Janaki’s Zen

Overture

(or entr’acte after Rhapsody in Woods)

స్ఫటికంలా స్ఫురిస్తున్న పాలసాగరంపై, ఉత్పలతల్పంపై, కొలువు తీరినాడానాడు పరమాత్ముడు. ఇరుప్రక్కలా వేదికల మీద ఆసీనమై వైకుంఠనగరి వాయిద్యబృందము – చయ్కావ్‍స్కీ స్వాన్ లేక్ సంగీతం వినిపిస్తుండగా, దేవాధిదేవుని ముందు, తమ ఉజ్వలకాంతుల బహువర్ణాల పర్ణాలు మెరుపు లీనేలా కదిలిస్తూ విదిలిస్తూ; తమ పొడవాటి మెడలు పెనవేస్తూ, విడదీస్తూ; స రి గ మ ప ద ని హంసలు; వారి చుట్టూ మరెన్నో చిన్నారి బాలరీనో బాలరీనా హంసల గుంపులు నర్తించాయి.

ఆ నాట్యవిశేషము ముగిశాక, ప్రఖ్యాత భాగవత గాథ నుండి, సప్తస్వర హంసలు విష్ణుస్తుతి చేశాయి.

ఆదిదేవా! స్వర్గమును సురలకు
మరల నీ విప్పించ దలిచేవు,
దైత్యులను చ్యుతులను చేయనెంచేవు.
కశ్యపుని కొడుకుగా రూపు నెత్తేవు
అదితి అంగణాన, మురిపాలు తీరగా
చిన్ని పాపడివై నీవు చిందులేసేవు.
అక్షయమగు ఒక భిక్షాపాత్రను గొని
గొడుగు చేత బట్టి, బాల వడుగై
బలి రాక్షసుని బిచ్చమెత్తేవు.
బడుగు వలె మూడే అడుగుల నేల కోరేవు.
“ఎవరి వోయీ నీవు? ఊరేమి? పేరేమి?
భూరి దాతను కొద్ది కోర్కె కోరేవేమి?”
అని అడుగు బలితో:
“ఎవ్వనివాడను కాను, నేనందరివాడను
ఎందును లేను, కాని, ఎల్లెడల కలను
ఏమెరుగను, కాని, ఎరుగనిదే లేదు
ఒంటివాడను, నాకు చుట్టమే లేడు
చిన్నవాడను, నాకెన్నొ కోర్కె లేల?
పేదవాడికి చాలు జానెడు నేల”
అని వడుగా! నీవు గడుసుగా పలికేవు.
నీ బంగరు మోముకు
బుడిబుడి నడకలకు
బులిపెపు మాటలకు
మురిసి మురిసి,
నీవు చక్రధారివని
తెలిసి తెలిసి
కడిగె గదా బలి చక్రవర్తి! నీ చిట్టి పాదము,
ధారపోసెను గదా నీ చిన్ని చేతిలో ధరను.

అపుడు నవ్వితివంట
నగుచు పెరిగితివంట
వటువింక కావంట
నిటువుగా సాగగా
పటుల బ్రహ్మాండమ్ము
పగులు చూపేనంట.

భూలోకమును దాటి, భువర్లోకము దాటి,
సువర్లోకము దాటి…

అంటుండగా -ఆ హంసలకు చటుక్కున భూలోకము జ్ఞప్తికి వచ్చి;

సకల సద్గుణాభిరాముడగు మానవుడు
భూమిపై కలడొకడు, అతడు రాముడు
అతనికి సీతతో ఎడబాటు కలిగెనిపుడు
వారి కుయ్యాలించి కరుణించి కాపాడు,
సెలవు చక్రధారీ! జగన్నాటక సూత్రధారీ!

(అని పలికి, ఆ ఏడు హంసలు భూమి దిశగా ఎగిరిపోగా తెర లేస్తుంది.)


అది రావణాసురుని రాజ్యమైన సువర్ణ లంక. ఆ నగరిలోని అతని అశోకవనము. ఆ వనిలో, తనెక్కడ ఉన్నదో తెలియని విభ్రాంతిలో, రాజకుమారి సీత. రావణుడు వచ్చి, సుడిగాలి రూపంలో ఆమెను ఎగురవేసి, దండకారణ్యం నుండి అక్కడకు తీసుకువచ్చినది తనేనని, సీతతో చెపుతాడు. ఆమె తనకు నచ్చినట్లు చెప్పి, తనను వివాహం చేసుకోమని అడుగుతాడు. ఆమె భయభీత అవుతుంది. ఐనాగాని, ఆమె మిథిల లోను, అయోధ్య లోనూ ఉన్నప్పుడు, అక్కడి రాజగురువులనుండి, ఆపత్కర పరిస్ధితులు తటస్థిస్తే, బైటపడటానికి తగు శిక్షణ పొందిఉన్న రాకుమారి. ఆమె సార్వభౌముడు రావణునితో గౌరవంగా సంభాషిస్తుంది. తనను రాముని వద్దకు మరల చేర్చమని అడుగుతుంది. సీత అప్పటి మాటలివి:

మనసు నాదెపుడు రామచంద్రాభిముఖము
మరలి రాదది ఎవరెంత వేడిన ఏమి సుఖము!
కోపించి, నిందించి, వెళ్ళబోసిన మీరెంత అక్కసు
వినదు, ఊ అనదు, ఔననదు నా మూర్ఖపు మనసు.

రావణుడు అప్పటికి వెళ్ళిపోయి, మరోరోజు వచ్చి, కుబేరుని మించిన తన వైభవం గురించి చెప్పి, రాముడిని మర్చిపోయి తనతో లంకలో ఉండిపొమ్మంటాడు. సీత ఇలా అంటుంది.

“మరువలేను! నేనాతని అందచందములు
ఆ చల్లని వెన్నెల నవ్వు లాతని మేని గంధములు.
ఏల మరువ వలెను? నేనాతని మనసు మిసిమి
మేలి కలిమి, చిన్ననాటి చెలిమి, ఎన్నొ ఏండ్ల కూరిమి
కలసి శరత్తుల, వసంత రాత్రులలో ఆడిన ఊసుల;
ఒరసి, చెక్కిళ్ళు దరిచేసి, చేతిలో చెయివేసి చేసిన బాసల?

మళ్ళీ కొన్నాళ్ళకు రావణుడు వచ్చి అదే ప్రస్తావన తెస్తాడు. ఆ రాజకుమారి మర్యాద పూర్వకంగా సమాధానమిస్తుంది.

ఏల మరతు? నేనా సుఖనిద్రల, ఆ బాహువుల డోలల,
చాల ప్రేమతో తన ఉరమునె తలగడ చేసిన తియ్యని వేళల;
పారవైతునా నేనతని ఆదరము, గౌరవము ఈ దినము
ఆ ఉదార హృదయపు పూర్వపు మన్ననము!
పూడ్చివైతునా మమతల మరువపు స్మృతులను
పెరకివైతునా కలసి పెనవేసిన ప్రేమ లతలను?”


అక్కడ దండకారణ్యంలో; తన కళ్ళముందే, ఒక మహాప్రభంజనం ఆవిర్భవించి, సీతను పైకి ఎగురవేసి, దూరంగా, దూరంగా, ఇక కనపడకుండా ఆకాశంలో ముగిసిపోవటం చూసిన రాముడు, నిర్విణ్ణుడైనాడు. సీత! ఇంకెక్కడి సీత! ఆమె సుకుమార దేహం, ఆ వాయుగుండంలో ఛిద్రమై ఆమె అణువులు అంతరిక్షంలో కలిసిపోయాయి. రాముడు తనకే పిడుగు తగిలినట్లు నేలకు కూలిపోయాడు. అతనికి స్పృహలేదు. ఎంతకాలం గడిచిందో! అక్కడి కోతులు అతడికి శ్వాస ఆడుతున్నదో లేదో గమనించేవి. అతడి చేతులూ కాళ్ళూ అటూ ఇటూ ఆడించేవి. ఏనుగులు నీటితో అతని శరీరాన్ని ప్రోక్షించేవి. కోయలు వచ్చి, బలవంతాన అతడి నోరు తెరిచి ఏవో పసరులు పిండేవారు. అడివి భిషక్కులు తోచిన చోట్ల అతని శరీరాన్ని సూదులతో గుచ్చేవారు. ఎన్ని దినాలు, నెలలు గడచినవో మరి!

ఒకనాడు సంహిత మంత్రవీణ నుండి సీత స్వరంలో పిలుపులు రాముని దాపులో వినిపించాయి.

నీలి రాగము నే నీటుగా పలికేను
వినుచుంటివా నీవు వినుచుంటివా?
ఆధారభావమా! నాదాత్మరామా!
సుకముంటివా నీవు సుకముంటివా?

చలిలో వేచేనిట నీకోసం
పిలిచా ఓ రామా, శ్యామా, అని రోజూ నీ పేరే.
వినలేదేమోలే నీవు రామా!
నిరతం వాసంతం నీతో, సతతం సీమంతం నీతో
కలలో నీవే, ఇలలో నీవే, కథలో నీవే
సీతా! సకియా! అన్నావే; ఏమో
మరచేవేమోలే!
అనలేదేమోలే నాతో; సరిలే ఓ రామా!
పిలిచా ఓ రామా, శ్యామా, అని రోజూ నీ పేరే.

సీత పరిచిత శ్రావ్యకంఠస్వరం అతడి కర్ణరంధ్రాలలోనుండి మెదడులోకి వెళ్ళి, దెబ్బతిన్న జాగరణ, జ్ఞాపకపు తంత్రులను చక్కదిద్దింది. సీత బ్రతికే ఉంది. ఆ సమాచారం అమృతోపమేయమై, అతడు స్పృహలోకి వచ్చి, మెల్లగా అక్కడి అరణ్యజీవుల స్నేహ, ఉపచారాలతో కోలుకుని, కొన్నాళ్ళకు లేచి తిరగసాగాడు.


ఇక్కడ లంకాపురిలో; సీతను చూడటానికి వచ్చినప్పుడల్లా, ప్రతిసారీ ఆమె రాముడి పైన వ్యక్తం చేసే ప్రేమకు, ఒకరోజు రావణుడు విసుగుతో, – “ఏమీ లేని పేద, ఆ రాముడెందుకు నీకు?” అంటాడు. ‘రాముడెందుకు?’ అన్నప్పుడు, తొటతొట కళ్ళవెంట నీళ్ళు కారిపోయి, ఆమె మొదటిసారిగా అతనివద్ద శోకిస్తుంది.

మట్టి పుట్టితి నేను, మట్టి పెరిగితి నేను
మట్టి కలిసెద నొకనాడు
వట్టి మాట కాదు;
నడమంత్రపుసిరి నాకు రాముని ప్రేమ!
రాముడేటికన్న రాటుమాట విన్న
కనుల నీరు తొరగి, తొలగి పోతా నేను
మనసు విరిగి, ఇక వారితో
మాట కలపలేను.

అని చెప్పి, ఆ పైన సీత ఇక రావణుడితో మాటలు మానివేసింది. ఆమె దుఃఖపు తీవ్రత చూసిన రావణునికి, గుండెలో ఓర్చలేని కళవళం కలిగింది. అతడికి దిక్కు తోచలేదు. మనసంతా గందరగోళమై పోయింది. ఇది అతనికి ఒక కొత్త అనుభూతి. ఆ రాక్షసరాజుకి, ఆ అందగత్తెతో సుఖించాలని ఉన్నది కాని ఆమె ఏడుపు చూడాలని లేదు. అతడంతకు మునుపు తెచ్చుకున్న స్త్రీలు ఎవరూ అతనిని నిరోధించలేదు. పైకి బింకంగా, “నీ అంతట నువ్వు మనసు మార్చుకోవటానికి ఒక సంవత్సర కాలం గడువిస్తున్నాను,” అని చెప్పి అశోకవనం విడిచి వెళ్ళిపోతాడు.

సీత తన భద్రత గురించి కొంత స్తిమితపడుతుంది. ఆ పిమ్మట రామునిపై బెంగ పడుతుంది.

ఆ గాఢ సంశ్లేషము
లేడ పోయెను రామ!
మగుడి రావో ఇంక
మన పైడి ప్రణయాలు!
శింశుపా వృక్షాలు చిగురులేసినవి
అశోకలు, సంపెగలు విరగబూసినవి
ఈ తరులకేలా ఇంత విజృంభణము!
పదితలల-ఇరువది చేతుల
మాయావి, వేల వేల విరస
రూపాలు వెర్రిగ నవ్వినట్లు
భ్రాంతి కలిగించు ఈ చెట్లు.
అందమే లేదు, ఆనందమే లేదు,
నీవు లేక సౌఖ్యమన్నదే లేదు.
రావేలా రామ? ఇంత జాగేలా?

కావలె నాతడు, కావలె నాకు,
కాకుత్స్థుండే కావలె నాకు.
కమలాప్తుని కుల కాంతి కిరణము
కరుణాళువు, కావగ నాకై కోరి రావలె.
రావలె నాతడు, రావలె నాకై,
రాక్షసు నుండి రక్షించంగా;
రావణ చెఱను విడిపించంగా,
రావలె రాముడె.

అరణ్యంలోని రాముడు, సంహిత మంత్రవీణ సహాయంతో, సీత పిలుపులన్నీ వినగలిగి, ఆమె ఎక్కడ బందీగా ఉన్నదో సరిగా గ్రహించుకున్నాడు. సీతకు కొన్ని సందేశాలు విడిచిపెట్టాడు. మెల్ల మెల్లగా కాళ్ళు చేతులు కూడతీసుకున్నాడు. ఆరోగ్యవంతుడయ్యాడు. ఆ తరువాత, లంక ఎక్కడ ఉన్నది, ఎలా చేరాలి, సీతను ఎలా విడిపించాలీ అన్న యత్నాలలో నిమగ్నుడైనాడు.


లంకలో, రావణుని పట్టమహిషి మండోదరి, ఇతర అంతిపురి స్త్రీలు, ఒక మానవ స్త్రీ ఇప్పుడు వారి తోటలో బందీగా ఉన్నదని విని, కుతూహలంతో ఆమెను వచ్చి చూసి, చూసిన పిదప, సీత స్థితికి వ్యధ చెందుతారు.

నాగరీకపు అయోధ్యనగరపు
నాజూకుల నారీ!
సాగర తీరపు దీవిలో
ఏలమ్మా
నీ రాగ గగనాన
ఈ తిమిరపు తెరలు?
తీయవో ఒకసారీ.
ఏవమ్మా నీ
జిలిబిలి మెరుపుల
దీప కళికలు?
వెలుగవో కడసారీ.
కడలీ పొరలెను,
అడలీ పొంగెను,
ఒడిలో నీ రాజేడీ?
వాడు ఎడమాయెననీ
భువి కడు శూన్యమనీ
బేలా కలగేవో
నీలో కుమిలేవో!
వసివాడీ, మసిబారీ
ఇలా, లోలో కనలేవో!
ప్రాణ దాతలౌ
నీ ప్రియుని స్పర్శలు
పలుచ పలుచనై
జీవన ఇంధనం
ఇంకిపోవగా
నీవీ వేళా మలిగేవో!

విభీషణుడు, ఒక ప్రేమ జంటను విడదీసిన తన అన్న రావణుని క్రూరతకు సిగ్గుపడి, అతని ప్రవర్తన మార్చలేక, అసహాయుడై, సీత గురించి అమితబాధ చెందుతాడు.

వర దాశరథీ!
కరుణాపయోనిధీ!
శ్రీరామ! సీతకై రావేమి?
ఘోర క్రూర చెరలో, ధూళి ధూసరితయై
దుఃఖాన ప్రణయిని కూలేను.
ఎలుగెత్తి పిలచినా హృదయమా వినవేమి!
శ్రీరామ! సీతకై రావేమి!
రాక్షస శిక్షకా, యతియాగ రక్షకా,
శ్రీరామరక్ష సీతకు లేదో!
రావేమి, రావేమి, రావేమి రాఘవా!
నీ రామ సీతకై రావేమి?

సీతను చూస్తానికి అంతఃపుర కాంతలు మళ్ళీ, మళ్ళీ వచ్చారు. వారు ఎన్ని కళలలో, ఎన్ని శాస్త్రాలలో నిష్ణాతులో గమనించి సీత ఆశ్చర్యపోయింది. వారితో స్వేచ్ఛగా మాట్లాడింది. తన మనసు విప్పిచెప్పింది. రాముడి చిత్రపటాలు గీసి వారికి చూపింది.

ఆకాశ దీపం
నా ప్రియుని రూపం!

అలరించు నన్నతడు
తీర్చు పరితాపం.
భావించినంతనే
భాసించు ఎదుటనే
భ్రమియింతు నాతని
సరసీ చుంబనం
సత్తమాలింగనం.
అల రాస కొమరుడు!
ఆ రామచంద్రుడు!
అలరారగా రాగ
అలదేను గంధం
చలువ చూడ్కుల వాని,
చక్కన్ని నా దొరను
నిలువు నిలువు మంచు
నిత్తు నీరాజనం.
ఇక్ష్వాకు కుల తిలక!
ఇక విడిచి పోకురా!
నా చక్షువుల నుండరా
యని, లక్ష పూవులు
జల్లి, వాని నడిగేనులే!

రావణుని రాణులు, మానవి జానకి గాఢ ప్రేమను చూసి మురిశారు. వారు స్వయంగా, కాపలా స్త్రీలకు ఆమెకు సకల సదుపాయాలు ఆ తోటలో అమర్చవలసిందిగా ఆజ్ఞలు జారీ చేశారు. పలువిద్యలు, వ్యాపకాలు -సంగీతము, చిత్రకళ, శిల్పము, వైద్యము – అభ్యసించి అభివృద్ధి చేసుకునే శాలలు, ఆమె కోసం త్వరగా తోటలో అమర్చబడుతున్నాయి.


సంహిత మంత్రవీణ నుండి ఒకనాడు, ఆకస్మికంగా రాముని మాటలు సీతకు వినిపించాయి.

ప్రియమారగ పలుమారులు నీ పేరు పిలువని పవళ్ళు
తనివారగ నీ తనువు తగలని రాత్రుళ్ళు
ఏ దుర్గతి వలన నాకు కలిగెనో, కాని జానకీ!
నీ తలపు నిలుపని క్షణము నా తనువు నిలుపదు ప్రాణము.

కత్తు కలిపితి నీ ఒక్కర్తి తోనె నేను
కల్ల కాదు. వైదేహి! నీ అంత లేడికన్నులు
అంత వాడి పలుకులు, అంత వేడి ఉరకల
నెత్తురులున్న కాంతను నే చూడబోనెచట.

ఎన్ని వసంతాలు గడిచేనో!
ఐనా, మన మొదటి ప్రణయం,
మేడపై మెత్తని పడక,
సీతా! నీ నవ యౌవన శోభ
నీ రవ్వల జుంకీల మెరుపులు
నీ సొగసు చెంపలు
చెంపలలో సుడులు
ఆ ఎర్రని పెదిమలు
ఆ తీయని ఊటల ముద్దు
అప్పటి నీ వెచ్చని ఊర్పు
ఇప్పటికీ నే మరువలేను
ప్రియురాలా! స్వర్ణసుందరీ!

నీ ఫాలమ్ముపై ముద్దు, ఫాలాక్షుడే ఆన
చెక్కిళ్ళపై ముద్దు చతురాననుని ఆన
చుబుకమ్ముపై ముద్దు చక్రధారి ఆన
పెదవులపై ముద్దు పెద్దమ్మదే ఆన!

సొగసగు ప్రేమికవు నీవు సత్యము
యోగి-జనక మహరాజిచ్చిన వరము!
ఇంత ఓర్పు వహించుము, వేగిరము
సుఖింతువు సఖీ! నిత్య కొత్తలుగ.

పీడకల ఇది, వ్యధ చెందకు చెలీ,
తొలగిపోతుంది తొందరగాను,
కలుసుకుంటాము కను మూసి తెరపులో
కలసిఉంటాముగా కలకాలము మనము
పెట్టుకుందువుగాని నీ నాణెపు నగలు
కట్టుకుందువుగాని పట్టు పుట్టములు
అలదుకుందువుగాని జాజి జవ్వాజులు
కౌగిలింతువుగాని కమ్మగా నన్ను
క్షేమంగ ఉండు జానకీ, నీకోసమే నేను.

అతడి కంఠస్వర మాధుర్యానికి, నెమ్మి పలుకులకు ఆమెకు కన్నుల నీరు స్రవించి పోయింది.

రాగబంధముల రాపిడికి నే నోపలేనైతిని
శోకాల నిలయాలు నా నయనాలు;
విలయపు వలయాలు – అహో! ఆలోచనలు.
ఆవేదనామహాతరంగము అంతరంగము.
దినదినగండముల కాలూననీక జారెడి ఇసకల,
లోలోనికి రారమ్మని లాగెడి సుడిగుండముల,
విక్షోభపు సాగరము -ఇన్నాళ్ళు జీవితము.
రాలుచున్నవిలే రామ! జలజలజల నా
వేలవేల వెతలు, నీ పలుకుల తీపుల కతన.

నీవున్నావని, ప్రేమిస్తావని
ఆ ధీమాతోనే ఇక రోజూ నేనుంటా.
పాటికి పదిమాటులు
పనిలేకున్నా, నా పేరు పిలుస్తావని
దిలాసాతో దివ్యంగా నేనుంటా.
ఏ సీమలనైనా, ఏ వేళైనా
ఓ ప్రేమ తపస్వీ! నీ వలనే
ఇకపై నిశ్చింతగా నిష్పూచీగా నేనుంటా.

సీత మానసిక వేదన అంతా మెల్లమెల్లగా కొట్టుకుపోయింది. దుఃఖమెంత వినాశకరము. ఆ విషమజ్జనం ఒక ఊబి. వశమైతే మనిషిని ధ్వంసము చెయ్యగలదు. ఆమె పట్టుదలతో, దుఃఖాన్ని విదిలించివేసి, తన మనస్సు లోపలి ప్రత్యేకమందిరంలోకి వెళ్ళిపోయి, తలుపు మూసి వేసి, ఆనందాన్ని సంవాహన చేసింది. ఆమె భద్రతాస్థానం రాముడే. రాముడే ఆనందం.

ఆనందమా! రమ్ము.
నాకు నీ ఆలింగనము నిమ్ము.
నీ అమృతస్పర్శ కణకణము ప్రసరించి
నా అణువణువు పులకించి
సాంప్రతముగ నేనెంతయో ఉప్పొంగి
అంతయూ రగిలి
దేదీప్య జ్వాలనై వెలుగుదును గాక!
ఆనంద రామా! రమ్ము. ఆలసించకుము.
నీ మధుర ప్రగాఢాలింగనము నిమ్ము!


సీత వివేకవతి. సాధ్యాసాధ్యాలు తెలిసినది. ఒక మానవునికి సముద్రం దాటి రావటమంటే మాటలా? మార్గం యోచించాలి కదా! రాముడు సమర్ధుడు, త్వరలో వస్తాడు. రాలేకపోతే, తనే లంక నుండి బైటపడే మార్గం ఆలోచించుకోవాలి. తన ప్రవర్తన అతడికి ఆపద కలిగించేదిగా మాత్రం, ఎప్పటికీ ఉండకూడదు. ఆమె -రాముడు, భూప్రపంచంలో, ముల్లోకాల్లో సాటిలేని శూరుడు, వీరుడు అని ఎచ్చురపుమాటలు ఎవరితోనూ చెప్పదు.

సీత, రాణివాసం వారితో స్నేహంగా లంకా పట్టణం తిరిగి చూసింది. ఎంత అందమైన ద్వీపము! మేధావంతులు సమర్ధపధకంతో రూపొందించిన నగరము! ఎత్తైన పటిష్ఠమైన భవనాలు. చక్కని వీధులు. మేడలు మణులు, ఆలిచిప్పలు, శంఖులు, కాంచనము పొదవబడి మెరుస్తూ, నగరివాసులు సంపన్నులని తెలుపుతున్నాయి. ఆమె లంకవాసుల ఐశ్వర్యానికి, సుఖజీవనానికి ముచ్చటపడి బాహాటంగా ఎంతో ప్రశంసించింది. రావణుడు రాజుగా, ఆ రాణులు, ప్రజలు, చిరకాలం సకలభోగాలు అనుభవించాలని ఆమె ఆకాంక్షలు తెలిపింది.

ఆమెకు, రామునికి మధ్య ఆంతరంగిక సందేశాలు, ఏకాంతంలో, సంహిత వీణ ద్వారా నడుస్తున్నవి.

ఎంత చక్కని గుర్తు
ఎన్నుకొంటిమో ప్రియా!
పండు జాబిలిని చూడగానే
నిండు ఆనందము మనకు.
తలవని తలపుగ తలచి
విప్పారు గదా! వదనాలు.
కలతలుండవీ తెల్లని చల్లదనాల
సీమలో, క్రమము తప్పక
కలసికొనే మనకు.

తలతునా నీ కార్ముకము!
తలతునా నీ నగుముఖము.
పండుగ రోజున:
పేరు పిలుస్తూ, పెద్ద అంగలు వేస్తూ
బంధువులందరి మధ్యన వెదుకుచు వచ్చి
సీతా! సకియా! ఈ బంగరు నాణెం
నీకిస్తున్నా బహుమతిగా!
అంటూ గుప్పిట ముడిచిన
ఆ నాణెపు రోజును, ఆ గారపు పిలుపును,
మరతునా నేను!
మరిమరి తలచిననే కదా! ప్రేమిక సుఖము.

రావణుని రాజ్యపాలనా దక్షత, లంకా పట్టణపు అపురూపమైన నిర్మాణం, సాటిలేని సౌందర్యం, అయోధ్య రాజకుమారి ఎంత మెచ్చుకున్నదీ కుశాలబుద్ధి గల రాణులు రావణాసురునికి చెప్పారు. అతడు లోలో ఉప్పొంగాడు. రావణుని చారులు, మంత్రులు, శూర్పణఖ మోసపు చర్యను అతనికి నైపుణ్యంతో విప్పిచెప్పారు. సీతను మాయం చేస్తే, రాముడిని తన వశం చేసుకోవచ్చని శూర్పణఖ పన్నాగం. ఈ మూర్ఖపు చెల్లెలు కారణంగా అనవసరపు తగువు తెచ్చుకుని, తన స్వర్ణదీవిని ఎందుకు తగలబెట్టుకోటం? రావణుని మనసులో సంఘర్షణలు పెరుగుతున్నవి.

ఈ లోపల, సంహిత మంత్రవీణ త్వరితంగా అనుభవం గడిస్తూ -తన సంకలన పరిధులు, సందేశాల వేగం, అభివృద్ధి చేస్తున్నది.

విన్నాగా! రామా
నువు స్వరపరచిన రావం
విడమరచిన పుంభావం
అమావాస్యలో అద్రిమీద చంద్రుని ధవళిమ
దిగ్భ్రమ చందమై సొక్కి ఉన్నాగా
సోలుపులో – నీ స్వరాల రంగులు
పలవరించింది నా మస్తిష్కం.

ఒడి లో నుండీ లేవకు, సీతా!
నా హృదయంపై చెయి తీయకు!
ఒక మాటైనా ఆడకు!
కన్నులపై ముద్దుంచకు,
పెదవికి సుర అందించకు
ఆ పొరపాటసలే చేయకు!
పాదం పాదం రాయకు
ప్రబలపు ఒత్తిడి కోరకు!
ప్రాయం నిప్పని మరువకు
నా ఒడిలో నుంచీ లేవకు.

సీత రాముల ప్రేమ గాఢత విశేషాలు, సీత రచించిన రాముని చిత్రపటాలు, రావణుని రాణులు, తగు సమయాలలో అతనికి చేర్చారు. రాముడు అతి సుందరుడు. ఆకర్షణశక్తి -అదెలా ఆ మానవునికి సంక్రమించిందో! అందరి మనసు గెలిచినట్లే ఆ రాక్షసరాజు మనసు కూడా గెలిచాడు. అతడికీ రాముడిని చూడాలనే కోరిక కలిగింది. రావణుడు ఆలోచించుకుంటున్నాడు. చక్కని క్రౌంచపక్షుల వంటి సీతారాముల జంటను తనెందుకు విడదీయటం?
సంహిత వీణ, శృంగారగీతాలు ప్రోది చేసి, సీతకు రాముడికి, వారు ఒంటరిగా ఉన్నప్పుడు, ఇటునుంచి అటు, అటునుంచి ఇటు, జోరుగా ప్రసారం చేస్తున్నది.

వినగ ప్రేమ గీతిక!
సుఖించగా కలిగె నాకు కోరిక
కోయిలేది కూయగా
కోవెలేది మ్రోగగా
కామవాంఛ కలుగువేళ
మోయునెవరు నీకు వార్త!

విన్నాగా సీతా! రుతగీతి
ఒప్పుకున్నాగా నీతో రతి,
కలకల నవ్వులదానా!
కటకటపడనీయను నిను
నిలునిలు నీవున్న చోటె,
వస్తాను నేనే ప్రేమికా!
చూస్తాను నిన్ను నమ్మిక.


అశోకవనంలో సీత చిత్రించే రాముడి చిత్రపటాలు, లంకాపురి చిత్రకారులు అనుకరించి వేయసాగారు. రాముడి అందం, అతని ఆకర్షణ -కథలు కథలుగా ప్రజలలోకి వెళ్ళాయి. మునుపు అయోధ్యలో ఏమి జరిగిందో, లంకలో అదే జరిగింది. ప్రజలు ఈ అపరిచిత మానవుని -ఈ సుందరరాముని ప్రేమించసాగారు. గాయకులకు, చిత్రకారులకు, శిల్పులకు రాముడు జీవనోపాధి ఐనాడు. వారి కళలకు యశము కూర్చేవాడైనాడు. అతనిని చూడాలన్న కాంక్ష లంకలో వారందరికీ ఉదయించి, నానాటికీ పెరగసాగింది.

మరి కొన్నాళ్ళకు, సీతకు శుభశకునాలు గోచరించాయి. ఒకరోజు ఆమెకు అకస్మాత్తుగా అధిక ఆనందం కలిగింది.

నేడేలనో ప్రభూ! నేడేలనో
నే డోలలూగేను దివ్యభావాలలో.
జాజి జవ్వాజుల సౌరు సౌరభము నేనైతి
ఆపై కాకలిస్వనపు కోకిల కూజితము నైతి
అంతలో ఉజ్జ్వలకాంతుల మణిదీపము నైతిని
వింతగా ఒక పాలపుంతలో వెలిగితిని.
ఈడేరనున్నదిలె ఈనాడు రామా!
నిను చూడవలెనన్న నా గాఢకాంక్ష
ఏడేడు జన్మల ఎన్నెన్నొ కడగండ్లు
కడతేరనున్నవిలే! ఈనాడు పరమాత్మ!

అంతలో, మంగళవాద్యాలతో, జన సమూహం తనున్న చోటికి వస్తున్న ధ్వనులు జానకికి వినిపించాయి. త్వరలో సమీపించాయి. చూస్తే, రాముడిని ముందుంచుకుని; కోలాహలంతో, జయరామ! జయరామ! అంటూ ఉత్సాహవర్ధన ధ్వానాలు చేస్తూ; రావణుడు, రాణులు, రాజు తమ్ముళ్ళు, మంత్రులు, ప్రజలు వస్తున్నారు. ఆ రావటం చూసిన ఆమె ఆశ్చర్యానికి మితిలేదు. ఆ పైన జానకీ రాముల గాఢ సమాశ్లేషము, రాముడు ఆమె ముఖంపై ఉంచిన ముద్దుల క్రమము ఆ గుంపంతా అమితానందంతో చూశారు. (శిల్పులు ఆ తరువాత, ఆ కౌగిలిని పాలరాతి శిల్పంగా అశోకవనిలో మలిచారు.)


రావణుని అతిథిమందిరంలో, వారిద్దరే ఉన్నప్పుడు, రావణునితో పరిచయం ఎలా సంఘటిల్లిందో రాముడు, సీతకు ఇలా చెప్పాడు.

కలరు కిష్కింధలో భల్లూకములు, వానరులు,
మహా బలశాలురు, వాయువేగము కలవారు
సముద్రము దాటగలరు, నీటిలో రాళ్ళు తేల్చగలరు
రాక్షసులతో మాయాయుద్ధములు చేయగలరు.
పోరు లేక కూడ, నిన్ను నన్ను భుజాన మోసి వారు
ఎంత దూరమైన, ఎక్కడికైన సులువుగ చేర్చగలరు.

సీత, అడిగింది. “అలాగైతే, మరి అక్కడి వారి సహాయం ఎందుకు తీసుకోలేదు రామా?” అతడిలా చెప్పాడు.

ఒక చెడ్డ షరతు కలదు, అది ఒకనికి అపాయము
అన్నదమ్ములలో అన్నను చంపి, తమ్ముని ఱేడు
చెయ్యాలి నేను, ఐతేనే లభిస్తుంది సహాయము
లేకుంటే కిష్కింధలొ ఒక్కడు రాడు నాకు తోడు.
నీకు తెలుసు సీతా, అట్టి పనులు నా కసహ్యము
నా తండ్రితో, తమ్ములతో తగవు రోత -అని నాడు
విడిచాను గదా నేను పుట్టి పెరిగి ప్రేమించిన రాజ్యము!
మరెందుకు నాకు అడవిలో వానరుల పగల జంజాటము?

నేను ఏమి చెయ్యాలి! అని, ఆలోచన తోచక కొట్టుమిట్టాడుతూ, కిష్కింధ పొలిమేరల్లో, సంహిత సంపాదించి ఇచ్చిన స్వరం ఒకటి, నేను చేసిన వాయిద్యంపై మోగిస్తున్నా. ఆ జగన్మోహకమైన స్వరం ఇలా ఉంటుంది.

రి రి·ని|నిద దప పగ|పా-ప నిప|పగ గరి రిగ|గా-గ పద|గా-ప దప|నీ-|- ని రి·ని|నిద దప పగ|
పా-ప నిప| పగ గరి రిగ|గా-గ పద|గా- ప దప|నీ -|- రి|రీ· స·స·ని|రీ· స·నిని| రీ·- సస|నీ- స|
నీ దదప|నీ దదప|నీ దద| పా నిరి·ని|నిద దప పగ|పా-ప నిప|పగ గరి రిగ| గా-గ పద|
గా ప|దా ని|పా-|రీ·-|నీ·-| (రిమ్స్కీ- సాంగ్ ఆఫ్ ఇండియా)

అది నేను మ్రోగిస్తుంటే, ఒక సమున్నతకాయుడు నేనున్నచోటికి వచ్చి వింటూ, ఆ స్వర లక్షణం, నిర్మాణం అర్ధం చేసికొని, తన గొంతు కలిపాడు. ఎంత గంభీర స్వరమో అతనిది! ఎంత గొప్ప గాయకుడో! రాళ్ళు కరిగాయి.
తర్వాత అతడు, “రామా! ఎంత వేదన, వెదుకులాట! నీవు మ్రోగించిన ఆ స్వరంలో!” అని, నా చేతిలోని వాయిద్యం తీసుకుని, కాసేపు తను భైరవ, భైరవి రాగాలు మ్రోగించాడు. విని, అతడు శివుడు మెచ్చిన వైణికుడు, సంగీత విద్వాంసుడు రావణుడని నేను గ్రహించుకున్నాను.

“ఏమని మాటాడితివో ? రామ! ఎవరి మనసు ఏ విధమో తెలిసి, ఏమని మాటాడితివో?
రాజులు, మునులు, సురాసురులు, వరదిగ్రాజులు, మరి శూరులు, శశిధర దినరాజులు లోబడి నడువను
నయభయముగ ముద్దుగ ఏమని మాటాడితివో!”- సీత అతనిని అడిగింది.

రాముడు నవ్వాడు. “ త్యాగయ్య యేనా, సీతా! నన్ను గురించి అభిమాన గాయకుల మెచ్చుకోళ్ళకు, దురభిమాన చరిత్రకారుల అభాండాలకు కొరతేమి! నా జీవితకథ కల్పనలకు, తర్జుమాలకు మితి లేదు కదా! సీతా! నువ్వు క్షేమంగా ఉన్నావని రావణుడు నాతో చెప్పగానే నా ప్రాణం లేచొచ్చింది. నీ దగ్గిరికి చేరుస్తాననగానే నాకు ఆప్తమిత్రుడిలా అనిపించాడు. నేను లంకకు వచ్చి కొన్నాళ్ళు అతని అతిధిగా ఉండాలని, ఆ తర్వాత, మన ఇద్దరినీ తన విమానంలో జాగ్రత్తగా సముద్రం దాటిస్తాననీ చెప్పి నన్ను తీసుకువచ్చాడు. నేను మాట్లాడేందుకేమి ఉంది ఇంకా?” అన్నాడు.

తొట్రుపాటులు కలిగె వారికప్పుడు
తోచి కొత్తగ, ఒకరి కొకరు;
కొత్త నివసతి కొంత మిథిల,
ఆమె మైథిలి;
కొత్త సదనము కొంత కోసల,
అతడు రాఘవుడు;
కొత్తకొత్తవి ఆ దీవిలో వారి పెనకువలు.


రావణుడు కోరినట్టే, వారిద్దరూ, అతని అతిథిగా కొన్ని దినాలపాటు రాజమందిరాలలో ఉన్నారు. కరువుతీరా సంగీత కళ, సంగీత శాస్త్రము, ఇతర శాస్త్రములు, సముద్రంపై వారధులు ఎలా నిర్మించటం, ఎక్కువమంది ఎక్కగలిగే ఓడలు, విమానాలెలా తయారు చెయ్యటం, సంహిత వంటి సంగీత, సందేశ సాధనాలు ఇంకా చిత్ర శక్తులతో అందరికీ ఎలా అందించటం, అంతరిక్షం లోని గ్రహాలలోకి జనుల ప్రయాణాల వంటి -విషయచర్చలు రోజూ జరిగాయి. ఆ సభల సందర్భములో, జనుల కోరిక మీద, రాముడు, సీత -లంకావాసులను కలిసి మాట్లాడే అవకాశాలు కల్పించబడ్డాయి. ప్రజలు వారిద్దరిని లంకలోనే నివాసం ఉండమని అడిగారు. సీతా రాములు, ఆ ఆపేక్షకు ఎంతో లోబడి, వారందరిని ప్రీతితో ఇలా అర్ధించారు.

నలుగురు కూర్చుని నవ్వే వేళల
మా పేరొక తరి తలవండి
మీ మీ కన్నబిడ్డల నొకరికి, ప్రేమతొ మా పేరివ్వండి!
(గురజాడ)

రావణుడు, రాణులు, తిథివారనక్షత్రాలు సరిచూసి, లంకలో ఒకరోజు సాగరతీరంలో, ఆకాశపు పందిరి కింద సీతారామకళ్యాణం జరిపించారు. పానకాలు, పప్పుబెల్లాలు, పాయసం అందరికీ పంచారు. ఈ వేడుక ప్రపంచ వ్యాప్తంగా జరిగే వేడుకలలో ఒకటౌవుతుందని లంకావాసులు, ఇతర ఆహ్వానితులు, ఆ సమయంలో ఉద్ఘోషించారు.

జగదానందకారక జయ జానకీ ప్రాణనాయక
జగదానంద కారక, జయ!
(త్యాగరాజు)


(కోడా)

అటు అడవులు ధ్వంసం చేయకుండా, ఇటు లంకానగరంలో భవనాలు తగలపెట్టకుండా, ప్రాణిజనులను హింస పెట్టకుండా, మేము వీరులమంటే మేమంతకన్నా వీరులమని విర్రవీగకుండా, సమరసంగా సమస్యలు పరిష్కరించుకున్న వారందరినీ చూసి – సంగీత పరమ హంసలకు హర్షం కలిగింది.

నీవు రాముడవు, మానవుడవు.
నిన్ను, నీతో, నీకొరకె -వరించి, రమించి, తపించి
నీవలనె, నీకై, నీ యందె -హసించి, జీవించి, సుఖించు సీత.
నీ రామకథ, తీపికథ, ప్రేమకథ, కావ్యకథ జనులు సర్వదా పలికేరు రామా!

ప్రేమయె రెండవ దైవము,
ప్రేమయె ఏడవ ఋతువగు, ప్రేమయె భవమౌ
ప్రేమయె ఐదవ వేదము,
ప్రేమయె పదియవ నిధియగు, ప్రేమయె శివమౌ. (మోహన)

అని అందరికీ ఆశీస్సులు పలికి, సప్తస్వరహంసలు పలుచని తెరల వెనుక ఎగురుతుండగా – వయొలిన్, వీణా, వేణువు, పియానో, హార్ప్, సన్నాయి, బాకా, మృదంగ, డప్పు, ఢమరికల వాయిద్యాలతో, పెక్కు సంగీతకళాకారులు, వేదిక మీదికి వచ్చి చేరి, ప్రపంచ ప్రసిద్ధి పాటలు పాడుతూ నృత్యాలు చేస్తుండగా:

(Curtain.)


Composition: Lyla Yerneni
Access to Telugu Classics: V.S.T. Sayee
Vocabulary checks: Andhra Bharathi dictionaries
Reference articles: Eemaata magazine