మాధుర్యేణ – ద్విగుణాశిశిరం – వక్త్రచంద్రం వహంతీ
వంశీవీథీ – విగలదమృత – స్రోతసా సేచయంతీ
మద్వాణీనాం – విహరణపదం – మత్తసౌభాగ్యభాజం
మత్పుణ్యానాం – పరిణతిరహో – నేత్రయో సమ్నిధత్తే
(లీలాశుక శ్రీకృష్ణకర్ణామృతము – 1.75)
మధురమధురమై -మసృణతరమై – మాధవాననము నిండెన్
నదిగా మురళీ – నాదసుధలన్ – నయముగా మున్గిపోతిన్
పదములతనివే – వఱలె నాల్కన్ – పరమభాగ్యమ్ము గాదా
యిది నా పుణ్య – మ్మెనగ కన్నుల – నిట్లు వానిన్ గనంగన్
మందం మందం – మధురనినదై – ర్వేణుమాపూ రయంతం
వృందం వృందా – వనభువి గవాం – చారయంతం చరంతం
ఛందోభాగే – శతమఖమఖా – ధ్వంసినాం దానవానాం
హంతారం తం – కథయ రసనే – గోపకన్యా భుజంగం (2.05)
మందమ్ముగ దా – మధుర రవముల్ – మంద్రమై నూదు మురళిన్
బృందావనిలో – ప్రియముగను గో – బృందమున్ గాచుచుండున్
ఛందమ్మున దు – ర్జనుల ఖలులన్ – జంపెనం చందురే యా
నందాత్మజు కథ – నాకు జెప్పవె – నాల్కతో నందవనితా
పాణౌ వేణుః – ప్రకృతిసుకుమా – రాకృతౌ బాల్యలక్ష్మీః
పార్శ్వే భాలః – ప్రణయసరసా – లోకితాపాంగలీలాః
మౌలౌ బర్హం – మధురవదనాం – భోరుహే మౌగ్ధ్యముద్రేऽ
త్యార్ద్రాకారం – కిమపి కితవం – జ్యోతిరన్వేషయామః (3.30)
చేతన్ వేణువు – చెలువు రూపము – చెన్నుగా సౌకుమార్యం
బాతని ప్రక్కన – ప్రణయభరితం – బైన లోలాక్షి బృందం
బా తలపైనన్ – బర్హిపింఛం – బంబుజానన మృదుత్వం
బీ తరుణమ్మున – వెదకుచుంటిమి – వెల్గు చిందించువానిన్
ముగింపు
పింగళ ఛందస్సు, నాట్యశాస్త్రములో ఒక బీజముగా మాత్రమే ఉన్న మందాక్రాంత వృత్తానికి ఒక కల్పవృక్షరూపమిచ్చి ఆ చెట్టులో ఎనలేని మందారకుసుమాలను పరిమళింపజేసిన మహాకవి కాళిదాసు. ఆ తావి నాటినుండి నేటివరకు భూగోళమంతా నిండియున్నది. ఈ వ్యాసము చదివిన పాఠకులు, కవులు, పండితులు మందాక్రాంతవృత్తమును, దాని ఆధారముగా సృష్టియైన మందాకిని జాతి పద్యాన్ని తెలుగు భాషలో విరివిగా ఉపయోగిస్తే నేను ధన్యుడినవుతాను. క్రింద ఒక మందాక్రాంతముతో, ఒక మందాకినితో ఈ వ్యాసాన్ని ముగించుచున్నాను.
వాణిశ్రీదా – వరము లొసగన్ – వందన మ్మిత్తు దేవీ
శ్రేణీఛందః – శిఖర సుకరా – చిన్మయా బ్రహ్మజాయా
ప్రాణత్రాణా – ప్రణవపద స-త్పద్యకావ్యాంబురాశీ
వీణాపాణీ – విమలహృదయా – వేదశాస్త్రార్థకారీ
ప్రేమనినాదము – ప్రియుల చెవులన్ – వేదవాక్కై వినబడున్
ప్రేమ నిజముగా – పెన్నిధి గదా – పేదకును మారాజుకున్
ప్రేమకు వేఱొక – పేరు దైవము – ప్రియముగా మాటాడుమా
ప్రేమాయణమే – విశ్వవీధిన్ – వెలుగు ధ్యేయమ్ము గాదా
(సృజనాత్మక వ్యాసాలను చదివి ఆనందిస్తే చాలదు. అందులోని బాగోగులను విమర్శించి రచయితకు ప్రోత్సాహమిస్తే అది రచయితకు, కవికి నవపథములో నడవడానికి చేయూత నిచ్చినట్లుంటుంది. నేను మందాక్రాంతముపై సందేశములు పంపినప్పుడల్లా స్పందించి నాకు చక్కని ప్రోత్సాహము నిచ్చిన శ్రీమతి లైలా యెర్నేని గారికి ఈ వ్యాసమును కానుకగా యిస్తున్నాను.)
గ్రంథసూచి
- Bahadur Chandra Chhabra – అభిలేఖసంగ్రహః – An anthology of Sanskrit Inscriptions – Sahitya Akademi – New Delhi – 1964.
- V.W. Karambelkar – Select Sanskrit Inscriptions – 1959.
- R.C. Majumdar – Ancient Indian colonies in the Far East – Champa – Punjab Sanskrit Book Depot – Lahore – 1927.
- క్షేమేంద్ర – పుల్లెల శ్రీరామచంద్రుని వ్యాఖ్య – ఔచిత్యవిచార, కవికంఠాభరణా, సువృత్తతిలక – సురభారతీ సమితి – హైదరాబాదు – 1983.
- రామవరపు శరత్ భాబు, శొంఠి శారదాపూర్ణల వ్యాఖ్య – మేఘదూతం – ఆనందలహరి – విశాఖపట్టణము – 1988.
- రాయప్రోలు సుబ్బారావు – దూతమత్తేభము – తిరుమల తిరుపతి దేవస్థానం ప్రెస్ – తిరుపతి – 1957.
- శంఖవరం సంపద్రాఘవాచార్య – మేఘసందేశము – నవోదయ పబ్లిషర్స్ – విజయవాడ – 2004.
- బాపట్ల రాజగోపాలశర్మ – తెలుగు సందేశకావ్య సమాలోచనం – గాయత్రి ప్రచ్రణలు – విజయవాడ – 1989.
- కోరాడ రామచంద్రశాస్త్రి – వ్యాఖ్య రామకృష్ణయ్య – ఘనవృత్తము – కోరాడ లక్ష్మీ మనోహరముచే ప్రచురితము – మచిలీపట్టణము – 1917.
- పింగలాచార్య – ఛందశ్శాస్త్రం – పరిమల పబ్లికేషన్స్ – ఢిల్లీ – 1994.
- భరతముని – నాట్యశాస్త్ర – English translation by Manmohan Ghosh – Asiatic Society of Bengal – Calcutta – 1951.
- వరాహమిహిర విరచితా బృహత్సంహితా – హిందీ వ్యాఖ్య అచ్యుతానంద ఝా శర్మ – చౌఖంభా విద్యాభవన్ – వారాణసి – 1959.
- అశ్వఘోషుని సౌందరనందము – సంపాదకుడు హరప్రసాద్ శాస్త్రి – Royal Asiatic Society of Bengal – Calcutta – 1939.
- Nagavarma’s Canarese Prosody – F. Kittel – Basel Mission Book and Tract Depository – London – 1875.
- మల్లియ రేచన – కవిజనాశ్రయము – వావిళ్ళ రామస్వామి శాస్త్రులు అండ్ సన్స్ – మదరాసు – 1950.
- జయదామన్ – సంపాదకుడు హరి దామోదర వేళంకర్ – హరితోషమాలా – బొంబాయి – 1949.
(నా అభ్యర్ధన మేరకు, యక్షుని చిత్రాలని గీసి అందించిన శ్రీ మాగంటి వంశీమోహన్‌కి నా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను – మోహన.)