కంప్యూటర్ చిప్ కథ – 4: మెరుపు – విద్యుత్తు: బెంజమిన్ ఫ్రాంక్లిన్ ప్రయోగాలు

“First let me talk with this philosopher. What is the cause of thunder?” – Act III, Scene IV of King Lear, William Shakespeare


బెంజమిన్ ఫ్రాంక్లిన్

కేవలం ప్రాధమిక విద్యకి మించని చదువుతో, పదిహేడేళ్ళు నిండక మునుపే ఇంటి నుండి పారిపోయి, ప్రింటరుగా వ్యాపారంలో స్థిరపడి, ఊళ్ళో పేరుగాంచిన పౌరుడయి, వృత్తిపని వాళ్ళకి ఉపయోగపడే కాలేజీని (తర్వాత ప్రపంచ ప్రసిద్ధిగాంచిన విశ్వవిద్యాలయమైన దానిని) నెలకొల్పి, రాజకీయ నాయకుడయి, అమెరికా సంయుక్త రాష్ట్రాల స్థాపకులలో (Founding Fathers) ఒకడైన బెంజమిన్ ఫ్రాంక్లిన్ (Benjamin Franklin, 1706-1790) మొదటి అమెరికా శాస్త్రవేత్త కూడా. స్వయంకృషితో పైకొచ్చిన ఈ బహుముఖ ప్రజ్ఞావంతుడి గురించిన వ్యాసం ఇది.

బాల్యం

జోసయా ఫ్రాంక్లిన్, భార్యా, ముగ్గురు పిల్లలతో 1683 ఆగస్టులో ఇంగ్లాండు నుండి బయలుదేరి అమెరికాలోని న్యూ ఇంగ్లాండు నగరమైన బోస్టన్ చేరుకున్నాడు. అతని వృత్తి పట్టు బట్టలకి అద్దకం వెయ్యటం. కాని ప్యూరిటన్ ప్రొటెస్టంటులున్న బోస్టన్‌లో పట్టు వస్త్రాలకి గిరాకి లేకపోవడాన వేరే వృత్తిలో – జంతువుల కొవ్వుతో సబ్బు, కొవ్వుత్తులు చేసి అమ్మడం – కుదురుకున్నాడు. క్రమంగా జోసయా వ్యాపారం పుంజుకొంది. భార్య చనిపోతే రెండో పెళ్ళి చేసుకున్నాడు.1706, జనవరి 17 న బెంజమిన్ ఫ్రాంక్లిన్ జోసయాకి పదిహేనో బిడ్డగా పుట్టాడు. తరవాత పుట్టిన ఇద్దరు కూతుళ్లతో మొత్తం పదిహేడుమంది పిల్లలతో జోసయాది పెద్ద కుటుంబం.

అప్పట్లో బోస్టన్ నగరం పదివేలమంది జనాభాతో సముద్ర వ్యాపారంలో బ్రిటిష్ సామ్రాజ్యంలో కెల్లా మూడో స్థానంలో ఉండి వృద్ధిచెందుతున్న ఓడరేవు. నీళ్ళు, పడవలు, నదులు, సముద్ర యానం – ఇవంటే చిన్నప్పటి నుండి ఫ్రాంక్లిన్‎కి ఎక్కువ ఇష్టం. బోస్టన్‌లోని ఛార్లెస్ నదిలో సులువుగా, వేగంగా ఈదడానికి మార్గాలు కనుక్కునే వాడు. గాలిపటాన్ని పట్టుకొని ఈదడం వలన తక్కువ శ్రమతో వేగంగా ఈదగలనని చిన్నప్పుడే తెలుసుకున్నాడు.

చిన్నతనం నుండి ఫ్రాంక్లిన్ చదువు మీద చాలా శ్రద్ధ చూపెట్టాడు. మిగిలిన సబ్జెక్టులలో క్లాసులో మొదటివాడుగా వచ్చినా, గణితంలో మాత్రం రాణించలేదు. క్రైస్తవ మతాచార్యుడవుతాడని తండ్రి ఆశపడ్డాడు. కాని అతిచిన్న వయసులోనే ఫ్రాంక్లిన్ వేసే చొప్పదంటు ప్రశ్నలు (“రోజూ భోంచేసే ముందర గ్రేస్ చెప్పే బదులు ఆరునెలలకోసారి మాంసం, దినుసులు, నిల్వచేసేటప్పుడు చేస్తే సరిపోదా?”) విని, కొడుకు ఆ వృత్తిలో ఇమడడని తండ్రి నిర్థారించుకొని, ఫ్రాంక్లిన్‎కి పదేళ్ళు నిండటంతోటే బడి మానిపించి పనిలో పడేశాడు. కాని దాంట్లో పనిచెయ్యడం ఫ్రాంక్లిన్‎కి సుతరామూ ఇష్టం లేదు. జంతుచర్మాన్ని కొవ్వు కోసం వేడి చెయ్యడం రోత పుట్టించేది; కొవ్వొత్తులకి వత్తులు పెట్టడం విసుగు కలిగించేది. ఫ్రాంక్లిన్ అన్న అప్పటికే ప్రింటర్‌గా ఇంగ్లాండులో శిక్షణ పొంది వచ్చి బోస్టన్‌లో ముద్రణా వ్యాపారం మొదలెట్టాడు; అతని దగ్గర ఫ్రాంక్లిన్ అప్రెంటీస్‌గా చేరాడు. అన్నకు చేదోడువాదోడుగా ఉంటూ పనిమంతుడిగా పేరు తెచ్చుకున్నాడు.

అన్న కొన్నాళ్ళకి “న్యూ ఇంగ్లండ్ కురాంట్ (New England Courant)” అన్న వార్తాపత్రిక మొదలెట్టాడు. ఫ్రాంక్లిన్ దాంట్లో మారుపేరున అన్నకి తెలియకుండా వ్యాసాలు రాయసాగాడు. ముద్రణా వ్యాపారంలో ఉండటం ఫ్రాంక్లిన్‌కి బాగా ఉపయోగపడింది. తీరిక వేళలో పుస్తకాలు చదవడం అలవాటు చేసుకున్నాడు. వాటిలో కొన్ని: Plutarch’s Lives, John Bunyan’s Pilgrim’s Progress, Daniel Defoe’s An Essay Upon Projects, బోస్టన్‌లోని క్రైస్తవ మతాచార్యుడు Cotton Mather రాసిన Bonifacius: Essays to Do Good. వీటిలో చివరి పుస్తకం ఫ్రాంక్లిన్‎ని చిన్నప్పుడే ఎంతో ప్రభావితం చేసింది. Mrs. Silence Dogood అన్న మారుపేరుతో కురాంట్‌లో వ్యాసాలు కూడా రాశాడు. పెద్దయిన తర్వాత ఫ్రాంక్లిన్ చేపట్టిన ప్రాజెక్టులని చూస్తే, వాటికీ Defoe రాసిన లండన్‌లో సమాజానికి పనికొచ్చే ప్రాజెక్టులకీ సామ్యం కనబడుతుంది.

క్రమంగా అన్నాతమ్ముళ్ల మధ్య కలహాలు పెరిగాయి. అపుడప్పుడు అన్న కొట్టేవాడు కూడా. స్వతంత్రంగా బతకాలని ఫ్రాంక్లిన్ నిర్ణయించుకొని కొన్ని పుస్తకాలని అమ్మి, ఆ డబ్బుతో ఓడ ప్రయాణానికి టికెట్ కొనుక్కొని, బోస్టన్ నుండి 1723 సెప్టెంబరు 25 న న్యూయార్క్‎కు పారిపోయాడు. ఓడలో ఒక ప్రయాణీకుడు, తన కొడుకుకి ఫిలడెల్ఫియాలో ముద్రణాలయం ఉందనీ, వెళ్తే ఏదన్నా పని దొరకవచ్చనీ సలహా ఇచ్చాడు. అక్టోబర్ 6 న ఫ్రాంక్లిన్ ఫిలడెల్ఫియా చేరాడు.

పరారి జీవితం

17 వ శతాబ్దంలో క్రైస్తవమతంలోని క్వేకర్స్ (Quakers) వర్గానికి చెందిన విలియం పెన్ బ్రిటిష్ రాజు నుండి అమెరికాలోని ఈశాన్య ప్రాంతంలో కొంత భూమిపై హక్కు పొందాడు. 1682 లో పెన్ అమెరికా వలస వచ్చి, “ఫిలడెల్ఫియా (Philadelphia)” ( గ్రీకు భాషలో “సోదర ప్రేమ”) అన్న నగరాన్ని నెలకొల్పాడు. పెన్సిల్వేనియా రాష్ట్రం పేరు అతనిమీదుగా వచ్చిందే. అప్పటిలో పది వేలమంది జనాభాతో బోస్టన్ తర్వాత ఫిలడెల్ఫియాయే అమెరికాలో కెల్లా పెద్ద నగరం. క్వేకర్ వర్గీయులకి శాంతి, సహనం, మత స్వాతంత్ర్యం, ముఖ్య ఆశయాలు.

పది రోజులు ఓడ మీద, పడవ మీద, కాలి నడకన ప్రయాణం చేయడాన ఫిలడెల్ఫియా చేరేసరికి ఫ్రాంక్లిన్ అలసిపోయాడు. బట్టలు మాసిపోయాయి. ఆకలితో అలమటిస్తున్నాడు. ఒక డచ్ డాలర్‎కి మించి డబ్బుల్లేవు. ఆఊళ్ళో తెలిసిన ప్రాణి ఒక్కటీ లేదు. బజార్ల వెంబడి తిరుగుతుంటే ఓ బేకరీ కనిపించింది. మూడు రొట్టెలు కొన్నాడు. రెండు చెరో చేతి కింద పెట్టుకొని, మూడో దానిని తింటూ వీధిలో నడుస్తూంటే, ఓ ఇంటి బయట నిలబడి ఉన్న డెబరా రీడ్ అనే అమ్మాయి ‘ఎవరీ మోటు మనిషి?’ అనుకుంది. మరి కొన్నేళ్ళ తర్వాత ఆమే ఫ్రాంక్లిన్‎కి భార్య అయింది.

అక్కడ ఓ ప్రింటరు దగ్గర ఫ్రాంక్లిన్ అప్రెంటిస్‌గా చేరాడు. అతని పనితనం గురించి తెలుసుకున్న ఫిలడెల్ఫియా గవర్నరు ఫ్రాంక్లిన్‎ని కలిసి, తల్లిదండ్రుల సాయంతో సొంత ముద్రణాలయం పెట్టమని ప్రోత్సహించాడు. తల్లిదండ్రులని కలవడానికి 1724 ఏప్రిల్‌లో ఫ్రాంక్లిన్ తిరిగి బోస్టన్ వచ్చాడు. అతని రాకకు తల్లిదండ్రులు సంతోషించినా, అంత చిన్న వయసులో సొంత వ్యాపారంలోకి దిగొద్దనీ, ముందు ఉద్యోగంలో స్థిరపడమనీ నచ్చచెప్పారు.

అది విన్న ఫిలడెల్ఫియా గవర్నరు తానే సాయం చేస్తానని, ముద్రణా వ్యాపారానికి కావలసిన సామగ్రి గురించి ఆరా తీశాడు. ఫ్రాంక్లిన్ చిన్న ప్రింటు వ్యాపారానికి కావలసిన సామగ్రి పట్టిక ఇచ్చాడు. లండన్ వెళ్ళి కావలసిన యంత్రాంగం కొనుగోలు చెయ్యమనీ, అక్కడి వర్తకుల దగ్గర తనకు కాతా ఉందనీ, వాళ్ళకి వేరేగా ఉత్తరాలూ డబ్బూ పంపుతాననీ గవర్నరు ప్రగల్భాలు పలికాడు. అతనిని నమ్మి ఫ్రాంక్లిన్ 1724 నవంబరులో బయలుదేరి డిశంబరు 24 న లండన్ చేరాడు. తీరా అక్కడకు చేరింతర్వాత గవర్నరు వట్టి దగాకోరు అని తెలుసుకొని మోసపోయినందుకు విచారించాడు. తిరుగు ప్రయాణానికి డబ్బుల్లేవు.

లండన్‌లో ఓ ముద్రణాలయంలో పని సంపాదించాడు. దానితో అక్కడ కొందరు ప్రముఖులతో పరిచయాలయాయి. ఫిలడెల్ఫియా నుండి కొన్ని కుతూహలం కలిగించే వస్తువులని ఫ్రాంక్లిన్ తనతో తీసుకొచ్చాడు. అందులో ఒకటి రాతినార (asbestos) తో చేసిన పర్సు. అది మంటలో పడినా మాడదు. ప్రకృతి మీద పరిశోధనలు చేసే వాళ్ళకు నచ్చుతుందని తెచ్చాడు. దాని గురించి తెలుసుకున్న ఓ పెద్ద మనిషి, సర్ హాన్స్ స్లోన్, ఫ్రాంక్లిన్‎ని కలిసి, ఆ పర్సును మంచి ధరకి కొన్నాడు. ఆయన తర్వాత రాయల్ సొసైటీకి ప్రెసిడెంట్ అయ్యాడు. చాలా చిన్న వయసులోనే పెద్దలతో పరిచయాలు చేసుకోవడం ఫ్రాంక్లిన్‎కి సులభంగా అబ్బిన గుణం.

లండన్‌లో ఉన్నప్పుడే ఫిలడెల్ఫియాకి చెందిన ఓ వ్యాపారి తనకు సాయంగా ఉండమనటంతో ఫ్రాంక్లిన్ జులై 1726 లో లండన్ వదిలి ఫిలడెల్ఫియాకి తిరిగి వచ్చాడు. ఉద్యోగం చేసి కొంత డబ్బు సంపాదించి సొంతంగా ముద్రణాలయం పెట్టాడు. అప్పటి నుండి అతను వెనుతిరగలేదు.

మూడు పువ్వులు, ఆరుకాయలుగా పెరిగిన వ్యాపారం

పనితనం, క్రమశిక్షణ, కలుపుగోలుతనం, కుతూహలం, మొదలైన సుగుణాలనన్నిటినీ వంటబట్టించుకున్న ఫ్రాంక్లిన్ ముద్రణకి సంబంధించిన వ్యాపారాలు (ముద్రణాలయం, పెన్సిల్వేనియా గెజెట్ అన్న వార్తా పత్రిక, …) ఎన్నో చేపట్టాడు. అందులో ఒకటి “పేద రిచర్ద్ పంచాంగం (Poor Richard’s Almanack)”. పంచాంగమంటే ప్రతి ఏడాదీ ప్రజలు కొత్తది కొనుక్కోవాలి కనుక ఆదాయం నిలకడగా వస్తుంది; ఇదీ ఫ్రాంక్లిన్ ఆలోచన. ఆ పంచాంగంలో తిథులు, గ్రహణాలు, వాతావరణం, సూర్య చంద్రుల ఉదయాస్తమాన సమయాలు మొదలైనవే కాక, చతురోక్తులు, సలహాలు, సామెతలు, ఇలా ఎన్నో స్వయంగా రాసేవాడు. ఫ్రాంక్లిన్ పాత సామెతలనే తీసుకున్నా వాటిని కొంత మార్చి మరింత ఆకర్షణీయంగా రాసేవాడు. వాటిలో ఎన్నో ఇప్పటికీ అమెరికా ప్రజల నోళ్ళలో నానుతూ ఉంటాయి: Eat to live, and not live to eat; None preaches better than the ant, and she says nothing; No gains without pains. ఆ పంచాంగం దాదాపు పాతికేళ్ళ పాటు ప్రచురితమైంది. దానిలోని నానుడులనీ, సలహాలనీ తీసుకొని అచ్చేసిన “The Way to Wealth” అన్న పుస్తకం, కొన్నేళ్ళ పాటు, అమెరికా కాలనీలనుండి అచ్చయిన పుస్తకాలలోకెల్లా విరివిగా అమ్ముడు పోయిన పుస్తకం.

ప్రింటర్‌గా స్థిరపడిన తర్వాత పెళ్ళి చేసుకోదలచి, బాగా కట్నం ఇచ్చే కుటుంబం కోసం గాలించాడు. కాని ప్రింటర్‎లకి అంత గిరాకీ లేదు. ఈ వేటలో ఉండి కామోద్రేకంలో పడి ఒకమ్మాయిని కలవడంతో వాళ్ళకి ఏప్రిల్ 1730 ప్రాంతంలో విలియం అన్న అబ్బాయి పుట్టాడు.

ఫ్రాంక్లిన్‌తో పరిచయం ఉన్నా అతను లండన్ నుండి సరిగా ఉత్తరాలు రాయకపోవడంతో డెబరా రీడ్ మరొకరిని పెళ్ళి చేసుకుంది. కాని అతడు కొన్ని నెలల తర్వాత అప్పులపాలయి వేరే దేశానికి చెప్పా పెట్టకుండా వెళ్ళిపోయాడు. ఎలా కుదుర్చుకున్నారో, ఫ్రాంక్లిన్ సెప్టెంబరు 1730 లో డెబరాతో కలిసి జీవించడం సాగించాడు. డెబరా ప్రింట్ షాపులో ఫ్రాంక్లిన్‌కి సాయంగా ఉండేది. ఆవిడ పొదుపు గుణం తనకు వచ్చిన ఆస్తి అని ఫ్రాంక్లిన్ పొగిడాడు.

సంఘ సేవ

ఎక్కడ కెళ్ళినా ఇతరులతో సులభంగా కలిసిపోయే మనస్తత్వం, కలుగుపోలుతనం ఫ్రాంక్లిన్‎కి సహజంగా అబ్బిన విద్యలు. కొందరు సమవయస్కులైన తోటి వర్తకులు, వృత్తి పనివారితో కలిసి, రకరకాల విషయాలమీద చర్చించడం, తమతమ రంగాలలో పైకి రావడానికి పరస్పరం సహాయం చేసుకోవడం ధ్యేయాలుగా, జుంటో అన్న క్లబ్ పెట్టాడు. (ఇలా చేయడాన్ని ఇప్పుడు నెట్‌వర్కింగ్ అంటాం.)

జుంటో సభ్యులందరూ తలా కాసిని పుస్తకాలు ఇస్తే ఓ చిన్న గ్రంథాలయం అవుతుంది అని ఫ్రాంక్లిన్ ప్రతిపాదించాడు. కానీ, పుస్తకాలు కొని గ్రంథాలయం నడపాలంటే డబ్బు కావాలి. అందుకని చందాదార్లని చేర్చాడు – సభ్యత్వం కింద కొంత రుసుము, నెలా నెలా పుస్తకాలు అద్దెకు తీసుకోడానికి కొంత రుసుము తీసుకునేవాళ్ళు. 1731 లో “ది లైబ్రరీ కంపెనీ ఆఫ్ ఫిలడెల్ఫియా” స్థాపించాడు. దాని ధ్యేయవాక్యం: అందరికీ మంచి చెయ్యడమే దైవత్వం.

రోజూ ఒకటి రెండు గంటల సేపు పుస్తకాలు చదివేవాడు. కాలేజీ చదువు లేని లోపం తీరింది. గ్రంథాలయం మూలంగా పెద్దల పరిచయం దొరికింది. గ్రంథాలయానికి పుస్తకాలు లండన్ నుండి తెప్పించుకునే వాళ్ళు. అందుకు లండన్‌లో పీటర్ కాలిన్సన్ (Peter Collinson, 1694-1768) అన్న వ్యాపారితో పరిచేయమేర్పడింది. (తరువాతి రోజుల్లో ఫ్రాంక్లిన్ ప్రయోగాలకి ప్రాచుర్యం తెప్పించడంలో కాలిన్సన్ ప్రముఖ పాత్ర వహించాడు.) క్రమంగా అద్దె గ్రంథాలయం ఆలోచన మిగిలిన కాలనీలలోకి కూడా ప్రాకింది. వాటి మూలంగా రైతులు, చిన్న చిన్న పనులు చేసుకునే వాళ్ళు కూడా ఇతర దేశాలలో వాళ్ళ కన్నా విద్యావంతులయారు.

కాలేజీ చదువు లేకపోయినా సొంతంగా పైకి వచ్చిన ఫ్రాంక్లిన్ 1749 లో “Proposals Relating to the Education of Youth in Pennsylvania” అన్న కరపత్రం రాశాడు. హార్వర్డ్, ప్రిన్స్‌టన్‌లలాగా కాకుండా, మత సంబంధం లేకుండా, యువకులకు ఉపయోగపడే విషయాలలో – చదవడం, రాయడం, వ్యాపారం, అకౌంటింగ్, గణితం, … – చదువు నేర్పాలని ఆ కరపత్రంలో సూచించాడు. ఫ్రాంక్లిన్ 1751 లో నెలకొల్పిన అకాడెమీ 1791 లో యూనివర్సిటీ ఆఫ్ పెన్సిల్వేనియా (University of Pennsylvania)గా పేరు మార్చుకుంది. ఇది క్రమంగా ఐవీ లీగ్ విశ్వవిద్యాలయంగా, ప్రపంచంలో కెల్లా పేరున్న విశ్వవిద్యాలయంగా ఎదిగింది.

కాలేజీ నెలకొల్పడం అయిన వెంటనే ఫ్రాంక్లిన్ ఆసుపత్రి ప్రాజెక్టు మొదలెట్టాడు. విరాళాలు సేకరించడం కష్టమయి, ఒక అపూర్వమైన పథకం రూపొందించాడు. పౌరులు ఇచ్చే విరాళాలకి ప్రభుత్వం సమానమైన మొత్తాన్ని జోడిస్తుంది. ఇలాంటి విరాళాల జోడింపు పథకం అప్పటిదాకా ఎవ్వరూ చేయనిది. అమెరికాలో ఇప్పటికీ అనేక స్వచ్ఛంద సంస్థలు నిధుల కోసం ప్రజలు ఇచ్చే విరాళాలకి పెద్ద పెద్ద సంస్థలు ఇచ్చే జోడింపు విరాళాల మీద ఆధారపడతాయి.

ఫ్రాంక్లిన్ ప్రింట్ వ్యాపారం అంచెలంచెలగా పెరిగింది. ప్రింటింగ్ ప్రెస్, పబ్లిషింగ్ హౌస్, వార్తాపత్రిక, ఆల్మనాక్, పోస్టల్ కంట్రోల్, … అలా విస్తరించి కాలనీలలోకెల్లా పెద్దదయింది. పెరిగిన సంపాదనతో ఫిలడెల్ఫియాలో స్థిరాస్తులు కొన్నాడు. కాని డబ్బు సంపాదన అతని జీవిత లక్ష్యం కాదు. 1748 లో, తన 42వ ఏట వ్యాపారం నుండి విరమించుకొని విశ్రాంతి తీసుకుంటూ, చదువుకీ, ప్రయోగాలకీ, స్నేహితులతో సంభాషణలకీ కాలం వెచ్చించాలని నిశ్చయించుకున్నాడు. అంతకు నాలుగేళ్ళ క్రిందట విద్యుత్తుతో మొదలెట్టిన ప్రయోగాలతో సైన్సులో చెప్పుకోదగ్గ పరిశోధనలు చేశాడు. వాటి గురించి తెలుసుకునే ముందు, వాటి నేపథ్యం చూద్దాం.

లైడెన్ జాడీ (Leyden Jar)


లైడెన్ జాడీ

గాజు కడ్డీని సిల్కు గుడ్డతో రుద్దితే విద్యుత్తు పుడుతుందని గత సంచికలలో తెలుసుకున్నాం. కాని ఆ విద్యుత్తు ఎంతో సేపు నిలవదు. అవసరమయినప్పుడు వాడుకునేందుకు ఎక్కువకాలం నిలిచే విద్యుత్తుని పుట్టించడం కోసం యూరప్‌లో చాలా కాలం పరిశోధనలు సాగాయి. వాటి ఫలితమే లైడెన్ జాడీ.

1745 లో జర్మనీకి చెందిన ఎవాల్డ్ ఫాన్ క్లెయిస్ట్ (Ewald Georg von Kleist, 1700–1748) లైడెన్ జాడీని కనుక్కున్నాడు. కాని అది ఎలా పనిచేస్తుందో సరిగా వివరించలేకపోయాడు. 1746 లో నెదెర్లాండ్స్‌లోని లైడెన్ యూనివర్సిటీకి చెందిన పీటర్ ఫాన్ ముషెంబ్రోక్ (Pieter van Musschenbroek, 1692-1761) క్రమమైన పద్ధతిలో ప్రయోగాలు చేసి, పారిస్‌లోని రాయల్ అకాడెమీ ఆఫ్ సైన్సెస్‌కి ఇలా ఉత్తరం రాశాడు:

“నేను మీకు ఓ ప్రమాదకరమైన కొత్త ప్రయోగం గురించి రాస్తున్నాను; దీనిని మీరెవరూ చెయ్యడానికి ప్రయత్నించవద్దు. నేను విద్యుత్ శక్తిని కొలిచే పరిశోధనలో నిమగ్నమై, గాజుగోళాన్ని వేగంగా తిప్పుతూ, చేత్తో రుద్ది, వచ్చిన రాపిడితో విద్యుత్తుని పుట్టించి, దానిని ఓ తుపాకి గొట్టానికి సరఫరా చేసాను; తుపాకి గొట్టం చివర ఓ కంచు తీగెని కట్టి తీగెని నీళ్ళు ఉన్న గాజు జాడీలో ఉంచాను. ఆ జాడీని ఒక చేత్తో పట్టుకొని, రెండో చేతితో తుపాకి గొట్టాన్ని తాకడానికి ప్రయత్నించాను. వెంటనే నాపై పిడుగు పడినంత షాక్ కొట్టింది. గాజు జాడీ పగల్లేదు, దానిమీద పెట్టిన చెయ్యి అలాగే ఉంది; కాని నా వంటికి వాత పెట్టినట్లయింది. ఇంకా చెప్పాలంటే, నాప్రాణం పోయిందనుకున్నాను.”


షాన్-ఆంట్వొనే నోలె ప్రయోగం

ఆ జాబుని అందుకున్న షాన్-ఆంట్వొనే నోలె (Jean-Antoine Nollet, 1700-1770) దానిని ఫ్రెంచ్‎లో‎కి అనువదించి ప్రాచుర్యంలోకి తెచ్చాడు. నోలె శాస్త్రవేత్తే కాక మతాచార్యుడు కూడా. అతను డ్యూఫేకి సహాయకుడిగా పనిచేశాడు. అతడే దానికి “లైడెన్ జాడీ (Leyden Jar)” అన్న పేరు పెట్టాడు, అనేక ప్రయోగాలు చేశాడు. వాటిలో ఒక వినోదకరమైన ప్రయోగం: రెండు వందల మంది సన్యాసులని వలయాకారంలో నిలబెట్టి, ఇనుప తీగెతో కలిపి, తీగెని లైడెన్ జాడీతో కలిపి స్పార్క్ సృష్టించాడు; సన్యాసులందరూ ఒకేసారి షాక్ కొట్టి ఎగిరి పడ్డారు.

లైడెన్ జాడీ గురించి తెలుసుకున్న ఇంగ్లాండు శాస్త్రవేత్త సర్ విలియం వాట్సన్ (Sir William Watson, 1715-1787) దానికి కొన్ని మెరుగులు పెట్టాడు. జాడీకి లోపలా బయటా తగరపు రేకులు అంటించి జాడీ విద్యుత్ శక్తిని పెంచాడు. అనేక జాడీలను కలిపి దాదాపు రెండు మైళ్ళ తీగెని వెస్ట్ మినిస్టర్ బ్రిడ్జి మీదుగా తీసుకెళ్ళి విద్యుత్తు చాలా దూరం ప్రయాణం చెయ్యగలదని చూపాడు.

ఫిలడెల్ఫియా ప్రయోగాలు

లైడెన్ జాడీతో స్పార్క్‎లు పుట్టించి వినోదం కలిగించడం యూరప్‌లో వాడుకయింది. కొందరు ఆ వినోదాన్ని అమెరికాకు తీసుకొచ్చారు. 1743 లో ఫ్రాంక్లిన్‎ తన కుటుంబాన్ని చూడటానికి బోస్టన్ వెళ్ళినప్పుడు, ఎడిన్‎బర్‎కి చెందిన దేశసంచారి డాక్టర్ స్పెన్సర్ విద్యుత్తుతో మంటలు పుట్టించి జనాలని ఆకర్షించే ప్రదర్శనలను చెయ్యడం చూశాడు. తనకు కల సహజ కుతూహలంతో విద్యుత్తు మీద పరిశోధనలు చెయ్యాలనుకున్నాడు.

ఫ్రాంక్లిన్ స్థాపించిన లైబ్రరీ కంపెనీ ఆఫ్ ఫిలడెల్ఫియాకి లండన్‌లో ఏజెంట్‌గా ఉన్న, క్వేకర్ వర్గానికి చెందిన, పీటర్ కాలిన్సన్ (Peter Collinson, 1694–1768) అమెరికన్ కాలనీలలోని ప్రజల విజ్ఞాన సముపార్జన ఆశించినవాడు. అతను స్వయంగా శాస్త్రవేత్త, రాయల్ సొసైటీ సభ్యుడు.

జెంటిల్మెన్ మ్యాగజైన్ అన్న పత్రికకి లైబ్రరీ కంపెనీ చందాదారు. ఏప్రిల్ 1745 జెంటిల్మన్ మ్యాగజైన్‎లో యూరప్‌లో అప్పటివరకు జరిగిన విద్యుత్ పరిశోధనల మీద ఓ సమీక్ష వచ్చింది. దానిలో హక్స్‌బీ , గ్రే, డ్యూఫేల ప్రయోగాల వివరాలు ఉన్నాయి. అయితే విద్యుత్ మౌలిక స్వభావం గురించి ఇంకా పరిశోధనలు జరగవలసి ఉంది. ఆ పత్రికతో బాటు కాలిన్సన్ ఓ గాజుగొట్టాన్ని కూడా పంపాడు. ఫ్రాంక్లిన్ సహచరులతో కలిసి ఫిలడెల్ఫియాలో విద్యుత్ ప్రయోగాలు చెయ్యడం మొదలెట్టాడు. ఎప్పటికప్పుడు తన ప్రయోగాల గురించి కాలిన్సన్‎కి ఉత్తరాలు రాయడం మొదలెట్టాడు. కాలిన్సన్‎ ఆ ఉత్తరాలని రాయల్ సొసైటీ ముందర చదివేవాడు. ఫ్రాంక్లిన్ కాలిన్సన్ కలం స్నేహితులయ్యారు.

విద్యుత్తులో ఉన్నది ఒకే రకం

అప్పటివరకు విద్యుత్తు గురించి ప్రయోగాలు చేశారు కాని, దాని గురించి సిద్ధాంతపరమైన ప్రతిపాదనలు ఎవరూ చెయ్యలేదు. ఫ్రాంక్లిన్ చాల సులభంగా అర్థమయే సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు: అన్ని వస్తువులలోనూ విద్యుత్తు (ద్రవ రూపంలోనో మరో రూపంలోనో) ఒక నిర్ణీత స్థాయిలో ఉన్నది. కాని కొన్ని పరిస్థితులలో విద్యుత్తు పెరగవచ్చు, లేదా తరగవచ్చు. అలా జరిగినప్పుడు ఆ వస్తువు ఛార్జ్ అయినదంటాం. పెరిగితే ధన (+) విద్యుత్తు కలిగిందనీ, తరిగితే రుణ (-) విద్యుత్తు కలిగిందనీ. పెరగడం, తరగడం, ఒకదాని నుండి మరోదానికి పంపకం మూలానే కాని కొత్తగా పుట్టించడం వలన కాదు. ఇప్పటికీ +, -, గుర్తులు పరికరాలలో వాడుతున్నాం.

గాజు ముక్కని సిల్కు గుడ్డతో రుద్దితే, గాజులో విద్యుత్తు ధన రూపంలో ఉంటుంది. అప్పటివరకు గాజులో రాపిడి మూలంగా విద్యుత్తు పుట్టినదని భావించారు. కాని ఫ్రాంక్లిన్ సిల్కు నుండి కొంత విద్యుత్తు గాజులోకి ప్రవహించిందనీ, కొత్తగా విద్యుత్తు ఉత్పన్నమవలేదనీ ప్రతిపాదించాడు. దీనినే conservation of charge అంటారు.

దీనిని ఓ ప్రయోగం ద్వారా నిరూపించాడు. ఇద్దరు మనుషులను, ఒకరిని ధన విద్యుత్తుతో, రెండో అతనిని రుణ విద్యుత్తుతో, గాజు బల్ల మీద నిలబెట్టాడు. వాళ్ళిద్దరూ చేతులు కలిపితే ఇద్దరూ విద్యుత్తుని కోల్పోయారు. అలా కాక విద్యుత్తు లేని మూడో మనిషి ఆ ఇద్దరిలో ఎవరిని తాకినా వారికిగాని తనకిగాని షాక్ కొట్టింది.

ఫ్రాంక్లిన్ బ్యాటరీ

లైడెన్ జాడీలో ఉన్న విద్యుత్ శక్తి ఎక్కడ ఉంది? నీటిలోనా, తీగెలోనా, గాజులోనా? అది తెలుసుకోడానికి జాగ్రత్తగా విశ్లేషణ చేస్తూ ఫ్రాంక్లిన్‎ క్రమమైన ప్రయోగం చేశాడు. 1) జాడీలోని తీగెని తీసివేసి, జాడీని ఓ చేతిలో ఉంచి, రెండో చేతి వేలుని నీటి దగ్గరకి తీసుకొస్తే షాక్ కొట్టింది; శక్తి తీగెలో లేదని తేలింది. 2) జాడీని తిరిగి ఛార్జ్ చేసి, తీగెని తీసివేసి, నీటిని వేరే జాడీలోకి పోశాడు; నీటిలో శక్తి ఉంటే రెండో జాడీ షాక్ ఇవ్వాలి, కాని ఇవ్వలేదు. అంటే శక్తి కోల్పొయినట్లా, లేక మొదటి జాడీలో ఉందా? మొదటి జాడీలో వేరే టీపాట్‌లోని నీళ్ళు కొత్తగా పోసి వేలుని నీటి దగ్గరకి తీసుకొస్తే షాక్ కొట్టింది; అంటే శక్తి నీటిలో లేదు. 3) చివరకి మిగిలింది జాడీయే కనుక శక్తి ఉన్నది గాజులోనే అని తేలింది. 4) గాజు పలకని చేతిలో పెట్టుకొని దానిపై ఓ సీసపు రేకు ఉంచి, గాజుని ఛార్జ్ చేసి, సీసపు రేకుని తాకితే షాక్ కొట్టింది. అంటే జాడీ ఆకారం ముఖ్యం కాదు.

ఒకే ఒక్క లైడెన్ జాడీని వాడేకంటే, పదకొండు జాడీలను తీసుకొని, ఒకదానినొకటి తీగెలతో కలిపితే, శక్తివంతమైన “బ్యాటరీ” (పదకొండు జాడీలకి సమానంగా) తయారవుతుందని చూపెట్టాడు. సైనికులు అనేక ఫిరంగులను వరుసగా పేర్చి (battery of cannons), ఒకేసారి పేలుస్తారు. దాని నుండి ఫ్రాంక్లిన్ తీసుకున్న పదమే బ్యాటరీ.

ఎన్ని ప్రయోగాలు చేసినా అవి ఏదో వినోదానికే కాని జనాలకి ఉపయోగపడేదేదీ విద్యుత్తుతో ఇంతవరకు చెయ్యలేనందుకు ఫ్రాంక్లిన్ మధనపడేవాడు.

మెరుపు-విద్యుత్తు

దేవతలకి కోపం వస్తే భూమ్మీద పిడుగుల వర్షం కురిపిస్తారని అన్ని సంస్కృతులలోనూ ఓ నమ్మిక. భారతంలో కృష్ణార్జునులు ఖాండవదహనం సాగించినప్పుడు దేవేంద్రుడు ఆగ్రహంచి కుండపోతగా వర్షం కురవమని మేఘాలని ఆజ్ఞాపించాడని నన్నయ ఆదిపర్వం (అష్టమాశ్వాసం, 270) లో వర్ణించాడు:

ఉరుముచు మెరుముచుఁ బిడుగులు వరలఁగ నలుగడలఁ బడ నవారితవృష్టుల్‌
గురుకొని కురియఁగఁ బంచెను మరియును నయ్యనలుమీఁద మఘవుం డలుకన్‌.

సముద్రంలో నీటి అణువులూ (నాన్-ఎలెక్ట్రిక్) ఉప్పు అణువులూ (ఎలెక్ట్రిక్ ), కలిసి విద్యుత్తుని ఉత్పత్తి చేసి విద్యుత్ మేఘాలవుతాయి. ఆ మేఘాలు ప్రయాణం చేస్తూ తమ విద్యుత్తుని త్రోవలో ఎదురైన వస్తువులకి బదిలీ చేస్తాయి. దీనికి శాస్త్రీయమైన రుజువు లేదు కాని, ఫ్రాంక్లిన్ దీనితో మొదలెట్టాడు.

విద్యుత్ మేఘం గాలికి ప్రయాణం చేస్తూ ఏదన్నా కొండను తాకితే ఆ కొండ మేఘం నుండి విద్యుత్తుని ఆకర్షిస్తుంది. విద్యుత్తుని వదులుకున్న మేఘం దగ్గరలో మరో విద్యుత్తు కల మేఘం ఉంటే దాని నుండి విద్యుత్తుని తీసుకుంటుంది. ఇలా ఒకదానితో మరొకటి ఘర్షణ పడటాన ఉరుము, మెరుపు ఉద్భవిస్తాయి.

విద్యుత్తు ఉన్న మేఘాలు ప్రయాణం చేస్తూ ఎత్తయిన భవనాలనీ, చెట్లనీ ఆకర్షించటంతో అవి విద్యుత్తుని లాగి మంటలు రగులుస్తాయి. అందువలన వర్షాకాలంలో చెట్ల క్రింద ఉండటం ప్రమాదకరం. తడిసి ఉంటే విద్యుత్తు శరీరంపై గుండా ప్రవహిస్తుంది; పొడిగా ఉంటే, రక్తంలో గుండా ప్రవహించి వంటికి హాని చేస్తుంది.

మెరుపుకీ విద్యుత్తుకీ గల పోలికలు – ఒకే రంగులో వెలుగునివ్వడం, లోహాలలో ప్రవహించడం, ఒకే వేగం – రాసుకుంటూ పోయాడు. అన్నిట్లో మెరుపూ, విద్యుత్తూ ఒకే రకంగా ఉన్నట్లున్నా, రెండూ ఒకటేనా? అప్పుడతనికి తన ల్యాబ్‌లో కనుగొన్న ఓ విషయం గుర్తొచ్చింది: జాడీలలో గాజు గొట్టాలలో ఉన్న విద్యుత్తుని మొనదేలిన వస్తువు ఆకర్షిస్తుంది. ప్రకృతిలోని మెరుపుని కూడా మొనదేలిన వస్తువు ఆకర్షిస్తుందా? ఆకర్షిస్తే రెండూ ఒకటేనని రూఢిచేసుకోవచ్చు. మిగిలిన అన్నిటిలోనూ సామ్యం ఉన్నది కావున, దీంట్లోనూ ఒకటే పోలిక ఉండవచ్చు, “ప్రయోగం చెయ్యనివ్వండి (Let the experiment be made)”, అని తీర్మానించాడు. ఇంతకు ముందు శాస్త్రవేత్తలు చేసిన ప్రయోగాలన్నీ పరికరాలతో (గాజు గొట్టాలతో, జాడీలతో) అయితే, ఫ్రాంక్లిన్ ప్రయోగం మేఘాలతో. విద్యుత్తు ఏమిటి అనేదాని కన్నా మెరుపులో ఏముందో కనుక్కోవాలంటే మెరుపు మీద కేంద్రీకరించాలన్నాడు.

ఆ ప్రయోగం ఎలా చెయ్యాలో వివరిస్తూ ఫ్రాంక్లిన్ 1750 జులైలో లండన్‌లోని కాలిన్సన్‎కి పెద్ద ఉత్తరం రాశాడు. దానికి కావలసిన పరికరాలు చాలా సాధారణమైనవి.

“పిడుగులని పడేసే మేఘాలలో విద్యుత్తు ఉందా లేదా అన్నదానిని పరిష్కరించడానికి నేనీ ప్రయోగాన్ని ప్రతిపాదిస్తున్నాను. ఎత్తయిన స్తంభం మీదనో, గోపురం మీదనో, మనిషి పట్టేంత పహరా శిబిరాన్ని ఉంచండి. దానిలో ఒక ఎలెక్ట్రిక్ స్టాండుని పెట్టండి. స్టాండు నుండి ఇరవై ముప్ఫై అడుగుల ఇనుప కడ్డీని పహరా బయటకు తెచ్చి చివర మొనదేలేటట్లుగా పైకి లాగి పంపండి. విద్యుత్ మేఘాలు కడ్డీ మీద పయనించినప్పుడు, స్టాండు పక్కన మనిషి నిలబడి ఓ తీగెతో ఇనుప కడ్డీని తాకితే, అతనికి మెరుపు తగులుతుంది.”


ఫిలడెల్ఫియాలో విద్యుత్ ప్రయోగాల గ్రంథం

ఉత్తరం చదివిన వెంటనే కాలిన్సన్ అదొక వినూత్న ప్రయోగమని భావించి, రాయల్ సొసైటీకి తెలియజేశాడు. అంతకు ముందు ఫ్రాంక్లిన్ ప్రయోగాలని గౌరవంతో పరిశీలించిన సొసైటీ దీనిని మిథ్యావాదంగా తీసిపారేయడమే కాక ఎగతాళి చేసింది. అది తెలుసుకున్న ఫ్రాంక్లిన్ నిబ్బరంగా ఉన్నా, కాలిన్సన్ ఊరకుండక, రాయల్ సొసైటీని త్రోసిపుచ్చి, ఫ్రాంక్లిన్ ఉత్తరాలనన్నిటినీ 1751 లో “Experiments and Observations on Electricity Made at Philadelphia in America,” అన్న పేరిట ప్రచురించాడు.

తాను వివరించిన ప్రయోగం ఎవరూ చెయ్యలేదు. తానే ఎందుకు చెయ్యకూడదు? చేద్దాం అనుకున్నాడు కాని, ఫిలడెల్ఫియాలో ఎత్తయిన కొండలు కాని భవనాలు కాని లేవు. పెన్సెల్వేనియా మొత్తం వెదకినా గోపురమున్న చర్చి ఒక్కటి కూడా లేదు. నగరంలో ఉన్న చర్చికి గోపురం కట్టడానికి జనాల్ని ఒప్పించాడు కాని యుద్ధం మూలాన ఆ ప్రయత్నాలు మూలపడ్డాయి.

ఫ్రాంక్లిన్ పుస్తకం పారిస్ లో బఫన్ (Comte de Buffon, 1707–1788) కి చేరింది. అతను వెంటనే అది అపూర్వమైన వింతయిన ఆలోచన అని పసిగట్టి, పుస్తకాన్ని ఫ్రెంచ్ లోకి అనువదింపమని దాలిబార్డ్ (Dalibard, 1709-1778) ని కోరాడు.

తన సిద్ధాంతాన్ని తప్పు పడుతుందనీ, తన ఆలోచనలకి గుర్తింపు ఇవ్వలేదనీ, ఇదంతా తనకి బద్ధ శత్రువైన బఫన్ రాసినదే కాని, అమెరికాలోని కాలనీ వాళ్ళెంత, వారి చదువేపాటిది, వారు శాస్త్ర పరిశోధనలు చెయ్యడమేమిటి అని రాజుకి దగ్గరయిన నోలె విరుచుకుపడ్డాదు. కాని ఫ్రాంక్లిన్ అనే అమెరికన్ నిజంగానే ఉన్నాడనీ, ఆ పుస్తకం అతనిదేననీ తెలుసుకున్న తర్వాత, ఫ్రాంక్లిన్ మీద ధ్వజమెత్తాడు. ఫ్రాంక్లిన్ మాత్రం అతనితో వాగ్వివాదానికి దిగలేదు.


పరికరాలు

గొప్ప అనువాదం కాకపోయినా ప్రయోగ క్రమ విధానం చదువరులను ఆకట్టుకుంది. అందరూ వాటి గురించి మాట్లాడుకోవడంతో పుస్తకం ఫ్రెంచ్ విద్యావంతుల మధ్య చర్చనీయాంశం అయింది. ఇది రాజు గారి చెవిన పడింది. ఆయన ఆ ప్రయోగాలను తన యెదుట జరపమని ఆజ్ఞాపించాడు. పుస్తకంలోని బ్యాటరీ, మరికొన్ని ఇతర ప్రయోగాలు చేసి చూపించారు. కాని మొనదేలిన కడ్డీతో మెరుపుని తాకే ప్రయోగాన్ని చెయ్యలేదు – రాజు గారి ముందర విఫలమైతే పరువు పోతుందని.

కాని వేరే చోట చెయ్యడానికి నిశ్చయించుకున్నారు. పారిస్‌కి ఇరవై మైళ్ళ దూరంలో మర్లీ విల్లె (Marly-la-Ville) లోని ఓ తోటలో, ఫ్రాంక్లిన్ చెప్పినట్లు, నలభై అడుగుల పొడవున్న ఇనుప కడ్డీని నిలబెట్టారు. దాని బేస్‌ని ఇన్సులేట్ చేసి. పిడుగు పడే సూచనలేమీ లేకపోవడాన, ఓ రౌతుని కనిపెట్టమని చెప్పారు. రోజులు గడిచాయి. మే 10, 1752 న పిడుగుల వర్షం పడింది. యజమాని కోసం ఆగకుండా రౌతు తానే తీగెని కడ్డీకి అంటించాడు. అదిరిపడే స్పార్క్స్ వచ్చాయి. దాలిబార్డ్ ఫ్రెంచ్ అకాడెమీకి ఫ్రాంక్లిన్ సిద్ధాంతం రుజువయిందని చెప్పాడు. 1752 మే నెల 18న పారిస్ లో వంద అడుగుల ఇనుప కడ్డీతో ఉరుములతో పడే వాన నుండి స్పార్క్స్ తెప్పించాడు. యూరప్‌లో వేరే చోట్ల కూడా ఈ ప్రయోగాన్ని చేశారు. ఫ్రాంక్లిన్ పేరు యూరప్ అంతటా మార్మ్రోగింది.

అయితే, ఫ్రెంచ్ వాళ్ళు మరీ పెద్ద ఎత్తుగల కొండ మీద నుంచో గోపురం నుంచో ప్రయోగం చెయ్యలేదు. ఇనుప కడ్డీకి విద్యుత్తు వచ్చింది నిజమే కాని అది మేఘాలనుండి వచ్చిందా, అంత తక్కువ ఎత్తులోకి మేఘాలు వచ్చాయా అన్నది రూఢిగా తెలియదు.

అప్పట్లో యూరప్ నుండి వార్తలు అమెరికా చేరడానికి ఒకటి రెండు నెలలు పట్టేది. యూరప్‌లో తన ప్రయోగాలు సృష్టించిన కోలాహలం గురించి ఫ్రాంక్లిన్‌కి తెలియదు. తన ప్రయోగాన్ని చెయ్యడానికి ఎత్తయిన భవనం లేకుండా చేసే మార్గం ఏదీ లేదా అని ఫ్రాంక్లిన్ మధనపడుతుండాగా ఓ బ్రహ్మాండమైన ఆలోచన తట్టింది. అదే ప్రపంచ ప్రసిద్ధి గాంచిన గాలిపటం ప్రయోగం.

జగత్ప్రసిద్ధి గాంచిన పతంగి ప్రయోగం


పతంగి ప్రయోగం

ఆకాశంలోని అతిభయంకర అగ్నిజ్వాలని నేలమీద ఉన్న జాడీలోకి తీసుకొచ్చి అదీ విద్యుత్తూ ఒకటో కాదో చూపెట్టాలని, అందుకు మేఘాలని గాలిపటంతో అందుకోవాలనుకున్నాడు. పిల్లలు గాలిపటాలని పిల్లగాలుల ఆహ్లాద వాతావారణంలో ఎగరేస్తారు కాని భయానకమైన గాలివానలో కాదు. అదే ఫ్రాంక్లిన్ విశేషమైన ఆలోచన.

రెండు సన్నని పుల్లల్ని ఓ చేతిరుమాలుతో కలిపి గాలిపటాన్ని చేశాడు. (మామూలుగా కాగితంతో చేస్తారు కాని వానకి తడిసి చిరిగిపోకుండా సిల్కు గుడ్డని వాడాడు.) దానికి ఒక చివర అడుగు పొడవున్న మొనతేలిన తీగెని అమర్చాడు. రెండో చివర దారాన్ని కట్టాడు. దారానికి చివర తాను పట్టుకోడానికి వీలుగా విద్యుద్బంధకమైన (insulator) ఓ సిల్కు రిబ్బన్‎ని ఉచ్చులా బిగించి, ఉచ్చు దగ్గరే దారానికి ఓ తాళంచెవిని కట్టాడు.

1752 జూన్ నెల వానా కాలం. కొడుకుని తీసుకొని ఫ్రాంక్లిన్ మైదానానికి వెళ్ళాడు. గాలిపటాన్ని ఆకాశంలోకి వదిలాడు. గాలికి పటం ఆటూ ఇటూ కొట్టుకుంటూ ఎగురుతూ మిన్నంటుకున్నది. ఓ మబ్బు గాలిపటాన్ని రాసుకుంటూ వెళ్ళింది కాని ఏమీ జరగలేదు. ప్రయోగం విఫలమైందని విచారిస్తుండగా మరో మబ్బు పటాన్ని తాకింది. దారానికి గల పోగులు రోమాల్లా నిక్కబొడుచుకున్నాయి – ఒకదానికొకటి దూరంగా, అవన్నీ విద్యుద్వాహకమైన తీగె మీద ఉన్నట్లుగా. ఫ్రాంక్లిన్ తాళం చెవిని మెటికతో తాకాడు. స్పార్క్ వచ్చి షాక్ కొట్టింది. ప్రయోగం సఫలమైంది. వర్షం పడే కొలదీ దారం తడిసి దానిలో విద్యుత్తు ధారాళంగా ప్రవహించింది. తాళం చెవి ద్వారా విద్యుత్తుని లైడెన్ జాడీలో పట్టుకొని, అదీ ఇన్నేళ్ళుగా మానవుడు రాపిడితో పుట్టించిన విద్యుత్తూ ఒకటేనని తేల్చాడు.

మెరుపు కడ్డీ (Lightning Rod)

హిందువుల పిల్లలు చిన్నతనంలో, తుఫాను వచ్చి పిడుగుపడ్డప్పుడు, “అర్జునా, ఫల్గుణా, పార్థా, కిరిటీ, సవ్యసాచీ, ధనంజయా, …” అని దేవేంద్రుడి కుమారుడైన అర్జునుని తమల్ని రక్షించమని ప్రార్థిస్తారు.

క్రైస్తవులు ఉరుములు వినబడితే చర్చిలో గంటలు మ్రోగించేవాళ్ళు. పవిత్రమైన గంటలు చేసే శబ్దాలు దేవుడిని శాంతింప చేస్తాయని వాళ్ళ నమ్మిక. చర్చి భవనాలు ఎత్తుగా ఉండటాన, విద్యుత్తు కలిగిన మేఘాలు వాటిని తాకితే, గంటలకి విద్యుత్తు పాకి, వాటిని మ్రోగించే వాళ్ళకి షాక్ కొట్టి ప్రాణాలకి ముప్పు కలిగేది. శాస్త్రజ్ఞానం బొత్తిగా లేకపోవడాన, అది దైవాధీనమని సరిపుచ్చుకునేవాళ్ళు.

ఫ్రాంక్లిన్ ప్రయోగ ఫలితంగా, పిడుగుల నుండి రక్షణ కల్పించడానికి పిడుగులోని విద్యుత్తుని పట్టుకొని దానిని భూమిలోకి ప్రసరించేటట్లుగా మెరుపు కడ్డీని (lightning rod) తయారుచేశాడు. మొదట అమెరికాలోనూ, తర్వాత యూరప్‌లోనూ, ఎత్తయిన భవనాలకూ, పెద్ద ఓడలకూ, వాటిని అమర్చడం ఓ భద్రతా నియమమయింది. విద్యుత్తు మూలంగా మానవాళికి ఉపయోగపడిన మొదటి సౌకర్యం ఈ కడ్డీ ఇచ్చిన ప్రాణభిక్షే అని చెప్పొచ్చు.

రాయల్ సొసైటీ 1753 లో ఫ్రాంక్లిన్‎కి కోప్లీ పతకానిచ్చి సత్కరించింది. 1756 లో రాయల్ సొసైటీ ఫెలో అయ్యాడు.

రాజకీయ జీవితం


అమెరికా స్వాతంత్ర్య ప్రకటన

శాస్త్రీయ విషయాలపై ఎంత మక్కువ ఉన్నా, పౌర సంబంధిత విషయాలకెప్పుడూ ఫ్రాంక్లిన్‎ దూరమవలేదు. అవసరమైతే, శాస్త్రీయపరమైన పనులని పక్కన పెట్టేవాడు. వివాదాలని తీర్చడంలో, అందరికీ సమ్మతమైన పరిష్కారాలు కనుగొనడంలో ఫ్రాంక్లిన్‎ చాకచక్యాన్ని గుర్తించిన అమెరికన్లు అతనిని అనేక పదవులలో నియమించారు. బ్రిటిష్ సామ్రాజ్యానికి వ్యతిరేకి కాకపోయినా, అమెరికన్లకి సమాన హక్కులు ఇవ్వడానికి బ్రిటిష్ వారు నిరాకరించినప్పుడు, కాలనీలనన్నిటినీ సంఘటితపరచి అమెరికా స్వాతంత్ర్యానికి కృషి చేశాడు. న్యూ జెర్సీకి గవర్నరుగా ఉన్న తన కొడుకు, విలియం, బ్రిటిష్ రాజుకి మద్దతుగా ఉన్నందుకు, అమెరికా నాయకులు అతనికి జైలు శిక్ష విధిస్తే, ఫ్రాంక్లిన్ జోక్యం చేసుకోలేదు.

1776 జులై 4 న అమెరికాలోని పదమూడు కాలనీలు బ్రిటిష్ పరిపాలన నుండి బయటపడి స్వాతంత్ర్యం ప్రకటించుకున్నాయి. ప్రపంచ ప్రఖ్యాతి చెందిన Declaration of Independence రాసిన థామస్ జెఫర్సన్ తన మొదటి ప్రతిలో రాసిన “We hold these truths to be sacred and undeniable, that all Men are created equal, …” అన్న పదాలని ఫ్రాంక్లిన్ ఇలా మార్చాడు: “We hold these truths to be self-evident, that all Men are created equal, …”

అవసానదశ

“మానవులందరూ సమానులే,” అని ప్రకటించి అయిదు వందల వేల మంది నల్లజాతి వాళ్ళని (అప్పటి జనాభాలో 20 శాతం) బానిసలుగా కొనసాగించడం, ఫ్రాంక్లిన్‎కి ఓ పెద్ద వైఫల్యమనిపించింది. 1787 లో Pennsylvania Society for Promoting the Abolition of Slavery కి అధ్యక్షుడయ్యాడు. 1790 ఫిబ్రవరిలో బానిసత్వాన్ని రద్దు చేసి నల్లవాళ్ళకి స్వతంత్రమివ్వాలని కాంగ్రెసుకి పిటిషన్ పెట్టాడు. బానిసత్వాన్ని బైబిల్ అనుమతించిందనీ, బానిసలు లేకపొతే ప్రత్తి పొలాలలో పనిచేసే వారుండరనీ అభ్యంతరం పెడుతూ జార్జియా శాసనసభ్యుడు, అతని సహచరులూ వాదించి ఆ పిటిషనుని ఖండించారు.

మరో రెండు నెలలకి, ఏప్రిల్ 17, 1790 న ఎనభై నాలుగో ఏట ఫ్రాంక్లిన్ మరణించాడు. ముప్ఫై వేల జనాభా ఉన్న ఫిలడెల్ఫియాలో ఇరవై వేల మంది, అన్ని మతవర్గాల నుండి, అతని అంత్యక్రియలకి హాజరయ్యారు. అమెరికా, ఫ్రాన్స్ దేశాలు సంతాపాన్ని ప్రకటించాయి.


ఫ్రాంక్లిన్ బ్యాటరీ శక్తివంతమైనదీ నిలవచెయ్యగలిగినదే కాని, దానిలో విద్యుత్తు అంతా ఒకే సారి విడుదలవడాన రోజువారీ పనులకు ఉపయోగపడదు. ఇప్పుడు మన కార్లలోనూ టార్చిలైట్లలోనూ ఉండే బ్యాటరీలోని విద్యుత్తుని ఎప్పుడు ఎంత కావలస్తే అంత వాడుకోవచ్చు. ఆ బ్యాటరీని ఎలా కనుగొన్నారో వచ్చే సంచికలో తెలుసుకుందాం.

మూలాలు:

  1. Park Benjamin. A History of Electricity. (The Intellectual Rise in Electricity) From Antiquity to the Days Benjamin Franklin. John Wiley & Sons. 1898.
  2. J. L. Heilbron. Electricity in the 17th and 18th centuries: A Study of Early Modern Physics. University of California Press. 2022.
  3. Benjamin Franklin. The Autobiography of Benjamin Franklin.
  4. Walter Isaacson. Benjamin Franklin: An American Life. Simon & Schuster. 2003.
  5. Wikipedia and Wikimedia Commons

కొడవళ్ళ హనుమంతరావు

రచయిత కొడవళ్ళ హనుమంతరావు గురించి:

పుట్టిందీ పదో తరగతిదాకా చదివిందీ ప్రకాశం జిల్లా రావినూతల గ్రామంలో. ఇప్పుడు ఉండేది వాషింగ్‌టన్ రాష్ట్రంలో సియాటల్ నగరానికి దగ్గర్లో. ఇంజనీరుగా పని చేసేది సాఫ్ట్ వేర్ రంగంలో.

దాదాపు నలభై యేళ్ళుగా అమెరికాలో ఉంటూ ఉద్యోగంలో లీనమై సాహిత్యదృష్టి కొరవడిన లోపాన్ని సరిదిద్దుకోడానికి, గత కొంతకాలంలో కొందరు తెలుగువాళ్ళతో పరిచయం, కాస్త తెలుగు చదవడం, ఎప్పుడన్నా ఓవ్యాసం రాయడం – అదీ ప్రస్తుత వ్యాపకం.

 ...