కోనిగ్ ఆర్ట్ షాపు ప్లాస్టిక్ సంచీ లోంచి ఐఫోన్ మోగటం వినిపించింది. నిసీ షామల్ గబుక్కున చేతిలోని కుంచె బల్లపైన పెట్టేసి, ఆ సంచీని వెదకటం మొదలెట్టింది. కేన్వాసులు, ఏక్రిలిక్ రంగుల పెట్టెలు, స్కెచ్ పేడ్లు, చిన్ని తుళ్ళు, ఇలా అన్నీ కింద పడేస్తూ చివరికి సెల్ ఫోన్ ఉన్న బేగ్ తెరిచి చూసింది. ఈ లోపల ఆర్ట్ క్లాసులో సహ విద్యార్ధులు కొంత అసహనంగా చూశారు ఆమె వంక. మళ్ళీ మోగుతున్న ఫోన్‌ని చెవి కానించుకుంటూ, క్లాసు బైటికి వెళ్ళింది.
“హలో! ఏమిటి లాజ్లో!”
“ఏం చేస్తున్నావ్?” అడిగాడు ఆమె స్నేహితుడు, మెడికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ లాజ్లో బేకస్.
“బొమ్మలేసుకుంటున్నా. ఎందుకు పిలిచావూ?”
“అదే, ఏన్యుయల్ న్యూరోఆంకాలజీ సింపోజియం – ఈ శనివారం సెప్టెంబర్ 26న, 7 గంటలకు మొదలు. నువ్వు సూర్యోదయం చూసి చాన్నాళ్ళయి ఉంటుంది కదా! టైం కి రమ్మని చెప్పటానికి.”
“ఇడియట్. నీకు రోజూ అదే పని. కాన్సర్ కాన్సర్ కాన్సర్! నాకు వందపనులుంటయ్. వస్తానని చెప్పాగా. అయినా ఇందుకోసమా ఇప్పుడు ఫోన్ చేసింది? ఒక మోడల్ బొమ్మ గీస్తున్నాం. లార్డ్ కృష్ణ లాగా, నల్లరాతినుంచి చెక్కిన విగ్రహంలా, చక్కటి సౌష్టవంతో ఉన్నాడు. నీలా కాదు బక్కగా! పైగా గిటార్ మన్మోహనంగా వాయిస్తున్నాడు. మధ్యలో నీ గోల. నిన్ను తెలిసి ఉంటం నా పూర్వ జన్మ పాపం. బై.” అని క్లాసులోకి వెళ్ళింది.
గిటారు తీగలని మీటుతున్న యువకుడు, ఆపి, ఆమెకు కన్ను గీటాడు. లైలలైలలైలా లైలా లైల లైలలైలాలైలా అని స్వరం ఎత్తుకుని Kiss me my Darling now, Don’t wait till tomorrow – అని తారస్థాయిలో పాడాడు. నిసి కళ్ళు నవ్వుతో వెలిగి పోయాయి. క్లాసులో సుందరీమణులు కేన్వాసుల మీద అతని సౌందర్యం ఎవరికి తోచిన రీతిగా వారు చిత్రిస్తున్నారు.
మధ్య మధ్య టీచర్ వారిని హెచ్చరిస్తోంది – “మీరు ఇతనిని చూస్తున్నందున, ఇతని సంగీతం వింటున్నందున మీలో కలిగిన భావ సంచలనాన్ని మీకు తోచినట్లు, వ్యక్తపరచండి. ఇంతకు ముందు మీరు చూసిన ఆర్టిస్టుల బొమ్మలను అనుకరించి వెయ్యటం కాదు. మనిషిని, గిటారుని కూడా వెయ్యక్కర్లేదు. ఆయిల్, ఏక్రిలిక్, వాటర్ కలర్, పేస్టెల్ – ఏది కావాలంటే అది ఎంచుకుని వెయ్యండి. మీ ఇష్టాన్నే మీరు గియ్యండి, నా ప్రమేయం ఏం లేదు ఈ క్లాస్ వరకూ” – అని చెబుతూ. క్లాస్ అయ్యాక గిటారిస్ట్ గది అంతా తిరుగుతూ అందరి ఆర్ట్ చూశాడు. నిసీ అతని గిటార్ తీసుకు వాయించి చూసి, అతని కార్డ్ తీసుకుంది.
“నేట్! ఒక్క పార్టీలకే గిటార్ వాయిస్తావా? వెన్నెల్లో లనాయ్‌లో నాకు డాన్స్ చెయ్యాలని అనిపిస్తే, పిలిస్తే అప్పటికప్పుడు నా ఇంటికి వచ్చి పాడతావా?”
“ఎందుకు రానూ. ష్యూర్.” అన్నాడతడు. నిసి ఈజెల్ మీద ఉన్న తన బొమ్మ చూసి పెద్దగా నవ్వాడు.
సెప్టెంబర్ 26 ఉదయం. న్యూయార్క్ నగరం. యూ. ఎస్. ఏ.
యూనివర్సిటీ కేంపస్‌లోనే ఉన్న హాస్పిటల్లో సింపోజియం. మొదటి రోజు నిసి పంక్చ్యువల్గా టైముకి వెళ్ళింది. ఆడిటోరియంలో అప్పటికే చాలామంది ఉన్నారు. కొంచెం సేపట్లో ఆమె పక్కన పరిచయ స్వరం. ఆమె మెడ మీద పరిచయమైన చేతులు. చెంపమీద చిన్ని ముద్దు. “థేంక్స్! వచ్చినందుకు,” అని చెవిలో గుస గుస.
“ఆల్రైట్ లాజ్! రిలాక్స్! ” అంది నిసి.
మొదటి వక్త ఒక న్యూరో సర్జన్. మాట్లాట్టం మొదలు పెట్టీ పెట్టక ముందే, ఆమె ‘ఫ్రెడెరిక్ ఫెకాయ్’ హెయిర్ కట్ ఇంకా సభ్యులు సరిగ్గా గుర్తించి ఆనందించక ముందే, అన్ని స్క్రీన్ల పైన ‘డా. బేకస్’, ‘డా. షామల్’ అని మెసేజ్ ఫ్లాష్ అవ్వటం మొదలయ్యింది. లాజ్లో లేచి నిసి భుజం మీద చిన్నగా తట్టాడు.
ఇద్దరూ బైటకు నడిచారు. బైట ఆందోళన నిండిన ముఖాలతో రేడియేషన్ ఆంకాలజీ ఛైర్మన్ -జాన్ లోగన్, చీఫ్ టెక్నాలజిస్ట్ – పీటర్ బుష్ నిలబడి ఉన్నారు. అందరూ పరుగు లాటి నడకతో రేడియేషన్ విభాగం కేసి నడిచారు. పీటర్, వారిని లినియాక్ ఏక్సిలరేటర్ గదిలొకి తీసుకు వెళ్ళాడు.
రేడియేషన్ ట్రీట్‌మెంట్ బల్ల మీద హెడ్ ఎండ్ నెక్ ఛీఫ్ సర్జన్ బిల్ నెల్సన్. శవరూపంలో! వారెవరూ ఊహించని దృశ్యం.
“నెల్సన్ ఇక్కడ! ఈ బల్ల మీద! మీకు గాని ఇప్పుడు పేషెంటా?” అని గబగబా లోగొంతులో అడిగింది నిసి. కొన్ని సార్లు స్టాఫ్ మెంబర్లకు కేన్సర్ వస్తే వారు మరీ పొద్దున్నే గాని, లేదా బాగా ఆలస్యంగా గాని ట్రీట్మెంట్ స్లాట్ తీసుకుని, వేరే పేషెంట్లకూ, డాక్టర్లకూ ఈ విషయం తెలియకుండా గుంభనగా వైద్యం చేయించుకుంటారు. లినియాక్ ఏక్సిలరేటర్ హెడ్ బిల్ నెల్సన్ ఛాతీకి గురి చేసి ఉంది. లంగ్ కేన్సరేమో అనుకుంది నిసి.
“కాదు. బిల్ మా పేషెంట్ కాదు. ఏం అర్థం కాటల్లేదు.” అన్నాడు డాక్టర్ జాన్ లోగన్. అతని ముఖంలో నెత్తురు చుక్క లేదు. పెదాలు వణుకుతున్నయ్.
“ఒక వేళ మిమ్మల్ని కలవటానికి కాని వచ్చాడా? వచ్చి వెదుకుతూ, సడెన్‌గా హార్ట్ ఎటాక్ వచ్చి, ఈ బల్ల మీద పడుకుని చనిపోయి ఉండొచ్చా?”
“ఉహూ. పేరుకు ఫియర్లెస్ ఎగ్రెసివ్ సర్జనే కాని, బిల్ రేడియేషన్ రూమ్ లోకి అసలు అడుగు పెట్టటానికే భయపడి – (చచ్చేవాడు అనబోయి నిగ్రహించుకుని) డేవాడు” అన్నాడు జాన్ లోగన్. “అసలిప్పుడు తను కూడా సింపోజియం లోనే ఉండాలి కదా. ఇక్కడ ఏం చేస్తున్నట్టూ?”
లాజ్లో – మై గాడ్! మైగాడ్! అనటం తప్ప ఏం చెయ్యటం లేదు.
“మన పీటర్ -రాత్రి బయాలజీ లేబ్ వాళ్ళు టిష్యూ రేడియేట్ చేసుకోటానికి వస్తే ఫిజిసిస్ట్ కు డోసిమెట్రీ కేలిబ్రేషన్ లలో సహాయం చేసి, ఆ తర్వాత ‘రేండో’ని బల్ల మీదే వదిలేసి వెళ్ళి పోయాట్ట. పొద్దున్నో ఏక్సెలెరేటర్ ‘వార్మ్ అప్’ కని వస్తే ‘రేండో’ మీద తెల్ల షీట్ కప్పబడి ఉంది. తొలిగిస్తే ఈయన శవం ఉందిట.” – మళ్ళీ జాన్ లోగన్.
డాక్టర్ నెల్సన్ లేత నీలం స్క్రబ్స్ వేసుకుని ఉన్నాడు. ఆయన హాస్పిటల్ ఆఫీసులో ఆ దుస్తుల్లోనే పేషెంట్లను చూసేవాడు. నిసీకి గుర్తే. నిసి రూం పరికించి చూసింది. అన్నీ -వస్తువులూ, పరికరాలూ- మామూలుగా వేటి స్థానంలో అవే ఉన్నట్లున్నయ్, రేండో తప్పించి. ‘రేండో’ గదిలో ఓ మూల నేలమీద పడి ఉంది. సర్జన్ శవాన్ని కూడా తాకకుండా, పరిశీలించి చూసింది.
“మెడిసిన్ కాబినెట్లు అన్నీ లాక్ చేసినవి అలానే ఉన్నాయి. వస్తువులు ఏవీ కదిలించినట్లుగా లేవు.” -మెల్లిగా అన్నాడు చీఫ్ టెక్నాలజిస్ట్ పీటర్ ఆమె చూపులను గమనిస్తూ. “మెషీన్ ఎవరూ వాడలేదు. రాత్రి నేను వదిలి వెళ్ళాక. ఏక్సిలరేటర్ లాగ్స్ చెక్ చేశాను.”
అందరూ ముఖాలు చూసుకున్నారు. సమయం 7.30 కావస్తున్నది. జాన్ లోగన్ గబగబా వారందరితో బైటికి నడిచి, “పీటర్! ఈ గది మూసి వేసి ఉంచు. ఈ మెషీన్ మీద ఈ ఉదయం ట్రీట్ చెయ్యవలసిన పేషెంట్లను వేరే మెషీన్ల మీదకు, మధ్యాన్నానికి వచ్చేట్లుగా మార్పించు. నేను మళ్ళీ వచ్చి నీతో మాట్లాడే వరకూ ఈ విషయం ఎవరితోనూ మాట్లాడవద్దు.” అని చెప్పేసి ఇద్దరు డాక్టర్లనూ తీసుకుని తన గదిలోకి వెళ్ళాడు.
“ఇది హత్యే. నా మీద, నా డిపార్ట్‌మెంట్ మీద ఎంత ద్వేషం ఉన్నా నెల్సన్ ఇక్కడకు వచ్చి కుదురుగ్గా ముఖం మీదుకు ముసుగు లాక్కుని చనిపోతాడా! హాస్పిటల్ ప్రెసిడెంట్‌కు ఫోన్ చేశాను. లాయర్ని తీసుకుని వస్తున్నాడు.”
“లాజ్లో! నువ్వు మొత్తం ఆంకాలజీకే డైరెక్టరువి కదా. నిన్నందుకే పిలిచాను. ఎంతో కష్టపడి హాస్పిటల్కి ఇంత పేరు ప్రతిష్టలు తీసుకు వచ్చాం. ఇప్పుడు ఈ గొడవతో, పేషెంట్లు వేరే చోటికి పోతారు. మనకిక ఇంత కూడా శాంతి ఉండదు. నిసి సింపోజియంకు ఈ రోజు వస్తున్నట్లు తెలిసింది. నాకు ఏమైనా సహాయం అవసరమైతే, ఆలోచన చెప్పవలిస్తే నిసి తప్పక చేస్తుందని పిలిచాను.” అంటూ నిసివైపు ఆందోళనతో చూశాడు.
లాజ్లో అర్థమైంది అన్నట్లు తలాడించాడు.
“ముందు ఈ కాన్ఫరెన్స్ కామ్‌గా నడిచేట్లు చూడాలి. ఎక్కడెక్కడి దేశాల వారూ వచ్చి ఉన్నారు. లక్కీగా ఈ మీటింగ్ అంతా డాక్టర్ చాంగ్ ఆధ్వర్యంలో నడుస్తున్నది. నేను అక్కడ అప్పుడప్పుడు కనిపిస్తే చాలు. నెల్సన్ స్పీకర్ కాదు. అది ఒక మేలు. ఇప్పుడు ఇంటర్నేషనల్ సెలెబ్రిటీ పేషెంట్లు చాలా మందికి మన సెంటర్లో వైద్యం నడుస్తూ ఉంది. నాకు తెలుసు ఎవరెవరు ఉన్నదీనూ. వీరెవరూ ఆందోళన పడకుండానూ, ఏ గందరగోళం సృష్టించకుండానూ జాగ్రత్త పడాలి.”
“అవును, నా వర్రీ కూడా అదే. చస్తే చచ్చాడు నెల్సన్. ఉత్త తగువులమారి వెధవ. వెరీ మీన్ పర్సన్. నువ్వేమన్నా అను లాజ్లో. నెల్సన్ చచ్చినందుకు నాకు సంతోషంగా ఉంది. కాని ఇక్కడే చావాలా, ఇప్పుడే చావాలా దరిద్రుడు!” అన్నాడు జాన్ లోగన్ పట్టలేక.
“కేర్ ఫుల్. కేర్ ఫుల్. గోడలకు చెవులుంటాయ్. హత్యేమో అనుకుంటున్నాం కూడా. కేర్ ఫుల్ జాన్! శవాన్ని స్ట్రెచర్ మీద పడేసి మోర్గ్ కి పంపటానికి కూడా లేదు. పోలీసులతో గొడవవుతుంది.” అన్నాడు లాజ్లో, చిన్నగా నిట్టూరుస్తూ.
నెల్సన్ దగ్గరి చుట్టాలెవరూ? – నిసి.
“ఎవరూ లేరు.”
“లేరా! ఎంత సుఖజీవి!” అంది నిసి. చుర్రున చూశాడు లాజ్లో.
“నేనదేమంటే -అదెలా సాధ్యం? అని” నిసి కాలు మీద కాలు వేసుకుని ప్రాడా షూ ఊగిస్తూ అడిగింది.
“తలిదండ్రులు, భార్య చనిపోయారు. ఇంతకు ముందు భార్యతో పిల్లల్లేరు. ఇప్పుడు ఒక న్యూరో సర్జన్ – కొలంబియాలో పని చేస్తుంది- ఆమెతో ప్రణయం నడుపుతున్నాడు. ఇంకా పెళ్ళి కాలేదు కాబట్టీ ఆమెకు ఇన్‌ఫార్మ్ చెయ్యక్కర్లా. అయినా, ఎంతమంది ఒంటరి జీవితం గడపరు? అదేం ఈ సిటీలో కొత్తా! ఏమిటి?” – లాజ్లో.
“ఒకే. ఇది క్రైమ్ ఐనా, ఈ మరణం సాల్వ్ చెయ్యటం అంత కష్టం కాదు.” – నిసి.
“ఇంకా మిస్టరీలు చదువుతున్నావా?”
“యా, యా, ష్యూర్! అగాథా క్రిస్టీ, పీ.డీ. జేమ్స్ , డొరొథీ సేయర్స్, కోనన్ డాయల్, ఊంబర్టో ఎకో, సిడ్నీ షెల్డన్, జాన్ గ్రిషమ్ , నోరా రాబ్స్, డేన్ బ్రౌన్ – ఇంకా ఎందరో. అంటే గుర్తుకొచ్చింది, పెట్రిసియా కార్న్‌వెల్ ‘పోస్ట్ మార్టమ్’ చదివావా? ఒకే సంవత్సరంలో నాలుగు బుక్ ఎవార్డులు వచ్చినయ్. ఇన్ని మిస్టరీలు చదివి, ఏమిటి లాస్లో! అంత సాధించలేని మిస్టరీ ఏముంది పెద్ద!” అంది నిసి.
“నిజంగా సాల్వ్ చెయ్యగలవా?” ఇద్దరూ ఒక్కసారే అరిచారు.
“నెల్సన్ చనిపోయాడు. చుట్టాల్లేరు. విషయం ఇంకా తేలిక. ఇప్పుడు ఏ ప్రశ్నలు వేసుకోటం ముఖ్యం? పోలీసులు వస్తే వాళ్ళకు కావలసినది ఏమిటి? వాళ్ళ పద్ధతి ప్రకారం ఈ ఏరియా అంతా సీల్ చేసి పేపర్లో స్టేట్మెంట్లిచ్చి మీ అందరినీ రకరకాల ప్రశ్నలు వేసి వేధించి…, నెలలు సంవత్సరాలు పట్టనూవచ్చు. ఈ లోపల మీ ప్రాక్టిసులు రూయిన్ అవనూ వచ్చు. కాని మీకు కావాల్సింది అదికాదు. డాక్టర్ల్లుగా మీక్కావాల్సింది ఏమిటి? ఇతని మరణం అంటువ్యాధా? దీనివల్ల ఇతర్లకు జబ్బు రావచ్చా? కాకుంటే ఇతనిని ఎవరైనా చంపి ఉంటే, మరెవర్నయినా అతగాడు చంపుతాడా? అనీ, ఆ మరెవరో మీరు కాకూడదనీనూ.
క్రైం బ్రాంచ్ ఛీఫ్ మనకు బాగా తెలిసినవాడే కదా. విషయం చెప్పి, 48 -72 గంటల వ్యవధి అడుగు. వాళ్ళ ప్లెయిన్ క్లోత్స్ టీమ్ వచ్చి శవాన్ని ఫొటోలు తీసుకోటమూ, ఎవిడెన్స్ కలక్ట్ చేసుకోటమూ చెయ్యమను. ఆటాప్సీ ఈ హాస్పిటల్లోనే చెయ్యనీ. ఇచ్చిన గడువు లోపల నేను హంతకుడెవరో చెప్పలేకపోతే, ఆ తర్వాత కథ వాళ్ళిష్టమైనట్లు నడిపించవచ్చు.”
“నిసి, ఈ షరతులకు క్రైం బ్రాంచ్ వాళ్ళు ఎందుకు ఒప్పుకుంటారు?”
“ఎందుకా? ఇది చాలా ప్రఖ్యాతి గల వాళ్ళు వచ్చే హాస్పిటల్. సిటీకి మంచి రెవెన్యూ, పేరు ప్రతిష్ఠలూ తెస్తుంది. అలాటిచోట సాధారణంగా పోలీస్ అడ్డు పుల్లలు వెయ్యరు. పైగా హాస్పిటల్. ఎలా ఒప్పించవచ్చంటే ఇది యూనివర్సిటీ హాస్పిటల్ కాబట్టి – ఇది ఎక్స్‌పెరిమెంటల్ జాయింట్ స్టడీగా చూపవచ్చు. ఎక్స్‌పెరిమెంటల్ డిటెక్షన్. ఖర్చు తగ్గించి, ఎఫిషియన్సీ పెంచటం. పేషెంట్ ఫ్రెండ్లీ. ఫొరెన్సిక్ డిపార్ట్‌మెంట్, పొలీస్ ఫోర్స్ జాయింట్ స్టడీగా పబ్లిష్ చెయ్యొచ్చు. లెజిటిమేట్ రీజనే గదా. ఒప్పుకుంటారు!
ఆ ఒప్పించటం ప్రెసిడెంట్‌కు, లీగల్ టీమ్‌కు వదలండి. పొలీస్ వాళ్ళ సంభాషణలను లాయర్లను రికార్డ్ చెయ్యమనండి. వాళ్ళు ఒప్పుకోకపోతే – అందువల్ల వచ్చే ఏ నష్టానికీ వాళ్ళే జవాబుదారీ అనీ, హాస్పిటల్, డాక్టర్ల ప్రాక్టీసు కాని, ఇతర పేషెంట్లకు కాని ఏమైనా హాని జరిగితే -అది అప్పుడు వాళ్ళ తప్పు కావచ్చని. పుట్ ప్రెషర్ ఆన్ దెమ్. ప్రెసిడెంట్ నుంచి నాకు ఈ హాస్పిటల్లో ఎవరి ఆఫీసు కంప్యూటరైనా వెదకటానికి, ఏ రికార్డులైనా చెక్ చెయ్యటానికి, ఎవరినైనా ఇంటర్యులు చెయ్యటానికి, రిటెన్ పర్మిషన్ తీసుకొ లాజ్! నేను నీ ఆఫీసు నుండి వర్క్ చేస్తా. ఒక డోనట్, కాఫీ పంపించు. నువ్వు పక్క ఆఫీసులో పని చేసుకో. పద, నీ ఆఫీసుకు.” – అంది. వాడి పోయి ఉన్న లాజ్లో బేకస్ ముఖంలోకి చూస్తూ. “లాజ్! ఏమిటోయ్, చావు హాస్పిటల్లో రోజూ చూసే వ్యవహారమేగా. పేషెంట్ చస్తే ఒకటీ, డాక్టరు చస్తే మరొకటీనా? పేషెంట్లు మరణించవచ్చు కానీ, డాక్టరు చస్తే ఇంత భయమెందుకోయ్?”
లాజ్లో గదిలొకి వెళ్ళాక అద్దంలో, అర్మానీ సూట్లో ఉన్న తన ప్రతిబింబం చూసుకుంది. కొద్దిగా జెస్సికా ఫ్లెచర్ లానే ఉన్నాను. ఈ పాటి కేస్ సాల్వ్ చెయ్యలేకపోటమేమిటి? ఎవరైనా వింటే నవ్వుతారు, అనుకుంది నిసి. తర్వాత – “ద సడెన్ డెత్ ఆఫ్ పూర్ డాక్టర్ నెల్సన్” అని వర్డ్ ప్రాసెసర్లో ఒక ఫైల్ తెరిచి నోట్స్ రాయటం మొదలెట్టింది.
– నెల్సన్ ఎలా చనిపోయాడో అవసరమా?
– ఎప్పుడు చనిపొయాడో అవసరమా?
– హు కేర్స్ ?:-)
– ఎవరు చంపారో! రియల్లీ! డు ఐ కేర్? :-):-) అవసరమే.
– ఎవరు? అతనికి తెలిసిన వాళ్ళేనా.
– అతని మీద ఒళ్ళు మండిన స్టాఫ్? హాస్పిటల్‌కి వచ్చి వెళ్ళేవాళ్ళు?
– ఎందుకు శవం అక్కడే, రేడియేషన్ డిపార్ట్‌మెంట్ లోనే వదిలారు? అక్కడికి యాక్సెస్ ఎవరెవరికుంది?
ఇలా ప్రశ్నలు వేసుకుంటూ, వాటికి పాజిబుల్ సమాధానాలు చెప్పుకుంటూ, నోట్స్ రాసుకుంది.
కొంచెం సేపటికి ఆమె బల్ల మీదకు సెక్రెటరీ ఎన్వలప్ తెచ్చి పెట్టింది. హాస్పిటల్ ప్రెసిడెంట్ ఆమెకు ఆ హాస్పిటల్లో ఉన్న అన్ని కంప్యూటర్ల మీద అన్ని రకాల సమాచారం వెదకటానికీ, ఏ డిపార్ట్‌మెంట్ కైనా వెళ్ళగలగటానికీ, ఎవరినైనా కలుసుకోటానికీ, వారిని ప్రశ్నించటానికీ , ఇలా 48గంటల పాటు ప్రత్యేక పర్మిషన్ ఇస్తున్నట్లు ఉత్తరం అందులో. ఆ లోపలే మళ్ళీ ప్రెసిడెంట్ ఎక్స్‌టెన్షన్ ఇస్తే తప్ప ఆ పర్మిషన్ ఆ పైన పని చెయ్యదు అని కూడా.
నిసి సంతోషంతో, తెలివున్న ప్రెసిడెంట్ అనుకుని, కంప్యూటర్ మీద డాక్టర్ నెల్సన్ కేలెండర్ తెరిచి ఆయన అపాయింట్మెంట్లు ఆ వారం లోవీ, తర్వాత కొంచెం ముందుకీ కొంచెం వెనక్కీ వెడుతూ, మధ్యలో తన ఫైల్లో కొన్ని పేర్లు రాస్కుంటూ పని సాగించింది. అతని కాన్ఫరెన్సుల కేలెండర్లు తనిఖీ చేసింది. అతని సెక్రెటరీ కేలెండర్‌నీ, అతని స్కెడ్యూళ్ళనీ కొన్ని సార్లు రెండూ ఒకే సారి స్క్రీను మీదికి తెచ్చీ, కొన్ని సార్లు ప్రింట్ చేసుకునీ చూసింది. ఇద్దరూ రాసుకున్న చిన్న నోట్సులు కూడా శ్రద్ధగా చూసింది. తర్వాత ఒకరిద్దరి ఇతర డాక్టర్ల అపాయింట్మెంట్ పుస్తకాలు కూడా. ఆమెను కొన్ని పేర్లు, కొన్ని విషయాలు ఆకర్షించాయి. కొన్ని తారీఖులు, ఇతర నంబర్లు నోట్ చేసుకుంది. ఆ తర్వాత దీక్షగా నెల్సన్ చేసిన కొన్ని ఆపరేటివ్ రిపోర్ట్స్, తర్వాత వారికి సంబంధించిన ఇతర రిపోర్ట్‌లు చూసింది, తను కూర్చున్న చోటి నుండి కదలకుండా. గంటలు గడిచి పోతున్నయ్.
కొంచెం సేపటికి, డెస్క్ మీదకు ఇంకో రిపోర్ట్ తెచ్చిపెట్టింది సెక్రెటరీ. దానిలో – క్రైం బ్రేంచ్, హాస్పిటల్, ఇతర స్వతంత్ర వ్యక్తులు కలిసి చేస్తున్న ఒక నూతన పరిశోధన. దానిలో పాల్గొంటున్న వ్యక్తులు, పరిశోధనా కాలము, దాని ఆశయములు, ఇలా చక్కగా విశదీకరించబడిన రెండు కాగితాలు. అందులో నిసి షామల్ పేరు ఆ స్టడీని ప్రతిపాదించిన వ్యక్తిగా, లీడ్ ఇన్వెస్టిగేటర్గా ఉంది.
నిసి నవ్వుకుంది. భలే చకచకా రాసారు. ఇంకెవరు. లాజ్లోనే. ఎన్ని వందల ప్రోటొకాల్స్ రాసి ఉంటాడు? ఎక్స్‌పర్ట్. స్టడీ డిజైన్ చెయ్యటం లోనూ, గ్రాంట్లు తెప్పించటం లోనూ. కాని ఏ కేన్సర్ కైనా క్యూర్ లాజ్లో కనిపెట్టగలడా? ఐ డౌట్ ఇట్ – అనుకుంటూ మళ్ళీ తన పని కొనసాగించింది. మెల్లిగా ఆమె ఆలొచనల్లో ఒక స్పష్టత వస్తున్నట్లనిపించింది. దాదాపు నెల్సన్ చావుకు కారణం, ఎవరో, ఏమిటో, ఎందుకో తెలిసినట్లుగా అనిపించసాగింది. కొన్ని డిపార్ట్‌మెంట్ల లోకి వర్చువల్ గా వెళ్ళి ఏవేవో టిష్యూ ఇమేజెస్, రిపోర్ట్‌లు, హాస్పిటల్ న్యూస్ లెటర్లు, కల్చరల్ & సైంటిఫిక్ ఇవెంట్లు, ఇ-ఫొటోలు, విడియోలు – ఇలా, మళ్ళీ చూసింది.
కొంచెం సేపటికి ఏమి జరిగి ఉండవచ్చునో – అన్న ఆమె ఆలోచనలు ఒక రూపు దిద్దుకున్నాయి. తర్వాత పథకమేమిటి?
ఆమె తన సెల్‌లో ఒక నంబర్ డయల్ చేసింది. అవతలి పక్క గొంతు మొదటి రింగుకే. “హలో నిసీ! బాగున్నారా? ఏమిటిలా అకస్మాత్తుగా!” కొంచెం ఆందోళన ధ్వనించింది గొంతులో.
“కుమార్ మీరండీ మనిషి అంటే. ఇంత త్వరగా పిలవగానే ఎలా పలుకుతారో? నాకెప్పుడూ ఆశ్చర్యమే. ఒక పిలుపులో పిలిచితే పలుకుతావట. ఆపద మొక్కుల సామీ…” అని పాడింది.
“మీ పాట వినిపించడానికి పిలిచి ఉండరు. కనీసం హిందీలోనో, ఇంగ్లీషులోనో పాడితే నాకు అర్థమన్నా అయేది. ఏమిటి విశేషం?” – కుమార్ అద్వానీ.
“నేను వెంటనే పారిస్ వెళ్ళాలి.”
“ఎందుకూ?”
“మనిద్దరం కలిసి వెడదామన్నారుగా అంతకు ముందు. ఇవ్వాళ వెళ్ళాలనిపిస్తున్నది.”
“ఆల్ రైట్! సంతోషం. ఐ విల్ హేవ్ ది జెట్ రెడీ. మీరు కెనడీకి వచ్చాక మళ్ళీ నన్ను పిలవండి. మనిద్దరం కలిసే వెడదాం. నేను న్యూయార్క్ లోనే ఉన్నా. లక్కీ మీ” – కుమార్.
నిసి, తను కుమార్‌తో పారిస్ వెడుతున్నాననీ, అక్కడి నుండీ మళ్ళీ మాట్లాడుతాననీ లాజ్లోకి పేజ్ చేసి చెప్పింది.
పరిగెత్తుకు వచ్చాడు లాజ్లో. “మళ్ళీ కుమార్! మాట్లాడితే కుమార్! ఈ బిలియనీర్ ఒకడు దొరికాడు నీకు. నన్ను ఇక్కడ ఈ మెస్‌లో వదిలేసి కుమార్‌తో షికార్ కొట్టటానికి వెళుతున్నావా? నీకసలు లాయల్టీలు లేవా?”
“ఇడియట్! నీ పని కోసమే వెడుతున్నా. ఐతే కుమార్ అద్వాని నీకెందుకు సహాయం చేస్తాడు? ప్లస్ ప్రైవసీ ఇష్యూ లేదూ? నేనెలా చెపుతాను అతనికి ఇక్కడి సంగతులన్నీ” – అంది నవ్వుతూ నిసి. “నీకుందా ప్రైవేట్ జెట్? పోనీ నీ జెట్లోనే వెళ్తా. వ్యవహారం సరి చెయ్యాల్సింది నీదా? నాదా?”
కొన్ని గంటల తర్వాత ఆమె చార్టర్డ్ జెట్లో పారిస్ కేసి పయనిస్తోంది. కుమార్, నిసి పొటేటో చిప్సు తింటూ డయట్ కోక్ తాగుతూ పేకలతో డిగ్ ఆడుకుంటున్నారు. ఆమె ఆడుతూ లోలోపల డాక్టర్ నెల్సన్ చావు – ఆ కేస్ గురించి ఆలోచిస్తున్నది. ఈ కేస్‌లో కుమార్ సహాయం ఇంకా కొంత తీసుకోవాలని ఆమె నిశ్చయించుకుంది.
“కుమార్! మీరు ఒక పబ్లిషింగ్ ఎంపైర్ అధిపతులు. మీ చేతిలో ఎన్నో మేగజీన్లు ఉన్నయ్. నాకు కొంత సహాయం కావాలి మీ ద్వారా, నే వెళ్ళే పనిలో.”
“నేనేదో నాతో ఓ రెండు రోజులు తిరగటానికీ, కాసేపు హస్కు కొట్టటానికి వచ్చారనుకున్నా. ఏమిటో చెప్పండి.”
“ఒక వ్యక్తి కావాలి. అతను ఇప్పుడు ఎక్కడ ఉంటున్నాడో మీరు కనిపెట్టి నాకు చెప్పాలి.” ఆమె కాగితం మీద అతని పేరు, ప్రొఫెషన్ రాసింది. అతను చదివాక చిన్న ముక్కలుగా చింపేసింది. ఆమె విచిత్రమైన చేష్టలకు కుమార్ ఆశ్చర్యపడలేదు. ఆమె వివేకంపై అతనికి నమ్మకం.
ఆ రాసిన పేరు చూసి కుమార్ ఆశ్చర్యంగా చూసాడు. “ఈయన ఎక్కడ ఉండేదీ అందరికీ తెలుసు గదా!”
“నా అనుమానం నిజమైతే, ఇతను ఇప్పుడు ఇంకో చోటికి మారిపోయి గుప్తంగా ఉంటున్నాడని. మీకు సెలెబ్రిటీ రియల్ ఎస్టేట్ గురించి మేగజీన్లు ఉన్నయ్. వారికి రియల్ ఎస్టేట్ సలహాలు చెప్పి వారి తరఫున కొనుగోలు చేసేవారూ మీకు తెలిసి ఉంటారు. అందుకని. కాని ఈ సమాచారం గురించి అడుగుతున్నట్లు ఈ కాగితంలో వ్యక్తికి తెలియకూడదు. అతనికి ఇప్పటికే చాలా అపకారం జరిగింది. అతనికి ఇంకా ఆపదలు జరక్కూడదు. మీరు ఈ పని చేసేలోగా నేను కొన్ని ఫోన్లు చెయ్యాలి. మీ కంప్యూటర్ వాడుకోవాలి.” అంది డాక్టర్ నిసి షామల్. అతడు విస్మయంతో తలూపాడు.
కుమార్ తర్వాత ఆమెను కేబిన్లో కలిసి, “అతడు ప్రొవాన్స్ లో నీస్ కు దగ్గర కొండల్లో ఒక విలేజ్ లో ఉంటున్నాడు. నాకు 29 తారీఖున అతన్ని కలవటానికి పర్మిషన్ ఇచ్చాడు” అని చెప్పాడు.
“నీస్? నిజంగా! నీస్ దగ్గర్లోనా!” ఆమె కళ్ళు సంతోషంతో మెరిశాయి. చకచకా, తన ఐఫోన్ లో ఒక వ్యక్తికి ఏదో టెక్స్ట్ మెసేజ్ పంపింది. వెను వెంటనే ఆమెకి వెనక్కి సమాధానం వచ్చింది.
“కుమార్. లైఫ్ ఈజ్ వండర్ ఫుల్. అద్భుతం! ! పారిస్లో రెండురోజులుండి తర్వాత నీస్ వెడదాం. సరేనా?”
“ఫైన్. పారిస్లో హోటెల్ మరిస్, నీస్ దగ్గర్లో మౌంట్ ఎజ్ -షాటో. మీకు చాలా నచ్చుతుంది. పని పూర్తయ్యాక, నీస్ నుండి న్యూయార్క్ మనం తిరిగి వెళ్ళొచ్చు.”
“ఐ లవ్ ఇట్!”
సెప్టెంబర్ 29, మధ్యాహ్నం. నీస్ నగరం. ఫ్రాన్స్.
కుమార్ అద్వానీ, నిసీ కోరినట్లు ఇంటర్నేషనల్ మ్యూజిక్ స్కూల్ వద్ద ఆమెను కార్లో దింపి తన అపాయింట్మెంట్‌కి వెళ్ళిపోయాడు.
నిసి లోనికి వెళ్ళి అక్కడి వారికి తనని పరిచయం చేసుకుని, ఆమె ఐడెంటిఫికేషన్ చూపించి, రిసైటల్ హాల్లో స్టూడెంట్లు కూర్చున్న గేలరీలో కూర్చుంది. నిసి ఆ రోజు చాలా ఉత్సాహంగా ఉంది. ఆమె చమ్కీ కోట్, మిలమిలలాడే పొడుగాటి స్కర్ట్ వేసుకుంది. ఆమెకు అషర్ ఆ రోజు ప్రోగ్రాం ఇచ్చాడు. ఆమె ప్రోగ్రాం చూసింది.
విక్టర్ బెర్నెట్టీ అండ్ స్టూడెంట్స్ ఆన్ పియానో ప్రెజెంట్:
బాఖ్ -మిన్యుఎట్ ఇన్ జి మేజర్
షోపాన్ – ఫేంటసీ ఇంప్రోంప్టూ
మోజార్ట్ -సొనాటా ఫర్ టూ పియానోస్ ఇన్ డి మేజర్
(విరామం)
ఫ్రాన్సిస్ పులెన్క్ -కన్చెర్టో ఫర్ టూ పియానోస్.
నిసి గుండెలు దడదడలాడిపోతున్నాయి. ఇది ఆమెకు సరికొత్త అనుభవం. పియానో కాన్సర్ట్ వింటానికి వచ్చిన అతిథులతో, చిన్న, పెద్ద స్టూడెంట్లతో హాల్ నిండి ఉంది. కాన్సర్ట్ మొదలయ్యి చక్కగా సాగుతున్నది.
ఆఖరుగా – కన్చెర్టో ఫర్ టు పియానోస్ – అందులో ఫస్ట్ మూవ్‌మెంట్ చివర్లో, కంపోజర్ ఫ్రాన్సిస్ పులెన్క్, ఒక ఇండొనీషియన్ పీస్ అమర్చాడనీ, కాని దాని బదులుగా డాక్టర్. నిసి షామల్ ఒక సౌత్ ఇండియన్ పీస్, మోహన రాగ తాన వర్ణము వాయిస్తుందనీ, ఆ తర్వాత ప్రొఫెసర్ విక్టర్ బెర్నెట్టీ, ఆ స్కూల్ స్టూడెంట్ కలిసి, ఏ మార్పూ లేకుండా మిగతా భాగాలు పూర్తి చేస్తారనీ – అనౌన్స్ చెయ్యబడింది.
నిసి గుండెలు దడదడలాడుతుండగా, మ్యుజీషియన్స్‌తో స్టేజ్ మీదకు వెళ్ళింది. వారితో కలిసి శ్రోతలకు ‘bow’ చేసింది. తర్వాత విక్టర్ బెర్నెట్టీ ఆదేశించినట్లు, అతని పియానో వద్దే అతనికి కుడిపక్కగా అదే సీట్ మీద నిసి కూర్చుంది. ఎదురుగా ఉన్న పియానో వద్ద మ్యూజిక్ స్కూల్ విద్యార్ధి కూర్చున్నాడు. కన్చెర్టో మొదటి భాగం మొదలయ్యింది. నిసి శ్రద్ధగా వింటూ పియానో కీబోర్డ్ మీద విక్టర్ చేతుల విన్యాసాన్ని చూసింది. అతడి ముఖంలో సన్నని చిరునవ్వు. పియానోలో నిమగ్నమై ఉన్నట్లే ఉండి, తన విద్యార్ధులకేసి చూసి నవ్వుతూనూ, శ్రోతల్తో మాట్లాడుతున్నట్లే ఉంటాడు.
అతడు తనకు సంకేతం ఇచ్చినప్పుడు మోహనరాగములోని తానవర్ణము ‘నిన్ను కోరి ఉన్నార నిఖిల లోకనాయక’ వాయించింది. శ్రోతలు ఆ ఆకస్మికమైన మార్పును కొంచెం ఉత్సుకతతో వినడం మొదలుపెట్టి చివరికి ఆనందంగా స్వీకరించారు.
కాన్సర్ట్ అయ్యాక నిసి, విక్టర్ కలిసి మౌంట్ ఎజ్ కి వెళ్ళారు.
ఆ సాయంత్రపు గాలిలో ఆ ఎత్తైన కొండ, పక్కనే నిండుగా కాసి ఉన్న ఆలివ్ చెట్లు. దగ్గరలో చిన్ని చర్చ్ నుంచి గాలిలో తేలుతూ వినిపిస్తున్న ఆర్గన్ మ్యూజిక్. కొండ చరియల్లో తోటలు, విరబూసిన పూలచెట్లు, క్రింద నీలాతి నీలమైన మెడిటరేనియన్ సముద్రం. ఆ చుట్టూ ఉన్న రంగులన్నీ ఉన్న ఆమె పొడుగాటి స్కర్టూ, ఎర్రని స్వెట్టరూ ఆ ప్రకృతికి ప్రతీకగా ఉన్నాయి. అతడు జీన్స్ మీద ఒక పొడవాటి కోటు వేసుకుని ఉన్నాడు. మెడలో ఒక చిన్న సిల్క్ స్కార్ఫ్. అతని లేతగోధుమవన్నె పొడుగు జుట్టు గాలికి ఎగురుతోంది.
“కాన్సర్ట్ కి వచ్చి, ఇండియన్ మ్యూజిక్ పియానో మీద వాయించినందుకు థేంక్స్. బాగుంది. ఐ లైక్ ఇట్. మ్యూజిక్ స్కూల్లో త్వరగా జేరాలి సుమా. బద్ధకించవద్దు.”
“అలాగే. నాకు స్టయిన్వే కాన్సర్ట్ పియానో కొనుక్కోమని సూచించినందుకు, థేంక్యూ! ఇంత ఆనందం లభిస్తుందని, నేనెప్పుడూ ఊహించలేదు.”
“అవును. నాకూ అంతే. మన జీవితంలో ఈ మధురమైన సమయం వస్తుందని నేనూ ఊహించలేదు. మనకిష్టమైన కవయిత్రి – ఆమెకెలా తెలుసు? ఎలా ఊహించిందామె?” అప్రయత్నంగా విక్టర్ తెలుగులో ఇలా చదివాడు.
“ఆ పూల కొండ కొమ్ము
ఆ అద్భుత పరిష్వంగమ్ము
ఆ ప్రేమికుల జంట
ఆనాడప్పట్టు నతడు
తలదాల్చిన ద్రాక్ష తీవలు
ఆమె జులపాల మెరియు తారలు
ఆ కొండకొమ్ముకు పయనించవలెను;
ఆ గాఢప్రణయ
మా ముద్దు ఒత్తిడి
మెడ ఒంపులో నా కాముకుని ఊర్పులు
ఆ మతిమాలిన జంట
మెరుపుల జిలుగుల ఉడుపుల కాంతు
లా గాలి, ఆ రాత్రి, ఆ క్షణము,
అతిత్వరగ పరుగిడి
ఆకాంక్ష
ఆ కడనె నిలచి
అనుభవించవలెను.”
వారి హృదయాలు ప్రేమతో పరవశించి ఉన్నాయి. ఒకరి సాన్నిధ్యం ఒకరికి ఎంతో హితంగా ఉంది. సమయమో! పరుగెత్తి పోతున్నది.
“రేపు వియన్నాలో కాన్సర్ట్ ఉంది. నిసి! నేను ఇంక వెళ్ళనా?”
“నాకు ఎలా మనసులో వినిపిస్తుందో, ఆపెరా సంగీతంలా మీ గొంతులో అలా పలికిందీ కవనం. విక్టర్! తెలుగు సంగీతకారులు మీరు పాడినట్లు ఈ కవితను పాడలేరేమో. మళ్ళీ కలుద్దాం. సెలవు.”
సెప్టెంబర్ 30. నీస్ – న్యూయార్క్ మధ్యలో.
న్యూయార్క్ కు వెళుతున్న జెట్‌లో నిసి షామల్‌కు కుమార్ అద్వాని చెప్పిన కథ:
నేనతని విల్లాకి వెళ్ళినప్పుడు దారి చాలా మెలికలు మెలికలుగా, ఒక పక్కన కొండ మరో పక్కన కిందికి చూస్తే సముద్రం – చాలా సీనిక్ గా ఉంది. అతని విల్లా తోటల మధ్యలో ఉంది. అంతా ఆలివ్ చెట్లు. విరగ పూచిన దానిమ్మలు. లవెండర్, ఓలియాండర్, రోజ్‌మేరీ సువాసనల్తో గాలి నిండి ఉంది.
గేట్ వద్ద నా పేరు చెప్తే, గేట్ తెరుచుకుంది. బట్లర్ తలుపు తీశాడు. నేను లైబ్రరీలో అతని కోసం వేచి ఉన్నా. ఇంతలో అకస్మాత్తుగా ఒక వికారి ఆ గదిలోకి వచ్చాడు. అతనితో రెండు నల్లని రాట్‌వైలర్స్ ఉన్నయ్. అవి నిశ్శబ్దంగా గదిలో ఒక మూలకు వెళ్ళి అతన్ని కాపాడటానికి సిద్ధంగా ఉన్నట్లుగా, నాలుకలు వేళ్ళాడేసి వగరుస్తూ, ఒక దాని పక్కనే ఒకటి పడుకున్నయ్. వచ్చిన అతని వయసు చెప్పలేను. ముఖం ఒక పక్కకు తోసికొని పోయి ఉంది. నోరు చిన్నదై, తొస్సిపోయి లోనికి పోయింది. మెడమీద వికృతంగా తోలులా వేలాడుతూ అస్తవ్యస్తంగా అతికిన చర్మం. వేళ్ళాడబడిపోయి కుడి చెయ్యీ.
ఆ రూపం నే భరించలేకపోయా. అతనికి షేక్ హేండ్ ఇవ్వటానికి నాకు ఎంతో బెరుకు కలిగింది. నా భయాన్ని అతను గుర్తించాడు.
“షాకింగ్ గా ఉంది కదా నా రూపం. అవును నేనే, మీ మూవీ ఐడల్ మైఖల్ మార్సెల్‌ని. ఆ ఆయిల్ పెయింటింగ్‌కీ నాకూ ఏమైనా పోలిక ఉందా ఇప్పుడు? అలా అని అదెంతో పాత చిత్రం కూడా కాదు. క్రితం సంవత్సరం ఆస్కార్స్ రెడ్ కార్పెట్ మీద తీసిన ఫొటో నుంచి గీసిన చిత్రమే. ఈ లోపల నన్ను డాక్టర్లు వైద్యం చేస్తున్నామంటూ ఎలా మార్చివేశారో చూశారా?”
అతని మాటలు తొస్సిపోతున్నయి. అతన్ని అర్థం చేసుకోటమే కష్టంగా ఉంది. నాకు ఏం మాట్లాడడానికీ తోచలేదు.
“ఏం పనిమీద వచ్చారు కుమార్? బహుశా నా రియల్ ఎస్టేట్ మీద మీకు ఇంట్రెస్ట్ ఉండొచ్చు. ఇప్పుడైతే ఏవీ అమ్మాలని ఆలోచన లేదు. అసలే ఆలోచనా లేదు. బుర్ర మొద్దుబారిపోయి ఉన్నది.”
“ఈ ఉత్తరం మీకోసం.” అని మీరిచ్చిన కవరు అతని కందిచ్చి ఊరుకున్నాను.
అతడు డెస్క్ దగ్గరకు వెళ్ళి కూర్చుని అది చదువుకున్నాడు. అతని కళ్ళవెంట నీరు. రెండు రాట్‌వైలర్లూ గురగురలాడుతూ అతనికి పక్కనే వెళ్ళి పడుకుని, అతని చేతులను ఆప్యాయంగా ఓదారుస్తూ నాకాయి.
అతడు బరబరా సంతకాలు చేసి కొన్ని కాగితాలు డెస్క్‌లో పడేసి, కొన్నికవర్లో పెట్టి సీల్ చేసి నాకిచ్చాడు.
“ఈ రాత్రికి మా చెఫ్ ప్రొవాన్స్ వంటకాలు రుచి చూసి రేపు వెడుదురుగాని. ప్రొవాన్స్ వైన్స్, షెర్రీలు, కోన్యాక్ కనీసం మీరు రుచి చూస్తే ఆనందిస్తా. నాకిప్పుడు ఏ భోజనం, ఏ పానీయం ఎలానూ రుచించదు.” అన్నాడు.
కుమార్ అక్కడ కథ ఆపి, అడిగాడు.
“ఏమిటి నిసీ? ఈ ఘోరం? ఏం జరిగింది అతనికి?
“కాన్సర్. నోట్లో. అది నయం చెయ్యటానికని, కమాండో ఆపరేషన్ అని – కొంత దవడ ఎముక, నాలుక, ఆ వైపు మెడలో లింఫ్ నోడ్స్, కండరాలు తీసివెయ్యటం- చేస్తారు.”
“అయ్యో!”
“అవును. ఎన్నో కేన్సర్లకు ఇంకా సరైన చికిత్సలు లేవు. ఇలాటి దారుణమైన ఫలితాలు కొందరు మనుషులు మౌనంగా భరిస్తారు. నేను కాన్సర్ ఫీల్డ్‌లో అంతకు ముందు పని చేసి ఉన్న డాక్టర్ని. నన్ను చూస్తే మైఖల్‌కి ఇంకా కోపం రగులుతుంది. అందుకే మిమ్మల్ని పంపాను.”
“అతన్ని అలా అప్పటికప్పుడు విడిచి రాబుద్ధి కాలేదు నిసీ. నేనందుకే రాత్రి అక్కడే ఆగిపోయా.”
“చాలా మంచి పని చేశారు. మిమ్మల్ని ఈ పని మీద పంపి మీకు అనవసరంగా విషాదం కలిగించినందుకు సారీ! కానీ మీరూ ఒక బాధ్యత గలిగిన వృత్తిలోనే ఉన్నారు. కేన్సర్ వచ్చిన వారి మీద, వారి ఫేమిలీల మీద క్రూరవైద్యాల భారాలు పెట్టటమూ, అవి భరించే మనుషులు హిరోయిక్ అనే రాతలు మేగజీన్లలో ప్రచారంలో పెట్టి, మనుషుల రోగాలూ అవకరాల చుట్టూ – ఛారిటీలు, నాట్యాలూ, గానాలూ అరేంజ్ చెయ్యటం మంచిదా?”
సెప్టెంబర్ 30 రాత్రి. హిల్టన్ లాబీ రెస్టారెంట్. న్యూయార్క్ నగరం.
లాబీలో ఆనియన్ బిస్క్ సూప్ తాగుతూ మాట్లాడుకుంటున్నారు నిసి, లాజ్లో.
“జరిగినదేమిటో, అగాథా క్రిస్టీ నవల్లో ఆఖరి పేజీల్లో లాగా చెప్పమంటావా?”
“చెప్పు. నీ ఊహా కధనం.”
“మైఖల్‌కి కమాండో ఆపరేషన్ చేసి ఇంకా రెండు నెల్లు కాలేదు, అతని నోట్లో ఇంకోవైపు కేన్సర్ ఉన్నట్లు బైట పడింది. ఈ సారి రేడియేషన్ తీసుకొమ్మన్నాడు డాక్టర్ నెల్సన్ అతన్ని. ఇంత త్వరగా ఇంకో కేన్సర్ వచ్చేట్లయితే ఇంత ఘోరమైన ఆపరేషన్ ఎందుకు చేశావయ్యా? అంటే నెల్సన్ తింగిరిగా సమాధానాలిచ్చాడు. మైఖల్‌కి భగ్గున మండి, ఇప్పటికిప్పుడు నా ప్లేన్ తీసుకుని వస్తున్నా. నే వచ్చేదాకా ఇంటికి వెళ్ళకు. ఈ సాయంత్రమే నిన్ను కలుస్తా నీ ఆఫీసులో. నీ సంగతి ఏమిటో తేలుస్తానన్నాడు. నెల్సన్‌కి ఆందోళన మొదలయ్యింది. ఆ మధ్యాహ్నమే దవడ నెప్పి, ఎడమ చెయ్యి పోటు కలిగితే నెల్సన్‌కి ఏన్జియోగ్రామ్ చేశారు. కరొనరీ ఆర్టెరీలో బ్లాక్ ఉందనీ, మర్నాడే స్ట్రెస్ టెస్ట్‌కి రమ్మనీ, వెంటనే ఓపెన్ హార్ట్ సర్జరీ చెయ్యాల్సి రావచ్చనీ అతనికి చెప్పారు.
నెల్సన్ నిజానికి ఉత్త చికెన్. తన ఆఫీసులో వాళ్ళంతా ఇంటికి పోయాక ఒక్కడే కూర్చుని మైఖల్ కొసం ఎదురు చూస్తున్నాడు, తన జబ్బు, ఆపరేషన్ గురించి ఆలోచిస్తూ. ఆ భయంతో అతనికి గుండె పోటు వచ్చింది. కూర్చున్న వాడు కూర్చున్నట్లుగానే గుండె ఆగి చచ్చిపోయాడు. కొంచెం సేపటికి నెల్సన్ మీద విరుచుకు పడదామని, అసలు అతన్ని చంపాలన్నంత ఆవేశంతో వచ్చిన మైఖల్‌కి ఆశాభంగమే అయ్యింది. అతనికి పోలీసుల్ని పిలవాలని, నెల్సన్ చావు రిపోర్ట్ చెయ్యాలని – అలాటి మామూలు నీతి నియమాలు లేవు. అప్పటికే డ్రగ్స్, ఎసాల్ట్, డ్రంక్ డ్రైవింగ్- ఇలాటి చార్జెస్ మీద మాట్లాడితే ఎన్నోసార్లు అతన్ని జైల్లో పడేశారు పొలీసులు.
అతడికి విసుగొచ్చింది. అసలే ఎక్సెంట్రిక్. నెల్సన్ని స్ట్రెచర్ మీద పడేసి, బర బరా రేడియేషన్ రూంకి తోసుకు పోయి, అతని ఐడీ కార్డ్ తోనే తలుపులు తెరిచి – “ఇంత చేసింది చాలదూ? ఇంకా ఏం మిగిలిందని? నేను రేడియేషన్ తీసుకోవాలా? దేనికి? మీ డాక్టర్లకు ఏదో పని కల్పించటానికా? నువ్వే తీసుకో. పిశాచి వెధవా. హాయిగా పడుకుని రేడియేషన్ పుచ్చుకో. ఆ తర్వాత గో టు హెల్! – అని నెల్సన్ శవాన్ని ఆ బల్ల మీద పడేసి, మళ్ళీ తలుపులు వేసేసి వెళ్ళిపోయాడు.”
స్వయంగా చూసినట్లే నిసి చెపుతుంటే, ముఖంలో రంగులు మారుతుండగా ఆ కథనం విన్నాడు డాక్టర్ లాజ్లో బేకస్. తర్వాత ఉక్రోషంతో ఇలా అడిగాడు.
“నిసీ! డాక్టర్ నెల్సన్ కరొనరీ బ్లాక్ తో చనిపోయినట్లు అటాప్సీలో తెలుస్తుందని, మైఖల్ కి కేన్సర్ ఉన్నట్లూ, అతను ఇన్నొసెంట్ అని తెలిసి కూడా నువ్వు ఎందుకు అర్ధంతరంగా ఫ్రాన్స్ వెళ్ళినట్లు? నాతో ఈ చెత్త పేపర్ వర్కంతా ఎందుకు చేయించినట్లు?”
“అట్లా నన్ను దబాయిస్తే నీకు ఈ ఆర్ట్ వర్క్ ఇచ్చేది లేదు. ఎంతో ప్రేమతో, మౌంట్ ఎజ్ వాటర్ కలర్ లోకల్ ఆర్టిస్ట్ తో అప్పటి కప్పుడు గీయించుకువచ్చా నీకోసం. మన్హాటన్ లో లీ’స్ ఆర్ట్ షాప్ కి వెళ్ళి ఫ్రేం కూడా చేయించా చూడు.” అందులో ఎడమ పక్కన నిసి చిత్రించిన గుస్టాఫ్ క్లింట్ ‘ది కిస్’ ని పోలిన ఒక జంట బొమ్మ, కుడి పక్కన అదే సైజు ‘మౌంట్ ఎజ్’ వాటర్ కలర్ చక్కగా మౌంట్ చేసి ఉన్నాయి.
“ఎందుకు పారిస్ వెళ్ళానా? నెల్సన్ చావుకీ నాకూ ఏమీ సంబంధం లేకపోయినా, అతని శవాన్ని మీతో పాటు చూసినందుకు, పోలీసులు నన్ను కూడా ప్రశ్నించి, నా టెస్టిమొనీ తీసుకుని, ఈ కేసు తేలేదాకా నన్ను కోర్టులకి పిలిచీ, ఫోన్లు చేసీ… – ఈ తలకాయ నొప్పి నాకెందుకు? నీకు గుర్తు లేదోమో, నాదీ కుమార్‌దీ ఒకే పుట్టిన రోజు. హాయిగా పారిస్లో ఆ రోజు ఐఫిల్ టవర్ చూసి, సేన్‌లో పడవ షికారు చేసి ఆ రాత్రి బెస్ట్ ఇండియన్ రెస్టరాంట్ ‘రత్న’ లో భోజనం చేశాం. ఈ చచ్చిన సర్జన్ గొడవలో పడి, బ్రతికున్న నేను నా టైం ఎందుకు వేస్ట్ చేసుకోవాలి? పిచ్చి దండగ. మా పుట్టినరోజు పారిస్‌లో ఎంతో హాయిగా గడిచింది.
మర్నాడు, కుమార్ నీస్‌లో మైఖల్ని చూడ్డానికి వెళ్ళాడు. నేను ఇంటర్నేషనల్ మ్యూజిక్ స్కూల్లో ఒక కాన్సర్ట్ వింటానికి వెళ్ళాను. సమయం వృధా పోకుండా ఇంత ఆనందంగా గడిచింది.
అనుకున్నట్లే న్యూయార్క్ తిరిగి వచ్చేసరికి కేస్ దానంతట అదే విడిపోయింది కదా. అదీ కాక మైఖల్ టెస్టిమోనీ కూడా తీసుకొచ్చా గదా. అతడు శవాన్ని ఒకచోటి నుంచి ఇంకో చోటికి మార్చినందుకు ఇప్పుడు పోలీసులు గాని, హాస్పిటల్ గాని ఏమీ గొడవ చెయ్యరు. చేస్తే అందరూ ఎంతో ఉత్కంఠతో ఎదురు చూస్తున్న సినిమా కలెక్షన్లు దెబ్బతినవూ? 50- 60 మిలియన్ డాలర్ల వ్యవహారం కదా. పబ్లిక్ కి అతనికి జరిగిన అన్యాయం తెలిస్తే, సింపథీ అతని మీదే ఉంటుంది. మైఖల్ వికార రూపం బైట పెడితే హాస్పిటల్ మీద, పోలిస్ మీద, ధన నష్టం గురించి కొత్త సినిమా ప్రొడ్యూసర్లు లా సూట్లు వెయ్యొచ్చు. మైఖల్‌కి డబ్బు సంపాదించుకోటానికి ఇక ఇదే ఆఖరి చాన్స్. ఇక అతడు పబ్లిక్కి తన ముఖం చూపడు.
నేను ఓ నాలుగు రోజులు యూరప్‌లో గడిపి వచ్చినందుకు ఇందులో ఎవరికీ నష్టం రాలేదే. నువ్వు కూడా పారిస్ వచ్చి ఉంటే బాగుండేదనుకో. ఎజ్ విలేజ్లో అసలు మనిద్దరం ఫ్రూడ్రిక్ నీఛ నడిచిన ఆ దారుల్లో నడిచి, అతని జరతుస్త్రా చదివి ఉండాల్సింది. కాని నీకు ఇక్కడ న్యూయార్క్ లో బాధ్యతలున్నాయిగా! పాపం!” – నిసి నవ్వింది.
“He who climbs upon the highest mountains laughs at all tragedies, real and imaginary – Thus spake Zarathustra” అంటూ నవ్వాడు లాజ్లో కూడా.
“యూ ఆర్ ఎ వికెడ్ విచ్! పేరు మార్చుకోరాదూ నీఛ అని. సోగ్గా ఉంటుంది. కొన్నాళ్ళకు అతనిలా నీకు వెర్రి ఎక్కుతుంది. ఈ పిచ్చి బొమ్మలు నాకెందుకు. నీతో ఆంకాలజీలో ఏదో వాదన పెట్టుకుంటే నీ బ్రెయిన్ సంగతేమో గాని నా బుర్ర బాగా పని చేస్తుంది. ఐ విల్ గెట్ యూ బేక్ నిసి. ఈ ఆర్టూ, గీర్టూ, ఆర్టిస్టులూ, ఈ సాహిత్య పత్రికలూ, కుబేరుడు కుమారూ, ఇంకో సంగీతం సుకుమారూ, ఈ తిరుగుళ్ళూ – ఈ నాన్సెన్స్ ఇంకెన్నాళ్ళో సాగనివ్వను. సైన్స్ లోకి మళ్ళీ లాక్కొస్తాను. యూ జుస్ట్ వెయిట్ డాక్టర్ నిసీ షామల్! యూ జుస్ట్ వెయిట్” – అన్నాడతను ఎర్ర గడ్డం నిమురుకుంటూ.
ఆమె -పురూరవలో శారదా శ్రీనివాసన్ లా, కెథెడ్రల్‌లో బెల్స్ లా హాయిగా నవ్వింది –
“గుడ్ లక్! ఎండ్ గాడ్ స్పీడ్!” అంటూ.
(డాక్టర్ నిసీ షామల్ 2009 డైరీ నుంచి)