సగం వాన

కాలం వేళ్ళ సందుల్లోంచి
జీవితాలు జారుతున్నట్టు
ఒకటే వాన!

ముడుచుకున్న రేకులతోనే
మొగ్గలు నవ్వుతున్నాయి,
విచ్చుకున్న రెక్కలతోనే
పువ్వులు పలకరిస్తున్నాయి.

చినుకు స్పర్శ చాలు
మట్టి మనసు మెత్తబడటానికి.

లోపల వాన కురిస్తేనే
మనిషి తత్వం చిగురిస్తుంది
మానవత్వం వాసన గుబాళిస్తుంది.

ఉబికి వస్తున్న వానని
ఉన్నట్టుండి
ఎవరో వాయిదా వేసినట్టున్నారు.
నిన్నటి ఆశలు
నెమ్మదిగా
నీరుగారిపోతున్నట్టుగా వుంది.

నీటి బిందువుల
చల్లని కౌగిలిలో కూడా
ఆమె గుండె మండుతూనే ఉంది.

బహుశా
సగం వానే ఇది.

మరో సగం
బీగం వేసి బిగబట్టిన
రెప్పల మౌనాన్ని దాటి
ఉరలుతున్న ఆమె కన్నుల్లో చూడండి.