(గుండుగొమ్ములనుమానం – మొదటి భాగం, రెండవ భాగం)
మనసు చేసే తప్పుల్ని ధూర్జటి, వేమన, పోతన వంటి వాళ్ళు ఎందరో మొరపెట్టుకున్నారు. సత్యం ఒకటి ఉందనీ, దానికి నిబద్ధులమై బతకాలని తెలిసి తెలిసీ మనసు అలా ఉండనివ్వదనీ వాళ్ళ ఆక్రందన. దీనికి అలౌకికమైన దైవం, తత్వమే ఆధారం కానక్కర్లేదు. న్యాయం, మానవ ధర్మం అని మర్యాద చేసేవాటిని సత్యం అనుకుంటే, దానికి నిబద్ధం కాలేనిదంతా ‘అబద్ధం’ కదా! Salinger సృజనకు ఆధారం ఇలాంటి ఆక్రందనే. త్రిపుర ప్రతిపాదించేరంటున్నది అర్ధం చేసుకోవటానికి ‘సత్యం’ అనీ, ‘నేరం’ అనీ అంత బరువైన మాటలు అక్కర్లేదు. చుట్టూ చూస్తే చాల సూక్ష్మమైనవి – ప్రలోభాలు, బులపాటాలు, దుర్బలతలు, ఇలాంటివి పైకే కనిపించేవీ, లోకం దృష్టిలో పడకుండా దాచుకున్నా అంతరంగంలో జరిగేవీ ఒకవైపు ఉన్నాయి. ఇంకొకవైపు ఉన్నతమైన, ఉదాత్తమైన ఆలోచనలు, మాటలు, పనులు, నాగరికత సాధించే విజయాలు కూడా ఉన్నాయి. మనుషుల అంతరంగం, ప్రవర్తనలే కాదు, బయటి ప్రపంచం, ప్రకృతి కూడా ఇలాంటి సూక్ష్మాతి సూక్ష్మమైన విశేషాలతో అలరారుతుంటాయి.
సృజనశీలుర దృష్టిని అంతరంగం, ప్రవర్తన, ప్రకృతి – ఈ మూడు ప్రపంచాల్లోని సంగతులూ కవ్విస్తూ, ఆహ్వానిస్తూ ఉంటాయి. ‘తమ లోతు కనుక్కో’మంటాయి. వాళ్ళు వీటిలో తమకు పరిచితమైన ప్రపంచాల్ని, తమ స్వభావానుసారం, తాము బతుకుతున్న నేపధ్యాల్లోనే విస్మయంతో, కుతూహలంతో, విహ్వలులయ్యీ పరిశీలించి చూడగలుగుతున్నారు. సూక్ష్మమైన విశేషాలంటే కేవలం వర్ణనలే కాదు. ఎంచుకున్న వస్తువు, ఇతివృత్తం, పాత్రలు సన్నివేశాల వంటి మౌలికమైన అంశాలు, అవి కల్పనలో ఇమిడే పద్ధతి, ఎత్తుగడ ఇవి అన్నీ వివిధమైన స్థాయిల్లో – అంటే scalesలో – సృజన శీలి చూసి, అందుకుని, నిర్మించి, నగిషీలు చెక్కి ప్రదర్శించే విశేషాలే.
ఈ సూక్ష్మాలు అమూర్తమైనవి. స్థూల దృష్టికి అంత తేలిగ్గా అందేవి కావు. చెదురుమదురుగా, అనైక్యంగా దాక్కొని ఉండి స్థూల దృష్టికి గోచరించని ఈ సన్నని వింతల్ని, విశేషాల్ని సృజనశీలి అందిపుచ్చుకుని, వాటికి తన సృజనలో ఒక మూర్తిమత్వాన్నీ, ఐక్యతనూ కల్పిస్తున్నాడు. అతను నిపుణుడైన కవి అయితే ఊహను, భాషను తన సృజన నిర్మాణానికి, నగిషీలకు పనిముట్లుగా మాత్రమే వాడుకుంటున్నాడు. సృజనశీలురు నిపుణులైన కళాకారులు కూడా అయి ఉన్నప్పుడే కానరాని ఈ సూక్ష్మాల్ని చూడగల్గటమే కాదు, ఒడుపుగా పట్టుకుని తమ సృజనల్లో పనివాడితనంతో ప్రదర్శించగల్గుతారు. తమ పనిముట్లను – అంటే భాష, వివేచన వంటివాటిని ఆ ప్రదర్శనకు విధేయాలుగా, పనిముట్లుగా మాత్రమే ఉండేలా నియంత్రించగల్గుతారు. కవి కేవలం ఆలోచనాపరుడు అయితే సృజన ప్రక్రియ లోని చివరి అంచె ఐన నిర్మాణాన్నే మొత్తం సృజనగాను, ఉదాత్తమైన ఊహలు, నిపుణమైన భాషతో అలరారే నిర్మాణాలనే మేలైన సాహిత్యం గాను, ప్రతిపాదిస్తున్నాడు. ఆలోచనాపరుడు ఉద్వేగాన్ని – అంటే emotion – చిత్రించటానికి కూడా ఆలోచన, భాష పైనే ఆధారపడటం వలన సృజనలు sentimentalityగా పతనమౌతాయి. ఉదాహరణకు కళ్యాణ సుందరీ జగన్నాధ్ మేలైన కళాకారిణి కాబట్టి చాల ఆర్ద్రము, ఉద్వేగ భరితమైన ఇతివృత్తాలను కూడా sentimentalityకి ఏమాత్రం అవకాశం లేకుండా, అలాంటి స్ఫురణే రాకుండా కధను నిర్వహిస్తారు. ఉద్వేగం సృజనను ఎలా బలహీనం చేస్తుందో Eliot బాగా ప్రతిపాదించేరు. ఆలోచనాపరుల రచనలు ఊహలు, భాష, ఉద్వేగాలతో గొప్ప సొగసుగా అలంకరింపబడి కూడా నిర్జీవంగా ఉంటాయి. కవి సృజనశీలి అయ్యుండి కూడా నిపుణుడైన శిల్పి కాకపోతే అప్పుడు అతని సృజన సజీవమైనప్పటికీ, వివిధమైన స్థాయిల్లో ఏదో ఒక చోట పొందికను కోల్పోయి సగం చెక్కినవో, పొంతన లేనివో ఇంకా పని మిగిలి ఉన్న శిల్పాల్లా ఉంటాయి.
నామిని బయటి ప్రపంచం నుండి, ప్రవర్తనల్నుండి ఇలాంటి సూక్ష్మాల్ని ఒడుపుగా అందిబుచ్చుకుని, చాలా చాకచక్యంగా, కళాత్మకంగాను, గొప్ప వేదనను, సానుభూతిని అంత:సూత్రాలుగా మాత్రం నియంత్రించి ప్రదర్శించగలుగుతున్నారు. అంతరంగం గురించి ఆయనకు ఆసక్తి ఉన్నట్టు లేదు. తను ఎంచుకున్న ప్రపంచాల్లో తను చూస్తున్న సృజన నైసర్గికమైన స్వరూపానికి, స్వభావానికీ ఆయన నిబద్ధులై ఉన్నారు. నిబద్ధత అంటే కవి తను చూస్తున్న, తనది మాత్రమే అయిన సృజనకు, ఆ సృజనతో తన సంబంధానికీ కంకణ బద్ధుడై ఉండి,కేవలం దాన్ని మాత్రమే తన కల్పనలకు ఆధారంగా చేసుకొనే ప్రవృత్తి. దీనికి నిపుణత కూడా తోడైతే ఆ రెండింటి కలగలుపు గొప్ప కళాత్మకంగా అలరిస్తాయి. నఓయా షిగా (Naoya Shiga) అని జపనీస్ రచయిత – ఆయన కధల్లో ప్రకృతిని, ప్రవర్తనను గురించి ఇలాంటి నిశితమైన పరిశీలన ఉంటుంది. దీన్ని ‘వర్ణన’ అని ముక్తాయించడం సరి కాదు. ఆయన కధల్ని గురించి Ueda అని ఒక ప్రముఖ విమర్శకుని మాటలు:
“An impression of natural beauty comes from observing a man who conducts himself honestly, in accordance with his inmost feelings. Such a man would not repress his true feelings in the interest of social convention . … He would follow the dictates of his innermost self even if that would lead to an explosive clash with his father or even to the death of his wife. A man fighting for his survival was beautiful, because he was, if nothing else, pure in his motives.”
ఇది Shiga సృజనలకు ప్రవర్తనల్లోని సూక్ష్మాల్ని పట్టివ్వటం వలన వచ్చిన అందం. ఇది కాక ఆయన ప్రకృతిలోనివీ, భౌతికమైన ప్రపంచంలోనివీ ఘటనల్ని చాల సన్నని దారాల తివాచీల్లాగ అల్లుతాడు. ఇటువంటి అల్లికలకు లోకపు నైతిక మర్యాదలు సరైన కొలబద్దలు కావు. లోకంలో ‘లంజా!’ అంటే ఒక తిట్టు, చాలా తప్పు. అదే మాటను సృజనల్లో నామిని వాడినప్పుడు, శ్రీ శ్రీ వాడినప్పుడు, వేమన వాడినప్పుడు, ఆ సందర్భాలకి సహజంగా, ముచ్చటగా అమరి, గొప్ప కళాత్మకంగా ఉంటాయి.
భౌతికమైన ప్రపంచాన్నీ, ప్రకృతినీ, బయటికి గోచరమయ్యే ప్రవర్తనలనూ చూడటం కంటే కూడా అంతరంగాన్ని చూడటం మరింత కష్టమైన పని. అంతరంగపు సూక్ష్మ విశేషాలు పూర్తిగా అమూర్తమైనవి, ఎవరికి వాళ్ళే శోధించి చూడగలగాలి తప్ప ఇతరులు చూపించగలిగేవి కాదు. కాని కొందరికి అంతరంగాన్ని తరచి చూసుకోవడమే గొప్ప ఆసక్తికరంగాను, లేకుంటే ఒక అనివార్యమైన అవసరంగానూ ఉంటుంది. అలాంటి వాళ్ళు సృజనశీలురు, కళాకారులు అయితే వాళ్ళ సృజనలు అంతరంగంలోని సూక్ష్మాతి సూక్ష్మమైన విశేషాల్ని అందిపుచ్చుకొని చిత్రిస్తాయి. త్రిపుర ఈ కోవకు చెందిన సృజనకారుడు. Joyce, Beckett, Kafka లను ఈ పద్ధతికి ఉదాహరణలుగా పేర్కొంటారు. మన సంప్రదాయంలో ఇలాంటి ఆసక్తికి ధూర్జటి, వేమన, అన్నమయ్య మేలైన ఉదాహరణలుగా ఉన్నారు. వాళ్ళు కొన్ని శతాబ్దాల వెనుకటివాళ్ళు కనుక అంతరంగాన్ని చిత్రించటానికి అప్పటికి అందుబాటులో, ఆమోదయోగ్యమై ఉన్న పరిభాషను, ఊహల్నే – అంటే భవమే ఒక రోగమని, ఈశ్వరేచ్ఛ దానికి మందు అని ఇటువంటివి – స్వీకరించి తమ సృజనలని వాళ్ళు ఒప్పించేరు. అయినప్పటికీ అంతరంగపు పోకడల్ని ఒడిసిపుచ్చుకుని చిత్రించటంలో వాళ్ళకున్న నేర్పు అద్భుతంగా ఉంటుంది. కవులు అంతరంగాలలో చూసే అమూర్తమైన సూక్ష్మాల్ని గురించి రెండు విశేషాలున్నాయి. ఒకటి – స్థూల దృష్టికి అందే భాషతో, ఊహతో వాటిని పట్టి చూపించటం దాదాపు అసాధ్యమవుతుంది. రెండవది – అవి అనివార్యంగా అంతరంగపు వైరుధ్యాలను, న్యూనతలను సూచిస్తూ ఉంటాయి. త్రిపుర confession అని ప్రతిపాదిస్తున్నవి ఇవే. త్రిపురకి కాఫ్కా సృజనలంటే అంత ఇష్టం ఎందుకంటే అవి మనం స్థూల దృష్టికి పట్టుకోలేనివీ, ఎందరో రచయితలు కూడా అందిబుచ్చుకోలేనివీ ఇలాంటి సూక్ష్మాతిసూక్ష్మాల్ని ఎత్తిచూపిస్తాయట.
“నిశ్శబ్దపు పిలుపు వినగలవు నువ్వు
నిశ్శబ్దపు గర్జనను వినగలవు.
ఈ ప్రపంచం కంటే లోతయిన ప్రపంచాల్లోంచీ.”
అని త్రిపుర అన్నది ఈ అంతరంగ ప్రపంచాల్ని గురించే. దాని గర్జనలను అందిపుచ్చుకొని సృజనలుగా వెలువరించటానికి బహిశ్చేతనకు అలవాటుగా ఉన్న భాష, ఊహ, సంప్రదాయికమైన సారస్వతపు మర్యాదా సరిపోవు, పనికిరాకుండా పోతాయి, ఒక్కోసారి అడ్డం వస్తాయి. ఆ సృజనకు తనదైన భాషా, అభివ్యక్తి అవసరమౌతాయి. స్థూల దృష్టికి, తార్కికమైన పరిశీలనకు అవి అగమ్య గోచరంగా, అసంబద్ధంగా, ఉన్మాది ప్రేలాపనల్లాగా ఉంటాయి. కాని వాటికోసం ఉవ్విళ్ళూరి, వాటిని అందుకోగలిగిన పాఠకులకి అవి లభ్యమవుతాయి. Beckett సృజనలలో వెర్రి పేలాపనలా అనిపించే ఈ లక్షణం ఆయన అభిమానులకు హృద్యంగా ఉంటుంది. భాష, ఆలోచన అంతరంగం మీద చలాయించే దాష్టీకాన్ని గ్రహించి తిరస్కరించిన పిమ్మట అదే భాషనూ, ఊహనూ తన సృజనకు వినియోగించే కవి భాషాగత స్వతంత్రుడే కాదు, సర్వ తంత్ర స్వతంత్రుడు.
ప్రకృతి, ప్రవర్తన, అంతరంగం – వీటిలో దేన్ని స్పృశిస్తున్నా మేలైన కళా రూపాల్లో సృజన ప్రక్రియలోని అన్ని అంచెల్నీ, అన్ని స్థాయిల్లోనూ అమరికగా, ‘అద్భుతం’ అనిపించే పనివాడితనంతో నిర్వహించడం తెలుస్తుంది. అందరికీ కాదు; ఆ సృజనకు పాఠకులైన కొందరికి. అక్కడికి ఆ సృజన ప్రక్రియ పూర్తయ్యింది, కవికి సంబంధించినంత వరకు దానితో పని అయిపోయింది. ఇంతకు మించిన ప్రయోజనాలు సృజనకు ఉండవచ్చు. కాని సృజనకు మొట్టమొదటిది, పరమ ప్రయోజనం తన స్వభావానికి, స్వరూపానికీ తాను నిబద్ధమై ఉండటం. కవి తన సృజన స్వరూపాన్ని గుర్తెరిగి, దానికి నిబద్ధుడయి ఉన్నప్పుడే ఇలాంటి నిర్వహణ సాధ్యం అవుతున్నాది. అలాంటి నిబద్ధత లోపించటమే అబద్ధం, సృజనలోకంలో దివాలా. ఇవి లోకంలో వ్యవహరించే అబద్ధాలు – అంటే అసత్యాలు, కావు. సృజనలో అబద్ధం చిన్నదైనా, పెద్దదైనా తేడా లేకుండా మొత్తం సృజననే రస భంగం చేయగల శక్తి దానికి ఉన్నాది, కొద్దిపాటి అపస్వరాలు పాట అంతట్నీ అభాస చేసేటట్టు. కవులు కేవలం ఒక మాట కోసమో, వాక్యం కోసమో కావ్యాల్నే చిత్తు చేసేది ఇందుకే. కడివెడు పాలలో ఒక్క తోడుచుక్క అన్నది ఇందుకే.
నిపుణులైన రచయితలు తమ సృజన తత్వపు ఎరుకలో నిష్టులై ఉన్నారు. నామిని, త్రిపుర, Salinger వంటి వాళ్ళను నేను ‘బాలోన్మత్త పిశాచవట్’ అన్నది ఇందుకే. వాళ్ళు చిన్న పిల్లలు కారు, పిచ్చివాళ్ళు కారు, పిశాచాలూ కారు, రస నిష్టులైన యోగుల్లాంటి వాళ్ళు. తమకే స్థిరంగా, అనుభవపూర్వకంగా తెలిసిన తమ సృజన తత్వం ఒక్కదానికి మాత్రమే కట్టుబడి ఉండి, దానికి విరుద్ధమైనవన్నిటినీ అవి ఎంతటి వాంఛనీయమైన విషయాలైనా అనివార్యంగా తృణీకరిస్తున్న వాళ్ళు. మిగిలిన సృజన రంగాల్లో కూడా ఇలాంటి నిష్ట ఉన్న సృజనకారుల ఉదాహరణలు ఎన్నో ఉన్నాయి. ఈ నిబద్ధతను ఏదో ఒక తత్వానికో, ఆలోచనా మార్గానికో చెందినదిగా అపార్ధం చేసుకోకూడదు. ఉదాహరణకు పోతన, అన్నమయ్య భక్తికి, గద్దర్ విప్లవ మార్గానికి, ధూర్జటి వైరాగ్యానికీ నిబద్ధతను ప్రకటించుకున్నారు, కాని ఇది కాక వాళ్ళు తమ సృజన స్వరూపానికి, స్వభావానికీ నిబద్ధులై ఉన్న, నిపుణులైన కవులు. అందుకే వాళ్ళ జీవన తత్వం, సృజన తత్వం ఒకదానికొకటి అడ్డురావు సరికదా వాళ్ళ సృజనల్లో విడదీయరానంతా కలసిపోయి, ఒకదాన్ని ఒకటి పరిపుష్టం చేస్తాయి.
అలాంటి మేలైన సృజనల్ని ఎలా పోల్చుకుంటాము? ఎవరో ఇలాగే అడిగితే రావి శాస్త్రి గారు ‘చదివితే తెలిసిపోతుంది శిష్యా!’ అన్నాడు. నేను ఇది వరకు అన్న పేచీలలో ఒకటి ఏమిటంటే నాకు నూటికి తొంభై రచనలు రుచించవు. చదవబోతే ఏదో ఒక మేరకు నిరాశ కలిగించి, మరి ముందుకి సాగనివ్వవు. నా రచనలు కూడా ఇందుకు మినహాయింపు కావు. గొప్ప కవులనుకున్న వాళ్ళవి కూడా కొన్ని బావుంటాయి, కొన్ని ‘ఛీ కాదూ, భళా కాదూ’ అన్నట్టుంటాయి. ఏవో కొన్ని, ఎప్పుడో అరుదుగా మాత్రం ‘ఆహా!’ అనిపిస్తాయి. ఇది ఎందుకిలాగ? నా దృష్టి దోషమా? లేక మేలైన సృజనలు అంత దుర్లభమా, కోట్లాది కోట్లమంది మనుషుల్లో ఏ కొందరో మహాత్ములున్నట్టు? కవులు ఒకరిపట్ల ఒకరు సామరస్యంగా, సుహృద్భావంగా ఉండటం, అన్ని రకాల పోకడలనూ ఆదరించటం ప్రజాస్వామ్య సంస్కృతికి అవసరం కదా? మరి నచ్చని సంగతులు నామిని చెప్పుకున్నట్టు పైకి చెప్పుకుంటే మనోభావాలు దెబ్బతినవా?
నా స్నేహితులు ఒకరిద్దరు – సాహిత్యం అంటే బాగా ఇష్టపడేవాళ్ళు, విస్తృతంగా చదువుకున్నవాళ్ళు – నాకు త్రిపురంటే ఎందుకంత ఇష్టం అని ఆరోపణగా అడిగేవాళ్ళు. త్రిపుర సృజనలు కనీసం చదివితే ‘అర్ధం’ కావు! ఆలోచనల్ని రేకెత్తించి మనుషుల్ని కార్యోన్ముఖుల్ని కమ్మని బోధించవు! నాక్కూడా ఏమని జవాబు చెప్పడానికీ పాలుపోలేదు. త్రిపుర ఈ విషయం బేషరతుగా ఒపుకుంటారు – ‘ఎవరికో ఇద్దరికో ముగ్గురికో అర్ధమవుతాయనుకుంటాను…’ అని. అర్ధంకావన్న ఆరోపణల్ని గురించి త్రిపుర చెప్పిన ఛలోక్తులున్నాయి. ఆయనకి లెక్కల్లో పాఠాలు పై తరగతులకి పోయేకొద్దీ అర్ధం అయ్యేవి కావట. భిన్నాలు పాఠంగా చెప్పేటప్పుడు ఒక రొట్టెని నాలుగు భాగాలుగా చేసి ఒక్కొక్కదాన్నీ 1/4 అనుక్కోమంటే, ‘అలాగెలాగ? ఒక్కోముక్కా అది కూడా పూర్తిగా ఒక రొట్టే కదా?’ అని ఇలాటి సందేహాలతో ఇంక బండి ముందుకి నడిచేది కాదు. పెద్ద లెక్కల పుస్తకాల్నీ, అవి చర్చించుకొనేవాళ్ళనీ చూసి ‘అవి ఏవో నిజమే అయ్యుంటాయి, మనకి ఎక్కవులే!’ అని ఊరుకున్నారట. త్రిపుర వాళ్ళ బంధువులొకాయన, ఏభయ్యరవై ఏళ్ళ మనిషి, పత్రికల్లో వచ్చే కధల్ని చూసి “ఇవీ కధలేన్రా? మధ్యలో మొదలెట్టెస్తారు. ఎలా అర్ధమవుతాయి?!” అని విసుక్కొనేవారట. అంటే ‘పూర్వం బ్రహ్మదత్తుడు కాశీరాజ్యాన్ని పరిపాలించే కాలంలో సుందర రామ పురం అనే గ్రామమునందు ఒక …’ అని ఇలా ‘మొదట్నుండీ’ చెప్పిందే ఆయనకి రుచించే కధ.
అన్నీ అందరికీ అర్ధం కావాలని ఆశించటం అపోహ. ఈ విషయంలో త్రిపురవి, నారాయణ రావు గారివి కూడా స్థిరమైన అభిప్రాయాలే. ఒక్కో రచయితకి, కవికి వాళ్ళ రచనల్ని అందుకోగలిగినవాళ్ళు, కావాలనుకొనే వాళ్ళూ కొందరే పాఠకులుంటారు. వాళ్ళే వాళ్ళకి ఒకరికొకరు పాఠకులూ, కవులూ. సృజనల్లోనూ ఇలా తరగతులుంటాయి అని, అన్నీ అందరికోసం కానక్కర్లేదనీ ఒప్పుకోవటమే చాలమందికి కష్టంగా ఉంటుంది. కవికి తన సృజనలు ‘నా జాతి జనం గుండెల్లో పాడుకొనే గీతంగా…’ కావాలని కోరికగా ఉంటే అది అందరు పాఠకులూ తను రాసింది ఇష్టపడే తీరాలన్న అపోహకు, ఆశకూ దారితీసే అవకాశం ఉంది. పాఠకులకి తమకు నచ్చిన కవుల్నే అందరూ నచ్చుకోవాలనీ, వాళ్ళు ‘మహా కవులు’ అని ఇతరులు ఒప్పుకోవాలనీ ఉండే కోరిక కూడా ఒక అపోహ. వీరాభిమానం గురించి త్రిపుర ఒకసారి చామల వేపుడు కధ చెప్పేరు. వాళ్ళ మనవడి వరస ఒకబ్బాయి చామల వేపుడొక్కటే తింటాడు తప్ప ఇంక ఏ కూరా తినడు. అవి కూరలే కావు అని తిరస్కరిస్తాడు. కూరల్లో రక రకాల కూరల్ని తిని ఆస్వాదించగలిగినట్టే సృజనల్లో రక రకాలు – మిష్టరీ నవలలు, డిటెక్టివ్ నవలలతో సహా – చదివి ఆస్వాదించవచ్చని, వాటన్నిటిలోను సృజన నైపుణ్యాన్ని, భాషా చమత్కృతిని పరికించి చూడవచ్చని ఉదాహరణలతో చెప్తుంటారు.
నారాయణ రావు గారు వైవిధ్యాన్ని గుర్తించి, ఒప్పుకోవలసిన అవసరాన్ని, పద్ధతినీ బాగా విడమరచి చెప్పేవారు. అన్ని గొప్ప రచనలూ ఒకే రకంగా, అవే కారణాల వల్ల గొప్పవి కావు. ఒక్కోటీ ఒక్కో రకం కారణాల వలన, కొన్ని రకాల పాఠకులకి మాత్రం గొప్పవి. ఇది ఇప్పుడు చాల సరళమైన విషయంలా ఉంటుంది కాని, మా చిన్నప్పుడు దీన్ని గురించే చాల గందరగోళంగా ఉండేది. ఎందుకంటే సాహితీ చర్చ పేరిట మా చుట్టూ ‘శ్రీ శ్రీ గొప్పవాడా, నారాయణా బాబు గొప్పవాడా?’ ‘ఈ శతాబ్దం శ్రీ శ్రీదేనా, ఇంకా ఎవరికైనా వాటా ఉన్నాదా?’ ఇలాంటి సంవాదాలు తీవ్రంగా నడిచేవి. చుట్టూ ఉన్న కవులందర్నీ ‘చిన్నారి పొన్నారి చిరుత కూకటి నాడే’ వాద ప్రతివాదాల్లో ఓడించి, ‘గౌడ డింఢిమ భట్టు కంచు ఢక్కా పగలగొట్టటమే’ బాల కవులకి వన్నె తెచ్చే ప్రవర్తన అన్న భావనతో నేను కూడా వీరోచితంగా పోరాడి లయన్స్ క్లబ్ వాళ్ళు, రామక్రిష్ణా మిషన్ వాళ్ళు, సాహితీ సంస్థల వాళ్ళు ఇచ్చే బహుమతుల కోసం ఎగబడేవాణ్ణి. ఈ దురద ఒక యావగా, యుద్ధ కాంక్షగా స్థిరపడకుండా త్రిపుర, నారాయణ రావు గారి వంటి ఉపాధ్యాయులు వాళ్ళకి తెలిసో తెలియకో అడ్డం పడి నాకు మేలు చేసేరని తల్చుకుంటాను.
వ్యక్తిగతమైన అభిరుచిని, పదుగురిలో చెలామణీలో ఉన్న ఉమ్మడి అభిరుచినీ సమన్వయం చేసుకోవటం ఎలాగన్న ఈ ప్రశ్నను గురించి సౌందర్య సిద్ధాంతమనీ, రస సిద్ధాంతమనీ, సాహిత్య సిద్ధాంతమనీ మన సంప్రదాయం లోను, పాశ్చాత్య సంప్రదాయం లోనూ చాలా చర్చే ఉంది, వీటిని ఏ కొంతైనా నివృత్తి చేసుకోడానికి ఉపయోగిస్తుంది. మిగతా భాషల సారస్వత సంస్కృతుల్లో కూడా ఇలాంటి చర్చ ఉండే ఉంటుంది. ఈ వ్యాసం ఇప్పటికే తీగె పాకంలాగ సాగుతున్నాది కాబట్టి ఆ సంగతులు ఇంకోసారి వేరేగా మాట్లాడుకోవాలి. పుట్టపర్తి నారాయణాచార్యులు గారికి ఎలాంటి సృజనలూ ఒక పట్టాన నచ్చేవి కావట. ఆయన తన రస పిపాస తీరుతుందేమోనన్న ఆశతో పధ్నాలుగు భాషల్లోని సాహిత్యాన్ని వెదుక్కుని, ఇంకా తనివి తీరక సంగీతం, నాట్యం కూడా నేర్చుకున్నారట. తీవ్రమైన రస దృష్టి సరస్వతీ తత్వమనీ, దానిలో తాను నిష్టుణ్ణనీ ఆయన చెప్పుకున్నారు. చాసో గారు ఒక పట్టాన ఏ కధలూ తనకి నచ్చవని, నచ్చినవి నిజంగానే వేళ్ళమీద లెక్కించి చెప్పేవారట. విశ్వనాధ సనాతన ధర్మమే తనకు తెలిసిన, తనదైన సంప్రదాయమని, దాన్ని చిత్రిస్తే తనని ఎందుకు తప్పుపడతారని, తనకు తెలిసిందీ, తనదైనదీ రాసుకోక మరి ఇంకేం రాయమంటారనీ వాపోయేరు. నారాయణ రావు గార్ని నేను అభిరుచిని గురించి అడిగితే ఆయన శ్రేష్టమైన అభిరుచి గలవాళ్ళు ఉండే ఉంటారనీ, వాళ్ళు సాహిత్యం పేరిట జరిగే నిర్వాహకాన్ని నిస్సహాయంగా తమాషా చూస్తూ ఉంటారనీ, వాళ్ళు అలా ఊరుకోకుండా తమ దర్శనాన్ని ప్రకటించి, చర్చించాలనీ వాపోయేవారు. చర్చ ఎందుకు? అని అడిగితే చర్చ అభిరుచిని సంస్కరిస్తుందనీ, ఉన్నతం చేస్తుందనీ పదే పదే చెప్పేవారు. త్రిపుర కూడా చర్చకు, విమర్శకు ఉన్న ఈ ప్రయోజనాన్ని గురించి నొక్కి చెప్పేవారు, కాని కళా చర్చ పేరిట జరిగే వ్యాసంగాన్ని అనాసక్తితో పక్కన పెట్టేసేవారు.
చర్చలు సృజనకారులకు కొంతవరకు ఉపయోగ పడతాయిగాని మరీ శ్రుతిమించితే అడ్డంకులౌతాయి అనిపిస్తుంది. ఇందుకేనేమో సృజనను గురించి చర్చలంటే నాకు అదొకలాంటి అయిష్టం. అందుకే ఈ వ్యాసం కూడా ఇంతకుమించి ముందుకు నడవనని మొరాయిస్తుంది. సృజన గురించే కాదు, మనం కావాలనుకొనేవీ, ఉన్నతమైనవి అనుకొనేవీ – ప్రేమ, స్నేహం, దయ, శాంతి, దైవం, ప్రతిభ, సమత, సౌందర్యం, మానవత్వం, మంచితనం, మౌనం, ధ్యానం, ముక్తి ఇలాంటివి – ఏవీ వాటిని గురించి మాట్లాడీ, చర్చించీ పొందగలిగేవి కావనిపిస్తుంది. అంతేకాక వాటిని గురించి ఎంతగా చర్చిస్తే వాటినుండి అంతగా దూరమౌతామనిపిస్తుంది. ‘Word is not the thing’ అని, ‘Map is not the territory’ అని తాత్వికులు హెచ్చరిస్తుంటారు. ‘శబ్దజాల మహారణ్యం చిత్త భ్రమణ కారకం’ అని శంకరాచార్యులు అన్నారట. సృజన గురించిన చర్చలు సృజన కావు కదా. పైగా అవి సృజనశీలుర ధ్యాసను సృజనమీద నిలచి ఉండకుండా పక్కదార్లు పట్టించి ధర్మ పన్నాలుగా పతనమయ్యే ప్రమాదం ఉన్నాయి. ఇందుకే కళా చర్చను గురించి నాకు చాల నిరాశ.
త్రిపుర సృజనను గురించిన చర్చల్ని సంశయంతో పరికిస్తారు. త్రిపుర కాఫ్కా కవితల సంపుటి మొదటి పేజీల్లో ఒక జెన్ యోగి కవిత ఉంటుంది:
Who calls my poems poems?
My poems are not poems.
Knowing my poems are not poems
Together we can begin to speak of poems.
‘ఇవి మంచి కవితలు, అవి కావు, ఈ కవి కంటె ఆ కవి తక్కువవాడు’ అని ఇలాంటి చర్చల్ని త్రిపుర దగ్గరకు తీసుకొనిపోయే వాళ్ళకి ఆయన మౌనమే సమాధానం అవుతుంది. ఇది లౌక్యంతోనో, మర్యాద కోసమో, తన ఔన్నత్యాన్ని సూచించడానికో పాటించే మౌనం కాదు. తర్కపు పరిమితుల్ని గుర్తెరిగి, బుద్ధికి గుణ దోషాల్ని విచారించాలని ఉండే లౌల్యాన్ని, దాని వెనుక ఉన్న యావను కూడా బాగా అర్ధం చేసుకుని, దాన్ని తప్పు పట్టకుండా మన్నించి ఊరుకునే యోగి మౌనం. To set up what you like against what you dislike – this is the disease of the mind అన్న తాత్వికుని మౌనం వంటిది. త్రిపుర గురించి నా స్నేహితుల ఆరోపణకు జవాబివ్వటం చాలా జటిలమైన పని, అది ఒక పెద్ద పుస్తకమే అవుతుంది, Beckett వంటి రచయితల్ని గురించి చర్చల వలెనే. త్రిపురతో పరిచయం లేనివాళ్ళకి ఆయన పుస్తకాలున్నాయి. “త్యాగరాజాది మహాత్ములందరూ పాడి పొందలేదు. పొందినదానినే పాడినారు.” అని రమణ మహర్షి అన్నారట. నేను త్రిపుర పుస్తకాల్నే కాదు, ఆయన స్నేహాన్నీ, వాత్సల్యాన్నీ పొందిన అదృష్టవంతుణ్ణి. త్రిపుర పుస్తకాలు ఆయన ప్రజ్ఞ లోతులకు చిన్నపాటి మచ్చు తునకల్లాగ ఉండి ‘ఇవి ఎందుకులే త్రిపురే ఉండగా!’ అనిపిస్తాయి.
అభిరుచుల్ని గురించి త్రిపుర చెప్పేది ఏమంటే మౌలికంగా, అంటే దేశ కాలాదులతో సంబంధం లేకుండా, నిరపేక్షమైన ప్రమాణాలని ఏమీ లేవు. ప్రతిభావంతులైన వాళ్ళు, కుశాగ్రబుద్ధులు ఒకరి తర్వాత ఒకరు వచ్చి ఒక సిద్ధాంతాన్ని ప్రతిపాదించడం, దాన్ని వేరొకరు రద్దుచేసి ఇంకోటి ప్రతిపాదించడం తత్వంలోనూ, సాహిత్యం లోనూ చిరకాలంగా జరుగుతూ వస్తోంది. ‘ఇదే నిజం, ఇదే నిజం’ అని బల్లలు గుద్ది చెప్పడం అసంబద్ధంగా ఉంటుంది ఆయనకి. అసలు ఆలోచనే సాపేక్షమైనది. ఆలోచనని ఆలంబనలుగా చేసుకొని సృజన తత్వాన్ని గురించి ప్రతిపాదించే చర్చ సమస్తాన్నీ ఆయన ప్రగాఢమైన ఆసక్తితోనే కాని ఏమాత్రం కలగజేసుకోకుండా పరికించి చూస్తుంటారు. దీన్నిగురించి ఒక ఛలోక్తి కూడా చెప్పేరు. ఒకడు అరుగుమీద కూర్చుని తగువు వింటున్నాడు. వాది ముందుకొచ్చి తన వాదం వినిపిస్తే “ఇది బావుంది!” అన్నాడు. ప్రతివాది ముందుకొచ్చి వాడు చెప్పింది ఖండిస్తే “ఊఁ ఇదీ బావుంది!” అన్నాడు. మూడోవాడు పెద్ద మనిషొచ్చి “అదేంటి వాడు చెప్పిందీ బావుంది, వీడూ చెప్పిందీ బావుంది అంటావు, అలాగెలాగ తప్పు కదూ?” అంటే “ఊఁ నువ్వు చెప్తున్నదేదో ఇదీ బాగానే ఉంది!” అన్నాడుట. ఇంక అతనికి వాదాలేం వినిపిస్తారు?
నారాయణ రావు గారు కళా చర్చను గౌరవిస్తారు. చర్చకున్న ప్రయోజనాల మీద ఆయనకు గట్టి నమ్మకమే ఉంది. ఆయన విమర్శతో నాకు పేచీలన్న వాటిలో ఒకటి ఈ విషయానికి – అంటే అభిరుచికి సంబంధించినది. ఒక వస్తువుని మనం పరిశీలనకు స్వీకరించేమంటే అది మంచి యోగ్యమైన వస్తువు అయ్యుండాలి కదా. మరి ఆయన విమర్శకు, అనువాదం కోసం స్వీకరించే వస్తువుల్లో ఎన్నో నా దృష్టికి ఏమాత్రం రుచించనివి ఉన్నాయి. వాటిని ఎందుకు తలకెత్తుకుని సమీక్ష, విమర్శ నిర్వహిస్తారు? అని. దీనికి సాహిత్య సిద్ధాంతుల్లోనే కొందరు సమాధానం ఇదివరకే ఇచ్చేరు. సృజనల్ని గుర్తించటం (identification), వాటి నాణ్యతల్ని పడికట్టటం ఇవి రెండూ ఒకే పని కాదు, వేరు వేరు పనులు. రచనల్లో అన్నిరకాలుగా ఒప్పించగలిగేవి, మేలైనవి సృజనలు చాలా తక్కువగానే ఉంటాయట. అదీ కాక ఈ ఒప్పించటం అనేది చదివేవాళ్ళు ఆ సృజనకు పాఠకులు అవునా కాదా అనే విషయం మీద కూడా ఆధారపడి ఉంటుంది. అంచేత విమర్శకులు సాధారణమైన పాఠకులు చేసేటట్టు ఆదికి ముందే తమకు రుచించని రచనల్ని తిరస్కరించకుండా, అన్నింటినీ స్వీకరించి సంయమనంతో, ఓపిగ్గా వాటి మంచీ చెడ్డా విచారించి చెప్పాలట. నాకైతే ఇలాంటి సహనం ఎంతమాత్రం లేదు. ఇది నా తప్పో ఒప్పో నాకే తెలీదు. ఏ కోణం నుండి, ఏ స్థాయిలో చూసినా అన్ని రకాలుగానూ నాకు గొప్పగా నచ్చే కొద్దిపాటి సృజనల కోసమే నేను వెతుక్కుని వెతుక్కుని అవే మళ్ళీ మళ్ళీ చదువుకుంటాను. వైవిధ్యం,సుహృద్భావం,సామరస్యం, ప్రజాస్వామిక మైన దృష్టితో అన్ని వర్గాల రచనల్నీ సమానంగా ఆదరించడం వంటి కొలబద్దలు సృజన పట్ల అపచారాలని నేను కోపగించుకుంటాను. ఇలాగ కోపం తప్పు అని తెలిసి కూడా నేను నిగ్రహించుకోలేక త్రిపుర దగ్గిరా, నారాయణ రావు గారి దగ్గిరా అక్కసుపడితే వాళ్ళు ఇద్దరూ ఒక్కలాగే నవ్వీసి ఊరుకునేవాళ్ళు – ‘ఓహో! నీకు అలాగుంటాది వై?!’ అని.
రస దృష్టికి, క్షమా దృష్టికి మధ్య ఈ సంఘర్షణను త్రిపుర, నారాయణ రావు గారు ఇద్దరూ తమవైన తోవల్లో పరిష్కరించుకున్నారు. నా మటుక్కి నాకు ఇది చాల ఇబ్బందిగా పరిణమించింది. కనకమ్మ గారని ఒక యోగిని – ఆవిడతో చెప్పుకున్నాను. కనకమ్మ గారు వృద్ధురాలు, తన జీవితాన్నంతట్నీ చలం గారు చెప్పుకున్న లాంటి తత్వ చింతనకు ధారపోసిన మనిషి. ఆవిడ నేను చెప్పుకున్నదంతా విని “పోనీలే రాయడం నీ ప్రవృత్తి అనుకో, దాన్లో తప్పేముంది?” అన్నారు. నేను ‘అది నిజమే కాని నా అసహనం తప్పుకదా, నామీద నాకే చికాకేస్తుందీ’ అని అడిగేను. ఆవిడ “మనసు బిర్ర బిగుసుకొని ఉంటే అహంకరించి తన ఆలోచనలకీ ఇతరుల ఆలోచనలకీ యుద్ధాలు ప్రకటించుకొని, తనదే పైచేయి అని ఎలాగోలాగ నిరూపించుకుంటుంది. ప్రార్ధిస్తే మనసు మెత్తనవుతుంది. అది మీ పనికి కూడా మంచిదవుతుంది.” అన్నారు. ఆవిడ చెప్పిన మాటలకంటే ఆవిడ స్వయంగా మూర్తీభవించినట్లున్న క్షమను, సహనాన్ని చూసి నేను చకితుణ్ణయిపోయేను గాని ఆవిడ చెప్పినట్టు ప్రార్ధించి కూడా నేను దొంగ సృజనల్ని సహించలేకుండా ఉన్నాను. ‘నేనింతే కాబోలు!’ అనుకున్నాను.
‘రసం’, ‘యోగం’, ‘నిష్ట’ వంటి మాటలు ఇప్పుడు చాదస్తంలా అనిపిస్తాయి. వాటిని పాత కాలపు సాంకేతిక పదాలుగా స్వీకరించి అవి వేటికి ప్రతీకలో ఆ అనుభవాల్ని అర్ధం చేసుకొనే ప్రయత్నం చెయ్యవచ్చును. ‘రవిగాంచనిచో కవిగాంచునే’ అని మునుపెవరో అన్నదీ, ‘కళ్ళంటూ ఉంటే చూసీ..’ అని శ్రీ శ్రీ గారన్నదీ, కవి తన పాఠకునికి తలలోని జేజమ్మని దర్శింపజేస్తాడని నేనన్నది రస దృష్టినే సూచిస్తున్నాయి. ఇప్పుడు దీనిమీద రసవత్తరమైన విజ్ఞాన శాస్త్ర చర్చ జరుగుతున్నాది. ఉదాహరణకు రామచంద్రన్ అని ఒక మనోవైజ్ఞానికుడు ప్రతిపాదించిన సిద్ధాంతం – The Science of Art అని ఉన్నాది. సృజనని అమ్మ అని, సరస్వతీ దేవి అని, భారతీ అనీ, సంగీత శ్యామలే అనీ వ్యవరించే ప్రతీకలు నాకైతే మూఢ నమ్మకంలా కాక మిక్కిలి మనోహరంగా ఉంటాయి. జీవితపు భీభత్సం నుండి సేదదీర్చి, దాన్లోంచే జీవితపు మాధుర్యాన్నీ, సౌందర్యాన్నీ వెలికితెచ్చి అందించే సృజన కవికి, అతని పాఠకులకీ అమ్మ. సృజన తత్వం తెలియక వాళ్ళు చేసే తప్పులు అమ్మ యెడల పిల్లలు చేసే లాంటి తప్పులు, దిద్దుకోగలిగినవి. ఈ తప్పులేమిటో నాకూ బాగా అనుభవం ఉన్నాది. ‘వెలది, జూదము, పానము, వేట, పలుకు ప్రల్లదనము, దండంపు పరుషదనము, సొమ్ము నిష్ప్రయోజనముగా వమ్ముసేత’ ఇవి బతుకుల్లో చేసే తప్పులట! సృజనల్లో తప్పులేమిటో నాకు ఊహ తెలిసినప్పటి వరకూ వెనక్కి చూసుకుని అవన్నీ ఇదిగో ఒక జాబితా లాగ రాసేను: పాలుమాలిమి (Boredom), మెప్పు యావ, అనుకరణ, దబాయింపు, బుకాయింపు, గడుసుతనం, టక్కరితనం, చాపల్యం, ప్రదర్శన, స్వాతిశయం, బద్ధకం, అశ్రద్ధ, నటన, కాఠిన్యం, అసహనం, నిర్దయ, ప్రలోభం, పక్షపాతం, దురభిమానం, దుందుడుకు, మొహమాటం, పెద్దమనిషి తరహా, నాయకత్వ కాంక్ష, కపటం, ముఠా తత్వం, డాబుసరి, పెట్టుడు ఆవేశం (sentimentality), గురుత్వ కాంక్ష, అపోహ, రాజకీయం, ప్రచారం, దుర్భ్రమ (confusion about roles and purpose), ఉదాత్తత – అంటే Holier than thou! అన్నలాంటి వైఖరి. తప్పులు తెలుసుకుని దిద్దుకోగలిగితే చివరికి నైసర్గికమైన ప్రతిభంటూ ఉండి ఉంటే అది సృజనల్లో ప్రస్ఫుటమవుతుంది. తమ ప్రతిభ, అభ్యాస బలంతో ఇలాంటి బలహీనతల్నుండి ముక్తులైన వాళ్ళు సృజన తత్వాన్ని గురించి క్షమతో చెప్పకనే చెప్పగలిగే ఉపాధ్యాయులు.
గురు స్థానాలను అన్నింటినీ లౌక్యులు, మేధావులు తెలిసో తెలియకో ఆక్రమించుకొని ఉన్నా వివేకంతో తమ గురువుల్ని వెదికి వెదికి అందుకోగలిగిన సృజనశీలురు అదృష్టవంతులు. సృజనశీలురైన వాళ్ళకి బాల్యం గడుస్తున్నకొద్దీ తమకు సృజనతో ఏదో ఒక సంబంధం ఉండక తప్పదన్న స్పృహ కలుగుతుంది. పెరిగి పెద్దయ్యి వాళ్ళు సృజనకారులుగా తమ పాత్ర ఏమిటో, సృజనతో తమ సంబంధం ఏమిటో కనుక్కోవలసి ఉంటుంది. కవి, రచయిత, నాటక కర్త, వాగ్గేయకారుడు, రసజ్ఞుడు, పండితుడు, ఉపాధ్యాయుడు, లాక్షణికుడు, రస సిద్ధాంతి, విమర్శకుడు, సంపాదకుడు, ప్రచురణకర్త, ప్రచారకుడు, – సృజనశీలురకు సృజనతో ఇన్ని రకాల బాంధవ్యాలకు అవకాశం ఉంది. వీటిలో తమ పాత్ర ఏదో ఎంచుకోవటమే కష్టం; కాని అక్కడితో ఈ ప్రశ్న ఆగదు. తాము ఎంచుకున్న పాత్ర నిర్వహించడంలో తమ మార్గం ఏమిటో కూడా వాళ్ళు వివేకంతో నిర్ధారించుకోవాలి. దీనికి వెనుకటి తరాలవాళ్ళు ఉపాధ్యాయులుగా తోవ చూపించగలగాలి. ఈ విషయంలో దుందుడుకు నిర్ణయాలు తీసుకుంటే, తమ ప్రతిభకు, ప్రవృత్తికి, శక్తికి సరిపడని తోవలు ఎంచుకుంటే అసంతృప్తి మిగులుతుంది. దీన్ని వివేకంతో నిర్వహించుకో గలిగిన వారికి సృజన నుండి తాము ఏం ఆశిస్తున్నారో అది దొరికి ఊరట కలుగుతుంది.
అలాంటి సమతుల్యాన్ని సాధించుకున్నవాళ్ళు తమ సృజనను గురించీ, సృజనతో తమ సంబంధాన్ని గురించీ చెక్కు చెదరని స్థైర్యంతో ఉంటారు. కాని అదే సమయంలో ఏదో ఒక నైసర్గికమైన వినయంతో కూడా ఉంటారు. త్రిపురని, నారాయణరావు గార్ని నేను చూసీ చూడగానే వాళ్ళిద్దరిలో ఇలాంటి స్థైర్యాన్ని పోల్చుకున్నాను. రావిశాస్త్రి గారు ఇలాగే ఉండే వారు. వీళ్ళే కాదు ఇలాంటి నిబ్బరం ఉన్న సృజనకారుల్ని జీవితంలో అన్ని రంగాల్లోనూ ఎప్పుడో అపురూపంగా తారసపడుతుంటారు. వీళ్ళల్లో తమ సృజన నాణ్యతనీ విలువనీ ఇతరులకి ప్రదర్శించి మెప్పించుకోవాలన్న ఆదుర్దా, యావ కనిపించవు. రాసింది వెనుతిరిగి చూసుకొని పశ్చాత్తాప పడటం, ఇతరుల అంచనా కోసం, మెప్పు కోసం ఎదురు చూడటం క్రమేపీ లుప్తమైపోతాయి. ఎందుకంటే స్వయం ప్రకాశకమైన వస్తువుల్ని ఎత్తి చూపించటానికి వాటిమీద వేరే దీపం వెయ్యక్కర్లేదు.
త్రిపుర అయితే ఈ విషయంలో చెప్పనలవి కానంత ధీరుడు. ఆయన సృజన గాంభీర్యపు లోతులు కొలతకు అందనివి. ఒకసారి ఒక గాయనిలో ఇలాంటి స్థైర్యాన్నే చూసి చకితుణ్ణై ఆ సంగతి త్రిపురతో ప్రస్తావించేను. ఆవిడకి తన సంగీతాన్ని గురించీ, జీవితాన్ని గురించి కూడాను అంతటి నిబ్బరం ఎక్కడ్నుంచి వస్తుంది? అని. త్రిపుర చెప్పేవి మాటలు తక్కువ, చేష్టలు, నవ్వులు, సంకేతాలే ఎక్కువ. ఆయన చెప్పిందీ ఏమంటే – కళాకారులు తమ సృజన మీద ఆశీనులై ఈ జరిగే లోక వ్యవహారాన్నీ, ఒడిదుడుకుల్నీ చోద్యం చూస్తుంటారని. నామిని సుబ్రహ్మణ్యం నాయుడు గారి మాటల్లోనూ ఇలాంటి స్థైర్యాన్నే చూస్తున్నాము. దుర్భరమైన కష్టాల్ని, వేదనను స్వయంగా అనుభవించేవాళ్ళు సైతం సృజనశీలురైతే చిత్రంగా ఆ దు:ఖం ఒక సాకుగా మారి వాళ్ళ సృజనని కబళించివెయ్యటం లేదు సరికదా అంతర్లీనంగా ప్రవహిస్తూ వాళ్ళ సృజనకు వన్నె తెస్తున్నాది. ఎలాగో?!