ఆగస్ట్ 2025

Issue Index Image

ఆగస్టు 30, 2025 నాటికి, రచయిత, పండితుడు, హేతువాది, మూఢనమ్మకాలను నిర్మొహమాటంగా విమర్శించిన ఎం. ఎం. కల్బుర్గి (మల్లేశప్ప మడివాళప్ప కలబుర్గి) హత్య జరిగి పదేళ్లు పూర్తవుతాయి. అతని హత్య కేవలం ఒక వ్యక్తిపై జరిగిన హింసాకాండ మాత్రమే కాదు; అది ప్రజాస్వామ్య సమాజానికి జీవనాడి అయిన వాక్స్వాతంత్ర్యంపై జరిగిన ప్రత్యక్ష దాడి. తాము వెలిబుచ్చిన అభిప్రాయాల కారణంగా హత్యకు గురైన వారిలో కల్బుర్గి మొదటివాడు కాదు. ఆఖరివాడు కూడా కాలేకపోయాడు. కల్బుర్గి హత్యకు ఒకటి, రెండు సంవత్సరాల ముందు వెనుకలుగా నరేంద్ర దభోల్‌కర్, గోవింద్ పన్సారే, గౌరి లంకేశ్ వంటి ఇతర రచయితలను కూడా దాదాపు ఇదే రకమైన దాడులతో కాల్చి చంపారు. ఈ రచయితల హత్య జరిగిన ఈ దశాబ్ద కాలంలో, ఈ హత్యల గురించి రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల నుండి, న్యాయస్థానాల నుండి స్పందన మాత్రం నిస్తేజంగా ఉంది. దర్యాప్తులు నత్తనడకన సాగాయి. శిక్షలు అరుదుగా పడ్డాయి. ద్వేషాన్ని పెంచి పోషించే విస్తృత వ్యవస్థలు మాత్రం చెక్కుచెదరకుండా ఉన్నాయి; బహుశా మరింత బలోపేతం అయ్యాయి. ఆధునిక సమాజంలో, భావ ప్రకటనా స్వేచ్ఛ కేవలం ఒక హక్కు మాత్రమే కాదు, అది జాతి పురోగతికి, వ్యక్తిగత స్వేచ్ఛకు కీలకమైన పునాది. ఎలాంటి ప్రతీకార చర్యలకు భయపడకుండా పౌరులు సాహిత్యం ద్వారా, ఇతర మాధ్యమాల ద్వారా ప్రభుత్వాలను, సంస్థలను విమర్శించగలగడం అనేది అధికారులను, రాజకీయ నాయకులను జవాబుదారీగా ఉంచగలిగే ప్రాథమిక సాధనం. అంతేకాకుండా, ఈ స్వేచ్ఛ సమాజంలో పాతుకుపోయిన ఆధిపత్య ధోరణులను, మతం, సంప్రదాయం అనే ముసుగులో జరిగే ఘోరాలను, అత్యాచారాలను సవాలు చేయడం ద్వారా సత్యాన్వేషణకు మార్గం సుగమం చేస్తుంది. భారతదేశంలో ఈ రకమైన భావప్రకటనా స్వేచ్ఛ నిజానికి ఏ ఆధునిక పాశ్చాత్య దేశాలనుండి దిగుమతి చేసుకొన్న భావన కాదు. అది భారతదేశ తాత్విక, ఆధ్యాత్మిక సంప్రదాయాలలోనే నిక్షిప్తమై ఉంది. ఉపనిషత్తులలో కనిపించే సంవాద చర్చల నుండి భక్తి కవుల వరకు, బుద్ధుడి కర్మకాండల తిరస్కరణ నుండి బసవన్న ప్రతిపాదించిన కులవ్యతిరేక సంస్కరణల వరకు వాదప్రతివాదాలకు, చర్చోపచర్చలకు ఎప్పుడూ పెద్దపీట వేసే ఘనమైన సంప్రదాయం భారతదేశానిది. ఈ విషాద వార్షికోత్సవం సందర్భంగా మనం వేసుకోవాల్సిన ప్రశ్న: మనం ఎలాంటి ప్రపంచాన్ని కోరుకుంటున్నాం? ఎటువంటి సామాజిక వ్యవస్థలను సమర్థిస్తున్నాం? ఎటువైపు పయనిస్తున్నాం? ప్రపంచవ్యాప్తంగా జాతీయవాద దృక్పథాల పేరిట ఆరోగ్యకరమైన దేశభక్తిని దాటి, స్వ-పర భేదాలతో మనుషులను విభజించుకొని, “అన్య” వర్గాలపై విద్వేషాన్ని మరింత బలోపేతం చేసే సమాజాల వైపా? లేక, బహుళత్వాన్ని, మానవ సమాజంలో ఉన్న పలు జాతి, వర్గ వైవిధ్యాలను, పలు మత, ఆధ్యాత్మిక, తాత్విక సాంప్రదాయాలను, విజ్ఞానశాస్త్రాలను ఉమ్మడి మావనీయ సంపదలుగా, మనందరినీ కలిపే వారధులుగా భావించి భవిష్యత్తులో ఉమ్మడిగా సవాళ్ళను ఎదుర్కొనగలిగే స్వేచ్ఛాయుత ప్రపంచాన్ని అందజేసే సమాజాల వైపా?