అయ్యో
అంతా అయిపోయింది
తలుపు చాటున నక్కిన భావం
మధుపాత్రలో దూకి చచ్చిపోయింది.
వీధికుక్క అరుపులకు భయపడి,
పల్లకిలో ఊరేగుతున్న ఆశయాలు
ముద్దగా వాకిలిలో కూలబడ్డాయి.
భావం తాలూకు ఆస్తిపత్రాలేవైనా ఉంటే
దింపుడు కళ్ళెం దగ్గరే పంచుతామని
గోడ గడియారం దండోరా వేసింది.
శవయాత్రకు అక్షరాలు హాజరు కావొద్దని తీర్మానించాయి.
శబ్దించే నిశ్శబ్దాలు దిక్కులు పెక్కటిల్లేలా రోదిస్తున్నాయి.
అంతా కకావికలం
వికల హృదయ విలాపం
ఆలోచనల సమూహం సమాలోచనలు చేసి
భావం మృతికి సంతాపం తెలిపాయి.
వాటి ఊకదంపుడు ఉపన్యాసాలు వినే
ఓపికా, తీరికా ఇక్కడ ఎవ్వరికీ లేదు.
అయినా భావం లేకపోతేనేం?
ప్రత్యూషాలు, ప్రదోషాలు వస్తూనే ఉన్నా
పుట్టుకలు, మరణాలు ఆగట్లేదుగా?
వైరుధ్యాలు, వైషమ్యాలు వీగట్లేదుగా?
చలన కాంక్ష ప్రపంచపు సహజాతం
మత్తు నుంచి లేచిన భావాన్ని చూసి
ఆశయాలు భూతమని భావించాయి.
“నేను బ్రతికే ఉన్నాను మొర్రో!” అని
వెర్రికేకలు వేసినా పట్టించుకోలేదు.
చచ్చి బ్రతికినందుకు భావానికి శిక్ష తప్పదని
గోడగడియారం హెచ్చరించింది.
భావం రాల్చిన కన్నీళ్ళకు
సముద్రం పొంగిపోయింది.
ఆకాశం విరిగిపోయింది.
భూమి కంపించిపోయింది.
ప్రళయం, విళయం, వినాశనం!
పరిణామగతిని ఎదుర్కొనే శక్తి ఎవ్వరికీ లేకపోయింది.
కాల వాజితతి పదఘట్టనలో విలయ లయ హేల.
వికారాకార విహంగాల రెక్కలు విప్పుకుంటూ
కొత్త శక్తులు పుట్టుకొచ్చాయి.
మళ్ళీ ఆశల ఆశయాలను పట్టుకొచ్చాయి
భావాలు పురుడు పోసుకున్నాయి.
కనికరంలేని గోడగడియారం మాత్రం,
ఉరకలువేస్తూ తీర్పులు చెప్పసాగింది.
కాలాన్నే నిలదీసి నిలువగలిగే భావం
ఎప్పుడు పుడుతుందో?
ఏమో మరి?