గురుశిష్య బాంధవ్యం

సుమారు 6-7 ఏళ్ళకిందట తెలుసాలో సాహితీ చర్చలు ఘాటుగానే జరిగేవి. అప్పటి రోజుల్లో విశ్వనాథ సత్యనారాయణ గారు వారి గురువుగారు చెళ్ళపిళ్ళ వెంకట శాస్త్రి గారిగురించి రాసిన పద్యాలు, చెళ్ళపిళ్ళ వారు తమ శిష్యుడిపై చెప్పిన పద్యాలూ,విమర్శనాత్మకంగా పరిశీలించబడ్డాయి. వీరిద్దరంటే నచ్చినవారు, మెచ్చని వారూ ఈ చర్చల్లో పాల్గొన్నారు.

గురువంటే గౌరవం, శిష్యుడంటే వాత్సల్యం ఉవ్వెత్తుగా మెప్పించే పద్యాలు ఇవి. పునరుక్తి దోషం, పాపం నాది. పద్యాల శోభ అనుభవించడం మీది. ఆ రోజుల్లో, కొన్ని పద్యాలకి కొందరు పాఠకుల కోరికపై ప్రతిపదార్థం ఇవ్వడం జరిగింది. “ఈ మాట” పాఠకుల స్థాయి వేరు కాబట్టి ఈ సారి ఆ పని చెయ్యడం లేదు.

ఈ పద్యం, రామాయణ కల్పవృక్షం, అవతారిక నుంచి. సత్యనారాయణ గారు గురువుగురించి చెపుతూ, తన ప్రతిభని సూచిస్తున్నారు.

మ. అలనన్నయ్యకు లేదు తిక్కనకు లేదా భోగ మస్మాదృశుం
డలఘుస్వాదు రసావతార ధిషణాహంకార సంభారదో
హల బ్రాహ్మీమయమూర్తి శిష్యుడయినా డన్నట్టి దావ్యోమపే
శల చాన్ద్రీ మృదుకీర్తి చెళ్ళపిళవంశస్వామి కున్నట్లుగన్‌

చెళ్ళపిళ్ళ వెంకట శాస్త్రి గారు ఎంత అదృష్టవంతుడో సత్యనారాయణగారు చెప్పుతున్నారు. నన్నయకి, తిక్కనకి లేని భోగం, అదృష్టం చెళ్ళపిళ్ళవారికి కలిగిందిట. ఎందుచేత? “అలఘుస్వాదురసావతార ధిషణాహంకారసంభార దో హల బ్రాహ్మీమయమూర్తి” అయిన తనవంటివాడు శిష్యుడవడం మూలంగా! అలాగని గురువుని తక్కువ చెయ్యటం లేదు. “వ్యోమపేశల చాన్ద్రీమృదుకీర్తి చెళ్ళపిళ్ళవంశస్వామి,” అని కీర్తించారు.

ఈ పద్యానికి మరొక గూఢమైన, గాఢమైన వివరణ ఉన్నదని తెలుగులో Ph.D సంస్కృతంలో M.A. ఉన్న ఒకరు అప్పట్లో నాతో అన్నారు. ఇప్పటికీ నేను ఆ వివరణ వినలేదు. గతం గతః. ఈ పద్యం తెలుగు సాహిత్యంలో మణిపూసలా మెరుస్తూన్నది.

గురువు గారి మంచితనం గురించి అతిమధురంగా చెప్పిన మరొక పద్యం. ఇదీ సత్యనారాయణగారి పద్యమే.

చ. తన యెదయెల్ల మెత్తన కృతప్రతిపద్యము అంతకంటె మె
త్తన తన శిష్యులన్న యెడదం గల ప్రేముడి చెప్పలేని మె
త్తన యయి శత్రుపర్వతశతారము సత్కవి చెళ్ళపిళ్ళ వేం
కన గురువంచు చెప్పికొనగా నది గొప్ప తెలుంగునాడునన్‌

“మెత్తన,” అన్న పదం ఎంత మృదువుగా పద్యంలో కలిసిపోయిందో చూడండి.

సత్యనారాయణగారికి గుడివాడ ఎ.ఎన్‌.ఆర్‌. కాలేజీలో సన్మానం చేసినప్పుడు, చెళ్ళపిళ్ళ వెంకట శాస్త్రి గారు తొమ్మిది ఆశీర్వచన పద్యాలు చెప్పారు. అందులో ఎనిమిదవది ఈ కింది పద్యం.

శా. నా మార్గమ్మును కాదు, శిష్యుడయినన్‌ నా తాత ముత్తాతలం
దే మార్గమ్మును కాదు; వీని దెదియో? ఈ వూర్గ మట్లౌటచే,
సామాన్యుండనరాదు వీని కవితాసమ్రాడ్వ్తమా హేతువై,
ఈ వుచ్చిష్యుని దా వరించినది, నేనెంతే ముదంబందెదన్‌

చెళ్ళపిళ్ళవారు ఆశ్చర్యపోతూ అంటున్నారు, “నా శిష్యుడే అయినా, ఇతనిది నా పద్ధతి కాదు. నా తాత ముత్తాతల పద్ధతీ కాదు.” ఇక్కడ తాత ముత్తాతలు అంటే మన పూర్వ కవులని చెప్పుకోవాలి. “ఇతడిని సామాన్యుడనుకోరాదు. కవితాసంరాడ్వ్తమాహేతువై ఈ నా శిష్యుడిని వరించింది. నాకెంతో సంతోషంగా వున్నది,” అని.

చికాగోలో ఉన్నరోజుల్లో ఒకసారి కోట సుందరరామశర్మగారు చెప్పారు. చెళ్ళపిళ్ళవారి శిష్యుడిని అని చెప్పుకోవడం అప్పటి తెలుగు కవులకి, పండితులకీ ఒక certificate , యోగ్యతాపత్రం లాంటిదని. ఒక నెలో రెండునెలలో చెళ్ళపిళ్ళ వారి దగ్గిర చేరి, వారి శిష్యుడినే అని వందలమంది చెప్పుకునేవారట.

గురుభక్తికి, శిష్యవాత్సల్యానికి గుర్తుగా తెలుగునాట ఈ పద్యాలు పాఠ్యగ్రంథాలలో పెడితే బాగుండునేమో!