నిరంతర అన్వేషణే మార్పు

సాధారణంగా నవల రాసేటప్పుడు సమాజంలోని జీవితాల్ని గాని, ఒక వ్యక్తి జీవితచరిత్ర ఆధారంగా గాని రాస్తారు రచయితలు. నిడదవోలు మాలతి రాసిన మార్పు నవలలోని ప్రధానాంశం మానవ భావజాలంలో, జీవన విధానంలో వచ్చిన మార్పులు చెప్పడం. ఇందులో మూడుతరాల్ని తీసుకొని క్రమపరిణామాన్ని చెప్పటం ఒకటైతే, రెండవది భిన్న సంస్కృతులలో వచ్చిన మార్పుల్ని చర్చిస్తూనే మార్పులకు అనుగుణంగా మానవనైజంలో మాత్రం ఏ ప్రాంతంలో ఉన్నా, ఎంత ఆధునికంగా ఉన్నామనుకున్నా మారని విధానాన్ని ఎత్తిచూపించడం రచయిత్రి ఉద్దేశం. కాలపరిమితిని 1930-90ల మధ్య వచ్చిన మార్పులను చిత్రించానని అంటుంది రచయిత్రి.

ఇందులో పెద్దక్క, లీల, అరవింద మూడు తరాల ప్రతిధులుగా ప్రధాన పాత్రలు. అదేవిధంగా ప్రభాస్రావు, సుందరం, విషీ పురుష పాత్రలు, శ్రీదేవి, శివాని పాత్రలు కూడా ఉంటాయి. ‘నేను’ అనే పాత్ర ప్రేక్షకపాత్రగానే చెప్పాలి. తన అన్వేషణను రుజువు చేయటానికి మూడు తరాల స్త్రీల జీవితాల్ని పాఠకులకు పరిచయం చేస్తుంది రచయిత్రి. ఆ స్త్రీల జీవితాలు ఆవిధంగా ఉండటానికి కారణమై, ఆ పాత్రలకు అత్యంత సన్నిహితులైన పురుష పాత్రలు ఉంటాయి. అయితే ఆ పురుష పాత్రల మనోభావాలు మాత్రం మొదటితరం నుండి ప్రస్తుత తరం వరకూ ఏమాత్రం మార్పులేదనేది సంభాషణల ద్వారా, చర్చల ద్వారా, నడవడిక ద్వారా బలపరుస్తుంది రచయిత్రి.

ఈ నవలలో రచయిత్రి తన జీవితంలో ఎదురైన అనుభవాలను, మనుషులను, జీవన విధానాలను పరిశీలనాత్మకంగా గమనించారనిపిస్తుంది. సునిశితమైన, పరిణతమైన భావాల్ని ఈ నవల ఆసాంతం పాఠకులకు అవగాహన కలిగిస్తుంది.

1. పెద్దక్క: ఇండియాలో పుట్టి పెరిగిన పెద్దావిడ పెద్దక్క. ఆమెకి పదకొండో ఏటే పెళ్ళయ్యి ఉమ్మడి కుటుంబంలో కాపురానికి వెళ్ళిపోయింది. కాపురానికి వచ్చేనాటికి వంట రాకపోతే భర్తే చేసేవాడు. బావగారు వ్యసనపరుడు. భార్య నగల్ని పేకాటలో పెట్టేసేవాడు. అయినా మామగారు అండగా ఉండేవారు. పెద్దక్క అవసరమైనప్పుడు నెత్తిమీద నీళ్ళకుండ ఉన్నట్లు ఏదైనా చేసి తన పనులు సాధించుకునేది. భర్తకి అనుగుణంగా మెసలేది. భర్త చనిపోవటంతో పెద్ద వయసులో ఒక్కతే ఉండలేదని దగ్గరి ఆత్మీయురాలైన శ్రీదేవి తన దగ్గరికి అమెరికాకి తెచ్చుకుంటుంది. కానీ పెద్దక్క తాను ఒక్కతే ఉంటుంది. జారిపడి చెయ్యి విరగటంతో పెద్దక్కకి సాయంగా వాళ్ళింటికి లీల వస్తుంది.

2.లీల: ఇండియాలో పుట్టి పెరిగినా ఆధునిక విద్యాసంప్రదాయాల విషయంలో కొంత అవగాహన గల యువతి లీల. భర్త సుందరం పాతతరం అభిప్రాయాలు, ప్రస్తుతం అమెరికా జీవితంలో ఒనగూర్చుకుంటున్న ఆధునిక అభిప్రాయాలూ మేళవింపజేయటానికి విఫలప్రయత్నం చేస్తూ సందిగ్ధావస్థలో ఉన్నవాడు. లీల కోపం చితుకుల మంటలాంటిది. స్వల్ప విషయాలకే అగ్గిపుల్లలా భగ్గుమని మండి చప్పున చల్లారిపోతుంది. చీటికీమాటికీ వంటలకి, వేషధారణకి, ప్రవర్తనకీ ప్రతీదానికీ సరసం ఆడుతున్నానన్నట్లుగా సుందరం అందరి ముందూ వేళాకోళాలు ఆడుతుంటే చిన్నబుచ్చుకుంటుంది. అతను తరుచూ ఎవరెవరినో మిత్రుల్ని ఇంటికి పిలుస్తుంటాడు. సభలూ, సమావేశాలకోసం ఇండియానుండి వచ్చినవాళ్ళకి ఆతిథ్యాలు యిచ్చి వాళ్ళ ఎదురుగా లీలని వేళాకోళం చేస్తుంటాడు.

ఒకసారి వచ్చిన మిత్రుడిని సినీమాకు తీసుకువెళ్ళిన సుందరం సినీమా మధ్యలోనే లీలని థియేటర్లో వదిలి, మిత్రుడికి అనారోగ్యమని చెప్పి ఇద్దరూ ఇంటికి వెళ్ళిపోతారు. సినీమా పూర్తయ్యాక భర్తకోసం చూసి ఇక ఇంటికి వచ్చేస్తుంది లీల. ఇంటికి వచ్చేసరికి సిగరెట్లు కాలుస్తూ పేకాడుకుంటూ నవ్వుకుంటున్న సుందరాన్నీ ఆ మిత్రుడినీ చూసి కోపంతో లోపలికి వెళ్ళిపోతుంది. లీల అలా కోపంగా లోపలికెళ్ళిపోవటం మర్యాద కాదని సుందరం అనేసరికి, ‘అర్ధరాత్రి భార్యని అలా థియేటర్లో వదిలేయటం మర్యాదా’ కోపంగా అంటుంది. ‘నీకు స్వాతంత్య్రం, స్వేచ్ఛా ఇచ్చాను. నిన్నెవరేం చేయగలరు. నిన్ను చూసి భయపడి చస్తారు’ అని వేళాకోళంగా అన్న సుందరం మాటకు, లీల మరింత భగ్గుమంటుంది.

మర్నాడు లీల కారు తీసుకుని పార్కుకు వెళ్ళి, కారులోనే పడుకుని ఇంటికి వెళ్ళటానికి ఇష్టపడదు. అప్పుడు పెద్దక్కకి చెయ్యి విరిగిందని తెలిసి ఆమెకు సాయంగా అటునుండి అటే ఆమె ఇంటికి వెళ్ళి ఉంటుంది లీల. సుందరాన్ని వదిలి లీల బయటకు వెళ్ళిపోవటం మిత్రబృందాలలో పెద్ద చర్చగా మారుతుంది. అమెరికాలాంటి ప్రదేశంలో పెద్ద ఉద్యోగాలలో ఉంటారు. విడిపోవటం అనేది మామూలు విషయంగా తెలిసినవాళ్ళు సైతం భారతీయ మూలాల్లోని భావజాలం వదిలిపెట్టలేక లీలనే తప్పుపడతారు.

పెద్దక్క చెయ్యి బాగైన తర్వాత సుందరం లీలని కలిసి ఇంటికి వచ్చేయ మంటాడు. ఎదురు చెప్పటం చాతకాని లీల తిరిగి ఇంటికి వెళ్తుంది. కానీ సుందరంలో మార్పు రాదు. యథాప్రకారం అతిథులను ఆహ్వానించటం, చెప్పాచెయ్యకుండా టూర్లు వెళ్ళిపోవటంతో ఎప్పటిలాగే లీలకు ఒంటరితనమే మిగులుతుంది. అయితే నవల ముగింపుకు వచ్చేసరికి లీల బయటకు వెళ్ళి ఉద్యోగం చేయకపోయినా దేవుని బొమ్మలకు బట్టలు కుట్టటం చేస్తుంది. అప్పుడప్పుడు సరదాగా వేసే బొమ్మల్ని చూసిన అసదాలీ అనే కుటుంబమిత్రుడు తాను పనిచేసే కార్యాలయానికి ఇల్లస్ట్రేషన్లు వేయటానికి లీలను ఒప్పిస్తాడు.

3. అరవింద: అరవింద అమెరికాలో పుట్టి పెరిగినా తెలుగు సంస్కృతీ సంప్రదాయాలపట్ల ఆసక్తి, ప్రతీ విషయం కూలంకషంగా తెలుసుకోవాలనే ఉత్సుకత కలిగిన పదిహేడేళ్ళ తెలివైన అమ్మాయి. హైస్కూలు చదువు పూర్తిచేసింది. అక్కడే స్థిరపడిన విషీ అనే తెలుగుకుర్రాడితో నాలుగు నెలలు స్నేహం చేసి, అతని ప్రవర్తన నచ్చక దూరమైంది కానీ విషీ మాత్రమేకాక అతని నాన్నకూడా అరవిందను విషిని పెళ్ళి చేసుకోమంటూ వెంటపడుతుంటాడు. విషీ ఆమెపట్ల అందరి ముందు ప్రేమ ప్రకటిస్తుంటాడు. అంతలోనే అరవిందకు జాతీయస్థాయి వ్యాసరచనలో బహుమతి వచ్చేసరికి ‘అది నాకు రావల్సింది. ఆడపిల్లవని నీకిచ్చిఉంటారు’ అంటూ అసూయతో ముఖం ముడుచుకుంటాడు. ఈ ధోరణి అమెరికాలో పుట్టిపెరిగిన పిల్లవాడికి కూడా వుండటం గమనించదగ్గ విషయం.

విషీ తండ్రి ప్రభాస్రావు ఆ అమ్మాయి దూరంకావటం వల్ల తన కొడుకు పాడవుతున్నాడని, విషీని పెళ్ళి చేసుకోవడానికి అరవింద వప్పుకుంటే మామూలౌతాడని వెంటబడతాడు. అరవింద స్నేహితులను కలవటానికి వెళ్తే అక్కడకి విషీ వచ్చి ‘వాళ్ళు నాకూ స్నేహితులే’ అంటాడు. ఇతర అమ్మాయిలతో దగ్గరగా రాసుకు పూసుకుని ఉంటుంటే అది చూసి అరవింద అసూయపడి మళ్ళీ తనతో వస్తుందని భావిస్తాడు. ఆ ప్రవర్తన అరవిందకు మరింత చికాకు పుట్టిస్తుంది. ఇది కూడా ఎక్కడైనా మానవస్వభావం ఒకటే అనిపించేలా రచయిత్రి వ్యక్తపరుస్తుంది. అమెరికాలాంటి దేశంలో ఉన్నా అక్కడే పుట్టిపెరిగిన భారతీయ మూలాలుగల యువకులకుకూడా పురుషాహంకారం, బుద్ధి అలానే ఉన్నాయని అర్థం అవుతుంది.

పదిహేడేళ్ళ అరవిందకి విషీలాంటి వరుడు ఇక దొరకడన్నట్లుగా అరవింద తండ్రి, అతని స్నేహితుడు సుందరం ఒప్పించే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ‘ఎవరికైనా చిన్న చిన్న అభిప్రాయభేదాలు వస్తాయి సర్దుకోవా’లన్నట్లు బోధిస్తారు. ‘ప్రకృతి సిద్ధంగానే ఆడవాళ్ళకి శారీరకంగా, మానసికంగా ఎదుగుదల త్వరగా జరుగుతుంది. అందుకే అమ్మాయి చిన్నగా, అబ్బాయి పెద్దగా ఉండేలా సంబంధాలు చూస్తారు. విషీ వంటి మేధావి దొరకడు’ అని చెప్పటమేకాక తాను తన భార్య లీలకి సంపూర్ణ స్వాతంత్య్రం ఇచ్చానంటూ తన విషయాలు కూడా చెప్పి ఆలోచించుకోమంటాడు సుందరం. ‘సర్దుకుపోవడాలు, అర్థం చేసుకోడాలు ఇద్దరిలోనూ ఉండాలి కదా’ అని నిర్దిష్టమైన ఆలోచనలు గల అరవింద భావన.

అరవింద తన సమస్యని పరిష్కరించుకోడానికని పెద్దక్కని, లీలని, శ్రీదేవిని, అందరినీ వారి వారి తరంలోని దాంపత్య సంబంధాల గురించి తెలుసుకోవాలనుకోవటం మొత్తం నవలలో ఉంటుంది.

అరవింద తాను చదివిన షేక్స్‌పియర్ రచనలలో ‘ప్రేమంటే ఇద్దరూ ఒకరినొకరు చుట్టుకుపోయి ఏకలతగా జీవితాలు సాగించటం’ అని నూరిపోశారనే – విషయాన్ని వెల్లడిస్తుంది. కానీ మాయా ఏంజిలో చెప్పినది – ప్రేమంటే తాను ప్రేమించిన మనిషిని కట్టిపడేయటం కాదు, తన బతుకు తాను బతికేలా ఎదగటానికి అవకాశం ఇవ్వటం – అనేది కరెక్టని ఆమె విశ్వాసం. అంతేకాకుండా, ఇద్దరూ ఒకేరకం ఆశలూ ఆశయాలూ కోరికలూ కలవారైతే, ఒకరి సాన్నిధ్యం రెండోవారికి ఎదగటానికి ఉపయోగపడేదైతే ఇద్దరూ కలిసి ఉండొచ్చునేమో కానీ, ఆయిద్దరిలో ఏ ఒక్కరు ఎదగటానికి అవకాశం లేకపోయినా, ఆ వ్యక్తిని రెండోవారు తన కబంధహస్తాలతో కౌగలించుకు కూచోకుండా బయటకి పోనివ్వాలి. అంటే తనకు కావలసిన రీతిలో ఎదగటానికి అవకాశం ఇవ్వాలి నిజంగా ప్రేమ ఉన్నట్లయితే – అంటూ ఆ సందర్భంలోని చర్చ సారాంశానికి మాయా ఏంజిలో జీవితం కూడా అన్వయిస్తూ అరవిందచేత చెప్పిస్తుంది రచయిత్రి.

ఈ చర్చకు లీలే కాకుండా, ప్రేక్షక పాత్రగా ఉన్న ‘నేను’ కూడా సానుకూలంగానే స్పందించినట్లుగా కథనం చేస్తుంది రచయిత్రి. మొత్తం నవల ఆసాంతం మాయా ఏంజిలో చెప్పిన ప్రేమనిర్వచనం అంతర్లీనంగా కథని నడపటానికి ఉత్ప్రేరకం అవుతుంది.

పెద్దక్క తన కాపురం గురించి చెప్తూ పొరుగూరిలో అమ్మగారింటికి బస్సెక్కి వెళ్ళిపోయేదాన్నని, తల్లీతండ్రీ బుద్ధులు చెప్పి మళ్ళీ అత్తగారింట్లో దింపేవారని, ఆమె భర్త స్కూలులోని ఉద్యోగం వదిలిపెట్టి బొంబాయిలో బిజినెస్‍లంటూ మద్రాసులో సినీమాల కోసం పెద్దక్క నగలు ఊడ్చి తీసుకుపోతే మామగారే మళ్ళీ చేయించేవారని, అవీ కూడా ఒలిచి తీసుకుపోయేవాడని చెప్తుంది. తల్లి చనిపోతే తండ్రి పెద్దక్కని వాళ్ళ మామగారికి అప్పగింతలు చెప్పాడట. మామగారు చనిపోతూ తన కొడుకు స్థిరంలేనివాడని, నువ్వే జాగ్రత్తగా కాపురాన్ని నిలబెట్టుకోవాలని స్త్రీ ధర్మాలు బోధించాడని చెప్తుంది పెద్దక్క. అది విని లీల, అరవింద ఆశ్చర్యపోతారు. కానీ పెద్దక్క మా తరంలో ఏమీ ప్రశ్నించటాలు లేవు. అలా జీవితం సాగిపోవటమే అంటుంది. 30ల నాటి స్త్రీల జీవన విధానం పెద్దక్క జీవితం చూస్తూంటే అర్థమౌతుంది.

1930-40నాటి దాంపత్యజీవితాలు, ఉమ్మడి కాపురాలు పెద్దక్క జీవితం చెప్పేటప్పుడు దృశ్యాలు, దృశ్యాలుగా వివరించటం రచనాసంవిధానంలో తెలుస్తుంది. ఇది గుర్తించవలసిన విషయం. ఆడపిల్లలకు నరనరానా స్త్రీ ధర్మాలు పట్టేలా నూరిపోయటం వలన ప్రశ్నించే స్వభావం అలవడలేదు. అందుకే ఆ తరం స్త్రీలు భర్త ఎటువంటి వాడైనా పట్టించుకోకపోవటమే కాకుండా కాస్త తెలివైనవాళ్ళు ఒదిగి ఉంటూ కాపురాన్ని తీర్చిదిద్దుకునేవారని తెలుస్తుంది.

లీల తరానికి వచ్చేసరికి తమ స్వంత విషయాలలో ఇతరుల జోక్యాన్ని సహించరు. అది తను వ్యక్తిత్వాన్ని కించపరిచినట్లుగా బాధపడతారు. లీలకు కొద్దిగా ముందుతరానికి చెందిన శ్రీదేవి తాము చిన్నప్పుడు ఎవరింటికైనా చీకటిపడ్డాక వెళ్ళాలంటే తన తమ్ముడిని తోడు పంపేవారంటుంది ఒక సందర్భంలో. ఆమె కన్నా చిన్నవాడు ఆ వయసులో ఆమెకు రక్షకుడు ఎలా అవుతాడో అరవిందకు అంతుపట్టదు. కానీ ఇప్పటికీ స్త్రీని చీకటి పడ్డాక ఒంటరిగా పంపడానికి భయపడే రోజులే ఉన్నాయి.

50-60 దశకాలలో స్త్రీ విద్య, వయోజనవిద్య, గ్రంథాలయోద్యమం, స్కూళ్ళు, లైబ్రరీలు గ్రంథపఠనానికి పెద్దపీట వేయటం కూడ అరవింద ఆశ్చర్యపోతూ తెలుసుకుంటుంది. ఇంట్లో పత్రికలు, పుస్తకాలూ చదవనిచ్చేవారు కాదని తెలుసుకున్న అరవింద ‘మరి అప్పట్లో కూడా రచయిత్రులు ఉన్నారు కదా’ అని ప్రశ్నిస్తుంది. ఆ చర్చల సందర్భంలో రచయిత్రి నాళం సుశీలమ్మ, బండారు అచ్చమాంబ కాలం నాటి పరిస్థితుల్నీ, వాళ్ళంతా ఎలా ఆ పరిస్థితుల్ని ఎదుర్కొని చదువుకొని, రచనలు చేసి స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్నారో సంభాషణల రూపంలోనే రచయిత్రి ఉదాహరణలతో తెలియజేస్తుంది.

ఫ్రాన్సులో పద్దెనిమిదవ శతాబ్దంలోని కార్మికుల తిరుగుబాటు పర్యావసనాలు, స్త్రీవాదం పుట్టుపూర్వోత్తరాలు, శ్రీదేవి పాత్రతో చెప్పించిన సందర్భంలో ఇటువంటి చర్చలలో రచయిత్రి కథలోకి చొచ్చుకుంటూ ప్రవేశించి కొంత ఉపన్యాస ధోరణిలో తనకు తెలిసినది చెప్పే ధోరణి వ్యక్తమౌతుంది. ఇదేవిధంగా ఎన్నికల సమయంలో సాటి మనిషిని హీనంగా మాట్లాడటాన్ని నిరసిస్తుంది. అభివృద్ధి చెందిన దేశంలో కూడా స్త్రీల ప్రతిపత్తి నేతిబీరకాయ చందమే అంటుంది. పాశ్చాత్యులు నాగరికులు అని వాళ్ళని అనుకరించటమే నాగరికత అనే నమ్మకం రెండు వందల ఏళ్ళుగా ఉంది. పాశ్చాత్యులు చట్టం పేరుతో చేసే అరాచకాలు, భారతీయులు మతం పేరుతో చేసే అరాచకాలకు ఏమాత్రం తీసిపోదంటుంది చర్చల రూపేణా రచయిత్రి.

పెళ్ళిళ్ళ నిర్ణయాలలోను, దాంపత్య జీవితాలలోను, పిల్లల పెంపకంలోనూ తరాల పరిక్రమణలో వచ్చే మార్పులు, భారతదేశంలో ఎలా వస్తున్నాయో విదేశాలలోని భారతీయ కుటుంబాలలోను అదేవిధంగా వస్తున్నాయనేది నిరూపించే ప్రయత్నం ఈ నవలలో రచయిత్రి చేసింది. కుటుంబపరమైనదే కాకుండా సాహిత్యంలో, సభలూ సమావేశాలలో, సాహితీవేత్తల మనోభావాలలోని మార్పుల్ని కూడా పట్టిచూపించే ప్రయత్నం ఉంది. కథాక్రమంలో వందేళ్ళ సాహిత్యాన్ని విశ్లేషించటం సమయానుకూలంగా కథలో చొప్పించి చూపింది రచయిత్రి మాలతి.

సుందరం అమెరికా నుండివచ్చి లీలతో ఓ గంట మాట్లాడి పెళ్ళి చేసుకున్నాడు. ‘గంటలో ఒక మనిషికి మరో మనిషి గురించి తెలిసిపోతుందా? కులగోత్రాలు, జాతకాలు చూసినా అంతే, డేటింగుచేసినా అంతే’ అంటుంది లీల. ఇది ఆనాటి, ఈనాటి పెళ్ళిళ్ళ ప్రహసనాన్ని ఆలోచింపజేస్తుంది. సుందరం మాటకారి, ఎదుటివాళ్ళని కబుర్లతో బుట్టలో వేసుకునే తెలివితేటలున్నాయి. తాను వేళాకోళంగా అన్న మాటలకి లీల కోపగించి తనను వదిలివెళ్తే సుందరం అందరిదగ్గరా ‘మన సాహిత్యంలో పానుగంటి, మునిమాణిక్యం రచనలలో భార్యతో చేసిన సరదా సంభాషణలకి హర్షిస్తున్నాం కదా’ అని తనని సమర్థించుకోవటానికి చూస్తాడు. పానుగంటి, మునిమాణిక్యం భార్యతో చేసిన వేళాకోళ సంభాషణలు రచయితల దృష్టితో చేసినవే కదా! స్త్రీ దృష్టికోణంలో చెప్పలేదు ఆ రచయితలు. ఆ వేళాకోళాలు స్త్రీలు మనసుకు చేసే గాయాల్ని పురుషులు గమనించరనేది ఆలోచింపజేస్తుంది రచయిత్రి. ఈ విధంగా అనేకమంది సాహితీప్రముఖుల గురించి నవల అంతటా సమయోచితంగా ఉటంకింపులు కనిపిస్తాయి.ఇది రచయిత్రి మంచి చదువరి అనే విషయాన్ని వ్యక్తీకరిస్తుంది.

ఈ నవలలో రచయిత్రి తన జీవితంలో ఎదురైన అనుభవాలను, మనుషులను, జీవన విధానాలను పరిశీలనాత్మకంగా గమనించారనిపిస్తుంది. రచయిత్రికి గల సునిశితమైన, పరిణతమైన భావాల్ని ఈ నవల ఆసాంతం పాఠకులకు అవగాహన కలుగజేస్తుంది.

ఈ నవల ప్రారంభంలో మొదలు పెట్టి అరవింద తనకు తెలిసిన మూడుతరాల దాంపత్యజీవితాల్నీ మూల్యంకనం చేసుకొని చివరకు విషీని పూర్తిగా వదిలేసి, అప్నెమొన్ అనే విదేశీయువకుడిని చేసుకోవాలని నిర్ణయించుకుంటుంది. తన నిర్ణయాన్ని చెప్పటానికి వచ్చిన అరవింద తాను పెళ్ళాడాలనుకున్న ‘అప్నెమొన్’ అంటే నమ్మదగ్గవాడు అని అర్థం అనీ, అది నిజమని నమ్ముతున్నానని సంతోషంతో వెల్లడిస్తుంది. లీల జీవితం గురించి ప్రశ్నిస్తుంది అరవింద. ‘మనం ఎలా ఉన్నా ఏంచేసినా రోజులు గడచిపోక ఆగదుకదా. ఎందుకిలా అయ్యింది అనుకుంటూనే పదిహేనేళ్ళు గడిపేను. ఇలా అయినా మరోలా అయినా మరో పదిహేనో ముప్ఫయ్యో గడిచిపోతాయి’ అంటుంది నిర్వేదంతో లీల. మధ్యతరగతి మహిళలు సర్దుకుపోయే తత్వానికి మచ్చుతునక. ‘నీ భావనాలోకంలో నువ్వు సంతోషంగానే ఉన్నావు’ అని అరవింద వెళ్ళిపోతుంది. ఇంతతో అసలు కథ ముగించినట్లుగానే ఉంటుంది.

నవల ముగింపులో మతాల గురించి సుదీర్ఘ చర్చతో ముగిస్తుంది రచయిత్రి. దీనివలన కథకు పెద్ద ప్రయోజనం లేదనే నా భావన. కాలపరిణామక్రమంలో మార్పు వచ్చినట్లుగా ఉంటుంది. రానట్లూ ఉంటుంది. తరతరాలుగా ధార్మిక ప్రవక్తలు చెప్పినవి నిజంగా ఆచరణలో జరిగివుంటే ప్రపంచం ఈ విధంగా ఉండదుకదా అనే ధోరణిలో మతం, ధార్మికత మీద సుదీర్ఘ చర్చను రచయిత్రి కొనసాగించింది. నిజంగా తరిచిచూస్తే మానవులలో అంతరాంతరాలలో ఏ మార్పూ లేదు.

పరిసరాల్లో, ఆలోచనల్లో, ఆశల్లో, ఆశయాల్లో, సమాజంలో మార్పు ఎలా వస్తుంది, ఎందుకు వస్తుంది అన్న ప్రశ్నకు రచయిత్రి నిడదవోలు మాలతి నిరంతర అన్వేషణే ఈ మార్పు నవల.