విధ్వంసం

తెల్లారితే కన్నెమ్మకి పెండ్లి. కన్నెమ్మ గుడిసె దగ్గర పెండ్లి జోరు ఏమీ కనబడటం లేదు. కన్నెమ్మ, ఆమె అమ్మి కురువమ్మ ఎప్పటి తీరుగానే గుడిసె ముంగిట కూర్చొని వున్నారు. చుట్టు పక్కన ఉన్న ఆడోళ్ళు కూడా వచ్చి కూర్చుని ఆమాటా ఈమాటా మాట్లాడుతున్నారు. వాళ్ళు అడిగేదానికంతా కురువమ్మే నోరు తెరిచి జవాబు చెబుతోంది. కన్నెమ్మ ఎప్పటి లాగానే అన్యం పుణ్యం తెలీని పిల్లలా కూర్చోనుంది. ఆమెకి ఇప్పుడు ఇరవై నిండింది. ఈడుకొచ్చి ఇప్పటికి నాలుగేండ్లయింది. ఈ నాలుగేండ్ల బట్టి కురువమ్మ ఒక్క తీరుగ పోరుతూనే వుంది. ఆమె సోబతు ఈడు కొచ్చిన పిల్లలందరికి ఒక్కేడు, రెండేండ్లలో పెండ్లిళ్ళు అయి వెళ్ళి పోయారు. వాళ్ళంతా ఇప్పుడు చంకన ఓ బిడ్డ, కడుపున ఒక బిడ్డ అన్న తీరున ఉన్నారు. కన్నెమ్మ మాత్రమే పెండ్లి కాకుండా ఇంటి దగ్గర పడి ఉంది. అది చూసినప్పుడల్లా కురువమ్మకి కడుపు మండిపోతుండేది.

కురువమ్మకి పెండ్లి అయ్యిన నెలలోనే కన్నెమ్మ కడుపున పడింది. ఆమె పెనిమిటి కాలయ్యకి సంబరం పట్టలేదు. కాని కన్నెమ్మ పుట్టక ముందే, చంటిదాని మొఖం చూడక ముందే కాలయ్య చచ్చిపోయాడు. కాని ఇప్పుడే చచ్చినట్లుందని కురువమ్మ మాటకోసారి అనుకుంటూ గుబులు పడుతుండేది. కన్నెమ్మ ఈడుకొచ్చిన దగ్గర్నుండీ, కాలయ్య జ్ఞాపకాలతో కురువమ్మకి ప్రతిరోజూ మనసు కష్టమయ్యేది.

“ఎవరనుకుంటిమి గట్ల పోతడని. ఎప్పటి సంది బాయి తవ్వడానికి ఎల్లిండు. నెలలు నిండినయి. జర బద్రంగా ఉండమని తనతో చెప్పిఎల్లినోడే. మద్యానం సరిగ్గా కిరస్తానోల్ల గుడిలో పన్నెండు గంటలు కొట్టేకాడికి, ఆణ్ణి పీనుగ లెక్క తెచ్చి పడేసిండ్రు. బాయిలో బాంబు పెట్ట బోయిండట. గట్లనే వాణ్ని తీసి పారేసిందట. బాంబు పేలి సచ్చిండో లేక దెయ్యం కొట్టి కాలం చేసిండో ఏమీ తెలియకపాయే. నన్ను బద్రంగా ఉండమని వెళ్ళినోడు వాడే లేకుండా పోయిండు. కడుపులో బిడ్డ మాత్రం లేకపోతే అప్పుడే నేను కూడా పానం తీసుకొని వాడితోనే పోయుండేటి దాన్ని. కడుపులో బరువుపెట్టి పోయిండు. దాని కోసం గిట్ల పానాన్ని చేతుల పట్టుకొని తిరుగుతున్నా. ఇగ ఆమెని ఒకయ్య చేతిలో మంచి తీరుగ పెట్టితే గదే చాలు.”

“సర్లె సర్లె. అన్నీ మంచిగ జరుగుతయి. నువ్వూర్కెనె లొల్లి పెట్టుకుంట కూసోకు. మేమంతా ఇప్పుడు లేమా ఏందీ? అందరం కలిసి జేసినమంటే మంచిగ అయితది. కురువీ, నీకు గుబులెందుకైతదే. పోయి జరంత తిని పండుకో. మేం పొద్దుగాలనే వస్తం. మరిడెమ్మ గుడికే కదా రమ్మని చెప్పిండ్రు. అందరం కలిసే పోదం. సరేనా! ఒసే కన్నమ్మా! అమ్మిని తీస్కపోయి జర గంజి కాచి తాపించు.” పక్కింటి ముత్తమ్మ ధైర్యం చెప్పింది.

కన్నెమ్మ పెండ్లి గురించి ఊరంతా ఒకటే ముచ్చట. ‘ఎంతయినా కురువమ్మ గట్టిదేనే. మొగుడు బోయినంక గూడ ఒంటిగనే పిల్లను పెద్ద చేసింది. కన్నెమ్మకి ఏం తక్కువాయె? సూడనిక్కి సక్కగుంటది. ఇన్నేళ్ళ సంది ఒక్క పోరగాడు కూడా పిల్లని అడగడానికి రాలేదు కందా. పాపం ఆ పోరి తన పనేదో తను జూసుకుంటున్నమా, గంజి నీళ్ళు తాగినమా అన్నట్లు ఉండిపాయే. పిల్ల ఉన్న సప్పుడే తెలియక పాయె. నోరనేది లేకుండె. ఆమె కూడా పెండ్లి చేసుకుని పోతె, కురువమ్మ ఒంటిగ బిక్కు బిక్కుమంటూ బతకాలె.”

“అక్కోవ్! నువ్వు చెప్పనీకి ఏముంది? ఈ కాలంలో ఏ పోరగాడు ముక్కుతీరు, ముకం తీరు చూసి లగ్గం జేసుకుంటున్డు? ఎంత బంగారం పెడతాండరు? సామాన్లు ఏమేమి ఇస్తాండరు అని దెయ్యం లెక్క తిరుగుతాండరు. కాస్త ఉన్నోల్లుగా ఉంటేనే పిల్లను అడిగి వస్తున్నరు. లేనోల్లు గిట్లనే పడి ఉంటిరి. గిప్పుడు కూడ కన్నెమ్మని పిల్ల అడిగి వచ్చింది ఎవరనుకుంటున్నవు? ఒక ముసలాడే. కొంచం కూడా సిగ్గు శరం లేకుండా అరవై ఏండ్ల ముసలోడు ఇరవై ఏండ్ల పిల్లను పెళ్ళి చేసుకుంటానని బయలు దేరి వచ్చిండు.”

“నిజమానె నువు జెప్పేడిది?”

“మల, అబద్దం చెప్తనా ? ఏదో గవర్మెంటు ఉజ్జోగంల నుంచి రిటైరయినడంట. పెండ్లం సచ్చి ఇంకా సమత్సరం కూడా కాలేదంట. గంతలనే ఇంకో పెండ్లం కావాలని వస్తుండు.”

“పిల్లలు గిట్ల ఎవరూ లేరంటనా?”

“ఎందుకు లే? మంచిగున్నరు. ఇద్దరు పోరీ లిద్దరు పోరగాల్లు. వొక్కనిగ్గూడ పెండ్లి గాలే. అందరూ పెండ్లీడు కొచ్చిన్రంట. ఇంటామె మంచిగ ఉంటే, ఈల్లందర్నీ చక్కగ చూస్కుంటుండె. పాపం కాన్సరొచ్చి పోయిందంట. సిత్రం తెల్సునా, ఆ యమ్మి సావు బతుకుల మద్దె ఉన్నప్పుడే వీడు పిల్లను సూడనిక్కి బయలుదేరిండంట. ఆమె సావనికి ముందు పెనిమిటితో ‘నువ్వు ఎన్ని లగ్గాలైనా చేసుకో కానీ నా పిల్లల్ని జరంత సూసుకో. వాల్లనేదైన దారి బట్టించినంక నీకిష్టమున్నట్టు సేసుకో’ అని సెప్పి సచ్చిందంట. అయ్యా మల్లీ పెళ్ళొద్దే అని పిల్లలంతా సెప్పిండ్రట. మల్లీ బిడ్డ గట్ల పుడితే ఆస్తి కోసం లొల్లి అవుతదని అన్నరంట. అంటే, నా పెండ్లమే నన్ను పెండ్లి సేసుకోమని సెప్పి మరీ చచ్చింది. మద్దెలో మీరెవరు? నాకేమైనా పిల్లా పాపా లేరంటనా? బిడ్డ కోసమా నేను పెండ్లి సేసుకునేది? మీరంతా రేపు మొగుడ్నీ, పెళ్ళాన్నీ ఎతుక్కుంట బోతే నాకు మంచి నీళ్ళయిన ఇచ్చే దిక్కు కూడా లేకుండ ఉండాల్నా? అని అడిగిండట.”

“మంచి నీళ్ళు కుండకెల్లి ముంచుకు తాగనీకి ఈనికి సెయ్యి లేదా ఏందీ?”

“గా ముచ్చట ఆడినే అడగాలి. సెయ్యుంది, కాలుంది, ఈన్బొందలకెల్లి అన్నున్నై. ముసిలాడు బైటికి చెప్పుకునేది గా తీర్ల. వయసైపోయి మనవడు పుట్టినంక గూడా మగోనికి ఆడది కావాల్సి వచ్చె. ఏం జెప్తం, లోకమట్లున్నది. మొగోడెట్లైన ఆని మాట నిలబెట్టుకుంటడు.”

ఆడవాళ్ళ ముచ్చట్లు వింటున్న కురువమ్మకి, కన్నెమ్మకి దిగులు పెరిగింది. కన్నెమ్మకైతే కళ్ళల్లో నీళ్ళొచ్చినై.

“అమ్మా ఏందే! నాకన్నా పెద్దోళ్ళంటనే ఆయన బిడ్డలు. ఆండ్లకిష్టం లేదంట గందనే. మరి ఆ కొంపలనన్నెట్లుండనిస్తరే?”

“ఆయన సెప్పిండు గాదె! గుడిల పెండ్లి కాగానే నిను తీస్కబోతడంట. నిన్ను ఉంచేదానికి పక్కూర్ల ఇల్లు కిరాయకు తీసుకున్నడంట.”

“గట్లైతే మరి ఆ ముసలోనితో నేనొక్కదాన్నే ఉండాల్నా?”

“గాకుంటె ఏందే! మరి పెండ్లెందుకు చేస్కుంటుండనుకున్నవ్? ఆని ఆస్తి అంత ఆని పిల్లలు గుంజుకున్నరంట. పింఛనొస్తదంట నెల్నెలకి. దాంతోటే నిన్ను జూస్కుంటనని జెప్పిండు. ఆడు పోయినంక ఆ పించను నీకిస్తరు. నువ్వు సచ్చేదాక పైసలొస్తై. అందుకె గాదె ఆయనొచ్చి అడగంగనె సరేనంటి.”

“ఐతే ఇప్పుడేంది గంజిగ్గూడ లేకుండ ఆకలి బుట్టి సస్తున్ననా? నాకొచ్చిన పని జేస్కుంట తింటలేనా, ఉంటలేనా.”

తల్లీ కూతుళ్ళు మాట్లాడుకునేది చూసి కాళియమ్మ మధ్యలో కలగజేసుకుని చెప్పింది, “గంజి నీళ్ళకి గతి లేకనేమె మీ యమ్మ నీకు పెండ్లి చేస్త? మీ అమ్మ బోయినంక నీకు తోడెవరుంటరే? ముసలోడో, కుంటోడో, ఇంట్ల మొగోని తోడు కావలె గాదె. ఆడు ముసిలోడని నువ్విది గామాక. మనకెట్ల రాసుంటె గట్లనే అవుతది. ముసిలోన్తోని గన ఒకరిద్దర్ని కన్నవంటె నీ బిడ్డల్జూస్కుంటరు మంచిగ నిన్ను. కొత్తల ఆడు తిట్టిన కొట్టిన గమ్మునుండు. పూటకింత మంచిగ తిండి వండి పెట్టినవంటే మెల్లిగ ఆడే నోర్మూస్కొని పడుంటడు ఇంట్ల. సర్లే, పొద్దయింది, ఇంక బోయి పండుకో.”

‘ఇదొక పెండ్లి అనుకోవాల్నా?’ అని మనసులో అనుకున్నా బైటికి ఏమీ అనకుండా లేచి వెళ్ళింది కన్నెమ్మ. వాళ్ళమ్మ కూడా లేచి లోపలికి వచ్చింది. ఇద్దరూ తిండి తినకుండానే పడుకున్నారు. ఇద్దరికీ నిద్ర పట్టక పొర్లుతున్నా ఒకరితో ఒకరు ఒక్క మాట కూడా మాట్లాడు కోలేదు. దిగులుతో, గుబులుతో ఆ రాత్రిని ఎలాగో గడిపారు.

కోడి కూయగానే పక్కింటి వాళ్ళందరూ కూడి అయ్యంపేట ముసలాడు రాజయ్యకీ, మెలట్టూర్ కురువమ్మ కూతురు కన్నెమ్మకీ మరిడమ్మ గుడిలో పెండ్లి జరిపించారు. రాజయ్య తాలూకు మనుషులు గాని, పిల్లలుగానీ ఎవరూ రాలేదు. తాళి కట్టిన వెంటనే కన్నెమ్మను తనతో మంగల్కుడికి తీసుకు వెళ్ళి పోయాడు. సామాన్లు ఏమీ వద్దని చెప్పేశాడు. అందరూ ఏడిచారు. కన్నెమ్మ మాత్రం గుండెను రాయి చేసుకున్నట్టుగా అతనితో వెళ్ళి పోయింది. ఆమెకి కూడా ఏడవాలని అనిపించింది. కానీ ఏడవలేక పోయింది. మనసు మాత్రం భారంగా అయ్యింది.


గుడిసెలో కన్నెమ్మ ఒంటరిగా ఏడుస్తూ కూర్చుని ఉంది. రాజయ్య బిడ్డలను చూసి వస్తానని అయ్యంపేటకి వెళ్ళాడు. చుట్టు పక్కల గుడిసెలో ఉన్న వాళ్ళు మాట్లాడుకునే మాటలు కన్నెమ్మ చెవులలోనూ వినబడినాయి.

“గంజి నీళ్ళకి కూడా దిక్కులేని ఇంటి పిల్లట. తండ్రి లేడట. ఎవరూ వచ్చి పిల్లను అడగడానికి రాలేదట. అందుకే ముసలాడికి కట్టబెట్టారట. చిన్న పిల్లలాగే ఉంది. పాపం! ఈ ముసలాడికి పట్టింది యోగం.”

‘యోగం ముసలోనికి పట్టింది. నాకు శని పట్టింది. నాకిట్లనే రాసుంది. ఇగో, ఒక పనిమనిషి లెక్క ఈనికి వండి పెట్టుకుంట, ఇల్లు తుడుసుకుంట, బట్టలుతుక్కుంట బతకాలె. నా బతుకింతె!’ అనుకుంది కన్నెమ్మ.

పెళ్ళయి మూడు నెలలకి పైనే అయ్యింది. పొద్దునే లేచి, సానుపు జల్లి, ముగ్గు పెట్టి, వంట చేసి ముసలాడికి వేడిగా పెట్టి మిగిలినదాన్ని కన్నెమ్మ తింటుంది. రోజూ ముసలాడు బయలుదేరి ఎక్కడికో వెళ్ళేవాడు. ఎక్కడి వెడుతున్నానని గాని, ఎందుకు అని గాని ఏమీ చెప్పడు. ఈమె కూడా దాని గురించి ఎక్కువగా దిగులు పడింది లేదు. మధ్యాహ్నం వస్తే వస్తాడు. లేకపోతే లేదు. రాత్రుళ్ళు కూడా కొన్ని రోజులు వస్తాడు. కొన్ని రోజులు రాడు. మొదట్లో రాత్రుళ్ళు ఒంటరిగా పడుకోవడానికి భయంగా అనిపించేది. పోను పోనూ అలవాటు చేసుకుంది. ఆమెతో ఎక్కువ మాటలు పెట్టుకోడు. ఏదైనా పని ఉంటేనే మాట్లాడతాడు. పెద్ద పిల్లకి సంబంధాలు చూస్తున్నట్లుగా ఒకసారి చెప్పాడు. సంబంధం కుదరగానే కన్నెమ్మకి చెప్పాడు.

“నా కూతురికి లగ్గం పెట్టుకున్నాను. ఆ సమయంలో నువ్వు ఇక్కడ ఒంటరిగా ఉండక్కర లేదు. బయలుదేరి మీ అమ్మ ఇంటికి వెళ్ళు. లగ్గం అయిన తరువాత ఇక్కడికి వస్తే చాలు. అర్థం అయ్యిందా?”

సరేనని తలాడించింది కన్నెమ్మ. మరునాడు పొద్దున్నే బయలుదేరి అమ్మ ఇంటికి వచ్చి చేరింది. ముందూ వెనకా కబురు పెట్టకుండా, ఒక్క మాట కూడా చెప్పా పెట్టకుండా ఉన్నట్టుండి కన్నెమ్మ రాగానే కురువమ్మ బెంబేలెత్తి పోయింది.

“ఏందే ఇది? ఉన్నట్లుండి పొద్దుగాలె ఊడిపడినవ్. మీ ఆయన్రాలేదె?”

“రాలే.”

“లొల్లి పెట్టుకున్నరేందె? నిన్నేమన్న గొట్టిండా? నువ్వట్ల లొల్లి జేసుకోవ్ గదానె. నీకు నోరున్న బాగుండేటిది. మాట్లాడవేందే. ఏమైంది జెప్పే.”

కురువమ్మ అడుగుతుండగానే చుట్టు పక్కన ఉన్న వాళ్ళు వచ్చి చేరారు. లగ్గమైన వెంటనే వెళ్ళిన మనిషి ఇప్పుడే వచ్చింది అంటూ వచ్చిన అంజలి కన్నెమ్మని సరామరిగా ప్రశ్నలు వేసింది.

“ఏందే కన్నెమ్మా? ఎట్లున్నవ్? నీ మొగుడు నిన్ను మంచిగ చూస్కుంటుండే? తిండి సరింగ పెడ్తున్నడా? ఏమైన ఇసేషం ఉందానె?”

“ఉంది.”

“ఉందా? గట్ల సెప్పు మరి. కురువత్తా, నీ బిడ్డ కేం తెల్వదంటవ్ గదనే. ఏం తెల్వకుండనే నీకు మనవడిని కంటున్నాది జూడు. పెండ్లై ఆర్నెల్లు గూడ గాలే.”

“గట్లనా! నా తాన జెప్పలేదేందే?”

“ఏందే నీ తాన చెప్పేడిది?”

“నీక్కడుపైనాదే?”

“నాకెక్కడైనాది కడుపు?”

“అదేందే, గంగిరెద్దు లెక్క తలూపినవ్?” అంజలి కలవరపడింది.

“ఎప్పుడు?”

“ఎప్పుడేంది? ఇసేషమున్నాదె అంటే ఔనంటివి.”

“ఆయన కూతురికి లగ్గం పెట్టుకుండు. అదే అనుకుంటి నేను గూడ. నువ్వడుగుతుందేందో నాకు తెల్వలే.”

“ఇంత తిక్కల్దానివేందే. నేనడుగుతుండేదేంది, నువ్వు చెప్పేడిదేంది. గద్సరె, మీ ఆయన కూతురికి లగ్గం పెట్టుకుంటే నువ్వెందుకు పోలే?”

“నన్ను రావొద్దని జెప్పిండు.”

“గదే ఎందుకంట? ముసలోనికి పెండ్లి చేస్కుంటె నామోషీ లేదు గాని, పెండ్లాన్ని పదిమందికు చూపిచ్చాల్నంటే సిగ్గయితున్నాదె? ఐన నువ్వెట్ల గమ్మునున్నవే, ఆయనెంట బోవద్దా లొల్లి లొల్లి జేసైన గాని.” అని సాగ తీసింది అంజలి.

“ఆయన బిడ్డలకి నన్ను సూడనికి గూడ మనసౌతలేదంట.” కన్నెమ్మ నిదానంగానే చెప్పింది.

“ఆల్లు సూడకుంటే ఏంబోతది గాని, ఆయనన్న నిను మంచిగ సూస్కుంటున్నాడె బిడ్డా?” కురువమ్మ అడిగింది.

“గిన్ని రోజులుగ నేను బతికిన్నా సచ్చిన్నా అని గూడ నీకు యాదికి లేదు. ఇప్పుడేమొకం పెట్టుకొని అడుగుతుండవే? బత్కాలే గాబట్టి బత్కుతున్న. ఇంకేం గావాలె నీకు?”

“కన్నెమ్మా! నేంజెప్పేది ఇనుకో. సప్పుడు సెయ్యకుండ ఒక బిడ్డను కన్నవంటే ఇగ దానితోటైన నీకు మంచిగ పొద్దు గడుస్తది. నీగ్గూడ తోడుంటది. నువ్వేం చెప్పవేందే కుర్వత్తా?” అంజలి అడగగానే కురువమ్మ అవునన్నట్లుగా తలాడించింది.

నాలుగైదు రోజుల తర్వాత రాజయ్య వచ్చి కన్నెమ్మను తీసుకెళ్ళాడు. వెళ్ళే ముందు కురువమ్మ అన్నది. “దీపావళి పండక్కి మీరిద్దరు కల్సొస్తే బాగుంటది గందా.”

“కూతురుకీ ఈ సారి మొదటి దీపావళి. కూతురు, అల్లుడు వస్తారు. నేను కూడా అక్కడికి వెళ్ళాలి. ఈమెను పంపిస్తాను. పండగ ముగిసిన తరువాత నిదానంగా వస్తే చాలు.”


కన్నెమ్మకి దీపావళి పండగ ఎప్పుడు వస్తుందా అని అనిపించింది. ఇంకా మూడు నెలలు ఉన్నాయనుకుంటే కాస్త దిగులు కూడా వేసింది. సరిగ్గా దీపావళికి ఒక వారం ముందుగానే రాజయ్య కన్నెమ్మను ఇంటికి పంపించాడు. కన్నెమ్మను చూడగానే కురువమ్మకి సంబరం పట్టలేనట్లయింది. కన్నెమ్మ నీరసంగా కనపడింది.

“ఏందే? పోయిన తూరి వచ్చినప్పుడు బాగానే ఉంటివి. ఈతాన ఏమే అట్ల చిక్కిపోయినవ్?”

“ఏమో, ఒంట్ల మంచిగుంటలే. గంజి గూడ లోపలికి బోతలేదు. అన్నం చూస్తెనే కక్కు అయితుంది.”

“ఉండు. పోయి మారెమ్మని పిల్చొకనొస్త” అంటూ వెళ్ళి మారెమ్మను పిలుచుకొని వచ్చింది కురువమ్మ. దీపావళి పండగకి ఇంటికొచ్చిన కూతురు కడుపుతో ఉందేమో అనిపించి కురువమ్మకు సంతోషం పొంగుకొచ్చింది.

ఆమెతో పాటు ఇంకా నలుగురైదుగురు అమ్మలక్కలు కూడా వచ్చారు. ముసలిది పరీక్ష చేసి కన్నెమ్మ కడుపుతో ఉన్నట్లు రుజువుగా చెప్పి వెళ్ళింది. చివరికి తన ఇంట్లోకి బిడ్డ రాబోతున్నదని కురువమ్మ సంబరపడింది. చూసిన వాళ్ళందరి తోటి చెప్పి మురిసి పోయింది. కూతురికి అప్పుడప్పుడూ ఇలా ఉండాలి అలా ఉండాలి అని జాగ్రత్తలు చెప్పింది. తనవల్ల చేతనైనంత వరకు పిండి వంటలు చేసి కూతురికి తినిపించింది.

ఒక వారం తరువాత రాజయ్య కన్నెమ్మను తీసుకొని పోడానికి వచ్చాడు. అతని దగ్గర కన్నెమ్మ కడుపుతో ఉందన్న విషయాన్ని చూచాయగా చెప్పి , ఆమెను జాగ్రత్తగా చూసుకోమని చెప్పి పంపింది. విషయం వినగానే రాజయ్య ఉలిక్కి పడ్డా కప్పి పుచ్చుకున్నాడు. జవాబు ఏమీ చెప్పకుండా కన్నెమ్మను తీసుకొని వెళ్ళి పోయాడు.

ఇంటికి వచ్చిన మరునాడే కన్నెమ్మను పక్క ఊళ్ళో ఉన్న ఆస్పత్రికి తీసుకుపోయాడు. డాక్టరమ్మతో ఏదో మాట్లాడి కన్నెమ్మను డాక్టరమ్మతో లోపలి పంపించి వాళ్ళమ్మ కురువమ్మను ఆస్పత్రికి రమ్మనమని కబురు పంపించాడు.

కన్నెమ్మకి మనసులో సంతోషమనిపించింది. ఏది ఎలాగున్నా కడుపుతో ఉన్నానని తెలియగానే చెక్ చేపించనీకి వెంటనే డాక్టరమ్మ దగ్గరికి తీసుకొచ్చాడని రాజయ్య మీద అభిమానం పుట్టింది.

కురువమ్మ ఆసుపత్రికి వచ్చింది. రాజయ్య అప్పుడు అక్కడ లేడు. కూతురిని చూసి వివరం తెలుసుకుందామని వాళ్ళనీ వీళ్ళనీ అడుగుతూ లోనికి పోయింది. చీపురు పుల్లలా పడుకున్న కన్నెమ్మని చూసి బెంబేలెత్తి పోయింది. పేవులు తీసి బైట పడేసినట్లనిపించింది. ఏమయ్యిందే అని ఏడుస్తూ అడిగిన కురువమ్మకి బదులు చెప్పే స్థితిలో కన్నెమ్మ లేకపోయింది. తనకి ఏమైయ్యిందో ఆమెకే తెలియలేదు. బిత్తర బిత్తర జూసుకుంట పడుకుంది. అప్పుడే అక్కడికి వచ్చిన డాక్టరమ్మను కురువమ్మ అడిగింది.
డాక్టరమ్మ ఏం చెప్తుందోననని కన్నెమ్మ కూడా ఆమె వంక దీనంగా చూసింది.

“ఈమె భర్త మీకు ఏమీ చెప్పలేదా? ఆయనే ఈమెని ఇక్కడ అడ్మిట్ చేసి గర్బం తీయించ మన్నాడు.”

“ఏం జెప్తుండవ్ తల్లీ? బిడ్డను తీసేయమన్నడా?”” వణుకుతున్న గొంతుతో కురువమ్మ అడిగింది.

“అవును. గర్బం తీసి, ఇక బిడ్డలు పుట్టకుండ ఆపరేషన్ చేయించమన్నాడు. గర్భం తీసేసి ఆపరేషన్ కూడా చేసేసాము. ఇంకో వారంలో కుట్లు విప్పేస్తాము. దాని తరువాత ఇంటికి తీసుకొని పోవచ్చు.” సర్వ సాధారణంగా చెప్పిన డాక్టరమ్మ వెళ్ళి పోయింది.

తల్లీ కూతుళ్ళు పిచ్చి పట్టినట్లు అలాగే ఉండి పోయారు.


రచయిత్రి భామ ఎంతో మంచి పేరు , ప్రఖ్యాతులు తెచ్చుకున్న దళిత రచయిత్రులలో ఒకరు. ఆమె రచనలు, భాష ఆమె జీవిత అనుభవాలను ప్రకటిస్తాయి. ఆమె రచనలు విస్తారంగా ఇతరభాషల లోకి అనువదింపబడినాయి. ఆమె రచనల్లో, ఆమె ఆత్మకథ కరుక్కు (1992), సంగతి (1994) నవల, కిసుంబుకారన్ (1996) కథల సంపుటి ప్రముఖమైనవి. సంగతి నవలను ఇంగ్లిషు లోకి లక్ష్మి హోల్‌స్ట్రామ్ అనువదించారు. ఇది ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ ప్రెస్ 2005లో ప్రచురించింది.