పంజరంలో బందీ అయిన పక్షి ఎందుకు పాడుతుందో తెలుసా? తన రెక్కలు కత్తిరించబడి, తన కాళ్ళకు సంకెళ్ళు వేయబడి, రగిలిపోతున్న కోపం, నిస్సహాయతల ఊచలకావల చూడలేక, ఇక వేరే దారి లేక, దూరతీరాలకు తన గొంతు చేరాలని, స్వేచ్ఛాస్వాతంత్రాల కోసం తాను పాడే పాట పదిమందికీ వినిపించాలని–అంటుంది మాయా ఏన్జెలో తన కవితలో. ఇటీవల ప్రపంచమంతా వెల్లువెత్తుతున్న బ్లాక్ లైవ్స్ మాటర్ ఉద్యమం మొదట అమెరికాలో ఇలానే గొంతు విప్పుకుంది. తరతరాలుగా లోపల వేళ్ళూనుకున్న ఆధిపత్యభావజాలం సాటి మనిషి పీకపై కాలు పెట్టి ప్రాణాలు తీసివేయడానికి సంకోచించని ఆ క్షణంలో సాంకేతికంగా అభివృద్ధి చెందినంత మాత్రాన సామాజికంగాను అభివృద్ధి చెందినట్టు కాదని సర్వప్రపంచానికీ స్పష్టమయింది. రంగు, కులం, మతం, జాతి, లింగభేదం, అధికారం, ధనం-ఇలా సాటి మనిషిపై వివక్ష వేయి పడగలతో విషం చిమ్ముతూనే ఉంది. ఈ రుగ్మత ఏ ఒక్క దేశానిదో, ఏ ఒక్క సంస్కృతిదో కాదు. ప్రపంచమంతటా ఏదో ఒక రూపంలో ఈనాటికీ ఈ వివక్ష కనపడుతూనే ఉంది. అసహాయుల ప్రాణాలను బలిగొంటూనే ఉంది. కాలం మారిందనీ బానిస భావజాలం మేమిక మొయ్యమనీ ఇన్నాళ్ళూ దానిని భరించిన వాళ్ళు ఇప్పుడు బాహాటంగా చెప్పడం ఆధిపత్య సమాజానికి అహం మీద పడిన దెబ్బవుతోంది. ఎంత కట్టడి చేసినా తమ బ్రతుకుని గానం చేస్తూనే ఉండాలన్న పట్టుదలతో, వేనవేల ఒంటరి గొంతులు ఇప్పుడు ఒక్కటై మార్మోగుతున్నాయి. వివక్షకు గురైనవారి అనుభవాల్లోని వేదన, ఆ గొంతుల్లోని తడి, ధిక్కారం అందరికీ అర్థమవడం కోసం ఉద్యమిస్తున్నాయి. మునుపు లేని కొత్త చర్చలకు, కొత్త ఆలోచనలకు తావిస్తున్నాయి. సహానుభూతి ఉండీ సమస్యలోతులు పూర్తిగా తెలియనివారికి తెలియజేస్తున్నాయి. భిన్నాభిప్రాయాలను గౌరవించడానికి, భిన్నానుభవాలను అర్థం చేసుకోవడానికి, విభిన్నజీవనరీతులకు రెండు చేతులతో స్వాగతమిచ్చి తమ సరసనే స్థానమివ్వడానికి ఔదార్యం, సహనం, సహానుభూతి అవసరం. కత్తిరించబడ్డ చరిత్ర పుస్తకాలు, జల్లెడ పట్టబడిన బడిపాఠాలు అన్ని నిజాలూ చెప్పవు. అన్ని దృక్కోణాలూ చూపవు. మనసు లోపల్లోపలికి వెళ్ళి తమ అస్ఠిమూలగతమైన వివక్షాధోరణులను, అహంకార ఆధిపత్య ధోరణులను ఎవరికివారు తరచిచూసుకోగలగడమే సమాజంలో సమూలమైన మార్పు తెచ్చేందుకు మొదటి అడుగు. ఆ ఆలోచన మెదిలే దిశగా, అలా చూసేందుకు వీలైన ప్రశ్నలను వివక్ష, దాస్యం, అణచివేతల కొలిమిలో కాలిపోయి ఇక వేరే దారితోచని కళాకారుల గళం ఆర్తిగా అడుగుతూనే ఉంటుంది. మనం నిర్లక్ష్యం చేసిన, ఇప్పటికీ చేస్తున్న అలాంటి గొంతులేవైనా మన చుట్టూనే ఉన్నాయా అని చెవులొగ్గి వినాల్సిన సందర్భమిది. మన లోపలి చీకటి కుహరంలో తెలియకుండానే దాగివున్న వివక్షాధోరణుల పైన ప్రతి ఒక్కరం నిజాయితీగా వెలుగు ప్రసరించుకోవాల్సిన తప్పనిసరి తరుణమిది. సాటిమనిషిని ద్వేషించడానికి వెయ్యి కారణాలెప్పుడూ ఉంటాయి. ప్రేమించడానికి ఒక్క కారణం వెతుక్కొనవలసిన సమయమిది.