సముద్రానికి ఆకాశం
ఆకాశానికి సముద్రం
అనాదిగా తెరిచిన పుస్తకం
అలల హృదయాలలో ఏమున్నాయో
అలల లోపల అల
అలల కోసం అల
సముద్రం కోసం సముద్రం
సముద్రం లోపల సముద్రం
నదుల్నే కాదు
సముద్రాల్నీ మింగుతున్న సముద్రం
సముద్రాల సంగమం కదా
భూప్రపంచం
సముద్రపు గాలిలో కలిసిపోయి
వినపడని ఎన్నెన్ని గొంతుకల
కథల కంఠస్వరాలో
సముద్రం
నాదీ మాదని
ఎంత యుద్ధక్షేత్రమయినా
సముద్రాన్ని ఎవరు మోసగించగలరు
తిరగబడనంత వరకే సముద్రస్నేహం
సముద్రం నోరు
అలా తెరిచే ఉంటోంది
ఆ నోటిలో ఎన్నున్నాయో
ఆకాశం కళ్లు
అలా తెరిచే ఉంటున్నాయి
ఆ ఆవరణలో ఏముందో
ఏ సాక్ష్యాలు నమోదవుతున్నుయో
సముద్రాలమీద
ఎవరూ చదవలేని
ఎవరూ తెలుసుకోలేని
ఎన్ని రాతలున్నాయో
ఎన్ని భాషల బాధలున్నాయో
సముద్రం మీద వాలిపోతూ
అదేపనిగా చెప్పుకుంటోన్న
అలల సమూహం
కనిపించిన బండరాళ్లమీద
బలంగా బాదుకుంటోన్న
అలల తలలు
ఏ జాడల్నీ ఉంచుకోని
ప్రాచీన గ్రంథాలయం
సముద్రం
ఏ రహస్యాల్నీ తెలియనివ్వని
అనంతాన్వేషణల గహనం
ఆకాశం
