బండిసున్నా

అచ్చనగళ్ళు కుందుళ్ళు
అవలీలగా ఆడేసినా
బతుకాటలో నీకెపుడూ తడబాటే!

చిటికెనవేలు ఆసరాతో
జగమంతా చుట్టేసినా
అండ లేకుండా అడుగైనా వేయలేవు

రెండు రెళ్ళు నాలుగని తెలిసినా
అరవై సార్లు భుజం తట్టుకున్నా
అవసరమైన వేళ నోరు పెగలదు

ఎక్కాలు, గుణింతాలు
నేర్చుకున్నంత సులువుగా
బంధాలను గుణించుకోలేవు

అరవై నాలుగు గడుల ఆటలో నేర్పున్నా
జీవిత చదరంగాన్ని నెగ్గడమెలాగో
ఏ మాత్రం అంతుబట్టదు

మాటల మాటున దాగి ఉండే మర్మాలను
చేతల చెంతనే పొంచి ఉండే చాణక్య తంత్రాలను
ఎన్నటికీ పసిగట్టలేవు

కన్నీరుగా కరిగిపోవడమే కానీ
కడలిలా ముంచెత్తడం తెలియదు
కాచుకోవడమే తప్ప కత్తిని ఝళిపించలేవు

తలను ఊపుతూ ఊపుతూ
నిటారుగానూ నిలపవచ్చని మరిచిపోయినదానివి
నువ్వు బండిసున్నావు కాక మరేమిటి?