కాపరుల జీవిత దర్పణం: కొండపొలం

సుమారు ఇరవై ఐదేళ్ళుగా రాయలసీమ నుంచి ఆ ప్రాంత అస్తిత్వాన్ని ధ్రువపరిచే నవలలు వస్తున్నాయి. వాటికి సాహిత్యపరంగా ఎంతో గుర్తింపు లభిస్తున్నది. సీమ చారిత్రక వారసత్వం, సాంస్కృతిక విలువలు, సంప్రదాయాలు, ప్రజల అలవాట్లు, వేషభాషలు, నమ్మకాలు, వైఖరులు, దృక్పథాలు ప్రతిబింబించేలా సాహిత్యం ఉండాలన్న స్పృహ, చైతన్యం, ఆ ప్రాంతపు సాహిత్యకారులలో రావడం దీనికి కారణం. తన శప్తభూమి నవల కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డుకు డిసెంబరు 2019లో ఎంపికైన సందర్భంగా డిసెంబర్ 23న ఆంధ్రజ్యోతికిచ్చిన ఇంటర్యూలో రచయిత బండి నారాయణస్వామి అంటారు: తెలంగాణా ఉద్యమ క్రమంలో తెలంగాణ ప్రాంతం చారిత్రకంగా, సాంస్కృతికంగా దాదాపు పునరుజ్జీవం పొందింది. కానీ తెలంగాణ విడిపోయిన క్రమంలో రాయలసీమ అస్తిత్వం ప్రశ్నార్థకమైంది. రాయలసీమ ప్రాంత మూలాలను సామాజికంగా, రాజకీయంగా, చారిత్రకంగా, సాంస్కృతికంగా పరిచయం చేయాలనే ఉద్దేశమే ఈ శప్తభూమి నవలను రాయించింది.

ఆయన మాటలు పై పరిశీలనను సమర్థిస్తున్నాయి.

1990 నుంచి రాయలసీమ నవల తన కథనభాషకు మాండలికాన్ని చేర్చింది. సీమ జీవన విధానాన్ని సరైన అవగాహనతో, వాస్తవానికి దగ్గరగా ఆ ప్రాంతపు మాండలికంలో రాసిన నవలాకారులలో పేర్కొనదగినవారు కేశవరెడ్డి, పోలాప్రగడ సత్యనారాయణమూర్తి, స్వామి పేరుతో రాస్తున్న బండి నారాయణస్వామి, జొన్నవిత్తుల శ్రీరామచంద్రమూర్తి, చిలుకూరి దేవపుత్ర, శాంతినారాయణ మొదలైనవారు.

ఆ ప్రాంతపు జీవనరీతిని వెలుగులోకి తెస్తూ నవలలు రాస్తున్న మరొక నవలాకారుడు సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి. 1998లో వచ్చిన ఆయన నవల కాడి రాయలసీమ రైతు జీవితంలో రెండు దశాబ్దాల కాలంలో (1980-1998) వచ్చిన మార్పుల్ని సమగ్రంగా చిత్రించిన నవల. రైతులకు (రెడ్లకు), దళితులకు మధ్య ఆర్థిక, సామాజిక సంఘర్షణను కూడా సమర్థవంతంగా చిత్రించిన ఈ నవలకు ఆటా బహుమతి లభించింది. 2017లో వచ్చిన ఆయన నవల ఒంటరి ప్రకృతిని అర్థంచేసుకున్న వాడెవడూ దాన్ని విధ్వంసం చెయ్యడన్న సందేశాన్నిచ్చింది. మనిషికి తన చుట్టూ ఉన్న పర్యావరణాన్ని కొంతైనా అధ్యయనం చేయించే ఒక చిన్న ప్రయత్నమే ఈ ఒంటరి నవల అంటారాయన. ఇది తానా బహుమతి పొందిన నవల.

2019లో వచ్చిన ఆయన నవల కొండపొలం మరోసారి తానా బహుమతి గెలుచుకుంది. గొల్లలు, కాపులు సగం సగంగా ఉన్న ఊరు ఆయనది. అది కడపజిల్లాలో ఉన్న బాలరాజుపల్లె. చిన్నతనం నుండి గొల్లలతో కలసిమెలసి బతుకుపయనం సాగిస్తున్నప్పటికీ వాళ్ళ జీవితాల్ని అర్థంచేసికొని, వాటిని సాహిత్యంలోకి తీసుకురావాలనే తలంపుతో వ్యవసాయ వృత్తిని జీర్ణించుకొన్నంతగా గొర్లకాపరితనాన్ని జీర్ణించుకుని ఈ నవల రాశారు. తన కులానికి, వృత్తికి సంబంధించిన పొరలన్నీ వదల్చుకుని అవతలిగట్టుకు నడవగలిగిన స్థితికి వచ్చినప్పుడు మాత్రమే ఇది సాధ్యమవుతుందని ఆయన అంటారు.

ఈ నవలలో ముఖ్య పాత్రదారి రవీంద్రయాదవ్. యాదవుల ఇళ్ళల్లో మొదటి ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్. ఉద్యోగం సంపాదించుకోడానికి నాలుగేళ్ళుగా హైదరాబాద్ అమీర్‌పేటలోని సాఫ్ట్‌వేర్ సొల్యూషన్స్‌లో కోచింగ్ తీసుకుంటున్నాడు, కానీ ఉద్యోగం సంపాదించుకోలేకపోతున్నాడు. నగరాల్లోని పిల్లల వాగ్ధాటి ముందు గుంపు తర్కంలో నిలబడలేకపోతున్నాడు. ఇంటర్వూ గదిలోకి పోకముందే డీలాపడిపోతున్న పల్లె యువకుడు. తండ్రి గురప్ప ’నాలుగేండ్లయింతాంది సదువైపోయి…’ అనే ప్రశ్నలకు జవాబివ్వలేక సతమతమౌతున్నాడు.

వంద గొర్రెలున్న గొర్రెల కాపరి గురప్ప. వర్షాలు పడేదాకా, ఎండాకాలం వాటి మేత, నీళ్ళు పెద్ద సమస్య. సాధారణంగా కాపర్లు పదిమైళ్ళదూరంలో ఉన్న నల్లమల కొండల మీద మంచి వానపడ్డ తర్వాత గొర్రెలమందల్ని తోలుకుపోయి కొండలమీదున్న అడవుల్లో మేపుతారు. పల్లెల్లో వర్షాలు పడిన తర్వాత తిరిగివస్తారు. అలా పోవడాన్ని కొండపొలం వెళ్ళడం అంటారు. గొర్రెలకాపర్ల ఆడపడుచులు కొండపొలానికి బత్తెం తయారుచేస్తారు. సజ్జరొట్టెలు, బియ్యం, బెల్లపుండలు; ఉల్లిగడ్డలు, చింతపండు, వేరుశనగ గింజలు, ఎండు మిరపకాయలు దంచి ఉప్పు కలిపిన ఉండలు మొదలైనవి మూటగట్టి ఇస్తారు. అవి బత్తెపు కాలానికి అంటే ఎనిమిది రోజులకు సరిపోతాయి. అవి అయిపోగానే మళ్ళీ బత్తేలు తయారుచేసి పంపుతారు.

రవి తాత రవితో ’మీ నాయనతో పాటు నువ్వూ కొండపొలం చేసిరాపో. గొర్లపానాలు నిలబెట్టు. ఆర్నెల్లల్లో నీకు ఉద్దేగం రాకుంటే నా మొగం సూడగాకు’ అని ప్రతిజ్ఞ చేసినట్లుగా చెప్పాడు. అన్నయ్య శంకర్‌కి కొత్తగా పెళ్ళయింది. పెళ్ళయిన ఏడాది కొండపొలం చెయ్యకూడదన్న నియమం వల్ల అతన్ని మినహాయించారు. చివరికి రవికి తండ్రికి సహాయంగా వెళ్ళక తప్పలేదు. తల్లి గురమ్మ చిన్నప్పటినుంచి రవిని గారాబంగా పెంచి, దూరంగా పంపి చదివించింది. వాడికి ’పల్ల గొర్రెకు, బొల్లిగొర్రెకు తేడా తెలీదు. కారు పొట్టేలికి, దొడ్డి పొట్టేలికి భేదం కనుక్కోలేడు’ అనుకుని మొదట్లో ఒప్పుకోలేదు. చివరికి తన భర్తకి తోడవసరం అని గ్రహించి మరీమరీ జాగ్రత్తలు చెబుతూ కళ్ళనీళ్ళతో సాగనంపింది. రోజంతా భుజాన్నేసుకునే ఎవరి బత్తెం వాళ్ళు మోసుకపోతూ బయలుదేరారు తండ్రీకొడుకులు.

ఏభై రోజుల కొండపొలం అనుభవాన్ని రచయిత వర్ణించిన తీరు అద్వితీయం! ఉత్కంఠభరితంగా, ముందుముందు ఏమవుతుందోనన్న ఆరాటంతో చివరివరకు చదివిస్తుంది. గొర్రెకాపరుల అనుభవాల్ని ఇంత చక్కగా వర్ణించిన ఇటువంటి నవల ఇంతవరకూ రాలేదు. ఈ 21వ శతాబ్దంలో కూడా గొర్రెకాపరుల జీవితాలు ఇలా ఉంటాయా అన్న ఆశ్చర్యంలో మనల్ని ముంచెత్తుతుందీ నవల. ఈ నవల చదివేటప్పుడు నాకు నచ్చిన అంశాలు, సన్నివేశాలు, వచ్చిన ఆలోచనలు, అడవితో మమేకమైన నా మనఃస్థితి మీతో పంచుకోవాలన్నదే నా ఈ చిన్ని ప్రయత్నం.

మొదట్లో రవి కొండల్లో ఇతర గొర్రెకాపర్లతో పాటు తను అన్నిరోజులు జీవించగలడా అని సందేహపడ్డాడు. రోజూ స్నానం చెయ్యడానికి నీళ్ళుండవు. స్నానం కాదుకదా కాళ్ళు కడుక్కున్నా వెంటనే చలిజ్వరం వస్తుంది ఆ నీళ్ళ తత్వానికి. పురుగూ పుట్రా ఆలోచన లేకుండా నేలమీద పడుకోవాలి. రాళ్ళు విసిరి చప్పుళ్ళు చేస్తూ అడవుల్లోకి చొచ్చుకుపోతూ ఉండాలి. ఏ క్షణాన్నైనా క్రూరమృగాల దాడి జరగొచ్చు. వానొచ్చినా ఆశ్రయం ఉండదు. గొర్రెల్లాగా ఆరుబయట గడపాల్సిందే. గుండెల్లో దడుపు, అలజడి వలన అడవి అందం గాని, వెన్నెల చల్లదనం గాని ఆస్వాదించలేకపోయాడు. భయం రకరకాల జంతువుల రూపాలెత్తుతూ నిద్రను దూరంచేసేది.

నెమ్మది నెమ్మదిగా అతనిలో ధైర్యం వచ్చింది. ఎన్నోసార్లు పెద్దనక్క (పులిని గొర్లకాపర్లు అలానే పిలుస్తారు) దర్శనం అయింది. ఒకసారి చంటిపిల్ల తల్లియైన ముచ్చుగొర్రెను, మరోసారి తన తండ్రి పెంపుడు కుక్కను పులుల పాలబడకుండా సాహసంతో వాటిని ఎదుర్కొన్నాడు. ’పెద్దపులి వస్తే రానీ… ఒక గొర్రెను కొరక్కతింటది. అంతేగదా!’ అనేంత నిర్లిప్త మనఃస్థితికి చేరుకున్నాడు. అడవిలో ఇతర జంతువులైన చిరుత, చిలువ, ఎడగండు (బూడిద రంగు శరీరం మీద నల్లచారల చిరుబులి), ఎలుగుబంటిలతో ముఖాముఖి అవ్వడం కూడా అతనిలోని అదురును తుడిచిపారేసింది. అడవి సౌందర్యం, గొర్రెకాపరుల జీవనసరళి, కొండపొలం అనుభవాలు అతనికి ఎంతో ఇష్టంగా అనిపించి అనుభవించడం అలవాటయింది. అడవి అంటే అయోమయమని, భయమని అనుకున్న అతనికి అడవి తన విశ్వరూపాన్ని ప్రదర్శించి అడవిని ప్రేమించే మనిషిగా తయారుచేసింది. అతనిలోని నిద్రాణమైన మానవత్వాన్ని జాగృతం చేసింది. చివరికి అతని జీవిత గమ్యాన్నే మార్చివేసింది.

నవల చదువుతున్నప్పుడు ప్రకృతి రహస్యాలు, విన్యాసాలు, సౌందర్యాలు, వివిధ రూపాలు మన కళ్ళముందు నాట్యం చేస్తాయి. వెన్నెలని, ఆకాశాన్ని, అడవిని రచయిత వర్ణించిన తీరు మన మనసుల్లో చెరగని ముద్రవేస్తుంది. అన్నింటిని చెప్పడం సాధ్యంకాదు కాబట్టి, కొన్ని ఉదాహరణలు మాత్రం ఇస్తాను. వెన్నెల వర్ణన – పలుచని నీళ్ళమజ్జిగ లాంటి పంచమి వెన్నెల, ఉల్లిపొరలాంటి తెల్లని వస్త్రాన్ని అడవంతా కప్పినట్లుగా వ్యాపించి ఉన్న వెన్నెల; ఆకాశం వర్ణన – ఆకాశం నిండా తెల్ల జొన్నలు ఆరబోసినట్లు చుక్కలుండడం, ఉతికి ఆరేసిన నీలిరంగు ముత్యాల చీరలా అందంగా ఉన్న ఆకాశం; అడవి వర్ణన – వాన కురిసిన తర్వాత కొత్తగుడ్డలు కట్టుకుని పూలు పెట్టుకుని కూచున్న పెండ్లికూతురులా వున్న అడవి, అద్భుత సంగీత కచేరి నిర్వహిస్తూ, అడవినంతా సంగీత మాధుర్యంతో నింపుతున్న పక్షులు… ఇలా రాసుకుంటూ పోతే వర్ణనలు కోకొల్లలు.

రచయిత అడవిలోని రకరకాల చెట్లతో, పళ్ళతో, జంతువులతో మనకి పరిచయాలు చేస్తారు. చెట్లలోని రకాలు – ఎర్రపొలిక చెట్లు, తెల్లపొలిక చెట్లు, ఏపె చెట్లు, టేకు చెట్లు, ఇనుమద్ది, భిల్లు, సీకిరేణి, ఉసిరిక, దాదిర, ఎలమ, కొండగోగు, పొలిక చందనపు చెట్లు, తాండ్ర, మద్ది, సండ్ర, వెదురు, సిరిమాను, కొండగోగు చెట్లు, చందనపు చెట్లు; పళ్ళలోని రకాలు – మోవి పళ్ళు, వెలగ పళ్ళు, ఈత పండ్లు, టూకి పళ్ళు, పరికి పళ్ళు, అల్లనేరేడు పళ్ళు, కొండీత పళ్ళు; జంతువుల్లోని రకాలు – కడతులు, గండంగులు, పులులు, కొండచిలువలు, ఎలుగుబంట్లు, ఒంటి పందులు, ఏదుపందులు, రేచులు, చెట్టుడతలు, నెమళ్ళు, కోతులు, మేకలు, చిరుతలు.

నవలలో పేర్కొన్న రకరకాల సామెతలు కూడా మనకి గిలిగింతలు పెడ్తాయి. కడపజిల్లా మాండలికంలో వున్న ఆ సామెతలు పల్లెటూరి తత్త్వాన్ని, లోకం పోకడని, జ్ఞానాన్ని మనకి పంచిపెడతాయి. ఉదాహరణకి కొన్ని: నీల్లకుండ నెత్తిన పెట్టుకుని పుట్టచెండు ఆడగూడదట; ఒకూరి రెడ్డి ఇంగోకూరికి పసలపోలుగాడంట; ఇయ్యాల ఇంట్లో రేపు మంట్లో; గుడ్డొచ్చినపుడు గూడెతుక్కున్నెట్టుంది యవ్వారమంతా; గోడరాయి గోడకు చేర్చటమే మంచిదిగాని తీసిపారెయ్యడం ఎంతసేపు?; కక్కొచ్చినా కల్యాణమొచ్చినా ఆగదని; చిక్కి ఇగిలించేదానికన్నా వెల్లి ఎక్కిరించేది మేలు; గొర్రెలు కాసేవాణ్ని కొట్టినవాడు బర్రెలు కాసేవాణ్ని తిట్టనివాడూ లేడు; చాకలి తెలుపు మంగలి నునుపు; తీట వున్నేంక గీరుకోకుండా ఎట్టా; రాతిగొట్టినా సేతగొట్టినా దెబ్బ గుర్తుండిపోవాల.

ఇక గొల్లకాపరుల మనస్తత్వాలను, వ్యక్తిత్వాలను, జీవితం పట్ల వాళ్ళకున్న అవగాహనను చెప్పుకోకపోతే ఈ సమీక్షకి న్యాయం చేకూర్చినట్లు కాదు. కొండపొలం వెళ్ళిన గుంపందరిలో పుల్లయ్య పెద్దవాడు. ఎన్నో ఏళ్ళ కొండపొలం అనుభవంగల ముసలి కాపరి. అడవి న్యాయం అంటే ఏమిటో అతని సంభాషణల వలన మనకు తెలుస్తుంది. గొర్రెలు కాసేటప్పుడు పులులొస్తాయి, కొండసిలువలొస్తాయి, చిరుతలొస్తాయి, వాటిని తప్పించుకుని పోవాలిగాని, సంపి మందను బతికించుకోవాలని అనుకోకూడదు. పెద్దనక్క రాజ్జెం అడవి. గొర్రెలు మేపుకుందికి పుల్లరి తీసుకుంటది. గొర్రెనో, పొట్టేలినో పుల్లరిగా చెల్లించి దూరంగా పోవాల. ప్రాణాలమీదికి తెచ్చుకోకూడదన్నది అతని హెచ్చరింపు. చెట్లను నరికి అడవులను నాశనం చెయ్యగూడదు, పొలం దున్నే నాగలి కోసం కొమ్మను నరకవచ్చు. ఐదారేండ్లకు నాగలి అరిగిపోతే మళ్ళీ కొమ్మను కొట్టుకెళ్ళచ్చు, అంతేగాని అనవసరంగా కొమ్మల్ని నరికి అడవిని నాశనం చెయ్యకూడదన్నది అతని సిద్ధాంతం.

గొల్లకాపరికి తన గొర్ల మీదుండే ప్రేమని కూడా ఎంతో సునిశితంగా వర్ణించాడు రచయిత. గొర్రెకు ముల్లుగుచ్చుకుని నడవలేనప్పుడు గొర్రెకాలుని పళ్ళతో కరచి మరీ ముల్లు తియ్యడం, సేవ చేసేటప్పుడు మనిషికి, జంతువుకీ తేడా చూపించకపోవడం, స్వంత బిడ్డలా చూసుకోవడం, మద్యాహ్నం తిండి తినేటప్పుడు తప్ప మిగతా సమయమంతా గొర్రెల వెనక తిరిగి తిరిగి, వాటిని ఏమారకుండా కాపాడుకోవడం, గొర్రెలకు పుల్లిక చేసి మేపు కూడా తినకుండా వున్నప్పుడు సూదిమందు ఎక్కించడం, గొర్రె ఈనేటప్పుడు మర్దనచేస్తూ అండగా నిలబడటం – ఇలాంటివి ఎన్నో.

ఇవేగాక నవలలో అక్కడక్కడా మనస్సుని కదిలించే సంఘటనలు తారసపడతాయి. గొల్లకాపరి అంకయ్య గొర్రెలను సాకే పనిలోబడి భార్య సుభద్ర కోరిన చిన్నచిన్న కోరికలను తీర్చలేకపోవడం, ఆమె అలిగి పిల్లాడిని తీసుకుని పుట్టింటికి వెళ్ళిపోవడం, ఆమె ఎడబాటుని అంకయ్య భరించలేకపోవడం, రవితోపాటు కొండదిగి వచ్చినప్పుడు టెలిఫోను బూత్‌లో ఆవేదనతో భార్యతో మాట్లాడిన వైనం మనస్సుని ఆర్ధ్రతతో నింపుతుంది. పెళ్ళికి ముందే తల్లయిన కూతురు తనని చూసి దుఃఖపడి క్షమించమని అడిగిన విధానం, దానికి రామయ్య పశ్చాత్తాపంతో కరిగి నీరై కన్నీళ్ళుకార్చిన సంఘటన మనల్ని ఉక్కిరిబిక్కిరి చేసి కళ్ళనీళ్ళ పర్యంతం చేస్తుంది. ఇక గొర్ల కాపర్ల కుటుంబాలలో ఆడవాళ్ళదే పెత్తనం అని మనకి నవల చదివేటప్పుడు అర్ధం అవుతుంది. గొర్లకాపర్లు గొర్లను కాస్తూ చాలావరకు బయట తిరుగుతుంటారు కాబట్టి ఇంటి పెత్తనమంతా భార్య తీసుకుంటుంది. అంటే మేట్రియార్కల్ కుటుంబ విధానం అన్నమాట!

వానకోసం రైతులే కాదు, గొర్రెకాపర్లు కూడా ప్రాణాలు ఉగ్గపెట్టుకుని ఎదురుచూస్తారు. అడవి వర్ణనలాగే వర్షాన్ని వర్ణించడం ఈ పుస్తకంలోని ప్రత్యేకత. గొర్రెలు తెలవార్లూ నిలబడి, చెట్లలాగా, రాళ్ళలాగ వానకి తలొంచాయి. ఏ కొండమీద చూసినా నీటిజాలులే. సెలలన్నీ ప్రాణంవచ్చి కొండచిలువలై పరుగులు తీస్తున్నాయి. పర్వతాలకూ, సెలయేర్లకూ నోరొచ్చింది. వాన కురిసిన ఆనందం అన్ని బాధల్ని మింగేసింది. ఏభై రోజుల శ్రమంతా కరిగి కారిపోయింది. కొండనించి వచ్చిన మనుషులకు ఉలవగుగ్గిళ్ళు, ఉలవచారుతో తొలి భోజనం పెట్టారు. అది గొల్లల ఆచారం. అడవినుంచి వెంట తెచ్చుకున్న చాలారకాల శారీరక రుగ్మతల్ని అది తొలగిస్తుందట!

ఇక రచయిత నవల చివరలో ఇచ్చిన ముగింపును పరిశీలిద్దాం. కొండపొలం అనుభవం రవిని ఆద్యంతం మార్చివేసినట్లు, మనుషులు, చెట్లు, చేమలు, జంతువులు ఉన్న ప్రాణమున్న ప్రపంచం కావాలని కోరుకుని, అటవీ శాఖలో జిల్లాస్థాయి అధికారి కావాలన్న ధ్యేయం పెట్టుకుని రెండేళ్ళు కష్టపడి నేరుగా డి.ఎఫ్.ఒ. ఉద్యోగాన్ని సాధించినట్లు, ఆఫీసరుగా అడవి నరికేవాళ్ళ ఆగడాలను అరికట్టి నిజాయితీపరుడైన అధికారిగా పేరు తెచ్చుకున్నట్లు చూపించారు. ఈ విషయంలో నవలాకారుడిని విమర్శిస్తూ, దేశరాజు, సౌరవ ఆంధ్రజ్యోతి వివిధ పేజీల్లో ఆగస్టు 24న, అక్టోబర్ 12న వ్యాసాలు రాశారు. అటవీ అధికారిగా దుష్టశిక్షణ చెయ్యడం, దొంగల ఆటకట్టించినట్లు చూపించడం కాత్యాయనీ విద్మహేగారన్నట్లు అందమైన ఊహగా అంగీకరించడం కూడా కష్టమే అంటారు దేశరాజు.

నవలలోని ఇతివృత్తం గొల్లల జీవితమే అయినా రచయిత టార్గెట్ మధ్యతరగతి పాఠకులని, వారికి ఆకర్షణీయమైన కథాంశంగా ఉండేలా రచయిత జాగ్రత్తపడ్డారని సౌరవ అంటారు. ఇంకా నవలలో ప్రధాన పాత్రధారులైన గొల్లలు యథావిధిగా భూస్వామ్యవిధానపు చట్రంలో అణిగిపోతూనే ఉన్నారని, వారి జీవితాల్లో ఏ మార్పూ లేదని అంటారు. అటవీ వనరులను కొల్లగొట్టుకుపోతున్నది కేవలం స్మగ్లర్లు, అడవి దొంగలు కాదని, ఈ దోపిడీల వెనుకుండి కథ నడిపించేది రాజకీయ శక్తులు, అంతర్జాతీయ కార్పొరేట్ శక్తులని, ఆ నెట్‌వర్క్‌ను ఒక సిన్సియర్ ఆఫీసర్ తన నిజాయితీతో మార్పు చెయ్యగలుగుతాడని చెప్పడం పాఠకులను భ్రమింపజేయటమేనని కూడా అంటారు.

పై విమర్శలు సహేతుకమైనవే, కాదనను. వ్యవస్థీకృతమైన దోపిడీకి వ్యక్తుల స్థాయిలో పరిష్కారాలు వెదకడం అసాధ్యం. అలా తెగించి పోరాడిన నిజాయితీగల ఆఫీసర్ల జీవితాలేమయ్యాయో కొన్ని నిజజీవిత సంఘటనల వలన మనకందరికీ తెలుసు. రవికి అడవిని రక్షించే ప్రయత్నంలో ప్రతిబంధకాలు ఎదురైనట్టు, అవినీతి, కొన్ని వర్గాల ఆధిపత్యం, అసమానతలతో నిండిన వ్యవస్థను ఎదుర్కొనడం అంత సులభం కాదని గ్రహించినట్లు రాస్తే వాస్తవానికి దగ్గరగా ఉండేది.

కాని, తెలుగు సాహిత్యంలో మొట్టమొదటిసారిగా గొల్లల జీవితాన్ని అక్షరబద్ధం చేసి, అడవి, ఆకాశం, వెన్నెల, వర్షం మీద మనోరంజకమైన, ఉల్లాసభరితమైన వర్ణనలతో, అత్యంత సృజనాత్మకతతో పల్లెవాతావరణాన్ని, కొండపొలం అనుభవాన్ని మనకందించిన ముఖ్యమైన ఇతర అంశాలను విస్మరించి ముగింపును టార్గెట్ చేసిన సౌరవగారి విమర్శ కొంత సంతులితను సంతరించుకుని ఉంటే బాగుండేది! ఇంకా చెప్పాలంటే ప్రతి రచయితకీ తనకిష్టమైన రీతిలో ముగింపునిచ్చే హక్కు ఉంటుంది. అది అందరికీ ఆమోదకరంగా ఉండాల్సిన అవసరంలేదు.

సౌరవగారి రెండవ విమర్శ: అడవి పట్ల, జంతువుల పట్ల కొన్ని అపోహలు నవలలో చోటుచేసుకున్నాయని, పులి వెనుక భాగాన్ని పెంపుడు కుక్క పట్టేసి దాడిచేయకుండా ఆపడం, ఐదారు వందల పౌండ్ల బరువు గల జంతువును ఎదుర్కొనడం అభూతకల్పన మాత్రమేనని, గిరిజనులు కూడా పులి ఎదురుపడితే కదలకుండా నిలబడతారని, ఆయుధంతో దాడిచేసే ప్రయత్నం చెయ్యరని, ఇంకా ఆడ మగ కొండచిలువలు ఈల వేయడం అన్నది ఎక్కడా వినని విషయం అని పేర్కొన్నారు. కాని, చిన్నతనం నుంచి గొల్లలతో కలసిమెలసి బతుకుపయనం సాగిస్తూ, సాహిత్యకారుడిగా ఎంతో అనుభవమున్న సన్నపురెడ్డిగారు వీటిని గురించి ఎటువంటి అవగాహన లేకుండా కేవలం నవలను ఉత్కంఠభరితం చెయ్యడానికి, మధ్యతరగతి పాఠకులను ఆకట్టుకోడానికి రాశారనుకోవడం నమ్మశక్యంగాని విషయం!

సౌరవగారి మరో విమర్శ: ’నెలకి కనీసం ఐదువేలు కిట్టుబడి అయినా నా పొలంలో నేను కూలీగా ఉండిపోతాను’ అని రైతు చేత అనిపించాడు. ఇది రైతును పొలంనుంచి తరిమేసి ఆ పొలంలోనే అతన్ని కూలీగా మార్చాలనే పాలక వర్గాలకు, కార్పొరేట్లకు అనువైన ఆలోచనంటారు ఆయన. కానీ, రైతు జీవితం ఏ స్థితికి దిగజారిపోయిందో తెలిపే అసలైన వాక్యాలివి. బతుకు పోరాటంలో అలసిపోయిన అదే రైతు వానలొస్తే మళ్ళీ సేద్యం చేస్తానంటాడు. రైతుకు తన భూమితో ఉన్న అనుబంధాన్ని చక్కగా తెలిపారు రచయిత.

చివరగా రచయిత తన ముందుమాటలో అన్న వాక్యాలను గుర్తు చేసుకుందాం: నా కాళ్ళ కింద నేల, నా చుట్టూ ఉన్న జీవితాలు కలసి నాచేత రాయించిన మరో నవల ఈ కొండపొలం. సగిలేటినుంచి నల్లమల దాకా వున్న బరక పొలాలూ, మెరక నేలలూ, వంకలూ, వాగులూ, మిట్టలూ, గుట్టలూ, చెట్లూ చేమలూ, రకరకాల జీవరాశులతో కూడిన ఈ నేలకు నేను ఆస్థాన లేఖకుడ్ని. నిరంతరం వాటిముందు కూచుని అవి చెప్పే విషయాల్ని శ్రద్ధగా వింటూ రాసి ప్రకటించటం నా పని. ఆ పరంపరలో ఇప్పుడు నల్లమలకొండల వంతు వచ్చింది.