7.1 పెనలోపీ
ఇథకా రాణి పెనలోపీ, తండ్రిని వెతకడానికని వెళ్ళిన కొడుకు టెలెమాకస్ క్షేమసమాచారాలు తెలియక, దేవుణ్ణి ప్రార్ధిస్తూ, కంటికీ మంటికీ ఏకధారగా ఏడుస్తూంది. ఐదు వారాల క్రితం ఆ యువకుడు తండ్రి ఒడిస్సియస్ని వెతికి తీసుకొస్తానని పడవలో బయలుదేరేడు. అతను బయలుదేరి వెళ్ళిన తరువాత తెలిసింది, తనను వేధించుకు తింటూన్న ఉపసర్పికులు టెలెమాకస్ని దారిలో మాటు వేసి చంపడానికి కుట్రలు పన్నుతున్నారని.
ఏళ్ళ తరబడి ఈ ఉపసర్పికులు ఒడిస్సియస్ రాజప్రాసాదాన్ని అక్రమంగా ఆక్రమించేరు. ప్రతి రోజూ వాళ్ళు పెనలోపీని వేధించుకుని తింటున్నారు. ఆమె ఇంటి మీదకు, ఆస్తుల మీదకు దండయాత్ర చేస్తున్నారు. తమలో ఎవరినో ఒకరిని వరించి వివాహమాడమని ఒత్తిడి చేస్తున్నారు. ఇన్ని దిశలనుండి ఇన్ని ఇబ్బందులను ఎదుర్కుంటూ ఉన్నా ఆమెకి ఒడిస్సియస్ మీద ఉన్న అనురాగం లేశమంతయినా తగ్గలేదు. బెదిరింపులను, అవమానాలనూ భరిస్తూ, ఉపసర్పికులను ఆశ పెడుతూ, ఊరిస్తూ, పెడదారి పట్టిస్తూ కాలయాపన చేసింది కానీ వారికి లొంగలేదు.
ఇప్పుడు పరిస్థితి ఎలా పరిణమించింది? భర్త కనుమరుగై ఇరవై ఏళ్ళు దాటుతోంది. ఆ భర్త ఉనికిని కనుక్కోడానికి వెళ్ళిన కొడుకు ఇంతవరకూ ఇంటికి రాలేదు. రెంటికి చెడ్డ రేవడిలా తయారయింది ఆమె పరిస్థితి. తన గదిలో కాలు కాలిన పిల్లిలా పచార్లు చేస్తూంది. కిందనుండి ఎవ్వరో తనను పిలుస్తూన్నట్లు వినిపించింది. కిటికీ దగ్గరకు వెళ్ళి కిందకు చూసింది. వాళ్ళ పందులకాపరి పిలుస్తున్నాడు. అతను ఊరి బయట పందులదొడ్డి దగ్గర ఉంటాడు. ఇక్కడికి రావలసిన పనేమిటి? పైపెచ్చు అతని చుట్టూ పరిచారికలు, వారి చుట్టూ కొంతమంది ఉపసర్పికులు ఉన్నారు.
“అమ్మగారూ! మీరిక చింతించవలసిన పని లేదు. మీ అబ్బాయి క్షేమంగా మన ద్వీపానికి తిరిగి వచ్చేడు. ఇప్పుడు నా దగ్గర నా గుడిసెలో ఉన్నాడు.”
ఈ వార్త విని పెనలోపీ ఆనందబాష్పాలతో ఉక్కిరిబిక్కిరి అయింది. ఉపసర్పికుల హృదయాలకు ఈ వార్త అశనిపాతంలా తగిలింది. వాళ్ళు ఊరుకుంటారా? వెంటనే టెలెమాకస్ని అంతమొందించడానికి మరొక పన్నాగం పన్నడం మొదలు పెట్టేరు. ఈ వార్త వినగానే పెనలోపీ హృదయం ఒక్కసారి భగ్గుమంది. ఆమె కోపంతో కిందకు వచ్చింది. వచ్చి, ఉపసర్పికుల నాయకుడైన ఎంటినోయిస్ని ఉద్దేశించి —
“నీకు నీతీ నిజాయితీ ఉన్నాయా? ఒక అల్లరిమూక దాడి చేసినప్పుడు నా భర్త ఒడిస్సియస్ నీ తండ్రి ప్రాణాలు రక్షించేడు, జ్ఞాపకం ఉందా? ఇప్పుడు నువ్వు ఒడిస్సియస్ స్థానంలో నిలబడి అతని కొడుకు ప్రాణాలు తియ్యడానికి కుట్ర పన్నుతున్నావు. ఎన్ని దమ్ములురా నీకు?”
ఈ ప్రశ్నకు ఎంటినోయిస్ సమాధానం ఇచ్చేలోగా అల్లరిమూకలో ఉన్న మరొక రాకుమారుడు, గుమిగూడిన గుంపునుండి అరిచేడు: “మరేమీ భయపడకు, రాణీ! మానుండి నీ కొడుకుకు ఏ ప్రమాదమూ లేదు. కానీ ఆ కొండమీద దేవుళ్ళు వేరేలా ఆలోచిస్తే మేము చేయగలిగేది ఏమీ ఉండదు.”
ఈ పరిస్థితిలో చేయగలిగేది ఏమీ లేక కళ్ళు వాచేలా ఏడుస్తూ పెనలోపీ మేడ మీద తన గదిలోకి వెళ్ళిపోయింది.
ఆమె బాధ చూడలేక అథీనా దేవత నిద్ర అనే వరాన్ని ఇచ్చి ఆ వాచిన కళ్ళు మూసుకునేలా చేసింది.
7.2 రాజభవనం
అథీనా దేవత ఒడిస్సియస్ మీద ఒక కన్నూ, టెలెమాకస్ మీద ఒక కన్నూ వేసి చూస్తూనే ఉంది. రెండు రోజుల క్రితమే ఒడిస్సియస్ సముద్రపుటొడ్డున గమ్యం తెలియకుండా తిరుగుతూ ఉంటే అథీనా అతనికి ముసలి ముష్టివాడి రూపం ఇచ్చి పందులకాపరి దగ్గరకు పంపింది కదా.
పందులకాపరి గుడిసె దగ్గరకు ఒడిస్సియస్ కుంటుకుంటూ వెళ్ళినప్పుడు ఆ పందులకాపరి ఒడిస్సియస్ని గుర్తుపట్టలేదు. తరువాత టెలెమాకస్ పందులకాపరి గుడిసె దగ్గరకు వచ్చినప్పుడు అతను కూడా ఒడిస్సియస్ని గుర్తుపట్టలేదు. అప్పుడు అథీనా దేవత ఒడిస్సియస్ మారువేషాన్ని తీసేసి అసలు రూపాన్ని ఇచ్చింది. అప్పుడు తండ్రి, కొడుకు ఉమ్మడిగా, సావధానంగా, నూటఎనిమిదిమంది రాకుమారులని మట్టుబెట్టడానికి ఒక రహస్యపథకం తయారు చేసేరు. ఇప్పుడు ఆ పథకాన్ని మరొకసారి పరామర్శించి చూస్తున్నారు.
“నేను ముష్టివాడి వేషంలో అక్కడకి వస్తాను. నేనెవరో నీకు తెలియనట్లు నువ్వు నటించాలని గుర్తు పెట్టుకో. నాకు ఎవ్వరైనా అపకారం తలపెట్టినా, నాకేదైనా ప్రమాదం ఆసన్నమైనా నువ్వు ఏమాత్రం స్పందించకూడదు. నేనెవరో నీకు తెలియదు. జ్ఞాపకం ఉంచుకో!” ఒడిస్సియస్ కొడుకుతో చెప్పేడు.
“ఆయుధాలు ఎప్పుడు, ఎక్కడ దాచిపెట్టాలో మీరు నాకు చెబుతారు. అవునా?” టెలెమాకస్ అడిగేడు.
“అవును” అని భరోసా ఇచ్చేడు ఒడిస్సియస్. “అథీనా మనకి సహాయం చేస్తానని వాగ్దానం చేసింది. ఆమె ప్రత్యక్షం అయి నాకు సై చెప్పగానే మనం వసారాలో ఉన్న బల్లేలు, డాళ్ళు, యుద్ధసామగ్రి తీసుకుని మేడ మీద ఉన్న కొట్టుగదిలో దాచెయ్యాలి.”
పందులకాపరి రావడం చూసి వాళ్ళు ఈ సంభాషణని ఆపు చేసేరు. అథీనా ప్రభావంవల్ల ఒడిస్సియస్కి మళ్ళా ముసలి బిచ్చగాడి రూపు వచ్చేసింది. ముగ్గురూ రాత్రి భోజనం తయారు చెయ్యడంలో నిమగ్నమైపోయారు. తండ్రి, కొడుకు తమ ప్రణాళికను మనస్సులోనే దాచుకున్నారు.
మరునాడు ఉదయం, పొద్దెక్కక మునుపే, టెలెమాకస్ లేచి ఊరు బయట ఉన్న పందులకాపరి గుడిసెను వదలిపెట్టి, రాజప్రాసాదం చేరుకున్నాడు. రాబోయే పోట్లాట ఎలా పరిణమిస్తుందో అన్న చింతతో అతని మనస్సు అల్లకల్లోలంగా ఉంది.
టెలెమాకస్ ఇంటికి రాగానే అతని చిన్ననాటి పరిచారిక యూరిక్లేయా అపరిమితానందంతో అతన్ని స్వాగతించింది. వెనువెంటనే అతని తల్లి పెనలొపీ వచ్చి అతన్ని ఆలింగనం చేసి ఆనందబాష్పాలతో అతని శిరస్సును తడిపింది.
“నా బాచాల కొండా! నా పంచప్రాణాలూ! ప్రాణాలతో తిరిగి వచ్చావు. నాకంతే చాలు,” అంటూ పొంగి పొర్లుతూన్న మాతృప్రేమకు అడ్డుగోడ వెయ్యలేక భోరున ఏడ్చేసింది.
“అమ్మా, నేను నాన్నగారిని వెతుకుతూ చాలా చోట్ల తిరిగేను; స్పార్టా దేశంవరకూ వెళ్ళేను. అక్కడ రాజా మెనలెయస్, రాణి హెలెన్ ఎంత మర్యాద చేసేరనుకున్నావ్? అభిమానంగా పలకరించేరు, మంచి సలహాలు ఇచ్చేరు, తిరిగి వచ్చేటప్పుడు ఎన్నో బంగారు వస్తువులు బహుమానంగా ఇచ్చేరు!”
“ఇంతకీ మీ నాన్నగారి గురించి ఏమి వార్త పట్టుకొచ్చేవ్?”
టెలెమాకస్ ఇరుకులో పడ్డాడు. ఒడిస్సియస్ తిరిగి ఇథకా వచ్చేసేడన్న విషయం ఎవ్వరికీ చెప్పనని తండ్రికి చేసిన వాగ్దానం మనస్సులో పెట్టుకుని, తల్లికి అబద్ధం చెప్పడం ఇష్టం లేక, ఇలా సమాధానం ఇచ్చేడు: “అమ్మా, రాజా మెనలెయస్ చెప్పిన సంగతి నీకు చెబుతాను. చాలా కాలం క్రితం సముద్రంలో ఉండే ఒక ముసలి జీవి చెప్పిన కథనం ప్రకారం కలిప్సో దేవత ఒడిస్సియస్ని తన ద్వీపంలో బంధించి ఉంచిందిట. ఆ ద్వీపం వదలి ఇంటికి రావడానికి ఆయన వద్ద పడవ లేదుట.”
ఇలా ఒక పక్క తల్లితో తన ప్రయాణపు అనుభవాలు టెలెమాకస్ చెబుతూ ఉంటే, మరొక పక్కనుండి ఒడిస్సియస్ రాజభవనం వైపు అడుగులు వేసుకుంటూ వస్తున్నాడు. ముసలి వేషంలో ఉన్న ఒడిస్సియస్ని పందులకాపరి నెమ్మదిగా నడిపించుకుని వస్తున్నాడు.
వాళ్ళిద్దరూ రాజప్రాసాదపు ద్వారం దరిదాపుల్లోకి వచ్చేసరికి అక్కడ ఒక పెంటకుప్ప మీద బక్కచిక్కిన కుక్క ఒకటి కనిపించింది. హృదయవిదారకంగా ఉన్న ఆ కుక్క పరిస్థితి చూసి ఒడిస్సియస్ హృదయం ద్రవించింది. అది తన ప్రీతిపాత్రమైన ఆర్గస్ (AR-guss).
ఒడిస్సియస్ని ఆర్గస్ గుర్తుపట్టినట్లుంది. నీరసంతో కదలలేక నెమ్మదిగా, మక్కువతో తోకాడించింది.
“ఈ కుక్క దిక్కులేని స్థితిలో ఇక్కడ ఈ పెంటకుప్ప మీద ఎందుకు పడి ఉంది?” ఒడిస్సియస్ పక్కనున్న పందులకాపరిని అడిగేడు.
“ఆయ్! ఒకప్పుడు ఇది మా ఒడిస్సియస్ రాజావారి పెంపుడు కుక్క. ఆయన దీన్ని ఆరో ప్రాణంగా చూసుకునేవారు. ఇప్పుడు రాజభవనం, రాజ్యం దారుణమైన స్థితికి దిగజారిపోయాయి. అరాచకం పెరిగిపోయింది. ఈ ముసలి కుక్కని ఎవరు చూస్తారు? ఏళ్ళ తరబడి ఒడిస్సియస్ రాజా వారి రాకకోసం ఈ కుక్క ఎదురుచూసింది. నోరు లేని ఈ జంతువుకు ఎవరు చెబుతారు? రాజా వారు ఇక రారని ఎవరు చెబుతారు?” పందులకాపరి కళ్ళ వెంబడి నీళ్ళు కారేయి.
బరువెక్కిన గుండెతో ముందుకు కదిలేడు ఒడిస్సియస్. పందులకాపరి ప్రాంగణపు ద్వారం తెరిచేడు. ఇద్దరూ లోపలికి వెళుతూ ఉంటే కదలలేని కుక్క ఒడిస్సియస్ని చూస్తూ కళ్ళు మూసుకుంది. దాని మనోనేత్రంలో ఒడిస్సియస్ ఆకారం చివరిసారి ముద్ర పడింది. దాని చివరి కోరిక తీరింది. దాని యజమాని ఎట్టకేలకు ఇంటికి వచ్చేడు.
7.3 బిచ్చగాడు
చిరిగిన దుప్పటిని భుజాన వేసుకుని, ఆనుకర్రని ఆసరాగా చేసుకుని, వంగి వంగి నడుస్తూ ఒడిస్సియస్, ఒకానొకప్పుడు తాను నివసించిన రాజభవనం చేరుకున్నాడు. పూర్వవైభవం గుర్తుకు రాగా ఆ భవనాన్ని నిశ్చేష్టుడై చూస్తూ నిలబడ్డాడు.
ఇంతలోనే ఉపసర్పిక రాకుమారులు ఒక్కొక్కరూ రాజభవనంలోకి ప్రవేశించడం మొదలుపెట్టేరు. మరెవ్వరికీ కనబడకుండా అథీనా వచ్చి ఒడిస్సియస్ దృష్టిపథంలో నిలచింది. నిలచి, అతని చెవిలో రహస్యంగా చెప్పింది: “నువ్వు కూడా లోపలికి వెళ్ళి, ఉపసర్పిక రాకుమారులను కలుసుకుని, పాత్రలో భిక్ష వేసి సహాయం చెయ్యమని యాచన చెయ్యి. ఒక్క దెబ్బలో వారిలో మంచివాళ్ళు ఎవ్వరో, చెడ్డవాళ్ళు ఎవ్వరో తెలిసిపోతుంది.”
అథీనా చెప్పినట్లే ఒడిస్సియస్ చేసేడు. కుంటుకుంటూ ప్రతి రాకుమారుడి దగ్గరకు వెళ్ళి ఆకలి వేస్తున్నదనిన్నీ, తినడానికి ఏదైనా సహాయం చెయ్యమనీ అడగడం మొదలు పెట్టేడు.
ఎంటినోయిస్ ఛీత్కారంతో ఒడిస్సియస్ని పొమ్మన్నాడు. “పోవయ్యా! ముష్టెత్తుకోడానికి సిగ్గెయ్యడం లేదూ? నా తిండి నీకివ్వాలా?”
ఎంటినోయిస్ కళ్ళల్లోకి సూటిగా చూస్తూ, ఒడిస్సియస్ బింకంగా సమాధానం ఇచ్చేడు: “నువ్వు చేస్తూన్నది ఏమిటిట? పరాయి ఇంట్లో చొరబడి అప్పనంగా తింటం ముష్టెత్తుకోవడం కాదూ?”
మాటకు మాట సమాధానం చెప్పేసరికి ఎంటినోయిస్కి చిర్రెత్తుకొచ్చింది. ఎదురుగుండా కనిపిస్తూన్న కుర్చీని చేతబట్టి ఒడిస్సియస్ మీదకు విసిరికొట్టేడు.
దెబ్బ తిన్న ఒడిస్సియస్ మారుమాట్లాడకుండా అక్కడనుండి తప్పుకున్నాడు.
ఈ సంఘటన చూసి టెలెమాకస్ ఉగ్రుడయ్యాడు. అతనిలోని ఉడుకు రక్తం ఊరుకుంటుందా? ఎంటినోయిస్ మీదకు ఒక్కసారి లంఘించబోయాడు. కానీ తండ్రికి ఇచ్చిన మాట జ్ఞాపకం వచ్చి తమాయించుకున్నాడు. కానీ దూరంనుండి చూస్తూన్న పెనలొపీ ఊరుకోలేకపోయింది.
“ఇలా అసహ్యంగా ప్రవర్తిస్తూన్న ఎంటినోయిస్ని అథీనా దేవత వచ్చి చంపేస్తే బాగుణ్ణు. నన్ను పరిణయమాడదామని ఎదురుచూస్తూన్న ఈ రాజకుమారులంతా నీచులు. వారిలో ఈ ఎంటినోయిస్ పరమనీచుడు. ఆ ముసలి ముష్టివాడిని నా దగ్గరకు తీసుకు రండి. చూడ్డానికి దేశదిమ్మరిలా ఉన్నాడు. తినడానికి ఏదైనా ఇస్తాను.”
ఒక పరిచారిక రాణిగారి కోరికని ఒడిస్సియస్కి తెలియజేసింది.
“చీకటి పడ్డ తరువాత వస్తానని చెప్పు. వచ్చినప్పుడు రాజా ఒడిస్సియస్ గురించి వార్తని తీసుకొస్తానని చెప్పు.”
సాయంకాలం కోసం, చీకటికోసం ఎదురు చూస్తున్నాడు ఒడిస్సియస్. ఈలోగా ఉపసర్పిక రాకుమారుల ఆగడాలు మితిమీరి పోతున్నాయి. మండువా ఆవరణ అంతా ఈ కోతిమూకతో నిండిపోతున్నది. తాగుతున్నారు. తందనాలాడుతున్నారు. పాటలు పాడుతున్నారు. కేరింతలు కొడుతున్నారు. వాళ్ళలో వాళ్ళు కొట్లాడుకుంటున్నారు. బిచ్చగాడిని తిడుతున్నారు. ఎగతాళి చేస్తున్నారు.
ఇదంతా చూస్తూ టెలెమాకస్ ఊరుకోలేకపోయాడు.
“బుద్ధిహీనులారా? మీకు పిచ్చెక్కిందా? దయ్యం పట్టిందా? వెంటనే రాజభవనం విడిచి వెళ్ళిపోండి.”
ఇంత ధైర్యంగా టెలెమాకస్ మాట్లాడుతూ ఉంటే రాకుమారులు కొంచెం భయపడ్డారు. తోకలు ముడిచి ఒక్కొక్కరూ ప్రాంగణం విడచి వెళ్ళిపోయారు.
అందరూ బయటికి వెళ్ళిన తరువాత ఒడిస్సియస్కి కనబడి అథీనా ఒక సంకేతాన్ని ఇచ్చింది.
ఒడిస్సియస్ వెంటనే టెలెమాకస్ దగ్గరకు వెళ్ళి “ఇదే మన అవకాశం! ఇక్కడున్న ఆయుధాలన్నింటినీ కిందనుండి పై అంతస్తులోకి తరలించాలి. అనగా కత్తులు, శూలాలు, కవచాలు, యుద్ధసామగ్రి అంతా. ఎవ్వరైనా ఎందుకిలా చేస్తున్నారని అడిగితే కింద గదులలో పొగపట్టి పాడైపోతున్నాయని చెప్పు.”
అథీనా చేతిలో ఉన్న బంగారు దీపం ఎవ్వరి కంటికీ కనిపించడం లేదు కానీ ఆ చల్లటి కాంతిరేఖలు ఆ చీకట్లో మార్గాన్ని చూపిస్తున్నాయి. తండ్రీ కొడుకూ ఒక క్రమపద్ధతిలో, కిందనున్న అస్త్రశస్త్రాలన్నిటినీ – కవచాలు, శిరస్త్రాణాలు, కత్తులు, శూలాలు, తదితర యుద్ధసామగ్రి – కిందనుండి పైకి తీసుకుని వెళ్ళిపోయారు.
“ఇప్పుడు నువ్వు నీ గదిలోకి వెళ్ళి సుఖంగా నిద్రపో. చెయ్యవలసిన పనంతా రేపు ఉంది,” అని ఒడిస్సియస్ తన కొడుకును పంపించేసేడు.
7.4 పోరాటానికి ముందు రాత్రి
చీకటి పడింది. రాజప్రాసాదంలో అలికిడి తగ్గింది. పక్కనున్న మంట సెగలో చలికాగుతూ వెండి, దంతపు నగిషీలతో అలంకరించబడ్డ కుర్చీలో కూర్చున్న రాణి పెనలొపీ సాక్షాత్తూ ఆ ప్రేమదేవత ఆఫ్రొడైటీ అందాన్ని తలదన్నే అందంతో మెరిసిపోతూంది.
“మన అతిథి కూర్చోడానికి ఇక్కడ ఒక బల్ల వేయండి,” పెనలొపీ పరిచారికలతో చెప్పింది.
ఒక బల్ల పట్టుకొచ్చి వేసి, దాని మీద మెత్తని గొర్రె చర్మం కప్పేరు. అప్పుడు పరిచారికలు బయటికి వెళ్ళి అక్కడ నిరీక్షిస్తూ నిలబడ్డ ఒడిస్సియస్ని లోపలికి తీసుకువచ్చి కూర్చోబెట్టేరు.
“స్వాగతం, స్నేహితుడా! ఇప్పుడు చెప్పండి. మీరు ఎవరు? ఎక్కడనుండి వస్తున్నారు? మీ కుటుంబం ఎక్కడ ఉంది?”
చలినుండి రక్షణ ఇస్తూ, తలచుట్టూ కట్టుకున్న ముసుగువల్ల అతని ముఖం ఆ చీకటి రాత్రిలో స్ఫుటంగా కనిపించడం లేదు. నీరసించిన స్వరంతో అతను మాట్లాడడం మొదలుపెట్టేడు.
“రాజా ఒడిస్సియస్ ధర్మపత్ని అయిన పెనలొపీ దేవీ! నన్ను క్షమించాలి. దయచేసి నా స్వగ్రామం గురించి కానీ, నా సంసారం గురించి కానీ అడిగి బాధాకరమైన పూర్వస్మృతులను కెలికి బయటకు లాగకండి. తలుచుకుంటేనే దుఃఖం పొంగి పొర్లి వస్తోంది.”
“నేను అర్థం చేసుకోగలను. నా దుఃఖజీవితం మొదలయి ఇరవై ఏళ్ళు అవుతోంది. అప్పుడు నా భర్త ఒడిస్సియస్, ట్రోయ్ నగరంలో జరుగుతూన్న యుద్ధంలో పాల్గొనడానికి నన్నూ, పొత్తిళ్ళలో ఉన్న నెలల పిల్లాడిని వదలి వెళ్ళిపోయారు. ఇప్పటివరకు ఆయన జాడ తెలియలేదు. ఆయన ఇంటిదగ్గర లేకపోవడం చూసి ఎందరో రాకుమారులు నన్ను పరిణయమాడడానికి ముందుకు వస్తున్నారు. ఒత్తిడి తెస్తున్నారు. ఈ ప్రయత్నంలో వారు మా కోటలోనే పాగా వేసేరు. వాళ్ళను వదిలించుకోవడమెలాగో తెలియడం లేదు. నా భర్త ఒడిస్సియస్ ఇహ తిరిగి రాడనీ, అతని కోసం ఎదురు చూడడం వ్యర్థమనీ నూరి పోస్తున్నారు.
“వాళ్ళ పోరు పడలేక రకరకాలుగా వాళ్ళను అదుపులో పెడుతూ వచ్చేను. నేను మా మామగారి అంతిమయాత్రకని అల్లుతూన్న ప్రేతవస్త్రం పూర్తి అయేవరకు పెళ్ళి ప్రస్తావన అనుచితమని వారిని నమ్మించేను. పగలు అల్లిన అల్లికని ప్రతి రాత్రి విప్పేస్తూ ఉండేదానిని; అలా ఆ అల్లిక ఎప్పటికీ పూర్తవకుండా పొడిగించుకుంటూ వచ్చేను.
“ఇలా మాయమాటలు చెబుతూ మూడేళ్ళు నెట్టుకు వచ్చేను. కానీ ఈ రహస్యాన్ని ఒక పరిచారిక వారి చెవిలో ఊదేసింది. నా మాటను గౌరవిస్తూ వాళ్ళు మూడేళ్ళు ఆగేరు. ఇప్పుడు ఇహ ఆగడానికి వీలు పడదు, నా మాట నిలబెట్టుకోమని ఒత్తిడి తెస్తున్నారు. నాకు దారీ తెన్నూ తెలియడం లేదు. ఈ పదేళ్ళబట్టీ పడుతూన్న బాధలతో నా మెదడు మొద్దుబారిపోయింది. ఆలోచించే శక్తి నశించిపోయింది. ఈ రాకుమారుల దాడినుండి నన్ను రక్షించే దిక్కు కనబడడం లేదు.”
పెనలొపీ నిట్టూర్చింది. “నా గాథను మీకు చెప్పేను. ఇప్పుడు మీ కథను కూడా నాకు చెప్పండి. మీరు చెట్టుకు, పుట్టకు పుట్టి గాలి తాగి బ్రతకడం లేదు కదా!”
ఒడిస్సియస్ కళ్ళు మిటకరించకుండా సూటిగా ఆమె కళ్ళల్లోకి చూస్తూ తన కథను అల్లుకు వచ్చేడు. “నేను మానూ, మాకును కాదు. రాయీ, రప్పను కానే కాను. నేనూ మనిషినే. క్రీట్ ద్వీపం నాది. ప్రతిష్ఠాత్మకమైన రాజా మీనోస్ (Minos; MEE-nohss) మనవడిని నేను. నీ భర్త ఒడిస్సియస్, ట్రోయ్ నగరంలో జరుగుతూన్న యుద్ధంలో పాల్గొనడానికి వెళుతూన్న సందర్భంలో ఒక తుపానులో చిక్కుకుని, దారి తప్పి, మా ద్వీపానికి వచ్చేడు. అప్పుడు అతనికి, అతని నావికా సైన్యానికి మేము ఆతిథ్యం ఇచ్చేము. సద్దుమణిగిన తరువాత వారి దారంట వారు వెళ్ళిపోయారు.”
తన భర్త గురించి ఈమాత్రం సమాచారమైనా తెలిసినందుకు పెనలొపీ ఎంతగానో సంతోషించింది. చేతికందినట్లే అంది చేజారిపోయిన అనందం క్షణికం అయినా, ఏమీ లేనికంటే నయమే కదా.
“పరదేశపు చెలికాడా! మీరు చెప్పిన మాటలు వింటూంటే నాలో ఆశలు చెలరేగుతున్నాయి. కాని మీరు చెప్పిన సమాచారం అంతా నిజమేనని నేను ఎలా నమ్మడం? మీరు నిజంగా నా ఒడిస్సియస్ని చూసిన వారైతే ఆయన ఎలా కనిపించారో కాసింత వర్ణించి చెప్పండి. మీరు చూసినప్పుడు ఆయన ఏ విధమైన దుస్తులు ధరించేరు?”
“ఇది ఎప్పుడో ఇరవై ఏళ్ళ క్రితం సంగతి. అప్పటికీ, ఇప్పటికీ మధ్య ఎన్నో సంఘటనలు జరిగాయి. నా జ్ఞాపకం కూడా మసకగానే ఉంది. కానీ ఒక్క సంగతి మాత్రం స్ఫుటంగా గుర్తు ఉంది. ఆయన వేసుకున్న దుస్తులు నా మనస్సులో ముద్ర వేసుకుని ఉన్నాయి. ఆయన యుద్ధానికి బయలుదేరే ముందు ఊదా రంగు శాలువాను భుజం మీద వేసుకున్నారు. ఆ శాలువా మీద తళతళ మెరిసే ఒక బంగారు భూషణం ధరించేరు. ఆ భూషణం మీద ఒక డేగ బొమ్మా, ఒక లేడిపిల్ల బొమ్మా నల్లరంగులో ఉన్నాయి. ఆ భూషణాన్ని నేనే ఆయన చేతికి అందించేను.”
ఒడిస్సియస్ ఇలా చెబుతూ ఉంటే పెనలొపీ దుఃఖం ఆపుకోలేక భోరున ఏడ్చేసింది. “ఆ బంగారు భూషణాన్ని ఆ శాలువా మీద అమర్చినది నేనే. ఆయన యుద్ధానికి వెళ్ళే సమయంలో విజయం ఆయనను వరించాలని కోరుతూ నేనే, ఈ చేతులతోనే, ఆ భూషణాన్ని అమర్చేను.”
పెనలొపీ పడుతోన్న వేదనను చూడలేకపోతున్నాడు ఒడిస్సియస్. “ఏడవకు మహారాణీ! నేను ఇటీవల విన్నది ఏమిటంటే ఒడిస్సియస్ ఇంకా బ్రతికే ఉన్నాడనిన్నీ, త్వరలో అతను ఇంటికి రాబోతున్నాడనిన్నీ, తనతోబాటు ఎన్నో విలువైన ఆభరణాలు, ఆస్తులూ తెస్తున్నాడనిన్నీ. అతను… ఈ నెలలోనే, శుక్లపక్షంలో ఏదో ఒక రోజున వస్తాడట…”
“మీరు అన్న విధంగానే జరగాలని కోరుకుందాం. మీరు చెప్పినట్లు ఆయన తిరిగి వస్తే మీకు నేను ఎన్నో ప్రత్యేకమైన బహుమానాలు ఇచ్చి స్వయంగా గౌరవిస్తాను,” అని చెప్పి రాణి తన పరిచారికలని పిలచి, “ఈ బాటసారి పడకకు మెత్తని పరుపులతో శయనాగారం తయారు చెయ్యండి. ఈ రాత్రికి ఈయన ఇక్కడే పడుకుంటారు,” అని ఆదేశించింది.
“నాకు మెత్తని పరుపులు అక్కరలేదు. నాకు కటిక నేల మీద పడుకోవడం అలవాటయిపోయింది.”
“అలాగైతే కనీసం వెచ్చటి నీళ్ళతో స్నానం చేసి పడకకు వెళ్ళండి. నా పరిచారిక యూరిలోకస్ స్నానానికి అన్నీ సిద్ధం చేస్తుంది. ఒడిస్సియస్ పసిబాలుడుగా ఉన్నప్పటినుండి అతని సంరక్షణ ఆమే చేసింది.”
ఒడిస్సియస్ ఈ కోరికను మన్నించడానికి ఒప్పుకున్నాడు. పెనలొపీ అతన్ని అక్కడ ఏకాంతంగా వదిలేసి తన శయ్యామందిరంలోకి వెళ్ళిపోయింది. వృద్ధవనిత యూరిలోకస్ వచ్చి ఒడిస్సియస్ని స్నానాల గదిలోకి తీసుకుని వెళ్ళి, నీళ్ళు పెద్ద గంగాళంలోకి తొరలించడం మొదలుపెట్టింది. అప్పుడు అకస్మాత్తుగా ఒడిస్సియస్కి తన మోకాలి మీద ఉన్న గాయపు మచ్చ గుర్తుకి వచ్చింది. చిన్నప్పుడు అది అడవిపంది కోరలతో గీరినప్పుడు అయిన గాయంవల్ల ఏర్పడిన మచ్చ. దాన్ని దాచడానికి ప్రయత్నించే లోగా యూరిలోకస్ ఆ తెల్లటి మచ్చని చూసి కెవ్వుమంది. ఆమె ఒడిస్సియస్ కళ్ళల్లోకి చూసి, “నువ్వు నా ఒడిస్సియస్ కాదూ?” అంటూ ఏడవడం మొదలుపెట్టింది.
ఒడిస్సియస్ ఆమె జబ్బ పట్టుకుని బలంగా తన వైపుకు లాగేడు. ఆమె చెవి దగ్గరగా నోరు పెట్టి, “యూరిలోకస్! నేనెవరినో నీకు తప్ప మరెవ్వరికీ తెలియకూడదు. తెలిసిందా? ఒలింపస్ పర్వతం మీద ఉన్న దేవుళ్ళు ఉపసర్పకులని మట్టుపెట్టేదాకా నువ్వు నోరు తెరవకూడదు. ఇది రాచ రహస్యం.”
“అర్థం అయింది. నేను నోరు మెదపను. నేను ఇక చట్రాయినే.”
స్నానం అయిన తరువాత ఒడిస్సియస్ బయటకు వస్తూ ఉంటే పెనలొపీ వెనక్కి తిరిగి వచ్చి, “కృష్ణపక్షం వచ్చేసింది. నేనిహ ఈ దుర్మార్గులలో ఎవరినో ఒకరిని పెళ్ళి చేసుకోకపోతే ఈ నరరూపరాక్షసులు టెలెమాకస్ని చంపేస్తారు. కనుక నేను ఏమి చెయ్యదలుచుకున్నానో చెబుతాను, వినండి. ఒడిస్సియస్ చెట్లను పడగొట్టడానికి రకరకాల గొడ్డళ్ళు వాడేవాడు. ఆ గొడ్డళ్ళను గోడకు వేళ్ళాడగట్టడానికి గొడ్డలి కాడ చివర గుండ్రంగా ఒక రంధ్రం ఉంటుంది. ఈ గొడ్డళ్ళను – పన్నెండింటిని – వరుసగా అమర్చుతాను. ఏ రాకుమారుడైతే ఒడిస్సియస్ వింటిని సంధించి ఈ పన్నెండు రంధ్రాలగుండా ఒక బాణాన్ని నిరంతరాయంగా పంపగలుగుతాడో అతన్ని వరిస్తాను.”
ఒడిస్సియస్ ఒక నిమిషం ఆలోచించి, “ఈ పథకం బాగానే ఉంది. రేపే ఈ పని చేద్దాం,” అన్నాడు.
పెనలొపీ ముఖంలో చిరునవ్వు విరిసింది. “నీతో మాట్లాడుతూ ఉంటే మనస్సుకి ఎంతో ఊరటగా ఉంది. ఇక నేను నిద్రపోవాలి. మానవుడెవ్వడూ నిద్ర లేకుండా బ్రతకలేడు కదా.”
పెనలొపీ తన పడకగదిలోకి వెళ్ళి తలుపు వేసుకున్న తరువాత ఒడిస్సియస్ తన దగ్గర ఉన్న గొడ్డు చర్మాన్ని నేల మీద పరచి అక్కడే పడుకున్నాడు.
పడుకున్నాడు కానీ, నిద్ర పట్టదే. రాబోతూన్న యుద్ధాన్ని తలుచుకుని నిలకడ లేని మనస్సుతో పక్క మీద దొర్లుతున్నాడు.
…నేను పడ్డ కష్టాలతో పోల్చితే ఇదొక లెక్కా? నా కళ్ళ ఎదుట నా సహచరులను ఆ సైక్లాప్స్ రాక్షసుడు నమిలి మింగేసేడే. ఆ దారుణానికి తట్టుకుని నిలబడ్డానే… మృతుల లోకానికి వెళ్ళి ప్రాణాలతో తిరిగి వచ్చేనే… తుపానులలో పడవలు ములిగిపోతే బ్రతికి బయట పడ్డానే… ఇప్పుడెందుకు ఈ ఆరాటం?…
“ఒడిస్సియస్!”
“…ఎవరో పిలుస్తున్నారల్లే ఉందే?” ఒడిస్సియస్ కళ్ళు తెరచేడు.
కళ్ళ ఎదుట అథీనా దేవత కనబడింది.
“నీకెందుకు నిద్రపట్టడం లేదు? నీ భార్య నీ ఎదురుగా ఉంది. నీ కొడుకు ఇక్కడే ఉన్నాడు. నువ్వు నీ దేశం వచ్చేసేవు. అయినా నీకు సంతృప్తి లేదా? నీకెందుకు నిద్రపట్టడం లేదు?”
“నువ్వు చెప్పినవన్నీ నిజమే కాదనను. నాకెదురుగా ఉన్న సమస్య, ఈ సిగ్గులేని రాకుమారుల బెడదని ఎలా వదలగొట్టుకోవడమా అని. వాళ్ళెప్పుడూ కలిసికట్టుగా ఐకమత్యంతో కనిపిస్తున్నారు. నేను వాళ్ళందరినీ హతమార్చినా, వాళ్ళ బంధుమిత్రులు వచ్చి నన్ను వెంటాడరని భరోసా ఏదీ?”
“ఉహ్! ఈ మనుషులకు నమ్మకం తక్కువ. నేను ఎప్పుడైనా నిన్ను కనిపెట్టి ఉండకుండా వదలిపెట్టి వెళ్ళిపోయానా? మనం ఇద్దరం కలిసి కేవలం మానవసైన్యాన్ని మట్టుబెట్టలేమా? ముందు కంటి నిండా నిద్రపో. రేపు, నా సహాయంతో, జయం నీదే!”
7.5 దైవ సంకేతం
తొలికోడి కూతతో ఒడిస్సియస్ నిద్ర లేచేడు. పెనలొపీ పడకగదినుండి వెక్కివెక్కి ఏడుస్తూన్న శబ్దం వినిపించింది. ఈ సంకట పరిస్థితిని ఎదుర్కోవడం ఎలా?
ఒడిస్సియస్ రెండు చేతులను పైకెత్తి ఒలింపస్ పర్వతం మీద నివసించే దేవతలందరికీ రాజైన జూస్ని ఉద్దేశించి, “తండ్రీ! ఈనాటి రణరంగంలో నేను విజయం సాధించాలంటే నీ ఆశీర్వాదబలం ముఖ్యం. నా యీ మొరని ఆలకించినట్లు నాకొక సంకేతాన్ని పంపు,” అని ప్రార్థించాడు.
ఒక్క మేఘపు తునక కూడా లేని నీలి ఆకాశం గర్జించింది.
తిరగలిలో జొన్నగింజలు వేసి విసురుతూన్న పనిమనిషి ఆకాశంలోకి చూసి, “ఆశ్చర్యం! ఆకాశంలో ఒక్క మేఘం అయినా లేదు కానీ ఆకాశం ఉరుముతోంది. జూస్ మహారాజుకు మన మీద దయ కలిగినట్లుంది. నేటితో ఈ రాకుమారుల బెడద తీరిపోతే బాగుణ్ణు.”
ఒడిస్సియస్ ఆమె మాటలు విని సంతోషించాడు.
సూర్యుడి వెచ్చని కిరణాల తాకిడికి రాజభవనంలో చలనం పెరిగింది. టెలెమాకస్ నిద్ర లేచేడు. రాబోతూన్న యుద్ధానికి అనుకూలమైన దుస్తులు ధరించేడు. భుజానికి కరవాలం వేళ్ళాడదీసి, పాదాలకి రక్షలు బిగించి కట్టుకున్నాడు. శూలాన్ని చేతబట్టి బయలుదేరేడు.
బయట మండువాలో రాకుమారులు సమావేశం అయ్యారు. టెలెమాకస్ని కడతేర్చడానికి రకరకాల మార్గాలని, వాటి మంచిచెడ్డల్ని విశ్లేషిస్తున్నారు. అప్పుడు ఆకాశంలో ఒక డేగ ఎగురుతూ కనబడ్డది. దాని కాలిగోళ్ళ మధ్య ఒక పావురం చిక్కుకుని ఉంది.
“అలా చూడండి! ఆకాశంలో చూడండి” అన్నాడు ఒక రాకుమారుడు. “ఇది మంచి శకునం కాదు. ఇది మన కుట్ర విఫలం అవుతుందని చెబుతోంది.”
ఇలాంటివాటి మీద నమ్మకం లేదన్నట్లు కొందరు భుజాలు ఎగరేసి భోజనశాల వైపు దారి తీసేరు. ఉదయపు విందు భోజనం, ద్రాక్ష సారా వారి రాకకై ఎదురుచూస్తోంది. అదే సమయంలో టెలెమాకస్ కూడా, ఇంకా ముష్టివాడి వేషంలోనే ఉన్న ఒడిస్సియస్ని వెంటబెట్టుకుని అక్కడికి వచ్చేడు. ఒడిస్సియస్ ఒక ఎత్తయిన పీట మీద కూర్చున్నాడు. టెలెమాకస్ ఒక బొచ్చెలో ద్రాక్షసారా పోసి ఒడిస్సియస్కి అందించేడు.
ఈ దృశ్యం చూసి ఒక రాకుమారుడు పెద్ద వెకిలినవ్వు నవ్వేడు. “ఈ ముష్టివాడి బొచ్చెలో మనం కూడా ఏదైనా వేద్దాం,” అంటూ ఒక బొమిక ముక్కను అటు విసిరేడు. ఒడిస్సియస్ ఓరవాటుగా పక్కకి తప్పుకున్నాడు. కానీ ఉడుకు రక్తం ఉన్న టెలెమాకస్ ఊరుకోలేదు. “మా ఇంట పడి దోచుకు తింటున్నారు, మా సారా పీపాలు ఖాళీ చేస్తున్నారు. భరించి ఊరుకున్నాం. కానీ మా ఇంటికి వచ్చిన అతిథుల్ని కించపరిస్తే ఊరుకునేది లేదు.”
రాకుమారులు విరగబడి నవ్వడం మొదలు పెట్టేరు. అప్పుడు ఒక వింత జరిగింది. అథీనా ప్రభావం వల్ల ఆ మండువాలో ఒక పిల్లతెమ్మెర వీచింది. దాని వశీకరణ ప్రభావమో ఏమో కానీ రాకుమారులంతా విరగబడి నవ్వడం మొదలుపెట్టేరు. ప్రచండంగా బొబ్బలు పెట్టడం మొదలుపెట్టేరు.
కొంతసేపటికి, వారికి కాసింత స్వస్థత చేకూరిన తరువాత ఒకడు లేచి, “మహాజనులారా! వినండి. ఇప్పుడు నాకు ఒక ఉత్కృష్టమైన స్వప్నదర్శనం అయింది. ఈ రోజు ఇక్కడ ఏమి జరగబోతోందో నాకు కళ్ళకు కట్టినట్లు కనిపించింది. ఈ గది గోడలు రక్తసిక్తమై ఉన్నాయి. ఇక్కడ ప్రేతాత్మలు తిరుగుతున్నాయి…” అన్నాడు.
7.6 ధనుర్విద్యలో పోటీ
ఉదయపు భోజనం అయిన తరువాత రాణి పెనలొపీ రాజభవనంలో ఉన్న ఆయుధశాలలోకి వెళ్ళి అక్కడ ఉన్న ఒడిస్సియస్ ధనుస్సును చేతబట్టి బయటికి వచ్చింది. దాన్ని రాజకుమార ఉపసర్పకుల ఎదుట ఉంచింది.
“అందరూ నిశ్శబ్దంగా నా మాట వినండి. చాలా రోజులబట్టి మీరంతా ఈ రాజభవనంలో తిష్ఠ వేసి మా ప్రమేయం లేకుండా మా ఆతిథ్యం పొంది, మేము పొయ్యకుండా మా ద్రాక్షసారాని తెగ తాగి, మా అనుమతి లేకుండా మా పశువుల్ని చంపి తిని ఆనందిస్తున్నారు. మేము ఏమయినా అంటే మీలో ఒకరితో వివాహానికి నా అంగీకారంకోసం వేచి ఉన్నామని ఎదురు సమాధానం చెబుతున్నారు. వినండి. మీలో ఎవ్వరిని నేను ఎంపిక చేసుకోవాలి? నేనొక పరీక్ష పెడతాను. ఆ పరీక్షలో నెగ్గిన రాకుమారుడిని వివాహం చేసుకుంటాను. సరేనా?
“ఇక్కడ పన్నెండు గొడ్డళ్ళు బారుగా అమర్చి ఉన్నాయి కదా. వీటిని గోడమీద మేకులకు వేళ్ళాడేయడానికి వీలుగా, వీటి పిడికాడల చివర పెద్ద రంధ్రాలు ఉన్నాయి కదా. ఈ రంధ్రాలన్నీ ఒకదాని వెనుక మరొకటి వచ్చేలా బారుగా అమర్చి ఉన్నాయి కదా. ఇదిగో ఒడిస్సియస్ విల్లు, రెండు బాణాలు. ఈ వింటిని సంధించి, ఒక బాణాన్ని, ఆ రంధ్రాలగుండా, ఈ కొసనుండి ఆ కొసకి వెళ్ళేలా గురిచూసి లక్ష్యాన్ని ఎవరైతే కొట్టగలరో వారిని నేను వరిస్తాను.”
రాకుమారులు ఈ సవాలును స్వీకరించేరు.
ఒకరి తరువాత మరొకరు వరుసకట్టి ముందుకు వచ్చేరు. మొదట వింటిని వంచి అల్లెతాడు కట్టాలి కదా. ఒడిస్సియస్ విల్లు వంగదే! దానికి కొవ్వు రాసి చూసేరు. మంట దగ్గర వేడి చేసి చూసేరు. లొంగదే! వింటిని నారితో బంధించాలి, తరువాత దాన్ని ఎక్కుపెట్టాలి, గురి చూడాలి. అప్పుడు బాణాన్ని వదలాలి. అది రంధ్రాలగుండా, గొడ్డళ్ళకు తగలకుండా, అవతలకి వెళ్ళాలి, లక్ష్యానికి తగలాలి.
రాకుమారులు ఎవరి తంటాలు వారు పడుతున్నారు. ఈ చోద్యం చూడలేక ఒడిస్సియస్ దేవిడీలో పనిచేసే పశువులకాపరి, పందులకాపరి, బయటికి జారుకున్నారు. ఇంకా ముసలి బిచ్చగాడి వేషంలోనే ఉన్న ఒడిస్సియస్ వారిని వెంబడించేడు.
“ఆగండి, నాదొక చిన్న ప్రశ్న. ఇప్పుడు రాజా ఒడిస్సియస్ ఆకాశంనుండి ఊడి పడితే మీరిద్దరూ ఆయన తరఫున పోరాడుతారా? ఈ రాకుమారుల తరఫున పోరాడుతారా?” ఒడిస్సియస్ అడిగేడు.
“అదేం ప్రశ్న బాబయ్యా? ఆ స్వర్గంలో ఉన్న జూస్ నా ప్రార్థన ఆలకించి నా ఒడిస్సియస్ రాజాను ఇంటికి తీసుకొస్తే, ఆయన కోసం పోరాడడానికి నా కండరాల్లో బలం పుంజుకుంటుంది,” అన్నాడు పశువులకాపరి.
పందులకాపరి “భళీ” అన్నాడు.
వీళ్ళిద్దరినీ నమ్మవచ్చని ఒడిస్సియస్ ఒక నిశ్చయానికి వచ్చేడు.
“ఆ దేవుడు మీ ప్రార్థనలని ఆలకించేడు. నేనే ఆ ఒడిస్సియస్ని.”
ఆ ఇద్దరికీ నోట మాట రాలేదు. తమ ఎదురుగా ఉన్న ఈ దిక్కుమాలిన బిచ్చగాడు తానే ఒడిస్సియస్ని అంటున్నాడు. ఇతనికి పిచ్చి పట్టిందా? లేక తమకు మతి భ్రమించిందా?
ఒడిస్సియస్ తను కప్పుకున్న దుప్పటిని పక్కకి తొలగించి, తన తొడ మీద ఉన్న గాయపు మచ్చను చూపించేడు.
“జ్ఞాపకం ఉందా? నా చిన్నప్పుడు అడవిపంది నన్నిక్కడ గాయపరచింది కదా.”
పశువులకాపరి, పందులకాపరి ఆ గాయపు మచ్చని గుర్తుపట్టి ఒక్కసారి కెవ్వుమన్నారు. ఒడిస్సియస్ని పెనవేసుకుని ఏడ్చేరు.
“ఏడవకండి. ముందు మనం చెయ్యవలసిన పని చాలా ఉంది. జాగ్రత్తగా వినండి. మనం ఇప్పుడు లోపలికి వెళ్ళిన తరువాత నాకు అవకాశం వచ్చేలా చేసి, నా చేతికి విల్లు, అమ్ములు ఇవ్వండి. వెంటనే రాణివాసంలో ఉన్న స్త్రీలని వారి గదులలోకి పంపేసి, తలుపులకి తాళాలు వేసెయ్యండి. వాకిలి తలుపు మూసేసి గెడ పెట్టండి.”
ఒడిస్సియస్ తన ఇద్దరు భృత్యులతో ‘స్వయంవరం’ జరుగుతూన్న మండువాలోకి ప్రవేశించాడు. ఇంతవరకు ఏ ఒక్క రాకుమారుడు, వింటిని ఎక్కుపెట్టడం సంగతి అటుంచి, కనీసం ధనుస్సును వంచి అల్లెతాడైనా కట్టలేకపోయాడు.
“ఈ పోటీని రేపు కొనసాగించండి. మూడొంతులు ఒలింపస్ పర్వతంనుండి ఏ దేవుడైనా వచ్చి సహాయం చేయవచ్చు. అంతవరకు ఆ ధనుస్సును నేను భద్రపరుస్తాను. నా జబ్బలో కానీ, నా కాలి పిక్కలలో కానీ ఏమైనా శక్తి మిగిలి ఉందేమో చూసుకోవచ్చు కూడా,” అన్నాడు ముసలిరూపంలో ఉన్న ఒడిస్సియస్.
రాకుమారులు ఖస్సుమన్నారు. అనరూ మరి? వారి అహం దెబ్బతిన్నది కదా. పుండు మీద కారం జల్లేడు ఈ ముసలోడు. ఎంటినోయిస్ అందుకున్నాడు: “బుద్ధిహీనుడా! ఆ ధనుస్సును ముట్టుకోకు. నోటికొచ్చినట్లు పేలేవా? ఒక్క దెబ్బతో నువ్వు సముద్రంలో పడేలా కొట్టగలను, జాగ్రత్త!”
పెనలొపీ లేచి కలుగజేసుకుంది. “ఆ పెద్దాయనకు విల్లు ఇవ్వండి. వింటిని సంధించడానికి అతనికి కూడా అవకాశం ఇవ్వండి. అతను మన అతిథి. రాచవంశంనుండి వచ్చేనని చెబుతున్నాడు.”
“అమ్మా! మీరు అంతఃపురం లోపలికి వెళ్ళి మీ అల్లిక పనులేవో చూసుకోండి,” అని టెలెమాకస్ తల్లిని ధైర్యంగా అదలించేడు. అతనికి తెలుసు. ముందుంది ముసళ్ళ పండుగ అని. “నేను ఈ ఇంటి యజమానిని. వింటిని సంధించడానికి ఎవరు అర్హులో నిర్ణయించేది నేను. ఇప్పుడు మన అతిథిని ముందుకు వచ్చి ధనుస్సును ఎక్కుపెట్టమని అర్థిస్తున్నాను.”
కొడుకు చూపిన తెగువకి, ధైర్యానికి పెనలొపీ ఆశ్చర్యపోయింది. అతని అధికారానికి తల ఒగ్గుతూ లేచి తన మందిరంలోకి వెళ్ళి, తలగడలో తల దూర్చి, ఏడ్వడం మొదలుపెట్టింది. అథీనా వచ్చి ఆమె కనురెప్పలని తాకగానే అవి బరువెక్కి మూసుకుపోయాయి.
దిగువన మండువాలో పశువులకాపరి, పందులకాపరి, ధనుస్సును మోసుకువచ్చి ఒడిస్సియస్కి అందించారు. బయటకు వెళ్ళే తలుపులన్నీ మూసి, గెడలు పెట్టమని పరిచారకులకు చెప్పేరు.
ఒడిస్సియస్ ధనుస్సును సుతారంగా నిమిరేడు. దానిని నిలువునా నిలబెట్టి సునాయాసంగా వంచి నారితాటిని బిగించేడు. బిగించి, సరిగ్గా ఉందో లేదో చూడడానికి, వీణ తీగను మీటినట్లు మీటేడు. వానకోయిల కూజితంలా శబ్దం ధ్వనించింది.
దానికి ప్రతిధ్వనిలా ఆకాశంలో ఉరుములు ఉరిమేయి. ఒడిస్సియస్ ముఖంలో చిరునవ్వు వెల్లివిరిసింది. ఆ ఉరుములు జూస్నుండి వచ్చిన హర్షధ్వానాలు అని ఒడిస్సియస్కి తెలుసు. రాకుమారులందరూ బిక్కచచ్చిన ముఖాలతో అచేతనంగా చూస్తున్నారు. ఒడిస్సియస్ ఒక బాణం అందుకున్నాడు. ధనుస్సుకు బాణాన్ని తగిలించి ఎక్కుపెట్టి ఆకర్ణాంతం లాగేడు. వరుసగా ఉన్న గొడ్డళ్ళ హస్తకదండాలలో ఉన్న రంధ్రాల మధ్యస్తంగా గురిపెట్టి బాణాన్ని వదిలేడు. అది మధ్యలో ఎక్కడా దారి చెదరకుండా, పన్నెండు రంధ్రాలనీ దాటుకుని, ఆవలివైపున ఉన్న లక్ష్యాన్ని ఛేదించింది.
ఒడిస్సియస్ ధనుస్సును పక్కన పెట్టి విజయగర్వంతో టెలెమాకస్ వైపు చూసి నర్మగర్భంగా, “మీ ఇంటికి మీరు ఆహ్వానించిన అపరిచితుడు అపరాజితుడయి మీకు వన్నె తెచ్చేడు,” అన్నాడు. టెలెమాకస్ తల పంకించేడు.
7.7 ఉపసర్పికుల సంహారం
ఒడిస్సియస్ కప్పుకున్న చింకి దుప్పటిని పక్కకు పారేసి, ఆ మండువా మధ్య ఉన్న తిన్నె మీదికి లంఘించి, నిప్పులు కక్కుతూన్న కళ్ళతో ఉపసర్పికులను చూసేడు.
“రాణి ఆదేశించిన పోటీలో లక్ష్యాన్ని ఛేదించడం పూర్తి అయింది. ఇప్పుడు మన ఎదుట మరొక పోటీ మిగిలి ఉంది. ఈ పోటీలో నా ఎదుట నూట ఎనిమిది లక్ష్యాలు ఉన్నాయి. వీటిని ఛేదించడానికి విలువిద్యలకు అధినేత అయిన అపోలో సహాయం అర్థిస్తున్నాను,” అంటూ ఒడిస్సియస్ ఒక బాణం తీసి రాకుమారుల నాయకుడైన ఎంటినోయిస్ మీదికి గురి పెట్టి వదిలేడు. అది రివ్వున వెళ్ళి ఎంటినోయిస్ కుత్తుకలోకి చొరబడింది.
ఎంటినోయిస్ కుప్పకూలిపోయేడు. అది చూసి రాకుమారులు ఒక్క ఉదుటున లేచి నిలబడ్డారు. “ఈ పాపానికి ఫలితం అనుభవిస్తావ్” అని ఒకరంటే “రాబందులు నిన్ను పీక్కు తింటాయి” అని మరొకరు. అనుకోకుండా ఎదురయిన ఈ సంఘటనకు స్పందిస్తూ రాకుమారులు ఆయుధాల కోసం వెతుకులాట మొదలుపెట్టేరు. కానీ ఆ చుట్టుపట్ల ఎక్కడా ఈటెలు కానీ, కత్తులు, డాళ్ళు, వగైరాలు ఏవీ కనబడలేదు.
“కుక్కల్లారా! నక్కల్లారా! నేనెవరనుకున్నారురా తుంటరి వెధవల్లారా? నేనే ఒడిస్సియస్ని! నేను తిరిగి రాననుకున్నారుకదూ? కానీ వచ్చేను. మీ పాలిట హేడీస్ని. మిమ్మల్ని మృతుల లోకానికి పంపడానికి వచ్చేను. మీ రోజులు మూడేయి. కాసుకోండి, నా బాణాల వర్షంనుంచి.”
“మనం కూర్చున్న బల్లలను రక్షకఫలకాలుగా వాడుకుందాం. మన దగ్గర ఉన్న కరవాలాలతో వీడిని తెగటార్చుదాం. పదండి ముందుకు,” అంటూ మరొక రాకుమారుడు ముందుకు లంఘించేడు.
వాడు దరిదాపుల్లోకి రాక ముందే ఒడిస్సియస్ వదలిన బాణం వాడిని నేలకూల్చింది.
వాడి స్థానంలో మరొక రాకుమారుడు ముందుకు వచ్చేడు. వాడు కాలు కదిపేలోగా వాడిని టెలెమాకస్ మట్టుబెట్టేడు. వెనువెంటనే టెలెమాకస్ మేడ మీది కొట్టుగదిలోకి వెళ్ళి రెండు బల్లేలు, రెండు కవచాలు పట్టుకొచ్చి పశువులకాపరికి, పందులకాపరికి ఇచ్చేడు. ఇప్పుడు నలుగురు సాయుధులు ఒక పక్షం, మిగిలిన నిరాయుధులైన రాకుమారులందరూ ప్రతిపక్షం.
ఇంతలో ప్రతిపక్షంలో ఉన్న ఒక రాకుమారుడు మేడ మీది కొట్టుగది రహస్యం పసిగట్టి మేడ మెట్లు ఎక్కి, ఆయుధాలు ఉన్న గదిలో జొరబడి పన్నెండు బల్లేలు, కవచాలు దొంగిలించి తన వారికి పంచిపెట్టేడు.
ఇలా ప్రతిపక్షం బలం పుంజుకునేసరికి ఒడిస్సియస్ పన్నిన పన్నాగం ఇరుకున పడింది. అకస్మాత్తుగా, అనుకోకుండా అథీనా అక్కడ ప్రత్యక్షమైంది.
“అథీనా దేవీ! నువ్వు కూడా ఒక చెయ్యి వేసి మాకు సహాయం చెయ్యి,” అని మొరపెట్టుకున్నాడు ఒడిస్సియస్.
“మానవ ప్రయత్నం లేకుండా దైవసహాయం అందదు,” అంటూ అథీనా ఒక వానకోయిల రూపం దాల్చి అక్కడనుండి రివ్వున ఎగిరిపోయింది.
ఇనుమడించిన దృఢసంకల్పంతో సవ్యసాచిలా ఒడిస్సియస్ అమ్ముల వర్షం కురిపించేడు. అతనికి చేదోడుగా టెలెమాకస్ ఈటెతో విజృంభించేడు. వీరిద్దరి ప్రతాపాలతో స్పూర్తి పొంది పశువులకాపరి, పందులకాపరి ఆ రణరంగంలో శూలాలు విసురుతూ వీరవిహారం చేసేరు. రాకుమారులు కూడా శూలాలతో భీకరంగా పోరాడేరు కానీ, వారి శూలాలు – అథీనా ప్రభావం వల్ల – గురి తప్పుతూ వచ్చాయి.
ఈ వ్యవహారం ఇలా జరుగుతూ ఉండగా రాకుమారులను భయకంపితులుగా చెయ్యడానికి అథీనా ఒక కాల్పనిక దృశ్యం సృష్టించింది. ఒక నల్లటి పొగ ఆ మండువా ప్రాంతాన్ని ఆక్రమించింది. అది మేఘం రూపు దాల్చింది. అది కరడుకట్టి ఏనుగులా మారింది. ఆ మేఘం కుదించుకుని అడవిపంది ఆకారం సంతరించుకుని, చిట్టచివరికి అథీనా రక్షకఫలకంగా రూపుదిద్దుకుంది. అథీనా రక్షకఫలకం కనిపించిందంటే అది మరణశాసనమే అని రాకుమారులకు తెలుసు.
ప్రతిపక్షంలో ఉన్న వార్తాహరుడిని, గాయకుడిని తప్ప మిగిలిన వారందరినీ హతమార్చేరు, ఒడిస్సియస్ బృందం.
రాకుమారుల శవాలు గుట్టలు గుట్టలుగా పడి ఉన్నాయి.
హెర్మీస్ వచ్చి రాకుమారుల ప్రేతాత్మలను అధోలోకానికి తీసుకుపోయేడు.
7.8 పునస్సమాగమం
రక్తపు మడుగులో, రాకుమారుల శవాల మధ్య నిలబడి, తన చిన్ననాటి పరిచారిక యూరిక్లేయాను పిలిచేడు ఒడిస్సియస్. జరిగిన దమనకాండను చూసి పట్టపగ్గాలు లేని సంతోషంతో ఆమె కెవ్వుమని కేరింతలు కొడుతూ కేకేసింది. ఇన్నాళ్ళకు ఈ రాజభవనానికి పట్టిన శని విరగడైందని సంతోషించింది.
“ఉష్! తప్పు. మృతులని చూసి బ్రహ్మానందపడడం మంచిది కాదు,” అని ఒడిస్సియస్ మందలించేడు.
“కనీసం ఈ శుభవార్త పెనలొపీ దేవికి చెబుతాను. ఈ యుద్ధం జరుగుతున్నంతసేపూ ఆమె నిద్రపోతూనే ఉంది.”
“వద్దు, వద్దు! ఇప్పటినుండీ లేపేయవద్దు. ముందస్తుగా – రాకుమారులతో సహవాసం చేసి, వారితో సరససల్లాపాలు కొనసాగించిన పరిచారికలను పిలచి, వారికి ఈ మృతదేహాలను ఇక్కడనుండి తొలగించే పనిని అప్పజెప్పు. తరువాత రక్తసిక్తమైన ఈ భవనపు గోడలను, గచ్చును శుభ్రంగా కడిగించు.”
ఒడిస్సియస్ ఆజ్ఞలను యూరిక్లేయా శిరసావహించింది. అప్పుడు మండువా మధ్యలో అగ్నిహోత్రాన్ని వెలిగించి, దానిలో దేవదారు చెక్కలు, గంధపు చెక్కలు, సుగంధం వెదజల్లే గుగ్గిలం, సర్జరసంవంటి రసారాళములు వేసి, ఆ పొగతో ఆ భవనం అంతటికీ ధూపం వేసి, ఆ తరువాత పెనలొపీని నిద్రనుండి లేపడానికి అనుమతి ఇచ్చేడు.
“నిద్రనుండి లేవవమ్మా పెనలొపీ దేవీ! లేవాలి. శుభవార్త! ప్రాణాలతో తిరిగి వచ్చేడు నీ భర్త. నీ ప్రియమైన భర్త నీ కోసం కింద ఎదురు చూస్తున్నాడు.”
పెనలొపీ కళ్ళు తెరచింది. ఎదురుగా ఉన్న దాసీ యూరిక్లేయా ఆవేశంతో ఏదో చెబుతున్నది: ఆమె భర్త ఒడిస్సియస్, ఆమె కొడుకు టెలెమాకస్ – ఇద్దరూ కలిసి – నూట ఎనిమిదిమంది రాకుమారులను ఎలా హతమార్చేరో ఆవేశపడుతూ, ఒగర్పుతో చెబుతోంది.
“అనవసరంగా నా ఆశలు రేకెత్తించకు. అంతమంది రాకుమారులని వీరిద్దరూ హతమార్చేరంటే అది నమ్మశక్యంగా లేదు. మూడొంతులు, ఒలింపస్ పర్వతం మీది దేవతలు దిగి వచ్చి ఈ పని చేసి ఉంటారు. నా భర్త ఒడిస్సియస్ ఎక్కడో సముద్రం మధ్యలో ఉండి ఉంటాడు, లేదా చనిపోయి ఉంటాడు.”
“రాణీ, నా మాట నమ్మొద్దు. నువ్వే స్వయంగా కిందకి వెళ్ళి నీ కళ్ళతో చూడు,” యూరిక్లేయా నమ్మించడానికి ప్రయత్నం చేస్తూంది. “ఆయన మోకాలి మీద అడవిపంది కోరలతో గీరిన దెబ్బ తాలూకు మచ్చ కూడా చూసేను. నాతో కిందికి రా. నీ రాక కోసం ఒడిస్సియస్ ఎదురుచూస్తున్నాడు.”
“యూరిక్లేయా, నువ్వు ముసలిదానివి అయిపోతున్నావు. నీకు ఈ దేవుళ్ళు చేసే మాయలు తెలియవు. కానీలే, నా కొడుకుని చూడ్డానికి దిగి వస్తాను.”
పెనలొపీ మేడ దిగి కిందికి వచ్చింది. అక్కడ నిప్పుగూడు దగ్గర ఒడిస్సియస్ కూర్చుని ఉన్నాడు. ముడతలు పడ్డ శరీరం, మాసిన బట్టలతో, రక్తపు మరకలతో, చెమట కంపుతో, మునుపటికంటే ఘోరంగా ఉన్నాడు.
ఆ దృశ్యం చూడగానే పెనలోపీ ముఖం చిట్లించి పక్కకి తిప్పుకుంది.
టెలెమాకస్ స్పందించకుండా ఉండలేకపోయాడు. “అమ్మా! యుద్ధం చేసి గెలిచాడు. కనీసం అతనిని చూసి పలకరించవచ్చు కదా?”
ఒడిస్సియస్ పరిస్థితిని అర్థం చేసుకున్నాడు. “టెలెమాకస్! ముందు మనిద్దరమూ స్నానాలు చేసి, శుభ్రమైన దుస్తులు ధరించి వద్దాం. మనం తిరిగి వచ్చేసరికి గాయకులను రప్పించి శ్రావ్యమైన నేపథ్యసంగీతం ఏర్పాటు చేద్దాం. రాకుమారులపై మన విజయానికి ఇప్పుడే ఎక్కువ ప్రచారం ఇవ్వడం మంచిది కాదు.”
పరిచారకులు ఒడిస్సియస్ ఒళ్ళంతటికి జిత తైలం రాసి, మర్దన చేసి, వేడి నీళ్ళతో స్నానం చేయించేరు. ఇదే సమయం అని ఒడిస్సియస్కి నిజరూపం ఇచ్చింది అథీనా. ముష్టివాడి ఆకారం పోయి, శరీరం మీద ముడతలు పోయి, పొడుగ్గా, యవ్వనపు రూపు వచ్చింది.
దేవతలని ధిక్కరించే అందచందాలతో వెలిగిపోతూ, నూతన వస్త్రాలు ధరించి, నిప్పుగూడు దగ్గరకు వచ్చేడు ఒడిస్సియస్. అక్కడే ఉన్న పెనలొపీకి ఎదురుగా కూర్చున్నాడు. కానీ పెనలొపీలో స్పందన లేదు. ఒడిస్సియస్లో వచ్చిన మార్పు చూసిన తరువాత ఆమె అనుమానం ద్విగుణీకృతం అయింది. ఎదురుగా కూర్చున్నది నిజంగా మానవమాత్రుడేనా? లేక ఒలింపస్ పర్వతం మీద ఏ దేవుడో మాయవేషంలో తనని మోసం చెయ్యడానికి వచ్చేడా?
“ఎంత విచిత్రమైన వ్యక్తివి నువ్వు? ఇరవై ఏళ్ళబట్టి ఎదురు చూస్తూన్న భర్త ఎదురుగా వచ్చినప్పుడు అతని సందిట బందీ అవ్వాలని లేదా? ఆ బందీకి వశమై పోవాలని నాకు తహతహగా ఉంది,” అన్నాడు ఒడిస్సియస్.
పెనలొపీ మౌనంగా కూర్చుని ఉంది తప్ప స్పందించలేదు.
“అలాగయితే ఈ రాత్రికి నేను ఒంటరిగా పడుకోవాలన్నమాట?”
“ఎంత వింత వ్యక్తివయ్యా నువ్వు? నువ్వు మనిషి వేషంలో వచ్చిన దేవుడివి కాకపోతే…” అంటూ అర్ధోక్తిలో ఆగిపోయింది. ఆమె మనస్సులో తళుక్కున ఒక ఆలోచన మెరిసింది. ఒడిస్సియస్కి తనకీ పెళ్ళయిన కొత్తలో వారిద్దరి పడక కోసం ప్రత్యేకంగా ఒక మంచం తయారు చేసేడు, ఒడిస్సియస్. వాళ్ళ పడకగదిలో ఒక వారకి, సజీవమైన జిత వృక్షం ఉండేది. దాన్ని పడగొట్టి ఆ కలపతో మంచం నిర్మించాలని అతని సంకల్పం. కానీ చెట్టును పూర్తిగా నరకడానికి అతని ప్రాణం ఒప్పలేదు. అందుకని చెట్టు కొమ్మలు నరికి వాటితో మంచానికి మూడు కాళ్ళు రూపొందించేడు. ఇంకా సజీవంగా ఉన్న చెట్టు మానుని నాలుగో కాలుగా వాడి మంచాన్ని తయారు చేసేడు. ఆ మంచం గురించి వారిద్దరికే తెలుసు. మూడోకంటి వాడికి తెలియదు.
“మీరు నిజంగా ఎవరో నేను నిశ్చయించలేకపోతున్నాను. కానీ నేను పడుకునే మంచాన్ని మీకు బయట వసారాలో వేయిస్తాను, అక్కడ మీరు ఈ రాత్రికి శయనించండి. యూరిక్లేయా,” అని దాసిని పిలచి, “పరిచారికలతో చెప్పి నా పడకగదిలో ఉన్న మంచాన్ని బయట వసారాలో వేయమని చెప్పు. దాని మీద పట్టు పరుపులు వేస్తే మన అతిథి అక్కడ పడుకుంటారు.”
ఒడిస్సియస్ కళ్ళు కోపంతో ఎర్రబడ్డాయి. “ఇరవై ఏళ్ళ క్రితం నేను నా చేతులతో పడకగదిలో ఉండే మంచాన్ని తయారు చేసేను, అది ఏమైంది? ఆ మంచాన్ని కదపడానికి వీలు పడదు. ఎందుకంటే దాని నాలుగో కాలు ప్రాణంతో ఉన్న జిత చెట్టు. ఎవరన్నా దొంగలు ఆ చెట్టును నరికేసి మంచాన్ని దొంగిలించారా?”
పెనలొపీ గభాల్న లేచి, ఆనందంతో ఒక్క అరుపు అరిచి, ఒడిస్సియస్ మెడను పెనవేసుకుంది. “మనం పడుకునే మంచం వెనుక కథ మనిద్దరికే తెలుసు. నేను కళ్ళు కాయలు కాసేలా ఎదురుచూసిన ఒడిస్సియస్ నువ్వే!”
ఒడిస్సియస్ ఆమెని తన బాహువులతో బందీ చేసేడు, కానీ తానే ఆ బందీకి వశమైపోయాడు.
తన తల్లిదండ్రులు ఆ ఆలింగన స్పర్శతో ఆనందసముద్రంలో ములిగి తేలుతూ ఉంటే టెలెమాకస్, నేపథ్యసంగీతం అందిస్తూన్న గాయకులని, పరిచారకులని బయటికి పంపేసి తన తల్లిదండ్రుల ఏకాంతానికి భంగం కలిగించకుండా, నిశ్శబ్దంగా బయటికి జారుకున్నాడు.
మండువాలో దీపాల వత్తులు తగ్గించి, పరిచారికల బృందం నిష్క్రమించింది.
మీదకు పెనవేసుకున్న పెనలొపీని నెమ్మదిగా తమ శయనాగారంలోకి నడిపించి తీసుకెళ్ళేడు ఒడిస్సియస్. ఇద్దరూ ఒడిస్సియస్ తన చేతులతో నిర్మించిన మంచం మీద ఉన్న పట్టు పరుపు మీదకు ఒరిగిపోయారు. ఒకరి పరిష్వంగంలో మరొకరు ఒదిగిపోయి గత ఇరవై ఏళ్ళల్లోనూ జరిగిన సంగతులన్నీ గంటలకొద్దీ నెమరు వేసుకున్నారు.
పడకగదిలో ఉన్న ప్రేమపక్షులకు చీకటిలో మరికొంత సమయం ఇవ్వాలని ఆకాశంలో పరుగులు తీస్తూన్న సూర్యదేవుడి రథానికి ఉన్న గుర్రాలని కొంచెం నెమ్మదిగా పరిగెట్టమని ఆదేశించింది అథీనా.
7.9 శాంతి
మరునాడు కొంచెం ఆలస్యంగా తెల్లారింది.
ఒడిస్సియస్ మంచంమీంచి లేచి పెనలొపీతో “నేను మా తండ్రిగారు, రాజా లెయర్టీజ్, ఎక్కడున్నారో వెతకడానికి వెళ్ళాలి,” అన్నాడు. ఇరవై ఏళ్ళబట్టి కంటికి కనబడని కొడుకు కోసం బెంగపెట్టుకుని, విలపిస్తూ రాజా లెయర్టీజ్ పిచ్చివాడిలా తిరుగుతున్నాడు. ఆ ముసలాయన రాజప్రాసాదంలో ఉండడానికి నిరాకరించి, జీర్ణవస్త్రాలు ధరించి, రాజుగారి ద్రాక్షతోటలో పచ్చి కటికనేల మీద పడుకుని కాలక్షేపం చేస్తున్నాడు.
“నేను లేనప్పుడు నువ్వూ, నీ పరిచారికాబృందం, అంతఃపురంలో తలుపులు లోపల గెడ వేసుకుని అప్రమత్తతతో ఉండండి,” ఒడిస్సియస్ ఇంకా పెనలొపీతో చెబుతున్నాడు. “సాయంకాలం అయ్యేలోపుగా రాకుమారుల మరణవార్త నాలుగు మూలలకూ వ్యాపిస్తుంది. వాళ్ళ బంధుమిత్రులు ప్రతీకారాన్ని సాధించేందుకు దిగి వస్తారు. మన జాగ్రత్తలో మనం ఉండాలి.”
ఒడిస్సియస్ తరువాత టెలెమాకస్ని, పశువులకాపరిని, పందులకాపరిని కూడా నిద్ర లేపి వాళ్ళను సాయుధులై తనతో తండ్రిని చూడడానికి రమ్మని అడిగాడు. పొద్దు పైకెక్కుతున్నదేమో, పరిసరాలు ప్రకాశమానంగా ఉన్నప్పటికీ, అథీనా ఈ నలుగురూ నడిచే బాట చుట్టూ చీకట్లు కమ్మేలా చేసింది.
అందరూ ద్రాక్షతోట దగ్గరకు చేరుకున్నాక, “మీరంతా వెళ్ళి మనకు భోజన సదుపాయాలు చూడండి. నేను మా తండ్రిగారు ఎక్కడ ఉన్నారో వెతుకుతాను.”
ఒడిస్సియస్ వెతుకుతూన్న కళ్ళకి ఆ ద్రాక్షతోటలో ఒక మూల, తొళ్ళికతో నేలని తవ్వుతూ ఒక ముసలాయన కనిపించేడు. ఆయన భుజం మీద చిరిగిన దుప్పటి, తల మీద మాసిపోయిన తోలు టోపీ కనిపించేయి. చింపిరి గుడ్డలతో అలిసిపోయిన ఆ విగ్రహాన్ని చూసి ఒడిస్సియస్ చాలా బాధ పడ్డాడు.
“అయ్యా క్షమించండి. నేను ఒక స్నేహితుడి కోసం వెతుకుతున్నాను. కొన్నేళ్ళ క్రితం అతను మా ద్వీపంలో ఆగి నా ఆతిథ్యం పొందేడు. అతను ఇథకా వాస్తవ్యుడనిన్నీ, అతని తండ్రి పేరు లెయర్టీజ్ అనిన్నీ చెప్పేడు.”
ఆ ముసలాయన తలెత్తి, “ఆ ఆసామీ మా అబ్బాయే అయుంటాడు. ఒడిస్సియస్ ఇప్పుడు లేడు. సముద్రంలో ఏ తిమింగిలమో తినేసి ఉంటుంది. భూమి మీద అయితే ఏ అడవి జంతువో తినేసి ఉంటుంది.”
“అలాగా! నేను అతన్ని ఇటీవలే కలుసుకున్నాను. బంగారం, బహుమతులూ ఇచ్చేను. మళ్ళా త్వరలోనే కలుసుకుందామని ఒప్పందం కూడా చేసుకున్నాం.”
లెయర్టీజ్ కళ్ళవెంట బొటబొటా నీళ్ళు కారేయి. తెరలు తెరలుగా వస్తూన్న దుఃఖాన్ని ఆపుకోలేక పిచ్చివాడిలా దోసిళ్ళతో మట్టిని తీసి నెత్తి మీద పోసుకున్నాడు.
ఈ దృశ్యాన్ని ఇక తట్టుకోలేక, “నాన్నగారూ! నేనే ఒడిస్సియస్ని. మీ కొడుకును. నేను ప్రాణాలతో తిరిగి వచ్చేసేను. మిమ్మల్ని, మీ కోడలు పెనలోపీని, మీ మనవడు టెలెమాకస్ని కష్టాలు పెట్టిన దుర్మార్గులను మట్టుబెట్టేను.”
లెయర్టీజ్ అనుమానంగా చూసి, “నువ్వే నా ఒడిస్సియస్ అని రుజువేమిటి?” అని అడిగేడు.
“మీకు జ్ఞాపకం ఉండే ఉంటుంది. నా చిన్నపుడు అడవిపంది కోరలతో నా తొడ మీద పొడిచింది కదా. ఆ మచ్చ ఇంకా ఉంది. చూడండి.”
ఆ మచ్చని చూసి లెయర్టీజ్ మూర్ఛిల్లి పడిపోయేడు. ఒడిస్సియస్ తండ్రిని హృదయానికి హాత్తుకున్నాడు. తెప్పరిల్లిన తండ్రి కళ్ళు తెరచి, కొడుకు ముఖాన్ని తనివితీరా చూసి సంతోషసముద్రంలో మునిగి తేలుతూ, గభీమని ఒక్కపెట్టున భయపడ్డాడు.
“నీ చేతిలో మరణించిన ఆ రాకుమారుల కుటుంబాలు కక్షకట్టి నిన్ను వెంటాడవూ?”
“వాళ్ళ సంగతి ప్రస్తుతానికి అప్రస్తుతం. ముందు మీ మనవడు టెలెమాకస్తో కలసి విందు భోజనం చేద్దాం, నడవగలరా?”
అథీనా దేవత శిథిలమవుతూన్న లెయర్టీజ్ శరీరాంగాలకి శక్తిని ప్రసాదించింది. ఆయన పొడుగ్గా, బలంగా, ఠీవిగా కనిపించేరు.
ఒడిస్సియస్ తన తండ్రి చెయ్యి పట్టుకుని భోజనశాల వద్దకు నడిపించి తీసుకువెళ్ళేడు. అక్కడ ఆయన స్నానం చేసి, కొత్త బట్టలు కట్టుకున్నారు. టెలెమాకస్ ఆధ్వర్యంలో పశువులకాపరి, పందులకాపరి అద్భుతమైన ఆహారపదార్థాలు తయారుగా ఉంచేరు.
అందరూ ఆనందంగా పండుగ చేసుకుంటూన్న తరుణంలో, అపశకునంలా, బయట ఏదో కలకలం చెలరేగింది. రాకుమారుల వారసులు పెద్ద ఎత్తున దాడి చెయ్యడానికి వచ్చేరు.
ఒడిస్సియస్, అతని తండ్రి లెయర్టీజ్, అతని కొడుకు టెలెమాకస్, ముగ్గురూ యుద్ధానికి సిద్ధమయారు. లెయర్టీజ్ తన ఈటెను కోపంతో విసిరేడు. ఆ దెబ్బకి ఒకడు చచ్చేడు. కొడుకూ, మనవడూ ఒరలనుండి కత్తులని దూసి సింహం, సింహకిశోరంలా ముందుకు దూకేరు.
అకస్మాత్తుగా అక్కడ అథీనా ప్రత్యక్షమైంది. “ఆగండి! మరొక్క రక్తపు చుక్క చిందే లోపున ఆగండి!” అని గర్జించింది.
అథీనాని చూడగానే ఒడిస్సియస్ శత్రుగణం కాళ్ళకు బుద్ధి చెప్పింది. ఒడిస్సియస్ వాళ్ళను వెంబడించేడు.
దేవతల రాజైన జూస్ కోపంతో పిడుగుల వర్షం కురిపించేడు.
“అందరూ యుద్ధాన్ని ఆపండి!” అని అథీనా గట్టిగా అరిచింది. “ఇప్పుడే యుద్ధాన్ని ఆపకపోతే జూస్ అందరినీ శిక్షిస్తాడు. ఆపండి, భూమి మీద శాంతి వర్ధిల్లాలి!”
ఈ మాటలు వినగానే ఒడిస్సియస్ మనస్సుకు ఉపశమనం కలిగింది. శత్రువులను వెంటాడడం మానేసాడు. దేవుడి ఆశీర్వాదబలం ఉంటే అన్ని యుద్ధాలూ – ట్రోయ్ యుద్ధమే కానీయండి, ఏకాక్షి సైక్లాప్స్తో పోరాటమే కానీయండి, సముద్రంలో ఎదురైన రాక్షసులతో పోరాటమే కానీయండి, ఇంటి దగ్గర రాకుమారులతో పోరాటం కానీయండి – అన్నీ ఆగిపోతాయనిన్నీ, శాంతి వర్ధిల్లుతుందనిన్నీ అతనికి తెలుసు.
అప్పటినుండి ఇథకా రాజ్యంలో యుద్ధాలు లేకుండా, దేశం అంతా సుభిక్షంగా, ప్రజలంతా ఆనందంగా ఉంటూ వచ్చారు.
ఇథకా ప్రజలకు, గ్రీసు దేశపు ప్రజలకు, ట్రోయ్ రాజ్యపు ప్రజలకు, ప్రపంచంలో నాలుగు మూలల ఉన్న జనసందోహం అందరికీ శాంతిభద్రతలు చేకూరాలని ఆశిస్తూ, అందరికీ శుభాకాక్షలు.
శాంతి!
