స్వాధీనపతిక, ప్రోషితభర్తృక

కావ్యరసములలో శృంగారమును రసరాజముగా లాక్షణికు లంగీకరించి యుండుట సర్వజనవిదితమే. ఇట్టి శృంగారరసమునకు ఆలంబనములు నాయికానాయకులు. నాయికానాయకుల యొక్క చక్షుష్ప్రీతి, మనస్సంగములవల్ల కలుగు మనోవికారమే రూఢమై శృంగారరసముగా పరిణమించును. దీనికి పరిసరములందలి సురభిళానిల సుందరోద్యాన చంద్రికాదిసన్నివేశములును, పరస్పరాభిహితమైన ఆహార్యాంగహార చేష్టాదులును ఉద్దీపకములుగా లాక్షణికులు గుర్తించినారు. ఇవన్నియు అనురక్తులైన నాయికానాయకుల అనుభవ మందున్నవే. వీనినే లాక్షణికులు సిద్ధాంతీకరించినారు. నాయికావిషయప్రసక్తిలో ఆసక్తికరమైన విషయము అష్టవిధశృంగారనాయికావర్గీకరణము. ఇది నాయికా తాత్కాలిక మనోధర్మవర్గీకరణమే కాని, నాయికాప్రకృతివర్గీకరణము కాదు. అనగా ఒకే నాయిక తత్తత్కాలమనోధర్మము ననుసరించి, ఈ అష్టవర్గములలో ఏదో యొక వర్గమునకు చెందియుండుననుట. కావ్యాలంకారసంగ్రహములో ఈ శృంగారనాయికల లక్షణము లిట్లు చెప్పబడినవి:

సీ.వరుఁడు కైవసమైన వనిత స్వాధీనభ
          ర్తృక
; ప్రియాగమవేళ గృహముఁ,దనువు
     సవరించు నింతి వాసకసజ్జ; పతిరాక
          తడవుండ నుత్కంఠఁ దాల్చునింతి
     విరహోత్క; సంకేత మరసి, నాథుఁడు లేమి
          వెస నార్తయౌ కాంత విప్రలబ్ధ;
     విభుఁడన్యసతిఁ బొంది వేఁకువ రాఁ గుందు
          నబల ఖండిత; యల్క నధిపుఁ దెగడి

గీ. అనుశయముఁ జెందు సతి కలహాంతరిత; ని
      జేశుఁడు విదేశగతుఁడైనఁ గృశతఁ దాల్చు
      నతివ ప్రోషితపతిక; కాంతాభిసరణ
      శీల యభిసారికాఖ్యయై చెలువు మెఱయు.

(అనుశయము=పశ్చాత్తాపము)

పై పద్యములో ఈ అష్టవిధనాయికల పేర్లు సాంద్రమైన (Bold)అక్షరములతో గుర్తింపబడినవి. కడచిన రెండు ఈమాట సంచికలలో వాసకసజ్జికా, విరహోత్కంఠితా, ఖండితా, కలహాంతరితాలక్షణములను కొంత వివరించినాను. ఇప్పుడు స్వాధీనపతికా, ప్రోషితభర్తృకా అను నాయికలను గుఱించి వివరించి, వారి మనోధర్మములను ప్రతిబింబించునట్లుగా నేను వ్రాసిన గీతములను శ్రవ్యమాధ్యమములో ప్రదర్శింతును. ఇదియే ఈ వ్యాసము యొక్క ఆశయము.

స్వాధీనపతిక

యస్యా రతిరసాస్వాదముదితో దయితస్సదా|
సదైవాస్తే తయా సాకమేషా స్వాధీనభర్తృకా||
ఉద్యాన సలిలక్రీడా కుసుమాపచయక్రియా|
ఆపానకేళిః శక్రార్చా వసంతమదనోత్సవాః||
స్వాధీనభర్తృకాయాః స్యుర్విలాశ్చైవమాదయః|

అని శారదాతనయుని భావప్రకాశికలో స్వాధీనపతికాలక్షణము. రతిరసాస్వాదనచే ముదితుడైనవాడును, ఎల్లప్పుడు తనతో సహచరించు వాడును గల దయితుడు (భర్త) కలిగినది స్వాధీనపతిక, అని దీని కర్థము. ‘అట్టినాయిక ఉద్యానవన విహరణమందును, జలక్రీడయందును, కుసుమాపచయమందును, పానగోష్ఠియందును ఆసక్తురాలై యుండును. ఇంద్రపూజయందును, వసంతమదనోత్సవముల యందును నుత్సుకురాలై యుండును’ అని తన కధీనుడై తన కనుసన్నలలో మెలగు పతి గల యామెయొక్క విలాసక్రియలు పైశ్లోకములలో పేర్కొన బడినవి. గమనిక: ఇచ్చట భర్తృపదమునకు అనుకూలుడైన ప్రియుడని అర్థము చెప్పవలెను. ఏలనన లక్షణగ్రంథములలోను, కావ్యములలోను స్వీయకే కాక పరకీయాదులకు గూడ స్వాధీనపతికా, ప్రోషితపతికావస్థలు చెప్పబడినవి.
భరతుని నాట్యశాస్త్రములో స్వాధీనపతికాలక్షణ మిట్లున్నది:

సురతాతిరసైర్బద్ధో యస్యాః పార్శే తు నాయకః|
సాన్ద్రామోదగుణప్రాప్తా భవేత్ స్వాధీనభర్తృకా||

నాయకుడు సురతాతిరసబద్ధుడై, తన చెంతనుండగా నధికమైన హర్ష-సౌభాగ్య-అభిమానాదులను కలిగియుండునది స్వాధీనపతిక అని దీని కర్థము. ‘స్వాధీనః భర్తా పతిర్వా యస్యాః సా స్వాధీనభర్తృకా పతికావా (=తన కధీనుడైన భర్త లేక పతి గల్గిన స్త్రీ)’ అని స్వాధీనభర్తృక లేక పతికకు వ్యుత్పత్తి. కావ్యాలంకారసంగ్రహములోని ‘వరుఁడు కైవసమైన వనిత స్వాధీనభర్తృక’ అను రామరాజభూషణుని నిర్వచనము దీనికి సరిపడుచున్నది. ఇందులో ‘సదా=ఎల్లప్పుడు’ అను కాలనిర్దేశము లేదు. ఇదియే సరియైనదిగా దోచుచున్నది. ఏలనన స్వాధీనపతికాదిశృంగార నాయికాలక్షణములు తత్కాలావస్థాభేదములే కాని శాశ్వతస్వభావలక్షణములు కావు. అందుచేత దక్షిణనాయకుడు సైతము తత్కాలములో నాయికకు పరిపూర్ణముగా వశుడై యుండవచ్చును. అట్టి నాయిక స్వాధీనపతిక కావచ్చును. శ్రీకృష్ణుడు దక్షిణనాయకుడైనను జయదేవుని గీతగోవిందములో రాధకు విధేయుడైనవానిగనే చిత్రింపబడినాడుగదా! పారిజాతాపహరణములోను

శా. ఏయేవేళల నేసరోజముఖి యేయేలీలలం గోరుఁ దా
     నాయావేళల నాసరోజముఖి నాయాలీలలం దేల్చి యే
     చాయం జూచినఁ దానయై మెలఁగుచున్ సౌఖ్యాబ్ధి నోలాడు భో
     గాయత్తుండయి పెక్కురూపముల మాయాకల్పనాచాతురిన్

అని ముక్కుతిమ్మన శ్రీకృష్ణుని మాయాశక్తిచేత బహురూపములు ధరించి, అష్టమహిషుల కనుకూలుడైన భర్తగా వర్ణించినాడు. వారందఱి కతడు స్వాధీనుడైన పతిగనే భాసించినాడు. అందుచేతనే అతడు పారిజాతమును రుక్మిణి కొసగెనను వార్త విన్నంతనే సత్యభామ అతనిని పరాధీనుడైన వానిగా దలంచి నిందించినది. అతడు తన కధీనుడుగా నుండినప్పుడు ఉభయులు నెరపిన విలాసక్రియల నీక్రిందివిధముగా స్మరించుకొని పరితపించినది:

సీ. కలలోన నైన నవ్వులకైన నామాట జవదాఁట వెఱచునో చంద్రవదన!
     యేపదార్థంబు నాయెదుటఁ బెట్టక మున్న యెవ్వారి కొసఁగడో యిగురుఁబోడి!
     చెలులు నాతో నేమి చెప్పుదురో యని లంచంబు లిచ్చునో చంచలాక్షి!
     తోడిచేడియలు నాతోడివంతులకు రా సయిరింపఁజాలఁడో సన్నుతాంగి!

తే. యరమరలు లేని కూరిమి ననఁగి పెనఁగి,
     కొదలు దీఱని కోర్కులఁ గూడి మాడి,
     కపట మెఱుఁగని మమతలఁ గలసి మెలసి,
     యున్న విభుఁడిట్లు సేయునే యోలతాంగి! – పారిజాతాపహరణము 1-94.

పై పద్యములో నాయిక కధీనుడైన పతియొక్క స్వభావము చక్కగా వర్ణింపబడినది. ఇందులో అనగి పెనగి, కూడి మాడి, కలసి మెలసి యను జాతీయముల ప్రయోగముతో ‘ముద్దుపలుకుగా’ నీపద్యమును ముక్కుతిమ్మన తీర్చిదిద్దినాడు. అట్లు పరస్పరాధీనులై వారు కావించిన కేళీవిలాసములను సత్యభామ యీక్రిందివిధముగా గుర్తుచేసికొనుచున్నది:

సీ.కృతకాద్రికందరాకేళీ నిగూహనవేళా పరస్పరాన్వేషణములు,
     పోషితమాధవీపున్నాగపరిణయోత్సవ కల్పితానేకసంభ్రమములు,
     చాతురీనిర్జితద్యూతపణాదాన కలితచేలాంచలాకర్షణములు,
     సాయంసమారంభచక్రవాకద్వంద్వ విరహావలోకన విభ్రమములు,

తే. సాంద్రతర చంద్రికాకేళి చంక్రమములు,
     విధుశిలామయవేదికా విశ్రమములు,
     ఫలకచిత్రిత నిజరూప భావనములు,
     మఱచెనో కాక రుక్మిణిమాయఁ దగిలి. – పారిజాతాపహరణము 1-95.

వివరణ: పూర్వము ధనికుల ప్రమదావనములలో కృత్రిమశైలము లుండెడివి. ఇట్టి శైలకందరములలో దాగుడుమూతలాడుటలు, ఉద్యాన వనములో బెంచుకొన్న బండిగురివెందతీగకు పొన్నచెట్టునకు చేసిన వివాహసంరంభములు, పణము లొడ్డి యాడిన అక్షక్రీడల అవసానమున పణము చెల్లింపుమని చేలాంచలములను బట్టి లాగుటలు, సాయంకాలమున ఆసన్నమగు విరహము నెంచి తమిదీర్చుకొనుచున్న చక్రవాకదంపతులను సానురాగముగ జూచుటలు, పండువెన్నెల రాత్రులందలి వెన్నెలయాటలు, (చల్లనైన) చంద్రకాంత శిలావేదికలందు (ఒరసికొని కూర్చుండి) విశ్రమించుటలు, పరస్పరరూపములు పలకలయందు జిత్రించుకొని, వాని యందచందములను సవిలాసముగా భావించుటలు – ఇవన్నియు మున్ను పరిపూర్ణముగ శ్రీకృష్ణుడు తనకు వశుడై యున్నప్పుడు, అనగా తాను స్వాధీనపతికయైనప్పుడు, చేసినట్టి విలాసకార్యములు – ఇప్పుడు రుక్మిణి మాయలోబడి వాటి నన్నిటిని విస్మరించుచుండెనా యని సత్యభామ పలవించినది.

అమరుక, గీతగోవింద, పుష్పబాణవిలాసాదిగ్రంథములలో ఇట్టి నాయికానాయకుల స్వభావముల చిత్రించు అందమైన ఉదాహరణము లెన్నియో యున్నవి. పుష్పబాణవిలాసములోని ఈక్రింది శ్లోకమును చూడుడు:

శేతే శీతకరోఽమ్బుజే, కువలయద్వన్ద్వాద్వినిర్గచ్ఛతి!
స్వచ్ఛా మౌక్తికసంహతి, ర్ధవళిమా హైమీం లతామఞ్చతి||
స్పర్శాత్ పఙ్కజకోశయో రభినవా యాన్తి స్రజః క్లాన్తతామ్|
ఏషోత్పాతపరమ్పరా మమ సఖే! యాత్రాస్పృహాం కృన్తతి||

ఈ అందమైన శ్లోకమునకు నా భావానువాదము:

ఉ. నీరజవైరి యబ్జమున నిద్రను బూనె, సుమౌక్తికావళుల్
     కైరవయుగ్మమందొదవె, కాంచనవల్లిక తెల్లనయ్యె, నం
     భోరుహకుట్మలంబులను బూలసరంబులు దాఁకి మ్లానతం
     గూరెను, దుర్నిమిత్తములు గూడఁగ నిట్టులఁ బోవమానితిన్.

వివరణ: నాయికావిధేయుడైన నాయకు డొకడు హఠాత్తుగా తన ప్రయాణమును మానుకొన్నాడు. దానికి కారణ మేమి యని ప్రశ్నించు తన సఖునితో నతడిట్లు పలుకుచున్నాడు. శీతకరః=చంద్రుడు, అమ్బుజే=కమలమునందు, శేతే=శయనించుచున్నాడు; స్వచ్ఛా మౌక్తిక సంహతిః =స్వచ్ఛమైన ముత్యముల సమూహము, కువలయద్వన్ద్వాత్=కలువలజంటనుండి, వినిర్గచ్ఛతి=వెలువడుచున్నది; హైమీం లతామ్ = బంగారుతీగెను, ధవళిమా=తెల్లదనము, అఞ్చతి=పొందుచున్నది; పఙ్కజకోశయోః=పద్మకుట్మలములయొక్క, స్పర్శాత్=తాకిడివల్ల, అభినవా స్రజః = (అప్పుడే కూర్చిన) పూలదండలు, క్లాన్తతామ్=వాడుటను, యాన్తి=పొందుచున్నవి; సఖే=ఓ మిత్రమా! ఏషోత్పాతపరమ్పరా = ఈ దుర్నిమిత్తముల వరుస, మమ =నాయొక్క, యాత్రాస్పృహాం=ప్రయాణేచ్ఛను, కృన్తతి= ఛేదించు (చంపు)చున్నది.

కమలవిరోధియైన చంద్రుడు కమలములోనే పరుండుట, కలువలజంటనుండి మంచిముత్తెములు రాలుట, (హఠాత్తుగా ) బంగారుతీగె తెల్లవాఱుట, పద్మకుట్మములను తాకగనే క్రొత్తనైన పూదండలు వాడిపోవుట, ఇట్టి దుశ్శకునములు పొడసూపినవి. అందుచేత శ్రేయస్కరము కాదని నాప్రయాణము నాపికొంటిని. అనగా, నాయకుని ప్రయాణవార్తను వినగానే స్వాధీనపతిక కావున నాతని విడిచి యుండలేని నాయిక తన చేతిలో మోము నానించుకొని సంతాపమును బూనినది. అనగా పద్మమువంటి ఆమె చేతిలో చంద్రునివంటి యామె ముఖము విశ్రమించినది. ఇది యొక సంతాపసూచకభంగిమ. కలువలజంట(వంటి ఆమె కన్నుల)నుండి మంచిముత్తెములు (అనగా శోకబాష్పములు) రాలినవి. బంగరుతీగె (వంటి ఆమె మైదీగె హఠాత్తుగా) పాలిపోయినది. (విరహతాపముచే వేడెక్కిన యామె తనువందలి స్తనములనెడి) కమలపుమొగ్గలను తాకగనే మెడలో వేసికొన్న క్రొత్తనైన పూదండలు వాడిపోయినవి. ఇట్లు తన యెడబాటువార్త ఆమెను అత్యంతఖిన్నురాలిని జేయుటచేత ప్రయాణము నాపికొంటి నని నాయకుడు తెల్పుచున్నాడు. నాయికకు పరిపూర్ణముగా వశుడైన నాయకునికిని, అట్లు స్వాధీనపతిక యైన నాయికకును నిది మంచి ఉదాహరణము.