తన రచనకి ఒక ప్రామాణికతని సృష్టించుకున్న కథకుడు మధు పెమ్మరాజు

“దయకలిగి ఉండండి” అన్న శీర్షికతో వాట్సప్ లో చక్కర్లు కొడుతున్న ఒక కథని ఈ మధ్య కవి మిత్రుడు మోహన్ రుషి నాకు పంపించాడు. ఉత్తమ పురుషలో కొనసాగే ఆ కథలో కథకుడు ఒక రాత్రి తన అనుభవాన్ని చెబుతూ…”నేను ఊబర్ డ్రైవర్ని. ఎక్కువగా రాత్రిపూట నడుపుతుంటాను. గతవారం రాత్రి 11 గంటలకు ఒక వృద్ధుడిని ఎక్కించుకున్నాను. కారులో కూర్చోగానే ‘నేను ఈ రాత్రి నన్ను ఐదు చోట్లకి తీసుకెళ్లాలి. నేను నీకు 5 వేలు ఇస్తాను. కానీ పనంతా పూర్తయే వరకూ ఎందుకు అని నన్ను ప్రశ్నించకూడదు. అని ఐదు చిరునామాలు ఇచ్చాడు. మొదటిది పట్టణం చివరలో ఉన్న ఇల్లు. రెండవది ఒక ప్రాథమిక పాఠశాల. మూడవది ఒక చిన్న రెస్టారెంట్. నాలుగవది ఒక శ్మశానం. చివరిది నా అన్న వాళ్ళు ఎవరూ లేక, చివరకు అతను రోగిగా చేరబోతున్న కాన్సరు ఆసుపత్రి.”

నేను మోహన్ రుషికి సమాధానం రాస్తూ, ఆ కథ మధు పెమ్మరాజు రాసిన “గమనమే నా గమ్యం” అని తానా సావనీర్లో పడిన కథకి కాపీ అని రాసాను. నిజానికి మధు రాసిన గొప్ప కథకి అది ఒక చవకబారు కాపీ అనుకోండి. అది వేరే సంగతి. కథకి ఉదాత్తత అందులో ప్రకటించే ఆవేశాల నియంత్రణలో ఉంటుంది. మామూలు కథకుడికి ఆ సంయమనం ఉండదు. వాళ్ళకి తక్షణ ప్రయోజనం, సంతృప్తి కావాలి.

ఇప్పటిలా పూర్వం ప్రసార మాధ్యమాలు ప్రజల మధ్య వారధిగా లేని రోజుల్లో, “శ్రీ రాజ్” వ్రాసిన ‘లాస్ట్ కేస్‘ కథ, 28 అక్టోబరు 1970 ఆంధ్రప్రభ వార పత్రికలో వచ్చింది. దానిని ఒక ప్రబుద్ధుడు అంకించుకుని, ఆకాశవాణి, విశాఖపట్నం కేంద్రం వారికి నాటకంగా మలిచి స్వీయ రచనగా ప్రచారం చేసుకుని ప్రయోజనం పొందడానికి ప్రయత్నించాడు. రావిశాస్త్రి గారు ఆ శాల్తీ వివరాలు కనుక్కుని, నోటీసు ఇచ్చి, ఆయన హక్కుని రక్షించారు. శాస్త్రిగారు శ్రీరాజ్‌తో అన్న మాటల్నే పునరుక్తి దోషం ఉన్నా, తిరిగి చెప్పాల్సి వస్తుంది: ఒక రచయిత కథని వేరొకరు ఎత్తుకుపోడానికి ప్రయత్నించారంటే, అది మంచి కథ అని పరోక్షంగా కితాబు ఇచ్చినట్టే.

పతంజలి శాస్త్రిగారు తమ ముందుమాటలో “ఏ అనుభవం రచయితకి వస్తువు అవుతుంది?” అని మంచి ప్రశ్న లేవనెత్తారు. నిజానికి ఏ రచయితకైనా వారి వృత్తి కథలకి మంచి ముడిసరుకుని అందిస్తుంది. సంఘటనలని ఊహించడం కంటే వాస్తవంగా, దగ్గరగా అనుభూతి చెందడం వలన కథలకి కొంత సాధికారత వస్తుంది. కానీ వ్యక్తపరిచే శిల్పం లోనే తేడాలు ఉంటాయి. ఈ సందర్భంలో సూర్యశతకంలో మయూరుడు చెప్పిన ఉపమానం గుర్తుకు వస్తుంది. ఉదయిస్తున్న సూర్యుడి కిరణాలు పర్వతాల ఔన్నత్యాన్ని నిర్ధారిస్తున్నట్టు మీద నుండి క్రిందకు దిగుతున్నాయి అంటాడు. అందరి అనుభవాల ముడిసరుకు ఒక్కటే అయినా, అనుభవాల సాంద్రతలో, ప్రకటించే తీరులోనే తేడాలు ఉంటాయి. కథకుల్లో తారతమ్యాలని నిర్ణయించేది ఈ కిరణాలే.

మధు పెమ్మరాజు కథల్లో, నాకు నచ్చిన విషయం: కవిత్వాన్నీ, జన బాహుళ్యంలో ప్రచారంలో ఉన్న తెలుగు/ హిందీ సినిమా పాటల పల్లవుల్నీ, చరణాలనీ సందర్భానికి తగ్గట్టుగా మెటఫర్లుగా వాడుకోవడం. దానివల్ల కథనాన్నీ, వ్యక్తిత్వాలనీ, ఆ సందర్భంలో ఆవేశాల తీవ్రతనీ, క్లుప్తంగా, గాఢంగా చెప్పగలిగే సౌలభ్యం కలుగుతుంది. సాటి రచయితకి అది ప్రశంస లేదా నివాళిగా మనం తీసుకోవచ్చు. అది ప్రయత్న పూర్వకంగా చెయ్యడం మంచి ప్రయోగం, సంప్రదాయం కూడా.

ఇందులో 17 కథలు ఉన్నాయి. మొదటి కథతో పాటు, శిల్ప పరంగా నాకు నచ్చిన కథల్లో ఇనుపతెర, ఆడ్ జాబ్, రాత్-దిన్, వైకుంఠపాళి ఉన్నాయి.

అస్తిత్వ వేదనలలో, వైయక్తిక ప్రయోజనాలు, వాటి మధ్య పోటీలు, సంఘర్షణలకు దారి తీసి, మనుషుల మధ్య సత్సంబంధాలకి ఇనుప తెరలుగా నిలుస్తాయి. అవి లేనిపోని భయాలని రేకెత్తించి, మన దృక్పథాన్ని సంకుచితం చేసి మనలోని మానవీయతని మరుగు పరుస్తాయి. కానీ, చిత్రంగా, కొన్ని అనుకోని సంఘటనలు మనల్ని అంతర్ముఖుల్ని చేస్తాయి. మన ఆలోచనల సరళిని ప్రశ్నిస్తాయి. సంఘర్షణలు పరాకాష్ఠకు చేరుకుని, దేనికి ఇన్నాళ్ళూ భయపడ్డామో అది నిజంగా ఎదురైనపుడు, మనకి ఎక్కడలేని తెగింపు వస్తుంది. మనలోని మానవీయత మేల్కొంటుంది. జీవితాన్ని నిలబెట్టుకుందికి పట్టుదల వస్తుంది. “ఇనుపతెర” ఈ అంశాన్ని చాలా బాగా పట్టుకుంది.

ఆడ్ జాబ్ నిజమైన డయస్పోరా కథ. మంచి భవిష్యత్తుకై పడే ఆరాటంలో బ్యాంకులనుండి అప్పులు తీసుకుని, దేశం కాని దేశంలో చట్ట విరుద్ధంగా పని చెయ్యవలసిన ఆర్థిక అవసరాలకీ, గడువులోపల పూర్తి చెయ్యవలసిన అసైన్ మెంట్లకీ మధ్య నలిగిపోయే విద్యార్థుల జీవన పోరాటాన్ని చక్కగా చూపిస్తుంది.

రాత్-దిన్ చాలా చిన్న కథ. కానీ, వెలుగు చీకట్ల మధ్య మంచి విశ్లేషణ ఉంది. దేనికి భయపడాలి? వెలుగుకా? చీకటికా?

వైకుంఠపాళీ అమెరికన్ కార్పొరేట్ ప్రపంచంలో పెద్ద చేపలు చట్టంలో లొసుగుని తమకి అనుకూలంగా మలుచుకుని చిన్న చేపల్ని ఎలా వేటాడతాయో చెప్పే కథ. కానీ చిన్న చేపలు తెగించి ఎదురు తిరిగితే? … ఆ కథనం చిక్కగా సాగిన కథ.

చదివించడమే కాదు, చదివిన తర్వాత కొన్ని కథలు మనల్ని ఎప్పటికీ వెంటాడుతూనే ఉంటాయి.

డొరేదార్: మధు పెమ్మరాజు కథలు
నవోదయ బుక్ హౌస్, కాచిగుడ క్రాస్ రోడ్స్, హైదరాబాదు-27. వెల Rs/- 120/-