పూల పల్లకి

చుట్టూ పూలు… రంగు రంగుల పూలు… నేల రంగుల్ని ఈనినట్టుగా ఉందా పూతోట. ఆకాశం మీద భానుడు బంగారుకాంతులతో విచ్చుకుంటున్నాడు. ప్రకృతి ఓ అందమైన పెయింటింగ్ లా ఉంది. ఈ మైమరపు నాలో ఏదో హుషారుని మోసుకొచ్చింది. కురులని గాలికి వదిలేసి, గంతులేసుకుంటూ, దారికి ఇటూ, అటూ ఉన్న పూలని, మొక్కలని ముచ్చటగా తాకుతూ పరిగెడుతున్నాను. ఇంతలో నా దారిని అడ్డగిస్తూ గుర్రం మీద ఎవరో వచ్చారు. ‘ఎవరా!’ అని తలెత్తేసరికి రివ్వున గాలి నా ముఖాన్ని కురులతో కప్పేసింది. చేత్తో నా కురులను స్లో మోషన్లో తొలగించుకుంటూ చూస్తే, గుర్రం మీద కౌబాయ్ టోపీ పెట్టుకొని ఎవరో హీరోలా వున్నాడు. తను చేతిని ముందుకు చాచి, ‘ఈ చేయిని అందుకో.. నాతో వచ్చేయ్!..’ అన్నట్టు ఆహ్వానంగా చూసాడు. నా ప్రమేయం లేకుండానే నా చేయి తనని అందుకొంది…

పొద్దున్నే లేచి చదువుకుందామని పుస్తకాలు తీసి, ఇదిగో ఇలా ఊహల్లో తేలిపోయాను. ఈ ఊహ నా చిన్నప్పుడు,అంటే ఆరవతరగతి నుంచీ అనుకుంటా… వెంటాడుతునే ఉంది. పొద్దున్నే ఈ పుస్తకాల కుస్తీ ఎందుకంటే ఈ రోజు ఇంటర్వ్యూ ఉంది. అన్నట్టు చెప్పొద్దూ… నా పేరు దాక్షాయణి. స్నేహితులంతా “దాక్షీ” అని పిలుస్తారు. మా నాన్న మాత్రం ముద్దుగా “దాయీ!” అని పిలుస్తారు. మాది విజయనగరం జిల్లాలోని చిన్న పల్లెటూరు. ఇంజనీరింగ్ పూర్తయి, హైదరాబాదుకి వచ్చి ఆరునెలలుగా ఉద్యోగాల వేటలో ఉన్నాను. ఇంటర్వ్యూకి వెళ్ళాను. మొదటి రౌండ్ గట్టెక్కినా రెండవ రౌండ్‌లో ఇంటర్వ్యూ చేసేవాడి ముఖం చూసేసరికే నాకు అర్థమయిపోయింది. ‘ఈ ఇంటర్వ్యూ కూడా గోవిందా’ అని. చివరికి ముక్తాయింపుగా ‘మీకేవిషయమూ తర్వాత తెలియజేస్తామ’న్నారు. “ఇంక పోవే!” అని దానర్థం.

హు… నేనెందుకో ఇంటర్వ్యూ అనేసరికి తెగ టెన్షన్ పడిపోతాను. ‘ఎవరో నన్ను ప్రశ్నలేస్తున్నారు’ అన్న భావన అస్సలు నచ్చదు. బుర్ర అంతా బ్లాంక్ ఫ్రేమ్ లా మారి, బాగా తెలిసినవి కూడా ఆ క్షణానికి కొత్తగా వినపడతాయి అదేంటో. నన్ను నేను తిట్టుకుంటూ షేర్ ఆటో ఎక్కాను. ఆటోలో నాతోపాటు ఒక అబ్బాయి ఎక్కాడు. మన బాపతే. ఉద్యోగాల వేటలో ఉన్నాడు. మూడు, నాలుగు ఇంటర్వ్యూలలో నాతో పాటు చూసాను. మేమున్న రూముకి దగ్గర్లోనే అనుకుంటా. ఆటోలోంచి ఇద్దరమూ దిగాం. తను పలకరింపుగా నవ్వాడు. నేను నవ్వలా. నా మూడ్ అసలే బాగాలేదు. మాటలు కలుపుతూ, “మీ పేరు తెలుసుకోవచ్చా?” అనడిగాడు. నాకు చిర్రెత్తి, “మాంకాలమ్మ” అని కోపంగా చెప్పాను. తను ఒక నిమిషం అర్థం కానివాడిలా అలానే ఉండిపోయాడు. తరువాత అవమానంతో మనోడి ముఖం కందగడ్డలా మారడాన్ని కళ్ళారా చూసాను. వెంటనే నా నుంచి దూరం జరిగి పెద్ద పెద్ద అడుగులు వేసుకొంటూ విసవిసా వెళ్ళిపోయాడు. తననలా చూసేసరికి నాకు నవ్వాగక గట్టిగా నవ్వేసాను. తను ఒకసారి వెనక్కి నావైపు చూసి వెళ్ళిపోయాడు. నేను మామూలుగా తెలియనివారి దగ్గర అలా నా కోపాన్నీ, చికాకునీ చూపించను. కానీ ఈసారెందుకో ఇలా జరిగిపోయింది. పాపం అనిపించింది తరువాత.

రూముకి వచ్చి ముఖం కడుక్కొని, టీ చేసుకొని కప్పుతో బయటకి వచ్చాను. అప్పటికే సాయంత్రమయ్యింది. నే నాటిన సన్నజాజితీగ బాగా పెరిగి ఇంటి ముందర పందిరి చుట్టూ అల్లుకుపోయింది. దాని దగ్గరకి వచ్చి నిల్చున్నాను. హాయిగా అనిపించింది. ఫోనులో ఇంట్లోవాళ్ళకి ఇంటర్వ్యూ విషయం నివేదించి, ఆ ఇంటర్వ్యూవర్ మీద నా కోపాన్ని వెళ్ళగక్కి, అమ్మ మందలింపులు తిని నాన్న చేత కావాలని సముదాయించుకొని, తమ్ముడికి మాంకాలమ్మ విషయం చెప్పేసరికి మనసులో ఇంటర్వ్యూ తాలూకు చేదు అనుభవం చెరిగిపోయింది.

మళ్ళీ శనివారమొచ్చింది. ఇంకొక ఇంటర్వ్యూ. షరా మామూలే. ఈ తతంగం అయ్యాక బయటకి వచ్చి నడుస్తున్నాను. ఇంటర్వ్యూలలో “నీ భవిష్యత్తు ప్రణాళికలు ఏంటి?”… “ఒక నాలుగు సంవత్సరాల తరువాత నిన్ను నువ్వు ఎలాంటి భూమికలో ఊహించుకుంటావు?”.. ఇలాంటి ప్రశ్నలు నన్ను చాలా ఇబ్బందుల్లో పడేస్తాయి. నిజం చెప్పొద్దూ, నాకసలు ఉద్యోగం చెయ్యడమే పెద్దగా నచ్చదు. అందరూ ఉపదేశించే ఈ పోటీతత్వం మనకస్సలు లేదు. నావన్నీ చిన్న చిన్న ఆనందాలు. బాత్‌రూంలో పాటలు పాడుకుంటూ, ఆ పాటల్లో నన్ను ఊహించేసుకుంటూ తాపీగా స్నానం చేయడం, రకరకాల పూల మొక్కలు పట్టుకొచ్చి వాటిని మా పెరట్లో నాటడం (వాటికి పువ్వులు పూసాక ఇంక నా ఆనందం చెప్పడానికి ఉండదు), ఇంకా నన్ను నేను ముచ్చటగా సింగారించుకోవటం, మనసుకు దగ్గరైన వాళ్ళ ఒళ్ళో చనువుగా పడుకుని కబుర్లు చెప్తూ నిద్రలోకి జారిపోవడం, చిన్న పిల్లలతో ఆటలు, ఏ లాజిక్కూ ఆలోచించకుండా ప్రేమని పంచడం – ఇలాంటివే నా ఆనందాలు, ఆశయాలు. ఇవన్నీ చెప్పి, చెప్పాక ఇంటర్వ్యూ చేసేవాడి ముఖం ఎలా ఉంటుందో ఒకసారి చూడాలని అప్పుడప్పుడు అనిపిస్తుంటుంది.

భవిష్యత్తులో ఇది సాధించాలి, ఇలా ఉండాలి అని నేనెప్పుడూ అనుకోలేదు. నాకింకా గుర్తు – చిన్నప్పుడోసారి ఇంటికొచ్చిన మా మామయ్య “పెద్దయ్యాకా ఏమవుతావే?” అనడిగితే, “లచ్చమ్మ నవుతాన”ని చెప్పాను. అందరూ ఒక్కసారిగా గొల్లుమన్నారు. లచ్చమ్మ అంటే రోజూ సాయంత్రం మా వీధిలో పూలమ్మే ఆవిడ. నేను రోజూ సాయంత్రం బడి వదలంగానే పరిగెట్టుకొని ఇంటికి వచ్చేసి, గబగబా ముఖం కడిగేసుకుని ముస్తాబయ్యి ఆత్రంగా ఎదురుచూసేదాన్ని- ఆమె తెచ్చే పూలన్నీ చూసి, వాటిలో నాకు నచ్చినవి జడలో తురుముకోడానికి. అమ్మ పువ్వులు తీసుకోకపోయినా, లచ్చమ్మ నా గుప్పిల్లో కొన్ని పూలు పెట్టేది. అప్పుడప్పుడూ నా కోసం జిగుర్లూ, చేగొడియాలూ కూడా తెచ్చేది. ఎంత మంచిదో! ఇదిగో… ఇలా ఆలోచిస్తూ ఎప్పటికప్పుడు నా చిన్నతనం లోకి, మా ఇంటివాళ్ళ దగ్గరకి కప్పగెంతులేస్తుంటాను.

మళ్ళీ ఇంకో ఇంటర్వ్యూ అయ్యాక బయటికొచ్చి నడుస్తున్నాను. సన్నగా వర్షం పడుతోంది. తడిచిపోకుండా బస్‌స్టాప్‌లో ఆగాను. ఎదురుగా మొక్కజొన్న పొత్తులు కాల్చి అమ్ముతున్నారు. వర్షం పడుతున్నప్పుడు మొక్కజొన్న పొత్తు తింటే భలే ఉంటుంది కదా! కానీ కొనుక్కుందామంటే, “ఈ అమ్మాయి చూడు వర్షంలో తడిసి మరీ జొన్నపొత్తులు కొనుక్కుంటుంది… తిండిపోతు!” అని చూసినవాళ్ళు అనుకుంటారేమో అని ఒక వెధవ అనుమానం. చూడబోతే జొన్నపొత్తులన్నీ చెల్లిపోయేటట్లుగా ఉన్నాయి. అందరూ కొనుక్కొని, బుగ్గలాడించుకుంటూ తినేస్తున్నారు. అటు చూస్తే వర్షమూ తగ్గట్లేదు. ఇటు చల్లటి జల్లులో చినుకుల మధ్య దూరి వెచ్చగా ముక్కునంటుతున్న మొక్కజొన్న కాలుతున్న వాసన నన్ను మరింత టెంప్ట్ చేస్తోంది. అవి ఎక్కడ అయిపోతాయో అని నేను పడుతున్న టెన్షన్ బహుశా ఏ పరీక్షకి కూడా పడి ఉండను. అనుకున్నట్టే జొన్నపొత్తులన్నీ చెల్లిపోయి ఒక్కటే మిగిలింది. ఇక ఆగలేక ఎవరేమనుకుంటే అనుకోనీ అని వర్షంలో పరిగెత్తాను. ఇంకొక్క క్షణంలో చేరుకుంటాననగా ఒక అబ్బాయి వచ్చి కొనేసాడు. ‘సచ్చినోడు! ఎవడా?’ అని చూస్తే, మొన్న పేరు అడిగాడు కదా, వాడే! నన్ను చూసి ‘చూసావా బదులు తీర్చుకున్నాను’ అన్నట్టు కనుబొమ్మలు లైట్గా ఎగరేసి బస్‌స్టాప్ వైపు నడిచాడు. నాకెంత కోపం వచ్చిందంటే అంత వచ్చింది. అదేంటో, వర్షం కూడా వెంటనే చిటిక వేసినట్లుగా ఆగిపోయింది. ఇంకా ఒళ్ళు మండింది. షేర్‌ఆటోలో జొన్నపొత్తు తినేసినా ఇంకా ఆ కాడ పట్టుకొని కూర్చున్నాడు నన్ను ఏడిపించాలన్నట్లుగా. ఆటో దిగి మా వీధి సందు దగ్గర ఆగిపోయాను. తను నా ముందునడుస్తున్నాడు. నన్నింకా తను చేసిన మొక్కజొన్నద్రోహమే వేధిస్తోంది. కోపం ఆపుకోలేక, “దొంగ మొహమా! నీకు అరగదు రా!” అని గట్టిగా అరిచాను. తను వెనక్కి తిరిగి చూసేసరికి, తుర్రున వీధిలోకి పరుగెత్తాను.

రేపు ఇంకొక ఇంటర్వ్యూ. ఎన్ని ఇంటర్వ్యూలున్నా రాత్రి తొమ్మిదయ్యేసరికి మనల్ని నిద్రాదేవి పూనేస్తుంది. నా గడియారం తప్పు తిరగొచ్చు కానీ ఈవిడ మాత్రం టంచన్ గా వచ్చేస్తుంది.

ఉదయం ఇంటర్వ్యూకి బయలుదేరాను. కొంచం దూరం వెళ్ళేసరికి ఒక్కసారిగా పెద్ద వర్షం మొదలయ్యింది. దగ్గర్లో ఉన్న చెట్టు కిందకి చేరుకున్నాను. ఇంతలో ఆ అబ్బాయి కూడా వచ్చాడు. అంత వర్షాన్ని చెట్టు కాయలేకపోతుంది. నేను తగుదునమ్మా అనుకుంటూ తెల్లని సల్వార్‌కమీజ్ వేసుకొచ్చాను. కొంచం పలచగా ఉండటం వల్ల చినుకులకి డ్రెస్ చర్మాన్ని అతికేసుకుంటోంది. నేను సిగ్గుతో ముడుచుకుపోయాను. ‘నాలుగుకళ్ళేసుకొని (తనకి కళ్ళద్దాలున్నాయి లెండి) నన్ను ఎగాదిగా చూసేస్తున్నాడా!’ అని పక్కకి చూస్తే, ఏమయిపోయాడో.. పక్కన లేడు. వర్షం ఇంకా తగ్గట్లేదు. నాకు చాలా ఇబ్బందిగా అనిపిస్తోంది. ఇంతలో గొడుగేసుకొని తనొచ్చాడు. “రండి వెళ్దాము.” అని పిలిచాడు. “రక్షించావు కళ్ళజోడు కుర్రోడా” అనుకొని గొడుగు లోపలికి వచ్చాను.

“నా పేరు దాక్షాయణి.” అని చెప్పాను. “నా పేరు మూర్తి అండి” అని తను బదులిచ్చాడు.

అలా మాటలు కలిసాయి. ఇద్దరం ఒకే కంపెనీ కి వెళ్తున్నాం అని తెలిసింది. వర్షం తగ్గకపోవటం వల్ల ఆటో మాట్లాడుకుని బయలుదేరాం. ఆటోలో తన డాక్యుమెంట్లు చూసాను, అన్నింటిలోనూ తనకి చాలా మంచి మార్కులు వచ్చాయి. స్వతహాగా నేను ఏవరేజ్ స్టూడెంట్‌ని. నాకు తెలివైనవాళ్ళు గిట్టరు, నచ్చరు.

ఇంటర్వ్యూ గదిలోకి వెళ్ళాను. లోపల ముగ్గురున్నారు. ఒకాయన నా డాక్యుమెంట్స్ చూసి, “మాదీ మీ ఊరేనమ్మా” అని ఊరి విశేషాలు అడిగారు. మా ఊరి సంగతులు చెప్పేసరికి చాలా ఫ్రీ అయిపోయాను. తర్వాత టెక్నికల్ ప్రశ్నలు అడగటం మొదలుపెట్టారు. పెద్దగా ఇబ్బంది పడకుండా నాకు వచ్చినవి చెప్పాను. ఇంకొక రౌండ్ అయ్యాక సెలెక్ట్ అయ్యావన్నారు. ‘హుర్రే!’ కాలాన్ని ఒక రిమోట్‌లాటి దాంతో ఆపేసి చుట్టుపక్కల వాళ్ళందరూ ఫ్రీజ్ అయిపోతే నేనొక్కదాన్నే డాన్స్ చెయ్యాలనిపించింది. ఇంట్లోవాళ్ళకీ, ఫ్రెండ్స్‌కి ఫోన్ చేసి చెప్పాను. మూర్తి కూడా సెలెక్టయ్యాడు. ఆటోలోవెళ్తుంటే, ఇప్పుడే ప్రపంచానికి మహరాణిగా ఎన్నికై, పువ్వులతో అలంకరించిన అందమైన పల్లకిలో బోయలు నన్ను తీసుకెళుతున్నట్లుగా ఉంది.

ఆటోల్లో వస్తూ, పోతూ మా మధ్య పరిచయం కొంచం పెరిగింది. ఆ రోజు డిసెంబరు 31. రాత్రి పదకొండింటికి అలారం పెట్టుకొని లేచాను ముగ్గు వెయ్యడానికి. రూములో మిగిలిన అమ్మాయిలు టి.వి లో ఏవో ప్రోగ్రాములు చూసుకుంటున్నారు. బయటకొచ్చాను. పెద్దగా అలికిడి లేదు. సన్నగా కూనిరాగం తీసుకుంటూ, ముగ్గు వేయటం మొదలెట్టాను. పూర్తయ్యాకా లేచి చూస్తే, నా వెనుకగా మూర్తి ముగ్గుని చూస్తూ నిలుచున్నాడు. “ఎప్పుడొచ్చావు?” అని ఆశ్చర్యపోతూ అడిగాను. మూర్తి నావైపు ఆరాధనగా చూస్తూ “బాగా వేసావు” అన్నాడు. “ఇంకా రంగులు అద్దాల్సి ఉంది.” అని చెప్పా. “ఒక్క క్షణం ఆగు. ఇప్పుడే వస్తా.” అని వెళ్ళాడు. కాసేపటికి పెద్ద కవర్‌తో వచ్చాడు. చూస్తే రకరకాల, రంగురంగుల పూరేకులు. వాటిని చూడగానే నేను చిన్నపిల్లనైపోయాను. ముగ్గుని పూరేకులతో అలంకరించడం మొదలుపెట్టాము. “ఈ రంగు పూరేకులని ఇక్కడ అద్దుదాము. వాటిని అక్కడ” అనుకుంటూ ఇద్దరమూ ఉత్సాహంగా ముగ్గుని రేకులతో నింపేసాం.

ఆ రోజు నుంచి అప్పుడప్పుడూ సాయంత్రం ఆఫీసు తరువాత మూర్తి మా రూముకి వచ్చేవాడు. మెల్లగా అది అలవాటుగా మారింది. మా ఆఫీసు ఉదయం ఎనిమిది నుంచి సాయంత్రం నాలుగు వరకు. తను వాళ్ళ రూముకి వెళ్ళి, ఫ్రెష్ అయ్యి, ఆరింటికల్లా ఇక్కడికి వచ్చేసేవాడు. నేను మా ఇద్దరికీ టీ కాచి ఉంచేదాన్ని. ఇద్దరం టీ కప్పులు పట్టుకొని మేడ మీద గులాబి మొక్క పక్కన కూర్చొని కబుర్లు చెప్పుకుంటాము. నేను మా ఊరు, మా చుట్టాలు, పాటలు ఇలాంటివి మాట్లాడితే తను ఐన్‌స్టీన్ నుంచి ఓషో వరకూ అన్నీ మాట్లాడతాడు. ఒకసారి “నీకు చాలా విషయాలు తెలుసు” అన్నాను. “కానీ ఏం లాభం. ఇన్ని తెలిసినా నీ అంత సింపుల్‌గా, ఆనందంగా ఉండటానికి ఇంకా ప్రయత్నిస్తూనే ఉన్నాను.” అన్నాడు. నాకు పూర్తిగా అర్థం కాకపోయినా నన్ను పొగిడాడనుకొని నవ్వేసాను. నేను నవ్వుతుంటే నన్ను అపురూపంగా చూస్తున్నాడు. నా ముఖంలో సన్నని సిగ్గు రేఖ తళుక్కుమంది.

చలికాలం వచ్చేసింది. ఒకరోజు చలికి నా చున్నీని శాలువలా కప్పుకొని మేడ మీద తనతో మాట్లాడుతున్నాను. తనకి కూడా చలి వేస్తున్నట్టుంది. నేను చనువుగా “ఇది కప్పుకో” అని కొంచం చున్నీ తనకీ ఇచ్చాను. చున్నీ షేర్ చేసుకోవడానికి తను నాకు దగ్గరగా వచ్చాడు. దానితో మా భుజాలు, కాళ్ళు తగులుతున్నాయి. ఒక్కసారిగా నా శరీరమంతా స్పృహలోకి వచ్చినట్టుగా అనిపించింది. శరీరంలోని అణువణువు కొత్త జీవం పోసుకుంది. మనసుని ఏదో తేనెపాశం బంధించింది. కనురెప్పలు బరువుగా వాలుతున్నాయి.

తను వెళ్ళిపోయాక నేను అలాగే వచ్చి మంచం మీద పడిపోయాను. ” భోంచెయ్యవేంటి?” అని రూమ్మేటు అడిగింది. “ఊహు..” అని బదులిచ్చాను. కొంచం ఆకలిగా ఉన్నా తిన బుద్ధికాలేదు. నాన్న ఇక్కడుంటే, “దాయీ!” అంటూ బుజ్జగించి తినిపించేవారు. మరి మూర్తి నన్ను అలా బుజ్జగించి ముద్దలు తినిపిస్తాడా? అన్న సందేహం వచ్చింది. ‘ఓయ్… అసలు నువ్వేంటి ఇలా ఆలోచిస్తున్నావు?.. మూర్తి నీకేమవుతాడు?’ అంటూ తర్కపు బుర్ర ప్రశ్నించింది. ‘నిజమే’ అనుకున్నాను. ‘అసలు నీవాడిని మహేష్‌బాబు లెవల్లో ఊహించుకున్నావు. ఈ మూర్తిగాడికి పడిపోయేవు.’ అని గుర్తుచేసింది మనసులోనే ఇంకొక అమ్మలక్క. ఈ అయోమయంలోనే ఎప్పుడో నిద్రపట్టేసింది.

రోజులు అందమైన అనుభూతులనే పువ్వులను ఒక్కొక్కటిగా ఏరి మాల కడుతున్నట్టుగా గడిచిపోతున్నాయి….

“మా అన్నయ్య పెళ్ళికి తప్పకుండా రెండు రోజుల ముందే రావాలి” అని మూర్తి మరీ మరీ చెబితే బయలుదేరాను. వెళ్ళాక వాళ్ళింట్లో అందరినీ పరిచయం చేసాడు. వాళ్ళమ్మకి నా గురించి ముందుగానే చెప్పినట్టున్నాడు. ‘ఏమని చెప్పుంటాడో’ అనుకున్నా. ఆంటీ కలివిడిగా జోకులేస్తూ సరదాగా మాట్లాడుతున్నారు. నాకు భలే నచ్చారు. మనం కూడా మాటల పుట్ట కదా! ఇద్దరం ఇట్టే కలసిపోయాం.

విడిదింట్లో స్నానాలవీ అయ్యాక ఒక అరగంటకి మూర్తి, తోడుగా ఇంకొక అమ్మాయి వచ్చారు. ‘నా మరదలు’ అని పరిచయం చేసాడు. అమ్మాయి బాగుంది. ‘నా కన్నా బాగుంటుందా?’ అన్న సందేహం వచ్చింది. సందేహనివృత్తి కోసం మూర్తి కళ్ళలోకి చూసాను. ఎప్పటిలాగే నన్ను ప్రత్యేకంగా చూస్తున్నట్టనిపించింది. మనకన్నా బాగుండదు అన్న ధీమా వచ్చేసింది. ఇంతలో తను మూర్తి మీద చేయి వేసి, “మా ఇద్దరి జోడీ ఎలా ఉంది?” అని అడిగింది. నా కళ్ళని, చెవులని నమ్మబుద్ధి కాలేదు. “ఊ.. బాగుంది” అని ముఖానికి బలవంతంగా నవ్వుని అద్దుతూ చెప్పాను. “మీలాంటి అమ్మాయిని చూసి బావ మనసు పారేసుకోకుండా మా పెళ్ళి కూడా తొందరలోనే చేసేస్తారట” అని నవ్వుతూ అంది. నాకేమీ నవ్వు రాలా. కానీ మూర్తి నవ్వేసాడు. చెత్త వెధవ. అంత చెత్త నవ్వుని నేనెప్పుడూ చూడలేదు.

వాళ్ళు కాసేపు మాట్లాడి వెళ్ళిపోయారు. నేను అందరితో కలిసి తిరుగుతున్నానే కానీ ఎందుకో ప్రతీ విషయమూ చికాకుగా అనిపిస్తోంది. విడిది గదికొచ్చి తలుపేసి పడుకున్నాను. నిద్ర పట్టలేదు సరికదా చికాకు కోపంగా మారింది. నేను దేనికో బాధపడుతున్నట్టు అనిపిస్తోంది. కానీ దేనికని స్పష్టంగా తెలియట్లేదు. ఒక్కొక్క క్షణం చాలా నెమ్మదిగా నడుస్తూంది. ‘త్వరగా రెండు రోజులు అయిపోతే బాగుణ్ణు’ అనుకున్నాను. కాసేపటికి భోజనాలకి పిలిచారు. అక్కడ మూర్తినీ, తన మరదల్ని మళ్ళీ చూసాను. మూర్తి వచ్చి మాట్లాడుతున్నాడు. వెంటే తోకలా ఆ అమ్మాయి కూడా వచ్చేసింది. నేను తలనొప్పిగా ఉందని చెప్పి ముభావంగా మాట్లాడి, కొంచం తిని గదికి వచ్చేసాను.

నాకు పదేపదే మూర్తి, తన మరదలే గుర్తుకువస్తున్నారు. నా మీద నాకే కోపం వచ్చేస్తుంది. ‘నేను మూర్తిని ఇష్టపడుతున్నానా?’ ఇంతవరకు ఎప్పుడూ సీరియస్‌గా దీనిగురించి ఆలోచించలేదు. కానీ ఇప్పుడు ఆలోచిస్తే అర్థమవుతోంది. గత కొన్ని నెలలుగా మూర్తితో కలసి గడిపిన రోజులు ఎంత అద్భుతమైనవో అని. నా ప్రతి ఆలోచనలోనూ, నేను చేసిన ప్రతీ పనిలోనూ మూర్తే ఉన్నాడని. ఇవన్నీ గుర్తొస్తుంటే మనసింకా బరువెక్కిపోతోంది. ఇంతలో అమ్మ నా మొబైల్‌కి కాల్ చేసింది. నేను పొడిపొడిగా మాట్లాడుతున్నాను. “మూర్తి వాళ్ళు అక్కడ ఏర్పాట్లవీ బాగా చేస్తున్నారా?” అని అడిగింది. మూర్తి పేరు వినగానే ఉక్రోషం తన్నుకొచ్చింది. “ఆ దొంగమొహంగాడి పేరు నా దగ్గర ఎత్తకు. నాకు అసహ్యం. నేనింక వాడితో మాట్లాడను.” అన్నాను. ఆ మాటలు అంటూ నా కంటి నుంచి నీరు జర జరా కారుతున్నాయి. అమ్మకి ఏమీ అర్థమయినట్టు లేదు. ” నువ్వింతే. ఎప్పుడు ఏం మాట్లాడతావో నీకే తెలియదు.. బాగానే ఉన్నావు కదా!” అని ఫోన్ పెట్టేసింది.

కాసేపటికి మూర్తి వచ్చాడు. “తలనొప్పి తగ్గిందా?” అని అడిగాడు. ‘కొంచం తగ్గింద’ని బదులిచ్చాను. నా గురించి నేను తెలుసుకోకపోవచ్చు. కానీ తెలివైన వాడు కదా మరి, మూర్తికి ఎప్పుడూ అర్థం కాలేదా నేను తనని ఎంతలా ఇష్టపడుతున్నానని. అసలు మూర్తికి నా మీద ఇష్టం లేదేమో. ఆ ఆలోచనకే ఏడుపొచ్చింది. “ఏంటలా ఉన్నావు?” అనడిగాడు. “ఏమీ లేదు. అయినా నీకెందుకు?” అన్నాను. “ఏదో ఉంది చెప్పు” అని అడిగాడు. మూర్తి ముఖంలో సన్నని చిరునవ్వు కనపడుతోంది. అందుకు మరింత ఒళ్ళు మండింది. “నీకు మరదలు ఉన్నట్టు, నువ్వు తనని పెళ్ళి చేసుకోబోతున్నట్టు నాకెప్పుడూ చెప్పలేదేం?” అని ఉక్రోషం ఆపుకోలేక అడిగేసాను. మూర్తి నవ్వుతూ, “ఎందుకంటే ఇదంతా నాటకం కాబట్టి” అన్నాడు. నాకేమీ అర్థం కాలేదు.

మూర్తి నాకు దగ్గరగా వచ్చి, నా కళ్ళల్లోకి సూటిగా చూస్తూ “దాక్షీ!, నాకు నువ్వంటే ఇష్టం. కానీ నీ మనసులో ఏముందో తెలియదు. తను మా చిన్నాన్న కూతురు. నాకు చెల్లెలి వరస అవుతుంది. ఈ మాంకాలమ్మ మనసులో ఏముందో తెలుసుకుందామనే మేము ఈ నాటకం ఆడాం” అని చెప్పాడు. నాకు ఆనందమూ, నన్ను ఇంతవరకూ ఏడిపించాడన్న కోపమూ ఒకేసారి వచ్చాయి. “నిన్నూ… నన్ను ఏడిపిస్తావా! నీ పని చెప్తానుండు…” అంటూ ఒక్క ఉదుటున లేచాను.

మూర్తి పెరట్లోకి పరిగెత్తాడు. తనని వెంబడిస్తూ నేనూ పరిగెత్తాను. అక్కడ నేల తడిగా ఉండటం వలన నా కాలు జారి పడబోయాను. అది చూసి మూర్తి నన్ను ఒడుపుగా పట్టుకున్నాడు. మూర్తి చేతులు నా నడుముని చుట్టేసాయి. ఒకరి శ్వాస మరొకరి ముఖాన్ని తాకుతోంది. పక్కనే ఉన్న గులాబీ కొమ్మ కదిలి కొమ్మకున్న గులాబీ మా ఇద్దరి ముఖాలనూ తాకింది.

అయిదు సంవత్సరాల తర్వాత…

ఈ రోజు మా నాలుగో పెళ్ళిరోజు. మూర్తి నన్ను “ఓయ్! నీకొక సర్‌ప్రైజ్!” అన్నాడు హాల్ లోంచి. “ఏంటది, కళ్ళజోడబ్బాయీ? ” అని తనని చుట్టేసాను. “ఇక్కడ కాదు, పద..” అని కార్లో తీసుకువచ్చాడు. పెద్ద పూల నర్సరీ!

“మై డియర్ మాంకాళీ, దీన్నిమనం కొనేసాం. ఇక నువ్వు ఉద్యోగం మానేసి ఈ పనులు చూసుకో” అన్నాడు వెనకనుంచి నడుముచుట్టూ చేతులు వేసి నన్ను దగ్గరగా తీసుకుంటూ.

చుట్టూ పూలు… రంగు రంగుల పూలు… నేల రంగుల్ని ఈనినట్టుగా ఉందా పూతోట. ఆకాశం మీద భానుడు బంగారుకాంతులతో విచ్చుకుంటున్నాడు. ప్రకృతి ఓ అందమైన పెయింటింగ్ లా ఉంది. ఈ మైమరపు నాలో ఏదో హుషారుని మోసుకొచ్చింది. కురులని గాలికి వదిలేసి, గంతులేసుకుంటూ, దారికి ఇటూ, అటూ ఉన్న పూలని, మొక్కలని ముచ్చటగా తాకుతూ పరిగెడుతున్నాను. ఇంతలో నా దారిని అడ్డగిస్తూ కారులో ఎవరో వచ్చారు. ‘ఎవరా!’ అని తలెత్తేసరికి రివ్వున గాలి నా ముఖాన్ని కురులతో కప్పేసింది. చేత్తో నా కురులను తొలగించుకుంటూ చూస్తే, కారులో మా ఆయన.

నేను చిన్నప్పటినుంచీ ఊహించుకొనే ఊహ గుర్తుకి వచ్చింది. ఊహలు నిజమవ్వటమంటే ఇదేనేమో. కానీ నా హీరో గుర్రం మీద కదా వస్తాడు. నేను మా ఆయన్ని మురిపెంగా చూస్తూ, “మూర్తీ!, నువ్వీ కారునొదిలేసి ఒక గుర్రం కొనుక్కోవా ప్లీజ్” అన్నాను. ఇద్దరికీ ఒకేసారి నవ్వొచ్చింది.