అసలు పద్యాలెలా పుడతాయని కవుల్నడిగితే, ఏ నిజాయితీ పరుడయిన కవి చెప్పే సమాధానమే రఘు శేషభట్టర్ కొత్త కవితా సంపుటి అసంకల్పిత పద్యం. చెప్పుకోదగిన ఏ కవికయినా పద్యావిర్భావం అసంకల్పితంగానే జరుగుతుంది. ‘ఊరక కృతుల్ రచియింపుమటన్న శక్యమే’ అన్న పెద్దనకు ఆ క్షణానికి తొలి కదలికనిచ్చే వాక్యమో పదబంధమో దృశ్యచిత్రమో అప్పుడు దొరికి ఉండదు. ఉదయం లేచినది మొదలు మనకు ఇల్లూ ఆత్మీయులూ వస్తువులూ వీథీ ప్రకృతీ స్నేహితులూ ఆరాధ్యులు – వీళ్ళతోనే ఆలోచనలు నిండి ఉంటాయి. ఒక తాళం చెవి చూస్తే భోషాణప్పెట్టెలో ఉన్న పాత వస్తువుల జ్ఞాపకాలు. ఆత్మీయులు దరిజేరితే ప్రేమపూర్వకమైన పలకరింపులు. బయట స్నేహితులతోనూ, పెరట్లోనో వీథుల్లోనో చెట్టూ పుట్టా పువ్వూ మొగ్గా వీటితోనే మన అనుబంధాలు పెనవేసుకొని ఉంటాయి. ఈ దైనందిన జీవన పరిమళం కోసమే మనిషి నిద్ర లేచే సాహసం చేస్తాడు.
ఈ కవి సంస్కృతం చదువుకున్నాడు. శేషేంద్ర కవిత్వానికి చాలామందిలాగానే రఘు కూడా వీరాభిమాని. రఘు సమకాలీన అస్తిత్వవాద వామపక్ష భావజాలంలో కొట్టుకుపోయి డైలాగుల కవిత్వం రాయలేదు (నాకు అస్తిత్వవాదంతో పేచీ లేదు, డైలాగుల కవిత్వంతోనే పేచీ). రెండోది రఘు నిజాయితీగా రాశాడు. వాల్మీకివ్యాసకాళిదాసాదుల కవిత్వప్రభావమేనేమో ఈయన టెక్నిక్లేని కవిత్వాన్ని ఊహించలేడు. కవిత్వానికీ శుద్ధవచనానికీ భేదాలున్నాయి. వాటిని నిర్వచించలేం. అయితే, మన ప్రాచీనకవులను మొదలుకొని విశ్వనాథవారి వరకూ ఉన్న ఛందోకవిత్వంలో టెక్నిక్ అంటే తెగ ఇష్టపడే రఘు నుంచి, గొడ్డు వచనాన్ని కవిత్వంగా అమ్మజూపేవారిని ఈసడించుకునే రఘు నుంచి మనం ఎంతో ఆశించడం సహజం. రఘు ఎప్పట్నుంచో కవిత్వం రాస్తున్నాడు. లోగడ దిశాంతరస్వప్నాన్ని మనకోసం ప్రతిఫలించి ఇచ్చాడు. ఇందులో రఘు కవిగానేకాక, సామాజికుడిగా బాగా పరిచయం ఉన్న వ్యక్తిలా అంటే ఒక ఇంటివాడిగా మనకు కనిపిస్తాడు. ఈయన నిజాయితీగా రాస్తాడు అన్నది స్పష్టమే. కవికి నిజాయితీ అత్యవసరమని మొరపెట్టుకుని మొర్రోమన్న వారిలో నేనూ ఒకడిని. ఈ టెక్నిక్ అంటే అలంకారాలూ ఉపమలూ ఉత్ప్రేక్షలూ ఇటువంటి ఆభరణాలవల్లే ఓ రచన మంచి కవితై కూచోదు గానీ ఏ కవిత్వాంశ లేని వచనం గొడ్డువచనమై చతికిలబడుతుంది. ఈ అవగాహన మెండుగా ఉన్నవాడే రఘు.
ఉపమ, ఉత్ప్రేక్ష అనగానే రఘు కవిత్వం నిండా సంస్కృతసమాసభూయిష్ఠమయిన కవితలున్నాయనుకుంటే అది పొరపాటు. జానుతెలుగు పాలు ఎక్కువ, రఘు కవిత్వంలో. కవితకు వస్తువే ప్రధానమా లేదూ వ్యక్తీకరణే ప్రధానమా అంటే రెండూ తగు పాళ్ళలో జతకలిసి ఉండడమే ముఖ్యమని ఎవరైనా ఒప్పుకుంటారు. ఏ వస్తువూ లేని కవిత్వాన్ని రిలేట్ చేసుకోవడమూ కష్టమే. ఏ కవితాత్మకతా లేని వస్తువు పేలవమైన వచనమై తేలిపోతుంది. రఘు కవితా వస్తువుకే విలువిచ్చాడా లేక కవితాత్మకతకే విలువిచ్చాడా అని అడిగితే సమాధానం సులువుగా చెప్పవచ్చు. రఘు నిజానికి కవితావస్తువుకు విలువ ఇవ్వని కవి కాడు. అలాగని చెప్పే తీరును అశ్రద్ధ చేసే కవీ కాడు. ఈ రెంటినీ సమతూకంగా అందజేసే ప్రయత్నంలో, ఒక్కోసారి కవితలో వస్తువు కాస్త ప్రాధాన్యత సంతరించుకొని, వ్యక్తీకరణ అలంకారాల జోలికి పోకుండా బుద్ధిగా ఉండిపోతుంది. రఘు కవిత్వంలో అంతస్సూత్రంగా ఏవో దేవరహస్యాలు లేవు, కవి అనుభూతులే ఉన్నాయి. ఒక పులకిత శకలం వంటి హృదయంలో ఇమిడి ఇంకిపోయిన అనుభవాలే ఉన్నాయి. టపటపలాడుతున్న పేజీల్లో కొత్తపంక్తుల్ని ఒంపి చేసిన అనునయ సూక్తముంది. సరే ఆభరణాలు బాగున్నాయి గానీ సహజసౌందర్యముందా ఈ కవితాకన్యకకు అని మీరడిగితే ఉందనే అంటాన్నేను. వాల్మీకి సుందరకాండలో హనుమంతుడు సీతను చూసిన ఘట్టంలో ఉన్న ఆ పదిహేను పదహారు శ్లోకాలూ తెలిసినవారికి నేను వేరే ఏ సంజాయిషీ ఇవ్వక్కర్లేదు, రఘు కవిత్వం గురించి. రఘు శబ్దాల రంగూ రుచీ వాసనా పూర్తిగా తెలిసిన కవి. కనుక ఏ మండేన్ (mundane) విషయమైనా ఈ కవి తన టెక్నిక్ సంచిలో ముంచి తియ్యగానే, ఆ విషయం మురిపెంగా మనను ముద్దాడుతుంది. ఇంతకు మించి ఏ కవీ సాధించలేడు.
వాడు ఇక్ష్వాకుల కాలంనాటి పోరంబోకు.
పెళ్ళాం పుస్తెల్లో బంగారం కత్తిరించి
విజయగర్వంతో నవ్వినట్టుండే వాడి వికృతవాక్యం
నా చెవుల్లో దేవుతుంది. (ఒక కవిత్వ సభ)
లయలు పలు రకాలు. చెవుల్ని దేవేసే వికృతవాక్యాలకు విరుగుడు (antidote) రఘు ఇక్కడ మనకు ఇస్తున్నాడు.
అమరం పేరు వినలేదు.
బాలశిక్ష జోలికి పోలేదు.
…
మీలో పెళ్ళానికి ఉత్తరం రాసేవాడే పండితుడేమో (పండితుడేమో)
సాంప్రదాయికశ్రేష్ఠసాహిత్యప్రాబల్యం రాన్రాను అంతరించిపోవడం రఘుని ఎంత కలవరపెట్టిందీ తిన్నగా తెలుస్తుంది.
రఘు కవిత్వంలో కావాలని శేషేంద్రను అనుకరించిన వాక్యాలు కొన్ని ఉన్నాయి అనిపిస్తుంది. ఒక పరివ్రాజక కల అనే కవితలో ఇలా రాశాడు, రఘు:
అప్పుడప్పుడూ కన్న కలలన్నీ గుట్ట పోసి చుసేవాడ్ని
ఏం చేయాలో తోచక మళ్ళీ బుర్రలోనే దాచేవాడ్ని
ఇది శేషేంద్ర నేనూ-నా నెమలిలో రాసిన వాక్యాలకు సంకల్పితమైన అనుసరణ. ఇటువంటి కవితలను అనుకరణ అనడం కంటే అవి శేషేంద్రకు కవిచ్చిన ట్రిబ్యూట్ అని కాస్త ఆలోచిస్తే ఏ పాఠకుడికైనా తెలిసిపోయే విషయమే. నిజానికి శేషేంద్రకే తను రాసినదంతా అంకితమిచ్చాడు రఘు. కవికుల గురువులను స్మరించుకోవడం మన సంస్కృతిలో ఉన్నదే.
రఘు కవిత్వంలో ఏ ఊహా ఊర్వశీ ఏ ప్రేయసీ కనిపించదు. ఇది కాస్త వింతే. కవిత్వంలో పదప్రయోగం లోగడ ఏ సమకాలీన కవీ చేయనంత శ్రద్ధగా చేసి మంచి రసానుభూతి పాఠకుల్లో కలిగించి ఇంకో కవిత ఈయన ఎప్పుడు రాస్తాడా అనిపించేలా చేశాడు. ఇదీ అసలైన వింత. రఘు కవిత్వంలో తెలుగు పదాలు ఇంత తియ్యగా ఏర్పడగలవా అనిపించేలా పోటీ పడి దూరి సరైన వరసలో కూచుంటాయి. లోటు, నమ్రత రాసిన పద్యం వంటి కవితలు టెక్నిక్ లేని కవిత్వాన్ని ఊహించలేనివారికి కరదీపికలౌతాయి.
స్త్రీలు వాళ్ళ నాజూకు పెదవుల్లో రహస్యాలు దాచినట్టు
లోలోపల దాచుకున్న ఉపమల పెట్టెల్ని
పెంపుడు నెమళ్ళలా దింపుతాను. (కొత్త మెదడు)
రఘుకి ఉపమలన్నా మధురశబ్దసరిత్తన్నా ఇష్టం, ఏతత్ప్రయోగకలాఘనాపాఠి కూడా ఈయన. కనుక రఘు కవిత్వం అందర్నీ అలరిస్తుంది.
వాడు ఇరవై ఏళ్ళకు కలిశాడు
ఇన్నాళ్ళూ దొరకనందుకు చివాట్లతో తడిశాడు
సరళత, అంత్య ప్రాస కలిసి స్నేహన్ని చక్కగా నిలబెట్టాయిక్కడ.
ఇంటి కిరీటాల్లాంటి ఆడాళ్ళు
వాళ్ళ మెత్తటి కోపాన్ని అందమైన వర్ణనేదో చదివినట్టున్న
పెదవులతో నూరినప్పుడు
శంఖానికి చెల్లెల్లాంటి పెళ్ళాం మెడ
నగలేవీ లేవని మూల్గినప్పుడు
విసుగు రవ్వలు మోసుకుంటూ ఎగరాలనుకొని ఉంటావు. (అటకెక్కిన కల)
మమూలు అనుభవాన్ని అందమైన అనుభూతి చెయ్యగలిగే దృష్టి ఉన్నది కనుక రఘు ఇలా రాయగలిగాడు.
రఘుని చదివి మనమేం చేస్తాం? మన దిగులు గుట్టల్ని అగ్గిపెట్టెలో చీరలా దాచి ఒకింత కుదుటపడతాం. కవి ఆశించినదీ ఇదే! నన్నడిగితే ఇది చాలు. రఘుని చదివాక కవిత రాయడం అనుకున్నంత కష్టం కాదని అందరమూ నమ్ముతాం. ఇదే రఘు అసలు విజయం.
అయితే రఘుతో నాకు అభిప్రాయభేదాలూ ఉన్నాయి. ఇజ్రాయెల్నూ నెతన్యాహూనూ కీర్తిస్తూ కవితలు రాశాడు, సలామ్ చేశాడు. ఈరోజుల్లో సొంతగడ్డను పోగొట్టుకొని బానిసల్లానో ఖైదీల్లానో బతుకుతున్న పాలస్తీనా ప్రజలపై సానుభూతి మృగ్యమౌతోంది. నాకిది ఎంతమాత్రం రుచించలేదు. అయితే ఇది వేరే చర్చ. కవితో అభిప్రాయభేదాలున్నాయని మంచి కవిత్వాన్ని తెగిడి పక్కకు నెట్టేసేవాణ్ణి కాను నేను. కనుకనే ఈ చిగురువర్ణాల సంపుటుల్ని చదవమని అర్థిస్తున్నాను. చదివి నేను హంసనో కొంగనో మీరే చెప్పండి అని అడిగిన కవికి సమాధానం చెప్పండి. నా సమాధానం ఈ వ్యాసంలో సుస్పష్టమే కదా!
ఉపమా కాలిదాసస్య అన్నారు. చేరని ఉత్తరాలు కాలం గోడల నుండి అప్పుడప్పుడు మట్టిపెళ్ళల్లా రాలతాయని అన్నప్పుడూ, ఇంకా ఇటువంటి వాక్యాలు చూసినప్పుడూ ఉపమా రఘోశ్చాపి అనిపిస్తుంది. ఉపమల బలం చెప్పడం కాదు చూపించడం అని మనకు తెలుసు. ఒక్క పోలికతో రెండు విభిన్నాంశాలను బొమ్మ గీసి జోడించవచ్చు. రఘు కవితలో మొదట కనిపించే అంశం ఇదే. ఈ కవి ఏ లైనూ ఓ రెండు మూడు ఉపమల్లేనిదీ రాయడు, రాయలేడు, రాయకూడదని నమ్ముతాడేమో! ఏ సందర్భంలోనో తన ప్రమాణాలకు తగిన ఉపమ దొరక్కపోతే అచ్చెరువొందించే అంతర్లయ కలిగిన పదాల పోహళింపుకై వెతుక్కుంటాడు.
మొత్తానికి రఘు కవిత సభూష. అంతే కాక, ఈ కవికి దాపరికం లేదు. తన కావ్యసృష్టి రహస్యాలను ఏదో మసక మసగ్గా కాక, మధ్యందిన మార్తాండుని చండతీక్ష్ణాతపంలో కవిగా స్రష్టగా తన కవితను బహిరంగం చేస్తాడు. ఉదాహరణకు, ఇతని కవిత మిష చదవండి, అది కవి విశ్వరూపసాక్షాత్కారం. రఘు కవిత్వం చదువుతూ ఉంటే, మనం ఆ పద్యాల్లోని సంగీతాన్ని ఆస్వాదిస్తూ, చత్వారం కన్ను సూది మొన దగ్గర ఆగినట్టు మన దృక్కులీ కవి జోడించిన విభిన్నాంశాల దగ్గర ఆపాల్సివస్తుంది. ఆనక, మిసమిసలాడే ఈ పసిడి పద్యాల్ని వీటితోనే తూచి తూకం ముల్లు నిటారుగా మధ్యలో ఆగడంతో ఈ కవి గూటికే వలస పోయేందుకు రెక్కలముర్చుకుంటాం. ఈ కవి గూడొక పుష్పకవిమానం.