‘వచన పద్యం పద్యమే’ అన్న వ్యాసంతో శ్రీ సంపత్కుమార ఒక గడుసైన ప్రశ్న వేశారు. ఒక వ్యాసంలోని వాక్యాలను భావ, భావాంశాల పద్ధతిలో పాదవిభజన చేసి వచన పద్యంగా నిరూపించ వచ్చునని నేనన్న దానికి అంగీకరిస్తూనే ఇలా ప్రశ్నించారు -’మరి సాంప్రదాయిక ఛందస్సుల ననుసరించి, వ్యాసాన్ని ఇరవయ్యారేసి అక్షరాలుగా (అంతకు తక్కువగా కూడా) విభజించి విషమ వృత్తాలుగా నిరూపించవచ్చు. ఈ విధంగా ఈనాటి వచన పద్యాన్ని ‘విషమ వృత్తం’గా పరిగణించవచ్చునని ఒక మిత్రుడు సూచించినాడు. మరి దీనికి ఏమనాలి?’ దీని అర్థం ఏమిటంటే గద్య పద్యాన్ని వేరు చేసే శక్తి భావగణ పద్ధతికి లేనిమాట నిజమే అయినా, ప్రాచీన ఛందస్సిద్ధాంతానికి కూడా ఈ అవస్థ తప్పదని. ఇది నిజమైతే ప్రాచీన ఛందస్సాంప్రదాయం ఈ మేరకు లోపభూయిష్టం కావాలి. ఏ ఛందస్సిద్ధాంతమైనా గద్యపద్యాల్ని వేరు చెయ్యలేకపోతే, దాని ప్రధానమైన ప్రయోజనమే దెబ్బ తిన్నట్టు. ఈ దృష్టితో ప్రాచీన ఛందశ్శాస్త్రాన్ని పరిశీలించాల్సిన అవసరం ఉంది. ప్రాచీనుల ఛందశ్శాస్త్రాన్ని ఈ కింది పద్ధతిలో ఒక వృత్తనిర్మాణ యంత్రంగా ఊహిస్తున్నాను. ఇట్లాంటి యంత్రాన్ని ఇదే పద్ధతిలో వాళ్ళు ఊహించారని నా ఉద్దేశం కాదు. ప్రాచీన ఛందస్సిద్ధాంతాన్ని అర్థం చేసుకోటానికి ఈ ఊహాయంత్రం సహాయకారి అని మాత్రమే.
ఈ యంత్రంలో మూడు భాగాలున్నై. 1. పాదోత్పత్తి విభాగం, 2. పాదనియమ విభాగం, 3. పాదబంధన విభాగం. మొదటి అర అక్షర క్రమాల్ని ఉత్పత్తి చేస్తుంది. రెండో అర పాదాలకు అంతర్నియమాలను విధిస్తుంది. మూడో అర సమానమైన పాదాలను ఏరుకొని ప్రాసనియమంతో బంధిస్తుంది. విషమ వృత్తాలకు సంబంధించిన నియమాలు కూడా ఈ అరలోనే ఉంటై. ఈ యంత్రానికి ముడిసరుకు భాషలో వాక్యాలు. చివరికి ఉత్పత్తి అయ్యేవి వృత్తాలు. జాతులు, ఉపజాతులు, మాత్రాఛందస్సులకు ఈ యంత్రం సరిపోదు. అక్షర ఛందస్సులకు మాత్రమే ఇది సరిపోతుంది.
అక్షర భేదాల సంఖ్య (గురు-లఘువులు) 2. ఇది స్థిరాంకం. పాదంలో అక్షరాల సంఖ్య 1 నుంచి 26 వరకూ ఉండొచ్చు. 26 అక్షరాలకు మించి పాదాలున్న లయగ్రాహి (30), లయవిభాతి (34), లయహారి (37) వంటి వృత్తాలను పేర్కొనటాన్ని బట్టి చూస్తే పాదంలో అక్షరాల సంఖ్య మీద గరిష్ఠ పరిమితి విధించటం ప్రాచీనుల ఉద్దేశం కాదని ఊహించవచ్చు. కాని, 26 అక్షరాల సంఖ్య వరకు మాత్రమే పేర్లు పెట్టారు. అంతకు ఎక్కువ ఉండటాన్ని వారు నిషేధించలేదు. ఒక్కో ఛందస్సులో అక్షరక్రమాల సంఖ్య 2n (2 to the power of n) అనే గణిత సూత్రం మీద ఆధారపడి ఉంటుంది. పాదంలో ఎన్ని అక్షరాలుంటే అన్నిసార్లు అక్షరభేద సంఖ్యను క్రమంగా రెట్టిస్తూ పోతే పాదంలో అక్షరక్రమాల సంఖ్య వస్తుంది. అదే ఒక్కో ఛందస్సులో పుట్టే వృత్తాల సంఖ్య. పాదోత్పత్తి విభాగం చేసే పని ఇది. ఈ పద్ధతిలో, పాదంలో అక్షరాల గరిష్ఠ సంఖ్య 26 అయితే 13,42,17,726 అక్షరక్రమాలు (ఇదే మొత్తం సమవృత్త సంఖ్య కూడా) సాధ్యమవుతై. విషమ వృత్తాలను పరిగణిస్తే ఈ సంఖ్య ఇంకా పెరుగుతుంది.
‘ప్రస్తారము వలన ఇన్ని కోట్ల వృత్తములున్నట్లు తెలిసినను, ప్రయోగములో నున్న మొత్తము వృత్తాల సంఖ్య అత్యల్పము. వంద, వంద యేబదికి మించకపోవచ్చును’ (సంపత్కుమార, 1962). ఈ ప్రయోగంలో ఉన్న 100 లేక 150 పద్యాలకు లక్షణం చెపితే సరిపోయేది గదా! ఇన్ని కోట్ల వృత్తాలను అనవరసరంగా పుట్టించటం ఎందుకు అనే సందేహం రావడం సహజం. ఉన్న పద్యాలకు లక్షణం చెప్పటం పరిమిత లక్ష్యం. భాషలో సాధ్యమైన వృత్తాలన్నింటికీ ఆటోమేటిక్‌గా లక్షణ నిర్వచనం చేసే యంత్రంగా ప్రాచీన ఛందఃకారులు ఛందశ్శాస్త్రాన్ని పరిగణించారు. దీన్నే ఆల్గొరిథమ్ అంటారు. ఈ లక్ష్యం భాషాశాస్త్రంలో వచ్చిన జనరేటివ్ సిద్ధాంత లక్ష్యం వంటిది. ఒక వ్యవహర్త ప్రయోగించే వాక్యాల సంఖ్య పరిమితం అయినా అతనికి అనంతమైన వాక్యాలను ఉపయోగించలగల దక్షత ఉంది. ఇది అతను నిర్మించుకున్న అమూర్త వ్యాకరణం ఇచ్చిన శక్తి. దీనికి భౌతికమైన అవధులు ఉండటం వల్ల వ్యవహర్త ప్రయోగించే వాక్యాల సంఖ్య ఎప్పుడూ పరిమితమే. అట్లాంటి అనంత వాక్యప్రయోగ దక్షత ఇచ్చిన అమూర్త వ్యాకరణానికి మూర్త రూపకల్పనే వ్యాక్కర్తల లక్షం. ఇట్లాంటి దక్షతను ప్రతిభ అని వాక్యప్రయోగాన్ని ప్రవృత్తి అని తెలుగులో వ్యవహరిస్తున్నాను. కేవలం ప్రయోగించిన వృత్తాలకు లక్షణం చెప్పడం కాకుండా భాషలో సాధ్యమైన వృత్త సమస్తానికి ఆటోమేటిక్‌గా లక్షణ నిర్వచనం చేసే సిద్ధాంతంగా ఛందశ్శాస్త్రాన్ని ప్రాచీనులు పరిగణించారు గనుక వీరి సిద్ధాంతాన్ని కూడా జనరేటివ్ సిద్ధాంతంగానే గుర్తిస్తున్నాను.
సాధ్యమైన అన్ని క్రమాలను పద్యభేదాలుగా లెక్క గడితే గద్యానికి పద్యానికి భేదం ఎక్కడ? ఏ వాక్యం తీసుకున్నా ఏదో ఒక అక్షర సంఖ్య ఉంటుంది. ఏదో ఒక అక్షర క్రమం ఉంటుంది. ఇల్లాంటివి నాలుగు కూరిస్తే భిన్న అక్షర క్రమాలతో కూడిన విషమవృత్తం అవుతుంది కదా? అల్లాంటప్పుడు ఏ వ్యాసాన్నయినా ఆ పద్ధతిలో పాదవిభజన చేసి విషమవృత్తాలుగా నిరూపించటానికి వీలులేదా? ఇది సంపత్కుమారగారు ఉద్దేశించిన ప్రశ్న. ఇంత జనరేటివ్ సిద్ధాంతాన్ని ఊహించిన ఛందశ్శాస్త్రకారులకు మాత్రం ఈ ప్రశ్న తట్టి ఉండదా? అందుకే వృత్త నిర్మాణయంత్రంలో మిగతా భాగాలు, వాటిలో నియమాలు. పాదోత్పత్తి విభాగానికి అపరిమితమైన, అవసరానికి మించిన ఉత్పాదకశక్తి ఉంది. దాన్ని అట్లాగే వదిలేస్తే భాషంతా పద్యమే అయే అవకాశముంది. ఈ అపరిమితోత్పాదకశక్తికి కొన్ని కళ్ళేలు తగిలించాలి. ఆ పనే మిగతా అరలు వివిధ నియమాల రూపంలో చేస్తై. ఈ నియమాలు ఒకరకంగా వడపోత పనీ చేస్తై. ఉత్పత్తి అయిన పాదంలో నిర్దిష్ట స్థానంలో విరామం ఉండాలని, పాదాంతంలో విరామం ఉండాలని సంస్కృతంలో పెట్టిన నియమాలు ఇట్లాంటివి. నిర్దిష్ట స్థానంలో యతిమైత్రి ఉండాలనేది తెలుగువాళ్ళు చేసిన కళ్ళెం. ఈ విరామం గాని, యతిమైత్రిగాని ఐచ్ఛికం అని వాదించవచ్చు. విరామం తప్పనిసరి అని వాదించవచ్చు. విరామం తప్పనిసరి అని సంస్కృతంలో కొందరైనా భావించారు (సంపత్కుమార, 1962). యతిమైత్రిని ఐచ్ఛికంగా తెలుగులో ప్రాచీనులెవరూ భావించలేదు. ఐచ్ఛికమని భావించిన వారిలో అక్కిరాజు ఉమాకాంతంగారు ముఖ్యులు. అయితే యతిమైత్రి స్థానంలో విరామం ఉండాలని ఆయన మతం.
ఏకాక్షర ద్వ్యక్షర వృత్తాలుగా వాక్యాలను విభజించవచ్చు. కాని, ఒక వ్యాసాన్నంతటినీ అట్లా విభజించటం సాధ్యం కాదు. పాదాంత విరామం చివరికంటా సరిపడదు; కేవలం ఒక అక్షరంతో గాని, రెండక్షరాలతో గాని అంతమయ్యే మాటలు ఎన్ని ఉంటై? పైగా రెండక్షరాలనగానే తెలుగులో ప్రాసమైత్రి అనేది అడ్డుకుంటుంది. పది అక్షరాల లోపునే పాదపరిమితిని పాటిస్తూ విషమ వృత్తాలు సృష్టించవచ్చు. కాని, పాదాంత విరామం గాని, ప్రాసమైత్రి గాని దెబ్బ తినకుండా ఒక వ్యాసాన్ని వృత్తంగా నిరూపించటం సాధ్యమౌతుందనుకోను. ఇక్కడ గుర్తించాల్సిన విషయ మొకటుంది. ఈ వృత్త నిర్మాణ యంత్రంలో కొత్తనియమాలు పెట్టుకోవటానికి వీలుంది. అట్లాంటి వీలుండటం వల్లనే తెలుగు వాళ్ళు ప్రాసమైత్రి, యతిమైత్రిని చేర్చుకోగలిగారు. ఇట్లాంటి నియమాలకు వీలున్నంత వరకూ వ్యాసాల్ని వృత్తాలుగా నిరూపించే అవకాశమే లేదు. వడపోత నియమాలు ఉండటం వల్ల ప్రాచీన ఛందశ్శాస్త్రం గద్య పద్య విభాగం సరిగ్గానే చెయ్యగలుగుతున్నది. సంపత్కుమారగారి వచన పద్య లక్షణాలకు సిద్ధాంత బలం లేదు. గద్యపద్యాలను వేరు చేసే శక్తి లేదు. అర్థం మీద గాని, భావం మీద గాని ఆధారపడి పద్యరూపాన్ని నిర్వచించే ఏ లక్షణానికైనా ఈ శక్తి ఉండదు.
అయితే, వ్యాసానికీ వచన పద్యానికీ అచ్చులోనేనా భేదం? ‘అంతే’ అని సంపత్కుమార సంతోషంతో అంటారనుకోను. కాని, వారి భావగణ పద్ధతిని అంగీకరిస్తే ఇంకో మార్గం లేదు. వాక్యనిర్మాణంలో భేదం కనిపిస్తుంది. వ్యాకరణ సహాయంతో ఈ భేదాన్ని నిరూపించటం సాధ్యం కావచ్చు. అప్పుడైనా, వచనపద్యాన్ని ఛందోవిభాగంగా నిరూపించటం సాధ్యం కాదు. మామూలు వచనానికి, ఛందోనియమంలేని కవిత్వపు వచనానికి వాక్యనిర్మాణంలో ఎట్లాంటి భేదం ఉందో తెలుసుకోవచ్చు. సాధారణ వ్యవహారాతిరిక్త భాషాప్రయోగం సాహిత్యానికి కనీసం ఒక లక్షణం. ఛందస్సుల్లో ఈ అసాధారణత్వం అక్షరాల కూర్పు వల్ల సాధించబడింది. అంటే, ఇక్కడ అక్షరాల పరిమాణానికి, నిర్ణీతమైన వాటి ఏర్పాటుకు ప్రాధాన్యం ఉంటుంది. ఈ అసాధారణత్వం ధ్వని సంబంధమైనది. వచన పద్యంలో దీనిమీద దృష్టి ఉండదు. అసాధారణత్వం ఇంకో మార్గంలో సాధింపబడాలి. అది వాక్యనిర్మాణం ద్వారా సాధ్యపడుతుంది. ఈ అసాధారణత్వాన్ని గుర్తించటానికి వ్యాకరణం – ముఖ్యంగా వాక్యనిర్మాణ విభాగం – సాయపడుతుంది. (ఈ పేరాలో వాడిన ‘అసాధారణత్వం’ అనే మాటను పరిభాషగా గ్రహించాలి.) ఈ మార్గంలో వచన పద్యాన్ని పరిశీలిస్తే కొన్ని కొత్త విషయాలు బయటికి రావచ్చు. భావగణ పద్ధతివల్ల వచన పద్యాన్ని గురించి మనం గ్రహించగలిగింది ఏమీ లేదు.
సంపత్కుమారా ‘తేషాం ఋక్, యత్రార్థవశేన పాదవ్యవస్థా’ అనే జైమినీయ మీమాంసా న్యాయసూత్రాన్ని ఒకటి ప్రమాణంగా పట్టుకొచ్చారు. అది వచన పద్య పాదవిభజనలో ఎట్లా ఉపకరిస్తుందో నాకు బోధపడటం లేదు. ఎందుకంటే ఋక్కులు వచన పద్యాలు కావు కదా. బండి నాగరాజుగారు (చూ. అనుబంధం) అడిగినట్లు, పఠనంలోనా? లేఖనంలోనా? ఋక్కుల్లో పాదవిభజన పఠనానికి. వచన పద్యంలో పాదవిభజనకు అసలు ప్రయోజనమేమిటో నాకు తెలీదు గాని అచ్చులో మాత్రమే దాని ప్రాధాన్యం కనిపిస్తుంది. పైగా ఋక్కులు అక్షర ఛందస్సులు (గాయత్రి, అనుష్టుప్ మొ.) వాటిల్లో అక్షర సంఖ్య నిర్దిష్టం. నిర్దిష్టమైన అక్షర సంఖ్య ఉన్నా ఇతర నియమాలు లేనప్పుడు పాదవిభజన గ్రహించటం కష్టం అవుతుంది. అటువంటప్పుడు పాదాంతంలో విరామం ఉంటే పాదవిభజన గ్రహించటం తేలికవుతుంది. అట్లా విరామం ప్రకృతి ప్రత్యయాల మధ్య గాని, పదమధ్యంలో గాని సాధ్యం గాదు. అందువల్ల అర్థభంగం కాని విధంగా పాద విరామం ఉండాలి. ‘యత్రార్థవశేనా పాద వ్యవస్థా’ అనే దానికి ఎక్కడపడితే అక్కడ పాదవిభజన చెయ్యవచ్చు అని అర్థం ఉందనుకోను. అట్లా అయితే ఋక్కుల్ని వచన పద్యాలుగా ఎందుకు భావించకూడదు? అక్షర సంఖ్యా నిబద్ధమైన పద్య పాదాల్లో పాదవిభజన అర్థభంగం కలిగించని విధంగా ఉండాలని పై సూత్రానికి తాత్పర్యంగా గ్రహిస్తున్నాను. వచన పద్యాలకూ ఋక్కులకూ ఎట్లా సంబంధం లేదో, వాటిని గురించి చేసిన ప్రతిపాదనలకూ అంతే సంబంధం లేదు. అదీకాక హేతుబద్ధతే ప్రమాణం కన్నా ఎక్కువ విలువైందిగా గ్రహిస్తాను.
ఒక్కోచోట మేమిద్దరం ఒకర్నొకరం అర్థం చేసుకోలేకపోతున్నాం. బహుశా కొన్ని మాటల్ని మేమిద్దరమూ ఒకే అర్థంతో వాడటం లేదేమో? హేతుబద్ధంగా విషయాన్ని పరిశీలించటానికి ఇద్దరమూ ప్రయత్నిస్తున్నా అంగీకారానికి రాలేకపోతున్నాం (రావాలని నియమం ఏమీ లేదు.) బహుశా నేననుకునే హేతుబద్ధత, ఆయననుకునే హేతుబద్ధత ఒకటి కాదేమో.
పూర్వ వ్యాసాల్లో కొన్నిటిని చాలా సంక్షిప్తంగా చెప్పటం వల్ల అవి అపార్థాలకు తావిచ్చినై. ఉదాహరణకు ‘పూర్వ పరవ్యంజనంతో సంబంధం లేకుండా దీర్ఘాచ్చుగాని, పరవ్యంజనంతో మూతబడ్డ హ్రస్వాచ్చుగాని గురువు అవుతుంది’ అన్నాను. దీర్ఘాచ్చు ఎప్పుడైనా గురువే అవుతుందని, హ్రస్వాచ్చు పరవ్యంజనంతో మూతపడ్డప్పుడు మాత్రమే గురువు అవుతుందని నా ఉద్దేశం. పై సూత్రీకరణ అక్షరాలు (Syllables) ఆధారంగా చేసుకుని చెప్పింది. అయితే, నేను కొన్నిటిని వదిలేశాననుకొని సంపత్కుమార వాటిని పూరించారు. అందులో తప్పు లేదు గాని, ఆ పూరణకు అవసరం లేదు. అదే సందర్భంలో గురు లఘు నిర్ణయంలో హేతుబద్ధత లేదన్నారు సంపత్కుమార. అట్లా ఎందుకనుకుంటున్నారో నా కర్థం కావటం లేదు. నేననుకుంటున్న హేతుబద్ధతను కొంచెం సూచిస్తాను.
అచ్చులో హ్రస్వ దీర్ఘ భేదాలున్నై. ఒక్కోసారి ఉచ్ఛారణలో మనం హ్రస్వాచ్చు లనుకుంటున్నవి, దీర్ఘాచ్చు లనుకుంటున్న వాటికన్నా దీర్ఘంగా వినిపించవచ్చు. దీర్ఘాచ్చు లనుకుంటున్న వాటిల్లో కూడా తరతమ భేదాలుండవచ్చు. అందువల్ల వీటి మీద ఆధారపడ్డ గురు లఘు నిర్ణయంలో వ్యత్యయం రాదా అనే ప్రశ్న రావటం సహజం. హ్రస్వ దీర్ఘ స్వర భేదం భాషలో సైకలాజికల్ రియాలిటీ మీద ఆధారపడి ఉంది. ఇది ఫిజికల్ రియాలిటీతో భేదించవచ్చు. ఒకటి రెండు ఉదాహరణలిస్తాను.
తెలుగులో నాకు-చింత అనే మాటల్లో మొదటి మాటలో పదాది, వ్యంజనాన్ని, రెండో మాటలో సున్నాతో సూచించిన వ్యంజనాన్ని ఒకటిగానే గుర్తిస్తున్నాం. (స్పర్శం ముందు అనునాసిక వ్యంజనాన్ని, సున్నాతో సూచించడానికి కారణం ప్రెడిక్టబిలిటీ.) వీటిమధ్య భౌతికమైన ఉచ్ఛారణ భేదం ఉంది. మొదటిది దంతమూలీయం. రెండోది దంత్యం. అయితే, రెండుచోట్లా ‘త’వర్గానునాసికంగానే పరిగణిస్తున్నాం. అట్లాగే మనం స్పర్శాలుగా పరిగణిస్తున్న వర్ణాలు కొందరి ఉచ్ఛారణలో ఊష్మాలు కావచ్చు. ఉదా: ఫలితం, కఫం. మనం ఉభయోష్ఠ్యాలుగా పరిగణిస్తున్న వర్ణాలు కొందరి ఉచ్ఛారణలో దంతోష్ఠ్యాలుగా వినిపించవచ్చు. ఉదాహరణకు ప, బ, మలు, రెండు పెదాలూ మూయడానికి ఇబ్బంది ఉన్న వ్యవహర్తల ఉచ్ఛారణలో దంతోష్ఠ్యాలుగా వినిపించవచ్చు. ఈ వ్యవహర్తల తెలుగు భాషకు చేసే వర్ణ నిర్ణయంలో భౌతికమైన భేదాలు అడ్డు కావు. సైకలాజికల్‌గా ‘న’ వర్ణం దంత్యమే. ‘ఫ’ వర్ణం స్పర్శమే. ‘ప, బ, మ’లు ఉభయోష్ఠ్యాలే. ఇక్కడ తప్పొప్పుల ప్రసక్తి లేదు. ఇది హేతుబద్ధమైన నిర్ణయమే. అట్లాగే గురు లఘు నిర్ణయం కూడా. గురు లఘు భేదం భాషలో అక్షర పరిమాణానికి సంబంధించింది. భాషకు సంబంధించిన నిర్ణయాలు చేసేటప్పుడు సైకలాజికల్ రియాలిటీనే పరిగణించాలి. గురు లఘు నిర్ణయంలో ప్రాచీనుల్లో మత భేదాలున్నంత మాత్రాన వాటిని వ్యవస్థారాహిత్యానికి సూచకాలుగా గ్రహించకూడదు.
నేను ప్రత్యేకంగా ప్రస్తావించని విషయాలను నేను అంగీకరించినట్టుగా భావిస్తున్నారు సంపత్కుమార. ‘అయితే, నేను విభజించిన రీతిని గూర్చి రామారావుగారు ఏమీ అనలేదు కాబట్టి నా విభజన సరిగానే ఉందనుకోవాలె’ అని రాశారు. వచన పద్యంలో పాదవిభజనకు నిర్దిష్ట సూత్రం ఏమీ లేదని వాదించే నేను, ఆయన గానీ, మరొకరు గానీ చేసే పాదవిభజనను ఎట్లా అంగీకరిస్తాను? అసలు అంగీకరించటం, నిరాకరించడం అన్న సమస్య కూడా రాదు. ఆర్బిట్రరీగా జేసే విభజన తప్పు కాదు, ఒప్పూ కాదు.
పద్యవిభజనలో ఉన్న వైవిధ్యాన్ని గురించి చెబుతూ, ఛందస్‌శ్లేషను గురించి ప్రస్తావించాను. సంపత్కుమార దాన్ని నేను ఉద్దేశించిన అర్థంలో గ్రహించలేదు. పద్యవిభజనలో భిన్నత్వం predict చెయ్యదగింది అవునా, కాదా అనే దృష్టితో నేను పరిశీలించాను. ఈ విషయాన్ని స్పష్టంగా తెలియజెయ్యటం కోసం వ్యాకరణ భిన్నత్వం ఒకే వాక్యానికి రెండర్థాలను ఎట్లా కలిగిస్తుందో పరిశీలిస్తాను.
ఇంట్లో బియ్యం లేవని మా ఆవిడ రొట్టెలు చేసింది.
ఈ పై వాక్యానికి రెండర్థాలున్నై. ఆ అర్థాలు కింది వాక్యాల్లో వ్యక్తమౌతున్నై.
1. ఇంట్లో బియ్యం లేవు కాబట్టి మా ఆవిడ రొట్టెలు చేసింది. (హేత్వర్థం.)
2. “ఇంట్లో బియ్యం లేవు” అని (నాతో అని) మా ఆవిడ రొట్టెలు చేసింది. (అనుకరణార్థం.)
ఈ రకమైన భిన్నార్థకత వ్యాకరణం ప్రెడిక్టు చేస్తుంది. మొదటి అర్థం ‘అని’ని అను ధాతువునుంచి ఏర్పడ్డ క్వార్థకరూపంగా అన్వయించటం వల్ల వచ్చింది. (అనుకరణలో వచ్చే ‘అని’ వెనువెంటనే వచ్చే అనుధాతు నిష్పన్న రూపాలముందు వికల్పంగా లోపిస్తుంది.) రెండో అర్థం ‘అని’ని అనిష్పన్నమైన అవయవిసూచకంగా గ్రహించటం వల్ల వచ్చింది. అనుధాతువునుంచి నిష్పన్నమైన క్త్వార్థక క్రియ అవయవిసూచకమైన ‘అని’ ఒకే రూపంతో ఉండటం వల్ల ఈ అర్థ భేదం వచ్చింది. నిర్దిష్టమైన వ్యాకరణ సూత్రాల మీద వాక్యనిర్మాణం ఆధారపడి ఉండటం వల్ల ఈ భిన్నార్థకతను ప్రెడిక్టు చెయ్యగలిగాం. కానీ, ఈ కింది వాక్యాన్ని పరిశీలించండి.
సీత అలంకరించుకొని మా ఇంటికి వచ్చింది.
ఇక్కడ సీత పాశ్చాత్య పద్ధతిలో అలంకరించుకొన్నదా? ప్రాచ్యపద్ధతిలో అలంకరించుకున్నదా? ఉత్తరాది పద్ధతిలో ముడి వేసుకున్నదా? దక్షిణాది పద్ధతిలో పూలజడ వేసుకొన్నదా? అనే విషయం వ్యాకరణం చెప్పలేదు. వీటిల్లో ఏ అర్థమైనా రైటు కావచ్చు. లేక ఇంకేదైనా కావచ్చు. సీత అనే అమ్మాయిని చూస్తే తప్ప ఏ విషయమూ చెప్పలేము. అందువల్ల ఇక్కడ (సూత్రబద్ధమైన) శ్లేష లేదు. ఈ పద్ధతిలో సంపత్కుమార ఉదాహరించిన ‘మధుర మధురమైన మామిడి పండ్లను’ పరిశీలించాను. ఇవి సీసభాగమా, ఆటవెలది భాగమా అనేది మనం ప్రెడిక్టు చెయ్యవచ్చు. అంటే రెండింట్లో ఏదో ఒకటిగా మాత్రమే విభజించటానికి వీలున్నదని చెప్పవచ్చు. వచన పద్య పాదవిభజనలో భిన్నత్వం అట్లాంటిది కాదు. దీనికి నిర్దిష్ట సూత్రాలు లేవు. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే ‘మధుర మధురమైన మామిడిపండ్లను’ విభజించటానికున్న భిన్న పద్ధతులను మనం ముందుగా చెప్పవచ్చు. ఛందశ్శాస్త్రం అందుకు సాయపడుతుంది. పాదవిభజన లేకుండా రాసిన వచన పద్యాన్ని ఒకరికి పాదవిభజన చెయ్యమని ఇస్తే అతను ఏయే పద్ధతుల్లో చెయ్యటానికి వీలుందో ప్రెడిక్టు చెయ్యగలమా? అతను విభజన చేసిన తరువాత నువ్వు ఇట్లా ఎందుకు చేశావంటే కారణం చెప్పగలడా? అందుకే సంపత్కుమార అచ్చులో కాని, రాతలో కాని పాదవిభజన సూచించాలనటం. అంటే అట్లా ప్రెడిక్టు చెయ్యటానికి వీల్లేదని వారంగీకరించినట్టే. వచన పద్యంలో కూడా అట్లా ప్రెడిక్టు చెయ్యటానికి వీలుందని, అయితే ఆ విభజించేవాడు ఈ ప్రెడిక్టు చేసేవాడూ భావగణాలని తెలుసుకొని ఉండాలని వాదిస్తే సంపత్కుమార వాదానికి బలం వచ్చేది. ఆ భావగణాలను గుర్తు పట్టటం అన్నది వేరే ప్రశ్న. సంపత్కుమార విధాన్ని గురించి ఎట్లాగూ వేరే ఆలోచించాలి. నేనుద్దేశించిన దాన్ని సంపత్కుమార గ్రహించలేదు. అందుకే, ‘అక్కడ వేరు వేరుగా విభజించేందుకు గల అవకాశం ప్రధానం గాని, రెండు విధాలుగానా? మూడు విధాలుగానా? అన్నది ప్రధానం కాదు’ అని రాశారు. ఎన్ని విధాలుగా అన్నది కూడా ఇక్కడ ప్రధానమే. ప్రెడిక్టు చెయ్యటమంటే అదే. సూత్రబద్ధమైన శ్లేష ఉన్నప్పుడు ఎన్ని విధాలుగా విభజించటానికి వీలుందో ప్రెడిక్టు చెయ్యవచ్చు. మధుర మధురమైన మామిడిపండ్లను (జాతుల్లో) రెండు రకాలుగా మాత్రమే ప్రెడిక్టు చెయ్యటానికి వీలుంది. వచన పద్యానికి సూత్రబద్ధత లేదు గనుక అట్లాంటిది సాధ్యం కాదు. ఒకవేళ ప్రెడిక్టు చేస్తే వ్యాకరణాంశాలను బట్టి చెయ్యవచ్చు. అప్పుడది ఛందస్సుకు సంబంధించినది కాకుండా పోతుంది.
ఇక భావగణాల దగ్గరికొస్తే వాటిని వివరించానంటున్నారు సంపత్కుమార. ఆ వివరణ చాలదంటున్నాను. ‘అనల తోరణం’ అనే కూర్పులో ఇది భావగణం, ఇది భావాంశం అని చూపించిన మాట నిజమే. ఎందువల్ల ఇది భావగణం, ఎందువల్ల ఇది భావాంశం అనే ప్రశ్నలు వారు వేసుకోలేదు. నేను వేసిన వాటికి సమాధానాలియ్యలేదు. ‘ఇక్కడ భావం పూర్తి అవుతున్నది. ఇక్కడ భావం స్ఫురిస్తున్నది’ అనేవాటిని సంతృప్తికరమైన సమాధానాలుగా నేను గ్రహించలేను. ఇది ఇంతేనంటే నేను చెయ్యగలిగిందేమీ లేదు. ఇక వాదాలు అంతటితో ఆగిపోవటం తప్ప మార్గాంతరం లేదు. ఇంతకు పూర్వం లక్షణాలు చెప్పినవాళ్ళు ఇట్లాంటి ప్రశ్నలు వేసుకున్నారు. ఆ దృష్టితో లక్షణాలు చెప్పారు. వాటిని మనం అన్వయించుకొని చూడవచ్చు. అందువల్ల అవి శాస్త్ర ప్రతిపాదనలుగా నిలబడగలిగినై – అవి సమగ్రమా? అసమగ్రమా? అనేది వేరే ప్రశ్న.
పద్యానికి పాదబద్ధత అనేది ప్రధానాంశం అని మేమిద్దరమూ అంగీకరిస్తున్నాం. ఆ పాదబద్ధత ఎట్లాంటిది అనే అంశం మీదనే భేదిస్తున్నాం. పాదవ్యవస్థను అర్థం చేసుకోటానికి అంతర్నిర్మాణమూ, బాహ్య పరిమితీ అనే అంశాలను నేను ప్రతిపాదించాను. నిజానికీ మాటలు మాత్రమే నేను కొత్తగా ప్రతిపాదించినవి. ఈ భావాలు పూర్వం నుంచీ ఉన్నవే. లేకపోతే ఒక పాదంలో అక్షరాల క్రమాల గురించి గాని, గణ క్రమాన్ని గురించి గాని, ఫలాని అక్షరం ఫలానిదై ఉండాలని గాని, ఫలానిది కాకూడదని గాని చెప్పటానికి కారణం కనిపించదు. పాదవ్యవస్థకు అడ్డువచ్చేది దండకం ఒకటి ఉంది. ఒక్కో గణాన్ని పాదంగా పరిగణిస్తే పాదవ్యవస్థను దానికి కూడా అన్వయించుకోవచ్చు. మాలికా వృత్తాలకు దండకానికి భేదం (తెలుగులో) ఒకటే కనిపిస్తున్నది. దండకానికి ప్రాసనియమం లేదు. ప్రాసనియమం లేని మాలికా వృత్తంగా దండకాన్ని పరిగణించవచ్చు. అంతర్నిర్మాణ విషయంలో ఏకాక్షర వృత్తం లొంగదు. ఒక సెట్ తనలో తాను అంతర్భాగం కూడా అవుతుందన్న గణిత శాస్త్ర ప్రతిపాదనను దీని కన్వయించవచ్చు గానీ, దానివల్ల సాధించగలిగిన ప్రయోజనాల విషయంలో నాకు స్పష్టమైన అభిప్రాయం లేదు. అందువల్ల పై రెండు ఛందోభేదాలనూ అపవాదాలుగానూ, వాటి గురించి నేను చేసిన సూచనలు తాత్కాలికమైనవిగానూ గ్రహించాలి.
నేను ప్రతిపాదించిన బాహ్యపరిమితి విషయంలో సంపత్కుమారకు పేచీ లేదు. అంతర్నిర్మాణం విషయంలోనే అభ్యంతరం చెబుతున్నారు. నిజానికి అభ్యంతరం చెప్పాల్సిన అవసరం లేదు. అంతర్నిర్మాణం ఉంటుందని ఒప్పుకోటమూ, అది ఫలాని విధంగా ఉంటుందని ఒప్పుకోటమూ ఒకటి కావు. ఈ రెంటినీ సంపత్కుమార కలిపేస్తున్నారు. ‘ఏ విధమైన పద్యపాదానికి కూడా అంతర్నిర్మాణమంటూ ఏదీ ఉండదు’ అనే వాక్యం వారి అసలు ఉద్దేశాన్ని వెల్లడించడం లేదు. అంతర్నిర్మాణం చెప్పటానికి గణపద్ధతి ఒకటే ఉందని నేననుకుంటున్నట్టు సంపత్కుమార అనుకుంటునట్టున్నారు. ఈ విషయంలో నా అభిప్రాయాన్ని బండి నాగరాజుగారు (చూ. అనుబంధం) విస్తరించారు గనుక దాన్ని గురించి ఇక్కడ ఎక్కువగా ప్రస్తావించను. ‘పాదం అక్షర సముదాయం కాదు, గణ సముదాయం’ అని నేను మొదటి వ్యాసంలో అన్న మాట స్థూలదృష్టితో చెప్పింది. నా రెండో వ్యాసంలో దాన్ని గురించి విపులంగా చర్చించి అంతర్నిర్మాణానికి గణసహాయం అవసరం లేదన్న సంపత్కుమార సూచనను వృత్తాల విషయంలో గ్రహించాను. మాత్రాపద్యాల విషయంలోనూ, జాతుల విషయంలోనూ గణ సహాయం అవసరం అన్నాను. అంటే గణాల్లేకుండా లక్షణం చెప్పడం అసలు కుదరదని కాదు. అట్లా చెప్పటంలో సంక్షిప్తత లేదని నా ఉద్దేశం. దాన్నే ‘ఏకైక పద్ధతి’ అన్నాను. గణాల పద్ధతిలో చెప్పటంలో సంక్షిప్తత ఉంది. సౌలభ్యం ఉంది. ఈ మాటల్ని మామూలు అర్థాల్లో కాక పరిభాషలో వాడుతున్నాను. కాయితం మీద తక్కువ చోటు పడుతుంది కాబట్టి సంక్షిప్తత, సూత్రం తేలిగ్గా చదవ్వచ్చు కాబట్టి సౌలభ్యం అవసరమని నా ఉద్దేశం కాదు. పట్టే చోటుతోగాని, చదివే సౌకర్యంతోగాని శాస్త్రానికి సంబంధం లేదు. ఇంతకన్నా ఎక్కువ ప్రయోజనం ఉంటేనే సంక్షిప్తతకూ, సౌలభ్యానికీ శాస్త్రంలో ప్రవేశం ఉంటుంది. స్పష్టత కోసం వ్యాకరణం నుంచి ఒక ఉదాహరణ చూపిస్తాను. సంకేతాల ద్వారా ఈ సంక్షిప్తత సాధించబడింది. బాలవ్యాకరణంలో ఈ దిగువ సూత్రం ఉంది.
“అగు, వచ్చు, చొచ్చు, చూచులకు ముత్తు పరంబగునప్పుడు కా, రా, చొరు, చూడులగు.” (క్రియ – 91.)
తెలుగు క్రియల్లో కొన్నింటికి భిన్నపరిసరాల్లో వచ్చే రూపభేదాలను వాటి వర్ణసంయోజనాన్ని బట్టి నిర్ణయించలేం. అట్లాంటివి పైన సూత్రంలో చెప్పిన క్రియలు. ఈ రూపభేదాన్ని కలిగించే పరిసరాలు ముత్తు అన్న సంకేతంతో సూచించబడ్డయ్. ఈ ముత్తు వేటికి సంకేతమో వ్యాకరణంలో ఇంకో చోట చెప్పబడింది. ఈ ముత్తు అనే సంకేతం లేకుండా చెప్పకూడదా అంటే తప్పకుండా చెప్పవచ్చు. అయినా వ్యాక్కర్త సంక్షిప్తతనే వరించి ముత్తు అనే సంజ్ఞను వాడాడు. నిజానికి ఈ ముత్తు ఏమిటో తెలుసుకోవాలంటే వేరే సూత్రాలు వెతుక్కోవాలి. ఆ రకంగా చదవటంలో క్లిష్టత కూడా ఉంది. అయినా ఈ సంకేతాన్ని వాడటంవల్ల వ్యాక్కర్త సాధించేదేమిటంటే శాస్త్ర సంక్షిప్తత, అదే ‘ఏకైక పద్దతి’లో చెప్పటం. భిన్న పరిసరాల్లో జరిగే మార్పుల్లో ఉన్న ‘ఏకత’ను ఈ సూత్రం ద్వారా వ్యక్తపరిచాడు. ఈ పరిసరాలన్నీ కలిపి కలిగించే మార్పు ఒక్కటే అన్న విషయం తెలియపర్చటానికే ఈ సూత్రం ఇట్లా రాయబడ్డది. ‘ముత్తు’ అవసరం లేదని ఎవరైనా వాదించవచ్చు. సాధారణీకరణ (జెనరాలిటీ) సాధించదల్చుకున్న వ్యాక్కర్త కిది అవసరమే.
ఈ దృష్టితోనే నేను గణాల అవసరాల్ని పరిశీలించాను. వృత్తాల లక్షణాల్ని గణాలతోనూ చెప్పవచ్చు, అక్షరక్రమంలోనూ చెప్పవచ్చు. గణాలతో చెప్పటంలో సంక్షిప్తత లేదా అంటే మామూలు దృష్టితో ఉందిగాని శాస్త్రదృష్టితో లేదు. అక్షరక్రమంలో చెప్పిన దానికన్నా గణక్రమంలో చెప్పటం వల్ల వృత్తాల్లో సాధించే ‘జెనరాలిటీ’ లేదు. అంటే అక్కడి సంక్షిప్తత శాస్త్ర సంక్షిప్తత కాదు. అందువల్ల వృత్తాల అంతర్నిర్మాణాన్ని చెప్పటానికి గణాల అవసరం లేదంటే గణాల సాయంతో చెప్పలేమని కాదు. అట్లా చెప్పటం వల్ల సాధించే శాస్త్ర సంక్షిప్తత లేదని. కానీ జాతుల విషయంలో అట్లాంటిది ఉంది. భిన్నాక్షరక్రమాలు ఒక అంతస్సూత్రం మీద ఆధారపడి ఉన్నాయన్న విషయాన్ని జాతుల్లో గణ సహాయం ద్వారా చెప్పవచ్చు. అక్షరక్రమంలో చెప్తే ఈ అంతస్సూత్రాన్ని చెప్పలేం. అట్లాగే మాత్రాఛందస్సుల విషయం. అందుకే నా నవంబరు వ్యాసంలో ‘ఏకైక పద్ధతి’ అని వాడింది. దాన్నే బొమ్మల సాయంతో వివరించాను.
జాతులకు నిర్దేశించిన గణాలు సమమాత్రాకాలు కావు. అంతేకాక ఆ గణాలు ఏకైక అక్షరక్రమాన్ని ఇయ్యలేవు. సమమాత్రాకాలు అయితే మాత్రాగణాలతో చెప్పవచ్చు. ఒకే అక్షర క్రమాన్ని ఇస్తే గురు లఘు క్రమ భేదంతోగాని, నిసర్గ గణాల్లోగాని చెప్పొచ్చు. జాతుల గణాల్లోని ఈ వ్యత్యాసాన్ని గురించి చెబుతూ సంపత్కుమార, ‘ఆ గణాల పరిస్థితి అట్లా ఉన్నది’ అని అన్నారు. పరిస్థితి అట్లా ఉన్నది కాబట్టే ఆ గణాలు అక్కడ అవసరమయినై. ‘ఆలోచిస్తే లక్షణ కథనంలోని సౌలభ్యం కోసమే ఈ గణపద్ధతి అని స్పష్టం’ అని రాసినదానితో కూడా నాకు పేచీ లేదు. అయితే ఆ సౌలభ్యం పైన నేను సూచించిన శాస్త్ర సంక్షిప్తతను సాధించేది కావాలి. శాస్త్ర సంక్షిప్తత అవసరమా కాదా అంటే అవసరమని నా అభిప్రాయం. నా అభిప్రాయంతో సంపత్కుమార ఒప్పుకోకపోవచ్చు. భారతీయ శాస్త్రకారులీ సంక్షిప్తతను సాధించటానికి ప్రయత్నించారని తెలిసిన వాళ్ళంటారు. ఆధునిక భాషాశాస్త్రంలో ఇది అతిముఖ్యమైన లక్షణం. ఒక భాషకు సాధ్యమైన భిన్నవ్యాకరణాలలో ఉత్తమమైనది ఎంచుకోటానికి ఉపయోగించే లక్షణం ఇది (రామారావు, 1971.)
మాత్రా పద్యాలకు మాత్రా గణాల్లో కాకుండా వేరే పద్ధతిలో లక్షణం చెప్పవచ్చు గాని శాస్త్ర సంక్షిప్తతను సాధిస్తూ లయను సూచిస్తూ చెప్పాలంటే మాత్రాగణాల సాయంతో చెప్పాలి. పాదాల్లో మాత్రల కలయికను గురించి చెప్పకుండా, పాదంలో మాత్రాసంఖ్యను మాత్రమే చెప్తే పాదాల అంతర్నిర్మాణాన్ని గురించి చెప్పినట్టే. ఇక వాటి అంతర్నిర్మాణాన్ని లయ ననుసరించి చెప్పాలంటే మాత్రాగణాల పద్ధతిలోనే చెప్పాలని నా వాదం. అట్లా చెప్పకపోతే లయ ననుసరించి చెప్పినట్టు కాదు. అంటే ఆ పద్యానికి లయ నిర్దేశం చెయ్యలేదన్నమాట. లయ నిర్దేశం చెయ్యకపోతే భిన్నలయలు వాడుకోడానికి వీలుంది. మాత్రాగణాల్లో చెబితే మాత్రం లయ సాధ్యమౌతుందా? అంటే మాత్రాగణాల్ని భాషలో ఊనిక ప్రవర్తన ననుసరించి వాడితే లయ సాధ్యమవుతుంది. ఈ ఊనిక ప్రవర్తన పద పదాంశ విరామం మీదా, పదంలో గురు లఘు క్రమం మీదా ఆధారపడి ఉంటుంది. ఈ ఊనిక ప్రవర్తన ననుసరించే అనులోమ విలోమ గతుల భేదం వస్తుంది. లయ స్ఫురణలో పద పదాంశ విరామాలూ, ఊనిక ప్రవర్తన చాలా ముఖ్యమైన పాత్ర నిర్వహిస్తయ్యని నా మొదటి వ్యాసంలో సూచించాను.
ఇంతకీ జాతుల్లో గాని, మాత్రా ఛందస్సుల్లో గాని అంతర్నిర్మాణం గణాల్లో చెప్పాలా అక్కర్లేదా అన్నది నా వాదానికి ప్రధానం కాదు. అట్లా చెప్పటంలో ఉన్న సౌలభ్యాన్ని పైన చర్చించాను. రేపటి పరిశోధకులు గణ పద్ధతికన్నా పటిష్ఠమైన ఇంకో పద్ధతిని సూచించవచ్చు. కాని అంతర్నిర్మాణం లేకుండా పద్యం ఉండదు. ఫలాని అక్షరాలు ఫలాని క్రమంలో ఉంటయ్యని గాని, ఫలాని అక్షరం గురువో లఘువో కావాలని గాని, కాకూడదని గాని చెప్పటం పాదంలో అంతర్నిర్మాణాన్ని గురించి చెప్పటమే అవుతుంది. ఈ విషయాన్ని నాగరాజుగారు (చూ. అనుబంధం) గుర్తించారు.
ఇక భావగణాల విషయం. భావగణ విభజనలో వ్యాకరణాంశాల పాత్రను సంపత్కుమార పూర్తిగా నిరాకరించలేదని గుర్తించాను. ఆ పాత్ర ఎంతవరకు అన్నదాంట్లోనే మా ఇద్దరికీ అభిప్రాయ భేదం. వ్యాకరణ సంబంధాలకీ, భావాంశాలకీ ఏకైక సంబంధం ఉందని నా అభిప్రాయం. సంబంధాన్ని పూర్తిగా నిరాకరిస్తే అర్థబోధలో వ్యాకరణాంశాలకు పాత్ర లేదనాల్సి ఉంటుంది. అందువల్ల సంపత్కుమార మధ్యే మార్గాన్ని ఎన్నుకుని కొంతవరకు మాత్రం ఉంటుందంటున్నారు. కాదు పూర్తిగా ఉంటుందని నా వాదం. దీనికి ఉపపత్తిగా వారు భావగణాలంటున్న వాటిని నేను వ్యాకరణ గణాలుగా నిరూపించాను. సంపత్కుమార తన వాదాన్ని నిలబెట్టుకోవాలంటే వ్యాకరణ సంబంధాలు పాదవిభజనకు ఎక్కడ లేవో నిరూపించాలి. కనీసం ఆ ‘కొంతవరకు’ అనేది ఎంతవరకో స్పష్టంగా చెప్పాలి. ఇది సాధ్యమనుకోను. భావగణాలని వారనుకుంటున్న వాటికి, వ్యాకరణానికి అంత విడదియ్యరాని సంబంధం ఉంది. అయితే భావస్పూర్తి ప్రధానం గాని వ్యాకరణ సంబంధాలు ప్రధానం కాదంటారు సంపత్కుమార. ఈ సందర్భంలో అర్థాలంకార ప్రసక్తి తీసుకొచ్చారు. అర్థాలంకారాలను వ్యాకరణాలంకారాలు అని అనాల్సి ఉంటుందా? అని అడుగుతున్నారు. అనక్కర్లేదు, అనగూడదు అని సమాధానం. ఒక అలంకారాన్ని ఒక కవి సంస్కృత శ్లోకంలో వాడినా, తెలుగు పద్యంలో వాడినా, గద్యంలో వాడినా, చిన్న పద్యంలో వాడినా, పెద్ద వాక్యంలో వాడినా, సంహృత వాక్యంలో వాడినా, ఒక వాక్యంలో వాడినా, భిన్న వాక్యాల్లో వాడినా ఒక అలంకారం అదే అలంకారం అవుతుంది. అలంకారాల్లో పాదవిభజన లేదు. శబ్దరూప ప్రాధాన్యం లేదు. వాక్యవ్యవస్థను బట్టి అలంకారం మారదు. కాని, వీరి భావగణాలు అట్లా మారకుండా ఉంటయ్యా? మారకుండా ఉండని పద్ధతిలో భావగణాల్ని నిర్వచించారా? ఎంతకీ భావస్ఫూర్తిని బట్టి, భావాన్ని బట్టి అనేగాని అంతకన్నా స్పష్టమైన నిర్వచనం ఇవ్వటం లేదు. ఇప్పటి వ్యాసంలోనైనా ఈ వాక్యాలు చూడండి: ‘భావగణం ఏకపదంగా ఉంటుందా? బహుపదంగా ఉంటుందా? అన్నప్పుడు అక్కడ ఉపయుక్తమైన పదాల స్థితి అంటే ఏకపదం భావాంశ స్ఫోరకమైతే ఏకపదమే భావగణం. బహుపదాల సమష్టి భావాంశ స్ఫోరకమైతే ఆ సమష్టే భావగణం. భావాన్ని స్ఫురింపజేసే పదాల స్థితి అంటే ఇది.’ – దీన్ని బట్టి భావగణం ఏమిటో నాకర్థం కావటం లేదు. ఈ వాక్యాల్నుంచి భావగణ స్వరూపాన్ని గ్రహించలేని నా అశక్తతను మనస్ఫూర్తిగా ఒప్పుకుంటున్నాను. ఇంతకన్నా స్పష్టంగా భావగణ స్వరూపాన్ని వివరించటం కుదరదంటే చేసేదేమీ లేదు.
పద్యపాదానికి అంతర్నిర్మాణ బాహ్య పరిమితులుంటాయనీ, వచన పద్యానికి అంతర్నిర్మాణం లేదని, బాహ్య పరిమితి ఆర్బిట్రరీ అని, భావగణాల స్వరూపం ఏమిటో స్పష్టంగా తెలియనందున భావగణాలు వచన పద్యాన్ని నిర్వచించలేవని, భావగణ విభజన ఏ పద్ధతిలో జరిగినా వచన పద్యాన్ని వచనం నుంచి భావగణాలు వేరు చెయ్యలేవనీ, అందువల్ల వచన పద్యం ‘పద్యం’ కాదనీ ఇంకోసారి నిరూపించాను. అచ్చులో లైన్లు కూరే పద్ధతిమీద ఆధారపడకుండా వచన పద్యాన్ని గద్యం నుంచి వేరు చేసే కొత్త లక్షణాల్ని సంపత్కుమార గాని, ఇంకొకరు గాని ప్రతిపాదించేవరకు ఈ విషయాన్ని గురించి చర్చించవలసిన అంశాలు కూడా లేవు.
(భారతి జులై 1975 పే. 28-35)
వచన పద్యం: లక్షణ చర్చ – ఉపయుక్త గ్రంథ, వ్యాస సూచి.
వచన పద్యం: ఒక పరిశీలన – బండి నాగరాజు. వచన పద్యం లక్షణ చర్చకు అనుబంధ వ్యాసం.
(ఈ వ్యాస పరంపరలో చివరి వ్యాసం కోవెల సంపత్కుమార రాసిన వచన పద్యం వాద సమాపనం.)