[సుమారు పదునాలుగు సంవత్సరాల క్రితం Glad to meet you అనడాన్ని తెలుగులో గ్లాచ్చు మీచ్యూ అంటూ ఒక పుస్తకం వచ్చింది. ప్రముఖ కార్టూనిస్ట్ జయదేవ్, ఆయన బాల్యం, యవ్వనం, చదువు, ఆటపాటలు, ఉద్యోగ సద్యోగం, ఇంకా బొమ్మలు బొమ్మలు బొమ్మలూ అంటూ అనేకానేక విశేషాలని చిన్న చిన్న కబుర్లుగా గుదిగుచ్చి, ఒక పుస్తకరూపంలో తెచ్చి, తెలుగు పాఠకులను పలకరించిన సందర్భం అది. ఇప్పుడు మళ్ళీ అదే తెలుగులో ‘గ్లాచ్చు మీచ్యూ రెండోస్సారీ’ అంటూ అదే చేయి మనల్ని మెత్తగా మళ్ళీ పలకరించవస్తోంది త్వరలోనే. ఈ రెండవ పుస్తకంలో నిండి ఉన్న నలభై కబుర్లలో సాప అని ఒకే ఒక కథానిక వంటి, నాటకం వంటి, నలుగురు కూచున్నవేళ నవ్వులాటగా చెప్పుకునే సంఘటన వంటి ఒక ముచ్చట ఇది. తన గీతల ద్వారా జగమెరిగిన జయదేవ్ ఈ సాప కథ వల్ల ఆయన రాయని గొప్ప కథల రచయిత అని తెలవడం భలే ఆనందాశ్చర్యం. తెలుగులో జయదేవ్ బొమ్మ అచ్చుకాని పత్రిక అంటూ ఉన్నది లేదు. ఆయన తొలి కథ మాత్రం మొదటిసారిగా ఇక్కడ ఇలా – ఈమాటలో – అన్వర్.]
“మేయ్ పిన్నోడు యేర్గేసొచ్చి యెంతాసేపుగా నిలస్తావుండాడో సూడు. గుద్దెండిపోబోతాది. కడుగు. వంటింట్లో ఏంజేస్తావుండా?”
“పొయ్యిలో పాలు పెట్టుండా మామా. ఇదో వొస్తా…”
పాలు దించి, రాజేశ్వరి గబగబా దొడ్లోకి నడిచింది. బుడ్డోడు ముడ్డి గీరుకుంటున్నాడు. అది చూసి గట్టిగా అరిచింది.
“రేయ్ యెదవా, శెయ్ తీయ్‌రా అక్కడా!” బుడ్డోడి చెయ్యి లాగి, మగ్గుతో డ్రమ్ములోకి వొంగి నీళ్ళు తీసింది. బుడ్డోడిని కడిగి శుభ్రం చేసేలోగా రెండు పందులు పరుగుపరుగునొచ్చి బుడ్డోడి ప్రసాదాన్ని ఆవురావురుమని తినేసి వెళ్ళిపోయాయి.
“ఈ కొంప పెళ్ళో దరిద్రం పట్టిన పందులు వేరే. ఛీ!” విసుక్కుంది రాజేశ్వరి. నీళ్ళ కోసం డ్రమ్ములోకి వొంగి వొంగి ఆమెకి నడుము పట్టేసింది. కనుబొమలు ముడిచి మొగుడుకేసి చూసి, “ఏం మామా, పక్కింట్లో నించి నీళ్ళు తెచ్చేదానికి ఎంత కష్టంగా వుండాదో సూస్తానే వుండావు. బోరెయ్ మామా అని దినమ్మూ కొట్టుకుంటా వుండా. శెవులోనే యేస్కోనంటావు. ” పిల్లాడికి నిజారు తొడుగుతూ విసుక్కుంది.
శ్రీరాములు బీడీ నలిపి పారేసి, జారిపోయే లుంగీ బిగించుకుని పెళ్ళాం వైపు చూసి ఉరిమాడు. “పొద్దస్తమానం బోరు బోరు అని అరస్తావు, బోరెయ్యాలంటే యాపై వేలు కావాల. పోయి మీ యబ్బనడిగి తే పో! పండక్కి సొక్కాయి పంచ కూడా ఇయ్యిలే ఆ ముశిలోడు.”
ఈ ఎత్తిపొడుపు మాటలు వినలేక రాజేశ్వరి నోరు మూసుకుని వంటింట్లోకి జారుకుంది. శ్రీరాములు గుడి అయ్యవారుని కలవడానికి చొక్కా తొడుక్కుని బయల్దేరాడు.
శ్రీరాములు రాజేశ్వరిల పెళ్ళి అయిదేళ్ళక్రితం జరిగింది. పెళ్ళయిన యేడాదికి రాజేశ్వరి బుడ్డోడిని కన్నది. పుట్టింటినుంచి పిల్లోడిని తెచ్చుకుని మొగుడింటికొచ్చాక ఆమె తిరిగి పుట్టింటికెళ్ళలేదు. శ్రీరాములు మంచికీ చెడుకీ పెళ్ళాన్ని పంపినోడే కాదు. వాడిదదో మొండితనం. ఉద్యోగం వాన్ నడిపే డ్రైవర్ పని. నెలకి తొమ్మిదివేలు జీతం. ఉండే మూడు గదుల పెంకుటిల్లు సొంతిల్లు గనక అద్దె కట్టాల్సిన అవసరం లేదు. తిండికి కావాల్సిన సరుకులు తెచ్చి పడేస్తే పొదుపుగా సంసారం చేసే పెళ్ళాం వుంది గనక వాడి మందులూ మాకులకి జేబుకు సరిపడా డబ్బులు ఎప్పుడూ వుండేవి.
శ్రీరాములు తమ్ముడు భాస్కర్‌కి లెక్కలు రాసే పని. వూళ్ళో లారీలు, వాన్‌ల ఓనర్ నాయుడు భాస్కర్ యజమాని. వాడిదీ నెలజీతమే. అందులో రెండు వేలు వదిన రాజేశ్వరి చేతిలో పెట్టి ఆమె వండింది తిని, ఆ మూడుగదుల కొంపలో ఒక గదిలో పడుకుంటాడు. తీరికున్నప్పుడు పిల్లాడిని ఆడిస్తాడు. అన్న శ్రీరాములుతో ఎప్పుడూ పేచీ పడడు. శ్రీరాములుకీ తమ్ముడంటే అభిమానమే. అనవసర కీచులాటలుండవు ఇద్దరి మధ్యా.
ఈ మధ్య భాస్కర్‌కి పెళ్ళి సంబంధం తీసుకొచ్చాడు ఆ వూరి అమ్మోరు గుడి అయ్యవారు.
“యేరా శ్రీరాములూ తమ్ముడిని అడిగినావా పెళ్ళి చేసుకుంటావా అనేసి?” హారతి పళ్ళేన్ని పక్కన పెట్టి అడిగాడు గుడి అయ్యవారు.
బీడీముక్క అవతల పారేసి రెండు చేతులూ తలవెనక్కి పెట్టి బుజాలు ఎగరేసి చెప్పాడు శ్రీరాములు, “వాడినేందడిగేది అయ్యోరా. పిల్ల గొంతులో బొట్టు తాడు కట్రా అంటే కట్టబోతాడు. నువ్వు జాతకాలు సూశేశినావా? బాగుండయ్యా?”
“బాగుండాయి గదా. నే ముందే జెప్పుండ్లా, బాగలేకపోతే ఈ సంబందం ఎందుకు తేబోతాను!” కొంచెం మొహం ముడుచుకున్నాడు అయ్యవారు.
“సరే అయ్యోరా. కోపం తెచ్చుకోమాకా. అయితే పిల్లని సూశేదానికి పోవద్దా? ఎప్పుడు పోతామంటావు?” అడిగాడు శ్రీరాములు.
“ఇదో రాబోయే ఆదారం దినం బాగుండాది. నువ్వు ఎవుర్నెవుర్ని పిల్సుకుంటావొ పిల్సుకో. మద్దానం బోంచేస్కోని పిన్నోడిని తొడుకోని పిల్ల ఇంటికి సక్కా పోతామూ. రెండున్నరా నాలుగు టైము బాగుండాది. పిల్లా పిన్నోడూ సూసుకోనీ. ఇద్దురికీ నచ్చి చేసుకుంటాము అన్నారంటే రావుకాలం లోపల సాపేశాస్తాము.”
ఎవరో భక్తులు రావడం చూసి అయ్యవారు కండువా నడుముకి చుట్టుకుని గర్భగుడి లోకి వెళ్ళిపోయాడు. శ్రీరాములుకీ టైమై పోయింది, ఓనర్ అరుస్తాడని చకచకా పనికి బయల్దేరాడు. పని ముగించి ఇంటికొచ్చేసరికి బాగా చీకటి పడింది.
“మేయ్, బాస్కర్ రాలే యింకా? వాడితో సమాచారం మాట్లాడాల…” కాళ్ళు కడుక్కుంటూ అడిగాడు.
“వొచ్చినాడు మామా. గుడికి పోయుండాడు. నువ్వు కూడు తింటువు రా.”
“వాడొచ్చినాక తింటా” చొక్కా విప్పి గుంజ మేకుకి తగిలించి కూర్చున్నాడు. నెత్తిమీద ఫాన్ తిరిగిన శబ్దమే గానీ గాలి రాలే. ఫాన్ స్విచ్ ఆఫ్ చేసి పేపర్‌తో విసురుకుంటూ గోడకానుకున్నాడు.
గుడి అయ్యవారు గుడి తలుపుల దగ్గర కూర్చున్నాడు. కొందరు ఆడంగి భక్తురాండ్రు రాత్రి తొమ్మిదిదాకా వస్తుంటారు. దూరంలో భాస్కర్ రావడం గమనించి లేచాడు.
“రా రా రేయ్ బాస్కరా. రేపాదివారం పిల్లని సూశేదానికి పోతా వుండాం. తెల్లారి మీయన్నొచ్చినాడు. చెప్పినా. మీయన్న నీకు చెప్పలేదా?” అడిగాడు అయ్యవారు.
“లేదయ్యోరా. అది సరే, పిల్ల ఏమి సదువుకుంది? ఈ కాలం ఆడపిలకాయలు బియ్యేలు గియ్యేలు సదవతా వుండారు. నేను ప్లస్ టూ దానే?” తల దించి కళ్ళు పైకెత్తి చూశాడు భాస్కర్.
“రేయ్ బాస్కరా, నీ సదువు నాకు తెలుసురా. అది పిల్లోళ్ళకి చెప్పేసినా జాతకం అడిగే ముందు. పిల్ల తొమ్మిదోది పాసవుతానే సదువు నిలిపేశినారు. పిల్లని నేను చూశినా. బాగూండాది. అంతా మీ వొదిన మాదిరుంటాదనుకోయమ్మే.” భాస్కర్ ఏదో అడగబోయే లోపు, అయ్యవారు భాస్కర్‌ని కూర్చోమని చెప్పి, “రేయ్ అబ్బాయ్, పిల్ల పేరు లక్ష్మి. వయిసు ఇరవై ఒకటి దాటుంటాది. వాళ్ళింటికి ఒకే బిడ్డ, మీ వొదిన మాదిరి. పది సవరాలు నగలేసి పెళ్ళి చేస్తారు. మంచం బీరవా ఇంకా శీదనం అదీ ఇదీ కొదవ లేకండా చేసి పెడతారు. అదంతా నాకొదిలేయ్. నేను సూసుకుంటా. పిల్లని సూడు. నీకు పట్టిందీ అని చెప్పినావా సాపేశేస్తాము, పో!”
అయ్యవారు కండువా విదిల్చాడు. భాస్కర్ అమ్మవారికి దణ్ణం పెట్టి ఇంటికి బయల్దేరబోతుండగా అయ్యవారు అతడి చేయి పట్టి లాగి, “రేయ్, చేతులో దుడ్డు పెట్టుకోనుండావా? మీయన్న దగ్గర కాల్రూపాయ కూడా వుండదు, నాకు తెలుసు” శ్రద్ధగా అడిగాడు.
“వుండాదయ్యోరా. నేను నాయుడు దగ్గిర నెల నెలా నా జీతంలో కొంచెం ఇచ్చిపెట్టుండా, మావొదిన కొంచెం చేర్చి పెట్టుండాది. మొత్తం…” ఇంత అని అయ్యవారి చెవిలో ఊదాడు. అయ్యవారు “అది సాల్లేరా… సాలు, సాలు, అప్పు చెయ్యకుండా పని జరగాల మనక్కావల్సింది అంతే” అని నవ్వుతూ గుడి తలుపులు మూయడానికి లేచాడు.
శ్రీరాములుకి ఆకలేసింది. “ఏంది మేయ్, బాస్కరుడు గుడికి పొయ్యినాడా, వేరే ఎక్కడికైనానా?” నసిగాడు.
రాజేశ్వరి ఓపికగా, “గుడికి దా పొయ్యుండాడు. నువ్వు కూడు తినేస్తావా మామా?” అనడిగింది.
“సరే ఎయ్యి,” అని కూచున్నాడు శ్రీరాములు. మొగుడికి వడ్డించి తను తిని, మరిదికి గిన్నెల్లో మూసిపెట్టింది. ఇది తనకి అలవాటే. మరిది ఆలస్యంగా వస్తే, వడ్డించుకుని తిని గదిలోకి వెళ్ళిపోయేవాడు.
రాజేశ్వరి చాపా దిండు పరిచి లైటు ఆర్పింది. ఆపాటికి బుడ్డోడు నిద్రలో వున్నాడు. శ్రీరాములు ఓ బీడీ దమ్ము లాగించి రాజేశ్వరి పక్కన పడుకున్నాడు. ఇంటి తలుపు తోసిన చప్పుడైంది. భాస్కరొచ్చాడు. వంటింట్లోకెళ్ళి అన్నం వడ్డించుకుని తిని తన గదిలోకి పోయాడు. శ్రీరాములు తమ్ముడితో మాట్లాదుదామని లేవబోతే, రాజేశ్వరి అతడి లుంగీ పట్టి లాగి “తెల్లారి మాట్లాడు మామా” అని పడుకోమంది.
పడుకున్నాడే గానీ శ్రీరాములుకి నిద్ర పట్టలేదు. పెళ్ళాంతో గుడి అయ్యవారుతో మాట్లాడిన సంగతి చెపుదామని “మేయ్!” అని పిలిచాడు.
రాజేశ్వరి “నాకు తెలుసు మామా, మనం ఆదివారంనాడు బాస్కర్ని తొడుకోని పిల్లని సూశేదానికి పోతావుండాము, అయ్యోరు చెప్పినాడు” అంది.
“ఒరె, సూడ్రా! ఈ ఆడోళ్ళని యేమో అనుకున్నానే, కిల్లేడిలురా యబ్బా” అని పెళ్ళాన్ని దగ్గరికి లాక్కున్నాడు శ్రీరాములు.
“మామా… ” ఆప్యాయంగా మొగుడి చెవి దగ్గర నోరానించి పలికింది రాజేశ్వరి. “ఆదివారానికి నడుంగులో నాలుగే దినాలుండయి. మనం మనుషుల్ని పిలుసుకోవద్దా?” అని. తన అమ్మా నాయనలని శ్రీరాములు పిలుస్తాడో లేదో అనే అనుమానంతో. శ్రీరాములు అటుపక్కకి తిరిగాడు.
“ఈ పనికి ఎవుర్నెవుర్ని పిలవాల, మనం నలుగురు పోతే సాల్దా?”
“బాగుండాది మామా కత. సాపకి నువ్వూ, నేనూ, బాస్కర్డు మాత్రం పోతే, వూర్లోవాళ్ళు ఏమనుకుంట్రు?” లేచి కూచుంది రాజేశ్వరి. మసక చీకట్లో ముద్దమందారంలా వుంది ఆమె ముఖం. మొగుడ్ని తనవైపుకి తిప్పుకుంది. శ్రీరాములుకి ఆవులింతలు మొదలయ్యాయి.
“మామోవ్!” కటువుగా వున్నాయి ఆమె మాటలు. “మాయమ్మా నాయనల్ని పిలవొద్దులే. మీ మేనమామని పిలవద్దా? పందిట్లో బాస్కర్డికి మెట్లు తొడిగేది ఎవురు? మేనమామ గందా? అనేక అయ్యోరు, అయ్యోరు పెళ్ళాం, మనకి కూడుపెట్టే మీ యజమాని నాయుడు, ఆయన బార్యా… వీళ్ళైనా మనతో రావద్దా? పెళ్ళికొడుకు జనం కొంచెం గౌరవంగా నలుగురుతో పోతే కదా మనకి మర్యాదా?”
“నిద్రొస్తా వుండాదే, పండుకోయే. తెల్లారికి పిలస్తాములే అందుర్నీ… ” మత్తుగా శ్రీరాములు నోట్లోంచి మాటలు దొర్లాయి.
కొప్పు ముడి విప్పి రాజేశ్వరి శ్రీరాములు చాతీ మీద తల పెట్టి, “మా అమ్మా నాయనలని కూడా పిలస్తాము, సర్దానే” గోముగా అడిగింది.
“ఊఁ” అని మూలిగాడు మొగుడు.
చల్లటి గాలి తలుపుల్ని ఆడించి లోనికి వీచింది. మూల వెలుగుతున్న గుడ్డి దీపం ఆరి, పొగ తీగలు పైకి లేచాయి, చమటకు తడిసిన రాజేశ్వరి ముంగురులు మరింత చల్లబడ్డాయి.
ఆదివారం రోజున పొద్దున్నే రాజేశ్వరి బుడ్డోడికి స్నానం చేయించి చొక్కా లాగూ తొడిగింది. శ్రీరాములుకి ఫుల్ స్లాక్ షర్టూ, సరిగ పంచ ఆమెకి అమ్మగారిచ్చిన చెక్క బీరువా లోంచి తీసి బైట పెట్టింది. మరిది గది బైట నిలబడి, తలుపు చిన్నగ తట్టి, “బాస్కరా, మంచి సొక్కాయ, పాంటూ యేసుకొనిరా, పిల్ల నిన్ను సూశి గుమ్మయిపోవాల” అని తను వంటింట్లోకి దూరి తలుపు మరుగున చీర కట్టుకుని జడల్లుకుని గోడకి తగిలించిన అద్దం తీసి చూసి, గోపాల్ సాండల్ పవుడర్ మొహానికి రాసుకుని నుదుట కుంకం బొట్టు దిద్దుకుని అందంగా ముస్తాబయింది.
శ్రీరాములు ఆమెని చూసి డంగైపోయాడు. “ఎక్కడిది మేయ్ ఈ కోక! శానా బాగుండాది” కళ్ళు పెద్దవి చేసుకుని అడిగాడు.
“నాయుడు పిల్ల సమర్తకి ముత్తైదులకి వాళ్ళు కోకలు జాకెట్ పీసులు పెట్టుండ్లా, అది గదా ఇది… ” అని వయ్యారంగ కొంగు బొడ్డులోకి దోపి నుంచుంది రాజేశ్వరి. “మామా, పదో గంటకి కూడొడ్డిస్తా. పొప్పు, ఊరగాయ పెట్టుకునేసి తినేస్తాము. పన్నెండొ గంటకి మనం బైల్దేరాల. నువ్వు పోయి నాయుడుని, ఆయన బార్యని ఎక్కించుకోని వాన్ తెచ్చేయ్. దోవలో గుడయ్యోర్ని, ఆయన పెళ్ళాన్నీ ఎక్కించుకుంటాము. చిన్నాయన మనం పిలవను బోయినప్పుడు టక్కని పదోగంటకి గడపలో వుంటానన్నారే, వీది మొనలో పోయి సూడూ” అని ఉరమాయించింది.
శ్రీరాములు ఫుల్ స్లాక్ తొడుక్కుని బొత్తాలు పెట్టుకుంటూ, “రేయ్ బాస్కరా, బిన్నేగ రెడీ అవురా. నేను పోయి మామొస్తావుండాడా సూశొస్తా” అని వీధిలోకి నడిచాడు.
కాసేపటికి తన గది తలుపు తెరిచి భాస్కర్ కొత్త షర్టు పాంటులో టక్ చేసుకుని బైటికొచ్చాడు. మరిది ముస్తాబును చూసి మురిసిపోయి రెండు చేతుల్తో దిష్టి తీసి మెటికలించుకుంది, వదిన రాజేశ్వరి. ఈలోగా, శ్రీరాములు తన మేనమామని వెంట తీసుకొచ్చాడు. “వాళ్ళూర్లో నిన్నట్నించి బస్సు లేదు గామాల. సీకట్తో బైల్దేరి బాట పట్టుకోని కాళ్ళీడ్సుకుంటా వొచ్చినాడు.”
“రా చిన్నయనా, కాళ్ళు కడుక్కో” అంటూ మగ్గులో నీళ్ళందిచ్చింది రాజేశ్వరి.
“నువ్వు కూడెయ్యి టైమవుతావుంది” అంటూ, శ్రీరాములు కుట్టాకులు పరిచి నీళ్ళు చల్లి కూర్చున్నాడు. “రా మామా, కూకో. రేయ్ బాస్కరా, రారా” అని చేతిని నేల మీద తట్టి తన పక్కన కూర్చోమని సన్జ చేశాడు.
భోజనాలయ్యక, ఇల్లు సర్ది ప్రయాణానికి సిద్ధమయ్యేసరికి పదకొండు దాటింది. “నేను వాను తెస్తా,” అంటూ శ్రీరాములు నాయుడింటికి బయల్దేరాడు.
శ్రీరాములు వాన్ తోల్తున్నాడు. పక్కన నాయుడు కూర్చున్నాడు. జరీ పట్టు పంచ, భుజాన అంగవస్త్రం, నుదుట వీభూతి, చందనం బొట్టుతో పెద్దమనిషి తరహాలో వున్నాడు. వెనక సీట్లలో ఒక వైపు రాజేశ్వరి, ఒళ్ళో బుడ్డోడు, పక్కన నాయుడు భార్య వొంటినిండా నగలతో అపర అమ్మవారులాగా ఒక కాలు మడిచి కూర్చుంది. ఆమె పక్కనే బక్కచిక్కిన అయ్యవారి భార్య రూపాయంత నెత్తిబొట్టుతో కొంగు భుజాలకి కప్పి ఒదిగి కూర్చున్నది. ఎదురు సీటులో పెళ్ళికొడుకు భాస్కర్, పక్కన మేనమామ, చివర్న అయ్యవారు కూర్చున్నారు. వాను పల్లంలో దిగి పైకెక్కి ఒక్క కుదుపు కుదిపింది. నాయుడు భార్య ముందుకు పడబోయి తమాయించుకుని ఒక అరుపు అరిచింది, “రేయ్, శీరామా! మెల్లిగా తోలురా, ఆయనకి యీపు నొప్పి, ఎమికల్లో సూదులు గుస్తావుండాయని రేత్తిరంతా తైలం రుద్దమన్నాడురా… ”
బదులుగా శ్రీరాములు గీరు మారుస్తూ, “యెమా, నాయుడు ఒళ్ళు కంకర్రాయి. నువ్వెమీ దిగులుపడక తల్లే” అని వెనక్కి తిరిగి చెప్పాడు. నాయుడు వాడి భుజం తట్టి, “రోడు చూసి తోల్రా, ఎదురుగా బండొస్తావుంది జాగర్త” అని హెచ్చరించాడు.
పెళ్ళికూతురు ఊర్లోకి ప్రవేశించింది వాను. రెండు వీధులు తిరిగాక, ఒక డాబా ఇల్లు ముందు అయ్యవారు బండాపమన్నాడు. ఇంటిముందు సందడిగా వుంది. గడపలకి మామిడాకుల చెండ్లు కట్టి ఉన్నాయి. వయసాడపిల్లలు గడపల వెనకాల నుంచుని తొంగి చూస్తున్నారు. హాలులో అగరొత్తుల సువాసనలు నాసికలని అలరిస్తున్నాయి. అయ్యవారు దిగి గబగబ ఇంట్లోకి అడుగుపెట్టి పెళ్ళికూతురు తల్లితండ్రుల్ని పిలిచి, పెళ్ళికొడుకుని లోనికాహ్వానించమన్నాడు. హాలులో జమకాళాలు పరిచి వున్నాయి. అందరూ వాను దిగి చెప్పులు విడిచి కాళ్ళు కడుక్కుని హాలులో ప్రవేశించి కూర్చున్నారు. ఎదురుగా ఆపాటికే పెళ్ళికూతురు తాలూకు ముసిలీ ముతకా, ఆడ మగా కూచోని వున్నారు. నాయుడు, పక్కనే కూర్చున్న పెళ్ళాంతో, “పెద్ద సంతే!” అని పళ్ళు కొరికి పలికాడు. రాజేశ్వరి భాస్కర్ చెవిలో, “పిల్లోళ్ళ ఇల్లు మిద్దిల్లు” అని ఊది సంబరపడింది. అందరికీ లోటాల్లో మజ్జిగ పోసి ఇస్తున్నారు. ఇచ్చే ఆడంగులు “దాకం తాగండి” అని చెప్పి మరీ మజ్జిగ పోస్తున్నారు. ఒక మీసాలాయన గటగటా నాలుగు లోటాలు తాగేశాడు. గడప వెనకల, గుంజల వెనకల తొంగిచూస్తున్న ఆడపిల్లలు కిలకిలా నవ్వారు. భాస్కర్‌కి వెండి లోటాలో మజ్జిగ పోసిచ్చింది, పెళ్ళికూతురు వదినగారు. సిగ్గుపడుతూ భాస్కర్ మజ్జిగ తీసుకున్నాడు.
సందడి సందడిగా వున్న ఆ జనం మధ్యలోకొచ్చి అయ్యవారు కూర్చున్నాడు. “ఏం సుదర్శనం?” పెళ్ళికూతురు తండ్రిని దగ్గరికి జరిగి కూర్చోమని చేత్తో పిలుస్తూ, “ఆరంబిస్తామా?” అనడిగాడు. అలాగే అని సుదర్శనం తలాడిపించాడు.
“అయితే అడుగు. బైటూరి నుంచి బందువులొచ్చుండారు. ఏం పని మీద ఒచ్చినారు?”
“నువ్వే మేమడిగినట్లు మాటాడేయ్ అయ్యొరా.”
మీసాలాయన, కొంచెం ముందుకు జరిగి కూర్చున్నాడు. అయ్యవారు శ్రీరాములు పక్కనే కూర్చున్న అతడి మేనమామ వైపు వంగి, “మీరున్ను, మీ బందు మిత్రులూ వొచ్చుండారు… ఏమి సంగతి?” అనడిగాడు. నాయుడు, “అయ్యోరా, నువ్వే మా తరపున కూడా మాట్లాడేయ్” అని పలికి శ్రీరాములు పక్కన భాస్కర్‌ని కూర్చొమన్నాడు. అయ్యవారు గొంతు సవరించుకున్నాడు. జనం మరింత నిశ్శబ్దంగా కూర్చున్నారు. పిల్లల్ని ఉష్ ఉష్ అని సైలెంటుగా ఉండాలని మీసాలాయన నోటిమీద వేలుపెట్టి గుడ్లురిమాడు.
అయ్యవారు పలికాడు పెళ్ళికూతురు తండ్రి సుదర్శనం వైపు చూసి, “మాకు, మీ యింట్లో చినపాప వుంది అనేశి తెలిశి బయల్దేరినాము. మాకు ముత్తైదులు ఎదురొచ్చినారు. ఆవులు ఎదురొచ్చినాయి. ఆ విదంగా మంచి మంచి శకునాలు ఎదురొచ్చినాయి. మీరు మంచిమాట చెప్పినారంటే మాకు సంతోషంగా వుంటాది.”
“సరే అని చెప్పు సుదర్శనా,” మీసాలాయన అందుకున్నాడు.
“సరే” అని తలూపాడు సుదర్శనం. “నోరు తెరిచి చెప్పెమ్మే” మీసాలాయన గట్టిగా అరిచాడు. జనం గొల్లుమన్నారు. “సరే అయ్యోరా!” అని గాట్టిగా అరిచాడు సుదర్శనం. జనం మరోసారి గొల్లుమన్నారు.
“మంచిమాట చెప్పినారు. సంతోషము. చినపాపని సింగారించి కూకోబెట్టండి.”
జనం నిశ్శబ్దం అయ్యారు. అందరి కళ్ళు పెళ్ళికూతురు రాకని ఎదురుచూస్తున్నాయి. రాజేశ్వరి భాస్కర్ భుజాన్ని తట్టి, “అబ్బాయోవ్, పిల్లని బాగ సూడు. తలొంచుకోని కూకోక. పెళ్ళికూతురు నువ్వుకాదు, ఆమి. అదొదొ వొస్తావుంది సూడు, సూడు” చెవిలో చెప్పింది. బుడ్డోడిని తట్టి “సూడు, సూడురా, పిన్ని… పిన్ని” అని వాడిని శ్రీరాములు వొళ్ళో కూర్చోబెట్టింది.
పెళ్ళికూతుర్ని వాళ్ళ వదినె మరో ఇద్దరు స్త్రీలు నడిపించుకొచ్చారు. జనం దారిచ్చి సర్దుకుని కూర్చున్నారు. అమ్మాయిని వాళ్ళ నాన్న పక్కన కూర్చోబెట్టారు. వెనుక, అమ్మ వదిన నుంచున్నారు.
అయ్యవారు గొంతు సరిచేసుకుని, “అబ్బాయ్ చిరంజీవి బాస్కరా…” అంటుండగా, గుంజ చాటున్న ఆడపిల్లలు, “మేయ్, అబ్బాయి హీరో చిరంజీవి అంట!” అని పకపక నవ్వారు. మీసాలాయన ‘హుష్’ అని వాళ్ళని నాలుక మడిచి బెదిరించి, “నువ్ కానీ అయ్యోరా” అన్నాడు. అయ్యవారు, “అబ్బాయ్ చిరంజీవి బాస్కరా… ఇదో చినపాప సౌబాగ్యవతి లక్ష్మి ఎదురుగా కూకోనుండాది. ఒకరు ఒకరు సూస్కోండి” అన్నాడు.
అమ్మాయి వైపు తిరిగి, “చినపాపా, అబ్బాయిని సూడు. మీ ఇద్దురికి పట్టింది అంటే మేము సాపేశి మాట్లాడుకుంటాము. ఏరా అబ్బాయ్, ముందుగాల నువు చెప్పు, అమ్మాయి నీకు పట్టిందా?” అయ్యవారి ప్రశ్నకి సమాధానంగా “నచ్చింది” అని చెప్పి తలూపాడు భాస్కర్. అది విని అమ్మాయి సిగ్గు ముంచుకొచ్చి, రెండు చేతుల్తో మొహం మూసుకుని చటుక్కున లేచి గబగబ తన గదిలోకి పరుగెత్తింది. భాస్కర్ ఆమె ఊగే జడను చూసి తృప్తిగా వదిన రాజేశ్వరి వంక తల తిప్పాడు. రాజేశ్వరి మరిది బుగ్గ గిల్లింది.
అయ్యవారు, “అబ్బాయికి పిల్ల నచ్చింది. ఇప్పుడు అమ్మాయి చెప్పాల. అబ్బాయి నచ్చినాడా?” అనడక్క ముందే, తలుపు చాటున్న ఆడపిల్లలు గట్టిగా “నచ్చాడు, నచ్చాడు. చిరంజీవి” అని ఏకకంఠంతో అరిచారు. ఈసారి మీసాలాయన వాళ్ళని బెదిరించలేదు. “సుదర్శనా, టైమవుతా వుంది. ఇంక సాపేశేస్తాము, సరేనా?” అన్నాడు పెళ్ళికూతురు తండ్రి వైపు చూసి. సుదర్శనం లేచాడు. ఆయనతో పాటు అందరూ లేచారు.
అయ్యవారు “అందురూ లేశేశినారేమి. కూకోండి” అనగానే, శ్రీరాములు మేనమామ “సాప తెచ్చి పరసమనండి అయ్యొరా” అనరిచాడు.
మీసాలాయన “జమకాణాలు పరిచేసి వుండాయి గదా, ఇంకా సాప ఎందుకు?” అని సమధానం ఇచ్చాడు.
శ్రీరాములు మేనమామకి చిర్రెత్తుకొచ్చింది. “ఏందీ, జమకాణాలు సాపనా? సాప తెచ్చి ఎయ్యమనండి” హుందాగా పలికాడు.
శ్రీరాములు మామ చెయ్యి పట్టి మెల్లగా, “ఈ జమకాణం మీదే కూకోని మాట్లాడేస్తాం మామా” అని పలికాడు.
మామకి కోపం వచ్చింది. “రేయ్, నువ్వుండ్రేయ్. జమకాణం సాప ఎట్టా అవుతాది?” అరిచాడు.
మీసాలయన పక్కన కూచున్న గెడ్డం ఆయనతో నోరుకి చెయ్యి అడ్డంపెట్టి “ఈ మనిషి యెవ్వారానికి దిగుండాడు బావా” అని గుసగుస పలికాడు.
ఈలోగా పెళ్ళికూతురు తల్లి లోపల గదిలో చుట్టున్న చాపను తీసుకొచ్చి పరిచింది. అది చూసి శ్రీరాములు మేనమామ రెండు చేతులు చాచి, “ఇది పాత సాప, కొత్త సాప తెచ్చెయ్యి” అని అరిచాడు.
రాజేశ్వరి లేచొచ్చి, “చిన్నయనా ఇది సాల్లే, దీనిమీదే…” అని ప్రాధేయపడుతోంది.
“లేదమ్మాయి. మనం మాట్లాడబోయేది పెళ్ళి సమాచారం. దానికి కొత్త సాప పరసాల” పట్టుపట్టాడు శ్రీరాములు మేనమామ.
“ఇట్టపక్క సాపలమ్మే వోళ్ళొచ్చి దినాలైపోయింది. ఇప్పుడు కొత్త సాప గావాలంటే యాడికి బొయ్యేది?” అని ఒక పెద్దామె, నాయుడు భార్య దగ్గరికొచ్చి వినయంగా చెప్పింది. నాయుడు భార్య ఇందులో తన జోక్యం ఏమీ లేనట్లుగ సమధానం పలక్కుండా కూచుంది.
పెళ్ళికూతురు తండ్రి ఒక పిల్లాడిని పిలిచి, “రెయ్ అబ్బాయ్, నువు పరిగెత్తి పోయి ఈది మొనాల శెట్టింట్లో ఒక కొత్త సాప కావాలని అడిగి తే పో” అని పంపించాడు. ఆ కుర్రాడు రెండు నిమిషాల్లో ఒక రంగురంగుల చాప తెచ్చాడు. వెడల్పుగా, పెద్దదే. కొత్తదిగానే వుంది. దాన్ని విప్పి పరిచారు.
మేనమామగారు దాని కొన వేళ్ళతో పట్టి వెటకారంగా,”ఇదేందీ పళాశ్టిక్ సాప. దీన్ని తెచ్చినారు! పొయ్యి వేరేది తేండబ్బా… ” అంటూ మొండిపట్టు పట్టాడు. పరిష్కారం తెలియక అందరూ ఒకరిమొహం ఒకరు చూసుకుంటూ నోరు మెదపకుండా కూర్చున్నారు. పెళ్ళికూతురు తల్లితండ్రులూ, వదినా, అన్నలకి ఈ మేనమామ పెద్దమనిషిని ఏ విధంగ సముదాయించాలో తెలియలేదు.
అప్పుడు మీసాలాయన, గెడ్డాలాయన లేచి మేనమామగారి చెయ్యి పట్టుకుని, ఎంతో వినయంగా “అన్నా, కొంచెం పెద్దమనసు చేసుకోని పని జరిపించు. టైమైపోతా వుంది. రావుకాలం రాబోతంది” అని ప్రాధేయపడ్డారు. మేనమామ మొండికేసి కూర్చున్నాడు. భాస్కర్ ఉండబట్టలేక ఆయన కాళ్ళమీద పడ్డాడు. మేనమామ చలించిపోయి చివరికి ఒప్పేసుకున్నాడు. “అయితే, దీని మీద ఇంటి సాప పరసండి. పని జరగాల గదా” అని చేతులు వెనక కట్టి నుంచున్నాడు.
నిముషాల్లో ప్లాస్టిక్ చాపమీద అంతకుముందు పరిచిన మామూలు చాప పరిచారు. దానిమీద ముందుగా అయ్యవారు పద్మాసనం వేసి కూర్చున్నారు. ఒకవైపు శ్రీరాములు, మేనమామ, నాయుడు, రాజేశ్వరి తండ్రి, వెనక పెళ్ళికుమారుడు కూర్చున్నారు. వాళ్ళకెదురుగా, పెళ్ళికూతురు తండ్రి, అన్న, మేనమామలు, బావలు కూర్చున్నారు- మీసాలాయన, గెడ్డాలాయనతో సహా. “ఈ మనిషి అటం పట్టకుంటే ఈపాటికి పనైపోయుణ్ణు. మనకి ఇంట్లో వేరే పనుండ్లా. అనేక తొటకి బోవాల” అని గుసగుస పలికాడు.
అయ్యవారు, “సుదర్శన, గెట్టిమాట మాట్లాడుకుంటామా? నీ కూతురు సౌబాగ్యవతి లక్ష్మిని, సీరాములు తమ్ముడు చిరంజీవి (ఆడపిల్లల పకపకలు వినిపించాయి) బాస్కర్‌కి ఇచ్చి పెళ్ళి చేశెదానికి పూర్న సమ్మతము. సరేనా? మీ ఇంట్లో ఆడోళ్ళనీ, ఆడబిడ్డల్నీ, అల్లుళ్ళనీ కలిసి మాకు చెప్పాల్సింది. లేశిపొయ్యి అడిగేశి రా” అన్నాడు.
సుదర్శనం లేచాడు. “అందురికీ సమ్మతమేనా?” తన బంధుమిత్రుల మీద చూపులానించి ఇటూ అటూ తలాడించి అడిగాడు. అందరు ముక్తకంఠంతో “సమ్మతమే, సమ్మతమే” అన్నారు. ఆయ్యవారు ఒక మంత్రం పఠించాడు. తరువాత, శ్రీరాములు వైపు తిరిగి, “శ్రీరాములూ, మీ ఆడోళ్ళని అడిగి వక్కాకు తట్ట ఇక్కడ పెట్టు” అని, పెళ్ళికూతురు తల్లి వైపు చూసి, “అమ్మాయ్, మీ తట్ట కూడా ఇక్కడ పెట్టండి” అనడిగాడు.
పెళ్ళికొడుకు తరఫున రాజేశ్వరి తమలపాకులు, పళ్ళు, వక్కలు అమర్చిన పళ్ళెం అయ్యవారు ముందుంచింది. పెళ్ళికూతురు తరఫున ఆమె తల్లి తమలపాకుల పళ్ళెం తీసుకొచ్చింది.
అయ్యవారు ఒక మంత్రం చదివి, నాలుగు తమలపాకులు, రెండు వక్కలు, రెండు అరటిపళ్ళు పక్కన పెట్టాడు. అదేలాంటి మరో తమలపాకుల సెట్టు పక్కన పెట్టి, శ్రీరాముల్ని సుదర్శనంని ఎదురెదురుగా కూర్చోమని తమలపాకులు వక్కలు పళ్ళు మూడుమార్లు మార్చుకోమన్నాడు. అదయ్యాక, ఒక మంచి రోజు చూసి నిశ్చితార్ధమూ, ముహూర్త నిర్ణయమూ, పెళ్ళి పత్రిక రాయడమూ చేస్తామని సభలోని జనానికి విన్నవించాడు. అందరికి తమలపాకు, వక్కలు పంచారు. మీసాలాయన, “అందురికీ వక్కాకులు చేరిందా?” లేచి నిలబడి అడిగాడు. నాయుడుగారి వైపు చూసి పెద్దాయన, “అందురికీ కలర్ నీళ్ళు దాకం ఇస్తాము. భొంచేసి పోవాల్సింది” అన్నాడు. వెంటనే, అందరికీ చిన్న గ్లాసుల్లో ఫాంటా ఆరెంజ్ పోసిచ్చారు. పదినిమిషాల పాటు ఈ కార్యక్రమం జరుగుతున్న సమయంలో, రాజేశ్వరి పెళ్ళికూతురు గదిలోకి బుడ్డోడితో వెళ్ళింది. కూడా నాయుడు భార్యా, అయ్యవారి భార్యా వెళ్ళి పెళ్ళికూతురుతో మాట్లాడి తృప్తిగా బైటికొచ్చారు.
శ్రీరాములు, సుదర్శనం అయ్యవారికి కట్నం సమర్పించి కాళ్ళ మీద పడి నమస్కరించారు. శ్రీరాములు, భాస్కర్‌లు తమ మేనమామను, నాయుడిని, రాజేశ్వరి తండ్రినీ, సుదర్శనంనీ పక్కపక్క నుంచోమని వాళ్ళ పాదాలకి నమస్కారం చేసుకున్నారు. సుదర్శనం తన కాబోయే అల్లుడి వినయం చూసి మురిసిపోయాడు.
అందరు ఇంటి బయటికి నడిచారు. ఎవరి చెప్పులు వాళ్ళు వెతికి తొడుక్కుంటున్నారు. సెలవు తీసుకుని నడక మీద కొందరు, మోటార్‌సైకిళ్ళ మీద కొందరూ, ఒక ట్రాక్టర్ మీద కొందరూ వెళ్ళిపోతున్నారు. శ్రీరాములు వీధిచివర్న నిలిపిన వాన్‌ను తోలుకురాడానికి వెళ్ళాడు. అయ్యవారు, నాయుడు, మీసాలాయన, సుదర్శనం ఓ పక్క నుంచుని ఏవో చిన్న కబుర్లాడుకుంటున్నారు. నాయుడు భార్య, అయ్యవారి భార్య, రాజేశ్వరి వాను ఎక్కడానికి సిద్ధంగా వున్నారు.
పెళ్ళికొడుకు భాస్కర్ తను విడిచిన చెప్పులు వెతుకుతూ వున్నాడు. తక్కిన చెప్పులన్నీ మాయమయ్యాయి. తనవి కూడా లేవు. వాను లోంచి శ్రీరాములు అరిచాడు,”అందురూ ఎక్కండి. రావుకాలం పెట్టేముందు మనం బయల్దేరేయాల.”
అందరూ వాను ఎక్కారు.
చెప్పులు లేకుండా భాస్కర్ బండెక్కాడు.
వాన్ కదిలింది.
భాస్కర్ వాన్ కిటికీలోంచి, ఇంటి డాబా వైపు చూశాడు.
డాబా మీద పెళ్ళికూతురు ఒక చేత్తో భాస్కర్ చెప్పులు పట్టి చూపిస్తూ, మరో చేత్తో టాటా చెబుతోంది!