్లు పూళ్ళు అయింది. ఇది నాకు అరుదైన అవకాశం’ అన్నారు. తెలుగు పుస్తకమే అయినా ఆ హిందీ మనిషికి నా ‘అండమాన్ డైరీ’ జ్ఞాపికగా ఇచ్చాను.
ఒక యువ అధికారికి అంత నమ్రత ఉంటుందని ఊహించలేదు.
కమోర్తా ద్వీపానికి నైరృతి దిశలో పదీ పదిహేను కిలోమీటర్ల దూరాన ఉన్న దీవి కచ్ఛల్. వైశాల్యం రీత్యా కార్ నికోబార్, కమోర్తా ద్వీపాలతో సరితూగినా జనాభా అంతా కలసి 2700 మాత్రమే. అంటే కార్ నికోబార్‌లో ఏడవ వంతు. జనాభా తక్కువే అయినా వాళ్ళంతా 37 గ్రామాల్లో విస్తరించి ఉన్నారు. మళ్ళా ఆ విస్తరణ అంతా ద్వీపపు ఉత్తరభాగంలోనే – దక్షిణ భాగం దాదాపు నిర్జనం. పరిపాలనాపరంగా ఈ దీవి కమోర్తాలో ఉన్న అసిస్టెంట్ కమిషనర్ పరిధిలోకి వస్తుంది. స్థానిక విషయాల విషయంలో కచ్ఛల్ ద్వీపంలోని అండమాన్ పీడబ్ల్యూడీ ఇంజనీర్ సమన్వయకర్తగా వ్యవహరిస్తూ ఉంటారు. అన్నట్టు ఇక్కడి జనాభాలో సగంమంది మాత్రమే నికోబారీలు. దాదాపు సగంమంది తమిళనాడు, శ్రీలంకలకు చెందిన తమిళులు. కొద్దిమంది తెలుగువాళ్ళు.
కచ్ఛల్ జెట్టీ దగ్గర పడవ దిగేసరికి నాలుగు దాటింది. రిసీవ్ చేసుకోడానికి వచ్చిన ఉద్యోగి మమ్మల్ని గెస్ట్‌హౌస్‌లో దింపి, స్కూటర్ ఏర్పాట్లు కూడా చేసి పెట్టాడు. వైఫై కనెక్ట్ చేసుకోవడంలో మేము ఇబ్బంది పడుతోంటే తనకున్న స్థానికజ్ఞానంతో ఎయిర్‌టెల్ కనెక్ట్ చేసి పెట్టాడు. ఈసారి ఏక్టివా బండి దొరికింది. బైక్‌కన్నా ఏక్టివా నాకు బాగా అనుకూలం. జగన్ మీద ఆధారపడకుండా నా అంతట నేనే ఎక్కడికైనా వెళ్ళొచ్చన్న మాట. రెక్కలు విప్పిన సంతోషం.
కమోర్తాలో రీసెర్చి విద్యార్ధులు చెప్పినట్టుగానే కచ్ఛల్ గెస్ట్‌హౌస్‌కు అనుబంధంగా ఉన్న పూలతోట మహా దివ్యంగా ఉంది. ఎవరి పుణ్యమోగానీ తీర్చిదిద్దిన పూల మళ్ళు, వాటి మధ్య కాలిబాటలు, మధ్యలో ఒక రెల్లుగడ్డి కప్పిన చుట్టిల్లు, ఒకే మొక్కకు పూసిన రంగురంగుల పూలు – అక్కడ రెండు రోజులు ఉండగలగడం ఏ విధంగా చూసినా ఒక సౌభాగ్యమే. అందుకు తగ్గట్టు కచ్ఛల్‌లో నాకూ జగన్‌కూ విడి విడి గదులు ఇచ్చారు. ఏకాంతం ఎంతగానో అవసరమైన చోట అలా విడి గదులు దొరకడం యాదృచ్ఛికమేనా? తోటలో తిరిగిన ఉత్సాహం అలా బయటకు వెళ్ళి రోడ్లు చూసి రావడానికి దారి తీసింది. అప్పటికే అయిదున్నర అయింది. చీకట్లు ముసిరే సమయం. గెస్ట్‌హౌస్ ఊరికి దూరంగా ఉన్నట్టుంది – ఇళ్ళేమీ కనిపించలేదు. ఓ పక్క పెట్రోల్ బంక్ ఉన్నట్టు, ఇంకా ముందుకు వెళితే ఏదో చర్చి ఉన్నట్టూ జాడ తెలిసింది. ఎందుకో అదంతా ఒక మునివాటికను తలపించింది. ఆకులు లేని చెట్ల మధ్య ఉన్న కాస్తంత వెలుగునూ చీకటి మింగేయసాగింది. ఆ చీకటిని జయిస్తూ వెన్నెల… మేమూ ఉన్నామంటూ తోటలోని దీపాలు తమ ఉనికిని చాటడం మొదలెట్టాయి. మెల్లగా గదుల్లోకి చేరుకుని ఇద్దరం కబుర్లలో మునిగిపోయాం. కేర్‌టేకర్ తెలుగు తెలిసిన తమిళ మనిషి. వంట ఇంటి మనిషి కలుపుగోలు తెలుగావిడ – ఇంకేం, చిన్న కుటుంబ వాతావరణం… రాత్రి భోజనం.. వెలిగే చతుర్దశి చంద్రుడు… చక్కని తోట.. దగ్గర్లోని బీచ్‌కు వెళదామా అన్న ఆలోచన.. వద్దులే, రేపు బీచ్‌లోనే పూర్ణచంద్రుడిని తనివితీరా చూద్దాం అనుకొని ఆ ఆలోచనని విరమించాం.28 అక్టోబర్, 2023, శనివారం.
మా గెస్ట్‌హౌస్‌కు రెండే రెండు కిలోమీటర్ల దూరంలో ద్వీపంలోకెల్లా ముఖ్యమైన కపంగ బీచ్ ఉందని కేర్‌టేకర్ మాటల్లో తెలిసింది. సహజంగానే అది ఆనాటి మా మొట్టమొదటి శోధనాబిందువు అయింది. ఇంకా అయిదు కాక ముందే ఎర్ర ఏక్టివాను ముందుకు ఉరికించాం.
నిన్న మేము దిగిన జెట్టీ దారిలోనే ఒక మైలు దూరం వెళ్ళి ఎడమకు మళ్ళితే కపంగ చేరతామని గూగుల్ చెప్పింది. ఆ మలుపు దిగే దగ్గర ట్రై జంక్షన్లో ఏనాడో కట్టిన సిమెంట్ దిమ్మ. పైన గాంధీగారి విగ్రహం.
దిమ్మ మీద ఉన్న ఫలకంలో ఏమి రాసి ఉందో చూద్దామని వెళితే అక్కడ ఆదర్శ గ్రామం లక్షణాలు వివరంగా చెక్కి కనిపించాయి: స్థానికంగా దొరికే నిర్మాణసామగ్రితో కట్టిన ఇళ్ళు, ఇంటి వెనుక కూరగాయల మళ్ళు, ముందు పశువుల శాలలు, దుమ్మూ ధూళీ లేని దారులు, కాలుష్యానికి అవకాశంలేని మురుగు నీటి పారుదల వ్యవస్థ, అందరికీ అందుబాటులో ఉండే మంచినీటి బావులు, అన్ని ధర్మాల వారికీ ఉపయోగపడే ప్రార్థనా స్థలాలు, పారిశ్రామిక నైపుణ్యం నేర్పే పాఠశాలలు, పాల సేకరణ కోసం సహకార కేంద్రం, ఉమ్మడి సమావేశ స్థలం, వివాదాలు పరిష్కరించే పంచాయితీ, ఆహారధాన్యాల విషయంలో స్వయం సమృద్ధత, దుస్తుల కోసం ఖాదీ వడికే వ్యవస్థ – ఎవరివీ ఈ ఆలోచనలూ? ఖాదీ ప్రస్తావన ఉంది గదా, సందేహమెందుకూ? గాంధీగారివి.
ఆయన ఆ మాటలు వందేళ్ళ క్రితం అన్నపుడే అదంతా చాదస్తం అన్నవాళ్లు ఉన్నారు. ‘కాదు – ఆచరణ సాధ్యం,’ అని భారతదేశపు మెయిన్‌లాండ్‌కు వెయ్యి కిలోమీటర్ల దూరాన, సముద్రం మధ్యన, సగటున పది కిలోమీటర్ల పొడవూ ఎనిమిది కిలోమీటర్ల వెడల్పూ ఉన్న హైడ్రా రూపపు చిరుద్వీపంలో – అలాంటి ఆదర్శగ్రామాలు ఒకటి కాదు, రెండు కాదు – ముప్ఫై ఏడింటికి రూపకల్పన చెయ్యడం ద్వారా నిరూపించారు. అందుకు పరిపాలనా వ్యవస్థ అందించిన చేయూత ఎంతైనా కారణం అన్నది నిర్వివాదం. ఆ ఫలకాన్ని మొదటిసారి చూసినపుడు మేము కూడా ‘గాంధీ గారంటేనే మహా ఆదర్శజీవి’ అని తేలికగా తీసుకున్న మాట నిజం. రెండు రోజులు ద్వీపమంతా తిరిగాక ఆదర్శాలకు నిబద్ధత సమకూరితే ఆచరణ సులభసాధ్యమే అని స్పష్టమయింది.
(సశేషం)



















