రచనల్లో నిజాయితీని గురించి త్రిపుర చెప్పిన మాటలు – రాతలన్నీ కల్పనలు. ‘నిజం’ కావు. రక రకాల కళాకారులు తమ కళారూపాల్ని ప్రదర్శించినట్లే రచయిత తన సృజనను ప్రదర్శిస్తున్నాడు. రచనకు సంబంధించినంత వరకు ‘నిజం’ అని, ‘నిజాయితీ’ అనీ పట్టు పట్టడం సబబు కాదు. రచయిత ఒక ఐంద్రజాలికునిలా వదిలించుకొనే వీల్లేనంత గట్టిగా పాఠకుడి ధ్యాసను, దృష్టినీ చేజిక్కించుకుని రక రకాల వింతలు మలుపులున్న తన కాల్పనిక వీధుల్లోనికి ఈడ్చుకుపోతూ ఆ కల్పననే చూడమని ప్రదర్శిస్తున్నాడు. గాయకులు, నర్తకులు, చిత్రకారులు, నటులు – ఇలాంటి కళాకారుల ప్రదర్శనల్ని చూసి అవి రక్తి కట్టేయా లేదా అని శ్రోతలు, ప్రేక్షకులు తమకు తాముగా నిర్ణయించుకుంటారు. ఇలాంటి నిర్ధారణలను సమంజసంగా ప్రతిపాదించి, ఒప్పించగలిగే వాళ్ళని మంచి అభిరుచి ఉన్నవాళ్ళని చెప్పుకుంటాము.
రాతపూర్వకంగా ఉన్న ఏ విషయానికైనా పాఠకుడ్ని ఒక కాల్పనిక ప్రపంచంలోకి తీసుకొనిపోయే శక్తి ఉంది. త్రిపుర ఒకసారి దీనికి రైల్వే టైంటేబుల్ ఉదాహరణగా చెప్పేరు. రైళ్ళ రాక పోకల పట్టిక తెరచి దాన్లో ‘రాయగడ బొలాంగీర్ మీదుగా కిరుబురు మరియు ఆ పైకి’ అని ఆపాటి చదివితే కాల్పనిక ప్రపంచాలు అప్పుడే కిటికీలు తెరుచుకోవడం ప్రారంభిస్తాయి. నారాయణరావు ఈ విషయాన్నే ఇంకొకలాగ, ఇంకా తీవ్రంగా చెప్పేరు. ప్రతి మాటకీ కల్పించే శక్తి ఉంది. మాట అంటేనే కల్పన. ‘కనక ప్రసాద్’ అని అంటే ఆ పాటి మాటే విన్నవాళ్ళకి రక రకాల ఊహా చిత్రాల్ని కల్పిస్తుంది. నారాయణరావు ఈ సంగతికి కొనసాగింపుగా తిరిగి ఒక ప్రశ్న అడిగేవారు. ఒకసారి కల్పించిన పాత్రలు ఆ రచన అయిపోయేక ఎక్కడికి నిష్క్రమిస్తున్నాయి? గుర్తుండిపోయిన పాత్రల్ని గురించి ఈ ప్రశ్న వేసుకుంటే చిత్రంగా ఉంటుంది.
రచన కవి నిర్వహిస్తున్న ప్రదర్శన. దానిలో కవి తన నిజ స్వరూపాన్నో, తను చూసే జీవితపు శకలాన్నో యధాతధంగా త్రుంచి చూపించాలని ఆశించలేము. అటువంటి షరతులు వాస్తవంగా సృజన జరిగే పద్ధతికి, కల్పన స్వరూపానికీ విరుద్ధం. కవి, రచయిత ఒక మాటల నటుడు, మాటలతో తన చదువరులు ఒక్కొక్కరికీ వాళ్ళకే ప్రత్యేకమైన ఊహా ప్రపంచాన్ని కట్టి ఇచ్చే దృశ్య శిల్పి. రచన నుండి ఆశించవలసింది ఏమంటే – ఆ రచన ఒక్కో పాఠకుడికీ ప్రత్యేకంగా చూపిస్తున్న తన ప్రదర్శనను రక్తి కట్టించటంలో ఆ ఒక్క పాఠకుడి అనుభవంలో ఏ మేరకు సఫలమయ్యిందన్న విషయాన్ని మాత్రమే. ప్రత్యేకం ఎందుకంటే ఆ ప్రదర్శన పాఠకుని మనోరంగంపై కవీ, పాఠకుడూ జట్టుగా నిర్వహించేది. ఇలాంటి అనుభవాల కలబోత ఆ రచన గురించి ఉమ్మడి అభిప్రాయానికి దారితీస్తుంది. అయితే, అంతగా రక్తి కట్టని ఏ ప్రదర్శననైనా చూసొచ్చి ఆ నటుల, శిల్పుల, చిత్రకారుల కల్పనల్ని కూడా ‘జూటాకోరు సృజనలు’ అని నిందిస్తామా? ఆ ప్రదర్శనలు, ఈ చూసినవాడ్ని మాత్రం రంజింపచెయ్యలేకపోయాయి అని సర్దిచెప్పుకుంటామా? లేదా ఇంకా తీవ్రంగా ఆ కళాకారులే ‘జూటాకోర్లు’ అని నిందిస్తామా? నామిని ఇటీవలి వ్యాఖ్యల్ని ఈ ప్రశ్నల నేపధ్యంలో ఎలా అర్ధం చేసుకుంటాము?
ఇక్కడ శిల్పాల్ని గురించి ఒక సంగతి జ్ఞాపకం వస్తుంది. మా చిన్నప్పుడు నగరపాలక సంస్థ వాళ్ళు గొప్ప జాతీయనాయకుల విగ్రహాల్ని చెక్కే పనిని ఒక పేరుమోసిన శిల్పిగారికి అప్పగించేరు. తీరా ఆయన చేసిన శిల్పాల్ని కూడళ్ళలో ప్రతిష్టించేక ఏ బొమ్మ తీరు చూసినా ఇంచుమించు ఒక్కలాగే ఉండేది. ఉన్నది ఒకటే బొమ్మనీ, దానికే గెడ్డం మకుటం ఉంటే అది శివాజీ అనీ, చీర కట్టుకుని కత్తీ డాలూ ధరిస్తే ఝాన్సీ లక్ష్మీబాయి అనీ, కోటూ గులాబీ పువ్వూ ఉంటే నెహ్రూ గారనీ పోల్చుకోవాలి. శిల్పిగారికి చెక్కడం తెలిసింది ఒక్కరకం బొమ్మేననీ, అదెవరి బొమ్మో దుస్తుల్ని బట్టే పోల్చుకోవాలనీ హాస్యంగా చెప్పుకునేవాళ్ళు. శిల్పులకైతే ఎదర చూసి అనుకరించేందుకు, చెక్కిన శిల్పాల్ని వెనుదిరిగి కొలిచి చూసేందుకూ ప్రమాణాలుగా నిజం శివాజీ, నిజం ఝాన్సీ రాణీ ఉన్నారు. మాటలతో చెక్కే శిల్పమైన సృజనకి ముందూ, పిమ్మటా ఇలాంటి ప్రమాణాలు ఏమున్నాయి?
త్రిపుర రచయితల, కవుల ‘నిజాయితీ’ మీద కటువైన విమర్శల్ని హర్షించరు. చదివినప్పుడు నిజాయితీ మీద సందేహాలు వస్తే ఆ కాల్పనిక ప్రదర్శన పేలవంగా ఉందని మాత్రం అర్ధంచేసుకోమంటారు. ఇక్కడ సఫలం కానిది వ్యక్తిగానో, కళాకారునిగానో ఆ రచయిత నిజాయితీ కాదు. సఫలం కానిదల్లా అతని (ఆమె) కళా ప్రదర్శన (Artistic Performance) మాత్రమే. ఈ క్షమా దృష్టిని ఇదివరకు అనుకున్న సానుభూతి నేపధ్యంలో అర్ధం చేసుకోవచ్చు. రచయితల ప్రవృత్తి రాయటం కాబట్టి ఆ వ్యాపారానికి త్రిపుర పూర్తి సానుభూతి, మద్దతు ఉన్నాయి. ఇక్కడి వరకు త్రిపుర, నారాయణరావుల అభిప్రాయాలు రమారమి ఒక్కటిగానే ఉన్నాయి. నారాయణరావు కూడా అడిగినవాళ్ళందరికీ ‘బుద్ధిగా హాయిగా రాసుకో!’ అని చెప్తుంటారు. అయితే, ఆ రాతలలో ఏవి సఫలమైన సృజనలు అనే విషయంలో త్రిపుర గొప్ప నిరంకుశుడు. నారాయణరావు గారు కూడా నిరంకుశుడే. కాని వాళ్ళిద్దరి ప్రాపంచిక దృక్పధాలు, తాత్విక భూమికలు, రచనల నేపధ్యాలూ, ఉద్దేశాలూ చాల భిన్నమైనవి. నారాయణరావు మౌలికంగా సాహిత్య శాస్త్రజ్ఞుడు కాబట్టి ఆయన బహుళము, విస్తృతమైన సాహిత్యాన్నంతట్నీ కాపలా కాస్తూ ఆ సంచయం మొత్తం ప్రాతిపదికగా తన అభిప్రాయాల్ని, సిద్ధాంతాన్నీ నిర్మించుకోవాలి, ప్రకటించుకోవాలి. అంతే కాకుండా ఆ సాహిత్యం ఆవరణల్లో ఉన్న సాటివాళ్ళని (peers) ఒప్పించుకోవాలి. ఇది చాల కష్టమైన పని, ఒంటరి పని, కాని శాస్త్రవేత్తలకు వృత్తి ధర్మంగా వచ్చే తప్పనిసరి పని. దీన్ని తలకెత్తుకొని, నిర్వహించి ఒప్పించటానికి అసాధారణమైన ప్రతిభ, చదువు, కృషి, జబ్బ సత్తువ, మొండి పట్టుదల నిర్మమత వంటి వ్యక్తిత్వ లక్షణాలు కావాలి. ఇవి ఏమిటో సాహిత్య సిద్ధాంతాల్ని ప్రతిపాదించే వాళ్ళు చరిత్రలో ఇదివరకే చర్చించి ఉన్నారు.
కవులకు, రచయితలకు ఈ బాధ్యత ఇంత విస్తృతంగా లేదు. కాని వాళ్ళు తమ స్వంత సృజన విషయంలో నిరంతరం తమని తామే ప్రశ్నించుకొని ఒప్పించుకోవాలని చూస్తారు. ఇదికూడ ఏమంత తేలికైన పని కాదు. రక రకాల కారణాల్ని, ప్రయోజనాల్నీ చూపించి సృజనకు ఆయువుపట్టయిన ఈ అంతర్మధనం (త్రిపుర భాషలో కవిని తప్పనిసరిగా నిరంతరం తొలుస్తుండే జంట కుమ్మరిపురుగుల తవ్వకం) నోరు నొక్కెయ్యటమే మేధస్సు చేసే పని. నామిని దీన్నే నిరసిస్తున్నాడు. రాసింది ప్రచురణకివ్వాలా వద్దా అని, తీరా ప్రచురించేక తప్పైపోయిందేమోననీ కవులు పడే మధన గురించి త్రిపుర, నారాయణరావులు చెప్పిన సంగతులున్నాయి. ‘ప్రతీ రచనా ఏదో ఒక మేరకు అసంపూర్తి అయిందే, కాబట్టి మరీ సంకోచం, మమకారం లేకుండా ప్రచురణకు ఒప్పుకోవడమే మంచిది. (Go ahead and publish with a certain abandon!)’ అని నారాయణరావనేవారు. ప్రచురించేక దానిమీద పడే రాళ్ళనీ పువ్వుల్నీ ‘నాది కాద’నుకొని చూడగలిగితే పోతుంది. తను రాస్తున్న పుస్తకాల్ని గురించి కూడా ఆయనకి ఇలాంటి మధన ఉంటూనే వచ్చింది. ఒకరోజు మాటల్లో ఆయన, ‘ఇలా రాస్తున్నానండీ! తిడతారేమోనని అనుమానంగా ఉంది!’ అని చెప్పుకున్నారు. నేను ‘మీరు రాసినా తిడతారు, రాయకపోయినా తిడతారు!’ అన్నాను. ఆమాట ఆయనకి చాలా నచ్చింది ఎందుకో. దాన్నొక మహా వాక్యంలాగ చాన్నాళ్ళు మళ్ళీ చెప్పేవారు. ‘రాసినా తిడతారు, రాయకపోయినా తిడతారన్నాడు. నిజమే! తిట్లు ఎలాగూ తప్పవు కాబట్టి రాసుకుంటేనే మంచిది!’ అని.
కవులు, రచయితల్ని ఈ అనుమానం ఎలా పట్టి పల్లారుస్తుందో త్రిపుర చెప్పింది ఉంది. కవికి సృజనతో ఉన్న సంబంధం చాల జటిలమైనది. దాన్ని నిర్మమకారంగా పరిత్యజించడం అంత సులభం, సాధ్యమూ కాదు. ఒక్కొక్క సారి సృజనకి కవి ఊహావరణాన్ని రక రకాల జ్ఞాపకాలుగా ఆక్రమించి అతన్ని తీవ్రమైనవి, వదిలించుకోవీల్లేని ఉద్వేగాలతో ఉక్కిరిబిక్కిరి చేసే శక్తి ఉంటుంది. ఒక్కో కధ, కవిత అయితే దశాబ్దాలతరబడి రాసినవాడ్ని వెంటాడగలవు. రాస్తున్నప్పుడూ, రాసిన తర్వాత కూడా దాన్నుండి తప్పించుకోవడం అసలు సాధ్యమే కాకపోవచ్చు. సృజనకి ఒక వెర్రిలాగో, దెయ్యం పట్టినట్టో ఆవహించి బాధించే శక్తి ఉంది. దీన్ని వదిలించుకోలేక, ఇంక విధిలేక తప్పనిసరై రాసేవాళ్ళున్నారు. త్రిపుర స్వయంగా దీనికొక ఉదాహరణ. నా అనుభవం త్రిపుర అన్నదానికి దగ్గరగా ఉంది.
సృజన సమయంలో, కల్పనకు కేవలమైన చోదక శక్తిగా ఈ వెర్రి ఎంత తీవ్రంగా ఉంటుందో సృజన తర్వాత పశ్చాత్తాపం (guilt) అంత తక్కువగా ఉంటుంది. అప్పుడు సృజన మాత్రమే ఉంది, దాన్ని రాసేవాళ్ళని ఎవరూ లేరు. రాసేవాడి పేరుతో, ఉనికితో, వ్యక్తిత్వంతో, లౌకికంగా అతను ప్రదర్శించే ముఖాలతో సృజనకు అవసరం గాని, ఖాతరు గాని లేదు. తీవ్రమైన, నైసర్గికమైన వాంఛతో మనుష్యులు, జంతువులు అనివార్యంగా సృష్టించే సంతతికి పేర్లు పెట్టేదీ, వర్గీకరించేదీ, విలువ కట్టేదీ మేధస్సు. సృష్టి కార్యం మేధస్సుకు అతీతంగా, దాన్ని ధిక్కరించి జరుగుతుంది. అందుకే అదంత తియ్యగా ఉంటుంది. ఉన్మాది చేసే నేరాలని న్యాయస్థానాలు కూడా క్షమిస్తాయి. అతనికి లౌకికమైన తన వ్యక్తిత్వాన్ని గురించీ, లోకపు మంచి చెడ్డల గురించీ స్పృహ ఉండదని. సృజనలో మేధస్సు చేసే మోసాల్ని, అవి ఎంత లోక కళ్యాణాన్నీ, ఎన్ని మంగళకరమైన ఆలోచనల్నీ ప్రతిపాదిస్తున్నా వివేకం ఉన్న పాఠకులు మన్నించరు. ఏదో ఒకనాడు తప్పకుండా పోల్చీసుకుంటారు.