ఏప్రిల్ 2022

ప్రపంచంలోని ప్రజాస్వామ్య దేశాలన్నింటిలోనూ వార్తాపత్రికలకు ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. అవి ప్రభుత్వాన్ని నిలదీసి విమర్శించే అక్షరదళాలు. అధికార దుర్వినియోగాన్ని ప్రశ్నించే ప్రజాగళాలు. అందుకే దృశ్యమాధ్యమాలు ఎంత ప్రాచుర్యంలోకి వచ్చినా వార్తాపత్రికల ప్రాధాన్యం ఒకింత తగ్గిందేమో తప్ప పూర్తిగా సమసిపోలేదు. నిజానికి విజువల్ మీడియా కూడా తమ కథనాలకోసం పత్రికా విలేకరుల వార్తలపైన, వారి పరిశోధనాత్మక పాత్రికేయత మీదే ఆధారపడుతుంది. అందువల్ల వార్తాపత్రికలు తమ ఉనికినీ ప్రాభవాన్ని పోగొట్టుకోవడమన్న మాట లేదు. సమస్యల్లా, మిగతా మీడియాతో పోటీపడే క్రమంలో పత్రికలు తమ ప్రమాణాలను దిగజార్చుకుంటూ వారి మూసల్లోకి ఒదిగే ప్రయత్నం చెయ్యడంతోనే. వార్తాకథనం రాయడం కష్టం. దానికి తర్ఫీదు కావాలి, నేర్పు కావాలి. వార్తావాక్యం సూటిగా, సరళంగా ఉండాలి. అందులో సత్యం స్పష్టంగా నిష్పక్షపాతంగా కనిపించాలి. శీర్షిక క్లుప్తంగా వార్తాకథనాన్ని పరిచయం చెయ్యాలి. పాఠకుడిని తమ అలంకారాలతో ప్రభావితం చెయ్యడం వార్తల పని కాదు. వార్తావాక్యం న్యాయాధికారి కాదు. న్యాయనిర్ణేత కాదు. సత్యావిష్కరణకు పనిముట్టుగా మాత్రమే మిగలాల్సిన వార్త సంఘటన పట్ల తీర్పు చెప్పకూడదు. ఇట్లాంటి లక్షణాలున్న వార్తలు ప్రచురించే పత్రిక కోసం నేడు తెలుగునాట వెదుకులాట అవసరమవుతోంది. వాడుకభాషలో కూడా మాట్లాడే భాష వేరు, రాసే భాష వేరు. ప్రపంచంలోని అన్ని భాషలలోనూ వాడుక భాషకు సంబంధించిన యాసలు ఎన్నివున్నా రాసే భాష కొంత భిన్నంగా ఉంటుంది. ఏ ప్రాంతీయభాష/యాస వాడినా వాక్యం వార్తావాక్యంగా ఉండాలి. ప్రామాణికత ఆ వాక్యలక్షణం ద్వారానే వస్తుంది. ఆ ప్రమాణాలను అందుకునేందుకు నిరంతర కృషి కొనసాగేది కనుకే, నిన్నామొన్నటి దాకా తెలుగునాట వాక్యరచనకు కథలనూ కవితలనూ నవలలనూ కాక వార్తపత్రికల భాషను, అక్కడి వాక్య లక్షణాలను ప్రామాణికంగా తీసుకునేవారు. కాని, వార్తావాక్యం అంటే ఏమిటో కూడా సమకాలీన విలేకరులకు అర్థం అవుతున్న దాఖలా లేదు. వర్ణనలు, అతిశయోక్తులు, ఆరోపణలు, అభిప్రాయాలు, చవుకబారు శీర్షికలు- వార్తాపత్రికల్లో ఇప్పుడున్నవన్నీ ఇవే. వార్తాపత్రికల భాషకు, పల్ప్ వెబ్‌సైట్ల భాషకూ తేడా కనపడటం లేదు. కథలు వార్తలుగా, వార్తలు కథలుగా, ఎవరు కథకులో ఎవరు విలేకరులో తేడా కనిపించని సమయంలో, సమాజంలో ఉన్నాం. సినిమాల ద్వారా ప్రాచుర్యానికి నోచుకునే కొన్ని పదబంధాలు జనాల నోళ్ళల్లో నానుతాయి. వీధిభాషలో ప్రజలు రకరకాల ఊతపదాలు, వ్యక్తీకరణలు వాడతారు. అంతమాత్రాన వాటికి ప్రామాణికత రాదు. అలాంటి భాషను తమ వార్తల్లోను, శీర్షికల్లోను వాడే వార్తాపత్రికల స్థాయి ఎలాంటిది? ఈ పాత్రికేయులకు ఇలాంటి భాషను ఏ విశ్వవిద్యాలయాల జర్నలిజం కోర్సులు నేర్పుతున్నాయి? ఆయా పత్రికల సంపాదకులు ఇలాంటి వాక్యాన్ని ఎలా అంగీకరిస్తున్నారు? సృజనాత్మకత పేరిట యథేచ్ఛగా వెలువడుతున్న వార్తలూ శీర్షికల్లోని చవకబారుతనాన్ని ఎందుకు ప్రోత్సహిస్తున్నారు? చివరకు ఘోరప్రమాదాలను, అత్యంత దయనీయం, దారుణం అయిన సంఘటనలను కూడా ప్రాసలు, పంచ్‌లైన్ల లౌల్యంలో బాధ్యతారహితంగా అమానవీయంగా ఎలా రాయగలుగుతున్నారు? వార్తాపత్రికలే రాజకీయపార్టీలకు తొత్తులై వారి బాకాలుగా, వారికి భజంత్రీలుగా మారి తమ స్వతంత్ర ఉనికిని పోగొట్టుకున్న ఈ కాలంలో, ప్రతిరోజూ నిజాలు కళ్ళెదుటే దారుణంగా హత్య కాబడుతుంటే, భాష గురించా తమ దిగులు అని మీరు నిలదీయవచ్చు. అవును, అదీ నిజమే. కాని, వార్త ఉండవలసినట్టు ఉంటే కనీసం అది హత్య అని అనిపించకుండా ఉంటుంది. వార్తావాక్యానికి ఉండాల్సిన సర్జికల్ ప్రిసిషన్ అదే కదా.