ఆకాశమంత యె త్తార్చినాను
నేను రాక్షసి గుండె నీరుగా పద్యాలు
పాడి మానవుని కాపాడినాను
నేను వే స్తంభాల నీడలో నొక తెల్గు
తోట నాటి సుమాలు దూసినాను
నేను పోతన కవీశాను గంటములోని
ఒడుపులు కొన్నింటి బడసినాను
కోటి తమ్ములకడ రెండు కోట్ల తెల్గు
టన్నలను గూర్చి వృత్తాంత మంద జేసి
మూడుకోటుల నొక్కటే ముడి బిగించి
పాడినాను మహాంధ్ర సౌభాగ్యగీతి.
కొదమసింగం గర్జించి నట్లున్న ఈ పద్యం దాశరథిది. పద్యరచనలో ఆయన మహాకవిగా సాక్షాత్కరిస్తాడు; వస్తువులో దేశ చరిత్రను తీర్చిదిద్దిన మహా నాయకుడుగా దర్శన మిస్తాడు. తెలుగుదేశ చరిత్రతో ముడిపడి ఉంది దాశరథి కవిత్వం. తెలంగాణా బంధాలు తెంచటం, రాక్షన పరిపాలన నీరయ్యేటట్లు చేయటం, తెలంగాణాలో సాహిత్య చైతన్యాన్ని కల్పించటం, తెలుగు పద్య రచనకు కొత్త ఒరవళ్లు పెట్టడం, మహాంధ్రోదయానికై కృషి సాగించటం- దాశరథి జీవితంలోనూ, సాహిత్య జీవితంలోనూ ఉజ్జ్వలంగా ప్రకాశించే ప్రథమాధ్యాయంగా భావించవచ్చు.
దాశరథి 1925 సెప్టెంబరులో తెలంగాణాలోని ఖమ్మం జిల్లా, మానుకోట తాలూకాలోని గూడూరు గ్రామంలో జన్మించాడు. పుట్టింది పండిత వంశం కావడం చేత చిన్నారి పొన్నారి చిరుత కూకటి నాటికే వన్నె మీరిన కవిత లల్లటం మొదలు పెట్టాడు దాశరథి. దాశరథి పుట్టుకతోనే అగ్నిశిఖలాంటి ప్రతిభామూర్తి. పదేళ్ళ వయస్సుకే ఆయన హృదయంలో వింత త్రేతాగ్నులు ప్రజ్వరిల్లాయి. ఆయన జీవితాన్ని ఒక మహాకవితా యజ్ఞంగా తీర్చిదిద్దాయి.
ఆత్రేతాగ్నులు- కేశవార్య శాస్త్రి వ్యాఖ్యానించిన ఉపనిషద్వాక్యాలూ, జనాబ్ జక్కీసాహెబ్ వినిపించిన ఇక్బాల్ విప్లవ గీతాలూ, చూడామణి చూపుల్లోని వెచ్చదనాలు. దాశరథి మా’నందిని’ ‘ప్రభావానికి’ వ్రాస్తూ ఇలా అన్నారు
“కేశవార్యశాస్త్రి జన్మతః శాస్త్రి కారు. ఆయన శాస్త్రాధ్యయనం చేసి శాస్త్రి అయినారు. కేశవయ్య కేశవార్యశాస్త్రిగా ఖ్యాతిపొందారు. నాకు పట్టుమని పదేళ్ళ వయసైనా లేనివాడు ఖమ్మంలో గుంటి మల్లన్న వీధిలో సంస్కృతపాఠశాల పెట్టి ఉదయం, సాయంత్రం హోమం చేస్తూ, (ఘుమఘుమలాడే ఘృతంతో) వేదం పఠిస్తూ ఉండే వారాయన. ఆయన గంభీర కంఠం వినడానికి వెళ్లే వాణ్ణి, నాతో వచ్చిన తోడి బాలురు ‘మామ కాని మామ చందమామ’ అంటే ‘శాస్త్రి కాని శాస్త్రి కేశవార్య శాస్త్రి’ అనేవాణ్ణి. ఆయన నవ్వుకుని ‘సువ్వన్నది నిజం. నా మతం కులాలను అంగీకరించదు’ – అనేవారాయన. ‘అగ్ని ర్వాగ్భూత్వా ముఖం ప్రవిశత్’ అనే ఐతరేయోపనిషత్ సూక్తికి అర్థం చెపుతూవుంటే-‘ఆ భగవంతుడి నోట్లోకి అగ్ని యెలాప్రవేశిస్తుంది?’ కాలదూ?’ అని అడిగేవాణ్ణి. “శబ్ద రూపంలో అగ్ని ప్రవేశిస్తుంది కనుక కాలదు, ఇతరుల గుండెల్లోని అజ్ఞానాన్ని కాలుస్తుంది” అనేవారు ఆయన, మత విశ్వాసాలలో నాకు విశ్వాసం లేకపోయినా, వేదాల్లోని, ఉపనిషత్తులలోని అగ్నిని గూర్చి ఆయన చెప్పినప్పుడల్లా సాహిత్య పరంగా అన్వయించుకోడానికి తప్పటడుగులు వేసేవాణ్ణి.’
ఇటు ‘మదర్సాకు’ వెళ్ళితే జనాబ్ జక్కీ సాహెఖ్-ఇక్బాల్ కవితలు చదివి వినిపించి అర్ధాలు చెప్పేవాడు.
“జీస్ ఖేత్ దహఖాఁకొమయస్సేర్ సహోఁరోజ్
ఉస్ ఖేకె హర్ ఖూషయె గండంకొ జలాదో”(యే చేను కృషివలునికి ఈయదో తిండి ఆ చేనున ప్రతి మొక్కను కాల్చేయ్యండి) ఇందులోని అగ్ని విప్లవాగ్నియై నాలో చొరబడేది. కాని, ఇక్బాల్ రాజకీయ సిద్ధాంతంతో నేను ఏకీభవించ లేదు.
ఇటు కేశవార్య శాస్త్రి, అటు జక్కీ సాహెబ్-ఈ ఇద్దరూ లేని సమయాల్లో నన్ను కవ్వించే మా బ ఘపు అమ్మాయి చూడామణి-శృంగార మందే తెలియని రోజుల్లో-ఏదో గిలిగింత మనసులో, తనువులోనూ కలిగిస్తుండేది.
‘ఉపనిష ద్వార్యాలూ, ఇక్బాల్ విప్లవ గీతాలలోని అగ్ని, చూడామణి చూపు ల్లోని పెచ్చదనం అడపా తడపా నామీద దాడి చేసి నన్ను లొంగదీశాయి. ఆనాడే అంగారం, శృంగారం నన్ను ఆవహించాయి. ‘గ్రామీణ ప్రమధా వినీల కబరీ రంగ స్థలీ లాసికా’ అని చాలా కాలం తరువాత వ్రాసిన వంక్తిలో ఈ రెండు (రసాలు) కలగలిసి పోయాయి. పలాశ కుసుమ లాసిక అగ్ని బాలిక:’
‘నేను ఆ విద్వాంసు లిద్దరికీ దూరమైనా, నా చూడామణి దక్కక పోయినా, నాలో ఆనాడు వారి వలన ప్రవేశించిన అగ్ని రమారమి నలభై ఏళ్ళుగా నన్ను వెంటాడు తున్నది. ‘అగ్నయే నమః’.
అగ్ని సంఘర్షణ వల్ల పుడుతుంది. ఆవేదనగా, ఆవేశంగా ప్రజ్వలిస్తుంది; రౌద్రంగా నర్తిస్తుంది. దాశరథి సూనూగు మీసాల నూత్న యౌవనంలో అడుగిడే నాటికి తెలగాణం తీగెలు తెగిన వీణలా మూగవోయి వుంది. నిజాం నిరంకుశ పాల నలో ప్రజల బాధ హృదయవిదారకంగా వినపడుతోంది. సామాన్యుల రక్తం పిండి సామ్రాజ్యాన్ని నిర్మించుకుంటున్న కసాయి ప్రభుత్వం చేసే ఆరావక కృత్యాలకు కవి అంతరంగం అగ్ని గుండంలా మండింది. అతని నాం్కమీన అగ్నిధానగా కవిత ఆవిర్భవించింది.
‘అది తెలంగాణలోని దావాగ్ని లేచి
చుట్టు ముట్టిన భయద సంక్షోభవేళ
అది నిజాము నృపాలుని అండదండ
చూచుకొని నిక్కినట్టి పిశాచ హేల-
నాడు మానవతీ నయనమ్ములందు
నాగసర్పాలు బుసకొట్టి నాట్యమాడె
నాడు మానవతయు నవనాగరకత
తన్నుతిన్నది రాక్షసత్వమ్ముచేత.’
అఖిల భారతం స్వాతంత్ర్య సమరం సాగిస్తుందే- నిజాం రాష్ట్రంలో తెలుగు వారు స్వీయభాషా గౌరవాల కోసం, బానిసత్వ శృంఖలాలను త్రెంచుకోవటం కోసం జీవన్మరణ సమస్యలతో హోరాహోరీ పోరాటం సాగించారు. నిరంకుస శక్తులతో ప్రజాశక్తి ప్రచ్ఛన్న యుద్ధం సాగించింది. నిజాం రాష్ట్రంలో అధిక సంఖ్యాకులు తెలుగువారు; కాని వారి భాషకు పరువులేదు ప్రభుత్వంలో. నవాబు ఖజానాలో మూల్గే బంగారం తెలంగాణా రైతుల స్వేదజలాల సారం. అధికారికి అన్నంపెట్టే రైతుకు అన్నం లేదు. ప్రపంచంలో ప్రముఖ సంపన్నుడు నిజాం నవాబు. ఆయన ధనకోశానికి పణం పెట్టాడు తన అన్నకోశాన్ని తెలంగాణా రైతు. రెక్కలు విరుచుకున్నా డొక్కలు నిండని సామాన్య జనుల దుర్భర జీవిత గాధ తెలంగాణాలో కార్చిచ్చును మండించింది. తెలుగు మాట పల్కటానికి తెలుగుపండుగ చేసుకోటానికి, తెలుగువారు కలిసి మాట్లాడుకోవటానికి వీలుపడని నిషేధాజ్ఞలు చేయించిన నిజాం ప్రభుత్వం తెలుగు తల్లిని చెరలో పెట్టింది. తెలుగుబిడ్డల తీరుతెన్నుల మీద తీరని ఆంక్షలు మోపింది, భారత స్వాతంత్ర్యం వచ్చినా తెలంగాణాప్రజల బాధలు తీర లేదు. రజాకార్ల దుండగాలతో తెలంగాణా అవమానాల పాలైంది. ఆస్తుల దోపిడీలూ గృహదహనాలూ, స్త్రీల మానాపహరణాలూ, తల్లి బిడ్డల కడుపు చిచ్చులూ, ప్రజా నాయకుల కృష్ణజన్మస్థాన ప్రయాణాలూ, హత్యాకాండలూ, అమానుష కృత్యాలూ తెలంగాణాన్ని కలత పెట్టి వేశాయి. ఈ అత్యాచారాలనుచూచి దాశరథి ఆగ్రహోదగ్రు డైనాడు. అంతటికీ కారకుడైన ఆ నిజాం నవాబును కవితా ఖడ్గంతో ఎదిరించాడు.
‘ప్రాణములొడ్డి ఘోర గహనాటవులన్ బడగొట్టి మంచిమా-
గాణములన్ సృజించి ఎముకల్ నుసి జేసి పొలాలు దున్ని భో-
షాణములన్ నవాబునకు స్వర్ణమునింపిన రైతుదే, తెలం-
గాణము రైతుదే, ముసలినక్కకు రాచరికంబు దక్కునే?’
‘ఓ నిజాము పిశాచమా! కానరాడు
నిన్నుబోలిన రాజు మాకెన్నడేని
తీగెలను తెంపి, అగ్నిలో దింపినావు
నా తెలంగాణ కోటిరత్నాలవీణ’
‘తరతరాల స్వప్నాల సుందర ఫలమ్ము
స్వైరభారతభూమి చూపడెనొ లేదొ
విషము గుప్పించినాడు నొప్పించినాడు
మా నిజాంనవాబు, జన్మజన్మాల బూజు’
‘అచట పాపము దౌర్జన్య మావరించి తెలుగుదేశాన నెత్తురుల్ చిలికి మతపిశాచము పేదల కుతుక నమిలి ఉమ్మి వేసెను పిప్పి, లోకమ్ము మీద’.
‘నా తెలంగాణ కోటిరత్నాలవీణ తీవియలు తెగి, విరిగి నదించకుండె నా తెలుగుజాణ ప్రాణమానాలు దోచి ఈ నిజాము పిశాచి కన్నెర్రచేసే’.
నిజాం ప్రభుత్వం ఈ అగ్గిపిడుగును ఇనుప గొలుసులతో బంధించింది. ఓరు గల్లు నగర వీధుల్లో నడిపించి హసించింది; నిజామాబాదు సెంట్రల్ జైలులో నిర్బం ధించింది. బందీఖానాలో రామదాసులా ఆక్రందించలేదు దాశరథి; బడబాగ్నిలా ప్రజ్వ లించాడు. వట్టికోట ఆళ్వారుస్వామి వంటి ప్రజల మనుషులు కటకటాల వెనుక కను పించారు. వారితో కలిసి వ్యక్తిత్వాన్ని పెంచుకున్నాడు. తన విప్లవ కవిత్వాన్ని జైలు గోడలమీద శిలాక్షరిగా లిఖించాడు. ఆళ్వారుస్వామి దాన్ని అన్నివై పులాచిత్రింంగి చాడు.’ఓ నిజాము పిశాచమాః…నా తెలంగాణ కోటి రత్నాల వీణ’ అన్న పద్యం ఫిర గుండులా ప్రభుత్వాన్ని భయపెట్టింది. ప్రజల హృదయాలకు సమర సంగీతంలా వినిపించింది. పద్యాలతోనే ఆగిపోలేదు దాశరథి: గీతాలలో కూడా నవాబును పడ తిట్టాడు. కవితార్చితో కనకపు సింహాసనాన్ని చుట్టుముట్టాడు:
ఇదేమాట ఇదేమాట పదే పదే అనేస్తాను ఖదంతొక్కి పదంపాడి ఇదేమాట అనేస్తాను …… జగ త్తంత రగుల్కొన్న కృధాజ్వాల వృధాపోదు । అడుగడుగున యెడదనెత్తు గడగడమని త్రాగినావు ।
పడతుల మానాలు దోచి గుడగుడ మని ‘హుక్క’ త్రాగి! జడియక కూర్చుండినావు మడికట్టుక నిలిచినావు। దగాకోరు బడాచోరు రజాకారు పోషకుడవు |
వూళ్ళ కూళ్లు అగ్గి పెట్టి ఇళ్ళన్నీ కొల్లగొట్టి।
తల్లి పిల్ల కడుపుకొట్టి నిక్కిన దుర్మార్గమంత। నీ చాధ్యత ! నీ బాధ్యత !
‘కోటిన్నర’ నోటివెంట పాటలుగా మాటలుగా దిగిపొమ్మని దిగిపొమ్మని ఇదేమాట అవేస్తాను, వద్దంటే గద్దె యెక్కి। పెద్దరికం చేస్తావా? మూడుకోట్ల చేతులు నీ మేడను పడతోస్తాయి మెడనే విడదీస్తాయి ! నీకు నిలుచు హక్కు లేదు నీ కింకా దిక్కులేదు । (చరిత్ర బొంగరం తిరిగి కిరీటాలు నేల కొరిగి)
ధరాధిపులు వశిస్తుంటే బరాయెనాంన వారా! పరాక్రమం చూపేవా! దిగిపొమ్మని జగత్తంత నగారాలు కొడుతున్నది. దిగిపోవోయ్, దిగిపోవోయ్ తెగిపోవోయ్, దిగిపోవోయ్! ఇదేమాట ఇదేమాట పదే పదే అనేస్తాను!”
భారత సైర్యాలు హైదరాబాదు విముక్తికి సన్నాహ మౌతున్న కాలంలో నవాబును దాశరథీ అపహాస్యంగా అధిక్షేపించాడు-
“నడిగడ్డను సముద్రాన పడకుండా కాపాడే బడాయి నీ కెందుకు రాజా! లడాయి నీ కెందుకు ? నీతుపాకి నిప్పులతో చేతులు కాల్చేసుకోరు! నీళ్ళమీద నిప్పులుపడి చల్లబడక పోతాయా? నడింగడ్డ కడుపులోని నదులుకూడ అటువైపే సముద్రాన్ని రమ్మంటూ సైగలు చేస్తున్నవిరా! అంతర్బహిశ్చ తత్సర్వం శత్రువులే నిండినారు-ఇంకేమి లింకంరా ! ఓ లంకాద్వీపపు రాజా!”
హైదరాబాదు సంస్థానం భారతదేశంలో విలీనమై పోవటంతో తెలంగాణా విముక్తి సమరం ఫలించింది. నిరంకుశ పాలను పోయి ప్రజా ప్రభుత్వం వచ్చింది. నిజాం ప్రభుత్వం వీరై పోవటానికి కాలం పెట్టిన శాపాన్ని దాశరథి భరత వాక్యంలా పేర్కొన్నాడు.
‘మూడవపాలు తెలుపటమున్ తన పాలికి కత్తిరించుకొ న్నాడు కదా నిజాము నరవాథుడు మున్నొక రెండుమూడు నూ రేడులనాడు ! వాడు తొలగించిన ఆంధ్రమహాపతాక క్రీ నీడలు నాగుపాములయి నేటికి కటిడె వాని వంళమున్”
దాశరథి మొదటి కవితా సంపుటి ‘అగ్నిధార’ తెలంగాణా విముక్తి పోరా టంలోని తెలుగువారల సమరగీతం దాశరథికంఠంలో కాహళగా వినిపిస్తుంది. జైల్లో, ఉద్యమంలో వ్రాసిన కవితాఖండిక లున్నా యిందులో బహుళంగా, సమకా లీన ప్రజా ఉద్యమాన్ని ప్రజ్వలింప చేసిన వైతాళికుడు దాశరథి. ఉద్యమం దాశ రథిని అగ్నికీలగా మండించింది: ఆయన కలం ‘అగ్నిధారగా’ రవ్వలు కురిపిం చింది,
దాశరథి నిజమైన ప్రజాకవి. ప్రేక్షకుని వలె గాక ప్రజం కష్ట నిష్ఠురాలలో తానొకడుగా కలసి పోయినాడు. అందుచేతనే దాశరథి ‘అగ్నిధార’ లో అణు మాత్రమైనా కాల్పనికతగానీ వాస్తవికతగానీ కనిపించదు. తెలంగాణ ప్రజల స్వాతంత్ర్య ఉద్యమానికి ప్రతిబింబం దాశరథి కవిత్వము’ అన్నారు శ్రీ దేవులపల్లి రామానుజ రావుగారు.
ఆధునికాంధ్ర సాహిత్యచరిత్ర వ్రాసేటప్పుడు దాశరథికొక ప్రత్యేక అధ్యాయం కేటాయించవలని వుంటుంది. అది ఆయన ప్రత్యేకతకు తార్కాణం. ఆ ప్రత్యేకత అగ్ని ధారతోనే ప్రారంభమైంది. తెలంగాణంలో ఉండటం చేత దాశరథి భారత స్వాతంత్ర్యపోరాటంలో ప్రత్యక్షంగా పాల్గొనే అవకాశం లేక పోయింది. హైదరాబాదు రాష్ట్రతరప్రాంతంలో వెలసిన నవ్యసాహిత్యంలో జాతీ యోద్యము, ఆంధ్ర రాష్టోద్యము ప్రబోధాత్మకమైన కవిత్వం ఒక ప్రత్యేకశాఖగా వర్దిల్లింది. అందులోనూ జాతీయోద్యమానికి సంబంధించిన కవిత ప్రధానంగా గేయరూపంలో వెలువడింది; రాష్ట్రగానం పద్యమయంగా జాలువారింది. ఆంధ్ర ప్రశస్తిని, ఆంధ్ర తేజాన్ని, కీర్తించే ప్రబోధకవిత్వం కూడా ప్రధానంగా పద్యాల లోనే వెలసింది. రాయప్రోలు తెలంగాణంలో ఉన్నా ప్రాచీనాంధ్రప్రశక్తిని కీర్తించారే కాని, నిజాం పరిపాలనలో మ్రగ్గిపోయిన తెలుగువారి అగచాట్లను చిత్రించే కవిత వినిపించలేకపోయారు. దాశరథి తెలుగుదేశంలో ఒక భాగమైన స్వాతంత్రోద్యమానికి శంఖం పూరించాడు. తాను ఉద్యమంలో వీరుడుగా పాల్గొని కష్టనష్టాలకు గురి అయ్యాడు. ప్రజాశక్తులతో కలిసి జనంలో కవితావేశాన్ని కల్పించి కార్యరంగంలో దూకించాడు. విశాలాంధ్రచరిత్రలో తెలంగాణా విషాద గాథను, విప్లవచరిత్రను కలసి చదువుకున్నప్పుడే సమగ్రత వచ్చేది. తెలుగు దేశంలో మూడవవంతు తెలంగాణం, దానిని మేల్కొల్పి యావందార్థంతో చెలిమి కలిపిన కవికిశోరం దాశరథి. ఆయన ప్రభావంతో ఆ తరువాత ఎందరో ఆ రంగంలో దూకి పనిచేశారు. ఒక విధంగా దాశరథి తెలంగాణంలో నవ్య కవికుల గురువు: ఆయన కవితకు తెలంగాణంలోనూ, తెలుగు దేశమంతటనూ ఎందరో అనుయాయులున్నారు. ఆశుకవిత్వంలోని వేగం, ఆధునిక కవిత్వం లోని ఆవేశం, ప్రబోధకవిత్వంలోని వైభవం ఆయన కవితలో సంగమించాయి. తెలంగాణా స్వాతం త్ర్యోద్యమ కవిత దాశరధిగళంలో పద్య గేయరూపాలలో సాగినా, ప్రజలు మెచ్చింది, సాహిత్య జగత్తుకు నచ్చింది ప్రధానంగా ఆయన పద్య కవితయే. ఉద్యమ కవిత్వాన్ని పద్యంలో నడిపిన కీర్తి దాశరథికి దక్కుతుంది. అదే ఆయన ప్రత్యేకత!
తెలంగాణా విముక్తి పోరాటంలో విశాలాంధ్రకు బీజాలున్నవి. విముక్తి లేనిదే సమైక్యం లేదు. ఆ సమైక్యం గత వైభవ కీర్తనం వల్ల కాదు. సమకాలీన ప్రజా సమస్యలను పరిష్కరించటం కలుగు తుందంటాడు దాశరథిః
‘పటుబాహాబలురైన ఆంధ్రుల గతప్రాశస్త్యముల్ వల్లెవే యుటలో కొన్నితరాలు దాటినవి: పూర్వోదంతముల్ నేటి సం కటముల్ తీర్పవుగాక; నాటి జ్వలితాంగారమ్ము లీనాటి కుం పటిలో బూడిద కప్పుకొన్నవి; రగుల్పన్ లెమ్ము వీరాంధ్రుడా!”
‘ముక్కలు ముక్కలై చెదరిపోయెనురా! మనజాతి; హూణభూ భుక్కుల రాజనీతికి కవుంగిళు లొడ్డిన ‘రాజు’ చేతిలో చిక్కెను కోటిమంది నివసించెడు బంగరు తెల్గునేల; నే డక్కడ తెలుటంగనల మానము ప్రాణము దక్కకుండెడిన్,
రాయప్రోలు కంటె దాశరథి త్రొక్కిన కొత్తబాట ఈ మాటలలో ఆర్థమౌతుంది. తెలంగాణ మంటే దాశరథికి కన్న తల్లి జ్ఞాపకం వస్తుంది. ఆమెను వేనోళ్ళ కీర్తిం చాడు దాశరథి. తన ‘రుద్రవీణ’ ను ఆమెకి అంకితం చేశాడు.
‘నను గని పెంచినట్టి కరుణామయి నా తెలఁగాణ! నీ గృహాం గణవనసీమలో బరుసుకంపలు నాటిన మా నిజామురా జును పడద్రోసినట్టి రణశూరుల వెచ్చని నెత్రుచుక్కలే మణికృత దీపమాలికలమాదిరి నీకు వెలుంగులిచ్చెడిన్’
‘పాటలు పాడితిన్ తెలుగుబాబులు నిద్దురమేల: కోగ, పో రాటము సేయగా కరకురాచరికమ్మును కూలద్రోయగా
కోటిగళాల నొక్కకడ గూర్చితి విప్లవశంఖ మొత్తితిన్ నాటికి నేటికిన్ తెలుగునాటికి వెచ్చదనంబు లూదితిన్”
తెలంగాణను విముక్తి చేసిన ఈ తెలుగు కవివీరుడా తల్లిని చివరకు కోరే వరం విశాలాంధ్రః
‘తుంగథ, దానదీభంగమ్ము లిరుస్రావ లొరసిపారుచు రుచు లరయుచుండ
కృష్ణవేణీతరంగిణి నాలుకలు సాచి దరుల రెండిట ‘మజా’ లరయుచుండ గోదావరీ వీచికా దివ్యహస్త మ్ము Đరు కెలంకుల మన్ను తరచుచుండ బోటి కిన్నెరసాని మాటిమాటికి పొంగి రెండు వైపుల దరు అండఁగొనఁగ
ఇటునటును తెల్లు నేల లారటము జెంది కలసిపోజూచుచున్న యట్టులనే తోచు కలిపివేయుమి, నా తెలంగాణతల్లి! మూడుకోటుల నొక్కటే ముడిబిగించి.
“నాకోర్కె తీర్పుమమ్మా ! నీకు మదీయాశ్రుకణవినిర్మితమాలా నీకమ్ము సమర్పించెద గాక; విశాలాంధ్రమనెడి కల నిజమగుతన్”
విశాలాంధ్ర సమైక్యభావానికి నదుల నిలా సమన్వయసూత్రంగా వాడుకున్న పద్యాలు తెలుగులో అరుదు, దాశరథి విశాలాంధ్రభావనం అఖండభారత భావన కనుబంధం.
‘జండా ఒక్కటి మూడువన్నెలది; దేశం బొక్కటే భారతా ఖండా సేతుహిమాచలోర్వరః కవీట్కాండంబులోనన్ రవీంద్రుండొ క్కండె కవీంద్రు; దూర్జితజగద్యుద్ధాలలో శాంతి కో దండోద్యద్విజయుండు గాంధీ ఒకడే తల్లీ! మహాభారతీ!
దాశరథి కవిత్వానికి జాతీయాభిమానం జీవితం; మహాభారతంలో మహాంధ్రం అఖండంగా ఉండాలనే ఆయన భావం। ఆయన ఉద్యమానికి ఆదే లక్ష్యం:
2
నిజాంపాలనకు వ్యతిరేకంగా ప్రజావిప్లవంలో పాల్గొన్న దాశరథికి సామ్యవాద సిద్ధాంతం మీద సానుభూతి కలిగింది. ప్రపంచంలో ప్రచండంగా వ్యాపిస్తున్న సోష లిస్టు దృక్పథం ఆయన్ను ఆకర్షించింది. చరిత్రగతిలో వర్గసంఘర్షణం వలన కలిగే విప్లవాల స్వభావం అవగతమైంది. అగ్నిధారలో మెరిసే మరో పదునైన అంచు పీడిత ప్రజాసముద్ధరణ సంకల్పం: అగ్నిధార ఉత్తరార్ధంలో దాశరథి సామ్యవాద కవితా దృక్పథం ప్రపంచింపబడింది.
ఆధునికాంధ్రసాహిత్యంలో ఈ మార్గానికి ప్రయోక్తగా నిలిచిన యుగకర్త శ్రీశ్రీ. ఆయన ప్రభావం దాశరథి మీద బలంగా కనపడుతుంది. శ్రీశ్రీ తిరుగుబాటు సంప్రదాయం మీదా, ఛందస్సుల మీదా, సమాజవ్యవస్థ మీదా ఒక్కసారిగా ఉవ్వెత్తుగా సాగింది. దాశరథి తిరుగుబాటు సమాజ్యవ్యవస్థకే పరిమితమైనట్లు కనబడుతుంది. పద్యాల్లో తన నూత్న చైతన్యాన్ని అంతర్నాదంగా వినిపిస్తాడు అగ్నిధారలో —
“నాగీతావళి ఎంతదూరము ప్రయాణం బౌనొ ; అందాక ఈ భూగోళమ్మున అగ్గి పెట్టెదను; నిప్పుల్ వోసి హేమంత మాగాంధర్వ వివాహమాడెదను; ర్యోమణ్యుష్ణగోళమ్ము పై ప్రాగాకాశనవారుణా ప్రజల ధారల్ చల్లి చల్లార్చెదన్”
“వీణియతీగపై పదను పెట్టిన నాకరవాలధారతో గానము నాలపింతు; కవికంఠము నుత్తరణం బొనర్చి స్వ ర్గానకు భూమినుండి రసగంగలు చిమ్మెద; పీడిత ప్రజా. వాణికి ‘మైక్’ అమర్చి అథవాదులకున్ వినిపింప జేసెదన్”
సంకల్పం పద్యంలో చేసినా సాధన గేయంలోనూ, వచనంలోనూ సాగింది తర్వాత…—
“అనాదిగా సాగుతోంది- అనంత సంగ్రామం అనాథునికి ఆగర్భ-శ్రీనాథునికీ మధ్య సేద్యం చేసే రైతుకు-భూమి లేదు పుట్ర లేదు రైతుల రక్తం త్రాగే-జమీందార్ల కెన్టేట్లు.
మిల్లు నడిపి, కోట్ల డబ్బు-కొల్లగ లాథం తెచ్చే కూలోనిది కాదు మిల్లు-మిల్ మ్యాగ్నేటొక సేటు కర్షకులు కార్మికులు-మధనపడే మేధావులు తమశ్రమలకు తగినఫలం-ఇమ్మంటే తిరుగుబాటు షావుకారు వడ్డీలకు జమీందార్ల హింసలకు వేగలేక ఆగ లేక-తిరగబడితె అతివాదం”
అని సమీక్షించి, ‘ప్రజాద్రోహి వర్గానికి లయకాళిక శ్రమికణాతి ; జగద్విప్లవ గళంలో జయమాలిక శ్రమిక రాతి ; మేల్కొన్నది; మేల్కొన్నది’ అని గుర్తించాడు దాశరథి. పశ్చిమఖండాల సామ్రాజ్యతత్వానికి ఎరయై శల్యావశిష్టమైన ప్రాగ్భూమిని చూచి విస్తుపోయాడు దాశరథి,
“పడమటి బొల్లిగద్దలు-పొడిచి పొడిచి తిని విడిచిన అగ్నిసంస్కారం నోచని నగ్నశవం ప్రాగ్భూమి ! “మతాలతో గతాలతో చితి రగిల్చి పడి చచ్చే అన్నాదమ్ముల చల్లని-కన్నతల్లి ప్రాగ్భూమి!
కరువుల తెరచాటున- మరణాంగనాలింగనంలో కనుమూసిన నిరు పేదల- ప్రణయళాల ప్రాగ్భూమి ! లక్షలాది పేదల ప్రాణార్- అడింతలుగా చల్లుకొన్న లక్షాధికార్ల పాలిటి-లక్ష్మిదేవి ప్రాగ్భూమి !””
ఆసియాలో ఉదయించిన నవారుణ చై తన్యం దాశరథి కవితకు సనుసమాజ స్పృహను కల్పించింది. ‘రుద్రవీణ’లో ఆతనికంఠం మరింత స్పష్టంగా తన భవితవ్యాన్ని చెప్పింది.
“రానున్నది యేది నిజం ?- అది వొకటే సోషలిజం! కలపండోయ్ బుజంబుజం – కదలండోయ్ గజంగజం! అడుగడుగున యెడద నెత్రు-మడుగులుగా విడువండోయ్! పడిపోయిన గుడిగోడలు-విడిచిపెట్టి నడవండోయ్! ఉదయాకాశ పతాకం- యెదలో కదలాడె నేడు ! హృదయావేళ తటాకం-నదిలా పౌరలాడె నేడు”
మరో ప్రపంచాన్ని చూపిస్తూ ముందుకు తోస్తున్న శ్రీశ్రీ లాగ దాశరథీ ప్రజలను ప్రబోధించాడు. ‘గతాన్ని విస్కీగా తాగిన కవిన్నేను: భవిష్యత్తు నిషానిజం :’ అని దాశరథి విస్కీ పుచ్చుకున్నా శ్రీశ్రీ అంతవేగంగా ముందుకుతూలి సాగలేకపోయాడు. అందులోనే ఉంది ఆయన ప్రత్యేకత 1
శ్రీశ్రీ లాగా దాశరథిసమాజంలోని కొన్ని చీకటికోణాలను చూపి సామాజి కుల్ని కరుణార్ధుల్ని చేయటమే కాకుండా, సమాజం కన్నులు తెరిపించాడు.
“ఈ సమాజాన దోపిడికే నివాస మిందు నీకేమి లేదు; సహింపరాని వేదనయె కాని వేరు కన్పింపబోదు లే, చివాలున లేచి మళ్ళించు రథము”
‘నరజాతి చరిత్ర సమస్తం పరిపీడన పరాయణత్వం’ అన్న సత్యానికి ఈ పద్యం వ్యాఖ్యానం. ‘తాజ్ మహల్ నిర్మాణానికి రాళ్లెత్తిన కూలీ లెవ్వరు?’ అన్న సామాజిక ప్రశ్నకు ప్రత్యుత్తరంగా ఒక కూలిదాని చిత్రాన్ని మనముందు దాశరథి గీసి చూపి స్తాడు. ఆమె నుదుట అగ్నికుంకుమం దిద్ది అశ్వానిస్తాడు.
“ఓసి కూలిదానా ! అరుణోదయాన మంటితట్ట నెత్తిన బెట్టి మరుగు లేని యెత్తు రొమ్మును పొంగించి యెందుకొరకు ఉస్సు రనెదవు ? ఆకాశ ముడికి పోవ?
అంబరచుంబి సౌధముల కాయువు పోసెడి నిశ్రమ ప్రభా వంబు నెఱుంగలేని ధనవంతుల బంగరుపళ్లెరాలలో అంబలిపోసి త్రావుసమయంబులు దగ్గరె లెమ్ము! నీ నవా స్యంబున రుద్రనేత్ర విలయాగ్నుల కుంకుమబొట్టు పెట్టుమా?”
ఇంతకంటే దయనీయమై, సాంఘికవ్యత్యాసాలను చిత్రించే మరో చిత్రం చూడండి :
“చింతలతోపులో కురియు చిన్కులకున్ తడిముద్దయైన బా లింత యొడిన్ శయించు పసిరెక్కల మొగ్గనువోని బిడ్డకున్ బొంతలు లేవు కప్పుటకు బొంది హిమంబయి పోవునేమొ; సా గింతును రుద్రవీణపయి నించుక వెచ్చని అగ్ని గీతముల్”
సమాజంలోని ఎత్తుపల్లాలలను దాశరథి చూచి నిర్వేవపడ్డాడు; ఆగ్రహావేశళ పరుడై
నాడు. దీని పరిష్కారం సోషలిజమని విశ్వసించాడు. వర్గసంఘర్షణచరిత్ర సత్యమైతే ఒకవర్గం మరోవర్గాన్ని విప్లవం ద్వారా తొలగించి అధికారంలోని వస్తుంది. అయితే విప్లవం శాంతివిప్లవమా ? లేక సాయుధ విప్లవమా: అన్నది సమస్య, ఆధునిక ప్రపంచంలో ఏయిజాన్ని ఆశ్రయించిన పెద్ద దేశమైనా తనస్వార్థంకోసం పరపీడన పరాయణత్వాన్ని అమలులో పెడుతూనే ఉంది. వర్గరహిత సమాజవ్యవస్థాస్థాపనం కోసం మరోవర్గాన్ని మారణహోమం చేసిన ఘట్టాలూ కనపడుతున్నాయి. ప్రచ్ఛ న్నంగా ప్రపంచాధిపత్యానికి ప్రణాళికలు తయారు చేస్తూనే ఉన్నాయి. వర్గాల మధ్య సంఘర్షణ యేర్పడినా, దేశాల మధ్య సంఘర్షణ యేర్పడినా, ప్రపంచసంస్థలు ఎన్ని కృషి చేస్తున్నా-వీటన్నిటి వెనక నున్న మానవుణ్ణి మాత్రం చాలసార్లు విస్మరించటం జరుగుతున్నది. శాస్త్ర విజ్ఞానం చంద్రమండలయాత్రకూ, మారణహోమానికీ కూడా వినియోగపడుతున్నది. విజ్ఞానం రాజకీయస్వార్థశక్తుల చేతుల్లో పడి విలయతాండవం చేస్తోంది. ప్రపంచమంతా శాంతిని కాంక్షిస్తోంది. ఎన్ని మార్పులు వచ్చినా, ఎన్ని ఇజాలు మారినా, ఎన్ని ప్రభుత్వాలు మారినా ప్రపంచ శాంతికీ మానవత్వానికీ మహోన్నత స్థానం రావటం లేదు. ఇటువంటి విశ్వవాతావరణంలో ఏదో ఒక వాదానికి కట్టుపడటం. విజ్ఞతకు లక్షణంకాదు. ఆర్థిక సమానత్వాలు తొలగటానికి సామ్యవాదం ఉపాదేయమే; కాని, విప్లవం హృదయచై తన్యం రూపంగా రావాలి కాని రక్తపాతంతో కాదు మనిషి కోసమే ఈ ప్రపంచ మైనప్పుడు మానవతావాదం వీడలేము.
ఈ మూడు సూత్రాల ముడిలో శాంతి భద్రంగా ఉండాలి. అదే విశ్వ శ్రేయస్సు. ఈ విధమైన అవగాహనం భారతదేశనాయకులు రూపొందించిన శాంతి పథంలో ఉంది. దాని ప్రసక్త గాంధీ; దానికి రూపకల్పన చేసింది నెహ్రూ : అందుకే భారతదేశం సామ్యవాదాన్నీ శాంతిపాఠాన్నీ కలిపి చదువుతుంది; స్వతంత్ర శక్తుల్నీ, సత్యాగ్రహ విప్లవాన్నీ సమర్థిస్తుంది; ప్రజాస్వామ్యాన్నీ ప్రగతిశీలాన్నీ ముడివేస్తుంది; ఆర్థికాభివృద్ధితోపాటు హార్దిక స్నేహాన్ని పెంపొందించ మంటుంది. దాశరథి ఈసమన్వయ మార్గంలో నడిచే శాంతి విప్లవవాది.
దాశరథి శాంతి విప్లవ బీజాలు పునర్నవంలో పొదకడతాయి.
“తెలంగాణలోని కోటి – ధీరులగళధ్వనినే గాక ఇలాగోళమం దుండెడి-ఎల్లరి శబ్దాన్ని నేను-” నా పేరు ప్రజాకోటి-నా ఊరు ప్రజావాటి.”
“గతమే జీవిత మనుకుని-వర్తమానమే వలదని వెనక్కు నడిచే వారిని వెక్కిరించు కోర్కి లేదు”.
“గతమంతా బూదికుప్ప-కావాలి మనోజ్ఞ భావి తిగరుబడండని అరచే బిరుసువారి నిందింపను”
“ఇవి రెండూ ఒక కత్తికి అటూ ఇటూ రెండంచులు ‘నే మాత్రం రెండంచుల-సాము చేయగలను లెండి !”
“గతాన్ని కాదనలేను-వర్తమానం వద్దనబోను భవిష్యత్తు వదలుకోను కాలం నా కంఠమాల నా పేరు ప్రజాకోటి-నా ఊరు ప్రజావాటి”
” “బాంబులలో బలం చచ్చి-పాములలో విషం చచ్చి పేమములో బలం హెచ్చి-స్నేహములో శక్తి హెచ్చి చిన్నపాటి అంకుశమున – గున్న యేనుగును వంచే కొత్తరకం పద్ధతి కను-గొన్నానండో-రండో!”
“భరతభూమి నేర్పినదో- ప్రజాకోటి నేర్చినదో నిజం ఏమిటో గాని-వట్టి చేతితో శత్రువు పై దుమికే శక్తి వుంది’
“ఎర్రజెండ పట్టుకోని-ఎగసిపోవువాడి తోటి పచ్చజండ పట్టుకోని-పరుగుతీయు వానితోని మైత్రీ బంధం కూర్చే మహాశక్తి నా కున్నది”.
“ఎవడై నా మానవుడే-ఎందుకు ద్వేషించడాలు ? రాక్షసినై నా మైత్రికి-రానిత్తును భయం లేదు !
“హృదయం వినా నాదగ్గర ఏ వస్తువు లభింపదు ఉదయం వినా నాకంటికి-ఏ వస్తువు రుచింపదు !
“అందరికంటే ముందే అణ్వస్త్రము గొనిపోయి అఖాతాన పడవేసితి-సుఖపడగా ప్రజాకోటి!
“కత్తిపట్టి గెలిచినట్టి-ఘనుడగు వీరుండెవ్వడు ? మెత్తనిహృదయం ధాటికి తుత్తునియలు కాని దెవడు? అజ్ఞానపు అడుసుకడిగి -అసలు విషయ మెరుంగుడి-ఘర్షణలో ఏనాటికి-హర్షం లభియింపబోదు”.
దాశరథి సామ్యవాదం మానవతావాదంతో పునీతమైంది. కొత్తకాంతితో కపోత సందేశం వినిపించింది. శాంతి విప్లవవాది ధరించేది మారణాయుధాలు కాదు; శాంతి పుష్ప బాణాలు. ‘శిశిరమనే రాక్షసిని క సితీరగ నరుకుటకు, అంతకన్న నిశితమైన ఆయుధ మక్కరలేదు :’ మానవతామలయవాయు సంచారములే చాలును. శాంతిపుష్ప బాణాలను కురియించుటయే చాలు’ నంటాడు దాశరథి.
“ఏనా డెవ్వడు కత్తితో గెలువలే ది విశ్వమున్; ప్రేమ పా శానన్ కట్టుము నాలుగుంబది ప్రపంచాలన్; మహాత్ముండిచే జ్ఞానోద్బోధము చేసె; నెవ్వడు వినెన్: సాహిత్యసామ్రాజ్యమం దైనం కొంతగ శాంతి పాడుకొననిమ్మా! నీకు పుణ్యంబగున్!”
అని ఆధునిక ప్రపంచాన్ని అనునయిస్తాడు మహాంధ్రోదయంలో దాశరథి.
ఆధునికాంధ్ర సాహిత్య క్షేత్రంలో భావచైతన్యస్రవంతి మూడుపాయలుగా చీలి ప్రవహిస్తోంది. ఒకటి : సంప్రదాయ చైతన్యధార. దీనికి నాయకుడు కవిసమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ. రెండు సాయుధ విప్లవచైతన్యధార, దీనికి నాయకుడు మహాకవి శ్రీశ్రీ. మూడు శాంతి విప్లవచైతన్యధార. దీనికి నాయకుడు మహాకవి దాశరథి. ఇందులో మొదటిరెండూ రెండు తీవ్రవాదాలు. వాటిని సమన్వయిస్తూ అభ్యుదయాన్ని వరించే మధ్యేమార్గం దాశరథిది. ఆయన మధ్యేమార్గపు మాగ్నకార్టాలు “తిమిరంతో సమరం” “ఆలోచనాలోచనాలు”
తిమిరంతో ఘనసమరం జరిపిన బ్రతుకే అమరం కవితాతేజోవలయం అవని శాంతి కదినిలయం”
ఈ గీతం ఆయన జీవితాని కెలావర్తిస్తుంలో- ఆయన కవితా సిద్ధాంతానికలా అనువర్తిస్తుంది. తిమిరం నలపుకు ప్రతీక. విశ్వశ్రేయస్సుకు, విశ్వశాంతికి, విరుద్ధ మైనభావం తిమిరం. అభ్యుదయానికి అవరోధంగా నిలిచేది తిమిరం, మానవజీవితం సాధించేచివరిమెట్టు అమరత్వం అమరత్వం అనవరత సమరసంకేతం. ఆదిచేసేదిచీకటితో సమరం: తిమిరమంటే అజ్ఞానంకావచ్చు; అహంకారం కావచ్చు: నిర్ణయ కావచ్చు; పార తంత్ర్యం కావచ్చు; పరులను దోచుకోవడం కావచ్చు; శత్రువ్యూహం కావచ్చు; మిత్ర ద్రోహం కావచ్చు; స్వార్థంకావచ్చు. సామ్రాజ్యవాదం కావచ్చు: వేదన కావచ్చు; వేర్పాటు ధోరణి కావచ్చు; అనైకమత్యం కావచ్చు; అవినీతి కావచ్చు; హింస కావచ్చు: రక్తపాతం కావచ్చు-ఇలా ఏకాలంలో ఏప్రాంతంలో ఏవిధంగా తిమిరం తీండ్రించినా దానితో సమరంచేయడమే కాంతికిరణానికి లక్షణం! ఈ కాంతికిరణం కలంలో మొలవ్వచ్చు, కరవాలంలో మోహరింపవచ్చు: ఒక్కొక్కసారి రెండూ కలిసి కాంతికనాటం తెరవచ్చు. అయితే కలాన్నీ కరవాలాన్నీ కదిలించేది మానవుడు. కదిలించిన ఆరెండూ మనిషినే బలితీసుకోరాదు. మనిషిని మరిచిపోయిన మహాసమరం కూడా తిమిరమే. ఆ తిమి రాన్నుంచి దూరం కావాలని విశ్వాత్మ ఘోషిస్తున్నది. చరిత్రలో దాని అడుగుల చప్పుడు వినపడుతున్నది. దాశరథికవితలో ఆ ధ్వని వినిపిస్తోంది. ‘మానవత్వం గెలుస్తుంది; దానవత్వం ఓడుతున్నది। అవనిలో హృదయాలరోగం, అంధకారం వీడుతున్నది’. ఇటీవలి వియత్నాం, బంగ్లాదేశ్ ప్రజలవిజయాలు ఆ సత్యాన్ని ఘోషిస్తున్నవి.
దాశరథి ఆవేశానికి ఆలోచనాలోచనాలు తెరిపించారు. తమ రెండవ సంపుటిలో సేవాధ్యక్షుడుగా సంఘం మొగదం నించొని శాంతి విప్లవ ఆదేశాన్నీ సాయుధ విప్లవ ప్రతిఘటనాన్నీ ప్రబోధిస్తాడు దాశరథి. పాదొరచయితల నుద్దేశించి, “ఆశాంతినీ, అరాచకాన్నీ, అన్నిదిశల వ్యాపింపచేసే ఆ విషహృదయాల పై, దాడిచేయండి గళా లతో, ఆ విషవలయాలను దండించండి కలాలతో” అని నిర్దేశిస్తూ “మాకర్తవ్యం మీరు నిర్వహించండి, లోకానికి నిజం తెలియచెప్పండి’ అని ధర్మగీతను ఉద్బోధిస్తాడు. “హంసనుండి సమసమాజహంస ఉద్భవించుననే, అసత్యాన్ని నమ్మకు హంతకుడవు కాటో’కని హెచ్చరిస్తాడు యువశక్తిని. ‘నిన్ను నీవు తెలుసుకొని, నీ కన్నులు తెరు చుకొని, విజృంభించినప్పుడే విప్లవమని నేనంటా”నని తాను నమ్మిన సత్యాన్ని నిర్మొగమాటంగా ఉదోషించాడు. నిరాళా దురాశలు నిరంతరం దాడిచేస్తున్న ఈనాడు దాశరథి నిస్సందేహంగా నిలిచిన ఆశావాది. ఆయన దర్శించే భవిష్యత్తు మానవతా కేతనం. ‘నవకవితా పతాకతో, యువతా శశిరేఖతో అజ్ఞానాంధకారాన్ని అణగిస్తూ, అమాయకుల ఆక్రందనను తొలగిస్తూ, పదవీదాహదావానరాన్ని చల్లారుస్తూ, అవకాశవాద పిశాచాన్ని హతమారుస్తూ, అపరిపక్వమైన విప్లవాండాన్ని అవియించ జూచే వినతల్ని అనాదరిస్తూ, కాలాచక్రాన్ని వెనక్కి తిప్పాలని కడు ప్రయత్నంచేసే కాలాంతకుల్ని కాలరాస్తూ, రావాలి భవిష్యత్తని భావిని ఆహ్వానించాడు. విప్లవనినాదాలు చేసే వీరావేశపరుల్ని చూచి అధిక్షేపిస్తూ వారి సమస్యకు పరిష్కారం చెప్పాడు.
“వీరంగం వేస్తుంటేరాదు విప్లవం-తారంగం పాడుతుంటే రాదు సమరథం అందుకోసమే నేనంటాను ఏ లేహ్యం తిన్నాగాని రాదు యౌవనం “రక్తం నదులై పారకపోతే రాదా రెవల్యూషన్? బుర్రలు బుర్రలు పగులక సమస్యకు లేదా సొల్యూషన్ ? హింసా, యుద్ధం ఔట్ డేటెడ్ అని నేనంటాను, శాంతి ఒక్కటే మానవజాతికి సరియగు సాల్వేషన్ !
దాశరథి బోధించే మహావిప్లవం మానవత్వం తో ముందుకునడిచే క్రాంతిపథం. శాంతి దానికి మూలసూత్రం. ఆ శాంతిపాఠం గాంధీగారిచ్చిన అమరసందేశం. ధరిత్రికంతా. గాంధేయ ధర్మమే తరుణోపాయమని దాశరథి విశ్వాసం.
“ప్రతి యెదలో మహాత్ముడే ప్రతిష్ఠితుడు కావాలి అతని అడుగుజాడలందు- అఖిలజగం నడవాలి నేటి క్లిష్ట సమస్యలకు సూటి జవా బతడు నేటి అస్థిరత్వమునకు – మేటి సవా లతడు అత డొకడే ఈ జగతికి ఆశాజ్యోతి అతండే ఈ కవిగళమున- ఆనందగీతి!”
ఈ గాంధేయ విప్లవవాది విప్లవం హింసతోకంటె ప్రేమతోనూ, త్యాగంతోనూ సాధించ వచ్చునని నమ్ముతాడు. విప్లవవాది కిందుకనే తననిర్వచనం చెప్పాడుదాశరథి “విప్లవమంటే అర్థం తెలియనివారికి పిస్తోలు పట్టినవాడే విప్లవవాది, విప్లవం అంటే అర్థం తెలిసిన వారికి పిస్తోలుకు గురియైనవాడే వివవాది!”
మార్గకవుల్లో దేశకవిలాగా విప్లవవాదుల్లో దాశరథి జాతీయవాది. తాను పుట్టిన మట్టికి మన్నికతెచ్చే మహావిప్లవం రావాలంటా డాయన. ‘ఏదో ఒకదేశంలో ఏదో అయితే, అలాగే మనదేశంలో అవారిని అనకండ’ని సాయుధ ప్లవాదుల్ని సాధి స్తాడు. విదేశీ విద్యావిధాలను విద్యార్థులమీద పులిమినట్లు విదేశీయ విప్లవాలను స్వదే శంలో దేశకాల పాత్రాలను గమనించకుండా ప్రయోగించవద్దంటాడు దాశరథి.
విప్లవయజ్ఞానికి త్రేతాగ్ని సంపుటిగా మూడు సమాజకక్తుల్ని గుర్తించా డాయన.
“నేను త్రేతాగ్నిలో ఒక అగ్నిని కర్షక కార్మిక కవిశ క్తులు కలసి, వెరసి త్రేతాగ్ని అనుకునేవాణ్ణి. ఈనగ్నోద్విగ్న త్రేతాగ్నికి నవసమాజ నిర్మాణ ధర్మకర్మనిష్టాపర అనేకానేక మహా ప్రజాహృదయ రుధిరధార అజ్యధార”!
పరానుకరణం దాశరథికి గిట్టదు. స్వదేశాభిమానం ఆయనలో చావలేదు. అందువల్లనే ఈ మార్గం ఆయన తొక్కాడు.
“అమ్మా! భారతీ! నేను మరోదేశాన్ని అనుసరించి, అనుకరించి అడుగు ముందుకు వేయలేను”
అని మాతృభూమికి నివేదించాడు. ప్రజాస్వామ్యవ్యవస్థలో శాంతివిప్లవమే ప్రయోజనాత్మకమని దాశరథి సందేశం! ఆధునికాంధ్రసాహిత్యంలో ఆయన కవిత జాతి కందించిన శాంతిగీత
3
ఆంధ్రులనూ అనై కమత్యాన్నీ కలిపి చదువుతుంటారు చాలమంది. ఐకమత్యం ఉంటే ఆఖిఁ భారతంలో అగ్రతాంబూలం వారిదే అని ఆశాగీతాన్ని అలపిస్తుంటారు. అందరూ! అన్ని వేళలా ఆశల్ని నిరాశలు చెయ్యలేదు ఆంధ్రులు. ఆంధ్రులు ఆవస రాలకోసం అలజడులు రేపుకున్నా అఖరికి అన్నదమ్ముల్లా ఉండటానికి అంగీకరిస్తారు. అంగీకారానికి అవధులు పెట్ట కోకపోయినా అన్నమాట కాదనకూడదనే ఆచారాన్ని గౌరవిస్తారు.
భాషారాష్ట్ర ప్రాతిపదిక మీద ఆంధ్రరాష్టోద్యమాన్ని నడిపిన వారాంధ్రులు. నాలుగుదశాబ్దాల పోరాటానికి ఫలంగా పొట్టి శ్రీరాముల ఆత్మార్పణ మూలంగా ఆంధ్ర రాష్ట్రం వచ్చింది. నాల్గు చెరగుల తెలుగు బిడ్డలు వెల్లురేకల్లా కలిసి వెలగాలని విశా
లాంధ్ర ఉద్యమం మోసులె తింది. అవగాహన ప్రాతిపదికగా ఆంధ్రప్రదేశ్ అవత రించింది. ఆంధ్రుల చిరకాల వాంఛితం ఫలించింది.
ఈ ఫలం ఒక్క రోజున ఊడిపడింది కాదు; ఒక్క రెవరో పండించింది కాదు. అయినా తెలంగాణం అంధరాష్ట్రంలో కలియటానికి ఎన్నో తికమకలు పుట్టాయి. భావ సమైక్యానికి అవకాశాలు లేని ఆ రోజుల్లో తెలంగాణా నాయకులతోపాటు, కవులు కూడా తెలుగుప్రజలకు ‘కలిసి ఉంటే కలదు సుఖ’ మన్న ప్రబోధాన్ని వాడవాడలా వినిపించాలని వచ్చింది. సాహిత్యరంగంలో తెలంగాణారచయితల సంఘం ఆ పాత్రను సమర్థవంతంగా నిర్వహించింది.
తెలంగాణా రచయితల సంఘానికి రూపకల్పన చేసిన ప్రధాన శిల్పి శ్రీ దాశరథి, విశాలాంధ్ర భావానికి కవితాకల్పకాన్ని సృష్టించిన మనీషి దాశరథి. కాళోజీ, దేవులపల్లి, వానమామలై, రామరాజు, నారాయణరెడ్డి, వట్టికోట, పల్లాదుర్గయ్య ప్రభృతులను చేరదీసి తెలంగాణంలో నిర్విరామంగా పర్యటించి కవితాగానాలు చేసి, సాహితీ చైతన్యాన్ని కల్పించటంతో పాటు, రాష్ట్రసమైక్యభావాన్ని ప్రబోధించాడు దాశరథి. తీరాంధ్రంలో నవ్యసాహిత్య పరిషత్తుపడాన దేవులపల్లి కృష్ణశాస్త్రి ప్రభృతులు నిర్వ హించిన సాహితీయజ్ఞం లాంటిదే తెలంగాణా రచయితల సంఘం చేసినకృషి. దాశరథి ‘మహాంధ్రోదయం’ విశాలాంధ్ర కెత్తిన స్వాగతగీతం.
దాశరథి పిలుపును ఆంధ్రదేశమంతా అందుకొన్నది. తెలుగు పత్రికలు పతాక శీర్షికల్లో, సంపాదకీయాల్లో దాశరథి పద్యాలను పేర్కొంటూ సమైక్యకంఠంతో సమగ్రాంధ్రను సమర్థించాయి. విశాలాంధ్ర కనుమేరలో కనిపించినప్పుడు దాశరథి క్షీరశరధిలా ఉప్పొంగి పోయాడు.
‘కోటిగొంతులు విచ్చి మేటి తెలంగాణ జోహారులను పల్క జొచ్చె నేడు: మంజు మంజీరాకుమారి రాజకుమారి వోలె నీటుగ తెల్గు పొంగు సూపె; వేకంబములగుడి ప్రిదిలిన తన గాథ
మరచిన కొత్తవెలుంగు పరచె దెసల: ఎనిమిదిమండలా లేకకంఠమ్మున తెలురాష్ట్రమునకు దివ్వెలె తె “మంగాళాత్రికమ్ముల పొంగిపోయె ఆంధ్రరాష్ట్రము వచ్చె; మహాంధ్రరాజ్య మేరుపడురోజు పొలిమేర జేరినిలరె నా తెలంగాణతల్లి ఆనందపడగ!”
తెలంగాణానికి ప్రతినిధి దాశరథి. ఆయన కవిత అంతా ఆత్మాశ్రయమే. ఆయన పలికిన పలుకులన్నీ ప్రణాకోటి ముక్తగీతాలే. విశాలాంధ్రావని అంతా దాశ రథి హృదయంలో ప్రతిధ్వనించింది. ఆయన ఒక్క తెలంగాణా కవిగానే కాదు తెలుగు వారందరి ఆత్మ తేజస్సులా ఆవిర్భవించాడు- ‘ఏది కాకతి? ఎవతి రుద్రమ? ఎవడు రాయలు? ఎవడు సింగనః అన్ని నేనే: అంత నేనే; వెలుగు నేనే; తెలుగు నేకే’ అని అఖండ తేజంలా ఆనందనాట్యం చేశాడు.
కలసి ఉన్న రాష్ట్రంలో కలతలు రేగి వేర్పాటు ఉద్యమాలు ప్రజ్వలించి తెలుగు నేల మరలా రెండు మూడు ముక్కలయ్యే విపత్తు సంభవించిన నాడు దాశరథి హృదయం దద్దరిల్లి పోయింది. తెలంగాణాకు కొత్త నిర్వచనం ఇచ్చాడు దాశరథి. అఖిలాంధ్రకు మారుపేరు కాదా అని ప్రశ్నించాడు.
‘కమ్మని నా తెలంగాణ. తొమ్మిది జిల్లాలేనా? బహుళాంధ్రకు తెలంగాణ, పర్యాయపదంకాదా?
(ఈ మాట దాశరథి అన్నప్పుడుండే విలువ మరెశరన్నాసాహిత్య జగత్తులో లేదేమో)
వేర్పాటు ధోరణిని మందలించాడు-
‘కుడికంటిని యెడమకన్ను పొడిచేనా? కుడిచేతిని యెడమచేయి నరికేనా? ఒక క దేహం ఒక గేహం – మరిచావా? ఒక్క తెలుగు-ఒక్క వెలుగు-మరిచావా?’
‘విడిపోవుట చెడిపోవుట విడిపోవుట పడిపోవుట కలసియుంట గెలుచుకొంట తెలుగువిలువ తెలుసుకొనుట! ‘గుండెను రెండుగ చీల్చే మొండితనం పనికి రాదు.
మనసుల నేకం చేసే మంచితనం కావాలి.’
సమైక్యవాదులు నాలుక కదపటానికి జంకిన రోజుల్లో సరాసరి ప్రజలను సంబోధించిన సాహసికుడు దాశరథి. ‘ఒక్క తెలుగు-ఒక్క వెలుగు’ అన్నది ఆయన నినాదం. ‘తెలుగుజాతి ఒక్కటి; భరతజాతి ఒక్కటి, ప్రపంచమే ఒక్కటి, శశి బింబం ఒక్కటి, రవిబింబం ఒక్కటి, నవఁబకు ఒక్కటి, మనమంతా ఒక్కటి;’ అని చాటి చెప్పాడు దాశరథి. సూర్యచంద్రులున్నంతవరకూ తెలుగుజాతి ఏక సూత్రంపై నిలవాలని ఆయన ఆకాంక్షః ఐక్యతకోసం ప్రాణాలనైనా బలిదానం చేస్తా నన్నాడాయన. తెలుగువారు మరలా ఒక్కటై నిలచిననాడు తెలుగుతల్లి పాదాలను ఆనందాశ్రువులతో అభిషేకించాడు దాశరథి.
‘తల్లి!నిను ముక్క లొనరింప దలచువారి ఆశ అడియాసలై యున్న అవసరాన నీపదమ్ములపై తలమోపి నేడు చిందుచుంటి ఆనందాశ్రు బిందువులను.
మహాంధ్రోదయ గాథతో ఈ మహాకవిచరిత్ర ముడిపడి శ్రీనాథుల తరువాత తెలుగు దేశాన్ని ఇంతగా ప్రేమించిన కవిలేడు. ఉంది, తిక్కన
4
అంగారం, శృంగారం దాశరథి రచనలో కలసి ఉంటాయని శ్రీ రామ లింగంగారన్నారు. శృంగార వీర రసాలు కలగలిసి తనలో పెల్లుబికేవని దాశరథిగారూ ఒప్పుకున్నారు. దాశరథిగారి ఈ ఉదంతం వినండి నెల్లికుదురు (మానుకోట తాలూకా) గ్రామంలో పోలీసు స్టేషనునుంచి తప్పించుకొని అడివిలోపడి పరుగెత్తినప్పుడు గుఱ్ఱాలమీద నలభై మంది సైనికులు నన్ను వెదుకుతూ వెంటాడుకున్నప్పుడు, క్షణం ఆగకుండా ఆరణ్యంలో పరుగెత్తుతుంటే ఎక్కడో పది గుడిసెలు, చిన్నపల్లె అక్కడ కాస్త సేపు ఆగి మంచినీళ్ళు అడిగితే ఆప్యాయంగా గళాసులో నీళ్ళు అందించిన రైతుపిల్ల ఒయ్యారం, ఆమె కళ్ళలోని అమాయకత నన్ను మైమరపించాయి. జైల్లో కిటికీలోంచి చూస్తే బయట మామిడికొమ్మ చిగిర్చి, పూలుపూస్తే లక్ష ఉగాదులు ఒక్కసారి హృదయంలో దూకినట్లుండేది: దాశరథి ఎంతటి సాహసవీరుడో అంతటి సహృదయ రసికుడు. ‘శృంగారీ చేత్ కవిః కావ్యేజాతం రసమయం జగత్’ అంటాడు అనంద వర్ధనుడు, శృంగారి అంటే తాముకుడని భావంకాదు. ప్ర్రాణమైన ప్రకృతి సౌందర్యాన్ని రసికచిత్తంతో ఆరాధించగలిగే చిత్తవృతిగలవాడని తాత్పర్యం. భోజుడు పరోక్షంగా దీనినే అహంకారమని అదే శృంగారస్థాయి అని తన శృంగార రస సమీ కరణ సిద్ధాంతంలో ప్రతిపాదించాడు. గాఢమైన ప్రేమ ఉంటే సహృదయుడు. సౌందర్య రసా సాధనతో కూడిన ప్రేముముంటే సత్కవి; సత్కవిగా, వీరుడుగా వెలుగొందే కవి మహాకవి దాశరథి
దాశరథిలో ధర్మవీరం స్థాయి. శృంగారం హేల. మాతృభూమిపై శత్రువు దాడిచేసినప్పుడు ఆయన సైనికుడౌతాడు. పెన్ జేబులో పెట్టి గన్ చేతపడతాడు. భారతదేశంమీద పాకిస్తాన్ దాడిచేసినపుడు దాశరథిలో దేశాభిమానం ఉవ్వెత్తుగా లేచింది.
‘కత్తికంటె కలంగొప్ప దన్నమాట కల్లకాకపోవచ్చును గాని కలంబలం తెలియని కరకురక్కసికి కలంనాల్క చిల్కపల్కులు వినలేని చెవిటికి…
నెత్తురు తాగి జీవించే నిర్దయుడికి మర్దనం ఒక్కటే మహౌషధం!
అందుకే తాత్కాలికంగా పెన్ను జేబులో పెట్టి- గన్ను చేత పట్టాను. ఏం చేయను ?
ఎంత శాంతించినా తప్పలేదు కొన్ని మాటలు వినటానికి వీణపలుకులు అవి ఆచరణలో ఇనుపములుకులు.
దాశరథి దేశభక్తి శత్రువు మీద రౌద్రోద్రేకాన్ని ప్రకటింప చేసింది, సహనశీలిలో పుట్టే వీరంగాని, రౌద్రంగాని శక్తిమంతంగా ఉంటుంది. దౌర్జన్యానికి తలవంచటం సహనం కాదు; శత్రువువల్ల కలిగిన వగను సహించటం సహనం కాదు; దౌర్జన్యంలోని దౌష్ట్యాన్ని సౌజన్యంతో తొలగించటం సహనం, సామం పనిచేయకపోతే సాహసం తోనైనా ఆత్మగౌరవాన్ని కాపాడుకోవటం సహనం; సహనం సమర్ధులకు పిరికిమందు కాదు; అవసరమైతే పగవారిగుండెల్లో నెగలు కమ్మించే మందుగుండు; రణపాఠం పఠించినా దానికి ఫలం పగవాడికి గుణపాఠం. సహనం ప్రాణాలను చలికోరదు.
పరులలో పరిణామాన్ని కోరుతుంది. మనిషిలోని పశువును చంపి పరమాత్మను ప్రబోధిస్తుంది; ఆధర్మాన్ని శిక్షించి ధర్మాన్ని రక్షిస్తుంది. దాశరథి వీరం మాన వత్వాన్ని వీడని మహాగ్ని జ్వాల.
ప్రపంచంలో మానవత కెక్కడ విజయం లభించినా దాశరథి తన విజయంగా భావించి పరవశిస్తాడు. బంగ్లాదేశ్ విజయానికి పరమహర్షం వెలిబుచ్చాడు. దక్షిణ వియత్నాం వికాసానికి దరహాసం చిందించాడు; మిసిసిపీ విశ్వవిద్యాలయంలోని తొలి నీగ్రో పట్టభద్రుడు – జేమ్స్ మెరిరిత్కు నీలిరవ్వను కానుకగా పంపాడు. దాశరథికి నీగ్రో నీలమేఘశ్యాముడుగా కనిపిస్తాడు పోతన్న కృష్ణుణ్ణి కీర్తించినట్లే దాశరథి అతణ్ణి వర్ణిస్తాడు –
‘నల్లనివాడ, జ్ఞాన నయమ్ములవాడ! మనస్సులో పలన్ తెల్లనివాడ, హింసను వధించిన నల్లనివాడ! శాంతి పై జల్లినవాడ, తెల్లని విషమ్మునకున్ విరుగైన వాడ! నా ఉల్లములోని వాడ! పదవోయి విశాల విభాపథాలవై.’ 3
నలిగిన నల్లవాడు: వెలిగే తెల్లవానిపై సాగించే స్వాతంత్ర్య సమరం దాశరథి కవి త్వానికి ధర్మతేజం :
పోతన భక్తికి శృంగారం ఎలాశక్తి నిచ్చిందో దాశరథి వీరానికి శృంగారం అలారక్తి నిస్తుంది. అంగారం శృంగారంలో మండుతున్నప్పుడు హిమజ్వాల ప్రజ్వ లించి నట్లుంటుంది. దాశరథి శృంగార రసపోషణలో తరుణ హిమజ్వాల:
‘నా చెవులలోన రుధిరవీణాకఠోర ఘోర ఝంకార మేల డాగుకొన జూచె నో? నిళాహిమానీ తరుణీ నితంబ లంబి వేణిక నగ్నిపుష్పంబు లేలనో!
అని దాశరథి ఆత్మావలోకనం చేసుకున్నాడు అగ్నిధారలోనే. దాశరథి శృంగార ఖండికలు అగ్నిపుష్పాలు,
దాశరథికి మోదుగు పూలంటే మహాయిష్టం. వాటిని అగ్నిపుష్పాలుగా భావిస్తా డాయన. ఆయన చిత్తవృత్తికి ప్రతిబింబం అసలాశపుష్పంలో కనపడుతుంది.
ఆయా కావ్యాల్లో ఎక్కడ చూచినా-
“అగ్నిజ్వాలిక వోలిక నగ్నముగా నాట్యమాడు నవవాసంతో ద్విగ్న పలాశ ప్రసవా లగ్న పాలక్త ర క్తరమ కనుపించెన్.”
దాశరథి శిశిరాన్ని సైతం శృంగారమయం చేసిన ధీమంతుడు.
‘ఆకులు రాలిపోయె, దెస లన్నిట చీరెలు జారిపోయె, న గ్నకృతయై మహాప్రకృతి నేలకు మోమును వాల్చె దుష్ట వా కులమై శరీరము, హృదంతర మంతయు బీటలెత్తె; బా లా! కటిపోక ముళ్లు విడలాగెద శైశిరకాలధర్మగా.’
ఈయన ఋతుషట్కంలో అంతస్సూత్రం వసంతం. ప్రకృతిలోని ప్రణయరహస్యం ఆయన శృంగార రస పారవశ్యం!
‘గుమగుమలాడి నా మనసుగొన్న నవాబ్దసఖీ ముఖానురా గమున సుమించె చంపకము; కౌగిలిలో ప్రసవించె గోరటల్ సుమరమణీయమై తగె నశోకము తచ్చరణాహతిన్: ప్రహా సమున సుమించె పొన్నలు: పసందగు నందన దివ్యవాటిలో.’
కవిసమయాలతో కవిప్రతిభ శృంగారావతారాన్ని తాల్చిందీ పద్యంలో. విశాలాంధ్రో దయ భానుబింబాన్ని దర్శించిన దాశరథి శృంగారరసోన్ని ద్రుడై ఇలావర్ణించాడు –
‘తరుణీ సుందర దంతఘట్టన లసత్ తాంబూల రాగప్రభా స్పురణీయాధర బింబమట్టు లదిగో సూర్యుండు, ప్రాచీధరా ధరకూటమ్ము పయిన్ పదమ్ములిడి సౌందర్యమ్ము చేకూర్చె ను ర్వరకున్; నిద్దురలెండు తెల్గుజనులారా! సుప్రభాతం బిదే!
వీరానికి శృంగారాన్ని విభావంగా నిలిపే శిల్పం దాశరథి కవితకు ఉగ్గుతోవచ్చిన విద్దె. సూర్యోదయంతోపాటు చంద్రోదయం కూడా అంతే.
‘వచ్చిన వాడు చంద్రముడు; పాలసముద్రపు మూలనుండి గో ర్వెచ్చని మీఁగడల్ మెసవి రేజవరాలి నరాలబుగ్గలన్ గిచ్చి, నవారుణాస్ర మొలికించుచు తూరుపులోన కాగడా తెచ్చెవొ ఆరకాసి జిగి దేరిన వెన్నెలజ్వాల లెత్తగా-‘
వీరావతారుడై న వివ్వచ్చుని ప్రవేశాన్ని సూచించే పద్యపు ఎత్తుగడః కాని, వర్ణన చల్లని వెన్నెల తేని రాకడ: చల్లనివాడైనా తెచ్చింది వెన్నె లజ్వాల
దాశరథి శృంగార రచనలకు భారతి పరవశించి ఇలా పలికినట్లున్నది:
“నరకానన్ బడి క్రుంగుచున్న నను గంధర్వాప్సరః కామినీ తరుణస్వాదు నవోపగూహన పథాంతర్వర్తిగా జేసి, దు ర్భర దారిద్య్రం పిశాచినీ రుధిరధారా క్రూర దంష్టాప్రఘా తరిరంసా పరిభిన్నతన్ మరపు నొందంజేతువోయీ కవీ!”
5
ఆధునికాంధ్ర సాహిత్యోద్యానవనంలో ఉర్దూ పారసీక కవితా సౌరభాలను వెదజల్లే వింత కావ్యలతలను పుష్పింపచేసిన నవవసంతుడు దాశరథి. ఆయన కవితా పుష్పకం, గాలిబ్ గీతాలు తెలుగులో ఆయన పెంచినపూలతోటు అందులో అంద మైన గులాబీలు ఉన్నవి; వాటిక్రింద వాడియైనముళ్లూ ఉన్న వి. ఉదధిలా పొంగేవిరహమూ ఉంది; మనసును మైమరపించే మధువూ ఉన్నది; మగువ రేపే మంటలూ ఉన్నవి; మనసుపడే బాధ ఉన్నది. వేదనలో నుండి వెలువడ్డ కవిత గాలిన్ది. ప్రేమ, సూఫీ తత్వం అంతర్ణయాగా సాగినా జీవితసారాన్ని వడియగట్టిన రసాయనం ఆయన కవిత, దాశరథి గాలిబ్ గజళ్లను తెలుగుకు పరిచయం చేశాడు. కవితాపుష్పకంలో మీర్, జఫర్ (బహద్దర్) లాంటి మహాకవుల అనువాదా లున్నాయి. రవీంద్రకవీంద్రుని గీతాలనూ కొన్ని అనువాదం చేశాడు. దాశరథి. మొత్తానికి దాశరథి శృంగార కవిత తెలుగుశిల్పి నిర్మించిన మధుశాలః
అందులో అడుగిడిన ప్రతి రసికుడూ
‘అందగత్తెల సాహసచర్యమ్మునందు కొద్దినాళులు గడిపిన గూడ చాలు ఘోరనిస్సార సంసార కుండమందు శతయుగమ్ములు జీవించ జాలుకంటే!’
నని భావిసాడు. కాని కొంత కొంత లోతుకు దిగిం తరువాత మధువులోని, వధువు లోని మాధుర్య సౌందర్యాలతో పాటు బాధలోని, బ్రతుకు లోని పరమార్థాన్ని కూడా తెలుసు కుంటాడు. ఈ రెండు గీతాల్లో ఆ రెండు అంచులు కనపడతాయి.
“జాబిలి అందం, చెలిఅందం- సరితూచా లనుకున్నాను షరాబువద్దకు వెళ్ళాను. తరాజులోపల వుంచాను-జాబిలి ఉండిన పళ్ళెరము- చప్పున చేరెను ఆకసము అందాలొలకే చెలిమోము- అవని నిలిచె నాకోసరము.”
జాబిలికంటె దెలి మోము అందం’ అన్న తాత్పర్యాన్ని గాథగా, వక్రోక్తి సుందరంగా చెప్పి రక్తిని పొంగించిన దాశరథి కలంనుంచే
“నీవు పుట్టిననాటి రోదన నీకు జ్ఞాపక మున్నదా? నీదుబందుగులెల్ల నవ్వుట – నీకు జ్ఞాపక మున్నదా? అట్టులే నీ అంత్యసమయ మ్మందు అందరు ఏడ్వగా నీవు నవ్వులలోన తేలుట – నేర్చుకొనరా సోదరా!”
అన్న తత్వ గీతం జాలువారి నప్పుడు రక్త విరక్తుల వ్యత్యాసాన్ని చూడగలం. జీవితం లోని ఉభయ సంధ్యలను ఉద్విగ్నంగా చిత్రించే ఉర్దూ కవితా పరిమళం దాశరథి కవితాభారతి కిచ్చిన కాంతి పరివేషంః
శృంగారరసాన్ని భోగదృష్టితో పోషించే విధం వేరు: తత్వదృష్టితో ఉపాసించే పద్ధతి వేరు. భావుకుడైన దాశరథి ప్రణయ మూర్తిపై వలపును వచరిం చే పద్యాలల్లినాడు. కాని ఆ మూర్తి భౌతిక మూర్తి కాదు. భౌతికాకృతి నందిన ప్రణయ తత్వం. అందులో అన్వేషణ, ఆవేదన, ఆరాధన, ఆస్వాదనావస్థలు కాసింప వచ్చును, విప్రలంభ, వియోగావస్థలు వెలుగొంద వచ్చును, సాత్విక తాత్వికావస్థలు రూపొందవచ్చును, వీనిలో ఉత్తరోత్తరాలు బలీయాలు, దాశరథి శృంగారకవిత ప్రణయమూర్తి సాత్విక రక్తిని సాక్షాత్కరింప చేస్తుంది. సాత్విక మనోవృత్తి నుండి తాత్విక రేఖను వ్యంగ్యంగా మెరిపించటం దాశరథి కళా రహస్యం. దాశరథి కవితలో స్త్రీ ప్రతీక మాత్రమే. ఆయనకు శాంతి, క్రాంతి, ఉగాది, పయోధి, హేమం తం, లతాంతం, మోదుగు, గానుగు, ఇరులు, ఝురులు అన్నీ స్త్రీలుగా సాక్షా త్కరిస్తాయి.
‘పూలను ముద్దు పెట్టుకొని, ముండ్లను వద్దనబోకు నీవు, నీ కేలటు తాకినంత పులకింపవె కంటకముల్ సుమమ్ములై నీలనిళా శిరోజముల నిండు శశాంకుని చెండు చెక్కగా జాలిన ముఖాంబుజము చాలు అమాసయె పౌర్ణమాసిగాన్’
అవి శాంతిని సంబోదిస్తున్నప్పుడు సుఖ దుఃఖాలలో కవి శాంతికోసం చేస్తున్న అన్వేషణ తత్వగంభీరంగా కనపడుతుంది. దాశరధి ప్రకృతిని మధురంగా దర్శిస్తాడు. మాధుర్యం వెనుక మంటలాంటి సత్యాన్ని స్వాయత్తం చేసుకుంటాడు. ప్రణయంలో ఆత్మ పరిశోధన దాశరథి శృంగార కవితా తత్వం
“ఆమె నన్ను చూడగానె అంతరించి ఆవేదన; అగిపోయె పెనురోదన సాగె హృదయ పరిశోధన!”
6
“మంచి కవిత్వం ఏభాషలో ఉంటే అదే నాభాష మంచికవి ఎవరైతే అతడు నామిత్రుడు నాకు ఉరుదూ, తెలుగూ రెండు కళ్లు ఈ రెండుకళ్ళతో అన్ని భాషలనీ చదవగలను హృదయం ఒకటైతే లోకమంతా ఒకటి.”
తెలంగాణంలో పుట్టిన దాశరథికి తెలుగూ ఉరుదూ రావటం అబ్బురం కాదు; అధునిక యుగంలో నివసిస్తున్నందుకు ఆంగ్లం రావటంలో ఆశ్చర్యం లేదు, సంస్కార వంతమైన కుటుంబంలో పుట్టి సంస్కృతభాషాపాండిత్యం గడించటం గొప్పతనం కాదు. ‘మంచి కవిత్వం ఏ భాషలో ఉందే అదే నా భాష’ అనే విశాలదృక్పథం ఏర్పడటం విశేషం. ఆధునిక మహాకవి కుండవలసిన మహానీయ గుణాల్లో ఇది మొదటిది.
దాశరథి హృదయవాది. అనుభూతియే అర్థవంతమైన భాషఆయనకు. లోకంలో హృదయవాదులు రెండురకాలు. ఒకరు అనుభూతితో ఆర్థులై కరిగిపోతారు. మరొకరు అనుభూతిని ఆత్మప్రత్యయంతో ఆవిష్కరిస్తారు. మొదటివారు సహృదయు లౌతారు. రెండవవారు సత్కవు లౌతారు. హృదయవాదులకు భిన్నులు రీతివాదులు. వీరికి అను భూతి కంటే ఆకృతివిలాసం హెచ్చు. వీరికంటె మరియొకరు అలంకారవాదులు. వారి కాకృతి విలాసం కంటే అలంకార భేషజం అధికం. అనుభూతి వాదులు శబ్దశక్తిని ఉపాసిస్తే, రీతివాదులు శబ్దరచనను సేవిస్తారు. అలంకారవాదులు శబ్ద చమత్కా రాన్ని సాధిస్తారు. చమత్కారం వల్ల హృదయం వికసిస్తుంది. రచనా సౌందర్యంవల్ల హృదయం రమిస్తుంది: ఆర్థప్రసాదం వల్ల హృదయం ద్రవిస్తుంది.
దాశరథికి హృదయ మెంత ఉందో అభిమాను అంత ఉంది. ఆయన పసివాడి వలె నవ్వగలడు; ప్రౌఢునివలె పలకగలడు. మనస్విగా అనుభవించి, ఓజస్విగా పలుకగలడు. ఈరెండు లక్షణాలు జంట కుదరటం కష్టం. దాశరథి రచనలో ఓజస్సు తేజస్సును వెలిగ్రక్కుతుంది; పలుకులోని వాడిదనం భావంలోని వేడిదనాన్ని పరవళ్ళు త్రొక్కిస్తుంది; గతిలో అదనెరిగి పదును, కదను పదంకలుపుతూ నడక సాగి స్తుంటవి. పద్యంగాని, గేయంకానీ, వచన గీతంకానీ, దాశరథిహృదయంలో ఉవ్వె త్తుగా లేచిన ఒక ‘మూడ్’ను ముమ్మూర్తులా సాక్షాత్కరింప చేస్తుంది. ‘మూడ్’ను ‘భావావేశం’తో అంటున్నాను. భావగతికి అనుగుణంగా వృత్తగతి, గేయగతి, వచన చరణ విన్యాసం వింత సోయగాలు పోతాయి. పద్యంలో శైలినీ, గేయంలో గతినీ,వచన కవిత్వంలోని అంతర్ణయనూ శాసించేది భావావేశమే. భావావేశంలో పదాడంబరాన్ని ప్రదర్శిస్తారు కొందరు, విశిష్టపదరచనా విన్యాసంతో కూడిన ప్రౌఢిని చూపిస్తారు. కొందరు. అనుప్రాసక్రీడలతో శ్రవణానందాన్ని సాధిస్తారు కొందరు; అలవోకగావచ్చే శబ్దార్థాలంకార శిల్పంతో రచనను అలంకరిస్తారు కొందరు. దాశరథి రచనలో భావా వేళంవల్ల అలవోకగా సాగివచ్చే పదరచనాప్రౌఢి కనవస్తుంది ప్రౌఢి సమాసరచనలోనే ఉంటుందను కుంటారు. అది నిజం కాదేమో! భావాభివ్యక్తికీ, భావావేశానికి తగిన పద బంధాలను సంవిధానం చేయటంలోనే అది ప్రత్యక్ష మౌతుంది. పదబంధం తెలుగు జాతీయాన్ని ఒలకబోయవచ్చు. సమాన సంగ్రథనాన్ని సాధింపవచ్చు; అంటే వాటిని భావావేశాభివ్యక్తికి బహిస్సాధనంగా ఉపయోగించుకునే నేర్చే ప్రౌఢి అన్నవ మాటల్లో మరులు కొల్పే లక్షణం, అభివ్యక్తిలో ప్రౌడిని ప్రదర్శించే ప్రాభవం దాశరథి కవితకు సహజాలంకారాలు. దాశరథి మనిషిగా జీవిస్తూ మనీషిగా, మహాకవిగా కాబ్యా లను రచిస్తాడు. ఆయన ‘బాల్యం’ మనిషిగా స్పందించే ఆయన మనస్సుకు వ్యాఖ్యానం.
“అస్మదంతరంగ వర్తి – చాలుడు అతన్ని ఆనందరూపుణ్ణిగా మలచి అఖండ బ్రహ్మాండంలో మానవుని జీవితంలో కొన్నేళ్ళ పాటు అమూల్య ఆనందాన్ని అందించే అమృతశక్తి- బాల్యం!”
దాశరథి ‘బాల్యం’ అమృత హృదయాన్ని ఆవిష్కరించిన గేయం. దాశరథి అమృత హృదయం అందులో అద్దంలో ప్రతిబింబింతా ప్రతిబింబిస్తుంది.
దాశరథి మేధను మనసుతో ఉపలాలిస్తాడు. మనసులేని మేధ మానవజాతిని మారణహోమం చేస్తుందని ఆయన మతం ‘మస్తిష్కంలో లేబొరేటరీ’ గేయం ఆయన మానవతా వాదానికీ, హృదయ వాదానికీ మచ్చుతునక .
“ఈ లెబొరేటరీలో కూచుని లోకం నిండా విరివిగా శాంతిపండే రీతిని కొత్తరకం విత్తనాల్ని కనిపెట్టే వీలున్నది. ఈ లేబొరేటరీలో కూచుని కలంపాళీ కొసల్లోంచి ఎంత బలం గల కవిత్వం సృష్టించవచ్చో!”
అని సూచిస్తాడు. విజ్ఞానం విశ్వశాంతికి విలువైన సాధనంగా భావిస్తాడు దాశరథి పలుకుల్లో పారుష్యంగానీ, సమాసాల కసరత్తులుగానీ, ప్రాసలకోసం అడియా నలుగానీ దాశరథి రచనల్లో ముఖ్యంగా వచనకవిత్వంలో – కనపడదు. తెలుగుదనంలో కనబడే వెలుగుదనం కవితనిండా కనిపిస్తుంది.
ఆధునికుల్లో దాశరథి ఉభయకవి మిత్రుడు. పద్యం పాతబడ్డ ప్రక్రియగా భావించి, ఛందఃపరిష్వంగాలను వదలి, గేయంలో, వచన గీతంలో ప్రజాశక్తిని సమర సన్నాహం చేసే అభ్యుదయరచయితలకు పద్యంలో సమరశంఖాన్ని వినిపించి, గేయంలో వైతాళిక గీతాన్ని ఆలపించి, వచనంలో విప్లవ సందేశాన్ని అందిస్తున్న దాశ రథి అభ్యుదయ కవుల్లో అతిరథు డనిపించుకున్నాడు. ప్రక్రియ యేదైనా పలికే శక్తిలో పటుత్వం అన్నది ఆయన కవిత సమకాలీన కవుల కిచ్చే సందేశం: పద్యరచ నలో తరతరాలుగా వస్తున్న నిలకడతనాన్ని తొలగించి పాదరసంలా పరుగెత్తే గుణాన్ని కల్పించాడు దాశరథి; పద్యధారకు వింతపదను పెట్టాడు దాశరథి, శబ్దం పద్యంలో ఇదివరకు నినదించేది దానికి నినాదం నేర్పాడు దాశరథి. గేయంలో గతి వేగంతో కదను త్రొక్కించే ప్రక్రియ ఒక వైపూ, ఆంగ్లశబ్దాల వింత శ్లేషలతో నవ్య ప్రయోగాలు చేసే చమత్కార వైఖరి మరియొకవైపూ, ఆ గహానికీ అధిక్షేసానికీ అను వైన ఆకృతిశిల్పాన్ని కల్పించే ఆధివాస్తవిక ధోరణి మరియొకవెపూ- కనపడుతుంటే గేయానికి కదను తగ్గించి పదనుచేశాడు; ప్రయోగాలను ప్రయోగాలకోసం కాకుండా ప్రయోజనంకోసం చేశాడు. ఆధివాస్తవికతకు ఔచిత్యాన్ని అలవరచాడు. వచన కవి తలో ఆకృతి శిల్పాన్ని ఆవేశానికి, ఆలోచకూ సవ్యసాచిగా ప్రయోగించాడు. ఈ విధంగా ఆధునిక రచనాప్రక్రియల్లో రెండంచుల కత్తిగా కవితను వాడుకున్న దాశరథి ‘ఉభయకావ్యప్రౌఢి పాటించు శిల్పమునన్’ పారగుడై నాడు.
దాశరథి మహాకావ్య రచనకు ఉపక్రమించ లేదు. ‘మహాబోధి’ని కథాకావ్యంగా చిత్రించి కావ్యరచనా సామర్థ్యం ఉందని చూపించాడు; ఆ కావ్యంలో త్రిశరణాల్లాగా ముచ్చటైన మూడు జాతక కథలున్నాయి. బుద్ధజయంతికి కానుకగా ఇచ్చిన పద్య కావ్యం కాని బుద్ధిపూర్వకంగా కావ్యనిర్మాణం చేయటానికి తలపెట్టిన కృతి కాదిది. వస్తువు నాశ్రయించి కావ్యం వ్రాసే ప్రవృత్తి దాశరథిలో తక్కువ, కవితను ఆత్మనా యకంగా వ్రాయడం ఆయన జీవితలక్షణం. వ్యక్తి గాతాను జీవించటానికి కవితాక్షేత్రాన్ని పాలించే స్వభావం ఆయనకు లేదు. తాను జీవిస్తున్న సమాజంకోసం, దాని బాధలనూ, దాని ధ్యేయాన్నీ తనదిగా భావించి ప్రబోధించే స్వభావం ఆయనకు అలవడింది. సమాజం అతివేగంగా ముందుకు సాగుతున్న రోజుల్లో స్థాయిగా సాంఘిక చిత్తవృత్తిని వ్యంజింప చేసే కావ్యరచనం సాధ్యంకాదేమో! అందువల్లనే ముత్తకకావ్యరచనం, ఖండకావ్య రచనం ఆయన కవితా వ్యవసాయంలో కమనీయ ఫలితాలుగా మన కందుతున్నాయి. దాశరథి ముక్తక రచనం మకుటాన్ని ధరించి దాశరథి ఉద్యమకవిత ఉప్పెనలా పొంగుతూ ఉంటే- పంటకాల్వలుగా కనపడేవి ఆయన శృంగార కవితలు, కుంటల్లో నిండిన నీరుగా కనపడేవి ఆయన సూక్తులూ, శతకాలూ, దాశరథి శతకం ఆయన లోకసూక్తి కబ్బిన సుధాకరం. లోక సత్యాలను నిర్మొగమాటంగానూ, వ్యంగ్య సుందరంగానూ, నర్మగర్భితంగానూ, రెప్పిన శతకంలో ‘సెటైర్’కు జీవంపోశాడు.
ఆరలు లేని హృదయం, అరమరలు లేని స్నేహం, స్వార్థంలేని సౌజన్యం దాశరథి వ్యక్తికి తరుగులేని సంపద. కులవర్గాలు లేని సమాజం, మతవైషమ్యాల్లేని మానవత ఆయన సమాజాని కిచ్చే సందేశం; విశ్వశాంతి ఆయన లక్ష్యం: కవిత్వం ఆయన జీవితం.
“నాకుల మెద్దియో యెరుగ నామత మెయ్యదియో యెఱుంగగా లేక దశాబ్దముల్ గడచె; లేళ్ళది యేళ్ళది రాళ్ళ దేకులం చా కులమే మదీయము, నరాళికి లేని విరాళి గుండెకున్ తాకగ వానిలో కలదు దాశరథీ! కరుణాపయోనిధీ!!
ఆధునిక సాహిత్యంలో విశ్వమానవ భావానికి దాశరథి కవిత ప్రతీక.
దాశరథి జాతీయకవి అనీ, ప్రజాకవి ఆనీ, ఉద్యమజీవిఆనీ, అభ్యుదయ కవిఆనీ, చై తన్య సారథి అనీ, సమవాదదీప స్తంభమనీ, భావుకుడనీ, ప్రజ్ఞలో త్రివిక్రముడనీ, సమ కాలీన విమర్శకులు ప్రశంసించారు. కేంద్ర రాష్ట్రసాహిత్య అకాడమీలు ఆయనకవితలకు బహుమానాలు అందజేశాయి. ఆంధ్ర విశ్వకళాపరిషత్తువారు ‘కళాప్రపూర్ణ’ బిరుదాన్ని ఇచ్చి గౌరవించారు. ఈ బిరుద సత్కారాలన్నీ ‘మహాకవి’గా దాశరథి గడించుకున్న ఖ్యాతికి మణిదీప తోరణాలే।
దాశరథి మహాకవిగా ఎంత మహోన్నతుడో- మనిషిగా అంత మంచివాడు. ఆయన నిలువెల్లా పొంగిన పాలమనసు. స్నేహానికి ప్రాణాన్నిచ్చే సిగ్ధమూర్తి. సాటివారి కష్టాలను చూచి కరిగిపోయే కరుణామయమూర్తి. ఆయన తెలుగువారి హృదయా లోనూ, కవితా విహాయాసంలోనూ, కలకాలం నిలిచే కళాప్రపూర్ణుడు.
-దాశరథి కవితాసౌధం ఒక పుష్పకవిమానం. ఎన్ని సంప్రదాయాలైనా, ఎన్ని కొత్తదనాలైనా అందులో ఇనుడగలవు; అది విప్లవాలను ఆహ్వానిస్తుంది, విశ్వశాంతిని ఉద్బోధిస్తుంది. అదుగో దాశరథి పిలుపు-
“ఈ కవితాసౌధం పుష్పక విమానం లాంటిది ఇందులో ఎందరు ప్రయాణించినా ఇంకా చోటుంటుంది అన్ని భాషల వారూ రండి మా పుష్పకవిమానంలో ఆనందలోకాలలోనికి సంచారం చేయడానికి వెళదాం. ఆ విమానం ఇక్కడే బయలు దేరుతుంది మంచి హృదయమే దానిలో ఎక్కడానికి అర్హతనిచ్చే టిక్కెట్టు డబ్బు అక్కరలేదు మాకు.
ఏకత్వం అనే పెట్రోలుతో ఎగురుతుంది ఈవిమానం. ఏకత్వం చెడిపోయిననాడు అదికూలుతుంది. కనుక ఏకంగా వుందాం… ఏకంగా విందాం కవిత ఏకంగా లోకాన్ని స్వర్గంచేసి విహరిద్దాం!”