ఇంతింతై

జూన్ నెల మధ్యలో, మార్నింగ్ వాక్‌లో తరచుగా ఎదురవుతున్నవాళ్ళల్లో అతనొకడని ఆమె త్వరగానే గుర్తించింది. పాండెమిక్ మొదలయిన కొన్ని నెలలకి కొందరిలాగా ఆమె కొత్తగా చేసుకున్న అలవాటు మార్నింగ్ వాక్. ఆమె నడక ఆ సమయంలో ప్రత్యేకంగా ఎదురయ్యే పశుపక్ష్యాదులని మెడలో వేలాడే కెమెరాలో బంధించడానికి.

“అదంటే నాకు అసూయ!” అనేవాడు స్టీవ్. బిజినెస్ ట్రిప్‌కి వెడుతూ కూడా కెమెరాని తనవెంట తీసుకెడుతుందని.

“నిన్ను దాని సైజుకు ష్రింక్ చెయ్యగలిగినప్పుడు నా కారీయాన్‌లో నువ్వు కూడా ఉంటావ్.” ఆమె జవాబిచ్చేది.

ఆమె తరచుగా వెళ్ళే ఊరు కొలరాడోలోని బౌల్డర్. మొదటి ట్రిప్పులోనే కొండల నడుమ లోయలో ఉన్న ఆ ఊరు ఆమెకి అమితంగా నచ్చేసింది. డెన్వర్ ఎయిర్‌పోర్ట్‌లో దిగి అక్కడికి డ్రైవ్ చేస్తున్నప్పుడు లోయలోకి దింపుతున్న ఆ రోడ్డు ఆ ఊరిని అద్భుతంగా చూపిస్తుంది.

ఒక ట్రిప్పులో అక్కడ ఒకరి ఆఫీసులో కనిపించిన ఒక సూర్యాస్తమయం ఫోటో ఆ తరువాతి ట్రిప్పులో ఆమె స్టీవ్‌ని అక్కడికి తీసుకెళ్ళేలా చేసింది; కారీయాన్‌లో కాదు, టిక్కెట్టు కొనే. అలాంటి కంపోజిషన్ కోసం సూర్యుడితోపాటు ఒక మనిషి కూడా కావాలి మరి.

‘తీసుకువచ్చి తప్పుపని చేశాను!’ అని ఆమె అనుకోకపోలేదు. అతని జోకర్ వ్యవహారం ఆమెకి అప్పుడప్పుడూ ఆనందం కలిగించేమాట నిజమే కానీ అప్పుడు మాత్రం కాదు.

ఆమె మదిలో రూపుదిద్దుకున్న ఫోటో కంపోజిషన్‌కి సూర్యుడు, మనిషే కాక ఇంకొన్ని ముఖ్యావసరమైన అంశాలున్నాయి. అవి: సూర్యుడి పరిమాణం, మనిషి పోజు, వాటితోబాటు ఆ రెంటినీ సమన్వయం చెయ్యగలిగిన దూరంలో కెమెరా, తగిన జూమ్ లెన్స్, ఏమాత్రం మబ్బులు లేని వాతావరణం. అన్నీ సమకూరినప్పుడు స్టీవ్ పెట్టాల్సిన పోజు, రెండు కాళ్ళూ ఎడంగా పెట్టి, రెండు చేతులూ పైకి చాచి, X ఆకారంలో నిల్చోవడం. ఆమె చూసిన ఫోటోలో ఆ మనిషి సూర్యుడివైపు తిరిగి ఆవాహన చేస్తున్నట్టున్నాడు – పెద్ద సూర్యుడు, చిన్న మనిషి; అతని కాళ్ళు సూర్య గోళం కింది అంచుని తాకుతున్నాయి. ఆమె ఆలోచనని సరిగ్గా అమలు జరపగలిగితే, అతని పాదాల, చేతివేళ్ళ కొనలు సూర్యబింబం అంచులని తాకుతాయి. లియోనార్డో గీసిన విట్రూవియన్ మనిషి చట్రంలో ఇమిడిపోయిన బొమ్మకులాగా.

అస్తమించే సమయంలో సూర్యుడి రంగులు అద్భుతంగా ఉంటాయి – ముఖ్యంగా సూర్యుడు భూమి అంచులని తాకి ముద్దిడుతూన్నప్పుడు. కానీ, భూమి తిరిగే వేగం ఫోటోకు సమకూర్చగల సమయాన్ని చాలా మితంచేస్తుంది. అందువల్ల, కొన్ని క్షణాలు మాత్రమే ఆ బింబపు దక్షిణపు కొన కొండచరియని తాకుతూ కనిపించి, దాదాపు వెంటనే ఆ గోళం క్రింది భాగం కోసేసినట్లు మాయమవడం మొదలవుతుంది.

“సెప్టెంబర్ 23కి రెండురోజులు అటూ ఇటూ మంచి సమయం” అన్నాడు ఆమెని ఆ ప్రయత్నానికి పురికొల్పిన ఫోటో తీసినతను. 22 లేదా 23 తేదీలు విషువత్తులు. మార్చ్‌లో ఉత్తరంగానూ, సెప్టెంబర్‌లో దక్షిణంగానూ వెడుతూ సూర్యుడు భూమధ్యరేఖని దాటే రోజులు. ఆ రోజులలో పగలూ రాత్రీ ఒకే నిడివి కలిగి వుంటాయి.

స్టీవ్ కొండచరియన ఏ గట్టు మీద నిలబడివుండాలో, ఆమె కొంచెం దూరంగా ఎక్కడ ఎలా తన కెమెరా ట్రైపాడ్ అమర్చుకోవాలో నిర్ణయించుకోవడంలో రెండు సాయంత్రాలు గడిచిపోయాయి. మూడవ రోజున హోటల్ నించి అక్కడికి కారులో డ్రైవ్ చేస్తున్నప్పుడు “దిస్సీజిట్!” అన్నదామె ఎక్సైట్‌మెంట్‌తో.

ఆమె కెమెరాని సెట్ చేసుకుని వ్యూఫైండర్ లోంచి అతన్ని చూసి ఆశ్చర్యపోయింది. స్టీవ్ తన పాంటూ, చొక్కా విప్పేశాడు. ఇప్పుడు సూపర్‌మాన్ గెటప్‌లో ఉన్నాడు. “వాటార్యూ డూయింగ్?” అని పెద్దగానే అరిచింది కూడా. అతనిచేత డ్రస్ మార్పించే వ్యవధి లేక కెమెరాని క్లిక్ క్లిక్ మనిపించింది గానీ ఆమె మొహం తన మొహమంత ఎర్రగా ఉన్నదని సూర్యుడు అనుకునే ఉంటాడు.

“నిన్న నువు మీటింగ్‌కెళ్ళినప్పుడు ఊళ్ళో నడుస్తుంటే హాలోవీన్ డ్రస్సులు అమ్ముతున్న షాప్ కనిపించింది. ‘యువర్ స్టీవ్ ఈజ్ ఎ సూపర్ మాన్, టచ్‌డ్ ది సన్!’ అని సర్ప్రైజ్ చేద్దామనుకున్నాను” అని అతను సంజాయిషీ ఇచ్చాడు.

“ఫోటో గూర్చి చేసిన ఇంత ప్రయత్నాన్నీ నాశనం చేశావ్!” ఆమె అతనిమీద విరుచుకుపడింది.

“మళ్ళీ రేపొద్దాం” అన్నాడు అతను తేలిగ్గా. కానీ తరువాతి రెండు రోజులూ వర్షం. కొన్ని చినుకులు ఆమె మీద పడి ఆవిరయ్యాయి.

పెద్ద సైజ్ ప్రింట్ తీయించి ఫ్రేమ్ కట్టించి లివింగ్ రూములో గోడకు తగిలించిందిగానీ దాన్ని చూసినప్పుడల్లా కోపం ఇనుమడించడంతో ఆ ఫోటోని ఫ్రేమ్ నించి బయటకు తీసి బ్లేడ్‌తో అతనున్న భాగాన్ని కోసేసి మళ్ళీ గోడకు తగిలించింది.

“ఇది కూడా బాగానే ఉంది” అన్నాడు స్టీవ్.

“యూ డిడిన్ట్ గెట్ ది మెసేజ్?” చూపులతోనే తీక్షణంగా సందేశాన్ని తెలియజేసింది.


మార్నింగ్ వాక్‌లో ఎదురు వచ్చేవాళ్ళకు విషెస్ చెప్పేటప్పుడు అందరిలాగానే అతను కూడా కళ్ళల్లోకి చూస్తాడు గానీ అతనితో కొన్ని రోజులుగా ఆ అలవాటు కొనసాగుతూండడం గూర్చి ఆమె కొద్దిగా సంకోచించి తల దించుకున్న రోజే ఎదురుగా వచ్చిన అతని మాటలు తనని దాటిన తరువాతే చెవిని చేరాయని గ్రహించి తల తిప్పి చూసేసరికి అతను వేగంగా పరుగెత్తుతూ కనిపించాడు. “పోటీలకి తయారయే వయసు మించిపోలేదా?” అనుకుని ఆశ్చర్యపోయింది. మరునాడు ఆమెకు అతను అంతకన్నా వేగంగా తనను దాటినట్లనిపించింది. తరువాతి పొద్దున కోసం ఆసక్తితో ఎదురుచూసింది.

ఆ వాకింగ్ ట్రెయిల్ గూర్చిన ఒక గుర్తింపు ఆమెకు ఆ ఉదయం కలిగింది. నాలుగడుగుల వెడల్పు, ఒక మైలు పొడుగు ఉండే ఆ తారు రోడ్డుకు రెండు వైపులా ఒక వంద గజాల పచ్చికబయలు. దానికీ అవతల ఉండే ఇళ్ళకీ ప్రహరా కాస్తున్నట్లుగా కొంత వెడల్పున చెట్ల వరుస. ఆ ఇళ్ళుండే కమ్యూనిటీలనించి సన్నని తారు రోడ్లు వచ్చి అక్కడక్కడా ఈ ట్రెయిల్‌ని కలుస్తున్నాయి. ‘రెండువైపులా తెడ్లుండే రోయింగ్ బోట్‌లాగా!’ అనుకున్నది గానీ కొన్ని రోజుల తరువాత ఆ పోలికని మార్చుకోవలసి వచ్చింది. ఆ క్రమం ఇది:

తను ట్రెయిల్‌‌కి కొంచెం చివరకి ఉన్న కమ్యూనిటీ తోవనుంచి జాయిన్ అవుతుంటే అతను ట్రెయిల్ రెండో చివరి నించి ఎదురుగా వస్తున్నాడని ఆమె గుర్తించింది. ఎదురుగా వచ్చి ఆమెని దాటిన తరువాత అతనికి ఆ ట్రెయిల్ మీద మిగిలే దూరం మహా అయితే వంద గజాలుంటుంది. అక్కడ ఒక ఆరు అడుగుల ఎత్తున చెక్కలతో చేసిన కంచె, దానికి అవతల రెండు లేన్లుండే రోడ్డూ. ఆ కంచెని చేరిన తరువాత అతను తిరిగి వస్తూ తనను వెనకనుండి దాటినదెప్పుడూ ఆమెకు గుర్తులేదు. ఒక రోజు తనని దాటిన తరువాత ఆమె వెనక్కు తిరిగి చూసి ఆశ్చర్యపోయింది. అతను ఎగిరి కంచెని దాటాడు. కీచుమంటూ ఆగిన కారు టైర్ల శబ్దాన్ని విని, ‘అతను కారు కింద పడలేదు కదా!’ అని ఆదుర్దాపడుతూ ఆమె పరుగున వెళ్ళి ఆ కంచె సందుల్లోంచి చూస్తే ఒక కారు అప్పుడే కదిలి వేగాన్ని పుంజుకుంటోంది గానీ ఆమె భయపడ్డట్లుగా అతను వంటినిండా గాయాలతో రోడ్డుమీద పడి కనిపించలేదు.

మరునాడు పొద్దున అతను ఎదురవడం ఆమె కుతూహలాన్ని ఇనుమడింపజేసింది. క్రితం రోజు అతనికి ఏమయినట్లు? పైగా అతను ఆ ముందురోజుకి రెట్టింపు వేగంతో తనవైపు వస్తున్నాడు! ఆమెకు హైస్పీడ్ ట్రెయిన్ గుర్తొకొచ్చింది. అతని ఫోటో తియ్యాలని నిశ్చయించుకుంది. అప్పుడు ఆమె గమనించినవి రెండు విషయాలు: ఒకటి సెప్టెంబర్ మాసం అవడంవల్ల సూర్యోదయం ఆలస్యమవుతోంది. రెండవది, సూర్యుడు దాదాపు ఆ ట్రెయిల్‌కి చివరన ఉదయిస్తున్నాడు. అంటే, అతను సూర్యుడివైపు పరుగెత్తుతున్నట్లు. అప్పుడామెకు సూర్యుడు సంవత్సరానికి రెండుసార్లు మాత్రమే – సెప్టెంబర్, మార్చ్ 22 లేదా 23 తారీకుల్లో – తూర్పున ఉదయిస్తాడని, మరి కొద్ది రోజుల్లో విషువం అనీ గుర్తుకొచ్చింది. ఆ ప్రత్యేక దినాల్లో ఈ ట్రెయిల్ తిన్నగా తూర్పు-పడమర దిశల్లో ఉంటుంది!

ఆమెకి కలిగిన ఆలోచన ఒక్క క్షణం ఆమె గుండె కొట్టుకోవడాన్ని ఆపింది గానీ, ‘అది మరీ అత్యాశ!’ అని ఆమె మదిలోని న్యూరాన్లు నిర్ణయించిన తరువాత ఆమె శరీరంలో రక్తం ప్రవహించడం తిరిగి మొదలెట్టింది.

అయినా సరే, తనవంతు ప్రయత్నం చెయ్యాలనుకుని ఒకనాడు కెమెరాకి మోటార్ డ్రైవ్ అమర్చి, హైస్పీడ్ సెటింగ్ సెలెక్ట్ చేసుకుని, ట్రైపాడ్‌కి కెమెరాని బిగించి, తూర్పువైపుగా సెట్ చేసి సిధ్ధమయింది. ఆమెని నిరాశపరచడం ఇష్టంలేనట్టుగా అతను మరింత వేగంగా పరుగెత్తి కంచెమీద నాలుగడుగుల ఎత్తులో పైకి ఎగిరాడు. ‘ఎంత దూరానికి అవతల నేలని తాకివుంటాడు?’ అని ఆమె మదిలో మెదిలిన ప్రశ్నకు జవాబుగా అన్నట్టుగా రోడ్డుకు అవతల ఉన్న ఇళ్ళ బాక్‌యార్డ్‌లో కుక్క మొరగడం లీలగా వినిపించింది. ఇంటికి వచ్చి ఫోటోలు చూస్తే ఫ్రేమ్‌లోనే ఉన్నాడు గానీ ఉదయిస్తున్న సూర్యుడికి కిందగా, అతని తలకీ ఆ బింబం కింద అంచుకీ కొంచెం ఎడం ఉన్నది. ‘ఇంకొక రెండు రోజులయితే తాకుతున్నట్లుగా ఉంటుందా?’ అనుకున్నది. విషువం వారం రోజుల్లోనని కాలెండర్ ఆశని రగిలించింది కాని, తరువాత ఆరు రోజులు వరుసగా ముసురు, వర్షం దాని మీద నీళ్ళు చిలకరించాయి. వాతావరణ సూచనల ప్రకారం 22వ తారీకు సూర్యోదయాన్ని చూడడానికి ఏ అంతరాయమూ ఉండకపోవడం ఆమెకు ధైర్యాన్నిచ్చింది.

ఆ ఉదయం రానే వచ్చింది, వెళ్ళింది.

ఆ రోజంతా ఫోటోలు ఆమెని మేఘాల్లో నడిపించడానికి కారణం అతను సూర్యుడి ముందు రకరకాల పరిమాణాల్లో కనిపించడం. కెమెరాకి దగ్గరగా ఉన్నప్పుడు సూర్యుడిని కొంత కప్పేస్తూనూ, కొంత దూరం వెళ్ళిన తరువాత గాలిలో తేలుతూండడంవల్ల సూర్యగోళం కింది అంచున ఒక కాలుపెట్టిన పరుగు పోజులోనూ, చివరిలో సూర్యుడిలో మచ్చగా మిగిలిపోతూనూ అతను!

అప్పుడామెకు ఆ ట్రెయిల్ తెడ్లున్న రోయింగ్‌ బోట్‌లాగా ఉన్నదనుకున్న మొదటి ఆలోచన గుర్తుకొచ్చింది. ‘కాదు, అది విమానంలా ఉన్నది. తేడా అల్లా, విమానం రన్ వే మీద పైకి లేస్తుంది. ఇతను మైలు పొడవున్న విమానం మీంచి పైకెగిరాడు,’ అనుకున్నది.

మరునాడు, ఆ తరువాత ఒక వారంపాటూ మార్నింగ్ వాక్ సమయంలో అతనికోసం ఎదురుచూసింది కానీ అతను కనపడలేదు. ‘ఎంతదూరం వెళ్ళాడో? పక్క ఊరిలో లాండ్ అయ్యుంటే త్వరగానే వచ్చివుండేవాడు. పక్క రాష్ట్రానికో దేశానికో చేరలేదు కదా?’ అనుకుని నవ్వుకుంది. వెంటనే, ‘తూర్పు దిశలో పక్కదేశం అంటే అట్లాంటిక్ మహా సముద్రానికి అవతల ఆఫ్రికా ఖండంలో!’ అని ఆమెకు గుర్తొచ్చింది. ‘అయ్యుండదులే’ అని సర్దిచెప్పుకుంది.

రెండు వారాల తరువాత అతను ఆ ట్రాక్ మీద పరుగెత్తుతూ కనిపించాడు.

ఈసారి ఫోటోలు పట్టుకున్న దృశ్యం, అతను ఒక పాదాన్ని సూర్యుడి నెత్తిమీద మోపి ఆవల కెగురుతూండడం.

చలికాలం మొదలయిన తరువాత మార్నింగ్ వాక్‌లో ఎవరూ కనిపించకపోయినా ఆమె అతనికోసమేనన్నట్టు కొంతకాలం వెళ్ళింది. కనిపించకపోయేసరికి, ‘ఈసారి సూర్యగోళాన్ని దాటినట్టున్నాడు, కనిపించడానికి చాలా కాలమే పట్టేటట్లుంది’ అనుకుంది.

తరువాత ఆమె ఆలోచనల్లో అతను నిండివుండడానికి కారణం, ఆ ఫోటోలకి అంతర్జాతీయ గుర్తింపులు, బహుమతులు రావడం. ‘ఫోటోషాప్ చేశావా?’ అని ఆమెని అడగనివాళ్ళు అరుదు. ఆసక్తిగా, ‘ఎలా తీశావ్?’ అని అడిగినవాళ్ళకు నమ్మేలా చెప్పగల జవాబు ఆమె వద్ద లేదు. ‘ఎక్కడ తీశావ్?’ అన్న తెలిసినవాళ్ళ ప్రశ్నకు ‘ఇంటి దగ్గరే’ అని చెప్పి, ‘చెప్పడం ఇష్టం లేకపోతే సరే. అబద్ధం చెప్పడం దేనికి? కొండ శిఖరాల మీద నుంచి దూకుతున్నప్పుడు తీశాను అంటే నమ్మచ్చు గానీ ఇంటి దగ్గర అంటే అంత ఎత్తున గాలిలోకి ఎగరాలి. మేమేమయినా చెవిలో పువ్వు పెట్టుకుని కనిపిస్తున్నామా?’ అన్న కినుకని ఎదుర్కొంది. అలా, ‘ఎలా? ఎక్కడ?’ ప్రశ్నలు ఎదుర్కొన్న ప్రతిసారీ అతన్ని ఆమె ఆలోచనల్లో ముందుకు తోశాయి. ఫోటోలని చూసినప్పుడు తన ప్రతిభ గూర్చి గర్వించిందిగాని, బహుమతులు పుచ్చుకుంటున్నప్పుడు మాత్రం వాటిల్లో అతని భాగాన్ని ఎక్నాలెడ్జ్ చెయ్యాలనుకుంది.

థాంక్స్‌గివింగ్‌, క్రిస్మస్ సెలవులకి తల్లిదండ్రులవద్దకు వెళ్ళినప్పుడు తప్ప కంప్యూటర్ మీద వర్క్ చేస్తున్నప్పుడు – ఇంట్లోనయినా, ఆఫీసులో అయినా – తలెత్తినా, ఆమె ఇంట్లో ఏ గదిలోకి అడుగుపెట్టినా సూర్యబింబం కేంద్రంగా రకరకాల పరిమాణాల్లో కనిపించే అతని ఫోటోలు దర్శన మిస్తాయి.

ఇంట్లోకి అడుగుపెట్టి కలయజూసిన స్నేహితురాలు “హి ఈజ్ రన్నింగ్ అవే ఫ్రమ్ యూ!” అని వేళాకోళం చేసేదాకా ఇంకొకరు ఆ రెండవ కోణంలో చూడవచ్చునని ఆమె గ్రహించలేదు. “సూర్యుణ్ణి దాటి నీవైపు వస్తున్నప్పుడు ఫోటో తీసి చూపించు!” కోపంగా జవాబిచ్చింది.

ఆమెకు అతని మొహం అంత త్వరగా గుర్తుకు రాలేదు. ఏ ఫోటోలోనూ అది కనిపించదు మరి! అతన్ని ముందునించీ చూసింది కళ్ళల్లోకి చూస్తూ ‘గుడ్ మార్నింగ్’ చెప్పినప్పుడే. మదిలో అన్ని నెలలు వెనుకకు వెడితే ఆ మొహం లీలగా కనిపించింది.

మార్చ్ నెల మధ్యలో వాతావరణం కొంచెం వెచ్చబడడంతో కెమెరాని మెడలో వేసుకుని మార్నింగ్ వాక్ మొదలుపెట్టింది. అక్కడక్కడా ఒకరిద్దరు ఎదురయ్యారుగానీ అతని జాడ లేదు. అంతకు ముందు కెమెరాని క్లిక్‌మనిపించేలా చేసిన పశుపక్ష్యాదులు ఇపుడామె కళ్ళని దాటి మదిని చేరడం లేదు. కెమెరా గుడ్డిదయింది.

ఒకరోజు ఈమెయిల్ పంపుతున్నప్పుడు తేదీని గుర్తించింది – మార్చ్ 22. ‘దాదాపు ఆరు నెలలయింది ఆ ఫోటోలు తీసి!’ అనుకుంది.

ఆరోజు సాయంత్రం, లివింగ్ రూములో సూర్యుడి నెత్తిమీద పాదం మోపిన ఫోటోని ఫ్రేమ్‌తో సహా తీసుకొచ్చి బెడ్‌రూమ్‌లో డ్రెసర్ మీద పెట్టింది. నైట్ డ్రెస్‌లోకి మారి పడుకోబోయే ముందర మంచం మీద హెడ్‌బోర్డ్‌ని ఆనుకుని కూర్చుని ఎదురుగా ఉన్న ఆ ఫోటోని చాలాసేపు అలానే చూసింది. కనురెప్పలు ఎప్పుడు మూసుకున్నాయో ఎప్పుడు నిద్రలోకి జారుకున్నదో ఆమెకు తెలియదు.

అలారమ్ శబ్దానికి ఆమెకు మెలకువ వచ్చింది. రాత్రి బెడ్‌లైట్ ఆర్పడం మరచిపోయిందని తెరిచి అంత వెలుగుని భరించలేక మూసుకున్న కళ్ళు తెలిపాయి. లైట్‌కు ఎడంగా పక్కకు తిరిగి ఆ వైపు గోడని కాసేపు చూసి, కళ్ళు గదిలో వెలుతురుకి అలవాటు పడ్డ తరువాత పక్క మీంచి లేచి కూర్చుని డ్రెసర్ వైపు చూసి ఉలిక్కిపడ్డది. కాళ్ళని కిందకు వేలాడేసి దాని మీద కూర్చుని తనని చూస్తూ అతను కనిపించాడు. దుప్పటిని మెడదాకా లాక్కుంటూ పక్క మీద వెనక్కు జరిగి, హెడ్‌బోర్డ్‌ని ఆనుకుని కూర్చుని డ్రెసర్ వైపు చూసింది. ‘ఎంతసేపటినించీ అలా కూర్చున్నాడో తెలియదు!’ అని ఆమె మెదడులోని ఒక భాగం వేగంగా పనిచేసి మిగిలిన భాగానికి తెలియజేసింది. కలో, నిజమో తేల్చుకోవడానికి ఆమెకు తట్టిన ఒకే మార్గం కెమెరా నడగడం. అది పక్క గదిలో ఉండడం వల్ల దుప్పటిని వంటికి చుట్టుకుని గుమ్మం దాటి బయటకు వెళ్ళి, వెనక్కు ఒక అడుగేసి, నడుముని విల్లంబులా వెనక్కు వంచి తలకాయని డ్రెసర్ వైపు తిప్పి చూసి, దృశ్యం ఏమీ మారలేదని నిర్ధారణ చేసుకుని, వెళ్ళి కెమెరాని తెచ్చి క్లిక్ మనిపించింది. డిజిటల్ కెమెరా తను రికార్డ్ చేసిన దృశ్యాన్ని వెంటనే డిస్‌ప్లేలో చూపించింది.

దినసరి కార్యక్రమంలో తరువాయి భాగం మార్నింగ్ వాక్‌కి వెళ్ళడం కనుక కెమెరాని, వంటికి చుట్టుకున్న దుప్పటిని మంచం మీద పడేసి ఫ్రెషప్ అయి వచ్చి తగినట్టు డ్రస్ చేసుకుంది. కెమెరాని మెడకు తగిలించుకుంటూ అతనివైపు చూసింది. ‘అది అవసరమా?’ అన్న అర్థం అతని చిరునవ్వులో కనిపించి, కెమెరాని అక్కడే వదిలేసి అతని వెనక బయటకు నడిచింది.