నిశ్శబ్దం

మృత్యువు ఒక్కటే
చావులనేకం

చనిపోయిన వాళ్లను
పేర్లు పెట్టి గుర్తించకు
ప్రపంచపు గాలిలో,
పూ పరాగంలో, నడిచే తోవలో
జీవించే భూమిలో

మనవాటా కొంత పెరిగినట్టే!

నిరాకార ఈశ్వరత్వమే
మృత్యువు
మా దొడ్డ శక్తి

శక్తి నిత్యత్వ సూత్రంలా
నిరంతర చలనశీలి,
గుక్కపట్టి తిరుగుతోన్న బొంగరం

పుట్టేవాళ్ళని
ఆహ్వానించాలి
పుట్టిన వాళ్ళని
గుర్తుంచుకోవాలి,
అందరూ వాటాదారులు

గాలి, ధూళి, నేల,
పంట, ఫలం–
ఏదీ మినహాయింపు కాదు

నిట్టూర్పుల చట్రం–
పులిసిన కర్బనపు గాలి

ఎవరికి వాళ్ళకి
చూసుకోవడానికి,
తెలుసుకోవడానికి అద్దం

దేవుడు, నీరు, ఆకాశం–
అన్నింటికీ హక్కులే

మృత్యువు అలా కాదు
అంకెల్లో ఒదిగిపోతుంది
ప్రశ్నలక్కరలేదు
జవాబులు అసలే ఉండవు

రూపం లేని మృత్యువు
ఎల్లలులేని విశ్వం
అన్ని నిశ్శబ్దాలనీ
పొదువుకునే మహా నిశ్శబ్దం


ఇంద్రప్రసాద్

రచయిత ఇంద్రప్రసాద్ గురించి:

ఆవంత్స సోమసుందర్ అంతేవాసిగా సాహిత్యంతో ప్రారంభమయిన ఇంద్రప్రసాద్ గారి సాహిత్య ప్రయాణం ఇంకా కొనసాగుతూనే ఉంది. నడిచి వచ్చిన దారి (కవిత్వం 1993), కాలం సైకత తీరం (కవిత్వం 2023), మూడు పడవలు (కవిత్వం 2024) అనే సంకలనాలను ప్రచురించారు.

 ...