బాపూ బాగా అలిసిపోయినట్టు కనపడుతున్నారు. దీదీ వచ్చి ఆయన రాత్రికి పెందరాడే పడుకుంటారని, భోజనం తొందరగా తయారు చెయ్యాలని పురమాయించింది. సోహన్‌రామ్ ఊపిరి పీల్చుకున్నాడు. బాపుకు భోజనం అంటే – ఉడికించిన రెండు అరటిపళ్ళు, ఓ కప్పు ఆకు కూరలు, ఓ గ్లాసు మేక పాలు; వాటితో పాటు క్రమం తప్పకుండా ఓ బుల్లిసీసాలో రెండు చెంచాల తేనె పెట్టాలి. బాపూ భోంచేసి పడుకోగానే, సోహన్ కూడా నిద్రకు ఉపక్రమిస్తాడు.
సోహన్‌రామ్‌కు కూడా బాగా అలసటగా వుంది. అతను పొద్దుట్నించీ బాపూతో పాటు బాగా నడిచున్నాడు. ఆయన వేగంతో పోటీ పడుతూ దూరాలు నడవడం అతనికి బాగా అలవాటున్నప్పటికీ ఇక్కడి ప్రత్యేకమైన వాతావరణం, ఎత్తుపల్లాలుగా సాగే ఈ కొత్త నేలా అతన్ని బానే ఇబ్బంది పెట్టాయి. ఎటుచూసినా నీటి కాలువలు, మడుగులు, చెరువులు. వాటిమీంచి వీస్తున్న ఆవిరి చెమ్మ, మట్టి, కుళ్ళిపోయిన మొక్కలు, ఆకులు, నాచు ఇవన్నీ కలిసి వస్తోన్న వాసన ఊపిరాడకుండా చేస్తోంది. ఇక్కడెవరూ ఒంటి మీద చొక్కాలేసుకుని లేరు. తల మీది జుట్టంతా కలిపి నుదుటి మీద పడేటట్టుగా ముడేసుకుని ఉన్నారు. ఏదో ముక్కుతో మాట్లాడుతున్నట్టు ఓ వింతైన భాషలో మాట్లాడుతున్నారు. వీటన్నిటితో విసిగిపోయిన సోహన్‌రామ్ తొందరగానే అలిసిపోయాడు.
బాపు ఎక్కడికి వెళితే అక్కడి జనం ఆయన్ను కలవడానికి వస్తున్నారు. ఆయన ముందు సాష్టాంగపడి లేచి పక్కకెళ్ళి గౌరవంగా భక్తితో నిలబడుతున్నారు; మఠాధిపతితో మాట్లాడుతున్నట్టు చేతిని నోటికి అడ్డం పెట్టుకుని, వినమ్రంగా రెండో మూడో మాటలు ఆయన చెవిన వేస్తున్నారు. కొంతమంది ఆడవాళ్ళైతే బాపు పాదాలను తాకిన మరుక్షణమే వెక్కి వెక్కి ఏడ్చేస్తున్నారు. చేతుల్లో ముఖాన్ని దాచుకుని, తమ తలలు పూర్తిగా వంచి భావోద్వేగాలను అణుచుకోలేక అవస్థలు పడుతున్న అలాటివాళ్ళను, స్థానిక కాంగ్రెస్ కార్యకర్తలు తెచ్చిపెట్టుకున్న గాంభీర్యంతో అక్కణ్ణించి పక్కకి తీసుకెళ్తున్నారు. పార్టీ వాళ్ళు, అక్కడి పెద్దలు ఒకరి తర్వాత ఒకరు అలా వస్తూనే వున్నారు.
ఓ బూడిద రంగు సూటు వేసుకున్న బట్టతలాయన చాలాసేపు బాపుతో సమావేశం అయ్యాడు. ఏదో బాగా పెద్దచదువులు చదివిన మనిషో, ఉన్నత పదవిలో ఉన్న మనిషో అయివుంటాడు. మొహానికి ఒంటికంటద్దం తగిలించుకున్నాడు. ఆయన ఆవేశపడి మొహం గనక బిగుసుకుంటే అది ఊడి కిందపడేలా వుంది. ఆపకుండా మాట్లాడుతున్నాడు. సోహన్‌రామ్‌కు దేశీయాసలో అయితేనే ఇంగ్లీష్ అర్థం అవుతుంది. ఎవరైనా అదే పనిగా మాట్లాడుతూ ఉంటే మటుకు బాపు మౌనముద్ర దాలుస్తారు. ఆయన తన చూపులతోటే తీవ్రమైన ఆసక్తిని కనపరచగలరు.
కానీ ఆయన చేతులు పద్ధతిగా రాట్నం తిప్పడం మొదలు పెట్టి, ఆ నూలు మెలికలు తిరుగుతూ క్రమంగా దారంగా మారడం గమనించినవారికి మాత్రమే, బాపు తన చుట్టూ ఉన్న పరిస్థితులకు అతీతమైన స్థితిలోకి వెళ్ళిపోయారని అర్థం అవుతుంది. ఆయన్ని కలవడానికి వచ్చేవారిలో అతి కొద్దిమంది తప్ప మిగతావాళ్ళు నిరంతరంగా తిరిగే ఆ రాట్నాన్ని పట్టించుకునేవాళ్ళు కాదు – వాళ్ళల్లో ఎక్కువమంది ఆడవాళ్ళు, పిల్లలు. కొంతమంది తిరిగే రాట్నం, వాళ్ళ సంభాషణకు అడ్డు పడుతోందని భావించేవాళ్ళు. విదర్భ నించి వచ్చిన కుర్రవాడొకడు ఒకసారి అడిగాడు, ‘బాపూజీ! రాట్నం తిప్పుతూ ఎందుకు మాట్లాడతారు. అది తప్పు కదా?’ బాపూ తన నోరంతా తెరిచి, శరీరం అంతా ఊగిపోయేంతలా ఆపకుండా నవ్వుతూనే వున్నారు.
బూడిద రంగు సూట్లోని ఆ బట్టతలాయన వెళ్ళిపోయిన తర్వాత, తెల్లకోటు వేసుకుని తలపాగా చుట్టుకొని నామాలు పెట్టుకున్న పెద్దమనిషి ఒకాయన బాపుతో చాలాసేపు మాట్లాడుతూ వుండిపోయాడు. మంచి ఇంగ్లీషులో, ఆత్మ-పరమాత్మల మధ్య సంబంధాన్ని గురించి, ఆత్మ శాశ్వతత్వం గురించి మాట్లాడాడు. బాపు ఆయన ప్రశ్నలకు చాలా సాధారణమైన సమాధానాలు ఇచ్చారు. చివరికి అన్నారు బాపూ: “ఆత్మ గురించి నేనేమీ మాట్లాడలేను. కానీ మీరు ఇదిగో… ఈ తిరిగే రాట్నం గురించి అడిగితే చాలా చెప్పగలను.” ఆ బట్టతలాయనకు ఏమనాలో అర్థంకాక, మొహం ఎర్రగా చేసుకుని, కళ్ళనిండా కోపంతో అటూ ఇటూ చూశాడు. అక్కడ చాలామంది ఉండడం వల్ల తనను తాను సంబాళించుకున్నాడు.
బాపు సోహన్‌ని మంచినీళ్ళు తెమ్మన్నారు. తీసుకొచ్చి ఇవ్వగానే, ఆ పెద్దమనిషి అతని వైపు తీక్షణంగా చూస్తూ, “ఈ కుర్రవాడు ఎవరు, ఏంటని తెలుసుకోవచ్చా?” అని బాపూని స్వరం తగ్గించి, సూటిగా ప్రశ్నించాడు. సోహన్‌రామ్ రక్తం మరిగి ఉప్పొంగి తన తలలోకి ఎగజిమ్మినట్లనిపించింది. ఇలాటి సందర్భం రోజుకు ఎన్నోసార్లు వస్తుంది… కానీ అది ప్రశ్న రూపంలో బయటకు రావడం చాలా అరుదు. కానీ, ఎదుటి వ్యక్తి ఆలోచనల్ని స్పర్శించి, గుర్తించేటంతగా, ఎల్లప్పుడూ సోహన్‌రామ్‌లో తనదైన ఆ అవగాహన అణువణువునా నిండిపోయి ఉంటుంది.
బాపు నింపాదిగా వెనక్కి వాలి “నా దగ్గరే ఉంటాడు. సోహన్‌రామ్ అతని పేరు” అన్నారు.
ఆ మనిషి కళ్ళు చికిలించాడు. “మీరేమో వైశ్యులు, వైష్ణవులని కూడా విన్నాను. కానీ ఇతని మొహం చూస్తే…”
సోహన్‌రామ్‌కు ఎటో చూస్తున్నట్టుగా చూపులు పక్కకు తిప్పుకోవడం తెలుసు. జీవ నిర్జీవ పదార్థాలతో సహా సమస్త విశ్వమూ తన వైపే దృష్టి సారించినట్టు అనిపించింది అతనికి.
“నేను వైష్ణవుణ్ణి! అతను హరిపుత్రుడు” అన్నారు బాపు.
ఆ పెద్దమనిషి గొంతులో ఊపిరి బిగిసినట్టున్న స్వరంతో “ధర్మశాస్త్రాలు దీనికి అంగీకరిస్తాయా?” అని అడిగాడు.
“అవసరం లేదు. రాముడి అంగీకారం తీసుకున్నాను.”
“ఇవన్నీ అర్థం పర్థం లేని మాటలు.”
“నేను రాముడితో మాట్లాడాను. మీరు కూడా ఆయనతో మాట్లాడగలిగితే, ఇదే విషయం ధృవపరుచుకోవచ్చు.”
అతి ఆవేశంతో ఆ పెద్దమనిషి ఒక్క ఉదుటున లేచి మారుమాట్లాడకుండా అక్కణ్ణించి నిష్క్రమించాడు.
బాపూ “రామ్! రామ్!” అని స్మరిస్తూ రాట్నాన్ని తిప్పుతూనే వున్నారు. సోహన్‌రామ్ అందంగా మెలికలు తిరుగుతూ చట్రాన్ని మృదువుగా చుట్టేసుకుంటోన్న దారం వైపు చూశాడు. పద్ధతిగా వైనంగా పనిచేస్తూన్న ఆ రాట్నాన్ని చూస్తోంటే సోహన్‌రామ్ మనసు ఏదో తెలీని ప్రశాంతతతో నిండిపోయింది. తాను లేచి గదిలోనించి బయటకు వస్తూంటే, అక్కడ వున్న వాళ్ళందరూ తాము పట్టిన బిగువును సడలించినట్టు అనిపించిందతనికి. వెలుపలకు రాగానే ఏదో చల్లని గాలి అతన్ని తాకిన భావన కలిగింది. చెప్పలేనంత వేదన అతని గుండె లోతుల్లో గూడు కట్టుకుని వుంది. దాన్ని పట్టించుకోకుండా వుండాలని ప్రయత్నించినంతసేపూ అది పెనుభారంగా మారి అతని ఒళ్ళంతా బరువెక్కిపోతోంది. ఇదంతా కొంత కాలం కిందట మొదలై, అదే పనిగా పెరుగుతూ వస్తోంది. దీనికంతా కారణం, బర్ద్వాన్‌లో వున్న తన గ్రామానికి తిరిగి వెళ్ళిపోవాలనే తపనా? అయినా తనకక్కడ ఏముందని?
భూమిహార్‌ల కళ్ళపడకుండా తిరగాల్సిన పరిస్థితి. అయినా సరే! వారానికి ఒక్కసారైనా రాళ్ళతోనో చెప్పులతోనో కొట్టించుకోవడం తప్పదు. రాత్రనకా పగలనకా ఒకటే ఆకలి. వెలుగున్నంతసేపూ ఒళ్ళు మరిచిపోయేంతలా పని చేయాలి. ఇంతకుముందు వూరికే అనిపించుకున్న బూతుమాట ఈరోజు ఒక్కటి తన చెవిన పడితే చాలు, తనను అక్కడికిక్కడే కాల్చి బూడిదగా మార్చేయడానికి. తన కుటుంబం బంధువులు చిన్నప్పటి స్నేహితులు ఇంకా అక్కడే వుంటారు. ఆ పాడుబడి కూలిపోవడానికి సిద్ధంగా వున్న గుడిసెల్లోనించి మురికి దుమ్ముతో పాటు గూడు కట్టుకుని వున్న – హింస, అదుపులేని ప్రేమ, అనుబంధాలు, తీవ్రమైన పరస్పర విద్వేషం, అంతులేని కుమ్ములాటలు, అసూయలు, పిరికితనం, నయంకాని అంటురోగాలు, వీటన్నిటితో నిండివున్న – ఆ గాలిని అతను ఇంకేమాత్రం పీల్చలేడు. అతను ఇంకేమాత్రం వాళ్ళు తినే తిండిని ముట్టలేడు. ఇంకేమాత్రం వాళ్ళతో కలిసి కనీసం ఒక చిరునవ్వు కూడా చిందించలేడు. అతను చదివిన పుస్తకాలు, చూసిన ప్రదేశాలు, కలిసిన మనుషులు, అతన్నెక్కడికో దూరానికి తీసుకవెళ్ళిపోయాయి. దూరం – జ్ఞాపకాలనన్నిటినీ వెనక్కి తోసేసి, వాటిని పూర్తిగా వాడిపోయేలా చేసేంత దూరం. వెనక్కి వెళ్ళడానికి అతనికి ఊరంటూ ఏదీ లేదు. అతనికక్కడ స్థానం లేదు. అతడు పాత సోహన్‌రామ్‌గా మారగలిగితే మాత్రమే అక్కడికి తిరిగి వెళ్ళడం సాధ్యం. అతడేం కోల్పోయాడు? ఆ పాత సోహన్‌రామ్‌నా?
ఆరేళ్ళ క్రితం, వాళ్ళ మురికివాడ పక్కనున్న బురదగుంటలో చేపలు పడుతూ ఉంటే, ఆ మట్టిదారిలో కొంతమంది మనుషులు నడుచుకుంటూ వెళ్ళడం చూశాడు. పొదల్లో దాక్కుంటూ దగ్గరికెళ్ళి వాళ్ళను చూశాడు. అతని మీదికి వాళ్ళొస్తే, ఎదుర్కోవడానికి ఆయుధంగా అతని చేతిలో ఓ రాయి వుంది. వయసుపైబడి, ముదురు శరీర ఛాయతో వాళ్ళ ముందుండి నడిపిస్తూన్న ఓ పెద్ద మనిషి దోనె చెవులను చూసి సోహన్‌రామ్ తనలో తానే నవ్వుకున్నాడు – ‘పంది చెవులు!’
ఆయన సోహన్‌రామ్ వైపు చూసి నవ్వి అడిగాడు “నీ పేరేమిటి?”
సోహన్‌రామ్ తనకు తెలిసిన ఒక పచ్చి బూతుమాటని సమాధానంగా ఇచ్చాడు. ‘పంది చెవులు’ అని గట్టిగా అరుచుకుంటూ అక్కడ్నించి పరిగెత్తి వెళ్ళిపోయాడు. కొంతదూరం పరిగెత్తి వెళ్ళింతర్వాత ఎవరూ తనని అనుసరించడం లేదని నిర్ధారించుకుని మళ్ళీ వెనక్కి వచ్చి అరిచాడు: ‘పంది చెవులు.’
ఆ పెద్దాయన బిగ్గరగా నవ్వి, “నువ్వింకా నా ప్రశ్నకు సమాధానం ఇవ్వలేదు. నీ పేరేమిటి?” అని ప్రశ్నించాడు. సోహాన్‌రామ్ తనకు తెలిసిన బూతు మాటలన్నిట్నీ వేగంగా వరుసబెట్టి గట్టిగా ప్రయోగించి అవసరమైతే పరుగందుకుని పారిపోవడానికి తయారుగా ఉన్నాడు. ఆ పెద్దాయన నోరంతా తెరిచి బిగ్గరగా నవ్వుతూ ఏవీ సమాధానం ఇవ్వకుండా, ముందుకు నడవడం మొదలెట్టాడు. సోహన్‌రామ్ బూతులు వల్లిస్తూ వాళ్ళ వెనకాలే నడిచాడు. ఎవ్వరూ అతణ్ణి పట్టించుకోలేదు. ఆ ఆటలో ఓడిపోయినట్లు ఆడవాళ్ళ కళ్ళముందర తాను నగ్నంగా నిలబడిపోయినట్టు సోహన్‌రామ్‌కు అనిపించింది. అరవడం ఆపేశాడు. ఆవేశంతో గోళ్ళు కొరుక్కోవడం మొదలెట్టాడు. ఒక గోరు ఊడొచ్చి, మంట పుట్టింది. ఆ మంట ఒంటికంతా పాకింది.
ఆ పెద్దాయన గ్రామంలోకి ప్రవేశించబోతూ, వెనక్కి తిరిగి అతణ్ణి చూసి నవ్వాడు. సోహన్ అక్కడే నిలబడి, ఆయన అనుచరగణంతో పాటు గ్రామంలోకి అదృశ్యం అవ్వడాన్ని చూస్తూ అలా వుండిపోయాడు. సూర్యుడు నడినెత్తి మీదికొచ్చి తల మాడుతోంది. కాళ్ళు మొద్దుబారుతున్నాయి. అక్కణ్ణించి దూరంగా పరిగెత్తి వెళ్ళిపోవాలని అనేకమార్లు ప్రయత్నించాడు కానీ కుదరడం లేదు. ఆ పెద్దాయన మళ్ళీ వెనక్కొస్తే, ఓ పేడముద్ద ఆయనమీదకు విసిరేసి తాను పారిపోయినట్టుగా ఊహించుకున్నాడు. అందుకే అక్కడ తాను నిలబడిపోయినట్టు సమాధానపడ్డాడు. కావాలంటే ఒక పెద్ద రాయి తీసుకొని ఆయన మీదికి విసరొచ్చు. ఆ బట్టతల పగుల్తుంది. రక్తం వస్తుంది. సోహన్‌రామ్ తనలో తానే నవ్వుకున్నాడు. సోహాన్‌రామ్ ఆ ఎర్రటి మట్టిదారంతా తన చెవుల్ని రిక్కించి పరిచాడు. వినపడే ప్రతి శబ్దమూ అడుగుల చప్పుడులానే అనిపించి, అతను ఉద్రేకంతో నిండిపోయాడు.
సాయంసంజె వేళకు వాళ్ళు వెనక్కి వచ్చారు. అందరూ బాగా అలసిపోయి ఉన్నారన్నది వాళ్ళ నడకలో తెలుస్తోంది. వాళ్ళు వెళ్ళొచ్చిన ఆ గూడెంలో, వాళ్ళకు ఆహ్వానం కాదు కదా కనీసం తాగడానికి నీళ్ళు కూడా అందలేదన్నది స్పష్టంగా తెలుస్తోంది. ఆయన దగ్గరకు వస్తున్న కొద్దీ తన కాళ్ళు వాటంతట అవే వణుకుతూ ఉండటాన్ని గమనించాడు. పొట్టంతా ఉబ్బినట్టయి మూత్రం తన్నుకొచ్చింది. సోహన్‌రామ్‌ను చూడగానే ఆయన చిరునవ్వు చిందించారు. సన్నటి గొంతుతో “నీ పేరేవిటి?” అని అడిగారు. నోరు మెదిపాడు సోహన్‌రామ్. నోరు పిడచగట్టుకుపోయి మాట బయటకు రాలేదు. ఆయన మళ్ళీ “నీ పేరేవిటి?” అని అడిగారు. సోహన్‌రామ్‌కు గుండెలోతుల్లో నుండి ఆక్రోశం పొంగుకొచ్చి అది తనను కుదిపేస్తూ ఏడుపులా మారిపోతుండటం గమనించాడు. అలా నేలకొరిగి కూర్చుండిపోతూ వెక్కిళ్ళు పెట్టి ఏడ్చాడు. ఆయన అతని దగ్గరకు వచ్చి అతని తలమీద చేతులు ఉంచారు.
వాళ్ళు వచ్చి ఆ రోజంతా గూడెంలోనే ఉండిపోయారు. గూడెం అంతా ఉద్వేగంతో, అయోమయంతో, ఒక తెలీని ఇబ్బందితో తబ్బిబ్బు అయిపోయింది. సోహన్‌రామ్ ఆయన కాళ్ళ దగ్గరే కూర్చుండిపోయాడు. ఆయన స్పర్శను వదిలి, దూరంగా వెళ్ళబుద్ధి కాలేదు. ఆ పెద్దాయన శరీరం వయసు పైబడిందనడానికి సూచనగా చిన్నగా కంపిస్తోంది. ఆ వణుకు తనతో జరుగుతోన్న ఒక ఆత్మీయ సంభాషణలా అనిపించిందతనికి. ఆ పెద్దాయన అతని భుజం మీద చేయి వేసి అడిగారు “నాతో వస్తావా?” తల ఊపాడు. ఆయన కాళ్ళలాగే చేతులు కూడా భారీగా బరువుగా వున్నాయి. ఆ చేతి భారమంతా అతని తలమీద పడింది.
ఈ ఆరేళ్ళలో సోహన్‌రామ్ ఆయన్ని ఎక్కువగా తాకింది లేదు, అదెప్పుడో ఒక్కోసారి యాదృచ్ఛికంగా జరిగినప్పుడు తప్ప. కాకపోతే ఆయన స్పర్శను సోహన్‌రామ్ అనుభవిస్తూనే వున్నాడు. ఆత్మీయంగా అనిపించే ఆ స్పర్శతో కూడిన వణుకు, అనురాగం, దాని భారం… మరీ ముఖ్యంగా అతను మగతగా వున్నప్పుడు. ఎందుకంత భారం? ఒక్కోసారి ఆ బరువంతా అతన్ని నొక్కిపెట్టి, ఊపిరాడకుండా చేస్తుంది. శ్వాస కోసం ఆరాటపడుతూ, ఉలిక్కిపడుతూ లేచి కూర్చుంటాడు.
చూడ్డానికి వచ్చిన సందర్శకులందరూ వెళ్ళిపోయాక దీదీ వచ్చి, “బాపూ భోజనం తయారుగా ఉందా?” అని అడిగింది. సోహన్ అరటిపళ్ళు కడిగి తీసుకురావడానికి వెళ్ళాడు. బయట ఏవో బిగ్గరగా మాటలు వినిపించాయి. కొంచెం చిరాగ్గా కోపంగా అటువైపు చూశాడు. అక్కడ చక్కటి దేహదారుఢ్యం కలిగిన ఒక నల్లటి మనిషి తలపాగా చుట్టుకుని నిల్చుని వున్నాడు. అతనితోబాటు మరికొంతమంది నల్లటి యువకులు నిలబడి వున్నారు. వాళ్ళు గొంతులు పెద్దవి చేసి మాట్లాడుతున్నారు. అక్కడున్న సేవాకార్యకర్తలు వాళ్ళను ఆపడానికి ప్రయత్నించే భాగంలో తాము కూడా స్వరం పెంచి మాట్లాడుతున్నారు. దీదీ బయటకొచ్చి అడిగింది. “ఏవిటి సంగతి గణపతీ?” ఒక సేవాకార్యకర్త సమాధానం ఇచ్చాడు. “వీళ్ళు బాపూని చూడాలంటున్నారు. బాపూ ఇప్పుడింకెవరినీ చూడరు అంటే వినిపించుకోవడం లేదు.”
“ఎవరతను?”
“అయ్యంకాళి అని స్థానిక నాయకుడు.” సమాధానం ఇచ్చాడు గణపతి.
“బాపూ బాగా అలిసిపోయున్నారు” అంది దీదీ.
అయ్యంకాళి పక్కనే వున్న ఒక యువకుడు, “నమస్కారం అమ్మా! నా పేరు సిండన్. మేము చాలాదూరం నించి వస్తున్నాం, ఇరణియల్ అనిచెప్పి తిరువనంతపురం అవతల. అక్కణ్ణించి కాలి నడకన వచ్చాము. బళ్ళల్లో కానీ, రహదారిలో కానీ వచ్చేటందుకు మమ్మల్ని అనుమతించరు. పొలంగట్ల వెంబడి పడివచ్చాము. ఎప్పుడో పొద్దున్నే బయల్దేరితే ఇప్పటికి చేరుకోగలిగాం” అని మాట్లాడ్డం మొదలెట్టాడు.
“అది మీ సమస్య!” అన్నాడు గణపతి. “బాపూ అలిసిపోయి ఉన్నారని ఆవిడ చెబుతూంటే మీకు వినపడ్డం లేదా?”
“ఆయన రేపు వెళ్ళిపోతున్నాడు అని విన్నాం” అన్నాడు సిండన్.
“అవును. మళ్ళీ ఇటొచ్చినప్పుడు మీరు ఆయన్ని కలవొచ్చు.”
“ఎప్పుడు?”
“చెప్పలేం. ఇంకో రెండేళ్ళు పట్టొచ్చు.”
“రెండేళ్ళా! అప్పటికి మేమెవ్వరమూ బతికుండకపోవచ్చు” అన్నాడు సిండన్. ఒక్కసారిగా అందరూ ఉలిక్కిపడ్డారు.
దీదీ వెంటనే “లోపలికి రండి” అంది. అప్పటిదాకా నల్లటి పోత పోసిన విగ్రహంలా ఒక్క మాట మాట్లాడకుండా రాయిలా నిల్చుని వున్న అయ్యంకాళి మెట్లెక్కాడు. ఎత్తయిన విగ్రహం, చదరపు ముఖం, వెడల్పాటి దవడలు, పొడవాటి మెలితిప్పిన మీసం, శక్తివంతమైన వెలుగుతో నిండివున్న కళ్ళు అతనొక చారిత్రక నాయకుడేమో అన్న అనుభూతిని కలిగిస్తున్నాయి. అతని చేతిలో బాగా చేవదేరిన గట్టి వెదురు కర్ర, చేతి పట్టుకు అరిగిపోయి బంగారు రంగులో మెరుస్తోంది. శిష్యులందరి చేతుల్లోకూడా కర్రలు. ఆ కర్రలు వాళ్ళ శరీరంలో ఓ సహజమైన భాగం అన్నట్టుగా నడుస్తున్నారు.
యథాలాపంగా “ఎవరీయన?” అని గణపతిని అడిగాడు సోహన్‌రామ్.
“పులైయర్ల నాయకుడు. అయ్యంకాళి” అన్నాడు గణపతి. “ఒక పెద్ద గూండా, మొరటు మనిషి. దాదాపు ముప్ఫయి మందిని చంపి ఉంటాడని సమాచారం. అయ్యంకాళి దళం అనిచెప్పి ఒక దుర్మార్గపు ముఠాని వేసుకుని తిరుగుతూ ఉంటాడు. అడిగింది ఇవ్వనివాళ్ళను దోచుకుని చంపి తగలపెడతాడు”.
“అయితే, పొన్నుతిరుమేని నాయర్ సేన ఏం చేస్తున్నట్టు?” అడిగాడు అయ్యంకాళి కోపంగా.
“అతనికి తెల్ల ఆఫీసర్ల సహకారం వుంది.” గణపతి సమాధానం ఇచ్చాడు.
“ఏం చేస్తాం, కలియుగం!”
“ఇక్కడికెందుకొచ్చినట్టో…”
సోహన్‌రామ్ గదిలోకి ప్రవేశించాడు. అయ్యంకాళి మౌనంగా బాపు ముందర కూర్చున్నాడు. మిగతావాళ్ళు చుట్టూ నిల్చున్నారు. సిండన్ గౌరవసూచకంగా కొంత దూరంలో కూర్చున్నాడు. సంభాషణ మొదలైంది.
సిండన్ మొదటగా, “మీ అభిప్రాయం తెలుసుకోవాలని వచ్చాం!” అన్నాడు.
బాపు సమాధానంగా “అన్యాయాన్ని న్యాయంతో ఎదిరించండి. హింసని కరుణతో, క్రౌర్యాన్ని కనికరంతో, ద్వేషాన్ని ప్రేమతో. నా మనసులోని మాట అదే” అన్నారు.
“మమ్మల్ని కుక్కల్లా తొక్కిపెట్టి మా ఆడవాళ్ళ మానాల్ని హరిస్తూ మా పిల్లల్ని బానిసల్ని చేస్తూంటే అహింస, ధర్మం అనుకుంటూ మేము కళ్ళు మూసుకోవాలా?”
“ఎవరైతే హింసకూ అన్యాయానికీ గురౌతారో వాళ్ళకి అహింసే పరమ ధర్మం, సరైన ఆయుధం!”
సిండన్ పట్టరాని కోపంతో ఒక్క ఉదుటున పైకి లేచాడు. “రే మాడన్! ఒక్కసారి ఈ సాములోరికి నీ వొళ్ళు చూపించు!”
మాడన్ తను కప్పుకుని ఉన్న అంగవస్త్రాన్ని తొలగించాడు. సోహన్‌రామ్ ఆ దృశ్యాన్ని చూసి భయంతో కొయ్యబారిపోయాడు. అతని వీపు ఛాతీ అంతా చీము, రక్తంతో నిండిపోయి వుంది. గాయం పగిలి దాని చుట్టూ రసి కప్పేసింది. ఒక్కసారిగా ఆ గదంతా ఉలిక్కిపడింది.
“కరైనాయర్లు వీణ్ణి లాక్కెళ్ళి పజ్జెనిమిదిసార్లు తిరువట్టార్ దేవాలయం చుట్టూతా నేలమీదే బరబరా ఈడ్చుకుంటూ తిప్పారు” అన్నాడు సిండన్. “వీడు చేసిన ఒకే ఒక నేరం గుడిలోకి పోయిన బర్రెని పట్టుకోవాలని లోపలికి వెళ్ళడానికి ప్రయత్నించడం. దేవళం భూముల్లో వేలకొద్దీ మావాళ్ళు చెమటోడ్చి పని చేస్తున్నారు. ఆ ఆదికేశవుడుకి పెట్టే బియ్యం, మేం కాళ్ళతో తొక్కి నార తీసిన వడ్లలోంచి వచ్చిందే. కానీ…”
బాపు అలానే కూర్చున్నారు. రాట్నం నెమ్మదిగా నడుస్తూ దారం మెలికలు తిరుగుతూ చట్రానికి చుట్టుకుంటోంది.
“మాట్లాడరేం! కొడితే పామైనా పడగ విప్పి కోపంతో పైకి లేస్తుంది. దూడైనా కొమ్ముల్లేని తలతో కుమ్మడానికి వస్తుంది. మా తరం అంతా వేల ఏళ్ళుగా కుక్కిన పేనుల్లా పడివున్నాము. నీకేం హక్కుందని మాతో అహింస గురించి మాట్లాడతావు? మేము కరైనాయర్ల ఇళ్ళల్లోకి వెళ్ళి వాళ్ళని చావబాదాము. వాళ్ళ కులదేవత గుడిలో మలవిసర్జన చేశాం. అది మా హక్కు.”
“మీరు హింసకు దిగడం అనేది, వాళ్ళు చేస్తూ వస్తున్నదానికి వత్తాసు పలకడమే” అన్నారు బాపు. “హింసే హింసకు సమర్థింపు.”
“మేము నీ భార్యని పాడుచేసి, నీ పిల్లల గుదాన ముళ్ళకర్రతో గుచ్చితే కూడా ఇదే రకంగా మాతో మాట్లాడగలవా?”
“తప్పనిసరిగా” అన్నారు బాపూ. “నాకందులో ఏ మాత్రం అనుమానం లేదు. నన్ను నేను ఈ విషయంలో అన్ని రకాలుగా పరికించి చూసుకున్న తర్వాత మటుకే అహింస గురించి పక్కనున్న వాడితో మొదటి పదం ఉచ్చరించాను. నా భార్య పిల్లలు ఇప్పుడు నా దగ్గర లేరు. నేను నీకు అనుమతినిస్తున్నాను. నన్ను కొట్టు, హింసించు. ఆ తర్వాత నా దృక్పథంలో మార్పు వస్తుందేమో పరీక్షించు.”
సిండన్ ఒక్క మాటున మౌనం వహించాడు. తన్ను తాను కూడబలుక్కుని “మేమలా చేయవని మీకు బాగా తెల్సు” అన్నాడు.
“అవును” అన్నారు బాపు. “కానీ మీ నాయకుడిలాటివాడు కావాలనుకుంటే, కన్నార్పకుండా ఆ పని చేయగలడు.” ఒక సన్నటి నవ్వు లీలగా బాపు మొహంలో కనపడింది. ఆయన కళ్ళు అయ్యంకాళి కళ్ళతో కలిశాయి. అయ్యంకాళి మొహం రాతి బొమ్మలా అభావంగా ఉంది.
బాపు కొనసాగించారు. “వేల ఏళ్ళుగా మీరనుభవిస్తున్న క్షోభకు మీరే ముఖ్యకారణం. ఈ అవమానాలన్నిటికీ మీరు పూర్తిగా అర్హులు.”
ఆ యువకుడు కోపంతో ఒక్క అడుగు ముందుకు వెయ్యబోయి, తనను తాను సంబాళించుకున్నాడు. అసహ్యం నిండిన మొహంతో, “ఈ మాట అన్నందుకు నేను మీ మొహం మీద ఉమ్మేయాలి” అన్నాడు.
“అది నా అభిప్రాయాన్ని ఏ మాత్రం మార్చలేదు” అన్నారు బాపు. “ఎవరైతే అన్యాయానికి బానిసలౌతారో నిజానికి వాళ్ళు దాంతో సమాధానపడినవాళ్ళు. మీ జాతి మనుషులు బతుకును కాకుండా చావును ఎంచుకుని ఉంటే వినాశనం కావడమో, విజయం పొందడమో ఏదో ఒకటి జరిగేది.”
ఆ తర్వాత ఉద్భవించిన నిశ్శబ్దంలో బాపు చక్రం క్రమబద్ధంగా తిరుగుతోంది.
“రాజీపడి విజయం సాధించాలనుకోవడం మన బలహీనత. అలా రాజీపడ్డ తర్వాత, మనం క్రోధంతో, విద్వేషంతో నిండిపోతాం. అప్పుడు మన భావప్రకటనకు హింస ఒక్కటే మార్గంగా కనిపిస్తుంది. పక్కవాడి మీదికే కాదు, ఆ హింస మనమీదకు కూడా మళ్ళుతుంది. ఆ కత్తి, దాన్ని పట్టినవాడి రక్తం చిందించనీయకుండా సేద తీరదు.”
“ఆ కత్తే చేతిలో లేకపోతే, మనలో రక్తం ఎలా మిగులుతుంది?” అడిగాడు ఇంకో యువకుడు.
“మీ శత్రువుల దగ్గరా కత్తులున్నాయి. అదికూడా మీకన్నా ఎక్కువ సంఖ్యలో, మరింత శిక్షణతో తీర్చిదిద్దబడిన కత్తులు. కానీ వాళ్ళ దగ్గరలేని ఒకే ఒక ఆయుధం మీ దగ్గరుంది. అది న్యాయం అనే ఆయుధం! న్యాయం మీకు ధైర్యాన్నిస్తుంది. అన్యాయం మీలో భయాన్ని నింపేస్తుంది” అన్నారు బాపు. అతి అరుదుగా ఆయనలో కనిపించే ఒక స్వాప్నికుడు ఆయన కవళికల్లో కనపడడం మొదలు పెట్టాడు. “హింసకు మనల్ని మార్చివేసే బలీయమైన శక్తి వుంది. అది మనల్నీ మన శత్రువుల్లాంటి వారిలా మార్చేస్తుంది. అది విజయం కాదు. నిజానికి అదొక భయంకర పరాజయం. మనల్ని మనం ఉన్నతులుగా మార్చుకుని పైకి ఎదగడమే అసలైన యుద్ధం.”
“పనికిమాలిన మెట్ట వేదాంతం!” అన్నాడు సిండన్. “మీకు అసలు యథార్థం, సాధ్యాసాధ్యాలు ఇవేవీ తెలీవు. వేల ఏళ్ళుగా మా జాతి అణగదొక్కబడుతోంది. ఇన్నాళ్ళుగా తగిలిన దెబ్బలన్నీ మా హృదయాలను పిరికితనంతో నింపేశాయి. నిజానికి మేము తిరిగి కొట్టే ప్రతిదెబ్బా, మాకు తగిలిన ఆ వేల దెబ్బలనించీ పుట్టిందే. అది మీరు మరిచిపోవద్దు.”
ఇంకో యువకుడన్నాడు. “ఒకసారి, మేము నెయ్యూరులో ఒక కురూప్ ఇంటి మీద దాడి చేసినప్పుడు, వాళ్ళ పెద్ద పాలేరు పులైయా అన్నాడు, ‘కానీండి, అప్పుడు ఈ పులైయరు చేతి దెబ్బ కూడా నాయర్ ఒంటిమీద పడుతుంది’ అని. మనం కూడా ఎదురు తిరిగి కొట్టొచ్చు అన్నదే ఇంకా మావాళ్ళకు తెలీడం లేదు. అవును, మేము వాళ్ళను ఒక్క దెబ్బ వేయడానికి, వెల్లకిలా పడుకొని నిద్రపోతున్న ఆ ఆదికేశవుడి గుండెల మీద, అనంతపద్మనాభుడి ఛాతీ మీదా కాలు పెట్టి మరీ దాటాల్సివుంటుంది.”
“అయితే ఆ పడుకోని ఉన్నవాళ్ళను నిద్ర నుంచి ఎందుకు లేపడం లేదు? ఆ శంఖగదాచక్రాలతో వచ్చి మీ పక్కన నిలబడమని అడగొచ్చుగా?”
“వాళ్ళు కూడా బ్రాహ్మల అశుద్ధం నించి పుట్టినవాళ్ళేగా!” సిండన్ కేక పెట్టాడు. “ఆ పాపపు నీడ కూడా మా ఇళ్ళ మీద పడడానికి లేదు.”
బాపు ఒక చట్రాన్ని తీసి ఇంకొకదాన్ని బిగించారు. దూదిని ఉండలోకి చుట్టి, చక్రం తిప్పారు. అది గిర్రుమని శబ్దం చేస్తూ తిరగడం మొదలెట్టింది.
“మా దేవుళ్ళు మమ్మల్ని రక్తాన్ని బలిగా ఇమ్మని కోరతారు. రథాలపైన కాదు, నేల మీదకొచ్చి నిలబడే దేవుళ్ళు. మాడన్, సుడలై, కడన్, కురుప్పన్‌లు యుద్ధంలో మా పక్కనుంటే చాలు.”
“బిడ్డల్ని చంకనెత్తుకుని వుండే అమ్మవార్లు కూడా వుంటారుగా వాళ్ళ పక్కనే, వాళ్ళొస్తారా మీతో?”
సిండన్ తన సహనాన్ని పూర్తిగా కోల్పోయాడు. “ఇంకా ఏందీ! మనం ఈయనతో మాట్లాడేది? తరాల తరబడి మనల్ని బానిసలుగా చేసుకున్న ఆ మోసగాళ్ళ మందకంతా ఈయన పూజారి. అన్నా! పోదాం పద…”
కానీ అయ్యంకాళి కదలకుండా అక్కడే మౌనంగా కూర్చున్నాడు. బాపు అతని కళ్ళల్లోకి చూశారు. ఇద్దరి కళ్ళు మాట్లాడుకుంటున్నాయి.
“నేను నీతో మాట్లాడగలను” అన్నారు బాపు అయ్యంకాళితో. “కానీ ఈ మాటలతో కాదు. వాటిని నేనే నమ్మలేక పోతున్నాను.”
అయ్యంకాళి నిట్టూరుస్తూ లేచి నిల్చున్నాడు. అతని కర్ర నేల మీద పడి ఉంది. బాపు అది గమనించారు.
అతను మంద్రమైన స్వరంతో ప్రశాంతంగా బాపూతో మాట్లాడటం మొదలెట్టాడు, “మీరిప్పటిదాకా ఇచ్చిన ఈ నైతిక సమర్థింపులేవీ నాకర్థం కావు. నాకు అసలు ఇంగ్లీషే సరిగా అర్థం కాదు. ఆ మాటకొస్తే, ఏ భాష కూడా…”
సోహన్‌రామ్‌కు అతని గంభీరమైన గొంతు కూడా అతని ఆకారం లాగే భారీగా తీవ్రతతో నిండి వుందనిపించింది. “…కానీ నేను మీకొక వాగ్దానం చేస్తున్నాను. ఈ కర్ర నాకింక అవసరం లేదు. దాని బలం మీద నేనాధారపడి లేను అనే విషయం ఇప్పుడు నాకర్థం అయ్యింది. అందుకు మీకు నేను కృతజ్ఞతలు చెప్పాలి. నేను రాజీపడుతోంది ఈ కర్రతో మాత్రమే! ఇంక అది కూడా లేదు.”
బాపు చిరునవ్వుతో చూస్తున్నారు.
“మళ్ళీ మనం కలుస్తామని నేను అనుకోవడం లేదు” అన్నాడు అయ్యంకాళి. “అందుకని నేనో విషయం చెప్పాలనుకుంటున్నాను. గెలుపు ఘడియల్లో మీరు ఎలాంటి మానసిక స్థైర్యాన్ని ప్రదర్శించుతారో, అలాంటి మానసిక స్థైర్యం మీరు ఓడిపోయిన క్షణాల్లో, నిర్లక్ష్యానికి గురైన క్షణాల్లో, హత్యకు గురైన క్షణాల్లో కూడా మీతో వుండాలని ఆశిస్తున్నాను. ఇప్పటిదాకా మీరు విన్న గొంతుకలు ఆ పైనించి వినపడినవి. ఇప్పుడు మీరు వింటోన్నది అధో లోకాలనించి వస్తున్నది. సెలవిక!”
వెనక్కి తిరిగి తలపైకెత్తుకుని నడిచాడతను.
బాపు రాట్నం ఆగిపోవడం గమనించాడు సోహన్‌రామ్.
అయ్యంకాళి శిష్యులంతా అయోమయానికి గురైయ్యారు. కొంతమంది కర్రలు కింద పడేశారు. ఇంకొంతమంది వీళ్ళను చూసి అదేపని చేశారు. సిండన్ ఒక్కడు మాత్రం తన కర్ర చేతిలోకి తీసుకుని దాన్ని విచిత్రంగా పైకెత్తి బిగించి పట్టుకున్నాడు. అతని స్నేహితుడు కూడా అదేపని చేశాడు. మిగతావాళ్ళు సిండన్ వైపు అయ్యంకాళి వైపు మార్చి మార్చి చూస్తూ తడబడుతూ నడిచారు. సిండన్ మటుకు అసహ్యం, ఆగ్రహం కూడుకున్న ముఖంతో ఒంటరిగా నడిస్తే, మిగతా అందరూ గబగబా ముందు వెడుతున్న అయ్యంకాళి వెనకాల నడిచారు.
బాపు ఒక నిట్టూర్పు విడిచి రాట్నం వడిగా తిప్పసాగారు. కీచుమని శబ్దం రావడం మొదలైంది. తగ్గట్టుగానే, దారం పురి వదులయ్యి తెగిపోయింది. బాపు మళ్ళీ దారం కలిపి తిప్పడం మొదలు పెట్టారు. దారం మళ్ళీ తెగింది. ఆయన వేళ్ళకీ చక్రానికీ మధ్య వుండే సమన్వయం లోపించినట్టుగా వుంది. మళ్ళీ మళ్ళీ దారం తెగిపోతోంది. బాపు తల పూర్తిగా కిందికి వంచి, తన దృష్టినంతా చక్రం మీద కేంద్రీకరించారు. ఆయన వేళ్ళు వణకడం ప్రారంభించాయి. ఆయన ప్రయత్నించే కొద్దీ వణుకు ఇంకా ఎక్కువ అవుతోంది. బాపు అలిసిపోయి ‘హే రామ్!’ అంటూ దాన్ని వదిలేశారు. ఆయన ముఖం వైపు చూసినప్పుడు సోహన్‌రామ్‌కు తన శరీరంలో ఏదో విస్ఫోటనం జరిగినట్టనిపించింది. బాపు మళ్ళీ పట్టుదలతో చక్రాన్ని చేతిలోకి తీసుకున్నారు. తనను తాను పూర్తిగా కూడగట్టుకున్నారు.
సోహన్ ఆ ఒత్తిడికి తట్టుకోలేక బయటకు నడిచాడు. చుట్టూ చీకటి ఒక నల్లటి దళసరి తెరలా నిలబడివుంది. కింద పక్క వేసుకుని పడుకున్నాడు. పూర్తిగా అలిసిపోయి ఉన్నప్పటికీ మనసులో సుళ్ళు తిరుగుతున్న కల్లోలాల వల్ల నిద్ర పోలేకపోయాడు. బాపు గదిలో దీపం ఇంకా ఆర్పేయలేదు. చక్రం ఇంకా తిరుగుతూనే వుంది. కానీ దాని శబ్దంలో లయ లేదు. ఆ చిక్కుపడ్డ దారం శబ్దంగా మారి అతన్ని చుట్టుముట్టినట్టు, ఆ చిక్కుముడి అతని ఆలోచనా స్రవంతిని కట్టేసినట్టు, లోపల్నించి ఉత్తుంగ తరంగంలా ఎగిసిపడి, చీకటిలా కమ్ముకున్నట్టు, ఆ దారం మరీ మరీ బిగిసిపోతోంది.
ఉన్నట్టుండి అతనికి తన మెదడులోంచి ఏదో నరం తెగిపడ్డట్టుగా అనిపించింది. తట్టుకోలేక ఉక్కిరిబిక్కిరై, లేచి ఒక్క కేక పెట్టాడు, “ఆపేయ్! ముసిలోడా!” లేదు. అరవలేదు. ఒక క్షణంలో అతనిలో ఏదో ప్రశాంతత, మరుక్షణంలో విద్యుద్ఘాతం లాటి వణుకు. దిగ్గున లేచి కూర్చుని, ‘రామ్ రామ్’ అని స్మరణ మొదలుపెట్టాడు. ఆ ప్రదేశం అన్నా, తన శరీరం అన్నా భయపడిపోయినట్టు లేచి పరుగులు పెట్టాడు. అక్కడ చాలామంది గాలికి మంద్రంగా వూగుతోన్న కొబ్బరి చెట్ల నీడల కింద పడుకుని నిద్రపోతున్నారు. అవతల ఒక మెరుస్తోన్న నల్లటి నీటి కుంట కనపడుతోంది. ఆకాశం అంతా మబ్బుల గుంపులతో చిక్కబడి పోయి వుంది.
ఎక్కడో దూరంగా ఆకాశాన వేలాడుతోన్న శుక్లపక్షపు చంద్రుడు దర్శనమిచ్చాడు.
సోహన్‌రామ్‌కు తన వంట్లోని వణుకు తెలుస్తోంది, ఆపడానికి అన్నట్టుగా మరింత మొండిగా ‘రామ్ రామ్ రామ్’ అని మంత్రజపం చేయసాగాడు. ఏ సంబంధమూ లేకుండా, ఆ పదాల వరుసలు పరిగెత్తి ఎటో వెళ్ళి అదృశ్యం అయినట్టుగా అర్థంలేని అతని భావప్రవాహం ముక్కలు చెక్కలై, కకావికలై, గిరగిర తిరుగుతూ పదే పదే ఉవ్వెత్తున లేచి కింద పడుతోంది. ఆకాశం, భూమి, వెలుగు, నీడ, ధ్వని, వీటిలో కలిసిపోతూ విడిపోతూ ఘర్షణ పడుతున్నాడు సోహన్‌రామ్. చీకట్లో సన్నగా కీచుమంటూ మొదలైన చిమ్మటల శబ్దం, సమస్తాన్నీ కలిపి పెనవేసి ఒకే స్వరం క్రింద మార్చివేసి వీటన్నిటిలోకి సన్నని నూలుపోగు లాగా ప్రవేశించింది. అతనిలోని చైతన్యం సర్వమూ అందులో కలిసిపోయి అంతా అల్లుకుని విస్తరించి సకల జగత్తునీ ముంచెత్తివేసింది. వెంటనే మరో లిప్తపాటు కాలంలో అతని చుట్టూరా వుండే ప్రపంచం, దాని పూర్వ రూపాన్ని అది సంతరించుకుంది.
క్రమంగా అతను స్థిమితపడ్డాడు. ఇంకే సమస్యలూ లేవు. అంతటా ప్రశాంతత. నిట్టూర్చాడు సోహన్‌రామ్. ఎక్కణ్ణించో అతని మస్తిష్కపు అంచుల నించి ఒక సన్నని నిర్విరామ స్వరం మొండిగా వినిపించటం మొదలైంది. కాదు స్వరం కాదు. ఒక నూలుపోగు, సన్నని నూలుపోగు, సన్నని నాజూకైన నూలుపోగు. ‘రామ్ రామ్ రామ్…’ సోహన్ రామ్ రెండు చేతులెత్తి నమస్కరించాడు. ఒక పక్క అతని హృదయం ద్రవించి, అంతటా వ్యాపిస్తూ, విస్తరిస్తూ ఉంటే, ఇంకో పక్క అంతరాంతరాల్లో నించి ఓ ప్రబోధంలా ఆ స్వరం సన్నగా మోగుతూనే వుంది. సోహన్‌రామ్ తాను తిరిగి వెళ్ళేసరికి ఆ రాట్నం లయబద్ధం కావాలంటూ ప్రార్థించసాగాడు.
(మూలం:మెల్లియ నూల్)
(ఈ కథ కేరళలోని అయ్యంకాళి అనే గొప్ప దళితనాయకుడి విమోచనం గురించి చెప్తుంది. 1863లో వెంగనూరు గ్రామంలో జన్మించిన ఆయన నిరక్షరాస్యుడు. నారాయణగురు ద్వారా ప్రభావితుడై అంటరానితనానికి, కులం పేరుతో జరిగే దౌర్జన్యాలకూ వ్యతిరేకంగా పోరాడాడు. 1905లో స్వామి సదానంద అంటరానితనం రూపుమాపడానికి చేస్తున్న ప్రచారంతో ప్రభావితుడై, పులైయ్యర్ల మహాసభను స్థాపించాడు. సమరతంత్ర మల్లవిద్యా ప్రావీణుడు, వర్మకళ వైద్యుడూ అయిన అయ్యంకాళి శిష్యగణాన్ని కూడగట్టి అయ్యంకాళి సేనను తయారు చేసి, హింసను తన పోరాట మార్గంగా ఎంచుకున్నాడు. జనవరి, 1937వ సంవత్సరంలో అయ్యంకాళి గాంధీజీని స్వయంగా కలిశాడు. అయ్యంకాళికి గౌరవసూచకంగా వెంగనూరులో గాంధీ ఒక పెద్ద సభను నిర్వహించారు. కానీ మొదటి సమావేశం వాళ్ళిద్దరి మధ్య అంతకు పదిహేను ఏళ్ళ ముందరే జరిగినట్టు చెప్తారు. ఆ సమావేశంలో ఏం జరిగి ఉండవచ్చో అని ఊహించి, రాసిన కథ ఇది. అయ్యంకాళి జూన్ పద్దెనిమిది, 1941లో మరణించారు. ఈ కథ 1999వ సంవత్సరంలో జయమోహన్ రాసిన ‘పిన్ తొడరుమ్ నిళలిన్ కురళ్’ – వెంటాడే నీడ యొక్క గొంతు – అనే నవలలోని ఒక భాగం.)