చిన్నయ సూరి – గిడుగు రామమూర్తి

చిన్నయ సూరి, గిడుగు రామమూర్తి ఈ రెండు పేర్లూ ఆధునిక కాలంలో తెలుగు భాష చరిత్రలో చాలా పెద్ద పేర్లు. వీళ్ళిద్దరి రచనలూ ఏ సందర్భంలో ప్రచారం లోకి వచ్చాయో పరిశీలించడం, వాటివల్ల ఆధునిక వచన రచనకి లాభం కలిగిందా, నష్టం కలిగిందా? అన్న విషయం చర్చించడం, ఈ వ్యాసంలో ఉద్దేశించిన పని. సూరిగారి అభిప్రాయాలు, రామమూర్తి పంతులుగారి అభిప్రాయాలు ఒకదానికొకటి విరుద్ధంగా ఉంటాయి. ఈ వైరుధ్యం ఆధునిక కాలంలో గ్రాంథిక, వ్యావహారిక భాషా వైరుధ్యంగా వ్యక్తమయింది. చిన్నయ సూరిగారు గ్రాంథిక భాషావాదిగా, రామమూర్తిగారు వ్యావహారిక భాషావాదిగా మన మనస్సుల్లో స్థిరపడిపోయారు. ఈ మాటలు ఈ కాలంలో ప్రచారం లోకి వచ్చిన మాటలు. ఈ రెండు రకాల భాషలకీ వైరుధ్యం ఏర్పడిన రోజులలో అమలులో ఉన్న మాటలు ఒకసారి చూద్దాం. చిన్నయ సూరి ఉద్దేశంలో వ్యాకరణ యుక్తమైన భాష లాక్షణిక భాష (భాషకి లక్షణాన్ని చెప్పేది వ్యాకరణం కాబట్టి). లక్షణ విరుద్ధమైన భాష గ్రామ్యము. గిడుగు రామమూర్తి పంతులుగారి దృష్టిలో ఈ లాక్షణిక భాష పాత పుస్తకాల్లోనే కనిపిస్తుంది. పుస్తకాలకే పరిమితమైన భాష కాబట్టి అది గ్రాంథిక భాష. ఆయన కోరుకున్న భాషకి ఆయన పెట్టిన పేరు వ్యావహారిక భాష.

20వ శతాబ్దిలో భాష విషయంలో తీవ్రమైన వాగ్యుద్ధాలు జరుగుతున్నప్పుడు ఈ రెండు జంటల మాటలూ అమలులో వుండేవి.

లాక్షణికభాష X గ్రామ్య భాష
గ్రాంథిక భాష X వ్యావహారిక భాష

ఈ రెండు జంటల పేర్లలో రెండవ జంట పేర్లే ప్రచారంలోకి వచ్చి మొదటి జంట పేర్లు కనుమరుగయి పోయాయి. అంటే లాక్షణిక భాషావాదులు ఓడిపోయారని అర్థం.

ఈ కాలానికి పూర్వం తెలుగుకి వ్యాకరణాలు సంస్కృతంలో ఉండేవి. నన్నయ రాశాడని చెప్పబడుతున్న ఆంధ్రశబ్దచింతామణి (దీనికే నన్నయభట్టీయం అని పేరు), త్రిలింగశబ్దానుశాసనము, అహోబల పండితీయము, ఆంధ్రకౌముది, మొదలైనవి అన్నీ సంస్కృతంలో రాయబడ్డాయి.

తెలుగులో వచ్చిన ఒకే ఒక్క వ్యాకరణం కేతన ఆంధ్రభాషాభూషణం. దీనికి శాస్త్రగౌరవం కలగలేదు. 19వ శతాబ్దిలో కుంఫిణీ ప్రభుత్వం వాళ్ళు తమ ఉద్యోగస్తులకు తెలుగు నేర్పాలి అనుకున్నారు. కాబట్టి, ఇంగ్లీషులో రాసిన తెలుగు వ్యాకరణాలు వచ్చాయి. ఉదాహరణకి, విలియం కేరీ (William Carey, 1814), కేంప్‌బెల్ (A.D. Campbell, 1816), విలియం బ్రౌన్ (William Brown, 1820), మారిస్ (J.C. Morris, 1823), సి.పి.బ్రౌన్ (C.P. Brown, 1840) రాసిన వ్యాకరణాలు. వీళ్ళల్లో బ్రౌన్ ముఖ్యమైనవాడు. అప్పటి కచేరీల్లోనూ, కోర్టుల్లోనూ, అర్జీల్లోనూ, ఇతర పరిపాలనా వ్యవహారాల్లోనూ వాడుకలో వున్న తెలుగు భాష బ్రౌన్ వ్యాకరణంలో కనిపిస్తుంది. వేదం పట్టాభిరామశాస్త్రి లాంటి తొలినాటి పండితులు తెలుగులో రాసిన తెలుగు వ్యాకరణాలలో ఆ రకమైన భాష కనిపించదు. బ్రౌన్ వ్యాకరణంలో వున్న భాషకి ఒక పేరు లేదు. నిజానికి పండితులు ఆ భాషే మాట్లాడేవారు. కాని, ఇంగ్లీషు ఉద్యోగస్తులు తెలుగు నేర్చుకోవాలని ఈ పండితుల దగ్గరకి వెళ్తే వాళ్ళు ఈ తెల్లదొరలకి ఆంధ్రశబ్దచింతామణి చెప్పేవాళ్ళు. నిత్య వ్యవహారంలో వున్న భాష పండితుల దృష్టిలో వ్యాకరణం వున్న భాష కాదు. అంటే వాళ్ళ దృష్టిలో ఈ భాషకి వ్యాకరణం లేదు. వేరే మాటల్లో చెప్పాలంటే ఈ పండితులకి తాము మాట్లాడే తెలుగు ఎలా నేర్చుకున్నారో తెలియదు. వాళ్ళు నేర్చుకున్న భాషే వాళ్ళు నేర్పగలరు. అంటే వ్యాకరణమే నేర్పగలరు. (ఇప్పటికీ తెలుగు పరిస్థితి ఇదే.)

పండితుల పాఠాలతో విసిగిపోయిన బ్రౌన్ లాంటి తెల్లవాళ్ళు తమ అనుభవం లోకి వచ్చిన తెలుగుకి కావలసిన వ్యాకరణాలు. నిఘంటువులు వాళ్ళే రాసుకున్నారు. వ్యాకరణాలు, నిఘంటువులు తయారు చేసినందుకు కుంఫిణీ నుంచి వారికి చక్కటి పారితోషికం లభించేది కూడా. తెలుగు సొంతభాషగా మాట్లాడుతున్న తెలుగు వాళ్ళకి ఈ వ్యాకరణాలు అక్కరా లేదు, ఇంగ్లీషులో రాసిన అవి వీళ్ళకి అర్థమూ కాలేదు. ఈ పరిస్థితుల్లో మెకాలే’స్ మినిట్ (Macaulay’s minute) అని మనకందరికీ పరిచయమైన పత్రంలో ఉన్న కొత్త ఆలోచన ఇంగ్లీషు పాలకులకి నచ్చింది. మొత్తం పరిపాలన అంతా ఇంగ్లీషులోనే జరపాలని, తెలుగు వాళ్ళకే ఇంగ్లీషు నేర్పి వాళ్ళని ఒక రకమైన ఇంగ్లీషు వాళ్ళుగా తయారు చేయాలని ఈ కొత్త అభిప్రాయం సారాంశం. దీని ఫలితంగా ఇంగ్లీషు వాళ్ళు తెలుగు నేర్చుకోవడం మానేశారు. దానితో పాటు ఇంగ్లీషులో రాసిన తెలుగు వ్యాకరణాలు మరుగున పడిపోయాయి.


పద్ధెనిమిదవ శతాబ్ది చివరి కాలం నాటికి రాజులు దెబ్బతిని పోయారు. ఒకరి తరువాత ఒకరుగా కుంఫిణీ ప్రభుత్వ ప్రాబల్యానికి లొంగిపోయారు. కుంఫిణీ ప్రభుత్వం నయానా భయానా, ఆ రెండూ చెల్లకపోతే మోసానా ఈ రాజ్యాలకి సైనిక అధికారం లేకుండా చేసింది. తెలుగుదేశంలో కుంఫిణీ ప్రభుత్వానికి ఎదురు నిలిచి పోట్లాడిన ఆఖరి రాజ్యం విజయనగర రాజ్యం. ఒక పక్క ఫ్రెంచివాళ్ళు, ఇంకొక పక్క ఇంగ్లీషువాళ్ళు దక్షిణదేశంలో ప్రాబల్యం కోసం పోటీ పడుతూ ఉండగా తెలుగు ప్రాంతంలో స్థానికంగా వైరాలు ఉన్న విజయనగరం, బొబ్బిలి రాజ్యాలు, ఇంకా ఇతర చిల్లర రాజ్యాలు తమ తగాదాల పరిష్కారం కోసం ఒకరు ఇంగ్లీషు వాళ్ళని, ఇంకొకరు ఫ్రెంచి వాళ్ళని సహాయం కోరుతూ ఉండేవారు. ఫ్రెంచి వాళ్ళని ఓడించి స్థిరంగా ఇంగ్లీషు కుంఫిణీ అధికారాన్ని సంపాదించుకున్న తరవాత ఈ స్థానిక సంస్థానాలని ఒక దాని వెనక ఒకటి తమ ఆధీనం లోకి తెచ్చుకోవడానికి ప్రయత్నం చేశారు. ఆ చరిత్ర వివరంగా చెప్పడానికి ఇది చోటు కాదు కాని, విజయనగర రాజులు ఇంగ్లీషు కుంఫిణీ వాళ్ళ ఆధిపత్యాన్ని ఒప్పుకోకుండా పద్మనాభం అనే చోట యుద్ధం చేశారని చట్రాతి లక్ష్మీనర్సకవి రాసిన పద్మనాభ యుద్ధం చెప్తుంది. కానీ ఈ పద్మనాభ యుద్ధకావ్యం విజయనగర రాజుల ఓటమిని ఒప్పుకోదు. అలాగే బొబ్బిలి రాజులకి ఫ్రెంచి సేనాని బుస్సీకి మధ్య జరిగిన యుద్ధంలో బొబ్బిలి ఓడిపోయినా దిట్టకవి నారాయణకవి రాసిన రంగరాయ విజయం కూడా బొబ్బిలి ఓటమిని ఒప్పుకోదు. ఆ రాజులు వీరస్వర్గం పొందినట్లు గానో మరోవిధంగానో వారిని పైచేయిగా ఈ కావ్యాలు చూపిస్తాయి. ఈ కావ్యాలు చదివితే, సాంస్కృతికంగా ఈ రాజులు తమ ప్రపంచంలో నిర్మించుకున్న వాతావరణానికీ — ఇంగ్లీషు కుంఫిణీ ప్రభుత్వమూ బుస్సీ దొరా అమలు చేస్తున్న రాజకీయ, సైనిక వ్యూహాలకీ మధ్య పెద్ద అగాధం ఉందని మనకి బోధ పడుతుంది. తమ మనస్సుల్లో వీరత్వం, గౌరవం మొదలైన నమ్మకాలు ఒక పట్టాన ఈ రాజులు పోగొట్టుకోలేదు. దేశమంతా ఇంగ్లీషు కుంఫిణీ వాళ్ళ అధికారంలోకి వచ్చిన తరువాత కూడా చింత చచ్చినా చావని పులుపు లాగా వాళ్ళు తమ ఆత్మగౌరవాన్ని, మర్యాదల్ని, విశ్వాసాల్ని, ఎక్కడో ఒకచోట అట్టే పెట్టుకున్నారు. రాజ్యంలో సైనికాధికారం పోయిన తరువాత వీళ్ళు నిజానికి పన్నుల వసూలు చేసే జమీందార్లు మాత్రమే అయ్యారు. రైతుల దగ్గర నుంచి పన్నులు వసూలు చేసి, ఆ పన్నుల్లో కొంత భాగం ఇంగ్లీషు కుంఫిణీ ప్రభుత్వానికి, దాని తర్వాత దాని స్థానంలో వచ్చిన బ్రిటిష్ ప్రభుత్వానికి ఏటేటా చెల్లించి, వాళ్ళ అనుమతితో ఈ జమీందార్లు బతుకుతూ ఉండేవారు. తర్వాత తర్వాత ఈ పన్నుల్ని వసూలు చేసే పనిని బ్రిటిష్ ప్రభుత్వం వేలం వేసేది. ఆ వేలంలో రకరకాల కులాల వాళ్ళు పాట పాడి కొనుక్కుని జమీందార్లు అయ్యారు. అలాంటి జమీందార్లలో ఒకప్పుడు రాజ్యాధికారానికి అలవాటు పడ్డ వెలమ దొరలు, వాళ్ళతో పాటు ఎప్పుడూ రాజ్యాధికారం లేని బ్రాహ్మణులు, వైశ్యులు కూడా ఉన్నారు. వాళ్ళ వాళ్ళ జమీందారీ విస్తీర్ణాన్ని బట్టి, దాని మీద వచ్చే పన్నుల ఆదాయాన్ని బట్టి, బ్రిటిష్ ప్రభుత్వానికి చెల్లించవలసిన పన్నులు పోగా మిగిలిన ఆదాయాన్ని బట్టి, ఈ జమీందారులు పెద్దాచిన్నాగా రకరకాల స్థాయిల్లో ఉండేవారు (తూమాటి దోణప్ప, 1969).

రాజులు పోయిన తరవాత, అంటే దాదాపుగా 18వ శతాబ్దాంతానికి పండితులు, కవులు బతకడానికి ఆధారం లేని వాళ్ళయ్యారు. అందులో ఏ కొద్దిమందికో తాతలు, తండ్రులు సంపాదించిన ఆస్తులు ఉండేవి. అవి రైతులకి అమరకానికి ఇచ్చి ఆ రైతు పండించిన పంటలో కొంత భాగం వీళ్ళకివ్వగా, ఆ డబ్బుతో ఈ కవులు, పండితులు సుఖజీవనం చేస్తూ వుండేవాళ్ళు. పుస్తకాలు చదవడం, కవిత్వం అల్లడం వీళ్ళకి వచ్చిన ఒకే ఒక విద్య. ఆ విద్య పోషింపబడటానికి కవిత్వాన్ని ఆదరించేవాళ్ళు కావాలి, పాండిత్యాన్ని గౌరవించేవాళ్ళు కావాలి; ఆ దశలో ఈ కవులు, పండితులు పోషకుల్ని తయారుచేసుకోవలసిన పరిస్థితి ఏర్పడింది. జమీందార్లకి అర్థం కాకపోయినా పెద్ద పెద్ద సమాసాలతో పద్యాలు చెప్పి, వాళ్ళకి లేని ఆస్థానాలని కల్పించి, ఆ జమీందార్లకి మహారాజులని, కవిపోషకులని గౌరవకరమైన బిరుదులిచ్చి, వాళ్ళ ఆస్థాన కవులమని, ఆస్థాన పండితులమని పేర్లు తమకిచ్చుకుని ఈ కవులు, పండితులు బతుకుతుండేవాళ్ళు.

కాని, తెలుగులోనే పని చేస్తున్నవాళ్ళు ఒక ఇబ్బందిని ఎదుర్కోవలసి వచ్చేది. వాళ్ళు కవులే కానీ పండితులు కారు. పండితులు అవాలంటే సంస్కృతంలో వ్యాకరణము, అలంకారశాస్త్రము క్షుణ్ణంగా రావాలి. పాణినిని, పతంజలిని కంఠస్తం చేసినవాళ్ళు కాని, అభినవగుప్తుణ్ణి, జగన్నాథ పండితరాయల్ని ఎప్పుడు పడితే అప్పుడు ఉదాహరించగల వాళ్ళు కాని, తెలుగు కవుల్లో ఎక్కువమంది లేరు. పండితులు అంటే సంస్కృతంలో శాస్త్రాలు చదివిన వాళ్ళే. ఈ పరిస్థితుల్లో తెలుగు కవులకి పాండిత్య గౌరవం లేకుండా పోయింది. జమీందారుల దగ్గరికి వెళ్ళి తమకి వచ్చిన సంస్కృతాన్ని హడావిడిగా చూపించుకోగల శక్తి సంస్కృత పండితులకే ఉండేది. పెద్దగా చదువుకోని ఈ జమీందారులు సంస్కృత పండితుల హడావిడి చూసి ఉబ్బితబ్బిబ్బై పోయేవారు. వాళ్ళ ఎదుట నిలబడి, సంస్కృత పండితులతో పోటీ పడగలమని ధైర్యంతో మాట్లాడగలిగిన తెలుగు కవులు ఉండేవారు కారు. ఈ సంగతి చెళ్ళపిళ్ళ వెంకటశాస్త్రిగారి జీవితచరిత్ర చూస్తే బాగా బోధపడుతుంది. తిరుపతి వేంకట కవులు నిజానికి సంస్కృత పండితులు కారు. అందుచేతనే వాళ్ళు ఆశువుగా పద్యాలు చెప్పడం, వందమంది అడిగిన ప్రశ్నలకి, వాళ్ళు ఇచ్చిన సమస్యలకీ పద్యాల్లోనే సమాధానాలు, పూరణలు చెప్పి, ఆ పద్యాలన్నీ మళ్ళా వాళ్ళే ధారణ పట్టి తిరిగి మరుపు లేకుండా అప్పచెప్పడం — ఇలాంటి విద్యలవల్ల వాళ్ళు తెలుగుకి సంస్కృతం కన్నా ఎక్కువ ప్రాధాన్యాన్ని సంపాదించారు. కాని, అంతకు ముందు పరిస్థితి చూస్తే సంస్కృత విద్వాంసులదే పైచేయి. గీర్వాణం అంటే దేవతల భాష కానీ గీర్వాణం అంటే గర్వం, పొగరుమోతు తనం అనే అర్థాలు తెలుగులో వచ్చాయి. తిరుపతి వెంకట కవుల పుణ్యమా అని తెలుగుకి ఆస్థాన ప్రవేశము, సాహిత్య గౌరవము ఏర్పడ్డ తర్వాత ‘తెలుగు మీరిపోతోంది’ అనే మాట కూడా అందుకే వచ్చింది. తెలుగుకి, సంస్కృతానికి ఈ రకమైన పోటీ కొన్నేళ్ళ పాటు కొనసాగింది.

ఆంధ్రభాషామయం కావ్యం అయోమయ విభూషణం — (తెలుగు భాషతో నిండిన కావ్యం ఇనుముతో చేసిన నగ లాంటిది) అని సంస్కృత పండితులు ఈసడిస్తే,

సంస్కృతారణ్య సంచారి విద్వన్మత్తేభ శృంఖలం — (సంస్కృతమనే అడవిలో యధేచ్ఛగా తిరిగే పండితుడు అనే ఏనుగుని కట్టేసే గొలుసు ఇది) అని తెలుగు కవులు అనేవారుట. చాటు ప్రపంచంలో జ్ఞాపకం వుండే శ్లోకం ఈ వైరుధ్యాన్నే తెలియ పరుస్తుంది (వెల్చేరు, షూల్మన్, 1998).

చెళ్ళపిళ్ళ వెంకటశాస్త్రిగారి కన్నా ఒక 20, 30 ఏళ్ళు ముందుకి వెళ్ళి చూస్తే ఈ వివాదాలు ఇంకా బలంగా కనిపిస్తాయి. తెలుగు కవులకి, పండితులకి ఆసరాగా నన్నయ తిక్కనలు ఉన్న్నారు కానీ శాస్త్ర పండితులు ఎవరూ లేరు. జమీందార్ల పోషణలో వుండే తెలుగు కవులు, సంస్కృత పండితులు ఇలాటి అంతర్గత వైరుధ్యాలతో సతమతవుతూ వుండేవారు. తెలుగు వ్యాకరణం సంస్కృతంలో వుంది. అది సంస్కృత వ్యాకరణం ఉన్నంత విస్తృతంగా లేకపోయినా ఆంధ్రశబ్దచింతామణికి తెలుగు కవులు బలమైన ప్రాధాన్యాన్ని ఇచ్చేవారు. పండితులు అంటే సంస్కృత పండితులు అనే పేరే వున్నా తెలుగులో కవి అనే పేరుకి అంత గౌరవమూ సంపాదించి తెలుగులో తాము చెప్పే కవిత్వమంతా ప్రామాణికం చెయ్యడానికి, అంటే శాస్త్ర గౌరవాన్ని సంపాదించుకోవడానికి, తెలుగు కవులు ప్రయత్నించేవారు. ఇలాంటి వారిని గౌరవిస్తే తప్ప జమీందార్లకి కూడా సాహిత్యపోషకులు అనే బిరుదు వచ్చేది కాదు. కుంఫిణీ ప్రభుత్వం తెలుగుని ఏ రకంగా చూచినా జమీందార్లు మాత్రం ఆంధ్రశబ్దచింతామణి ఒప్పుకున్న తెలుగునే ఆదరిస్తూ వచ్చారు. తమ ఆశుకవిత్వంతో, శతావధానాలతో జమిందార్లనే కాకుండా డబ్బున్న విద్యావంతులని కూడా ఆకర్షించిన తిరుపతి వెంకట కవులు కూడా తమ కవిత్వాన్ని ఎదుర్కునే పండితులతో పోట్లాడి, తమ ప్రయోగాలు వ్యాకరణ రీత్యా సమర్ధించుకోవడానికి ప్రయత్నించి, చివరికి ‘తెనుగునకు వ్యాకరణ దీపము చిన్నది’ అనే మాట అన్నా, వ్యాకరణాన్ని మాత్రం వాళ్ళెప్పుడూ కాదనలేదు.

తెల్లదొరలు తెలుగు నేర్చుకోవడం మానేసి తెలుగువాళ్ళకే ఇంగ్లీషు నేర్పడం మొదలుపెట్టిన తరువాత తెలుగుకి ఏ దిక్కూ లేకుండా పోయింది. ఒక పక్క జమీందార్లు చెప్పుకోదగ్గ బలంగా యెక్కడా లేరు. ఇంకొకపక్క కుంఫిణీ వారు తెలుగు వాళ్ళకి ఇంగ్లీషు నేర్పే పనిలో పడ్డారు. ఇటువంటి పరిస్థితుల్లో కూడా ఆంధ్ర ప్రాంతంలో స్కూళ్ళలో తెలుగు చెప్పేవారు. వీళ్ళకోసం తెలుగు పండితులు వ్యాకరణాలు, కథల పుస్తకాలు రాశారు. ఆ వ్యాకరణాలలో ముఖ్యమైనవి: వేదం పట్టాభిరామశాస్త్రి – ఆంధ్ర వ్యాకరణము లేక పట్టాభిరామ పండితీయం, రావిపాటి గురుమూర్తిశాస్త్రి – తెనుగు వ్యాకరణం, పుదూరి సీతారామశాస్త్రి – ప్రశ్నోత్తరాంధ్ర వ్యాకరణము, వేదం వెంకటరమణశాస్త్రి – లఘువ్యాకరణము, తాడినాడ వెంకయ్య – ఆంధ్రవ్యాకరణం, ఇత్యాది. ఈ వ్యాకరణాలతో పాటు రావిపాటి గురుమూర్తి శాస్త్రి రాసిన విక్రమార్కుని కథలు, ఆయనే రాసిన పంచతంత్రం, దీనితో పాటు అందరికీ పరిచయమైన పెద్ద బాలశిక్ష (పుదూరి సీతారామశాస్త్రి), పాటూరి రామస్వామి రాసిన శుకసప్తతి కథలు పఠనపాఠనాలలో వుండేవి.

చిన్నయ సూరి

పరవస్తు చిన్నయ 1809లో, సాతానులు అనే చాత్తాద వైష్ణవ సంప్రదాయంలోని కుటుంబంలో పుట్టాడు. నిడదవోలు వెంకటరావుగారు రాసిన చిన్నయ సూరి జీవితము ప్రకారం చిన్నయ పదహారేళ్ళొచ్చేదాకా అక్షర జ్ఞానం లేకుండా పెరిగాడు. ఎప్పుడో ఒకసారి కంచి రామానుజాచార్యులుగారు చదువుసంధ్యలు లేని ఈ కుర్రవాణ్ణి తిడితే అప్పట్నించీ చదువు కోవడం మొదలు పెట్టి సంస్కృత వ్యాకరణ శాస్త్రంలో గట్టి పట్టు సాధించాడు. అప్పుడు పండితులకందరికీ కుంఫిణీ ప్రభుత్వమే పెద్ద ఆధారం. మున్షీలుగాను, ఇంగ్లీషువారికి తెలుగు పాఠాలు నేర్పించే ట్యూటర్లు గాను, కొద్దిమొత్తాలకే ఈ పండితులు ఉద్యోగాలు కుదుర్చుకొనేవారు. అప్పటి రాజకీయ పరిస్థితుల గురించి, పండితుల ఆర్ధిక పరిస్థితుల గురించి మనకు సరయిన సమాచారం లేదు. కాని, కుంఫిణీవాళ్ళు ఫోర్ట్ సెయింట్ జార్జి కోటలో ఏర్పరిచిన కళాశాలలో ఒక తెలుగు పండితుడికి ఒక మోస్తరు ఎక్కువ జీతంతో ఉద్యోగం ఇచ్చేవారని తెలుసు. (ఈ కళాశాల 1840లో మూసివేయబడి, ఆ తరువాత ప్రెసిడెన్సీ హైస్కూలుగా మారింది.) మొట్టమొదట ఆ ఉద్యోగంలో వేదం పట్టాభిరామశాస్త్రిగారు, ఆయనకు సహాయకుడిగా రావిపాటి గురుమూర్తి శాస్త్రిగారు నియమించబడ్డారు. ఏ ఉద్యోగాలు లేని పండితులకి ఈ రెండు ఉద్యోగాలు గొప్ప పదవుల కిందే లెక్క. కోటలో ఉన్న కాలేజీలో తెలుగు పండితుడికి నెలకు 70 రూపాయిలు జీతం ఇచ్చేవారు. (వేదం పట్టాభిరామశాస్త్రిగారికి 175 రూపాయిల జీతం వచ్చేదని నిడదవోలు వెంకటరావుగారు చెప్తున్నారు.) పుదూరి సీతారామశాస్త్రిగారు 1847లో రిటైరు అయిన తరువాత ఆ తెలుగు ఉద్యోగానికి కేవలం తెలుగు చదివిన వారే కాకుండా కొంత ఇంగ్లీషు కూడా వచ్చిన వాళ్ళకోసం కళాశాల వారు ఒక ప్రకటన చేశారు. దానికి చిన్నయ అర్జీ పెట్టుకున్నాడు. ఆ రోజుల్లో ఆ కళాశాలకు అధ్యక్షుడు ఎ.జె. అర్బత్‌నాట్. అర్జీ పెట్టుకున్న చిన్నయని ఒక పండిత సభవారు పరీక్షించాలి. ఆ పరీక్షలో నెగ్గినవాళ్ళకే ఆ ఉద్యోగం వస్తుంది. చిన్నయని, ఆ ఉద్యోగానికే అర్జీ పంపిన పురాణం హయగ్రీవశాస్త్రిని, పండితులు పరీక్షించి ఆ ఇద్దరిలో చిన్నయే సమర్ధుడు అని పండిత సభ వారు నిర్ణయించారు. అప్పటి కాలమాన పరిస్థితులు మనకి అంతగా తెలియవు కానీ పండితులలో కులభేదాలు చాలా ఎక్కువగా ఉండేవి. అందులోను, బ్రాహ్మణ కులంలో పుట్టని చిన్నయ మీద చిన్నచూపు ఉండేది (చూ: ఆరుద్ర, స.ఆం.సా. పు:28-29 సం.10, 1990; బూదరాజు రాధాకృష్ణ, పరవస్తు చిన్నయ సూరి, పు. 12, 1995). పండితులందరూ శాస్త్రి అనే బిరుదు పెట్టుకునేవారు. కేవలం వైదీకులే కాకుండా నియోగి అయినా రావిపాటి గురుమూర్తి కూడా శాస్త్రి అనే పేరే పెట్టుకున్నాడు. చిన్నయకి శాస్త్రి అనే బిరుదు ఎందుకు లేదు అని అర్బత్‌నాట్ అడిగాడట. తాను అబ్రాహ్మణుడవటం చేత ఆ బిరుదుకి తను అర్హుణ్ణి కానని చిన్నయ అన్నాడట. అయితే ఏ బిరుదు పెట్టుకుంటావు అని అడిగితే సూరి అనే బిరుదైతే తనకి నప్పుతుంది అన్నాట్ట. అర్బత్‌నాట్ ఆ ప్రకారమే అప్పటి వారి ఆచారం ప్రకారం సూరి అనే అక్షరాలతో చెక్కిన బంగారపు కడియం ఒక్కటి ఇంగ్లండు నుంచి తెప్పించి చిన్నయకి బహుమతిగా ఇచ్చాడట. చిన్నయ అప్పటినుంచీ చిన్నయ సూరి అనే పేరుతొ ప్రచారం లోకి వచ్చాడు. చిన్నయ సూరి బాలవ్యాకరణానికి పూర్వం సూత్రాంధ్రవ్యాకరణం అని, పద్యాంధ్రవ్యాకరణం అని, ఆంధ్రశబ్దానుశాసనం అని అనేక వ్యాకరణాలు రాసి పెట్టుకున్నాడు. కానీ తెలుగులో చివరికి బాలవ్యాకరణమనే పేరుతొ 1858లో ఒక వ్యాకరణం ప్రకటించాడు. ఇది చిన్నయ సూరి దృష్టిలో కేవలం చిన్న పిల్లల కోసం రాసిన వ్యాకరణం.

“మును మదుపజ్ఞం బగుచుం
దనరిన వ్యాకృతిని సూత్రతతి యొకకొంతం
దెనిఁగించి యిది ఘటించితి
ననయము బాలావబోధ మగు భంగిఁదగన్

తెనుఁగునకు శబ్దలక్షణ
మనయం బరయంగ వేడ్క నందినవారల్
తనరఁగ నీవ్యాకరణం
బున మూలంబయినకృతిని బోలఁ గనఁదగున్

అని చిన్నయ సూరి ఆ వ్యాకరణం చివర పద్యాల్లో రాసుకున్నాడు. (బాలవ్యాకరణము, దూసి రామమూర్తిశాస్త్రి వ్యాఖ్యానంతో, వావిళ్ళ, మద్రాసు, 1937.)