
తెలుగుదేశంలోని తల్లిదండ్రులకు ఆంగ్లభాష ప్రపంచాన్ని ఓ కుగ్రామంలా మార్చేసి చప్పున అరచేతిలో పెట్టే మంత్రదండం. భారతదేశ సమగ్రతకు, సమైక్యతకు హిందీ భాష అత్యవసరమన్నది ప్రస్తుత రాజకీయ వాతావరణంలో రాజకీయ నాయకులలోనూ, సామాన్య ప్రజలలోనూ ప్రబలుతున్న నమ్మకం. ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాలలో తెలుగుభాష ఆధునిక అవసరాలు తీర్చే సజీవ భాషగా ఎంతకాలం మనగలుగుతుంది? ఆంగ్లం-హిందీ భాషలు విద్య, పరిపాలన, వాణిజ్యం, ఉపాధి రంగాలలో ఆధిపత్యం చెలాయిస్తే, తెలుగుభాష కేవలం సాహిత్య, సాంస్కృతిక, సామాజిక ప్రయోజనాలకు పరిమితమై మనుగడ సాగించగలదా? జర్మనీ, జపాన్, కొరియా వంటి పలు అభివృద్ధి చెందిన దేశాలలో స్థానిక మాతృభాషలే సాహిత్య, సామాజిక రంగాలతో పాటు రాజకీయ, పారిశ్రామిక ఆర్థికవ్యవస్థలలో కీలకపాత్ర పోషిస్తున్నాయి. కానీ, కారణాలు ఏవైతేనేం, ప్రజలు తెలుగు మాట్లాడే ప్రాంతాల్లో రాజరికపు వ్యవస్థలోనూ, తదనంతరపు ముస్లిమ్, బ్రిటిష్వారి పాలనా కాలంలోనూ, ప్రజాభాషలు కానట్టి సంస్కృతం, ప్రాకృతం, పారశీకం, ఇంగ్లీషు భాషలే ఎక్కువ కాలం అధికార భాషలుగా చెలామణి అయ్యాయి. భిన్న భాషలు, సంస్కృతులు గల విశాల భారతదేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థ పరిపుష్టం కావాలన్నా, అభివృద్ధి సాధించబడాలన్నా, ప్రజల భాషలలోనే పరిపాలన సాగాలనే మౌలిక సూత్రాన్ని స్వాతంత్ర్యం సిద్ధించిన తరువాత కాస్త ఆలస్యంగానైనా గుర్తించిన భారత ప్రభుత్వం భాషాప్రయుక్త రాష్ట్రాల నిర్మాణం చేపట్టి, స్థానిక భాషలను అధికార భాషలుగా గుర్తిస్తూ ఉత్తర్వులు జారీ చేసినా గత 75 సంవత్సరాలలో తెలుగును అధికారభాషగా చిత్తశుద్ధితో అమలుపరిచిన ప్రభుత్వాలు లేవు. కృత్రిమ మేధస్సు (AI), ఆటోమేటిక్ అనువాద సాధనాలు లభ్యమౌతున్న ఆధునిక యుగంలో తెలుగుభాష భవిష్యత్తు గురించి ఆందోళన అనవసరమని కొంతమంది అభిప్రాయం. అయితే, ఏఐ (AI) ఒక సాధనం మాత్రమే. తెలుగు భాష సజీవభాషగా మనుగడ సాగించాలంటే బడి, గుడి, ఏలుబడి, రాబడి రంగాలలో తెలుగుభాష వాడకం చురుకుగా సాగాలి. ప్రజలు తెలుగు భాషను రోజువారీ జీవితంలో ఉపయోగించడం మానేస్తే, ఆధునిక అవసరాలకు అనుగుణంగా దీనిని అభివృద్ధి చేయకపోతే, ఏఐ (AI) వంటి సాధనాలు, ప్రయత్నాలు పరిమిత ఫలితాలను మాత్రమే ఇస్తాయి.
తెలంగాణ రాష్ట్రంలో 2025-26 విద్యా సంవత్సరం నుండి అన్ని సీబీఎస్బీ, ఐసిఎస్ఈ, ఐబితో పాటు ఇతర బోర్డు అనుబంధ పాఠశాలల్లో 1 నుండి 10 తరగతుల వరకు తెలుగు తప్పనిసరి సబ్జెక్టుగా బోధించాలని ఉత్తర్వులు జారీ చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఇటువంటి చర్యలు చేపట్టాలి. ఈ రెండు రాష్ట్రాలలో ప్రభుత్వాలు భవిష్యత్ తరాలకు తెలుగుభాషపై అభిమానాన్ని, భాషపై పట్టును చిన్నవయస్సునుండే పెంపొందించి, వారి సాంస్కృతిక, భాషా వారసత్వాన్ని బలోపేతం చేయడంతో పాటు, ఆధునిక విద్య, పరిపాలన, వాణిజ్య రంగాలలో తెలుగు భాషను ఉపయోగించడాన్ని ప్రోత్సహించి, భారతీయ భాషలలో తెలుగు భాషను ఒక శక్తివంతమైన జీవభాషగా నిలబెట్టడానికి కృషి చేస్తారని ఆశిద్దాం.