“ఇసుక నేల కొబ్బరితోటల మధ్యనీ, తాటిమట్ట కట్టవార ఆవలి జీడిమావిడి తోటల్లోనూ, బ్రహ్మదండ ముళ్ళ కంచెల వెనుక సర్వీ తోట గుబురుల్లోనూ దాగివున్న వూరు.
ఆ ఊరిలో ఇళ్ళు చెల్లాచెదురుగా అక్కడక్కడ ఒకో యిల్లు దాగుడుమూతలాడే చిన్నచిన్న పిల్లల్లా ఒదిగి చెట్లలో నక్కి దాక్కుని వుంటాయి.
పట్నం వాసనలు తెలియని మారుమూల పల్లెటూరు.
మంచు కురుస్తున్నపుడు శరద్వెన్నెల జల్లుల్లో ఎక్కడో దూరాన విరిసిన చుక్కల ఆకాశం రాల్చిన మరీపల్చని కాంతుల్లో, మెత్తని ఇసుక నేల మీద పక్క పరుచుకుని రాత్రికాబోతుందనగానే మాటుమణిగే ఊరు”
ఇలాంటి వూరిని అన్ని రకాల ప్రయాణ సాధనాలు ఎక్కి ప్రయాణిస్తూ చివరాఖరికి పుంత దారిలో ఇసకలో నడిచి బంగాళాఖాతానికి కోసెడంత దూరంలో గోదావరి మారుమూల కోనసీమ రక్తకుల్య నదీతీరంలోని కొబ్బరితోటల కుగ్రామం శంకరగుప్తం ఎప్పుడైనా వెళ్ళారా?
వెళ్ళివుంటే సరేసరి లేకుంటే అటువంటి ఏగ్రామంలోనో,ఏరచ్చబండమీదో, ఏ మండువా లోగిలి పెంకుటింటి అరుగుమీదో కూర్చున్నారని భావించి, సత్యజిత్ రాయ్ సినీమానో మరో అవార్డు సినీమానో చూస్తున్నాననుకుని ‘ఊరు’ కథలు చదవాలి.
ఈ కథల రచయిత పేరు సాహిత్యంలో ‘కథక్మిత్ర’, అసలు పేరు వేమూరి నరసింహారావు.
కథక్మిత్ర స్నేహానికి బహుమతిగా ఆయన కథల్ని సేకరించి శీలా వీర్రాజు సంపుటీకరించిన ఈ ‘ఊరు’ కథల సంపుటిలో కథలన్నీ కోనసీమ లంకగ్రామాల నేపథ్యంలో పట్టణ వాసన లేని కథలే. కొన్ని కథలలో రచయిత తన చిన్ననాటి మిత్రుడు శీలా వీర్రాజునో, బుచ్చిబాబునో ఆవాహన చేసుకొని రాశాడనిపిస్తుంది. ప్రకృతి వర్ణనలో గాని, పాత్రల్ని పరిచయం చేయటం గానీ ఆ శైలిని రచయిత చాలా వరకూ ప్రభావితుడై రాసినట్లుగా ఉంటాయి. మరికొన్ని కథలు కారామాష్టారునో, రావిశాస్త్రినో మనసులో నిలుపుకొని రాసినట్లుగా తోస్తుంది.
అంటే ఈ రచయితకు తనదైన రచనా విన్యాసం లేదని కాదు.చిన్నచిన్న వాక్యాలతోనే కథని నడిపించటం కథక్మిత్ర శైలి. పెద్ద పెద్ద సంక్లిష్ట వాక్యాలుండవు.
మారుమూల చిన్న కుగ్రామాలలోని పంచాయితీరాజ్ ఆఫీసులో కథకుడు పనిచేసిన నాటి అనుభవాలు ఈ కథల్లో దర్శనమిస్తాయి.
ఏకోపాధ్యాయ పాఠశాలలో అన్ని వయసుల పిల్లలు వుంటారు. అంతకుముందు ఏ వూర్లో వారైనా చదువుకున్నాక పొట్ట చేత్తో పట్టుకుని రంగం వలసపోయేవారు. ఆ కథాకాలం నాటికి అండమాను పోయే పరిస్థితులు. అబ్బిగాడి తండ్రి అలాగే అండమాను పోయాడు. నాలుగోతరగతి చదివిన అబ్బిగాడు చదువు మీద ఇష్టంతో బళ్ళో చేరుతాడు.
తనకు అనారోగ్యంగా ఉన్నప్పుడు పాఠశాలలో ఒకరిని లీడరుగా పెడితే బాగుంటుందన్న ఆలోచన వచ్చిన మాష్టారు క్లాసులో ప్రకటిస్తాడు. పిల్లలు రెండుగా చీలిపోతారు. అబ్బిగాడు లీడరు కావటం భరించలేని గోపిగాడు స్నేహితులతో అబ్బిగాడిని చితగ్గొడితే చనిపోతాడు. అనవసరంగా రాజకీయాల్ని పాఠశాలలో తెచ్చినందుకు ‘తీర్పు లేని దోషి’ గా ఉపాధ్యాయుడు కుంగిపోతాడు. అబ్బిగాడి ప్రశ్నించే స్వభావాన్ని, ఆనాటి గ్రామీణ వాతావరణంలో కులవివక్ష ఈ కథలో, సంభాషణల్లో ధ్వనింపజేశారు. పేదవాడిచేత దొంగతనాలు చేయిస్తూ, దొంగ సరుకుని తమ బీరువాల్లో చేర్చుకొని పెద్దమనుషుల్లా చలామణీ అయ్యే గ్రామపెద్దలే ఈ ‘కుక్క మీద జాలిపడ్డ తోడేలు’ కథ.
రామా కృష్ణా అనుకొంటూ కొడుకు దగ్గర ఉండకుండా తన గ్రామాన్ని విడిచిపెట్టలేక పేదవారి కోసం, ఇరుగు పొరుగు గ్రామాల నుండి చదువుకు వచ్చే పిల్లల కోసం, వైద్యానికి వచ్చే పేదల కోసం, గుళ్ళో కార్యక్రమాలకి వచ్చే భక్తుల కోసం ధర్మసత్రం కట్టాలని తలపెట్టి, చందాల వసూలుచేసి, విరాళాల కోసం వెళ్ళిన రాధాస్వామి తిరిగి వచ్చేసరికి ధర్మసత్రం పూర్తయిపోతుంది. కాని దాని మీద వేలాడదీసిన బోర్డుపై ‘రిక్రియేషన్ క్లబ్’ అని వుంటుంది.
ఒక గ్రామంలో తనకు పరిచయస్తుడైన రాజారావు ప్లేసులో ఉద్యోగానికి వచ్చిన కథకుడు నివాసం కోసం అంతకుముందు రాజారావు అద్దెకు ఉన్న ఇంటికే వస్తాడు. ఇంటియజమాని రమణయ్య భార్యపోగా దూరపు బంధువైన రాజమ్మను ఆడసాయనికి తెచ్చుకుంటాడు. రమణయ్య స్వార్థపరుడనీ, తమ్ముడి ఆస్తిని కాజేశాడని వినికిడి. రాజమ్మ ఆ కథకుడితో కూడా చనువుగా మాట్లాడటం చూసి రమణయ్య కథకుడి కుటుంబ వివరాలు కూపీలాగి అతను వివాహితుడని భార్య పురిటికి వెళ్ళిందని తెలిసి ఊపిరి పీల్చుకుంటాడు.
ఒకరోజు ఉదయం కథకుడిని లేపి రాజారావు రాజమ్మని లేవదీసుకుపోయాడని తిట్టిపోస్తాడు. రమణయ్యతో కలిసి రాజారావు వూరు వెళ్తే అతను మశూచికంతో మంచం పట్టి వుంటాడు. తిరిగి వచ్చాక కూడా రమణయ్య వూరందరితో రాజమ్మ ఎవరితోనో లేచిపోయిందనే చెప్తాడు. కానీ కథకుడు మాత్రం వూర్లో చెరువులూ, బావులు వెతికించమనటంతో కథ ముగుస్తుంది. కథ ఎప్పటికప్పుడు పాఠకుడిలో ఉత్సుకతను రేపుతూ రాజమ్మ చొరవగా మాట్లాడడం చూస్తుంటే ఆమెమీదో, ఆమె ప్రవర్తన మీదో అనుమానం కలిగినట్లుగా నడుస్తుంది. కానీ రాజమ్మ ఎవరినీ ప్రేమించలేదు. రమణయ్య తమ్ముడూ, రాజారావూ కోరినా వారిని పెళ్ళి చేసుకోటానికి ఇష్టపడలేదు. కానీ అనుమానపు జబ్బు వున్న రమణయ్యే ఆమెని హతమార్చాడనేది తెలుస్తుంది.
కథక్మిత్ర లంక గ్రామాలలోనే పంచాయతీ బోర్డులో ఉద్యోగం చెయ్యటంవలన కథలన్నీ కూడా ఆ ప్రాంతాలలో జరిగిన కథలుగానే వుంటాయి. ఆ ప్రాంత పరిసరాల వర్ణన కథల నిండా పరచుకొని వుంటుంది. చదువుతున్నంతసేపూ లంక గ్రామాలలోని పచ్చని ప్రకృతి దృశ్యాలు తెలియనివారికి వంశీ సినీమానో, బాపూ సినిమానో చూస్తున్న అనుభూతి కలుగుతుంది.
ఈ కథలన్నీ కథక్మిత్ర 1970కు ముందు రాసినవే. ఆ తరువాత ఆయన అనేక కారణాలవలన కథలు రాయడం మానేశారు. కథక్మిత్ర కథాకాలం నాటికి కోనసీమ లంక గ్రామాలలో ప్రకృతి పచ్చదనాలు కాలుష్యం బారిన పడివుండని పట్నం వాసనలు తెలియని మారుమూల పల్లెటూర్లు.
‘వేసవి మండుటెండల్లో మబ్బుల్లేని నీలాకాశంలో సూరీడు నిప్పులు కురుస్తున్నప్పుడు పడుగుపేకల్లా పరుచుకున్న చెట్లనీడల్లో సేదతీర్చే ఎడారిమధ్య చల్లదనాల ఒయాసిస్సు ఆ వూరు.’ ఇలా అనేక కథల్లో ఊరి వర్ణనలు అప్పుడే రెక్కలు కట్టుకుని ఎగిరివెళ్ళి ఆ వూరి పచ్చని ప్రకృతి మధ్య పరవశించాలనేలా వుంటుంది.
ఊరు కథలో ప్రకృతి దృశ్యాలు మరింత రమణీయంగావుంటాయి. కథ ఉత్తమపురుషలో నడుస్తుంది. తన స్నేహితుడు నరసింహంను కలవటానికి వచ్చిన కథకుడు దారంతా వూరు అందాల్ని ఆస్వాదిస్తూ వస్తాడు. అంతకుముందు వచ్చినప్పటికీ ఇప్పటికీ వచ్చిన మార్పులను గమనిస్తాడు. తీరా నరసింహం ఉండే ఇంటికి వెళ్తే అతను ఉండడు. ఇంటి యాజమాని పరమేశం సాదరంగా ఆహ్వానిస్తాడు. నాటి అతని మనమరాలూ ఇప్పుడు వయసుకు వచ్చిన సర్వమంగళను చూసి ఆశ్చర్యపోతాడు. హైదరాబాదులోని తన బావని గూర్చి, నగరాన్ని గూర్చి ఉత్సుకతతో వివరాలు అడుగుతుంది. పరమేశానికి నగర జీవితం నచ్చదు. కొడుకు రమ్మన్నా వెళ్ళటానికి ఇష్టపడడు.
తిరిగి హైదరాబాద్ వెళ్ళిపోయిన కథకుడికి కొన్నాళ్ళకు హైదరాబాద్ నగరవీధులలో రోడ్డుప్రమాదంలో ప్రాణాలు పోగొట్టుకున్న పరమేశాన్ని చూసి సర్వమంగళ కలలు కూడా చితికిపోయాయని బాధపడటంతో కథ పూర్తి చేస్తాడు కథకుడు. ఇందులో కథకుడికి తన ఊరుపట్ల గల అనంతమైన ప్రేమను వర్ణనలతో ప్రకటిస్తాడు. అంతేకాక నగరజీవితం పట్ల వ్యతిరేకతను కూడా వ్యక్తపరుస్తాడు.
‘తగువు’ కథ పేదరైతులు, కూలీజనం పైసాపైసా కూడబెట్టుకునే పోదుపు సంఘాలు, మైక్రో ఫైనాన్స్‌లకు సంబంధించినది. చిన్నచేపల్ని మింగే పెద్దచేపల తీరును అక్షరబద్ధం చేసిన కథ.
ఈ విధంగా ప్రతీకథను తన వూరి వర్ణనలతో అలంకరించి, మానవీయ విలువలతో రాసిన కథక్మిత్ర అతి తక్కువ రచనలు మాత్రమే చేసి కౌటుంబిక, ఆర్థిక వత్తిడులేకాక గ్రామీణ రాజకీయాల్ని నిబద్ధతతో ఎదుర్కొనలేక విస్మృతులు కావటం ఒక విషాదం.
