ఒక మధ్యాహ్నం

జీవితం తనతో తాను జీవిస్తోంది
కుదురుగా బొమ్మలతో ఆడుకొంటున్న పాపాయిలా

తనని తాను చూసుకొంటోంది
గాలికి ఎగురుతున్న పేపరు కొసల్లో
ఆమె వస్త్రాలపై వాలుతున్న ఎండలో

వింటోంది తనని తాను
టీవీలోంచి పొడిగా రాలుతున్న శబ్దాల్లో
వాహనాల తొందరలో, మనుషుల చప్పుళ్ళలో

పనిలేని గాలి తనని తానే తాకినట్టు
తీరికగా తనని తాకుతోంది జీవితం
ఆవు దూడని నాకినట్టు
ఎండ నాలుక చాపి లోకాన్ని నాకుతోంది

జీవించటం మినహా జీవితానికి మరేమీ తోచని
మాఘమాసపు మధ్యాహ్నపు వేళ
నదిలో మునగటమెలానో తెలియని నువ్వు
పైకి తేలి కాసిని అక్షరాలని పలవరిస్తావు

నిన్ను కుడుతూనే ఎర్రచీమలు చనిపోయినట్టు
జీవితాన్ని పట్టుకొంటూనే అక్షరాలు చనిపోతాయి

బివివి ప్రసాద్

రచయిత బివివి ప్రసాద్ గురించి: హైకూకవిగా, తాత్విక కవిగా సుపరిచితులు. మూడు హైకూ సంపుటాలు: దృశ్యాదృశ్యం, హైకూ, పూలు రాలాయి; నాలుగు వచన కవితా సంపుటాలు: ఆరాధన, నేనే ఈ క్షణం, ఆకాశం, నీలో కొన్నిసార్లు ప్రచురిత రచనలు. హైకూ సాహిత్యానికి గాను మచిలీపట్నం సాహితీసమితి అవార్డు, ఆకాశం సంపుటికి ఇస్మాయిల్ అవార్డుతో సహా మూడు అవార్డులూ వచ్చాయి. సంపుటాలన్నీ బ్లాగులో ఈ-పుస్తకాల రూపంలో చదవవచ్చును. ...