రెండు కార్ల్ శాన్డ్‌బర్గ్ కవితలు

1. పొగమంచు

పొగమంచు
పిల్లిలా నింపాదిగా
నడుచుకుంటూ వస్తుంది.

పొంచి కూర్చుని
రేవునూ పట్టణాన్నీ మౌనంగా
పరికించి చూసి వెళ్ళిపోతుంది.

(Fog)

2. కిటికీ దగ్గర

కూర్చొని ప్రపంచాన్ని శాసించే ఓ దేవుళ్ళారా!
నాకు ఆకలినివ్వండి.
నాకు ఆకలినీ బాధనీ కోరికనీ ఇవ్వండి.
మీ పేరు ప్రతిష్టల బంగారు వాకిళ్ళనుంచి
నాకు అవమానాలూ ఓటములనిచ్చి
నన్ను వెలివేయండి. తుచ్ఛమైన
హేయమైన ఆకలినే నాకు ఇవ్వండి.

కానీ, నాకు కొద్దిపాటి ప్రేమను మాత్రం మిగల్చండి.
సాయంసమయానికి నన్ను పలకరించే ఓ గొంతుకనూ
సుదీర్ఘమైన వంటరితనాన్ని భగ్నంచేస్తూ
చీకటిలో నన్ను తాకే ఒక చేతినీ ఇవ్వండి.
పగటిరూపాల సాయంసంధ్యలో
సూర్యాస్తమయాన్ని కనబడనీకుండా
చీకటి తీరాల కావల నుంచి
ఒక తిరుగాడే చిన్ని పడమటి తార
ఆకాశంలో పొడిచింది.
కిటికీ దగ్గర చేరి
సంధ్యారూపాల పగటి నీడలను చూస్తూ
ఆ కొద్దిపాటి ప్రేమ రాకను తెలుసుకోనివ్వండి.

(At a Window)


విజయ్ కోగంటి

రచయిత విజయ్ కోగంటి గురించి: విజయ్ కోగంటి పేరుతో తెలుగు, ఇంగ్లీషులలో కవిత, కధా రచన, అనువాదాలు చేసే డా. కోగంటి విజయబాబు ఆంగ్ల అధ్యాపకుడు. దక్షిణాఫ్రికా లోని వివక్ష రాజకీయాలను తన రచనలలో ఖండించిన అటోల్ ఫ్యుగాడ్ నాటకాలపై సిద్ధాంత గ్రంధానికి పి.హెచ్డీ పొందారు. ఆంగ్ల భాష, సాహిత్య విషయాలపై పలు పత్రాల సమర్పణ, వ్యాసరచన చేసారు. విద్యార్ధి కేంద్రిత ఆంగ్ల బోధనా పద్ధతులపై అనేక మంది అధ్యాపకులకు కార్యశాలల ద్వారా శిక్షణ ఇస్తున్నారు. రెండు సార్లు అంతర్జాతీయ స్కాలర్షిప్ తో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉత్తమ అధ్యాపక పురస్కారం అందుకున్నారు. ‘ఇలా రువ్వుదామా రంగులు’ (2017) , ‘ఒక ఆదివారం సాయంత్రం ఇంకా ఇతర కవితలు’(2020)ఈయన కవిత్వ సంపుటులు. కేంద్ర సాహిత్య అకాడెమీ పురస్కార గ్రహీత శ్రీ దేవిప్రియ ప్రేమ కవితలను డా. పద్మజ తో కలిసి ఆంగ్లం లోనికి ‘స్లీపింగ్ విద్ ద రెయిన్ బొ’ గా అనువదించారు. డా. విజయ్ కోగంటి తన మొదటి కవిత్వసంపుటి ‘ఇలా రువ్వుదామా రంగులు’ (2017) కి శ్రీ నాగభైరవ సాహితీ పురస్కారం అందుకున్నారు. ...