కా. రా. కథనశిల్పం

ఈనాటి అభ్యుదయ రచయితలు–యీనాడు రచయితలందరూ అభ్యుదయరచయితలే, కాదని చెప్పుకునే ధైర్యం చాలామందికి లేదు–మనుషులను ఉన్నవారు, లేనివారు అని రెండు వర్గాలుగ విభజించారు. ఉన్నవారు ఒక్క మంచిగుణమూ లేనివారుగా, లేనివారు సద్గుణలమూటగా చిత్రించడం యీనాటి పరిపాటి. మంచివాడై ఉండవలెనంటే వాడు పేదవాడే అయివుండవలెననే నమ్మకం యీనాటి రచనలకు మూలమనిపిస్తుంది. పేదలు మంచివారైనపుడు నిరుపేదలు మరీ మంచివారై ఉండకతప్పదు కదా! కా.రా. కథలపద్ధతి వేరు. కా.రా. పేదలకంటే నిరుపేదల గురించి కథలు రాస్తాడు. అయితే మనుషులను మంచివారిగా గాని చెడ్డవారిగా గాని చూపడం అతడి కథాప్రయోజనం కాదు. మనిషి మంచివాడుగా గాని చెడ్డవాడుగా గాని ఎలా మలచబడుతున్నాడు మారుతున్నాడు అన్నది అతని కథావస్తువు. అతని కథల్లోకి మంచికి చెడుకి వ్యక్తులు కాక సమాజవ్యవస్థ బాధ్యత వహిస్తుంది. ఇతని కథల్లో ఏ పాత్రనూ దుష్టపాత్రగా చెప్పడం కష్టం. సమాజదౌష్ట్యానిదే ప్రాధాన్యం.

ఒక దృష్టితో చూచినపుడు మొత్తం సాహిత్యంలో రెండు విధానాలు కనిపిస్తాయి. ఒక విధానం మంచికీ చెడుకీ జరిగే సంఘర్షణను చిత్రించడం. రెండవది మంచికీ మంచికీ జరిగే సంఘర్షణను చిత్రించడం. మొదటిది జీవితంలో దొరకదు. (అంటే, కల్తీలేని మంచీ చెడూ జీవితంలో దొరకవు. సాహిత్యంలో పుష్కలంగా దొరుకుతాయి.) రెండవది జీవితం. కాని దాన్ని జీవితంలో గుర్తించడం కష్టం. చూపించడం చాలా కష్టం. అందుకే సాహిత్యంలో ఎప్పుడోకాని కనిపించదు. అన్యాయం అధర్మం క్రౌర్యం స్పష్టంగా కనిపిస్తుంటే వాటితో పోరాడడం సులభమే కావచ్చు. అసలు కష్టం వాటిని గుర్తుపట్టడమే. న్యాయం అన్యాయంగా, ధర్మం అధర్మంగా, కరుణ కరడుగట్టిన క్రౌర్యంగా మారే సరిహద్దులవరకు వెడతాడు కా.రా. అక్కడ చిక్కించుకుంటాడు వాటిని. ‘యజ్ఞం’లో అప్పల్రాముడిది అప్పేనని లెక్కలు ఒప్పుకుంటుంటే అప్పుకాదనే వాడి వాదన అన్యాయంగా కనిపించే న్యాయం. అప్పల్రాముడు ఉన్న కొంచెం మడిచెక్కనీ అమ్మి తన వంశాన్ని తరతరాలకు బానిసవంశంగా చేసైనా అప్పుతీర్చవలసిందే అనే శ్రీరాములునాయుడి వాదం ధర్మపక్షపాతంగా కనిపించే అధర్మం. అప్పల్రాముడు ఆ అప్పు తీర్చకపోతే, ఆ అప్పు తనే తీరుస్తానని శ్రీరాములునాయుడు అనడం, కరుణ కప్పువేసిన క్రౌర్యం. సీతారాముడు తన కొడుకు బానిసగా పెరిగి బతకడం చూడలేనని వాణ్ణి నరకడం రాక్షసత్వంగా కనిపించే పుత్రవాత్సల్యం.

సమాజదౌష్ట్యంపై వెలుగును గుప్పించి దాన్ని స్పష్టంగా చూపడంకోసం కా.రా. తన పాత్రలను అన్నివర్గాలవారిని ఆదర్శమూర్తులుగా తప్పుపట్టలేనివారిగా చిత్రిస్తాడు. ‘యజ్ఞం’లో మనం ఎవరినీ వ్యక్తులుగా తప్పుపట్టలేం. అందరూ ఆదర్శవ్యక్తులే. మంచితనం మారుపేరైనవారే. గోపన్నకు అప్పల్రాముడు వడ్డీతోసహా రెండువేల అయిదువందలు అప్పు యివ్వతేలాడు. ఇద్దరూ పరమసాత్వికులు. కలిసి వ్యాపారం చేశారు కొన్నాళ్ళు. గోపన్న పూర్తిగా చితికిపోయాడు. అతడి కొడుకులే అతన్ని దగా చేశారు. అతడిపై పాఠకుల సానుభూతిని ఏమాత్రము తగ్గించే ప్రయత్నం చేయడు కథకుడు. అప్పల్రాముడు ఆ ఊరి పంచాయతి హరిజన మెంబరు. మాలలకే కాక ఆ ఊరిలోని ముప్పాతికమందికి అతడంటే సదభిప్రాయం. మాటకు నిలబడేవాడూ మర్యాదగా బతకాలనుకునేవాడూ మాలల్లో అతడొకడే అని అందరూ చెబుతారు. వీరిద్దరిమధ్య తీర్పు చెప్పవచ్చిన శ్రీరాములునాయుడు ఆ ఊరి ప్రెసిడెంట్. ఊరందరికీ ‘దరమరాజు’. ఈ ముగ్గురిలో ఏ ఒక్కరినీ వ్యక్తులుగా మనం వేలెత్తి చూపలేము. అంతకన్నా మనుషుల్లో మంచితనం మనం ఊహించలేం.

భయం కథలో సత్తెయ్య పాత్ర మరొక ఆదర్శపాత్ర. సత్తెయ్యకు పాములను పట్టిచంపడం ఒక దీక్ష. అయితే మహాభారత కథలోవలె తండ్రి మరణానికి ప్రతీకారంగా కొడుకు చేసిన సర్పయాగం కాదు. అది సమాజశ్రేయస్సు కొరకు చేసింది. సత్తెయ్యలోని సహానుభూతి పాఠకులను ఆర్ద్రం చేస్తుంది. ‘చావు’ లోని అప్పారావు పాత్ర యిటువంటిదే. అయితే మంచితనం పెంచిన పాత్రలు ఒక్కోచోట అసహజమనిపిస్తాయి. ‘యజ్ఞం’లో సీతారాముడు తనను చంపవచ్చిన ఊరి పెద్దలతో చంపవద్దంటాడు. ఎందుకు? ప్రాణంమీది ప్రేమతో కాదు. ‘నాకు సావో నెక్క కాదు. కొడితే మీరు ఉరిలో పడతారు. మీ బిడ్డపాపల ఉసురు నాకేల తగలాల?’ అట్లాగే అప్పల్రాముడి అమాయకత్వమూ ఒక్కోచోట కథకుడు తొడిగిన ముసుగులా కనిపిస్తుంది.

“సూరెంబాబు యిరవైఏల యిరాలం యిచ్చినాడు- పున్నానికే యిచ్చినాడు. అందుకు మెచ్చి బగమంతుడు రైసుమిల్లెట్టించినాడు. ఇపుడు డబ్బొస్తన్నదంటే ఆ బాబేం సేయగలడు? అదే మాదిరి లచ్చుంనాయుడు బాబున్నూ పున్నానికే బూవిచ్చినాడు. అయిస్కూలెట్టినాక సుట్టూ బూవులు దరలు పెరిగిపోనాయి. ఇళ్ళజాగాలకమ్మితే నస్టం పూడి లాబవొచ్చినాది. ఆ జాగాలు కొనుక్కున్నోడికి బలవంతానగాని అంటగట్టినాడా?”

అలాగని కూకలేసినాను. దానికోగుంటపాపడన్నాడుకదా-

“ఓరి తాతోయ్ మనవూ యిచ్చినాం శమదానం. మన పున్నేనికి బవుమతేది?” అన్నాడు.

“నీక్కూల్లు దొరకనేదా, అన్నాను.”

‘నీక్కూల్లు దొరకనేదా’ అన్న మాటలో వ్యంగ్యం తోచకుండా ఉండడం కష్టం. ఆ వ్యంగ్యం పాత్రది కాదు. పాత్రకు కూడా వ్యంగ్యమని తోచని వాస్తవం. అప్పల్రాముడి మాటల్లో ఒక అంతస్సంఘర్షణ కనిపిస్తుంది. అతడు యిన్నాళ్ళూ మన్నించిన పాతకాలపు విలువలకు యీనాడు తను ఎదుర్కొంటున్న వాస్తవానికి మధ్య జరుగుతున్న సంఘర్షణ అది.

కా.రా. కథల్లోని శిల్పపరిణతిని పరిశీలించవలెనంటే అతని పెద్ద కథలను చూడవలసి ఉంటుంది. అతని చిన్నకథలు శిల్పదృష్టిలో కూడా చిన్నవే. ఈ చిన్నకథల్లో కా.రా. సాధారణంగా అలిగరీని (Allegory: అర్థాంతరం) ఆశ్రయిస్తాడు. యజ్ఞం కథలసంపుటిలో రెండు పెద్దకథల మధ్య యిరుక్కుపోయిన చిన్న కథ తీర్పు. అది వాస్తవకథనంగా మనల్ని ఆకట్టుకోదు. ఒక సమస్యను సూచించి ఆ సమస్యను పరిష్కరించడానికి కథకుడు ఊహించిన పాత్రలు ఆ కథలోవి. పాత్రలు వ్యక్తులుగా కాక సమస్యలుగా కనిపిస్తారు. వారి ప్రతి మాటా మరేదో అర్థం వైపు (అర్థాంతరం) మన దృష్టిని పక్కకు తిప్పుతుంది. ఇటువంటివే- జీవధార, వీరుడు-ప్రతివీరుడు వంటి కథలు.

అనేక భారతీయభాషల్లోకి అనువాదమై అతనికి అఖిలభారతఖ్యాతిని తెచ్చిన నో రూమ్ అనే కథ కా.రా. అతని ప్రాథమిక దశలో వ్రాసింది అయి ఉండవలె. ఆ కథ కా.రా.యే రాయనక్కరలేదు. ఓ. హెన్రీ కథకు పేలవమైన అనుకరణ అనిపిస్తుంది. కా.రా. కథనశిల్పం క్రమంగా పరిశీలించడానికి అయిదు పెద్ద కథలు చాలు: ఆర్తి, యజ్ఞం, భయం, చావు, కుట్ర. ఈ అయిదు కథల్లో కా.రా. అయిదు ప్రధానసమస్యలను ఆవిష్కరించడమే కాక అయిదు విధాలుగా కథ చెప్పాడు. ‘ఆర్తి’ నిరుపేదల నికృష్టజీవితాలను డాక్యుమెంటరీ లాగా చూపిస్తుంది. ఆ పేదల్లో సద్గుణాలు ఉండడానికి ఎట్లా వీలులేదో కూడా చూపుతుంది. పేదరికం యిట్లా ఉంటుందని చూపడం మాత్రమే ‘ఆర్తి’ చేయగలిగింది.

‘యజ్ఞం’లో సమస్యను ఆవిష్కరించడమే ప్రధానం. అందుకు కా.రా. అలిగరీని ఆశ్రయించాడు. అయితే వాస్తవికతకు ఎక్కడా దెబ్బతగలకుండా, పాత్రలు సంఘటనలు వాస్తవంగా కనిపిస్తూనే ఒక సమస్యావిష్కారానికి సూక్ష్మీకరణాలుగా నిలుస్తాయి. ఈ కథలో ఆలోచనకు అనుభవానికి మధ్యనున్న అగాధాన్ని స్పష్టం చేస్తాడు కా.రా. కంబారిగా జీవితాంతం బతకడమంటే క్షణక్షణమరణమన్న ఆలోచన అందరెరిగినదే. కాని ఆ ఆలోచనను అనుభవించడం సామాన్యంగా జరగదు. ఆలోచన వేరు, అనుభవం వేరు. కనుకనే సీతారాముడు తన పసికూనను నరికి చూపవలసివచ్చింది. ఈ అనుభవమే ప్రధానం ‘భయం’లో. భయం కథ అలిగరీ నుండి సింబలిజమ్ వైపుకు సాగింది. పాములెన్ని రకాలో భయాలన్ని రకాలు. పాములన్నిటిని ఏరిపారెయ్యడమే, లోకంలో పాపభయం లేకుండా చేయడమే సత్తెయ్య దీక్ష. పాములను పాపమనస్తత్వాన్ని అర్థం చేసుకోడంలో సత్తెయ్యకు గురవడికి ఎదురైన అనుభవాలు వారి జీవితాలలో మార్పు తెస్తాయి. యుగాల ఆలోచన కన్నా క్షణకాలపు అనుభవం మనిషిని మారుస్తుంది.

‘చావు’లో కా.రా. అలిగరీని గాని ప్రతీకలను గాని ఆశ్రయించలేదు.ఈ రెంటి అవసరం లేకుండానే మనల్ని నేరుగా కథలో నిలబెడతాడు. కథ చదివినంతసేపూ ఎముకలు కొరికే చలిగాలి మధ్యలో నిలబడతాం మనం. చావు కథలో జీవితాన్ని అనుభవంగా అందిస్తాడు కా.రా. తల్లి శవం తగులబడుతుంటే ఆ మంటలకాంతుల్లో ఎరకయ్య ముఖం ఒక అపూర్వ ఆనందంతో వెలిగిపోతుంది. అది ఒక గొప్ప జీవచిత్రం.

‘కుట్ర’ యీ నాలుగు కథలలో చేరదు.అతని కథలలో అన్నిటికంటే వేగంగా సాగే కథ. కా.రా. సామాన్యంగా శైలితో ఆకట్టుకోడు. ఆ ప్రయత్నమూ చేయడు. కాని, ‘కుట్ర’లో అతని శైలి పాఠకుణ్ణి అతనికి తెలియకుండానే ముందుకు లాక్కెడుతుంది. కా.రా. రావిశాస్త్రి శైలిని అనుకరిస్తున్నాడనిపిస్తుంది. కా.రా.కథల్లోకెల్లా ‘కుట్ర’ లోనే కోట్స్ (quotes) ఎక్కువ. ‘కుట్ర’ను కథ అనడం కష్టమే. కరపత్రం అనడమూ అంతే కష్టం. ఇందులో కథ చెప్పడం కంటే, ఆ నాటి సాంఘిక ఆర్థిక పరిస్థితులు విశ్లేషించడం ప్రధానం. కా.రా. మొదటినుండి సమస్యను వివరించడమే లక్ష్యంగా పెట్టుకున్నాడు. తన కథలోని చిక్కులన్నీ తనే విప్పుతాడు. అస్పష్టత, అనిర్వాచ్యత అతని సాహిత్యగుణాలు కావు. స్పష్టమైన అభిప్రాయాలతో విస్పష్టమైన వివరణతో కథ చెప్పడం అతని పద్ధతి. కథనంలో బిగువుకోసం అవివక్షితంగా వదిలేసిన చిక్కులు కూడా కథ ముగిసేలోపల వివరించక మానడు. ఈ వివరణే అతని ప్రధానలక్ష్యం. ‘ఆర్తి’లో యియ్యపురాళ్ళ తగాదా, ‘యజ్ఞం’లో అప్పల్రాముడి అప్పు, ‘భయం’లో పాము కరిచిన గౌరేసు చనిపోకపోవడానికి కారణం- యివన్నీ సహేతుకంగా స్పష్టంగా వివరిస్తాడు. వీటి అతుకులు ఎక్స్-రే ఫోటోలోలాగా చూపిస్తాడు. ఈ విధమైన వివరణాత్మక కథనవిధానం కథలో ప్రధానమై కథను మింగేసింది. మన దేశంలోని ఆర్థికవ్యవస్థకు పట్టిన జబ్బును చూపే ఎక్స్-రే అది, పోర్ట్రేట్ ఫోటోగ్రఫీ కాదు.

ఒక ప్రత్యేకమైన సందేశం యివ్వాలని, ఒక ప్రబోధం చేయాలని పాఠకులలో కార్యోన్ముఖత కలిగించాలని కా.రా. కథలు రాస్తాడన్నది స్పష్టమే. ఈ సందేశం తన కథల్లో ఎట్లా చేస్తూవచ్చాడో చూస్తే అతని కథనంలో మరొక విధమైన క్రమపరిణామం తెలుస్తుంది. అతని కథల ముగింపులు సందేశాత్మకంగా హెచ్చరిస్తూ ఉంటాయి. ‘ఆర్తి’లో యీ సందేశం వాచ్యం చేయడు. మోచేతికూడు అనే ఎంచితే ఎంచడానికి లేనిదేవుందా గుడిసెలో? సన్ని కంచం తెచ్చి పక్కన పెట్టింది. పైడయ్య చెయ్యి కడిగేసుకున్నాడు. కథలో యీ మోచేయి ఎక్కువగా కనిపించదు. కాని కథ చివరి యీ మాటలు చదివింతర్వాత కథ మొత్తం కొత్తగా మన కళ్ళముందు తిరుగుతుంది. ఆ అదృశ్యహస్తం నీడ కథలో స్పష్టంగా కనిపిస్తుంది. ‘యజ్ఞం’లో చివరి మాటలు, “యీ ధర్మపన్నాలెంత కాలం? అంతా నీమాట వినేవరకూ. ఆ తర్వాత…” ఇవి కథకుని మాటలు. రచయితగా తాను చేస్తున్న హెచ్చరిక. కథకు ఏమాత్రము అవసరం లేని, కథలో ఏమాత్రము అతకని, కనుకనే కథను ఏ మాత్రమూ చెడగొట్టలేని మాటలు. ‘భయం’ చివరి మాటలు: ఆ పాపపు ఆలోచనలు, ఊహలు, అతను కోరి తెచ్చుకున్నవి కావు, యితరులు తన తల్లోకి ఎక్కించినవీ కావు. జీవితం మనిషిలో మార్పు తెస్తుంది. ఆ మార్పుకు అనుభవం కారణమవుతుంది. మెదడును ఉతకడం (brain washing, indoctrination) వల్ల కాదని, అనుభవం వల్ల జీవితంలో కొన్ని కంటిపొరలు తొలగి, మనిషి మరో మనిషి అవుతాడని కా.రా. అంటున్నాడు. కథలో తాను చూపింది యీ అనుభవమే కాని అనుభావం కాదని తాను వివరించుకున్న మాటలు కూడా. ‘చావు’లో కథకుని యీ ప్రబోధం కథను ఎక్కువగానే ఆక్రమించింది. సూరయ్య, కన్నయ్య, కరనం బామ్మరిది, అందరూ తమ భాషలోనే అయినా కథకుని గొంతుతో మాట్లాడుతున్నట్టు కనిపిస్తుంది: “ప్రళయం తప్ప యీ బూమ్మీది మురికిని కడగనేదు. పోతే అన్నీ పోతాయి. మనుషులవూ పోతాం.” ఇక ‘చావు’లో ప్రబోధం కథలో ఎంత పరచుకున్నా, కథ మొదటినుండి గుండెలో నిలిచిపోతుంది. కథలో చివరి మాటలు హెచ్చరికా కాదు సందేశమూ కాదు. అనుభూతి: “ముసిల్ది నిన్న పోయింది. నిన్నపోతే యివాల్టికి రెండు. కాని సంధికాలంలో తెలవేసి ఉన్నవాళ్ళకి అలా అనిపించదు. నిన్న నేడు అంతా ఒక్కలాగే అలికేసి ఉంటుంది.” కాటేసి జారుకునే చావు కాదు, బతుకునంతా ‘అలికేసి’నట్టున్న చావు.

‘కుట్ర’ మొత్తం ప్రబోధమే. అందులోనూ చివరిమాటలు హెచ్చరిస్తూనే ఉన్నాయి. అయితే అవహేళనస్వరంలో. “ప్రెస్సూ ప్లాట్‌ఫామ్ చేతిలో ఉంటే ఎన్ని బుకాయింపులైనా బుకాయించొచ్చు. కాని నిజం ఎప్పటికీ నిజమే. గాంధీగారి కోతులు కళ్ళూ చెవులూ నోరూ మూసీసుకోవాలని మూసీసుకోండని చెప్పి— యింకా యినప్పోతే బలవంతాన మూసీడానికి ప్రయత్నించొచ్చు. కాని—?”

కా.రా. ఒక్కొక కథలో ఒక్కొక్క ప్రాథమిక ప్రశ్నను ఆవిష్కరిస్తాడు. చివరకు తేలే ప్రశ్న ఒకటే అయినా ఆ ప్రశ్న విభిన్నరూపాలు వివిధకథల్లో కనిపిస్తాయి. ‘ఆర్తి’లో మాత్రం ప్రశ్నలున్నా ఏది ప్రధానమైన ప్రశ్న అనేది చెప్పడం కష్టం. ఈ కథలో ప్రశ్నను రూపించడం కంటే మాలల నికృష్టజీవితానికి అద్దంపట్టడమే ప్రధానం అనిపిస్తుంది. ఈ కథ మూడు పేటల గొలుసు. ఒకటి ఎర్రెమ్మ, బంగారిల యియ్యపురాళ్ళ తగాదా. పండక్కు కూతుర్ని పుట్టింటికి తీసుకెళుతానంటుంది ఎర్రెమ్మ. కోడల్ని పండక్కు పుట్టింటికి పంపను, పండగెళ్ళాక తీసుకెళ్ళమంటుంది బంగారి. ఇద్దరిదీ ఒకే ఊరు. ఒకతె కన్నతల్లి, యింకొకతె కడుపులో పెట్టుకోవలసిన అత్త. ఎవరిని తప్పు పట్టడం? ఇద్దరిదీ తప్పు కాదు. పండుగ ముందు నెల్లాళ్ళు ముమ్మరంగా వరికోతలు. పండగెళ్ళాక తొలకరిస్తేగాని బతుకుల్లేవు. అందుకే పండుగముందు తీసుకెళ్తానని తల్లి, పండగెళ్ళాక తీసుకెళ్ళమని అత్త. కోడలైనా కూతురైనా సన్ని అంటే ఒక మనిషి కూలి.

కథలో మరో పేట, సన్ని మొగుడు పైడయ్య పండక్కని ఊరికొచ్చాడు. పెళ్ళాన్ని కలుసుకునే వీలులేదు. పక్క ఊరెళితే రావయ్య కోడలి కన్ను పట్నంనుంచి దిగిన తనపై పడిందని పైడయ్య అనుమానం. ఆశ ఊగింది. కాని మనిషి అట్లాటిదిగాదని తెలిసింది. నిరాశగా ఊరిముఖం పట్టాడు. చాటుగా కలుసుకోమని పెళ్ళానికి కబురు పంపాడు. దొంగచాటుగా మొగుణ్ణి కలియడానికి సన్నికి అభిమానం అడ్డొచ్చింది. పైడయ్య దాహంతో దెయ్యాల గంగమ్మ పాకలో ప్రవేశించాడు. రెండేళ్ళక్రితం ఒకసారి యిలానే వచ్చాడు. అప్పటికి సన్ని కాపరానికి రాలేదు. ‘ఇంకోసారి అడగనంటే అలాగే కాని’మ్మంది. మళ్ళీ యిప్పుడొచ్చాడు. పైడయ్య అన్న నారాయుడు భార్య పోయినప్పటినుండి దాహానికి గంగమ్మ దగ్గరకొస్తాడు. ‘నానిప్పుడు నీకు ఒదిన్నవుతాను’ అని అతని అసహాయస్థితిని చూచి తల్లిలా జాలిపడి దగ్గరున్న సారాసీసా ముందు పెట్టింది. తాగి తన వమనంలోనే పడ్డాడు పైడయ్య.

కథలో మూడవపేట, యియ్యపురాళ్ళ తగవు తీర్పు. నాయుడు తీర్పు చెప్పాడు, అల్లుణ్ణి అత్తగారింటికి పంపమని. తీర్పుకు అనుపానంగా తనింట్లో మిగిలిపోయిన కూరా కూడూ పంపుతాడు నాయుడు. సన్ని ఆ రాత్రి పైడయ్యకు అన్నం పెడుతున్నది. “ఆ రాత్రి తొమ్మిదిగంటలకు యీడ్చి యీడ్చి తన్నిన పశువులా ఉన్నాడు పైడయ్య.” నాయుడి తీర్పుతో కలిగిన సంసారంలో అతనికి సారం తోచలేదు. తినకపోతే ఆకలి. తిందామంటే ఆ మోచేతికూడు దిగదు.

ఈ వ్యాసంలో ఎన్నుకున్న తక్కిన నాలుగు కథలూ గొప్పకథలని ఎవరూ చెప్పక్కరలేదు. వాటి మొహంమీద స్పష్టంగా రాసి ఉంది. అయితే ‘ఆర్తి’ మాత్రం అలా కనిపించదు. కనిపించే ప్రయత్నమూ చేయదు. అందుకు కారణం కా.రా. అందులో కథ చెప్పే ప్రయత్నం చేయడు. తక్కిన కథల్లోలాగా యిందులో ఒక ప్రధానసమస్య, దాన్ని ఉత్సుకతను రేకెత్తించే విధంగా ఆవిష్కరించడము, ఒక పతాకస్థాయికి నడిపించడము, ఒక భయంకరమైన తీర్మానమూ యివేవీ లేవు. ఒక ఉప్పెననో భూకంపాన్నో అగ్నిపర్వతం బద్దలవడాన్నో చూపడం లేదు. నేలలో గాలిలో తేమకూడా క్రమంగా ఆరిపోతున్న కరవుప్రాంతంలో ఆరిన పెదాలపై, ఎండిన కళ్ళపై మూవీకెమెరాను మూగగా తిప్పుతూ వెళతాడు కా.రా. దేహమంతా దహిస్తూ నిలిచే ఆ దాహం చెప్పలేనిది. చెప్పుకోలేనిది. ప్రాణం తీసేదీ కాదు, బ్రతుకనిచ్చేదీ కాదు. మరణమృదంగం మూగగా పడిఉన్న దృశ్యం అది.

‘యజ్ఞం’లో కథ చెప్పడం కంటే సమస్యను ఆవిష్కరించడం ప్రధానం. ఇందులో ప్రశ్న: కల్ని ఏవడు సెప్పిన దరమం? ఏటా దరమం? చితికిపోయిన గోపన్న అప్పల్రాముడు తన బాకీ తీర్చాలనడం అధర్మమా? లెక్కలన్నీ సరిచూసి అన్యాయపు వడ్డీని కాదని, ప్రభుత్వపు వడ్డీరేటుకు అప్పు మొత్తం నిర్ణయించి, అప్పు తీర్చడానికి మూడేళ్ళ గడువిచ్చిన పెద్దమనిషి శ్రీరాములునాయుడిది అధర్మమా? లెక్కలను ఒప్పుకుంటూనే అప్పు తీర్చవలసిన అవసరం లేదనే తీర్పును ఆశించిన అప్పల్రాముడిది అధర్మమా? ఎవరిదీ కాదు. అధర్మం ఆర్థికవ్యవస్థలో ఉంది. అప్పల్రాముణ్ణి గోపన్న, గోపన్నను పట్నంలో షావుకారు, వాణ్ణి పై షావుకారు, యిట్లా చిన్నచేపను పెద్దచేప దిగమింగే ఆర్థికవ్యవస్థలో ఉంది అన్యాయం. ఇటువంటి వ్యవస్థలో సాధించిన అభివృద్ది అంతా ఉన్నవాళ్ళకే అభివృద్ధి. లేనివాళ్ళు యింకా లోనికి వెళ్ళే గొయ్యి. ఊళ్ళకు విద్యుత్తు వచ్చింది. ‘దేశమంతటా చిక్కంలా పరచుకొంటున్న తీగెలు’ అంటాడు. కా.రా. దేశం పచ్చగానే ఉంది. పేదల నోటికి ‘చిక్కం’ మాత్రం విడదు. ప్రగతికై సాగే యజ్ఞంలో బలిపశువులే పేదలు. యజ్ఞఫలం యజమానులదే.

ఈ కథలో సాగిన ధర్మతత్త్వ విచారం రాజ్యధర్మంకంటే సమాజధర్మం ఎంత కఠోరమైనదో చూపుతుంది. గుడికెదురుగా, తలుపులన్నీ తెరిస్తే దేవుడు కనిపించేటట్టుగా న్యాయమండపం కట్టుకున్నారు ఊరివారు. ఏనాడైతే యీ మండపంలో న్యాయం దొరక్క, దానికోసం యీ ఊరివాడు పైవూరు పోతాడో, ఆనాడు దాన్ని కట్టిన మన యీచేతులతోనే దాన్ని కూల్చివేతాం, అని నిర్ణయించుకున్నారు ఊరివారు ఊరి పెద్దలు. న్యాయం కొరకు కోర్టులకెళ్ళడాన్ని కూడా సహించరన్నమాట ఊరివారు. కోర్టుకెళితే పేదవాడికి పొరపాటున న్యాయం జరిగే అవకాశమున్నది. మీరు కోర్టుకు వెళ్ళి వాదించి గెలవ్వచ్చు. అంతమాత్రాన మీరు ఆ రుణాన్నుండి తప్పించుకోగలరనుకోడం కల్ల. ఈ జన్మలో కాకపోతే యింకో జన్మలోనైనా మీరు దాన్ని తీర్చడం తప్పదు, అంటాడు శ్రీరాములునాయుడు.

ఈ కథలో కా.రా. సమాజంలోని తక్కిన అంగాలను రాజ్యం ఎట్లా తెలివిగా వాడుకుంటుందో చూపుతాడు. మతము, పంచాయతీ పరిపాలన మొదలైనవి రాజ్యం చేతికి అందకుండా స్వేచ్ఛగా వ్యవహరించగలవు అనే అభాసను తొలగిస్తాడు కా.రా. ఈ కథలో. మునసబు కరణము రాజ్యంయొక్క ప్రతినిధులు. శ్రీరాములునాయుడు పంచాయతీపాలనకు ప్రతినిధి. గ్రామంలోని గుడి, ఆ గుడికెదురుగా నిలబెట్టబడ్డ న్యాయమండపం మమతా మానవతాలేని రాజ్యానికి చట్టానికంటె మనిషికి దగ్గరి వ్యవస్థలుగా కనిపిస్తాయి. కాని రాజ్యము, చట్టము తమకుగా తాము చేసుకోలేని పనులను పంచాయతీపాలన ద్వారా, మత ప్రవచనాల ద్వారా చేయించుకుంటాయి. అంటే ‘చట్టం’ పనిచేయలేనపుడు ‘ధర్మం’ సహాయం కావాలి దానికి. ఈ ధర్మం ఆ చట్టానికి దాని పని చేసిపెడుతూ తానేదో వెలగబెట్టినట్టు సంబరపడిపోతుంది. తను వాడుకోబడుతున్నట్టు ఆ ‘ఎర్రిపీరు’కు తెలీదు. మునసబు, కరణము, కోర్టులు అప్పలరాముడిది అప్పేననలేనపుడు వారికి శ్రీరాములునాయుడి న్యాయస్థానపు అవసరం కలిగింది. అదే అంటాడు సీతారాముడు నాయుడితో: “ఈ రాజ్యాన్నీ నిన్నూ ఏలే దొరలెవరో యెరుగుదువా—అదిగో ఆ బాబులిద్దరు. అదిగో ఆ కరణమయ్య. అదిగో ఆ మునసబయ్య. ఆళ్ళకు ఆళ్ళు సేసుకోలేని మంచిని నువ్ సేసినంతకాలమే నీ రాజ్యం—ఆ తరవాత ఆళెవరో, నువ్వెవరో.”

‘భయం’లో పాములు, మనిషిలో అర్థంలేని భయాలు కల్పించే వివిధశక్తులకు ప్రతీక. పేదల బ్రతుకులు గుప్పిట్లో ఉంచుకుని ఆడించే ధనికులు, పేదల అజ్ఞానాన్ని డబ్బుగా అధికారంగా మార్చుకునే మతాచార్యులు, ప్రజల మూఢవిశ్వాసాలను వాడుకుని వాళ్ళప్రాణాలు ఆస్తులు కాజేసే నాటు వైద్యులు వీళ్ళందరు ప్రజలపాలిటి పాములు. ఇలాంటి పాముల్ని చంపడానికి ఏ విధంగా చంపడానికి ఎటువంటి మీమాంస పనిలేదు. వాటిని దయతలచేవాళ్ళూ ఉంటారు. ‘అయ్యో పాపం ఎరమింగిన పాఁవర్రా! అలాంటి పాఁవుని చంపకూడదు!’ అన్నారు భూతదయాపరులు. పాఁవులంటే సత్తెయ్యకు ద్వేషం లేదు. అసలు పాములే లేవు. లేనిదానిని ద్వేషించడమెట్లా. ‘పూర్తిగా తెలివొచ్చి చూస్తే ఏ పామూ కనిపించదు. ఏ మాయా అగుపించదు.’

‘భయం’లో మూడు పేటలున్నాయి. గౌరేసు పారెమ్మల చావు; సత్తెయ్య సర్పయాగం; గురవడికి జీవితం తెలియడం. మొదటిది మూఢనమ్మకాలలోని ప్రమాదాన్ని చూపడానికి. కాని తరువాతి కథతో దీని అతుకు సరిగా చేయలేదనిపిస్తుంది. సత్తెయ్య సర్పయాగం అతని తల్లిదండ్రుల చావుకు ఒక పాము కారణమవడం చేత అని చెప్పడానికైతే గౌరేసు పారెమ్మల కథ అవసరం కాకున్నా కొంతవరకైనా సార్థకమయేది. కాని కా.రా. అటువంటి ప్రయోజనాన్ని ఉద్దేశించలేదు. సత్తెయ్య సర్పయాగం ప్రతీకారవాంఛాదుష్టం కాదు, లోకకళ్యాణకారకం. అయినప్పుడు గౌరేసు, పారెమ్మల కథ ఎందుకు? పాము కరచిన గౌరేసు చావలేదు. కరవని పారెమ్మ చచ్చింది. పాము కంటే పాముభయం ప్రాణాంతకమని చెప్పదలచాడా? కాదు పారెమ్మ చనిపోయింది భర్తను పాము కరచిందన్న షాకువల్ల కాదు. ఆ షాకువల్ల జరిగిన గర్భస్రావంలో ‘నాటుమంత్రసాని మోటు సుళువులు వికటించి’ చనిపోయింది. అట్లాగే పాఁవుల రావులయ్య నాటుమందులు — పాముకాటు కాదు— గౌరేసు ప్రాణము, ఆస్తి కాజేశాయి. కనుక గౌరేసు పారెమ్మల చావుకథ నాటుమందుల యొక్క ప్రమాదాన్ని చెప్పడానికి, దాని వలన సత్తెయ్యలో కలిగిన హేతువాదదృష్టిని ప్రతిపాదించడానికి అనుకోవలె. కాని తరువాతికథలో యీ హేతువాదం కథావస్తువుగా మళ్ళీ కనిపించదు. తరువాత కనిపించే మానవతావాదానికి యిది ఎట్లా పునాది అవుతుందో కూడా స్పష్టం కాదు. తన భయం ఎలా తొలగిందో ఏ చైతన్యం అందుకు కారణమో గ్రహించగలిగే ఊహ సత్తెయ్యకు లేదు.

తరువాతి కథలో వస్తువు భయాన్ని జయించడమెట్లా? “జనఁవేటనుకుంటారంటే అప్పుడెప్పుడో మాయయ్యని పాఁవు కరిసిందని -ఆ కసికొద్దీ పావుల్ని సంపుతాననుకుంటారు. పాఁవంటే నాకు పగ కాదు… పాఁవు మనిసిని కుడతాది. మనిసికి సావంటే బయం. పాఁవుని సూస్తే సావును సూసినంత బయం. సావుకు బయపణ్ణోడు ఒక్కడే పాఁవుకి బయపడ్డు. సిన్నప్పుడు కండసీవఁని సూసి బయపడినావు. పెద్దైనాక పాఁవు… సీవైనా పాఁవైనా సావైనా నాకొక్కటే. అదెప్పుడో కాటేస్తదో యెయ్యదో, దాని బయ్యం మనిసిని తినేస్తుంటది పురుగునాగ! ఎదురు తిరిగితే ఏటీ నేదు.”

చావుకు భయపడకపోవడం తనకి చావులేదని తెలుసుకున్నప్పుడే సాధ్యం. ద్వితీయాద్వై భయం భవతి అన్న ఉపనిషద్వాక్యాన్ని గుర్తుకుతెస్తాయి సత్తెయ్య మాటలు. లోకమంతా తననే చూచుకుంటున్న సత్తెయ్యకు చావు లేదు, భయమూ లేదు. ఈ ఆత్మీయత ఎంత భయంకరమైనదో రత్నాలు అడిగిన ప్రశ్నకు సత్తెయ్య చెప్పిన సమాధానంలో తెలుస్తుంది. ఆమె అడిగిన ప్రశ్న, “నువ్ — మీరంతా నాకైనట్టు ఈ లోకవంతా నీకౌద్దా?” అతడి జవాబు “అవుద్ది”. అంత తడువుఁకోకుండా వచ్చిన జవాబుకు రత్తాలువద్ద ఎదురుమాట లేదు. “అయితే సరే!” అంటూ తల తిప్పేసింది. ఆమెకు కళ్ళంబడి నీళ్ళెందుకు వచ్చేయో వాటిని ఆపడమెలాగో అతనికి కాని ఆమెక్కాని తెలీలేదు. ‘నీవే నాలోకం. లోకం ఏమైతే నాకేం’ అని సత్తెయ్య అనలేకపోవడం రత్నాలు కన్నీళ్ళకు కారణం. భర్త పరస్త్రీలోలుడైనా భార్య సహించగలదు కాని జ్ఞానియై ఆత్మవత్ సర్వభూతాని అనడం ఏ భార్యా భరించలేదు. మానవతావాదాన్ని దాని అంచులవరకు వూహించాడు కా.రా. అది అక్కడ అద్వైతపు అంచులను తాకుతుంది.

‘చావు’ కథ మనసును తాకదు. మనసుద్వారా తాకదు. సూటిగా హృదయాన్ని తాకుతుంది. దీన్ని కథలా చదవలేం. జీవితంలా అనుభవిస్తాం. అంటే యీ కథలో వాస్తవికము ప్రతీక విడిగా తెలియలేనంతగా కలిసిపోయాయి. కథాశిల్పం చేరుకోవాలని కోరుకున్న శిఖరం యిది. ఈ కథలో యితివృత్తం యించుమించు లేనట్టే. మాలవాడలో ఒక ముసలిది కన్నుమూసింది, బతికినంతకాలం చలితో తీసుకున్నది ముసలిది. దాన్ని కాల్చడానికి కావడి కట్టెలు ఎక్కువ. అరవై పేజీలు మించిన యీ కథ ఆ కాసిన్ని కట్టెలకోసం ఆ మాలలు పడే పాట్లు. అంత చలిలో ఆ రాత్రివేళ ఊరిలో ఏ పెద్దమనిషి నిద్రాభంగం సహిస్తాడు? సహించవచ్చు సహించకపోవచ్చు. అసలు లేపడానికి ఎవరు సాహసించగలరు? కొనడానికి ఊళ్ళో ఎవరూ అమ్మరు. ఊరికే యివ్వరు. శవాన్ని పాతెయ్యొచ్చు. కాని దయ్యమవుతుందన్న భయం. మాలపెద్దలంతా పాతెయ్యడమే దారి అని అనుకుంటుంటే కుర్రకారు కొందరు ఎక్కణ్ణుంచో ఆరు కట్టెలమోపులు తెచ్చి పడేశారు. పాతెయ్యడమే దారి అనుకంటున్న పెద్దలంతా అదిరిపడ్డారు. కుర్రవాళ్ళ యీ అఘాయిత్యం తెల్లారితే ఎట్లా సమర్థించడం, కాల్చడమా కాదా అన్న మీమాంసలో ఉంటే ఒక కుర్రగొంతు అన్నది: “శవాన్ని అందల ఏసి కాలుస్తారో నేప్పోతే ఆల్లనే కాల్సీమన్నారో అడగండి.” కుర్రవాళ్ళ పట్టుదల వల్ల శవం కట్టెలపైకెక్కింది. చచ్చినదాని కొడుకు ఎరకయ్యకు ఎంతగానో బాధగా ఉండింది, తల్లిని పాతెయ్యవలసి వస్తుందేమోనని. “ఒక్కోసారి మా యమ్మ అనీది. అయ్యా నానెప్పుడైనా యీ సలికే సచ్చిపోతాన్రా. ఈ సలిసంకటంతోనే సచ్చిపోతాను. సీతాకాలం కర్రలెక్కడా దొరకవు. కర్రల్దొరకవని కప్పెట్టీకిమి—ఎక్కడేనా కసింత అడుక్కునో సివరికి దొంగతనవేసేనా సరే నన్ను కాల్సీయాల. బండెడు కర్రల్తెచ్చీ కాల్సీ, నా యిన్నాళ్ళ సలీ కాష్టమ్మీనైనా కాలిపోవాల”, అనీది మా యమ్మ… తరువాత ఏటన్నా కానీ యిప్పిడీ కర్రలు తెచ్చినారా—ముందీ శవాన్ని కాల్చడమైపోనాది. నేప్పోతే నాను బతికున్నంతకాలం కుల్లుతూనే ఉందును. బైటకి అన్లేను. అయినా కుల్లుతాను.”

బతికున్నంతకాలం కుల్లుతూనే బతకవలసిన బతుకులు ‘చావు’ కథావస్తువు. ‘చావు’ ముసలిదాని చావు కాదు. బతికున్నవారి చావు. ‘నా ఏడుపల్ల బతికున్న శవాలగురించే’ అంటాడు అప్పారావు. ఈ కథలోని చలి, చలిలోని శవజాగరణ, ఆ నికృష్టుల చావని చావు వంటిదే. “జీవుడికి ఎండా కాన్దే, ఓనా కాన్దే…అయితే ఆటి దెబ్బ ఎదురుగా కనబడతాది. మంచూ సలీ అలాక్కాదు. సల్లసల్లగా జీవుడిని తినేస్తాయి” అనే రాజయ్య మాటలు, “ఒక్కసారి సావడమంటే మనకి బెదురు. కసింత కసింత సావడం మనకి శఁవానగుంటది”, అన్న అప్పారావు మాటలు, యీ చలివంటి చావును చెప్పేవే. మనిషి బతికున్నపుడు వాళ్ళ మనిషి వీళ్ళ మనిషి. చనిపోయిన తరువాత ఆ శవం అందరిదీ. దాన్ని సాగనంపే బాధ్యత సంఘానిది. మనిషి ప్రాణంపోయినా చలించని సంఘం, చావు కథలోని సంఘం. చలించనిది అంటే ప్రాణం లేనిది. ‘చావు’ సంఘానిది.

కొన్ని కథలు కమ్మగా కప్పురపు విడెం లాగా బుగ్గన గుబాళిస్తుంటాయి. కా.రా. కథలు గుండెలో ముల్లులా ఉండిపోతాయి.

కా.రా. సూచించే పరిష్కారాన్ని పాఠకుడు ఒప్పుకున్నా లేకున్నా అతని సమస్యావిష్కారాన్ని ఒప్పుకోక తప్పదు. మార్క్సిజమైనా మరో తత్త్వమైనా రచయితకు గుడ్డిగా నమ్మవలసిన సిద్ధాంతం కారాదు. ఆ తత్త్వం జీవితసత్యాన్ని దర్శింపజేయగలిగేదిగా ఉండాలి. ఆ దర్శనమే రచనలో ప్రతిబింబించాలి. కా.రా. కేవలం తాత్త్వికుడు కాడు. అతడు ఋషి. అందుకే అతని కథలు కావ్యాలు కాగలిగినాయి.

కా.రా. తన కథల్లో ఆదర్శసమాజాన్ని కలగంటాడు. లోకమంతా తనను, తనలో లోకమంతటిని చూడగలిగినవాడే అటువంటి సమాజంలోని వ్యక్తులు. విడిగా వికసించరు, సమాజసుమంగా వికసిస్తారు. ఆర్చిబాల్డ్ మెక్‌లీష్‌కు పద్యమెట్లానో కా.రా.కు సమాజమట్లా. A poem should be wordless, అంటాడు మెక్‌లీష్‌. పద్యంలో పదాలు కనిపించవు. పద్యమే కనిపిస్తుంది. నేను అన్నది పూర్తిగా రూపరి, రేకులు రేకులుగా ఆకర్షించని ప్రపంచాబ్జం కా.రా. కల. అది ఎన్నటికీ కలగానే ఉండవచ్చు. కానీ ప్రతివాడూ కనవలసిన కల. సమాజాన్ని ముందుకు నడిపించే కల.


[రచయిత మాట: ఇది ఆగస్టు 1978, భారతిలో ప్రచురించిన వ్యాసం. అది రాసిన తరువాత మూడు సంవత్సరాలు ప్రచురణ కాలేదు. 1975కు ముందు నేను కా.రా. పేరు విని ఉండలేదు. పేరు వినడం, విన్న వెంటనే చదవడం, చదివిన వెంటనే ఆయన కథలపైన యీ వ్యాసం రాయడం, రాసిన వెంటనే ఒక పత్రికకు పంపడం, అక్కడ వెంటనే సంపాదకుల చెత్తబుట్టలోకి వెళ్ళిపోవడం చకచకా జరిగిపోయాయి. వ్యాసం తిప్పి పంపలేదు పత్రిక. (‘స్టాంపులు జతచేయనిచో మీ రచనలు తిప్పి పంపబడవు.’ కొన్ని పత్రికలు యింకొంత ముందడుగు వేశాయి. ‘మీ రచనలు తిప్పి పంపబడవు. మీ వద్ద ఒక కాపీ ఉంచుకొనండి.’) అంటే యీ వ్యాసం సుమారు 45 సంవత్సరాలవెనక రాసినది. కనుక యిందులో నేను చేసిన విమర్శతో యిప్పుడు నేను పూర్తిగా ఏకీభవిస్తానని చెప్పలేను. ఏకీభవించలేనివి కొన్ని అభిప్రాయాలు:

– ‘అతని చిన్నకథలు శిల్పదృష్టిలో కూడా చిన్నవే.’

– ‘నో రూమ్’ కథ కా.రా. అతని ప్రాథమిక దశలో వ్రాసింది అయి ఉండవలె. (కాదు. చాలా లోతైనదృష్టితో రాసింది.)

– ‘ఆర్తి’ నిరుపేదల నికృష్టజీవితాలను డాక్యుమెంటరీ లాగా చూపిస్తుంది. (ఇప్పటి నా దృష్టిలో ఆర్తి డాక్యుమెంటరీ కాదు. అది చాలా గొప్ప కథ, అతని అగ్రశ్రేణి కథలలో ఒకటి.)

కాని వీటిని సరిదిద్ది వివరించడం యిప్పుడు చేయలేను.]