చంటిమేనిపై పైతృపిశాచి మదము
వ్యధను సంధింప కర్తయు, హర్తయు హరి
దక్క వేరొండు కాదంచు దనువు మరచు
నతడు అద్వైతకళల ప్రహ్లాద మూర్తి.
విమల రోగఘ్న గంధమ్ము విరగజిమ్ము
లేత ఐదేండ్ల గుండెలో లేలిహాన
దంష్ట్ర బల్మారు పోనివ్వ తరగబోని
మంచిగంధపు మారాకు మది జయించు.
తెలియనితనమే తెలియగ
తెలివి తనువగు హరి తెలివి తెలియును, తెలిసీ
తెలియవలసినది తనువను
తెలివిని తొలగించు తెలివి తెలియగ వశమే.
జాబిల్లి వెన్నెల్లు జలజాక్షుడైనంత హాలాహలోద్భీతి యేల రాదు?
నేర్పించు చదువుల్లు నిటలాక్షుడైనంత వేదండవిభ్రాంతి యేది లేదు?
మేలిల్లు, దేవుళ్ళు మీనాక్షుడైనంత కుధ్రసంభ్రమమేల గురుతురాదు?
దేశమ్ము కాలమ్ము దీర్ఘాక్షుడైనంత సింధువిభ్రమమేల చెంత రాదు?
నీకు తెలిసిన దైవమ్ము మాకు తెలియు
నీకు తెలిసిన భక్తులు మాకు కలుగు
నీదు నునులేత గుండెలో నిష్ఠచేత
వెలుగు శూలంపుపదును మావలన కాదు.
‘రారా బంగరుకొండ! దగ్గరకు రారా కంజపత్రాక్ష! నీ
మారామింక కుదించు, ఆఖరిదెపో మామంచి గోర్ముద్ద’యం
చో రావింప యతించు తల్లి పటిమన్ శోధింప పర్వెత్తు నీ
గారాబంబుల బుర్రలోనమరెనే కాఠిన్యవేదాంతముల్
అరిపాదమ్ములు లేచివుళ్ళు, విరినేత్రాంకాలు రాత్రిప్రసూ
న రమాసంకులకోమలాలు దరవిన్యాసాతిరేకంబులా
పరమానందపతాకభూమికలు రా ప్రహ్లాద! వర్ణింప, నీ
పరమాత్మాంకితచిత్తసంగతులు జెప్పన్ సాధ్యమే నేటికిన్
లలితనికాయకాయమున రంజిలు శింజిని భూషవోలె శ్రీ
లలనపథానుయానమున లక్షితచిత్తముకంటుకున్న దే
హ లవనివేశమే ఇదను హార్దికభావము ఉండుగాక, నీ
పలుచనిదేహఘట్టనలు పంచును క్షోభము తల్చుకొన్నచో.
నిన్ను మృదూపలార్ద్రగణనీయవిదేహుని చీదరించి సం
పన్నదురాభిమానమయపాశము పట్టిన కన్నతండ్రి శ
శ్వన్నిధనానుకూల ఖలశాసనలేఖకుడైన తీరు లో
గొన్న యెడంద నీదిగని కూలును నా హృది స్వప్నసౌధముల్.
పరువము తారసిల్లు విరి పాలగు మెత్తదనాల పొంగు; తె
మ్మెరపసికూన తూలి పొడమించెడు సౌఖ్యము, గుండెలోని ప్రే
మ రొదను చెప్పువేళ ముఖమందున దొర్లెడు తప్పుసోకు నీ
వరమగు చిన్నిమోమువలపంటిన భక్తికి సాటివచ్చునే.
వయసు వరేణ్యమై పొరలు వారిన మోహపు మానరాగసం
చయములతో మదించి తమిచాలక మగ్గెడు మాదుగుండెలో
నయముగ చల్లరా పసితనాల వినిర్మలబీజరాజి, చా
లు, యనుగమించు దేశగతి రోదసివైపుకి సాంద్రదీప్తమై.