కొన్ని నవ్వులూ కొన్ని ఏడ్పులూ

సాయంత్రం నీరెండలోకి చూస్తూ కారు నడుపుతున్నాను. అందమైన ఆకాశాన్ని చూస్తే ఏదో దిగులనిపించింది. అద్భుతమైన సౌందర్యాన్ని, ఎక్కడ, ఎప్పుడు చూసినా కొంచెం దిగులూ, ఇంకొంచెం భయమూ కలుగుతుంది. ఒక గొప్ప విడ్డూరాన్ని చూశాక మిగతా ప్రపంచం చాలా సాధారణంగా బీడుపోయి కనిపిస్తుంది. ఆ అద్బుతమైన సౌందర్యానికున్న అల్పాయుష్షు తలచుకుని దిగులు, అసలింత సౌందర్యం ఈ చిన్ని గుండె తట్టుకోలేదేమో అన్న భయమూ, అన్నీ కలిసి ఆ సౌందర్యం కలగజేసే ఆనందాన్ని కొంచెం కలుషితం చేస్తాయా? తెలియదు. నా ఆలోచనలతో నాకే నవ్వొచ్చింది. వారం వారం అలవాటయిపోయి నాతో నేనూ ఇలానే ప్రెజెంటర్ భాషలో మాట్లాడుకుంటున్నాను. కానీ నాలోనూ ఏదో మార్పొచ్చింది. తెలుస్తూనే ఉంది. వయసా, కుటుంబమా, ఉద్యోగమా?

ఈ ఉద్యోగం ఒకప్పుడు ఎంత గొప్పగా ఉత్సాహంగా ఉండేదనీ! రిప్లేస్ బిలీవ్ ఇట్ ఆర్ నాట్ లాంటి షో మాది, ఒక పెద్ద ఛానల్‌లో. చాలా హై టీఆర్పీ ఉన్న షో. ఒకప్పుడు ఎంతో గొప్ప వింతలూ విడ్డూరాలూ చూసేవాళ్ళం. ఒకామెకు జుట్టు ఎంత పొడుగంటే నడుము చుట్టూ పది చుట్లు చుట్టుకొనేంత. ఒకమ్మాయి ఒంటిమీద నీరు పోస్తే తామరాకు మీదనుంచి జారినట్టు జారిపోయేవి. ఒక చిన్న పిల్లవాడు నిజంగా జంతువులతో మాట్లాడగలిగేవాడు. నిజంగా అద్భుతాలు అవి. వెతికి వెతికి అలాంటివారిని పట్టుకొనేవాళ్ళం. చూస్తుంటే అబ్బురంగా ఉండేవి. ఎవరూ వివరించలేని అలాంటి గొప్ప విడ్డూరాల నుంచి రాను రానూ ప్రోగ్రామ్ వాసి తగ్గిపోయింది. ప్రస్తుతం, కరెంట్ షాక్ లాంటిదేదో తగుల్చుకొని బాబాలుగా మారిపోయి భవిష్యత్తు చూడగలననే ఫేక్ ఫకీర్లు, పదినిమిషాలలో పది పిజ్జాలో, వంద మిరపకాయలో తిని సూపర్ హ్యూమన్ అని చెప్పుకొనే జోకర్లూ ఎక్కువయ్యారు. నిజంగా అద్భుతాలను చూసినవారు ఇలా మీడియా గుర్తింపు కోసం వెంపర్లాడరు.

సాయంత్రం తప్పుకుంటూ చిరుచీకట్లకి దారిస్తోంది. హైదరాబాద్ చేరడానికి ఆలస్యం కావొచ్చు. ప్రియ పాపం ఒంటరిగా ఎదురుచూస్తూ వుంటుంది. ఒక్కసారి ఫోన్ చేయడం మంచిదేమో, మెల్లిగా హైవే దిగి కారు ఒక పక్కగా ఆపి ఇంటికి ఫోన్ చేశాను.

“హల్లో శేఖర్! ఎక్కడున్నావ్?” ప్రియ గొంతు అలసటగా వినిపించింది.

“మధ్యాహ్నమే విజయవాడ నించి బయల్దేరే ప్రయత్నం చేశా. అయినా ఆలస్యం అయిపోయింది. ఇంకా నల్లగొండ దగ్గరే వున్నా. ఇల్లు చేరేసరికి ఇంకొక రెండు గంటలైనా పట్టొచ్చు. నువ్వూ శ్రుతీ భోంచేసేయండి. వంట చేసే ఓపిక లేకపోతే బయట్నుంచి ఏదైనా తెప్పించుకో.”

“అలాగేలే! నువ్వు జాగ్రత్తగా డ్రైవ్ చేసుకుంటూ రా. తొందరపడకు.” ప్రియ నిట్టూర్చి ఫోన్ పెట్టేసింది.

ప్రతీరోజూ సాయంత్రమయ్యేసరికి తనే ఒక పేషంటులాగవుతుంది ప్రియ. అందుకే ఎలాగోలాగ వీలు చేసుకొని ప్రియని స్నేహితులతో బయటికి పంపుతాను, బలవంతంగానైనా. లేకపోతే తను డిప్రెషన్ బారిన పడే ప్రమాదం వుంది. ఇప్పటికే తన వుద్యోగం వదిలేసింది పాప కోసం. మానసిక వైకల్యము, అంగ వైకల్యమూ గల పంతొమ్మిదేళ్ళ ఆడపిల్లతో పొద్దుణ్ణించీ ఇంట్లో ఇంకే వ్యాపకమూ లేని ఒంటరితనం ఎంత భయంకరంగా, సఫొకేటింగ్‌గా వుంటుందో తెలుసు నాకు. ఏ బాధ్యతా లేని స్వతంత్రమూ వుండదు, పోనీ ఒక బాధ్యతని నిర్వర్తిస్తూ భవిష్యత్తులోకి తొంగిచూసే ఉత్సాహమూ వుండదు. పక్కన మనిషి వున్న పేరేగానీ, ఆ మనిషి ఉనికి వల్ల ఎటువంటి మానసిక శారీరక సాంత్వనా వుండదు. ఉన్నదల్లా ఎడతెగని చాకిరీ, అలసట, నిరుత్సాహం, బ్రతుకుమీద ఇదీ అని చెప్పరాని కోపమూ.

ఆలోచనల్లోంచి బయటపడి కారు స్టార్టు చేశాను. ఏమైందో ఏమో, స్టార్ట్ కాలేదు. కంగారుపడ్డాను. మళ్ళీ ప్రయత్నించాను. ఊహు! ఏమాత్రం చలనం లేదు. కార్లోంచి బయటకొచ్చి నిలబడ్డాను. చుట్టూ చూశాను. ఎవరూ లేరు. కారు బానెట్ ఎత్తి చూశాను. స్పార్క్ ప్లగ్ వైర్స్ అన్నీ సరిగ్గానే ఉన్నాయి. బహుశా ఆల్టర్నేటర్ పోయిందేమో. ఏమీ తోచలేదు ఒక నిమిషంపాటు. అయోమయంగా సెల్ ఫోన్ తీశాను, ఎవరికి ఫోన్ చేయాలనో! సిగ్నల్ లేదు. నిస్సహాయంగా చుట్టూ చూశాను. కొన్నిసార్లు మా డాక్టరు శ్రుతి వైపు చూసినప్పుడు అతని మొహమూ ఏమీ అర్థంకానట్టు అయోమయంగా వుంటుంది, అచ్చం ఇప్పుడు నా మొహంలాగే!

కారు మీద చెప్పలేనంత కోపం వచ్చింది. షో పని మీద చుట్టుపక్కల ఊళ్ళు తిరుగుతూ వుంటాను. నా టీమ్ షార్ట్‌లిస్ట్ చేసిన ఎవరినైనా నేనూ చూసి కన్ఫర్మ్ చేసుకోక తప్పదు. అయినా వీలైనంతవరకూ ఇంటికి రాత్రయేలోపలే చేరుకునే ప్రయత్నం చేస్తూనేవుంటాను కానీ ఇప్పుడిలా! ఈ పక్కన ఒక చిన్న పల్లెటూళ్ళో ఒక అమ్మాయి నిప్పుల్ని మింగుతూందంటే చూసి నిర్ధారించుకోవడానికొచ్చాను. మామూలు బ్రతుకులే నిప్పుల మీద నడకలాగుంటే, నిప్పులు మింగడంలో పెద్ద వింతేముంది నిజానికి?

ఇక ఈ రాత్రి ఈ కార్‌లో గడపక తప్పదనుకున్నాను.

“ఏమైంది సార్! ట్రబులా?” కొద్ది దూరంలో వినిపించింది గొంతు. చిరుచీకట్లోంచి నడిచివస్తూ తోచీతోచనట్టు క్రీనీడలా అనిపించాడు. అతను దగ్గరికొచ్చేదాకా నేనేమీ జవాబివ్వలేదు.

“ఏంది సార్? కారు ట్రబులిస్తుందా? నేను చూడనా?” అతనే మళ్ళీ అన్నాడు. బహుశా నా వయసే ఉండచ్చు. జీవితపు తిరగలిలో నలిగిపోయినట్టున్నాడు. అక్కడక్కడా నెరుస్తూ పలచబడుతున్న జుట్టు, వాలిపోయినట్టున్న భుజాలు, పెద్ద పెద్ద కళ్ళల్లో ఏదో పెద్ద బరువు మోస్తున్న అలసట అతని మొహంలో.

“అవును. స్టార్టర్ బానే ఉంది. ఏమయ్యిందో తెలియడంలేదు.”

అతనూ ప్రయత్నించాడు. ఊహూఁ! బండి అసలు పట్టించుకోనేలేదు. చిన్నగా నిట్టూర్చి, బోనెట్ మూసేశాడతను. ఇద్దరం కాసేపు మౌనంగా నిలబడ్డాం. నిర్మానుష్యంగా, దీనంగా వున్న మైదానంలాటి ప్రదేశం, చీకటీ చలీ కలిసి దాడిచేయబోతున్న సంధ్యా సమయం, అపరిచితులం ఇద్దరం, ఎందుకో ఒళ్ళు జలదరించింది నాకు. అతనే ముందు తేరుకున్నాడు.

“ఏమో సార్! నాకేం తెలవట్లే! పొద్దున్న ఒక మెకానిక్‌ని తీసుకోనొద్దాం. చీకటి పడుతుంది, పురుగూ పుట్రా తిరిగే టైమ్! మా ఇల్లిక్కణ్ణే వుంది. పోయి రాత్రికి పండుకోని పొద్దున వొద్దాం.”

“మీ ఇంట్లో వాళ్ళకి పాపం ఇబ్బందేమో కదా?” కొంచెం సంశయించాను.

“అయ్యో, ఇందులో ఇబ్బందేం వుంది సార్? నడువుండ్రి, రాత్రికి పండుకోని పొద్దున్న వొద్దాం.” చేసేదేం లేక పొలాల వెంబడి అతని వెనకే నడవసాగాను. బురదమట్టి కాలిబాట.

“ఇంతకీ మీ పేరు?” నడుస్తూ అడిగాను.

“చర్లపల్లి సార్.”

“జైలు లాగానా?” అర్థంలేకుండా నవ్వాను.

“బతుకంటే జైలే కద సార్!” వేదాంతిలా నవ్వాడు.

“ఏం చేస్తారు మీరు? వ్యవసాయమా?”

“లేద్సార్. ఎలెక్ట్రిసిటీ బోర్డులో లైన్‌మన్‌గా చేస్త. మీ పేరేంది సార్? ఎక్కణ్ణుంచొస్తున్రు?”

“విజయవాడ నించి, హైదరాబాదు వెళ్ళాలి. నమ్మలేని నిజాలు అనే టీవీ షో వొస్తుంది చూస్తారా? అది నడిపేది నేనే.”

నడుస్తున్నవాడల్లా టక్కున ఆగిపోయాడతను.

“అవునా సార్?! అయితే చాలా వింతలు చూసుంటరు గద సార్!” అన్నాడు ఆసక్తిగా.

పెద్దగా నవ్వాను. “అవును చాలానే చూశాను.”

“అయితే మీకొక వింత చూపించాల. మీరిప్పడ్దాక చూసుండరు.”

ఇది ఎప్పుడూ జరిగేదే. ఏదో ఒక నమ్మలేని నిజం తెలియనివాళ్ళుండడం చాలా అరుదు. అందుకే పెద్దగా స్పందన ఏమీ లేకుండానే అన్నాను, “అవునా? చెప్పండి.”

“నా కూతురు సార్. మామూలు ఆడపిల్ల కాదు. మీరు చెప్తే నమ్మరు కానీ ఒక్కసారి చూడండి సార్. నా బిడ్డ నిజంగా స్పెషల్ సార్.”

అతని కూతురు ప్రసక్తి రాగానే, నాకు నా కూతురు గుర్తుకొచ్చి మనసంతా వికలమైపోయింది. అవును, నా శ్రుతి కూడా స్పెషల్ గర్ల్. పాపం ప్రియ ఏమైనా తిన్నదో లేదో. శ్రుతి ఎలా ఉందో. కనీసం ఇంట్లో లైటన్నా వేసుకుందో లేక ఓపిక లేక అట్లాగే పడుకుందో! అసలే డస్సిపోయిన మనసూ శరీరం మరింతగా అలసిపోయాయి.

“మీకు పిల్లలా సార్?” అతని ప్రశ్నతో ఉలిక్కిపడ్డాను.

“ఆఁ, ఒక కూతురు!”

“అవునా, కూతురైతే ఇగ చెప్పేదేముంది! ఎన్ని నవ్వులుంటయో, అన్ని ఏడ్పులూ వుంటయి.”

ఎంత కవితాత్మకమైన పరిశీలన! ఇలా ఇక్కడ వినరావడం ఎంత విడ్డూరం. పెద్దగా చదువూ తెలివీ వున్నట్టే కనపడని అతను, అటూ ఇటూ తిప్పుతూ మాట్లాడుతున్న తల, గాలికి ఎగురుతున్న అతని పలచటి పొడుగాటి జుట్టు, అతని మాటల్లో కనిపించీ కనిపించని వేదన, ఏదో అర్థంకాని విషాదానికి భాష్యం చెప్తున్నట్టు. జీవితాన్ని చదివిన మనిషి, జీవితాన్ని గడిపిన మనిషి, జీవితాన్ని అర్థం చేసుకున్న మనిషి, ఈ మారుమూల ఇక్కడ, ఇలా. నాకెందుకో అతని మీద ఏదో తెలియని ఆప్యాయత కలిగింది.

శ్రుతి గురించి నేనెందుకో ఎప్పుడూ ఎవరితోనూ మాట్లాడలేదు. తనలా ఉండడం నాకెందుకు నామోషీగా అనిపిస్తుందనేది బహుశా నా మనసులో ఏ చీకటిమూలలోనో దాచిపెట్టుకున్న రహస్యం. నా కొలీగ్స్, ఫ్రెండ్స్ ఎవరిదగ్గరా ఆ ప్రస్తావన రాకుండానే జాగ్రత్తపడ్డాను. నిజానికి నా కొలీగ్స్ చాలామందికి శ్రుతి ఉందని కూడా తెలియదు. కానీ, ఇప్పుడు ఇక్కడ ఈ అపరిచితుడితో నా మనసులో వ్యథంతా పంచుకోవాలన్నంత ఆవేశం వచ్చింది. గొంతు సవరించుకుని చెప్పాను.

“మా శ్రుతికి, అదే మా అమ్మాయి, కొన్నాళ్ళ క్రితం పెద్ద ఆక్సిడెంటయింది. ఎనిమిదేళ్ళ క్రితం, అప్పుడు పదకొండేళ్ళు దానికి. పాపం, సైకిలు తీసుకొని బయటికెళ్ళింది. కారు గుద్దేసింది. కాళ్ళు చచ్చుబడిపోయాయి, మెదడు కూడా దెబ్బతింది. అసలది మమ్మల్ని గుర్తుపడుతుందా లేదా కూడా అనుమానమే. తన ప్రపంచంలో తనుంటుంది, మంచం మీద గుడ్డల మూటలా. డాక్టర్లు ఏవేవో చెపుతూ వుంటారు. ఆశ వొదులుకోవద్దని, ఏ అద్భుతమో జరగవచ్చని, అది మళ్ళీ మామూలు ఆడపిల్ల కాకపోయినా కనీసం నడవగలదు, మాట్లాడగలదు అని, ఇలాంటివి అప్పుడొకసారి ఇప్పుడొకసారి ముందెక్కడో జరిగాయని. ఏమేమో చెప్తుంటారు కానీ…”

నుదుటిమీద చూపుడు వేలికొసతో కొట్టుకున్నాను చూపిస్తున్నట్టు. “ఇందులో ఏం జరుగుతోందో, తను ఏం ఆలోచిస్తోందో, తనకు ఏం కావాలో, ఎవరికి తెలుసు?”

సాధారణంగా ఇవే మాటలు ఇంకెవరితోనైనా చెప్తే, వాళ్ళు మమ్మల్ని ఓదారుస్తున్నామన్న భ్రమలో ఏవేవో మాట్లాడడం మొదలుపెడతారు. నిజానికి ఆ మాటలేవీ నాకు కానీ ప్రియకి కానీ వినిపించనే వినిపించవు. మనసు ముక్కలవుతూ, ప్రాణాలు తోడేస్తుంటే ఎదుటివాళ్ళ శుష్కమైన ఓదార్పు మాటలెవరికి వినిపిస్తాయి? మాకు కావల్సింది మౌనం. మా బాధను అర్థంచేసుకొనే మౌనం. కనీసం మా బాధను మేము అనుభవించడానికి కావలసిన మౌనం. అది ఒకరికివ్వగలిగిన కనీసపు గౌరవం. అది నాకు ఇక్కడ, ఈ ఆకాశం కింద, ఒంటరిగా నా మాటలు వింటూ ఏమీ మాట్లాడకుండా, మౌనంగా వింటున్న ఇతనినుంచి దొరికింది. బహుశా, అదే నన్ను అపరాధిని చేసింది. లేకుంటే, తమ సంతానానికి అద్భుత శక్తులున్నాయనీ, వాళ్ళు దైవాంశ సంభూతులనీ నమ్మని తల్లితండ్రులు ఎవరు? అందుకే అలా చెప్పే తల్లితండ్రులని దూరంగానే ఉంచుతాను కాని, నా అపరాధభావన నన్ను అతన్ని అడిగేలా చేసింది. నాకు అతను చూపించిన గౌరవం నేనూ అతనికి చూపించడానికేనా?

“మీ అమ్మాయి స్పెషల్ అన్నారు కదా. ఏమిటా స్పెషాలిటీ?” అనడిగాను.

చర్లపల్లి ఎందుకో ముందున్నంత ఆసక్తి చూపించలేదు. “వద్దులే సార్, మీరు నమ్మరు.” అని మళ్ళీ నడక మొదలుపెట్టాడు.

“అయ్యో! నమ్మకపోవడం ఏముంది. మీకు తెలీదనుకుంటా. నేను ఇవాళ్టికివాళ, నిప్పులు అమాంతంగా మింగే అమ్మాయిని చూసి వస్తున్నాను!”

అతను నడవడం ఆపి నావంక కళ్ళార్పకుండా, నా ఆత్మలోకి తొంగిచూస్తున్నట్టు చూశాడు. నాకు ఇబ్బందిగా అనిపించింది, నన్ను శల్యపరీక్ష చేస్తున్నట్టున్న ఆ చూపు. అసలే విచిత్రంగా వున్న ఆ సాయంత్రం, అతను చెప్పిన విషయం వింటూ ఇంకా విస్తుపోయాను. ఆ మునిమాపు చీకట్లో, ఎటునుంచి పడుతున్న వెలుతురో అతని ముఖాన్ని మరింత స్పష్టంగా చూపించింది. ఎండకు కమిలీ వానకు తడిసీ మొరటుబారిన చర్మం. ముఖంలో వయసుకు మించిన ముడతలు. అతను చెప్పింది నిజమా? అదసలు సాధ్యమా? సూటిగా నావైపు చూడకుండా, తడబడుతూ ఏదో నామోషీతో ఒక రహస్యం పంచుకున్నట్టుగా అతను చెప్పడం చూసి అతని మాటలు నమ్మకతప్పలేదు నాకు.

అతను తిరిగి నడవడం మొదలుపెట్టాడు, ఆ బురదమట్టిలో అడ్డంగా పడి. ఒక్క క్షణం ఆగి అతనివెంటే నడిచాను. నిజానికి అది నేను చేసుండాల్సింది కాదు. వెనకకు తిరిగి పరిగెత్తి పారిపోవాల్సింది.

పెంకుటిల్లు. చుట్టూ ఇనుపతీగెలతో చేసిన ప్రహరీ. అతని వెనకే నడిచి, బయట గుమ్మం దగ్గరే మొహమాటంగా ఆగిపోయాను.

“రండి సార్! కూర్చోండి.” షూస్ విప్పి గుమ్మం దగ్గరే ఒదిలి లోపలికొచ్చి కూర్చున్నాను. చెక్క కుర్చీలలో దూది, పాతగుడ్డలతో చేసిన మెత్తలు. గోడల మీద పాత ఫోటోలు. అల్మారాలో దేవుళ్ళ బొమ్మలు. గది మధ్యలో లేస్ గుడ్డతో కప్పిన చిన్న టేబుల్ మీద టీవీ. దాని పక్కనే కార్నర్‌లో చెక్క షెల్ఫ్ మీద ల్యాండ్ ఫోన్.

“ఫోన్ ఆ పక్కనుంది, ఇంటికి ఫోన్ చేసుకోండి సార్. నేను బట్టలు మార్చుకొనొస్తా.” అంటూ లోపలికెళ్ళిపోయాడతను.

ప్రియకి ఫోన్ చేశాను.

“రియల్లీ సారీ ప్రియా! ఈ రాత్రికి ఇక్కడ వుండక తప్పేట్టులేదు. బయట్నించి ఏదైనా తెప్పించుకుని తిని నువ్వూ శ్రుతీ పడుకొండి. రాత్రికి వంట పనేదీ పెట్టుకోకు.”

“ఇట్స్ ఓకే శేఖర్. ఐ విల్ మేనేజ్. నువ్వు పొద్దున్నే జాగ్రత్తగా రా.”

ప్రియ ఏమనకపోయినా నాకు చాలా గిల్టీగా అనిపించింది. ఆమె గొంతులో వినబడ్డ అలసట బట్టి శ్రుతి ఇవాళ తనని చాలా శ్రమ పెట్టిందని గ్రహించాను. అసలు అలా కష్టపడ్డరోజు, భవిష్యత్తు ఇంకా భయపెడుతుంది. తీరని కష్టం కంటే, ఇక కష్టం ఎన్నటికీ తీరదేమోనన్న భయమే కదా ఎక్కువ బాధపెట్టేది!

“నీకో సంగతి తెలుసా?” ప్రియ గొంతు ఇంతలోనే. “మధ్యాహ్నం తనకు బాల్కనీలో కూర్చోబెట్టి లంచ్ తినిపిస్తూ… నీకు తెలుసు కదా. అది బైట చెట్లనూ పిట్టలనూ మబ్బులనూ చూడడానికి ఇష్టపడుతుందని… చేయి తీసి నా చేతిమీద వేసింది.”

“అవునా?”

గది మూల గోడకు కొట్టిన ఫోన్ షెల్ఫ్ పైన, చుట్టూ చర్లపల్లి కుటుంబం ఫోటోలు.

“యెస్! అయామ్ పాజిటివ్.” అలసటలోనూ ఎక్కడో ఒక చిన్న ఆశాకిరణం తన గొంతులో. కొంత హాయిగా నిద్ర పోగలిగితే బాగుండు తను ఈ రాత్రి.

ఫోన్ పెట్టేసి మళ్ళీ వచ్చి కుర్చీలో కూర్చున్నాను. లోపలనుంచి చర్లపల్లి గొంతు వినిపిస్తోంది. ఇంకెవరిదో ఆడ గొంతు. బహుశా భార్య అయివుండాలి. ఎవరో పిల్లల గొంతులు కలగాపులగంగా. గొంతులు కాసేపటికి సద్దుమణిగాయి. ఆపైన కాసేపటికి ఒక అమ్మాయి, ఒక అబ్బాయి ముందుగదిలోకి వచ్చారు. నన్ను చూసి సిగ్గుగా నవ్వి కొంచెం దూరంగా కూర్చున్నారు. ఆ పిల్లవాడు రిమోట్ తీసుకొని టీవీ ఆన్ చేశాడు. ఇద్దరూ కాసేపట్లోనే టీవీలో వచ్చే పాటల ప్రోగ్రామ్‌లో ముణిగిపోయారు. వెనక వంటగదిలోంచి వాసనలు సన్నగా.

నేను ఆ అమ్మాయిని పరికించి చూశాను. మామూలుగానే ఉంది, అందరు పదహారేళ్ళ అమ్మాయిల్లాగే. ఇంతలో చర్లపల్లి ముందుగదిలోకి వచ్చాడు. అదాటున తల తిప్పగానే నన్నే చూస్తూ కనపడ్డాడు. అతని చూపులో నామీద అనుమానమో, సందేహమో, ఏదో కనిపించింది. తొట్రుబాటుతో తల తిప్పుకున్నాను.

ఇంతలో చర్లపల్లి భార్య వచ్చింది. చర్లపల్లి నన్ను పరిచయం చేశాడు. ఆమె నమస్కారం పెట్టి వెంటనే లోపలకు వెళ్ళిపోయింది. మళ్ళీ పిల్లలవైపు చూశాను. ఇద్దరూ నావైపు చూస్తూ ఏదో గుసగుసలాడుకుంటున్నారు. నేను నవ్వి, “భయం అక్కర్లేదు, నాతో మాట్లాడచ్చు.” అన్నాను. ఆ అమ్మాయి కొంచెం సిగ్గుపడింది కాని అబ్బాయి కళ్ళు విచ్చుకున్నాయి.

“మీరు టీవీ అంకుల్ కదా? మీ షో మస్తుంటది అంకుల్. నాకైతే భలే ఇష్టం. మా అక్కకు కూడ ఇష్టమే.”

“అవునా! మరయితే ఏ ఎపిసోడ్ నీకు బాగా ఇష్టం?”

“ఏదంటే…”

ఇంతలో చర్లపల్లి వచ్చాడు చేతిలో పంచతో, భోజనం రెడీ అంటూ. వద్దన్నాను, ఎలానూ ప్యాంట్‌తో పడుకోవడం అలవాటయిన ప్రాణం కదా అని.

చర్లపల్లి భార్య మా నలుగురికీ వడ్డించింది. వేడివేడిగా అన్నం, కూరలు. ప్రాణం లేచొచ్చింది. గబగబా నాలుగు ముద్దలు నోట్లో పెట్టుకున్నాను. అందరూ కొంచెం ఇబ్బందిగా మొహమాటంగా ఉన్నట్టనిపించింది. చిన్నగా కబుర్లలోకి దింపాను. కాసేపటికే నేను చూసిన వింతలూ విడ్డూరాలూ కొన్ని చెప్పేసరికి వాతావరణం తేలికయింది. అందరూ హాయిగా రిలాక్స్ అయారు. చర్లపల్లి భార్య కూడా మాట్లాడ్డం మొదలుపెట్టింది.

“ఐతె సారూ! మీ షోలొ కనిపించినాక పైసలిస్తరా?”

“ఆఁ! తప్పకుండా ఇస్తాం.”

“ఎంతిస్తరు సార్?” చర్లపల్లి గొంతులో కుతూహలం.

“వారి ప్రత్యేకతను బట్టి.”

“ఔనా!” చర్లపల్లి భార్య గొంతులో ఆతృత.

అప్పటిదాకా అన్నం తింటూ మధ్యమధ్యలో ఆ అమ్మాయిని చూస్తూనే ఉన్నాను. ఏమిటీ ఈ అమ్మాయి ప్రత్యేకత? ఇక ఆ అమ్మాయిని అడగదల్చుకున్నాను ఈ డబ్బు ప్రసక్తి ఎలానూ వచ్చింది కాబట్టి.

“ఏమ్మా! మీ నాన్న నువ్వు స్పెషల్ అని చెప్పారు. ఏంటి అదీ?”

ఆ అమ్మాయి ముఖం ఎర్రబడింది. ఒక్క క్షణం అందరూ మౌనంగా అయిపోయారు.

“అది నేను కాదంకుల్. మా అక్కయ్య.”

కంచంలోకి తలదించుకున్నారు అక్కాతమ్ముళ్ళిద్దరూనూ. చర్లపల్లి, అతని భార్య ఏమీ మాట్లాడలేదు. వీళ్ళకి ఇంకో అమ్మాయుందా? మరి ఎక్కడా కనబడదేం? అతని వంక అయోమయంగా చూశాను. అతను ఇబ్బందిగా నవ్వాడు.

“అవును సార్! అది నా పెద్దకూతురు. మీరు అన్నం తినండి. తర్వాత చూపిస్త గద.” భార్యాభర్తలిద్దరూ ఒకరినొకరు చూసుకున్నారు ఒక్క క్షణంపాటు.

బ్యాటరీ లాంతరు పట్టుకొని ఆమె, వెనుకగా అతను. అతని వెనకాలే నేను. ఇంటికి వెనక విడిగా ఒక యాభై గజాల దూరంలో ఒక రేకుల షెడ్. సిమెంట్ పూతలేని ఇటుకుల గోడలు. ఒక ఇనుప తలుపు.

పేరుకి షెడ్ అన్నమాటే కానీ, చిన్న గదిలా మార్చారు. పడుకునే మంచమూ, పక్కనే ఒక చిన్న బల్లా కూడా వున్నాయి. శుభ్రంగా వున్నా షెడ్డంతా తుప్పు వాసన. ఒకప్పుడు అది గొడ్ల కొట్టాం అయుండాలి. మంచం మీద ఒకమ్మాయి, బహుశా పంతొమ్మిదేళ్ళుంటాయేమో, ఏదో పుస్తకం చదువుకుంటూ కూర్చోని వుంది. మమ్మల్ని చూసి తలెత్తి నవ్వింది. మొహంలో బాల్యం వల్ల వచ్చిన ప్రశాంతత వుంది. ఆ అమ్మాయి ఒక కాలికి ఇనప కచ్చడం, దానినుంచి గొలుసు, ఆ గొలుసు రెండవ కొస గోడలో ఉన్న కొక్కెంలోకి తాళం వేయబడి. కానీ ఆ అమ్మాయికి ఇదేమీ పట్టినట్టు లేదు. నా చూపు గమనించి చర్లపల్లి అన్నాడు. “చెప్పిన కద సారూ, బిడ్డ కొంచెం స్పెషలని.”

“బిడ్డా! అంకుల్‌కి నీ మేజిక్ చూపిస్తవారా?” కూతురితో అన్నాడు.

“బాపూ! ఇది మేజిక్ గాదు.” చిరాగ్గా అంది తను. అది చిరాకు కాదు. చెప్పీ చెప్పీ విసిగిపోయి వేసారిన గొంతు అది.

చర్లపల్లి నావంక చూసి ఇబ్బందిగా నవ్వాడు. “బిడ్డ అలసిపోయింది సార్,” ఆమె వైపు తిరిగి, “సరె సరె. మేజిక్ కాదు గాని నువ్వు చేసేది ఈ సార్‌కు చూపియ్యి ఒక్కసారి.” వొంగి ఆమె కాలికున్న గొలుసు తాళం తీశాడు.

“బాపూ, నువ్వే గదనె ఎవరికీ చూపించద్దన్నది.”

“లేదు బిడ్డా! ఈ అంకుల్ మంచోడు. ఆయనకు అర్థమైతది. మనకు సాయం చేస్తడు.”

నా వైపు చూసిందా అమ్మాయి. ఊపిరి బిగబట్టి తనవైపే చూశాను. అమ్మాయి సన్నగా ఒక నవ్వు నవ్వి, మెల్లగా చేతులు సాచి నెమ్మదిగా నేలని తన్ని పైకి లేచింది గాలిపటంలాగా. అలాగే నవ్వుతూ నా వంక చూస్తూ గోడల పక్కగా హాయిగా పైకి ఎగురుతూ… తేలిగ్గా ఒక దేవతలాగా తేలుతూ అలాగే మెల్లగా గది పై కప్పుదాకా ఎగిరింది. పై కప్పు దగ్గరకు రాగానే, చేయి ఎత్తి కప్పును నెట్టి ఆ ఊతంతో మళ్ళీ మెల్లగా కిందకు రాబోయింది. కానీ మళ్ళీ తేలసాగింది. చర్లపల్లి ఇంతలో ఎగిరి ఆ అమ్మాయి కాలు పట్టుకొని కిందకు లాగాడు. పట్టుకుని పడవను ఒడ్డుకు కట్టేసినట్టు, ఇనప కచ్చడంతో ఆ అమ్మాయి కాలిని మంచానికి కట్టేశాడు. అసలు నా కళ్ళు నేనే నమ్మలేకపోయాను.

“ఎన్నాళ్ళబట్టి జరుగుతోంది ఇలా?” అడిగాను.

“రెండు నెలల్నించి సార్.” జవాబిచ్చాడు. కూతురి భవిష్యత్తు గురించి కొంచెం బెంగ కనిపించినా, అతని గొంతులో గర్వం కూడా తొంగిచూసింది. ఆ అమ్మాయిని పడుకోబెట్టి దుప్పటి కప్పి, తలనిమిరి చర్లపల్లి అతని భార్య బయటకు నడిచారు.

అర్ధరాత్రయింది. అందరూ నిద్రపోతున్నారు. ఎక్కడా అలికిడి లేదు. చర్లపల్లి కుటుంబం అంతా పక్కగదిలో పడుకోనున్నారు. ముందుగదిలో నాకు పక్క వేశారు. అందరూ పడుకున్నారు అని నిశ్చయించుకున్నాక, ఫోను పక్కన తగిలించిన తాళాలు తీసుకొని చిన్నగా లేచి బయటకొచ్చాను. చెప్పులు కూడా వేసుకోకుండా అలానే నడుచుకుంటూ షెడ్ దగ్గరికి వెళ్ళి జాగ్రత్తగా తలుపు తీసి లోపలకి వెళ్ళాను.

ఆ అమ్మాయి ఇంకా నిద్రపోలేదు. పుస్తకం చదువుకుంటూ అలానే ఉంది. నేను లోపలికి రాగానే ఆ అమ్మాయి తలెత్తి నన్ను చూసింది. ఏమీ మాట్లాడలేదు. ఏ శబ్దమూ చేయలేదు. తన చూపులో ఆశ్చర్యం లేదు. నేనేం చేయబోతున్నానో తనకు ముందే పూర్తిగా తెలిసిన చూపు అది. కొందరు ఆడపిల్లలు అంతే. వారికన్నీ తెలిసిపోతాయి.

మెల్లిగా తన కాలికున్న కచ్చడం విప్పదీశాను. ఆ అమ్మాయి మంచం మీద ఉన్న చున్నీ తీసి కప్పుకుంది. తనను రెండుచేతులతో ఎత్తుకొని బైటకు తీసుకొచ్చాను. నా మెడ మీద ఆ అమ్మాయి ఊపిరి వెచ్చగా, నమ్మకంగా తగిలింది. ఆమె పలచటి చెంప నా భుజం మీద ఆనుకొని. షెడ్‌లోంచి ఆరుబయటకు ఇంటికి కొంత దూరంగా తీసుకొని వచ్చాను. ఇంకా దూరం తీసుకువెళదామనుకున్నాను కాని ఆ అమ్మాయి బరువో, లేక నా అలసటో నన్ను అంతదూరం పోనీయలేదు. ఆ అమ్మాయిని నేల మీద దించి పట్టుకున్నాను. తీగ మీద నిలబడ్డట్టు తడబడి సర్దుకొని నా చేయి పట్టుకొని తమాయించుకుంది, కొద్దిగా నవ్వుతూ.

“నాకు భయంగా ఉంది.”

“ఎందుకమ్మా, నీకు ఏ భయమూ అక్కర్లేదు.”

పిండారబోసినట్టు పండు వెన్నెల. ఏ కల్మషమూ లేకుండా నక్షత్రాలతో నిండిపోయిన ఆకాశం. తన చేతి పట్టు కొద్దిగా సడలించాను. కొంత దూరం జరిగి తనూ కొద్దిసేపటికి నా చేతిని కొంత వదిలివేసింది. దూరంగా ఏవో జంతువులు కదులుతున్న ఊహ లీలగా. ఒక్క క్షణం ఆ అమ్మాయి అరుస్తుందేమో, భయపడుతుందేమో, ఏడుస్తుందేమో, అమ్మానాన్నలను పిలుస్తుందేమో అనుకున్నాను. కానీ, అవేమీ చేయలేదు. నన్ను చూసి చిన్నగా నవ్వింది. కాసేపటికి, “సరే వెళతా!” అన్నది.

మెల్లిగా తన చేయి ఒదిలిపెట్టాను. తనూ నన్ను ఒదిలిపెట్టింది. చిన్నగా నా కళ్ళముందు నుంచే తన తల, తన శరీరం, తన కాళ్ళు తేలిపోయాయి గాలిలోకి. ఆపుకోలేని ఆనందంలో పెద్దగా నవ్వబోయి తన నోటికి చేయి అడ్డం పెట్టుకుంది. ఆపైన రెండు చేతులూ సాచి అలా తేలిపోసాగింది. నిజానికి ఆమె నేలకు దూరం అయిపోవడం కాదు, ఈ నేలే తననుంచి తన కాళ్ళ కిందనుంచి పడిపోతున్నట్టుగా అనిపించింది నాకు. ఆ అమ్మాయి అలా తేలిపోవడం చూస్తూ ఎప్పుడు నా కళ్ళల్లో నీళ్ళు నిండాయో, ఎప్పుడు అవి ఆగకుండా కారిపోసాగాయో నాకు తెలియనే లేదు. తను చివరిసారిగా నన్ను చూసి చేయి ఊపింది.

ఇంతలో ఇంట్లో లైట్లు వెలిగాయి. చర్లపల్లి, అతని భార్య నావైపు పరిగెత్తుకుంటూ వచ్చేసరికే ఆ అమ్మాయి అందనంత ఎత్తుకు ఎగిరిపోయింది.

వెనకనుంచి వినిపిస్తున్న తిట్లకు నేను పారిపోయి ఉండాల్సింది. కానీ, అక్కడే నిలబడి పైపైకి ఎగిరిపోతున్న ఆ అమ్మాయికి ఈ ప్రపంచం ఎలా కనిపిస్తుందో ఊహించడానికి ప్రయత్నించాను. ఆమె తన ఇల్లు, ఆ షెడ్, ఆ పొలాలు, దూరంగా చెట్లు, అవన్నీ చూస్తున్నదా? తన తల్లీ తండ్రీ పెడుతున్న పెడబొబ్బలు, నన్ను తిడుతున్న తిట్లు, వింటున్నదా? తన తండ్రి ఏడుపుతోపాటు అనంతాకాశం చెప్తున్న రహస్యాలూ వింటున్నదా? దూరంగా కింద నేల మీద ఒక మనిషిని ఇంకొక మనిషి పిడిగుద్దులు గుద్దడం, ఈ గోల చూసి అరుస్తూ అటు ఇటూ కదులుతూ కుక్క ఒకటి ఎగబడడం తనకు కనిపిస్తున్నదా?

క్రమక్రమంగా కింద నేలమీద అరుపులూ కేకలూ పిడిగుద్దులూ అన్నీ ఆగిపోయాయి. అందరూ అన్నీ ఆపేసి ఆకాశంలోకి చూస్తూ నిలబడిపోయేరు. రానురానూ చిన్నగా అవుతూ చివరికి కంటికి కనిపించనంత నలుసులాగా అయిపోయాక అందరూ అలా…

ఆ అమ్మాయి చివరకు అన్ని బంధాలు తెంచుకొని పూర్తిగా విముక్తురాలయింది.

(ప్రేరణ: A Lovely and Terrible Thing – Chris Womersley.)

శారద

రచయిత శారద గురించి: ఆస్ట్రేలియా ప్రభుత్వోద్యోగిగా పనిచేస్తూ, బ్రిస్బేన్ నగరంలో నివసించే శారద తెలుగులో, ఇంగ్లీష్‌లో కథలు, అనువాదాలు రాస్తూ వుంటారు. నీలాంబరి అనే పేరుతో వీరి కథల సంపుటి ప్రచురించారు. ...